‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-23 – సంసార్ కీ హర్ షయ్ కా ఇతనా హీ ఫసానా హై

0
10

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ధుంధ్’ (Dhund, 1973) చిత్రం లోని ‘సంసార్ కీ హర్ షయ్ కా ఇతనా హీ ఫసానా హై’. గానం మహేంద్ర కపూర్. సంగీతం రవి.

~

సాహిర్ రాసిన సినీ గీతాలలో విషాదం, వేదాంతం, సమపాళ్ళలో ఉండి, అవి మనకు జీవిత సత్యాలను బోధిస్తాయి. అన్ని మతాలకు అతీతంగా ఉంటూనే, అన్ని మతాల సారాన్నీ కలుపుకునీ మనిషి జీవితంలోని అనూహ్యతను  కమర్షియల్ సినీ ప్రపంచంలో పాటల రూపంలో వ్యక్తీకరిస్తూ సినీ ప్రపంచానికి అత్యున్నత సాహితీ స్థాయిని కల్పించారు సాహిర్. సినిమా సాహిత్యం జీవిత వాస్తవికత నుండి మనిషిని భావనా ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళే పలాయనావాద సిద్ధాంతం అని మేధావి వర్గం అనడంలో చాలా వాస్తవం ఉంది. కాని సాహిర్ లాంటి కవులు దీనికి విరుద్ధంగా సినీ సాహిత్యానికి అంతులేని గౌరవాన్ని తీసుకురాగలిగారు. అందుకే సాహిర్ పాటలను ఆస్వాదించే వారికి ఇప్పటి సినీ గీతాలు నచ్చవు.

సినిమా ప్రారంభంలో పేర్లు పడుతున్నప్పుడు సినిమా కథా నేపథ్యాన్ని పరిచయం చేసే కొన్ని పాటలను సినీ దర్శకులు ఇష్టపడి రాయించుకునే వాళ్లు. వీటిని థీమ్ సాంగ్స్ అంటారు. ఈ థీమ్ సాంగ్స్ తాత్వికతతోనూ, లోతైన జీవిత సత్యాలతోనూ నిండి ఉండేవి. సాహిర్ రాసిన గీతాలు చాలా వరకు థీమ్ సాంగ్స్‌గా ఎన్నుకోబడేవి. అవి ఎలా చిత్రించినా, సినీ కథా నేపథ్యానికి గాంభీర్యాన్ని జోడించే అతి గొప్ప గీతాలుగా దర్శకులు ఆ పాటలను ప్రశంసించేవారు. శ్రోతలూ ఆ పాటలను ఎంతో ఇష్టపడేవాళ్లు. అవి ఎంత గంభీరమైన విషయాలను చర్చించినా అందులో పద ప్రయోగాలు సరళంగా ఉండడం, వాటిలోని లోతైన తాత్విక చింతనను సామాన్య జనం కూడా అర్థం చేసుకోవడానికి అవి సహాయపడడంతో సాహిర్ సినీ గీతాలలోనే రారాజుగా పరిగణించబడ్డారు. పాటల ద్వారా మేధా  స్వరాన్ని వెతుక్కునే నైజం సాహిర్ పాటల ద్వారానే శ్రోతలకు అవగతమయింది. పాఠకుల ఆలోచనా స్థాయి, మేధా స్థాయిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషించగల సాహితీ సృజన చేయడం అందరికీ సాధ్యపడని విషయం. కాని ఈ విషయంలో సాహిర్ తన ప్రతి పాటతోనూ విజయం సాధించారు.

మనుషులు ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత జీవితం పట్ల ఎంతో ప్రేమను, కోరికను కలిగి ఉంటారు. ఎన్నిటితోనో అనుబంధం పెంచుకుంటారు. కాని తాము తమవిగా భావించేవన్నీ అశాశ్వతాలు అని అర్థమయిన కొద్దీ జీవితం పట్ల ఓ నిర్లిప్తత ఆవహిస్తుంది. ఈ ప్రపంచంలో తమ ఉనికి శాశ్వతం కాదు అని తెలుసుకుంటే కలిగే వైరాగ్యం అప్పటి దాకా మనం మాయలో బతికేశాం అనే నిజాన్ని తెలియచేస్తుంది. జీవితం ఎంత క్షణభంగురమో మన అస్తిత్వాలు ఎంత అల్పమో తెలిసిన తరువాత జీవితం పట్ల కనపరిచే ఉత్సాహంలో చాలా తేడా వస్తుంది. ఈ ఎరుక మనిషి వికాసానికి అవసరమేమో కాని దాని వెనుక మనుషులు అనుభవించే విషాదం, ఆ విషాదం  మనసుకు చేరేటప్పుడు, అది జ్ఞానంగా మెదడుకు చేరుకునేటప్పుడు మనిషి పడే వేదన అనుభవిస్తే తప్ప దాని లోతు అర్థం కాదు.

