‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-22 – మైనే చాంద్ ఔర్ సితారోం కీ

0
16

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘చంద్రకాంత’ (Chandrakanta, 1956) చిత్రం లోని ‘మైనే చాంద్ ఔర్ సితారోం కీ’. గానం మహమ్మద్ రఫీ. సంగీతం ఎన్. దత్తా.

~

మనుషులు ఎంత ప్రయత్నించినా జీవితంలో తాము కోరుకుంటున్నవన్నీ పొందే సందర్భాలు చాలా తక్కువ. ఎంత ఉన్నత స్థితిలో ఉన్న మనిషి జీవితాన్ని తరచి చూసినా వాళ్లు పొందినవాటితో సమానంగా జీవితంలో పోగొట్టుకున్నవి ఎక్కువే ఉంటాయి. చాలా సందర్భాలలో మనుషులు దేన్ని ఎక్కువగా కోరుకుంటారో అవి వాళ్లకు అందవు. నిరాశా నిస్పృహలు, విషాదం మనిషి జీవితంలో భాగం. విషాదం నుండే మనిషి జీవితాన్ని అర్థం చేసుకుంటాడు. ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. అయినా మనుషులు జీవితంలో ముందుకు అడుగు వేసుకుంటూనే సాగాలి. సాహిర్ అతి విషాదం లోని నిస్సహాయతను కూడా తన గీతాలలో ప్రదర్శించిన సందర్భాలు కొన్ని కనిపిస్తాయి. అందులో ఒకటి ‘చంద్రకాంత’ సినిమాలోని ఈ గీతం.

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నాకీ థీ

ముఝ్కో రాతోం కీ సియాహీ కే సివా కుఛ్ నా మిలా

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ

(నేను చంద్రుడు ఇంకా తారలను కోరుకున్నాను, నాకు రాత్రి అంధకారం తప్ప మరేమీ దొరకలేదు)

మనిషి ఆశించేదానికి జీవితంలో అతనికి దొరికేవాటికి మధ్య ఎంత భిన్నత్వం ఉందో చూడండి. మనం కోరుకున్నవాటికి విపరీతమైనవి మన దగ్గరకు చేరినప్పుడు మనిషి ఎంత అల్పజీవో మనకు అర్థం అవుతుంది. చాలా సందర్భాలలో మన్న ప్రమేయం లేకుండానే జీవితం మన చేయి జారిపోతుంది. మనిషి చివరి దాకా పోరాడాలి, జీవించాలి, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకోవాలి అని చెప్పిన సాహిర్ జీవితంలో కొన్ని సందర్భాలలో మనిషి అల్పజీవి అని అతని చేతిలో ఏదీ ఉండదనీ కూడా ఒప్పుకున్నారు. జీవితంలో పోరాడుతూ ముందుకు వెళ్లాలని చెప్పారు తప్ప దాని వల్ల అందరి జీవితాలలో వారు కోరిన మార్పు వచ్చి తీరుతుందనే అబద్ధాన్ని ప్రచారం చేయలేదు. మనిషి మనసులోని పట్టుదల, దీక్ష అతని వ్యక్తిత్వానికి నిదర్శనాలు. కాని ప్రకృతి ముందు మనిషి అతి చిన్న ప్రాణి మాత్రమే. కొందరి జీవితాలలో కోరినవేవీ దక్కకుండా పోవడం అనే విషాదం కమ్మి ఉంటుంది. ఆ నిరాశల మధ్యే మనిషి జీవించవలసి వస్తుంది.

మై వో నగమా హూ జిసే ప్యార్ కీ మెహఫిల్ న మిలీ

వో ముసాఫిర్ హూ జిసే కోయీ భీ మంజిల్ న మిలీ

జఖ్మ్ పాయె హై బహారోం కీ తమన్నా కీ థీ

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ

(నేను ప్రేమ నిండిన కచేరి మధ్యలోని చేరలేకపోయిన ఓ గీతాన్ని. ఏ గమ్యమూ దొరకని ఓ బాటసారిని. గాయాల పాలయిన నేను వసంతాలనే కోరుకున్నాను. నేను చంద్రుడిని, తారలను కోరాను..)

