‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-3 – మెహఫిల్ సే ఉఠ్ జానే వాలో తుం లోగోం పర్ క్యా ఇల్జాం

4
10

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] పాట ‘దూజ్ కా చాంద్’ సినిమాలోనిది, సంగీతం రోషన్.

మనిషి తాను అన్ని జీవాలకన్నా తెలివైన వాడినని విర్రవీగుతాడు కాని నిస్వార్థంగా ప్రేమించడం చేతకాని వ్యక్తులే ఈ ప్రపంచంలో ఎక్కువ. ఇటువంటి సమూహంలో కూడా ఎవరో ఒకరు ప్రేమను అత్యున్నతమైనదిగా పరిగణించి జీవించాలని ప్రయత్నిస్తారు. కాని, దానికి బదులుగా జీవితాంతం వేదనను మోస్తూ బ్రతుకుతారు. ఈ ప్రపంచంలో తెలివిగల మనుషులు ప్రేమను, నమ్మకాన్ని, తామనుకునే విజయాలను సాధించడానికి ఓ మెట్టుగా ఉపయోగించుకుంటారు. ఇది పచ్చి నిజం. ప్రేమకు బదులుగా ప్రేమను మాత్రమే కోరే వ్యక్తికి నిరాశే మిగులుతుంది. తాను ఓ భ్రమలో జీవించానని తెలుసుకున్నప్పుడు మనిషి ఓ నిర్వేదస్థితిలోకి వెళ్లిపోతాడు. అసలు తరచి చూస్తే అన్ని బంధాలూ స్వార్థపూరితాలే. ఈ ప్రపంచంలో మనం అత్యంతంగా ప్రేమించిన వారి స్వార్థం ముందు ఆశ్చర్యపరుస్తుంది తరువాత లోతైన గాయం చేస్తుంది. విపరీతమైన ఒంటరితనం ఆవహిస్తుంది. దాన్నిఅలవాటు చేసుకోలేక, తమ ఆలోచనలను మార్చుకోలేక ప్రేమ మిగిల్చిన గాయం నిరంతరం బాధపెడుతూ ఉంటే, ఆ నొప్పిని భరిస్తూ, సహిస్తూ భారంగా జీవితాన్ని గడుపుతాం.

సాహిర్ తన గీతాలలో మనిషి అంతరాలలోని ఈ వేదనను సూటిగా బయటపెడతాడు. ఈయన పాటలలో ప్రేమలో విఫలం అయినవారు తమ అనుభవాలిచ్చిన జ్ఞానంతో ప్రపంచాన్ని ప్రశ్నిస్తారు. అయ్యో నేను మోసపోయాను, ఇక ఈ జీవితం ఎలాగ అన్న వేదన కన్నా తాను ఉన్నతంగా తలచి ప్రేమించిన వ్యక్తులు ఎంత నీచమైన వ్యక్తులో, ఎంత చిన్నవాళ్లో బైటపెడుతూ ఎవరు అధములో నిర్ణయించుకోండి అని శ్రోతలను ఆలోచించమంటాడు సాహిర్.

నాకు బాగా నచ్చేది సాహిర్ ప్రదర్శించే ఇలాంటి విషాదం. నేను మోసపోయాను, నేను తప్పు చేసాను అన్న అపరాధ భావం ఎట్టి పరిస్థితిలో ఆయన పాటలలో కనిపించదు. నేను ఇలాగే ఉంటాను. అలా లభించిన ఒంటరితనాన్ని స్వీకరిస్తున్నాను. కాని మీ సంగతేంటీ? మీ జీవన శైలి ఏంటీ అని ఆయన ప్రశ్నించే విధానం ఆయన పాటలను లోతుగా అర్థం చేసుకున్నవారికి ఓ వింత బలాన్ని ఇస్తుంది. ఆ బలాన్ని అనుభవించినవారు సాహిర్ ప్రభావంలో పడిపోతారు. విషాదాన్ని స్వీకరించడం అంటే జీవితాన్ని గెలవడమే, ఆ బలాన్ని సంపూర్ణంగా ఇవ్వగలవు సాహిర్ గీతాలు.

ఉదాహరణకు ఈ పాట చూడండి.