ఈ వేదనాభరిత అనుభవాన్ని ఎంతో తాత్వికంగా అందించే గీతం ‘ధుంధ్’ సినిమాలో థీమ్ సాంగ్‌గా వస్తుంది.  ఈ గీతం ఈ ప్రపంచంలో మనిషి అల్పత్వాన్ని సూచిస్తుంది. మనుషులు కనపడని ప్రాకృతిక శక్తి ముందు అల్పులని చెబుతూ సాగే ఈ గీతం ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోవలసిన పాఠం.

సంసార్ కీ హర్ షయ్ కా ఇతనా హీ ఫసానా హై

ఇక్ ధుంధ్ సే ఆనా హై, ఇక్ ధుంధ్ మే జానా హై

(ప్రపంచంలో ప్రతి ఒక్కరి కథ ఇంతే. ఒక పొగమంచులో నుండి రావడం, మరో పొగమంచులోకి మాయమవడం)

మనం ఎక్కడి నుండి వస్తామో తెలియదు, ఎక్కడకు వెళతామో తెలియదు. మన జీవిత కాలం అంతా పొగమంచులా తేలిపోతుంది. ఆ పొగమంచు నుండే వచ్చి మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాం. ఇక్కడ పొగమంచు అనే పదాన్ని సాహిర్ ఎంత అర్థవంతంగా వాడారో చూడండి. అంతా కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏదీ స్పష్టంగా ఉండదు. మన పుట్టుక మరణం అర్థం అయీ అవనట్లే కదా ఉంటాయి. అలాగే మొదటి వాక్యంలో షయ్ అన్న పదం చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది. షయ్ అంటే వస్తువు అని అర్థం. జీవంతో ఉన్న లేదా జీవం లేకుండా ఉన్న ప్రతిదీ అన్న అర్థం వస్తుంది. మనుషులే కాదు, ఇక్కడ ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతీదీ కూడా అశాశ్వతమైనదే.

యే రాహ్ కహా సే హై, యె రాహ్ కహా తక్ హై

యే రాజ్ కోయీ రాహీ , సమఝా హై న జానా హై

(ఈ దారి ఎటు నుండి వస్తుందో ఎక్కడి దాకానో ఒక రహస్యమే, దీన్ని ఏ యాత్రికులూ అర్థం చేసుకోలేకపోయారూ, తెలుసుకోలేకపోయారు)

జీవితం అనే ప్రయాణం ఎటు నుంచి ఎక్కడివరకో  ఎవరూ తెలుసుకోలేరు. అది అర్థం కాని ఓ రహస్యమే. కేవలం ప్రయాణమే మనం చేసేది. అందులోని పర్యవసానాలు కూడా మన చేతిలో లేవు. ఏదీ మన చేతిలో లేని అర్థం కాని స్థితిలోనే మనం ఉంటూ ఎన్నో అనుకుంటాం, ఎంతో అహాన్ని ప్రదర్శిస్తాం. మన ప్రయాణం ఎంతవరకో, ఎందుకో తెలుసుకునే అవకాశం కూడా ఉండని ఓ దారిలో ప్రయాణం చేస్తూ పోతాం. మనలో లేని బలాన్ని, ప్రదర్శిస్తాం. ఎంత మాయలో పడి కొట్టుకుంటామో కదా..

