[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘జమీర్’ (Zameer 1975) చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడిన పాట. సంగీతం సపన్ చక్రవర్తి.
~
సాహిర్ ఉర్దూ పదాలను ఎంత గొప్పగా వాడేవారో తన పాటల్లో సరళమైన హిందీని అంతే చక్కగా ఉపయోగించేవారు. తన భాషా పాండిత్యాన్ని ఎంత చిక్కగా తన గీతాల్లో ప్రదర్శించేవారో, అలతి అలతి పదాలతో అతి సామాన్యమైన వాడుక పదాలతో గొప్ప అర్థాన్ని తన గీతాలలో చెక్కేవారు. దానికి ఉదాహరణ ఈ గీతం. ఎందరో సినీ కవులున్నా నేను సాహిర్‌ని ఇష్టపడడానికి కారణం వ్యక్తిగతంగా ఆయన గీతాలు నాలో నింపిన బలం. జీవితంలో ఎదురు దెబ్బలు తిని ఒంటరినయిన ప్రతి సమయంలో ఈయన రాసిన గీతాలు నాలో స్ఫూర్తిని నింపేవి. కొన్ని వాక్యాలయితే రాసుకుని గోడల మీద అంటించుకున్న రోజులూ ఉన్నాయి. ఇప్పుడు గోడల మీద అంటించుకోవలసిన అవసరం లేదు గాని ఇబ్బందికర పరిస్థితి ఎదురయినప్పుడు నా మెదడు సాహిర్ పంక్తులను నా మనసుకు సందేశంగా పంపే విధంగా ట్యూన్ అయిపోయింది. అలా నా కష్టకాలంలో నన్ను ఆదుకున్న గీతాలలో ఇది ఒకటి.
జిందగీ హస్నె గానే కె లియె హై పల్ దో పల్
జిందగీ హస్నె గానే కె లియె హై పల్ దో పల్
ఇసె ఖోనా నహి ఖోకె రోనా నహి
ఇసె ఖోనా నహీ ఖోకె రోనా నహి
జిందగీ హస్నే గానే కె లియె హై పల్ దో పల్
జీవితం అంటే నవ్వుతూ పాడుకుంటూ గడుపుకోవలసిన కొన్ని క్షణాలు. వీటిని పోగొట్టుకోవద్దు, పోగొట్టుకొని ఏడవద్దు. ఈ రెండు వాక్యాలలో ఎంత గొప్ప సారం ఉందో చూడండి. జీవితం నవ్వుతూ పాడుతూ గడుపుకోవాలి అంటూనే అది క్షణికమైనది అని కూడా చెప్తున్నారు కవి. నిజాన్ని ఏ సమయంలో కూడా సాహిర్ కప్పిపెట్టరు. జీవితం అంటే కొన్ని క్షణాలే, అవి నవ్వుతూ పాడుకుంటూ గడిపేయాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి ఆ క్షణాలను ఏవో ఆలోచనలతో అనవసరపు దుఃఖాలతో పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఆ క్షణాలు గడిచిపోయిన తరువాత ఇక నాకేం మిగిలింది అన్న దుఃఖమే ఉండిపోతుంది. అప్పుడు చేసిన పొరపాటు తెలిసినా గడిచిన కాలం తిరిగి రాదు కదా.
జీవితం క్షణ కాలమే, ఈ క్షణంలోనే జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచన సాహిర్ అవకాశం దొరికినప్పుడల్లా తన గేయాలలో ప్రదర్శించాడు.
‘ఆగే భీ జానే న తుమ్, పీఛే భీ జానే నా తూ, జోభీ హై బస్ యహీ ఎక్ పల్ హై’..అంటూ ముందేముందో తెలియదు, వెనకేముందో తెలియదు, ఉన్నది ఈ ఒక్క క్షణమే అన్న’ వక్త్’ సినిమా పాటలో …యే పల్ ఉజాలా హై/ బాకీ అంధేరా హై/ యే పల్ గవానా నా/ యె పల్ హి తేరా హై/ జీనేవాలే సోచ్ లే , యహీ వక్త్ హై కర్లో పూరి అర్జూ…అంటాడు. మనకి ఉన్నది ఈ క్షణమే, మిగతా అంతా అంధకారమే, కాబట్టి ఉన్న ఈ ఒక్క క్షణంలోనీ జీవితాన్ని అనుభవించు, కోరికలను తీర్చుకో…అంటాడు.