మెహఫిల్ సే ఉఠ్ జానే వాలో, తుం లోగోం పర్ క్యా ఇల్జాం

తుమ్ ఆబాద్ ఘరోం కే వాసీ, మై ఆవారా ఔర్ బద్నాం.

మేరే సాథీ, మేరే సాథీ, మేరే సాథీ ఖాలీ జాం. మేరే సాథీ ఖాలీ జాం.

(నా స్నేహ బృందం నుండి వెళ్లి పోయిన వారిపై నేపం ఎలా వేసేది

మీరు సుంపన్నమైన ఇళ్లలో నివసించేవారు, నేను అపఖ్యాతి పాలైన ఓ సంచారిని,

నా తోడు, నాకుతోడు, నాకున్నతోడు ఈ ఖాళీ మధుపాత్ర ఒక్కటే)

ఉర్దూలో పదాలకు, అదే భావంతో తెలుగులో సరైన పదాలు దొరకవు. రెండు భాషల నేపథ్యాలు, సాంస్కృతిక రంగాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మెహఫిల్ అనే పదాన్ని విస్తృతంగా వాడతారు ఉర్దూలో. తెలుగులో అది సమావేశం అనే అర్థం వస్తుంది. కాని ఈ సందర్భంలో అది అతకదు. జీవితం అంటే మనుషులను కలుపుకుంటూ పోవడం. ప్రతి మనిషికి తన జీవితంలో తనదైన ఓ బృందం ఉంటుంది. వారి మధ్యనే ఎదుగుతూ వెళతాం అనుబంధాలను ఏర్పరుచుకుంటాం. అయితే ఇక్కడ మనిషి ఏర్పరుచుకున్న ఈ స్నేహ బృంద సమావేశాలన్నీ ఎవరి స్థాయిని బట్టి చిక్కబడుతూ పోతాయి. అత్యంత విజయవంతమైన స్థితిలో ఉండే వ్యక్తి స్నేహ సమూహాలు సాధారణంగా నిండుగా కనిపిస్తాయి.

పై వాక్యాలని బట్టి అర్థం చేసుకోవలసింది ఇది. కవి తనదైన స్నేహ బృందాన్ని ఏర్పరుచుకున్నాడు. కాని ఒక్కొక్కరుగా అతన్ని అందరూ వీడి వెళ్లిపోతున్నారు. దానికి వారిని అతను కారణం అడగట్లేదు. ఏ నెపం వారిపై వేయట్లేదు. మీ దారి వేరు నా దారి వేరు. మీరు నిండైన ఇంటినుండి వచ్చినవారు, నేను ఒంటరిని, అపఖ్యాతి పాలయిన వాడను, ఆవారాని అంటున్నాడు. ఇతరులు తనననే మాటలను తానుగా చెప్పుకుంటూ, మీ దృష్టిలో నేను పనీ పాట లేక తిరుగుతున్న పోరంబోకును కదా. అందుకే నన్ను వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు నాకు తోడు ఈ ఖాళీ మధుపాత్ర ఒక్కటే. మధువు నిండి ఉన్న పాత్ర ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక అయితే ఇక్కడ కవి మధుపాత్ర ఖాళీ అయిపోయింది. జీవితంలో ఆనందం, ఉత్సాహం కలిగించేవేవి ఇప్పుడు అతనికి లేవు. అటువంటి వారి దగ్గర ఎవరు ఉంటారని? ఏదో లభిస్తుందంటే తప్ప స్నేహం కోసం చేయిచాచని మనుషులు ఇలాంటి వ్యక్తితో ఎందుకు కలిసి ఉంటారు? అతని ఏర్పరుచుకున్న స్నేహ బృందంలో ఒకొక్కరూ అతన్ని వదిలి వెళ్లిపోయారు. ఇది ప్రపంచ రీతి, దీనికి ఎవరినీ తప్పు పట్టలేం. పట్టకూడదు కూడా అన్నది సాహిర్ భావన. నిజానికి ఈ పాట రచన వెనుక ఒక కథ వుంది. సాహిర్ ముషాయిరాలో పాల్గొనేందుకు వెళ్ళినప్పుడు రాత్రివరకూ అతని హోటెల్ గదిలో అందరూ కలసికూర్చుని మద్యం తాగేరు. కానీ, ఆలస్యం అయినా కొద్దీ ఒకరొకరుగా అతడిని వదలి వెళ్ళిపోసాగారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత ఒంటరిగా సాహిర్ ఈ గజల్ రాశాడు. దాన్ని సినిమాలో  తరువాత సందర్భోచితంగా వాడుకున్నారు. వెళ్ళిపోతున్నవారందరికీ ఏదో ఓ పనివుంది. వెళ్ళిపోవటంలో వారి తప్పులేదు.

