అనగనగా ఒక ప్రేమ కథ

0
8

[box type=’note’ fontsize=’16’] “భగవంతుడు పెళ్లి కావలసిన జంటలను ముందే ముడేస్తాడంటారు” అంటూ ఓ ఆర్మీ ఆఫీసర్‌కీ, ఓ వైద్యురాలికీ మనసులు కలవడానికి సియాచిన్‌ వద్ద నిర్వహించిన ఓ హెల్త్ క్యాంప్ ఎలా కారణమైందో చెప్తున్నారు డా. ఎమ్. సుగుణ రావుఅనగనగా ఓ ప్రేమ కథ“లో. [/box]

[dropcap]వి[/dropcap]వాహాలు స్వర్గంలో జరుగుతాయంటారు. భగవంతుడు పెళ్లి కావలసిన జంటలను ముందే ముడెట్టేస్తాడంటారు. అందుకు నిదర్శనంగా ఎన్నో దృష్టాంతాలు. ఎక్కడో ఆముదాలవలసలో ఉన్న అబ్బాయి, అమెరికాలో వుండే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడని మనం పేపర్లలో చూసాం – ఇలా మన కథలో అబ్బాయి, అమ్మాయి అదే బాపతు.

అబ్బాయి వుండేది అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్. మన పొరుగుదేశం అయిన చైనా ఆ భూభాగం మీద తన హక్కుని ప్రకటించిన తర్వాత ఆ వైపు వెళుతున్న మన సైనిక వాహనాలు చాలా మంచులో కూరుకుపోయి పాడయిపోయాయి. వాటి వెలికితీత, దాంతో పాటు వాటిని బాగుచేసే ప్రాజెక్టు అధికారిగా ఫస్ట్ లెఫ్టినెంట్ సుధీర్‌బాబును నియమించారు.

సుధీర్‌బాబు అంతకుముందు జమ్ముకాశ్మీర్‌లోని కొన్ని మిలటరీ పోస్టులకు సంచాలకుడిగా పనిచేసాడు.

కొన్నాళ్లు సియాచిన్‌లో వున్నాడు. ఆ మంచుకొండల్లో సంవత్సరంపాటు, సముద్రమట్టానికి ఇరవైవేల అడుగుల ఎత్తులో పహరా కాసే సైనికులను పర్యవేక్షించాడు. మైనస్ యాభై డిగ్రీల శీతల స్థితిలో పనిచేసాడు. క్రమశిక్షణతో పనిచేసాడు. ఇప్పుడు తవాంగ్ – అక్కడి మిలటరీ పోస్టులో అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తన కేబిన్లో పుస్తకం చదువుతున్నాడు. అది ‘హూమ్ ది బెల్ టోల్స్’ నవల, రాసింది ఎర్నెస్ట్ హెమింగ్వే. ఆ నవల నేపథ్యం యుద్ధం. గెరిల్లా దళంలోని రాబర్టు అనే వ్యక్తి ఒక వంతెనను పేల్చేసే లక్ష్యంతో వస్తాడు. ఆ దళంలోని మేరియా అనే అమ్మాయి ప్రేమలో పడతాడు – ఆ ఘట్టం చదువుతున్న సుధీర్‌బాబు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. బయట మంచు కురుస్తోంది.