‘ది బర్నింగ్ ట్రైన్ ‘ అన్న సినిమాలో ‘పల్ దో పల్ కా సాథ్ హమారా’ అన్న ఖవ్వాలీ పాటలో , యే పల్ ఖుశీ కి జన్నత్ హై, ఇస్ పల్ మే జీలే దీవానే/ ఆజ్ కి ఖుశియా ఏక్ హకీకత్, కల్ కీ ఖుశియా అఫ్సానె హై’ అంటాడు. ఈ క్షణమే స్వర్గానందాన్నిచ్చే క్షణం, ఈ క్షణంలోనే జీవితాన్ని అనుభవించు, ఇప్పుడు అనుభవించే ఆనందమే నిజం, రేపటి ఆనందం ఒక కల్పన లాంటిది, అంటాడు.
‘టాక్సీడ్రైవర్’ సినిమాలో ఓ క్లబ్బు పాటలో ‘ ఆజ్ రాత్ ఝూమ్లే, ఆస్మాన్ కో చూమ్లే, కిస్కో పతా కల్ ఆయే కీ న ఆయే’ అంటాడు. ఈ పాటంతా, మరుసటి క్షణం ఏమవుతుందో తెలియదు కాబట్టి, ఉన్న ఈ క్షణంలోనే జీవితాన్ని అనుభవించేయమన్న సందేశం వుంటుంది. 1950, 1960, 1970, 1980 లలో సాహిర్ రాసిన పాటలలో ఈ భావన ఏదో ఒక రూపంలో కనబడటం, కాల మారుతూన్నా సాహిర్ నిర్దిష్టమైన అభిప్రాయాలు కాలదోషం పట్టనివి, కాలాన్ని బట్టి మారనివి అని స్పష్టమవుతుంది.
ఇలా అవకాశం కల్పించుకుని మరీ, జీవితం ఒకేసారి లభిస్తుంది, కాబట్టి, మనచేతిలో వున్న ఈ క్షణాన్ని వ్యర్ధం కానీయవద్దు, జీవితాన్ని అనుభవించాలి సంపూర్ణంగా, రేపేమవుతుందో తెలియదు కాబట్టి ఇవాళ్ళె అనుభవించాలి, జీవితాన్ని చేజారనివ్వద్దు, అన్న భావన సాహిర్ ప్రతి గీతంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తూనే వుంటుంది. అది ఈ పాటలో మరింత ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
తెరె గిర్నె మె భీ తెరీ హార్ నహి
కి తు ఆద్మీ హై అవతార్ నహి
ఈ చరణంలో పై రెండు వాక్యాలను వందల సార్లు నాకు నేను చెప్పుకుని ఉంటాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి అది నీ ఓటమి కాదు. నువ్వు మనిషివి, దేవుని అవతారానివి కాదు. ఎంత గొప్ప వాక్యాలు చూడండి ఇవి. ఎన్నో సార్లు జీవితంలో ఓటములను నేను ఎదుర్కుని నిలబడడానికి నాకు బలాన్ని ఇచ్చిన వాక్యాలు ఇవి.