ఇక్ పల్ కీ పలక్ పర్ హై ఠహరీ హుయీ యే దునియా

ఇక్ పల్ కె ఝపక్నే తక్ హర్ ఖేల్ సుహానా హై

( క్షణం అనే కనురెప్పపై నిలిచి ఉంది ఈ ప్రపంచం. అది రెప్పపాటు వేసేదాకా ప్రతి ఆట ఆనందంగా,  సరదాగానే ఉంటుంది)

జీవితం ఎంత క్షణ భంగురం. నిన్నటిదాకా మనతో ఉన్న వాళ్లు, కొన్ని సంవత్సరాలు మన జీవితాలలో భాగం అయిన వాళ్లు ఒక్క క్షణంలో మాయమయిపోతారు. మరణం అన్నిటిని మాయం చేస్తుంది. మరణాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప మనిషి ఉనికి ఎంత అల్పమో మనకు అర్థం కాదు. ఒక్క క్షణం మనది కాకుండా పోయి మన జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో అనుభవంలోకి వస్తే తప్ప చాలా విషయాల పట్ల మన అహం దూరం కాదు. ఒక రెప్పపాటు కాలం జీవితాలను అతలాకుతలం చేసే అనుభవం మనిషికి కలిగినప్పుడు దాని వెంట వచ్చే విషాదం మనుషులను కుదిపివేస్తుంది. దాన్ని భరించవలసి రావడం ప్రతి వారికి తప్పదు. ఆ వేదన జీవిత అర్థాలనే మార్చివేస్తుంది. అర్థాలనుకున్నవన్నీ అర్థరహితంగా మారే ఆ క్షణాన్ని ఇలా రెండు వాక్యాలలో పొందిపరిచిన సాహిర్ వేదాంత దృష్టి భయపెడుతుంది కూడా.

క్యా జానే కోయీ కిస్ పర్ కిస్ మోడ్ పె క్యా బీతే

ఇస్ రాహ్ మే యె రాహీ హర్ మోడ్ బహానా హై

(ఈ జీవిత మలుపుల్లో ఎవరికి ఎక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఈ ప్రయాణంలో ఓ ప్రయాణికుడా ప్రతి మలుపు ఓ సాకు మాత్రమే)

అన్నీ మనకు తెలుసనుకుంటాం. కాని ఈ జీవిత ప్రయాణంలో మనతో ప్రయాణం చెసే వారికే ఏ మలుపులో ఏ అనుభవాలు ఎదురయ్యాయో, ఎవరి జీవితంలో ఏ విషాదాలు ఉన్నాయో ఏ గాథలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కాని మనం అర్థం చేసుకోవలసింది ఒకటే ప్రతి మలుపు జీవన ప్రయాణంలో ఓ సాకు మాత్రమే. జరిగేది జరిగి తీరుతుంది. దక్కే అనుభవాలు, మిగిలే శూన్యతలను ఎవరూ ఆపలేరు. ఆ అనుభవాలకు ఆధారం అనుకునే సంఘటనలన్నీ మన జీవితంలో మన స్థితికి సాకులే. అవి కారణాలు కావు. జీవితంలో లభించే శూన్యత, ఒంటరితనం, వైరాగ్యం ఇవి మనకు అందే తుది అనుభవాలు. వీటికి దారి తీసే సంగతులన్నీ జీవితంలోని అశాశ్వత్వాన్ని అర్థం చేయించే సాకులు మాత్రమే.

ఈ వాక్యాలలోని వైరాగ్యం మనసును బాధిస్తుంది. అలాగే మనలోని అసహాయతను కోపాన్ని దూరం చేస్తుంది కూడా. సాధారణంగా మన జీవితంలోని కొన్ని సంఘటనలు మన జీవితంలోని విషాదానికి కారణాలుగా, కొందరు వ్యక్తులను మన జీవితంలోని కష్టాలకు కారకులుగా మనం పరిగణిస్తాం. కాని ఈ పాటలోని తాత్వికతను అర్థం చేసుకుంటే, మన స్థితికి ఎవరూ కారకులుగా, ఏవీ కారణాలుగా కనిపించవు, జీవితంలోని శూన్యత వైపుకు చేరడానికి, అన్నీ కేవలం సాకులుగా మాత్రమే కనిపిస్తాయి. ఈ స్థితిని స్థితప్రజ్ఞత అంటారేమో కాని ఆనందానికి విషాదానికి అతీతంగా నిలిచే ఈ స్థితి మనిషిని ఆ కనిపించని శక్తి ముందు తలవంచేలా చేస్తుంది. మనసును కోరికలు లేని అతీత స్థితికి చేరుస్తుంది.