ప్రతి కవి తాను రచించిన గీతం, ప్రేమతో అర్థం చేసుకుని ఆస్వాదించే కళాభిమానుల మధ్యకు చేరాలని కోరుకుంటాడు. అది జరగనప్పుడు అతను తీవ్ర వేదనను అనుభవిస్తాడు. సాహిర్‌కు కవులు అనుభవించే ఈ వేదన తెలుసు. ఇక్కడ జీవితంలో అన్నీ కోల్పోయిన ఓ వ్యక్తి తన నిరాశను మనతో పంచుకునే సందర్భంలో తాను మనసులో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని ప్రస్తావిస్తున్నాడు. అది ఎంత భయంకరంగా ఉందంటే రసజ్ఞుల మధ్యకు చేరని తన గీతాన్ని చూసి దిగాలు పడే ఓ కవి భరించే బాధంత లోతుగా ఉంది. ప్రతి బాటసారి తన గమ్యం వైపుగా సాగుతాడు. కాని ఇక్కడ ఈ వ్యక్తి బాటసారే కాని ఏ గమ్యమూ అతనికి చేరువ కాలేకపోయింది. అంటే తన ప్రయత్నం చేస్తూనే ఉన్నా గమ్యాన్ని చేరలేక నిస్సహాయతను అనుభవిస్తున్న వ్యక్తి వేదన అది. ఎన్నో గాయల పాలయి అసహాయంగా మిగిలిన అతను ఒకప్పుడు ఆనందాలను పంచే వసంతాలనే కోరుకున్నాడు. కాని దానికి విరుద్ధంగా బాధను మిగిల్చిన గాయాలతో మిగిలిపోయాడు. ఎంత విరోధాభాస అతని జీవితంలో ఉందో. జీవితం నిజంగా చాలా కఠినంగా ఉంటుంది. కోరుకున్న దానికి విరుద్ధంగా మలుపు తిరుగుతుంది. అప్పుడు మనిషి అనుభవించే నిరాశలోని ఒంటరితనం అత్యంత విషాదంగా ఉంటుంది.

కిసీ గెసూ కిసీ ఆంచల్ కా సహారా భీ నహీ

రాస్తె మే కోయీ ధుంధలా సా సితారా భీ నహీ

మేరీ నజరోం నే నజారోం కీ తమన్నా కీ థీ

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ

(ఏ కురుల తోడు ఏ కొంగు తోడు లేదు ఈ జీవితంలో, దారిలో మినుకు మినుకుమనే ఓ తార అయినా కనపడట్లేదు. నా కళ్లు అందమైన దృశ్యాలను కోరుకున్నాయి, నేను చంద్రుడిని తారలను కోరుకున్నాను)

కవి ప్రేమ కోసం అర్రులు చాస్తున్నాడు. కాని జీవితంలో అతను కోరుకున్న స్త్రీ తోడు లభించలేదు. ఆమెతో అందమైన జీవితాన్ని ఆశించాడు. అందమైన దృశ్యాలను ఊహించుకున్నాడు. కాని మినుకు మినుకుమనే తారలు కూడా అతని జీవన ప్రయాణంలో ఎదురవలేదు. ఏ కురుల తోడు, ఏ కొంగు తోడు అతనికి లభించలేదు. ఒంటరిగానే భయంకరమయిన చీకటిలో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో మినుకు మినుకు మనే తార కూడా కనబడకపోవటమంటే, ఎలాంటి చిన్న ఆశకూడా లేకపోవటం. ఆయన అందమయిన ద్రీశ్యాలను కోరుకుంటే, కన్నుపొడుచుకున్నా కనబడని కటిక చీకటి లభించిందన్నమాట. ఇలా కోరుకున్నవేవీ లభించకపోవటంతో తీవ్రమైన నిరాశను అనుభవిస్తున్నాడు.