నిజం మనం మనుషులం, దేవుని అవతారాలం కాదు కదా. మనిషన్నవాడు గెలుపోటములను అనుభవిస్తాడు. పొరపాట్లు చేస్తాడు. అది అతని దోషం కాదు. అందుకని నేరభావనను అనుభవించాల్సిన పనిలేదు. మన జీవితపు నడకలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాం. పడ్డాం, దెబ్బలు తిన్నాం. అది మన ఓటమి ఎలా అవుతుంది. మనుషులుగా మనం చేసిన ప్రయత్నం అంతే. కొన్ని ప్రయత్నాలలో గెలిస్తే మరి కొన్ని సార్లు ఓడిపోయాం. క్రింద పడ్డాం అని దెబ్బలు తిన్నాం అని ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు భాధపడాలి? మనం కేవలం మనుష్యులం, క్రింద పడుతూనే ఉంటాం, లేచి ముందుకెళ్లాలి. మనల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా దేవుళ్ళు కారు, మామూలు మనుషులే. వారి ముందు క్రింద పడ్డందుకు సిగ్గు దేనికి? జంకు దేనికి? మనం మనుషులం అని మనకు మనం చెప్పుకుంటే మన ఓటములన్నీ సాధారణ జీవిత ఘట్టాలు గానే కనిపిస్తాయి కదా. అందుకే ‘తెరె గిర్నె మె భీ తెరీ హార్ నహి, కి తు ఆద్మీ హై అవతార్ నహి’ అన్న వాక్యాలు నాకు చాలా చాలా ఇష్టం. నేను మనిషిని, కొన్నిసార్లు పడతాను కాని లేచి మళ్లీ నడుస్తాను. ప్రయత్నం ఆపను. నేను పడ్డానని సిగ్గుపడను. పడడం, మనిషి జీవితంలో చాలా సహజం అని నేను నమ్మి ఆచరించడానికి ఉపయోగపడిన ఆ వాక్యాలన్నా వాటిని రాసిన సాహిర్ అన్నా నాకు అమితమైన గౌరవం.
జొ వొ దేష్ వొ బేష్ బనా ప్యారె
చలె జైసె భి కామ్ చలా ప్యారె
ప్యారె తు గమ్ నా కర్
జిందగీ హస్నె గానె కె లియె హై పల్ దో పల్
మనం ఏ దేశంలో ఉన్నామో ఆ వేషం వేసుకుంటే నష్టం ఏమిటి? మన పని జరగడానికి ఆ దేశపు పలుకులు పలకడం తప్పుకాదు. ఇక్కడ ఆంగ్ల సామెత “బీ ఏ రోమన్ ఇన్ రోమ్” గుర్తుకు వస్తుంది కదా. ఇది గుర్తు పెట్టుకుంటే మన నిత్య జీవితంలో మనం చేసే మల్టీటాస్కింగ్ చాలా సులువు అయిపోతుంది. ఒక చోట నేను ఉపాధ్యాయురాలిని, మరో చోట మరో వేషం మరో చోట మరో వేషం. కొన్ని సార్లు ప్రవృత్తికి విరుద్ధమైన స్థితులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అక్కడ ఆ కాసేపు వారిలో ఒకరిగా కలసిపోవడం అవసరంగా మారుతుంది. కాని దాని అర్థం మనల్ని మనం మోసగించుకొమ్మని కాదు. కొన్నిసార్లు మన పని ముఖ్యం అనుకున్నప్పుడు ఆ సమూహంలో కలిసి ఉండడం కష్టమనిపించినప్పుడు, ఇబ్బంది పడకుండా కాసేపు ఇది నా దేశం కాదు, ఈ దేశంలో కాసేపు వీరితో కలిసి ఉండిపోవడం వలన దీర్ఘకాలిక మనశ్శాంతి కలుగుతుంది అన్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది.
ఇది నాకు వ్యక్తిగతంగా కొంచెం కష్టం అయిన పని. చాలా వరకు నాకు ఇబ్బంది కలిగించే చోటులకు నేను వెళ్ళడానికి ఇష్టపడను. ఇప్పుడు అసలు వెళ్లను. కాని ఈ స్థితికి రావడానికి నేను జీవితంలో చాలా సహించవలసి వచ్చింది. అప్పుడు ఇబ్బంది పడుతున్న ప్రతిసారి ఆ పై వాక్యాలను గుర్తు పెట్టుకునేదాన్ని. అలాంటి ఇబ్బందులను మళ్లీ ఎదుర్కోవలసిన అవసరం లేని స్థితికి నన్ను నేను తెచ్చుకోవడానికి కావల్సిన సహనాన్ని నాకు అలవడేలా చేసినవి ఆ పై వాక్యాలు.