హమ్ లోగ్ ఖిలౌనా హై ఇక్ ఐసే ఖిలాడీ కా

జిస్ కొ అభీ సదియోం  తక్ యే ఖేల్ రచానా హై

(మనం ఇంకా రాబోయే ఎన్నో యుగాలు దాకా ఈ ఆట ఆడవలసిన ఓ ఆటగాడి చేతిలో బొమ్మలం మాత్రమే)

చివర్లో సాహిర్ రాసిన ఈ రెండు వాక్యాల తరువాత ఇంకేమీ ప్రశ్నలు మనలో ఉదయించడానికి అవకాశమే ఉండదు. మనం అందరం ఆ పై వాడి చేతిలో బొమ్మలం మాత్రమే. అతను ఇంకా కొన్ని యుగాల దాకా ఈ ఆట ఆడుతూనే ఉంటాడు. ఇది ఇప్పట్లో ముగిసే ఆట కాదు. కాని ప్రతిదానికీ ఓ ముగింపు ఉన్నట్లే దీనికీ ఉండవచ్చు. ఈ ప్రపంచమూ మొత్తం నశించవచ్చు, ధర్మగ్రంథాలన్నీ అదే చెబుతాయి. అది నమ్మినా నమ్మకపోయినా ప్రతిదీ అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ధరణి ఉనికి శాశ్వతం అని కూడా చెప్పలేం కదా. కాకపోతే కొని యుగాల దాకా ఈ ఆట కొనసాగవచ్చు. ఈ ఆటలో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువూ కూడా ఒక పొగమంచులోనుండి వచ్చి మరో పొగమంచులోకి చేరిపోయే అశాశ్వతాలు. ఇది ఒక్కటే సత్యం. దీన్ని తెలుసుకుంటే ఏ ఆనందాలూ ఉండవు ఏ విషాదాలూ అంటవు.

ఇంత వేదాంతంతో నిండిన ఈ గీతం విన్న తరువాత ఈ సినిమా ఇతివృత్తంపై ఆసక్తి కలుగుతుంది. ఇది వేదాంత భరిత, తాత్వికత నిండిన చిత్రం అయి ఉండవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది థీమ్ సాంగ్‌గా సినిమా టైటిల్స్‌లో వచ్చే గీతం. కాని ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ పాట సినిమా కథలోని రహస్యాత్మకతను వెలికి తెచ్చే గీతం. కథలో హంతకుడు ఎవరు, ఎవరి జీవితంలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయి, ఎవరి జీవితం వారిని ఏ స్థితికి తీసుకువెళుతుంది, దానికి దారి తీసే సంఘటనలు ఎంతవరకు వారి జీవిత విషాదానికి కారణాలు? అవి కారణాలు కావు ఆ పాత్రల జీవన గతి ముందే నిర్దేశించబడింది. అదే విధి. దాని వైపుకు ప్రయాణించే వారి జీవన మార్గంలో ప్రతి సంఘటన ఓ సాకు మాత్రమే. కొందరి ప్రయాణం క్షణకాలం, మరి కొందరికి మరొ కొంతకాలం. కాని చివరకు అందరూ విధి చేతిలో పాత్రలే. ఇది తెలియజేస్తూ ఆసక్తిగా ఓ హత్య వెనుక కారణాన్ని కనుగొంటూ హంతకున్ని చేరుకోవడం సినీ కథ. కాని దానికి ఇంత గొప్ప తాత్వికతను జోడించడం సాహిర్ గొప్పతనం. అగాథా క్రిస్టీ రాసిన ఓ నవల ఆధారంగా నిర్మించిన ఓ అపరాధ పరిశోధక కథకు ఇలాంటి తాత్వికతను జోడించగలడం సాహిర్ వల్ల మాత్రమే సాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో.

‘ధుంధ్’ సినిమా మామూలుగానే ఆడింది. ఈ కథ చాలా మంది మర్చిపోయారు. కాని సినీ చరిత్రలో గొప్ప గీతంగా మాత్రం ఈ పాట మిగిలిపోయంది. ఉత్తర భారతదేశంలోని కొని గుళ్ళల్లో భజన రూపంలో కూడా ఇది స్థానం పొందింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథానేపథ్యం వివరించడానికి వాడుకున్న పాట భక్తి కేంద్రాలలో ఆధ్యాత్మికతను బోధించే స్థావరాలలో చోటు సంపాదించుకోవడం, గజల్ గానూ భజన రూపంలోనూ ప్రజలు దీన్నీ స్వీకరించడం కవి గొప్పతనం అని ఒప్పుకోక తప్పదు. అది సాహిర్ స్థాయి. అందుకే ఎందరు సినీ కవులు ఉన్న సాహిర్ వారి అందరి మధ్యన సూర్యుడే.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here