కవి తనలోని ఒంటరితనాని ప్రకటించుకుంటున్న విధానంలో ఓ ఫిలాసఫీ కూడా ఉంది. జీవితంలో కష్టాలను ఎదుర్కునే వ్యక్తులందరూ నిరాశ నిస్పృహలను అనుభవిస్తారు. కాని వాటిని స్వీకరించి పోరాడేటప్పుడు ప్రదర్శించే ధైర్యంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది. ఏదీ కోరకుండా ఉండే వ్యక్తి జీవితాన్ని స్వీకరించే విధానంలో కష్టాలను ఎదుర్కునే పద్ధతిలో ధైర్యాన్ని ప్రదర్శించడంలో విషాద తీవ్రత తక్కువ ఉంటుంది. అతను ఏవీ ఆశించలేదు. కాబట్టి జీవితంలోని సవాళ్ళను ఎదుర్కునేటప్పుడు క్రుంగిపోడు, శక్తి మేరా పోరాడుతాడు. కాని జీవితంలో ఒకటి కోరుకుని దానికి పూర్తి విరుద్ధమైనవి దొరికి వాటితో జీవితాన్ని ఎదురీదాల్సిన స్థితిలో ఉన్న మనిషి ప్రదర్శించే విషాదం భరింపరానిది. ఇక్కడ తన మనసులోని దుఃఖాన్ని మనతో పంచుకునే వ్యక్తి జీవితంలో ఎన్నో కోరికలున్నాయి, ఎన్నో ఆశలున్నాయి. కాని అవి తీరకపోగా వాటికి పూర్తి భిన్నమైన వాతావరణంతో యుద్ధం చేస్తున్నాడు. ఈ స్థితి అతన్ని నిర్వీర్యం చేస్తుంది.

మేరి రాహోం సె జుదా హో గయీ రాహే ఉన్కీ

ఆజ్ బద్లీ నజర్ ఆతీ హై నిగాహే ఉన్కీ

జిన్సె  ఇస్ దిల్ నే సహారోం కీ తమన్నా కీ థీ

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ

(నా దారి నుండి వారి దారి వీడిపోయింది.. ఎవరి నుండి ఈ మనసు తోడును కోరుకుందో ఆమె నా నుండి చూపులు మరల్చుకోవడం నాకు కనిపిస్తుంది. అంటే ఆమే దృష్టి మారిపోయిందన్న మాట. నేను   చంద్రుడు తారలను కోరుకున్నాను)

ఆనందం దొరికినట్లే దొరికి చేజారిపోవడం, ఆనందం దొరకనిదాన్ని కన్నా అత్యంత విషాదం అయిన స్థితి. ఈ పాటలో అంతర్లీనంగా చేజారిపోయిన జీవితంలోని విషాదం ఉంది. తాను ప్రేమించిన వ్యక్తి మధ్యలో తనను వదిలి వెళ్లపోవడం, తోడు ఆశిస్తే ఒంటరిగా మిగిలిపోవడంలోని విషాదాన్ని ఇక్కడ కవి ప్రస్తావిస్తున్నాడు. ప్రేమ అన్నది అనుభవంలోకి రాకపోతే, మనసు ఆనందకర భవిష్యత్తును అంతగా ఊహించుకోకపోతే జీవితంలోని విషాదం ఇంతగా క్రుంగదీయదు. కాని ఇక్కడ అతనికి ఓ తోడు దొరికింది. కాని అది శాశ్వతం కాలేదు. ఆందమైన కలకన్న స్థానంలో  కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కోలేక అతను వేదనను అనుభవిస్తున్నాదో. ఎవరితో కలసి జీవితపు రహదారుల్లో నడవాలనుకున్నాడో వారి దారి వేరైపోయింది.  వారి దృష్టి వేరయింది.

ఈ పాటలో సాహిర్ శైలిని గమనించండి. తానే స్థితిలో ఉన్నాడో ప్రతి చరణంలోని మొదటి రెండు వాక్యాలలో చెబుతున్నాడు. తరువాత తాను కోరుకున్నదేంటో ప్రస్తావిస్తున్నాడు. అంటే అంతర్లీనంగా తన దుఃఖానికి కారణం తాను కోరినదానికి విరుద్ధమైనవి లభించడం అన్నది సాహిర్ చెప్పాలనుకుంటున్న విషయం. అంటే పై చరణంలో గమనిస్తే నా దారి నుండి ఆమె వేరయింది అన్నది మొదటి వాక్యంలోని సారంశం, ఈ రోజు ఆమె చూపులు నా నుండి మరల్చుకుంది అన్నది రెండో వాక్యంలో వస్తుంది. కాని మూడవ వాక్యంలో తాను దానికి విరుద్ధంగా ఆశించినది, కోరినది చెప్తున్నాడు. ఆమె తోడును నా మనసు కోరుకుంది అంటున్నాడు. ప్రతి చరణంలోనూ ప్రస్తుతం తాను అనుభవిస్తున్న విషాదాన్ని మొదటి రెండు వాక్యాలలో చెబుతూ మూడవ వాక్యంలో తాను కోరికున్నది ఏంటో చెప్పడంతో ఈ పాటకు ఓ తాత్వికత తోడైంది.