చేతులకు గ్లవ్స్, నెత్తికి హెల్మెట్, కాళ్లకు చలి దూరని గమ్‌బూట్లు, బయట పహరా కాస్తున్న సెంట్రీ చేస్తున్న విజిల్ చప్పుడు. తన ఉలికిపాటుకు కారణం బయట ఏదో జరిగిందని కాదు, నవలలో అమ్మాయి పాత్ర రంగప్రవేశం. అమ్మాయిల ప్రస్తావన రాగానే తనకు ఏదో ఉలికిపాటు. ఈ ముప్ఫై రెండేళ్ళ జీవితంలో తనకు ఏ అమ్మాయి తారసపడినా, తను ఆ అమ్మాయి ఉనికిని గుర్తించేవాడు కాదు. అసలు ఆడ గాలే పడదు. కారణం ఏమిటి? కారణం తనకు అమ్మ ఆలనాపాలనా లేకపోవడంవల్లా? – అమ్మ తనను కని, ఈ భూమ్మీద వదిలి వెళ్ళిపోయినప్పుడు తనను ఎవరు పెంచారో తెలీదు. తనను ఒక హాస్టల్లో వదిలేసి వెళ్లిపోయాడు నాన్న. ఆ తర్వాత ఒక క్రొత్త అమ్మను తీసుకొచ్చాడు. ఆవిడను చూస్తే తనకు భయం. ఆవిడా తనను దగ్గరకు తీసుకునేది కాదు, తనను ఎత్తుకుంటుందని ఆశపడేవాడు. తను చేతులు చాచి కళ్ళు మూసుకునేవాడు. కళ్లు తెరిచి చూస్తే చేతిలో ఒక చాక్లెట్, ఎదురుగా అమ్మా నాన్న మాయం. ఇక తనకు అమ్మ అనే కాదు ఆడవాళ్ల మీద విరక్తి పుట్టింది. తనకు పరిచయమైన ఆడవాళ్లలో వారి మంచి లక్షణాలు కనపడేవి కావు. వారి లోపాలు తను వెతికేవాడు. ఆ హాస్టల్లోనే తన బాల్యం గడిచింది. ఆ హెూమ్‌లో అన్ని వయసుల పిల్లలూ ఉండేవారు. అప్పుడే పుట్టిన పసికందులు తల్లి లేని వారయితే అక్కడ ఆయాలు పాలు పట్టేవారు, స్నానం చేయించేవారు. తనను, తనకన్నా కొంచెం వయసులో పెద్దయిన పిల్లలు ఆడించేవారు.

అందుకే తనకు ఇప్పటికీ పిల్లలంటే ఇష్టం. అలాగే పల్లెలన్నా ఇష్టం. కారణం తను హాస్టలు ఒక పల్లెటూరులో ఉండేది. చుట్టూ పంటపొలాలు, పక్కనే ఉరకలేస్తూ పరుగులెత్తే సెలయేరు. తనని ఒక పెద్ద పిల్లాడో, పిల్లో ఎత్తుకునేవారు. సెలవులప్పుడు ఆ పల్లెటూళ్ళో శివుడి కోవెల, గంగిరావిచెట్టు, ఇంకా మామిడితోపు, ఇంకా ఆ ఊళ్లోని జమీందారుగారి మేడ. ఇలా ఆ పల్లెటూరంతా తిరిగేవాళ్లు, అలా ఆ పల్లె, తనను ఆడించిన పిల్లలు ఇంకా స్మృతిపథంలోనే ఉన్నారు.

అలా ఆ పల్లెటూరి హాస్టల్లో తన బాల్యంతోపాటూ ఎలిమెంటరీ స్కూలు జీవితం గడిచింది. ఆ తర్వాత నాన్న తనను టౌన్‌లో స్కూల్లో వేసాడు. అక్కడా హాస్టలే.

సెలవుల్లో నాన్న తనను ఇంటికి తీసుకెళ్లేవాడు. తనకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లు తన దగ్గరకొచ్చినా తను దూరంగా వెళ్ళిపోయేవాడు. పిన్ని వైఖరి అన్నేళ్ళయినా అలానే ఉండేది. అలా పిన్నే కాదు, చెల్లెళ్ళే కాదు లోకంలోని ఏ ఆడపిల్ల తనకు నచ్చలేదు.

హైస్కూలు చదువు, తర్వాత ఇంటరు, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివి తనకు ఇష్టమైన ఆర్మీ ఆఫీసర్‌గా చేరాడు. తనకిపుడు ముప్ఫై రెండేళ్లు. నాన్న తన దగ్గర ఎన్నో సార్లు పెళ్ళి ప్రస్తావన తెచ్చినా, తను మాత్రం ఒప్పుకోవడంలేదు – కారణం ఏ స్త్రీ తనతో జీవితం పంచుకోవడం ఇష్టంలేదు.