ఇందులో రఫీ గానం ఎంత అర్థవంతంగా ఉంటుందంటే, మేరే సాథీ అని మూడు సార్లు అంటున్నప్పుడు అది మూడు విధాలుగా వినిపిస్తుంది. “నా తోడు, నాకు తోడు, నాకున్న తోడు” అని ద్వనించేలా గానం చేస్తాడు గాన గంధర్వుడు రఫీ. మూడు సార్లు మేరే సాథీ అనే వస్తుంది పాటలో. కాని గానంలో ఒకో పదం ఒకో రీతిలో అర్థాన్ని ఇస్తుంది. అది రఫీ ఒక్కడికే సాధ్యం.

దో దిన్ తుమ్నే ప్యార్ జతాయా, దో దిన్ తుమ్సె మేల్ రహా

అచ్చా ఖాసా వక్త్ కటా ఔర్ అచ్చా ఖాసా ఖేల్ రహ

అబ్ ఉస్ ఖెల్ కా జిక్ర్ హి కైసా, వక్త్ కటా ఔర్ ఖేల్ తమామ్

మేరే సాథీ మేరే సాథీ మేరే సాథీ ఖాలీ జాం

(రెండు రోజులు నువ్వు ప్రేమను కురిపించావు, రెండు రోజులు నీతో సాన్నిహిత్యం అనుభవించాను. సమయం చక్కగా గడిచింది, ఆట చక్కగా సాగింది. ఇక ఆ ఆట గురించి ప్రస్తావించడం ఎందుకు, సమయం గడిపాం, ఆట అయిపోయింది. నా తోడు నాకు తోడు నాకున్న తోడు ఇప్పుడీ ఖాళీ మధుపాత్రే)

ప్రేమలో మోసపోయిన వ్యక్తి తనను వదిలి వెళ్ళేవారిని విమర్శిస్తాడు. కాని కవి ఇక్కడ ఆ పని చేయట్లేదు. రెండు రోజులే కావచ్చు, నువ్వు ప్రేమను కురిపించావు. నేను ఆనందాన్ని అనుభవించాను. ఇదో ఆట, సమయం గడపడానికే ఆడుకున్నా, అది చక్కగానే సాగింది. ఇద్దరికీ ఆనందం దొరికింది. ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు? అది గడిచిపోయిన ఆట. ఇప్పుడు నాకు తోడు, నాకున్న తోడు నాదైన తోడు ఈ ఖాళీ మధుపాత్ర ఒక్కటే.

ప్రేమ అనుకునే ఇద్దరం ఆనందించాం. నువ్వు ఆట అనుకుని వెళ్ళిపోయినా అనుభవించిన ఆనందపు ఘడియలు నాలో మిగిలే ఉంటాయి. అది నాకు ఆట కాదు కదా. ఆ ఆనందం గుర్తుగా ఆ గడిచిన రోజులపై కోపాన్ని ప్రదర్శించుకోవడం ఎందుకు? ఆ ఆట నాకూ ఆనందాన్నిచ్చినప్పుడు ఇక నేరం మోపడం ఎందుకు?

ఇక్కడ కవి మోసం చేసిన వ్యక్తిని దూషిస్తూ, ఆ వ్యక్తిపై కోపాన్ని ప్రకటించట్లేదు. అలా కోపం చూపడం అంటే ఆ వ్యక్తి లేని లోటును మనం అనుభవిస్తున్నాం అని ఒప్పుకోవడమే. కవిలోని ఆత్మగౌరవం మోసం చేసిన వ్యక్తికి ఆ స్థాయి ఇక్కడ ఇచ్చి ఆమెను గొప్ప చేయకపోవడం ఈ పాటలో కవి చూపే వ్యక్తిత్వం. నేనూ ఆ రెండు రోజులు ఆనందంగానే గడిపాను లేవోయ్. ఇక ఆ ప్రస్తావన ఎందుకు అని తీసిపడేస్తున్నాడు. మళ్ళీ వాస్తవానికి వస్తూ ఇక నాకు తోడు ఈ ఖాళీ మధుపాత్రే అని కూడా చెప్పుకుంటున్నాడు. అత్యంత విషాద స్థితిలో కూడా తనను వీడి వెళ్ళినవారి ప్రస్తావన తనకనవసరం అని ఒకింత గర్వంతో చెప్పుకోవడమే సాహిర్ శైలి. నాకు ఎంతో ఇష్టమైన జీవన శైలి.