సాధారణంగా నేనిది కోరుకున్నాను, నాకిదే దొరికింది లేదా నాకు ఏదీ దొరకలేదు అని ఓ వ్యక్తి తన బాధ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ శైలిలో ఓ స్పష్టత ఉంటుంది. కాని సాహిర్ అలా చేయలేదు, ముందు తానున్న స్థితిని చెబుతూ తరువాత దానికి విరుద్ధంగా తాను కోరినదాన్ని చెప్పడంలో అసలు ఆయన బాధ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులకు కాదని,  ఫలించని తన కోరికలకు అన్న విషయం శ్రోతల దృష్టికి చేరుతుంది. పల్లవి తాను కోరుకున్నది ఒకటి దొరికింది మరొకటి అంటూ మొదలయి చరణాల దగ్గరకు వచ్చే సరికి తనకు దొరికింది ఒకటి తాను కోరింది మరొకటి అని చెప్పడంతో ఈ పాటలోని విషాద తీవ్రత, కోరినది దొరకని వ్యక్తిలోని నిరాశ శ్రోతల మనసులకు చేరి వారిని అదే విషాదంలోకి ముంచేస్తూ అసలు కోరికలే మన విషాదానికి కారణం అనే తాత్వికతను జోడిస్తూ, కోరినవి అందకపోవడమే జీవితంలో అత్యంత విషాదం అన్న నిజాన్ని స్పష్టం చేస్తాయి. ఈ శైలే ఈ పాటకు ఓ అద్భుతమైన అందాన్నిచ్చింది.

ప్యార్ మాంగా తో సిసక్తె హుయే అర్మాన్ మిలె

చైన్ చాహా తో ఉమండ్తే హుయే తూఫాన్ మిలె

డూబ్తే  దిల్ నే కినారోం కీ తమన్నా కీ థీ

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ

(ప్రేమను కోరుకుంటే విషాదంలో మునిగిన  కోరికలు దొరికాయి. ప్రశాంతత కోరుకుంటే ఎగిసిపడే తుఫానులు దరి చేరాయి. మునిగిపోతున్న మనసు గట్టును కోరుకుంది, నేను చంద్రుడు తారలను కోరుకున్నాను నాకు రాత్రి చీకట్లు తప్ప మరేమీ దొరకలేదు)

ఈ చరణం దగ్గరకు వచ్చేసరికి తాను కోరినది తనకు దొరికనది పతి వాక్యంలోనూ ప్రస్తావిస్తూ కోరికలకు వాస్తవానికి మధ్య ఉన్న విరోధాభాసను వ్యక్తం చేస్తూ పాటలోని విషాద తీవ్రతను పెంచుతారు సాహిర్. దానితో ఈ వాక్యాలు విషాదంతో పాటు ఓ నిజాన్ని కూడా మోసుకు వస్తాయి. మన కోరికలే మనలోని దుఃఖం విషాదం స్థాయి పెరగడానికి కారణం. మన జీవితంలోని తీవ్ర అలజడులకు కారణం మన కోరికలే. కోరుకున్నది దొరకకపోతే ఆ అసంతృప్తిలో నుండి పుట్టే విషాదమే మనలను నిర్వీర్యం చేస్తుంది. అలా అని మనసు కోరకుండా ఉండదు. జీవితంలో మన విషాదానికి, నిర్లిప్తతలకు, జీవితాని మనం స్వీకరించే విధానానికి మన మనసు చేసె యుద్ధం మన కోరికలతోనే. ఈ విషయం ఈ చరణంలో మరో స్పష్టం అవుతుంది. ఇప్పుడు చివరి చరణంలో సాహిర్ ఇలా అంటున్నాడు.