ఆలోచనల్లో ఉన్న సుధీర్ దూరంగా ఎక్కడనించో వినవచ్చిన ఏదో వాహనం చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చాడు. టైము చూసుకున్నాడు. ఎదురుగా ఉన్న లేప్‌టాప్ తెరిచాడు. తన సుపీరియర్ ఆఫీసర్ నించి వచ్చిన అత్యవసర మెయిల్.

“ఆఫీసర్, ప్లీజ్ రెడీ ఫర్ ఆపరేషన్ ఎట్ సియాచిన్ విత్ ఎ కపుల్ అఫ్ వీక్స్”.  ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంది. ‘మళ్ళీ సియాచిన్‌కు వెళ్లాలా’ అనుకున్నాడు. సియాచిన్ గుర్తుకొస్తే చాలు, ఒళ్ళంతా గడ్డ కట్టుకుపోతుంది అక్కడి మంచులా.

***

ఇదీ మన అబ్బాయి లెఫ్టినెంట్ సుధీర్ కథ. ఇక అమ్మాయి కథ తెలియాలంటే చాలా దూరం చేరాలి.

***

అది అసియాలో అభివృద్ధి చెందుతున్న నగరం. సిటీ అఫ్ డెస్టినీ. ఈ నగరంలో చూడాల్సినవి కైలాసగిరి, బీచ్, యారాడ కొండ, పోర్టు ఇంకా స్టీల్‌ప్లాంట్. దర్శించుకోవలసింది సింహాచలం నరసింహస్వామి, ఇంకా కనకమహాలక్ష్మి అమ్మవారు. ఈపాటికి అర్థమై ఉంటుంది. ఆ నగరం విశాఖపట్నం అని. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో ఉంది ఆ వైద్య కళాశాల, దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో హైవేకు అనుకుని ఉంది. దాని పేరు విశాఖ వైద్య కళాశాల. సరిగ్గా ఉదయం పదకొండు గంటలయ్యింది. కాలేజీలోని ఆ ఏసి ఆడిటోరియంలో ప్రస్తుతం ఆ కాలేజీలో మెడిసిన్ చదివే విద్యార్థులు, అధ్యాపకులు అంతా సమావేశమయ్యారు. ఇది అత్యవసర సమావేశం. అందుకే అంత పీక్ అవర్‌లో పేషంట్లను చూడవలసిన సమయంలో మెడికల్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టారు.

స్టేజీమీద ఫుల్ సూట్లో ఉన్నారు ప్రిన్సిపాల్ డాక్టర్ బాలసుబ్రమణ్యం. ఆయన పక్కనే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నసుంధర. ఆ ఇద్దరి పక్కన కూర్చున్న వ్యక్తి బాగా పొడుగ్గా ఉన్నారు. ఆయన కూర్చున్నా బాగా పొడుగని ఆయన స్టేజిమీదకు వెళ్ళినపుడే గమనించారు. ఆయన మిలటరీ యూనిఫారంలో ఉన్నారు. ఆయన భుజం మీది నక్షత్రాలు, నెత్తిమీద కేప్ చూస్తే ఆర్మీలో పెద్ద అధికారి అని తెలుస్తుంది. ప్రిన్సిపాల్ బాలసుబ్రమణ్యంగారు లేచి నించుని చెప్పడం మొదలెట్టారు

“మిత్రులారా ఇలా మిమ్మల్ని అత్యవసరంగా ఇక్కడకు పిలిచినందుకు క్షమించండి. ఒక ముఖ్యమైన విషయం. మనది నోబుల్ ప్రొఫెషన్. అందరికీ అత్యవసరమైన సేవలు అన్నివేళలా అందించే వృత్తి మనది. మనకి టైముతో నిమిత్తం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి లేదు. ఏ వేళలో ఎవరికి ఏ అత్యవసర చికిత్స అయినా మనం అందుబాటులో ఉంటాము, అందుకే మనల్ని దేవుళ్లు అంటారు. ‘వైద్యో నారాయణో హరి’. అలాంటి దేవుళ్ళమైన మనకి ఆర్మీ వారి నుంచి పిలుపు వచ్చింది. ప్రతీ సంవత్సరం మనం మెడికల్ కేంపులు నిర్వహిస్తూ ఉంటాము. ఈసారి మెడికల్ కేంపు ఎక్కడో తెలుసా.. సియాచిన్…” అన్నారు.