తుమ్నె డూండీ సుఖ్ కీ దౌలత్ మైనె పాలా గమ్ కా రోగ్

కైసె బన్తా  కైసె నిభ్తా యె రిశ్తా ఔర్ యె సంజోగ్

మైనె దిల్ కొ దిల్ సె తోలా తుమ్నె మాంగీ ప్యార్ కె దామ్

మేరే సాథీ, మేరే సాథీ, మేరె సాథీ ఖాలీ జాం

(నువ్వు ధనం ద్వారా వచ్చే సుఖాన్ని వెతుక్కున్నావు. నేను బాధ అనే రోగాన్ని పెంచుకున్నాను. ఇక మన బంధం, మన కలయిక ఎలా కుదురుతుంది? ఎలా నిలుస్తుంది? నేను మనసుకు బదులు మనసును తూచాను. నువ్వు ప్రేమకు ఖరీదు అడిగావు. అందుకేగా మరి నాకు తోడుగా ఈ మధుపాత్రే మిగిలిపోయింది)

అవతలి వ్యక్తికి ధనం పై ఆశ. ఆమె ధనాన్ని, తద్వారా వచ్చే సుఖాన్ని ప్రేమ పేరుతో పొందాలనుకుంది. కవి మాత్రం బాధను స్వీకరించాడు. ప్రేమను అనుభవించే విధానంలోనే వారిలో ఇంత తేడా ఉంది. ఇద్దరూ భిన్న దృవాలకు చెందినవారు. ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అన్నది కాదు ఇక్కడ సమస్య, భిన్న దృవాలకు చెందిన వారు ఎలా కలవగలరు? వారి మధ్య ఏర్పడిన బంధం, ఎన్నాళ్లు మిగిలుంటుంది? అందుకే మనం విడిపోయాం. నువ్వు మోసం చేసింది లేదు, నేను మోసపోయింది లేదు. మనం కలిసే వ్యక్తులం కాదు. మనవి భిన్న దృవాలు. కొంత కాలం కలిసి ప్రయాణం చేసినా ఒకటిగా ఉండలేం. అందుకే దూరమయ్యాం, అంతే – అంటాడు కవి.

భిన్న మనస్తత్వాలు కలిసి ఉండలేవు, ఎప్పటికయినా విడిపోవడం తప్పదు. ఇది సత్యం. దీన్ని అంగీకరిస్తే, జీవితంలో విషాదాన్ని అనుభవించే శక్తి వస్తుంది. సాహిర్ కలం అత్యంత విషాద భరిత స్థితిలో కూడా ఆ శక్తిని జోడిస్తూ వెళుతుంది.

తుం దునియా కో బెహతర్ సంఝే, మై పాగల్ థా ఖ్వార్ హువా

తుమ్కొ అప్నానే నికలా థా, కుద్ సే భీ బేజార్ హువా

దేఖ్ లియా ఘర్ ఫూంక్ తమాషా, జాన్ లియా మైనె అంజాం

మేరే సాథీ, మేరే సాథీ మేరే సాథీ ఖాలీ జాం

(నువ్వు ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్నావు. నేను పిచ్చివాడిని అందుకే అవమానాలు పొందాను. నిన్ను పొందాలనుకున్నాను, నా నుంచే దూరమైనాను. ఇంటికే నిప్పంటించుకుని ఫలితం అనుభవించాను. దాని పర్యవసానాన్ని తెలుసుకున్నాను. నా తోడు, నాకు తోడు, నాకున్న తోడు ఈ ఖాళీ మధుపాత్రే.)