దిల్ మె నాకామ్ ఉమ్మీదోం కె బసేరే పాయే

రొష్నీ లేనే కొ నికలా తో అంధేరే పాయే

రంగ్ ఔర్ నూర్ కె ధారోం కీ తమన్నా కో థీ

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ

(మనసులో విఫలమైన ఆశలు కూడు కట్టుకుని ఉన్నాయి. వెలుగు కోసం వెతికితే చీకట్లు దరి చేరాయి. రంగులు కాంతుల ధారలను  కోరుకున్నాను, నేను చంద్రుడు తారలను కోరుకున్నాను)

మనసులో విఫలమైన ఆశల తీవ్రత అతని విషాదాన్ని పెంచుతుంది. పరిస్థితులను అతను ఎదుర్కునే శక్తికి ఆ విషాదమే అతన్ని దూరం చేస్తుంది.

ఎన్నో విషాద గీతాలుండగా సాహిర్ రాసిన ఈ పాట గొప్పతనం ఏంటీ అంటే ఇందులో అతనిలో సహజంగా ధ్వనించే పోరాట స్పూర్తి ఏ వాక్యంలోనూ కనపడదు. అత్యంత నిరాశాజనితమైన  ఈ గీతంలో సాహిర్ వ్యక్తీకరించే జీవన సారం పట్టుకోవడం కాస్త కష్టమే. దానికి ఈ పాటలోని ప్రతి చరణంలో అతను ఉపయోగించిన శైలిని గమనిస్తే ఈ పాట లోని మర్మం అర్థం అవుతుంది.

మన జీవితంలోని తీవ్ర దుఃఖాలకు చాలా వరకు మన కోరికలే కారణం. వాటిని నియంత్రణలో పెట్టుకోవడం అందరికీ సాధ్యం కాని పని. కాని విషాదం మనిషికి కొన్ని జీవన సత్యాలను నేర్పిస్తుంది. మనం కోరినవేవీ మనకు దక్కాలని లేదు. మనలోని విషాదానికి ఇతరులు కారణం కాదు. మన మనసే మన దుఃఖ తీవ్రతకు కారణం. కోరుకున్నవాటికి విరుద్ధమైన పరిస్థితులు జోడయినప్పుడు లభించే విషాదం అత్యంత తీవ్రంగా ఉంటుంది. పైగా ఆ స్థితిని స్వీకరించడం మనిషిని చాలా బాధిస్తుంది. కాని కోరినవేవీ అందకుండా పోవడమే జీవితం.

ఈపాటకు విరుగుడు అన్నట్టు సాహిర్, ‘హమ్ దోనో’ సినిమాలో ఆనందంగా ఎలా జీవించాలో చెప్తూ అద్భుతమైన గీతం ‘మై జిందగీ క సాథ్ నిభాతా చలాగయా/ హర్ ఫిక్ర్ కో ధువేమే ఉడాతా చలాగయా’ అన్న గీతం రాశారు. ఆ పాట చరణంలో ఏది దొరికితే అదే నా అదృష్టం అనుకుంటాను, దొరకని దాన్ని మరచి ముందుకు సాగుతాను’ అంటారు. ఈ విషాద గీతంకన్నా, ఆ సంతోషంగా బ్రతికే గీతం ఎక్కువగా ప్రజాదరణ పొందేట్టు రాయటం సాహిర్‌కే సాధ్యం. ఎందుకంటే, విషాద గీతాలకున్న ఆదరణ సంతోషకరమైన గీతాలకుండదు. కానీ, సాహిర్ ఈ ట్రెండుని మార్చారు.