ఆయన ఆ మాట చెప్పగానే ఆ హాల్లో అంతా నిశ్శబ్దం, అంతా మౌనంగా అయిపోయారు. వెంటనే ఆయన సభలోని వారి స్పందన గ్రహించి, మళ్ళీ చెప్పడం మొదలెట్టారు.

“మిత్రులారా, సియాచిన్ అంటే మీరెందుకు నిశ్శబ్దం అయిపోయారో నాకు అర్థమైంది. అయితే అక్కడ మనలాంటి మనుషులే ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారు దేశరక్షణ కోసం. వారే సైనిక సోదరులు. ఇపుడు మన మధ్యన ఉన్న మిలటరీ ఆఫీసర్ మేజర్ రామ్, ఇపుడు ఆ సియాచిన్‌లో పరిస్థితి ఏంటో, అక్కడ మెడికల్ కేంప్ ఆవశ్యకత ఎందుకో మనకి తన ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తారు” అంటూ చెప్పడం ఆపి కూర్చున్నారు.

ఆయన లేచి నిలబడ్డారు. ఒక్క క్షణం సభ అంతా కలియచూసారు. స్వచ్ఛమైన తెలుగులో తన ఉపన్యాసం మొదలెట్టారు.

“అందరికీ నమస్కారం, ఏ ఉపోద్ఘాతం లేకుండా నేను డైరెక్టుగా సబ్జెక్ట్‌లోకి వస్తాను. సియాచిన్ గురించి మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఈ సియాచిన్ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. రెండు దేశాల సరిహద్దు రేఖ. సముద్రమట్టానికి రెండువేల ఐదువందల అడుగుల ఎత్తులో ఉంటుంది. శరీరాన్ని గడ్డ కట్టించే శీతలం, చేతులకు ఏమీ ఆచ్ఛాదన లేకుండా ఏ వస్తువు పట్టుకున్నా ఆ వాతావరణానికి, ఆ శరీర భాగం ఏంప్యుటేషన్ అయిపోతుంది. అక్కడ ఏ సైనికుడు గెడ్డం గీసుకోలేడు. నిరంతరం ఆ మంచు అతి శీతలతతో పాటు, ఏ వైపునుంచి శత్రువు దాడి చేస్తాడో తెలియని ప్రమాదం అంచున మన సైనికులు పహరా కాస్తున్నారు. కొన్ని వందలమంది సైనిక సోదరులు చనిపోతున్నారు. అయినా తప్పదు, నూట ముప్ఫై కోట్లమందిని రక్షించడం కోసం వందలాది సైనికుల బలియాగం – ఈ యజ్ఞంలో మీ సహాయం కోరుతున్నాం. మాకు మిలటరీ డాక్టర్లు, నర్సులు ఇంకా వైద్యసిబ్బంది వున్నారు. అయినా సరిపోదు. మెడికల్ కేంపుల వలన అవసరమైన వారికి అత్యవసర సహాయం అందుతుంది. ఒక్కసారి చూడండి…” అంటూ ఆయన తన లేప్‌టాప్ ఆన్ చేసాడు. సియాచిన్ ప్రాంతం తెరమీద ప్రత్యక్షం. వందలాదిగా సైనికులు పహరా కాస్తున్న దృశ్యం – గాయపడిన సైనికులను స్ట్రెచర్ మీద తీసుకువెళుతున్న మరో దృశ్యం.

ఆయన ఆ దృశ్యాలు తెరమీద కదులుతుండగానే తన ఉపన్యాసం కొనసాగించాడు. “ఇప్పుడు చెప్పండి, సియాచిన్ మెడికల్ కేంపుకు వచ్చే వాళ్ళెవరు?”