ఆ తరువాత సాహిర్ అంటాడు ప్రియమైన నేస్తమా బాధపడకు జీవితం నవ్వుతూ పాడుతూ గడిపేసేయి అని. ఇది మాత్రం నిజం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సార్లు పడి దెబ్బలు తిన్నా, జీవితాన్ని నవ్వుతూనే గడిపేయాలి. అంత గట్టిపడాలి, రాటుదేలాలి. అదే జీవితంలో మనం సాధించే అసలు సిసలైన విజయం.
జహా సచ్ నా చలె వహ జూఠ్ సహి
జహా హక్ నా మిలె వహా లూట్ సహి
యహ చోర్ హై సబ్ కోయి సాచ్ నహి
సుఖ్ ఢూంఢ్ లె సుఖ్ అపరాధ్ నహి
ప్యారె తు గమ్ న కర్
జిందగీ హస్నె గానె కె లియె హై పల్ దో పల్
ఇసె ఖోనా నహి ఖోకె రోనా నహి
జిందగీ హస్నే గానె కె లియె హై పల్ దో పల్
జిందగీ
“ఎక్కడ నిజం గెలవదో అక్కడ అబద్దంతో పని జరిపేయ్. ఎక్కడ నీకు హక్కులు దొరకవో అక్కడ లూటీ చేయి. ఇక్కడ అందరూ దొంగలే మనకు ఎవరూ తోడు రారు. ఆనందాన్ని వెతుక్కో ఆనందించడం తప్పు కాదు. ప్రియమైన నేస్తమా దేనికీ బాధపడకు. జీవితం ఆడుతూ పాడుతూ గడిపేసేయి. ఏ క్షణాన్నీ వదులుకోకు, వదిలి తరువాత బాధపడకు.”
చాలా చోట్ల నిజం గెలవదు. అబద్ధం తప్పదు. కొన్ని సార్లు అబద్ధంతో జీవించడం మనల్ని బాధిస్తుంది. కాని మనం చేసేది మంచి అయినప్పుడు, నిజం గెలవని చోట్ల అబద్ధంతో పని జరిపించుకోవడం తప్పనప్పుడు ఆ దారిలో నడవడం తప్పు కాదు. మనకు అన్ని చోట్ల మన హక్కులు మనకు దొరకవు. న్యాయంగా ఏది మన పరం అవ్వాలో అది మనకివ్వకుండా చేస్తుంది లోకం. అక్కడ మన హక్కుల కోసం మనం పోరాడడం, మనకు రావల్సిన దాని కోసం ఎదురు తిరగడం ఒకోసారి లూటీ చేయడం కూడా తప్పు కాదు. దానికి భయపడకు. ఎవరికీ తలవంచకు. ఈ ప్రపంచంలో మన చుట్టు ఉన్నవారందరూ దొంగలే. వారెవ్వరూ నీకు తోడుగా నిలవరు. నీ నుంచి ఏం దొరుకుతుందో అన్న ఆశతోనే వాళ్ళు నీతో కలుస్తారు. దొరికింది అందుకుని వెళ్లిపోతారు తప్ప నీ కష్టాలలో నీకు తోడుగా ఎవరూ నిలవరు. అందుకని ఎవరినీ లక్ష్యపెట్టకు. సుఖాన్ని వెతుక్కుని జీవించు. సుఖపడడం తప్పు కాదు. కొన్ని సార్లు మనం ఆనందంగా ఉంటే మనం ఏదో తప్పు చేస్తున్నామన్నట్లుగా కూడా ఈ లోకం చూస్తుంది. కాని అది కేవలం వారి స్వార్థం వాళ్లలోని కుళ్ళు మాత్రమే. దానికి లొంగి నీ జీవితంలో అంది వచ్చిన సుఖాలను వదులుకోకు. సుఖపడడం తప్పు కాదు అది నీ హక్కు. దాన్ని ఎట్టి పరిస్థితులలో అర్థం లేని త్యాగాల పేరుతో వదులుకోకు.