ఈ పాటను రఫీ తప్ప మరొకరు పాడితే ఇలా ధ్వనించేది కాదేమో. దీన్ని సాహిర్ కూడా ఒప్పుకోరు. తన పాటలోని సాహిత్యమే దానికి ప్రాణం అని ఎవరు పాడినా తన పాటలు శ్రోతలను చేరతాయి అని వాదించి, సాధించి నిరూపించారు. కాని ఈ పాటను ఓ రఫీ ప్రేమికురాలిగా మరొకరి గొంతులో నేను ఊహించలేను. సాహిర్ ఈ పాటను ఉపయోగించిన శైలికి అబ్బురపడుతూనే రఫీ అందులో పలికించిన విషాదానికి అందులోని అసహాయతకు మనసు ద్రవించినప్పుడు కలిగే ఆ అనుభవం రఫీ గానంలోని అధ్బుతం అని ఒప్పుకోకుండానూ ఉండలేను. ముఖ్యంగా ప్రతి చరణంలో చివరి వాక్యం పాడేటాప్పుడు రఫీ చిలికించిన విషాదం పాటలోని పదాలకు నూతన శక్తినిస్తుంది. ముఖ్యంగా, బహారోంకి తమన్నా కీ థీ, నజారోంకి తమన్నా కీ థీ, సహారోంకి తమన్నా కీ థీ, కినారోంకి తమన్నా కీ థీ అన్నవి పలికేప్పుడు రఫీ స్వరంలో చిలికిన విషాదాన్ని సప్త సముద్రాలూ ఓపలేవు. పల్లవిలో ‘ముఝ్కో రాతోంకి సియాహీ కె సివా కుఛ్ న మిలా’ అన్న పాదం పలికేటప్పుడు ముఝ్కో, రాతోంకి అన్న విధానాన్ని సియాహీ( అంటే చీకటి అనేప్పుడు చీకటిని ధ్వనింప చేస్తాడు.)  అనటాన్ని   పోలిస్తే రఫీ గొప్పతనం తెలుస్తుంది.  రాతోంకి దగ్గర వేసిన అలంకారం రాత్రి ఎంత కఠినమైనదో తెలుపుతుంది. సియాహీ చీకటి ఎంత దట్టమైనదో ‘యా’ ఒత్తి  పలికి ‘హీ’  బరువుగా పలకటం అనుభవానికి తెస్తుంది. కుఛ్ న మిలా అనటంలో నిస్పృహ, నాకే ఎందుకిన్ని నిరాశలు అన్న విషాదంతో కూడిన బేలతనం కనిపించే ఫిర్యాదు ధ్వనింపచేస్తాడు. రఫీ పాట వినటమంటే, ఒక్కో అక్షరం, ఒక్కో పదంలో రఫీ పలికించిన అనంతమైన భావనల అల్లల శృంగాలపై ఎగరటమూ, లోతులలోకి దూకటమూనూ!    రెండు మేరు పర్వతాలు ఢీ కొన్నప్పుడు ఎవరు గొప్ప అని చెప్పలేం కాని సాహిర్ శైలి, రఫీ గానం రెండు ఈ పాటను ఓ అద్భుతంగా మరల్చాయి. పైగా ఎన్. దత్తా సంగీతం. ఒంటరిగా గీతం వింటుంటే నేటికీ కళ్ళూ చెమరుస్తాయి. చాలా సందర్భాలలో మనిషి ఈ సృష్టిలో అల్పుడు. ఇది ఒప్పుకుని తీరతాం. సాహిర్ మనిషిలోని శక్తిని ఎంత గొప్పగా వర్ణించగలరో, మనషిలోని అశక్తతనూ అదే అంతే గొప్పగానూ ప్రస్తావించగలరు.

ప్యార్ మాంగా తో సిసక్తె హుయే అర్మాన్ మిలె

చైన్ చాహా తో ఉమడ్తే హుయే తూఫాన్ మిలె

డూబ్తె దిల్ నె కినారోం కీ తమన్నా కీ థీ

మైనే చాంద్ ఔర్ సితారోం కీ తమన్నా కీ థీ..

ఈ వాక్యాలలోని విషాదానికి మనసు మౌనంగా రోదించకుండా ఆపడం కష్టమే.. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక విషయంలో నిరాశను అనుభవిస్తాడు. ఆ నిరాశల స్వరూపాన్ని కవితాత్మకంగా హృదయం స్పందించి, ద్రవించే రీతిలో ప్రదర్శిస్తుందీ పాట.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here