వెంటనే చాలామంది చేతులెత్తారు. అందరూ అబ్బాయిలే, దాదాపు వందకు పైగా…. అయితే అమ్మాయిలలో స్పందించింది ఒకే ఒక్క అమ్మాయి. ఆమె పేరు “నైమిష”. మనం వెతుకుతూ విశాఖ వచ్చిన అమ్మాయి. మనకు కావలసిన అమ్మాయి నైమిష.

***

నెల తర్వాత విశాఖ వైద్య కళాశాల విద్యార్థుల మెడికల్ కేంప్ సియాచిన్‌లో మొదలైంది. ఆ రోజు ముందుకొచ్చిన వందమంది మెడికల్ విద్యార్థులలో ఒక్కొక్కరే జారిపోగా ఆఖరికి మిగిలింది పదిమంది. అందులో తొమ్మిదిమంది అబ్బాయిలు, ఒక అమ్మాయి నైమిష. నైమిషను పంపడం ఆమె ఇంట్లోవాళ్లకు ఇష్టంలేదు. ఒంటరిగా ఆడపిల్లను పంపడం అనేకాదు, అక్కడి వాతావరణం.. పైగా నైమిషకున్న మహా భయంకరమైన ఒక సమస్య – ఆ విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. చిన్నప్పుడు బహుశా నైమిషకు ఐదేళ్ళ వయసు ఉంటుందేమో, నైమిషను వాళ్ళమ్మ ఎత్తుకుని కూరగాయలు తరుగుతోంది. ఇంతలో చాకుతో ఆమె వేలు తెగింది. ధారాపాతంగా రక్తం. ఆమె పరిగెత్తుకుంటూ బెడ్ రూమ్‌లోకి వచ్చింది కాటన్ కోసం.. ఈ కంగారులో గడప తగిలి పడిపోయింది. మళ్లీ నెత్తినించి ధారాపాతంగా రక్తం, ఆ రక్తం చూసిన ఐదేళ్ళ నైమిషకు భయం. ఆ తర్వాత ఆమెకు ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. వెంటనే సొమ్మసిల్లిపోయింది. అంతే ఆ క్షణం నించి ఆమెకు రక్తం అంటే భయం మొదలైంది. ఆ భయం ఇన్నేళ్లయినా, కొనసాగుతూనే ఉంది. అలా రక్తం అంటే ‘భయం’ ఉన్న అమ్మాయి, మెడిసిన్‍లో ఎందుకు చేరింది అంటే ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చే సమాధానం – భయపడేచోటే మనం దాన్ని భయపెట్టాలి – భయానికి దగ్గరగా ఉంటేనే ఆ భయం పోతుంది. అందుకే సాహసాలంటే ఇష్టం. అందుకే సియాచిన్ చేరుకుంది అత్యంత ధైర్యంతో.

***

సియాచిన్‌కు దగ్గరలో నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ‘వార్షి’ అనే ఊరు. అక్కడే మెడికల్ కేంప్ కోసం వచ్చిన విద్యార్థులకు బస ఏర్పాటు చేసారు.