ఎంత గొప్ప వాక్యాలు ఇవి. అర్థం లేని త్యాగాలతో జీవితం ఇచ్చే ఆ కాస్త సుఖాన్ని కూడా వదులుకుంటాం. పైగా అది బాధ్యత అనో, కర్తవ్యం అనో లేదా త్యాగం అనో చెప్పుకుని మన జీవితాలలో ఆదర్శాలను నిర్మించుకుంటాం. ఇతరుల నుండి సుఖాలను దోచుకుంటే తప్పు కాని మనకు లభించే ఆ చిన్న చిన్న ఆనందాలను కూడా లోకం ఏం అనుకుంటుందో అన్న మిషతో వదులుకుంటాం కదా. అలాంటి త్యాగాలు ఎవరి కోసం చేస్తామో, వారే మనల్ని సమయం వచ్చినప్పుడు కరివేపాకు ఏరి పారేసినట్లు ఏరి పారేస్తారే. మరి ఎవరి కోసం ఈ అర్థం లేని త్యాగాలు? ఈ వాక్యాలని పైపైన వింటుంటే ఓ స్వార్థపరుడు, జీవితం అంటే గౌరవం లేనివాడు పాడుతున్న గీతంలా అనిపిస్తుంది. కాని కొంచెం జీవితాన్ని అనుభవించి ఆలోచిస్తే అవును మనం ఎందుకు బ్రతకకూడదు? ఎందుకు సుఖపడకూడదు? అని ప్రశ్నలు వేసుకుంటాం.
నిజమే జీవితం అంటే కొన్ని క్షణాలే. అర్థం లేని ఆదర్శాల కోసం కాక కొంత మన కోసం, మనం కూడా బ్రతకాలి. ఇతరులకు హాని తలపెట్టకూడదు కాని మన ఆనందాన్నీ వదులుకోకూడదు. ఎందుకంటే చివరకి మనతో ఎవరూ ఉండరూ, అందరూ వాళ్ళకు కావల్సింది దోచుకుని వెళ్ళిపోతారు తప్ప మన కోసం ఓ అడుగు కూడా ముందుకు వేయరు. అందుకే మన కోసం మనం జీవించడం తప్పు కాదు. మన హక్కులను మనమే కాపాడుకోవాలి, పోరాడి కావలసినవి అందుకోవాలి. మనం సుఖంగా జీవించాలి. ఎందుకంటే సుఖపడడం తప్పు కాదు అది మన హక్కు. యహా చోర్ హై సబ్ కోయి సాచ్ నహి, సుఖ్ డూండ్ లె సుఖ్ అపరాధ్ నహి. ఇది అక్షరాలా నిజం. కాదంటారా? సుఖపడడం నా హక్కు అని ఎరుకపరిచిన సాహిర్ అంటే నాకు ఎంతో ప్రేమ. ఈ హాక్కు వదులుకోవడం పిచ్చితనం అనే నేను నమ్ముతాను. ఎన్ని సార్లు పడి లేచినా జీవితంలో నాకు దొరికే సుఖాలను, ఆనందాలను వదులుకోను, ఆనందంగా ఉంటున్నందుకు సిగ్గుపడను. నా జీవన మార్గంలో నన్ను గట్టిపడేలా చేసిన ఈ గీతం అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాట రాసినందుకు సాహిర్ అన్నా అంతే ఇష్టం. “తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న” అన్న వాక్యాలను నేను ఒప్పుకుంటాను. కాని మనవారిని సుఖపెట్టడానికి నిరంతరం కాలిపోతూ జీవించడానికి నేను వ్యతిరేకిని, నాకూ సుఖంగా జీవించే హక్కు ఉందని నమ్మి ఆచరించడం నా ప్రస్తుత మనశ్శాంతికి కారణం. అనవసర త్యాగాలు నాకేం మిగల్చలేదు కోపం కన్నీళ్ళూ తప్ప. ఆ అనుభవాల తరువాత మరింత ఇష్టపడుతున్న పాట ఇది.
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)