ఈ ఆఖరి చరణం శక్తివంతమైనది. తనను వీడి వెళ్ళిపోయిన ప్రేయసి చాలా తెలివైనది. ఆమెకు ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుసు., ప్రపంచంలో మెలగడం చాతకాని వాడు తను. అందుకే ప్రేమకు బదులుగా అవమానాన్ని పొందాడు. ప్రేమికురాలిని పొందాలనుకున్నాడు. కాని ఆ దారిలో నడిచి, తనను తానే పోగొట్టుకున్నాడు. అంటే ఆత్మాభిమానాన్ని, తనపై నమ్మకాన్ని పూర్తిగా నశింపజేసుకున్నాడు. అంతకు ముందు అతనికీ ఓ సురక్షితమైన ఆవాసం ఉండేది. అతని మనసు ప్రశాంతంగానూ ఉండేది. కాని తనతో ఏ మాత్రం సరిపోని వ్యక్తి స్నేహాన్నికోరి, తన ఇంటికి తానే నిప్పంటించుకున్నాడు. అతని స్థితికి. స్వయంగా అతనే కారకుడు. అందుకే ఎవరినీ అతను నిందించట్లేదు. ఈ అనుభవం అతనికి కొంత జ్ఞానాన్ని కూడా ఇచ్చింది. మనతో పొసగని వారిని ప్రేమిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో అతనికి తెలిపింది. అతను తప్పే చేశాడు కాని ఆ తప్పు ద్వారా జీవితానుభవాన్ని సంపాదించుకున్నాడు. ఈ అనుభవం లేకపోతే తనను తాను మోసగించుకుంటూనే ఉండిపోయేవాడు. ఈ విషాదమే అతన్ని జ్ఞానవంతుడిగా చేసింది. ఇప్పుడు అతని చేతిలో ఖాళీ మదుపాత్ర ఉన్నా ఆ విషాదం నుండి కూడా అతను కొంత నేర్చుకోగలిగాడు. గతంలోకన్నా ఇప్పుడు జ్ఞానవంతుడయ్యాడు.

సాహిర్ విషాదంలో ఒక లెక్కలేనితనం ఉంటుంది. ఔను మోసపోయాను, ఒంటరినయ్యాను కాని ఇప్పుడు నేను మునుపటి కంటే జ్ఞానవంతుడిని అని చెప్పుకోవడం, విషాదాన్ని ఒప్పుకోవడం సాహిర్ శైలి. ఈ గీతం కేవలం ఓ స్త్రీ పురుషుడికి మధ్య సాగే ప్రేమ దగ్గర ఆగిపోదు. సినిమాలో వచ్చే సన్నివేశాలతో సంబంధం లేకుండా విన్నప్పుడు కూడా విడిగా ఇదో గొప్ప గీతంలా అనిపిస్తుంది. జీవితంలో మోసాన్ని చవి చూసి ఒంటరయిన ప్రతి ఒక్కరికీ వారి అనుభవంలోని విషాదాన్నిగుర్తుకు తెస్తూ కూడా, వారిలోని కోపాన్ని దూరం చేస్తుంది, మన ఆలోచనలతో పొసగని వారి సాంగత్యాన్ని ఆశించి మనం ఒంటరయ్యాము తప్ప మనలో మరే లోపం లేదని, ఇప్పుడు ఖాళీ మధుపాత్రే మనకు తోడయినా ఈ అనుభవంతో నేర్చుకున్న పాఠాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి అని చెప్పే గొప్ప పాట ఇది. నా మనసుకు ఎంతో దగ్గరయిన పాట కూడా. మనల్ని వీడి వెళ్లిన వారు ప్రపంచంలో ముందుకు త్వరత్వరగా సాగిపోవడం నేర్చినవారు. వారితో స్నేహం మనల్ని ఎప్పుడయినా ఒంటరిని చేసేదే. అందుకే గతం దగ్గర ఆగిపోవద్దు. చేతిలో ఉన్నది ఖాళీ మధుపాత్రే కాని పొందిన జీవితానుభవం కూడా తక్కువ కాదు. అదే మన అసలైన ఆస్తి, మనల్ని గట్టిపరిచే పునాది.. అందుకే మేరే సాథీ మేరే సాథీ మేరే సాథీ ఖాళీ జాం అని గర్వంగా పాడుకోండి. అది ఇచ్చే హాయి గొప్పగా ఉంటుంది. అనుభవించి చెప్తున్న మాటలివి.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here