నైమిషకు మాత్రం, ఒక నర్స్ ఇంట్లో ఆశ్రయం ఏర్పాటు చేసారు. రెండురోజులు గడిచాయి. విపరీతమైన చలి, నెత్తి మీద కేప్, చేతులకు గ్లవ్స్, పైనుంచి క్రింద వరకు ఉలెన్ కోటు. ఆ రెండు గదుల ఇంట్లో నర్స్ ఒక్కర్తే – ఆమెది కేరళ ప్రాంతం. వారం రోజులూ ఆమెకు ఏమీ తోచలేదు. కొంతమంది సైనికులు ట్రక్కుల మీద వచ్చేవారు. వారికి బి.పి. చూడడం, సుగర్ టెస్ట్ చేయడం, ఈసిజిలు చూడడంతోనే సరిపోయేది. అయితే వారం తర్వాత ఒక అర్ధరాత్రి హఠాత్తుగా ఆమెని నిద్రనుండి లేపారు. “సియాచిన్‌లో హఠాత్తుగా తుపాకులు పేలాయి. బాగా గాయపడిన ఒక అధికారిని వార్షి తీసుకొచ్చేసారు. ఆయనతో పాటు ఒక మిలిటరీ డాక్టర్ – తాత్కాలికంగా ఏర్పాటైన వార్షిలోని ఒక ఆస్పత్రి థియేటర్‌లో ఆయన్ని చేర్చారు. నైమిషని పిలిచారు సహాయంగా. ఆ మిలిటరీ అధికారి భుజం నుంచి తుపాకీగుండు చూసుకుపోయింది. ఒళ్లంతా రక్తసిక్తం. నైమిష కళ్ళు మూసుకుంటూనే ఆ ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టింది. ఆ రక్తం చూసి కళ్ళు తిరిగాయి. నిలదొక్కుకుంది. తన ముందు ఒక క్షతగాత్రుడు ప్రాణాలతో పోరాడుతూ – అంతే, కార్యోన్ముఖ అయింది. గబగబా తన పని మొదలెట్టింది. గాయాలను శుభ్రపరిచింది. బేండేజ్ వేసింది. ఈలోగా ఆపరేషన్ మొదలైంది. ఇంకా మత్తులోకి జారుకోని ఆ మిలిటరీ అధికారి అసహనంగా ఉన్నాడు. కారణం ఒక అమ్మాయి తనకి నర్సింగ్ కేర్ చేస్తోంది. తన శరీరాన్ని స్పర్శిస్తున్న ఆమె చేతులు. ఏదో అనీజీనెస్… స్త్రీ స్పర్శ అంటేనే గిట్టని అతనే లెఫ్టినెంట్ సుధీర్ – అయినా ఆమె తన పని తాను కొనసాగిస్తూనే ఉంది. నిమిషాలు గడిచాయి. గంటలు దొర్లాయి. మిలిటరీ డాక్టర్లు, నైమిష కలిసి సుధీర్ ప్రాణాలు కాపాడారు.

***

వారం రోజుల తర్వాత సుధీర్ పూర్తిగా కోలుకున్నాడు. కొద్దిగా గాయాల తీవ్రత. నైమిష ఇరవై నాలుగు గంటలూ అతడికి సపర్యలు చేస్తోంది. అతను మెల్లగా నవ్వుతున్నాడు. ఇప్పుడు మనసులో ఇదివరకు అమ్మాయిలను చూస్తే వచ్చే ప్రతిచర్య లేదు. ఇంత దూరం వచ్చి తనను కాపాడే ప్రక్రియలో ఆమె పాత్ర ఉందని తెల్సి అతనికి ఆమె అంటే ఒక సదభిప్రాయం ఏర్పడింది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. మెడికల్ కేంప్ పూర్తయి నైమిష వెళ్ళిపోయే సమయం. అయితే ఆమె వైజాగ్ తిరుగు ప్రమాణంలో తన సహచరులు తొమ్మిదిమందితో పాటు మరో ప్రయాణీకుడు ఎక్కారు ఫ్లైట్. అతను లెఫ్టినెంట్ సుధీర్, కొన్నాళ్ళు వైజాగ్‌లో గడపడానికి. అతనిది చెన్నై అయినా వైజాగ్ రావడానికి కారణం నైమిష.

ఇపుడు నైమిష రక్తానికి భయపడడం మరచిపోయింది. సుధీర్ పిల్లల్నీ ప్రకృతినీ ప్రేమించడంతో పాటు ఒక పడతిని ప్రేమిస్తున్నాడు. ఆడవాళ్ళను ద్వేషించే అతను ప్రేమలో పడ్డాడు. అతని ప్రేమని పొందింది నైమిష.

అలా ఆ రెండు భిన్న ధృవాలను ఒక దేశం కలిపింది. ఆ దేశాన్ని ప్రేమించిన ఆ ఇద్దరి ప్రేమకథ ఇది.

అనగనగా ఒక ప్రేమ కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here