‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-4 – తూ మేరే సాథ్ రహేగా మున్నే

2
18

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఎ[/dropcap]వరెన్ని చెప్పినా, కాలం ఎంతగా  మారినా మనమున్నది పితృస్వామ్య సమాజంలోనే. ఈ లోకంలో ఒంటరి స్త్రీలు బిడ్డలను పెంచుకునే క్రమంలో అనుభవించే వేదన అందరికీ అర్థం కాదు. అలాంటి తల్లుల పెంపకంలో పెరిగిన పిల్లలూ ఆ తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న సందర్భాలు చాలా చాలా తక్కువ. ఓ ఒంటరి తల్లి పెంచిన కొడుకుగా ఆ తల్లి మనసును, ఆమె క్షోభను, ఒంటరితనాన్నీ  పూర్తిగా అర్థం చేసుకున్న కొడుకు సాహిర్ లుధియాన్వి. అందుకే ఒంటరి తల్లుల ఘోషను తన గేయాలలో వినిపించే సందర్భంలో తానే ఆ ఒంటరి స్త్రీగా మారి ఆమె హృదయాన్ని అత్యద్భుతమైన రీతిలో ఆవిష్కరించగలిగిన ఏకైక పురుష కవి సాహిర్. ఆయన రాసిన ఇలాంటి పాటల్లో స్త్రీ మనసులోని ఆక్రోశం, కసి, కోపం చాలా సహజమైన రీతిలో బైటికి వస్తాయి. దీనికి ఉదాహరణగా త్రిశుల్ (1978) సినిమాలోని ఈ గీతం చూడండి.

తూ మెరే సాథ్ రహెగా మున్నే,

తాకి తూ జాన్సకె తుఝ్కొ పర్వాన్ చఢానే కే లియె

కిత్నె సంగీన్ మరాహిల్ సె తేరీ మా గుజరీ

తూ మేరే సాథ్ రహెగా మున్నె

(నువ్వు నాతోనే ఉంటావురా కన్నా, నిన్ను జీవితంలో ఓ ఎత్తుకు చేర్చడానికి నేనెన్ని కఠినమైన దారుల్లో ప్రయాణించానో నీకు తెలియడానికి నేను నిన్ను నాతోనే ఉంచుకుంటాను)

ఓ స్త్రీ పురుషుడి చేతిలో లేదా జీవితం చేతిలో మోసపోయి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, తనకు ఎవరూ చేయూత ఇవ్వకపోగా తనను బహిష్కృతగా మార్చినప్పుడు ఈ సమాజంపై  కసితో రగిలిపోతుంది. ఆ కసితోనే ఆమె బిడ్డను పెంచుతుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కుంటుంది. ఆ బిడ్డకు తన కష్టం తెలియాలని కోరుకుంటుంది. ఆమెకు సమాజం నుండి రక్షణ కోసం ఓ తోడు కావాలి. కాని సమాజం ఆమెకు ఆ తోడు లేకుండా చేసింది. పైగా ఒంటరి స్త్రీని ఆమె బిడ్డను సమాజం చూసే తీరులో ఓ క్రౌర్యం ఉంటుంది. దాన్ని ఎదుర్కుంటున్నప్పుడు ఆమెలో కలిగే ఆక్రోశం “ఈ బిడ్డనే నాకు తోడుగా మలచుకుంటాను” అన్న దిశగా ఆమెలో పట్టుదలను పెంచుతుంది. స్త్రీలో ఉండే లాలిత్యం, సున్నితత్వం మరుగున పడి ఆమెలో విపరీతమైన పట్టుదల, మొండితనం బయలుదేరతాయి. అందుకే ఈ గీతంలో ఆమె, నేనెంత హింస అనుభవించి నిన్ను పెద్దవాడిని చేస్తానో చూసే సాక్షంగా నిన్ను నేను పెంచుకుంటాను అని అంటుంది. లాలిత్యంతో జోల పాటలు పాడే స్థితిలో ఒంటరి తల్లిని చూపిన కవులకు ఈ వాస్తవికత రుచించక పోవచ్చు. స్త్రీ జీవితంలోని సంఘర్షణ లోతుల్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే ఈ వాక్యాలలోని లోతుని చేరగలుగుతారు.

తూ మెరే సాథ్ రహెగా మున్నే,

తాకి తూ దేఖ్ సకె కితనె పావో మేరే మమతా కె కలెజె పే పడే

కిత్నె ఖంజర్   మెరే ఆంఖో మెరే కానో మే ఘడే

తూ మెరే సాథ్ రహెగా మున్నే,

(నువ్వు నాకు తోడుగా ఉంటావురా కన్నా, ఎన్ని నిర్దయ పాదాలు నా మాతృత్వపు గుండెను నలిపేశాయో , ఎన్ని శూలాలు నా కన్నులని, చెవులను తూట్లు పొడిచాయో దగ్గరుండి చూడడానికి నువ్వు నాతోనే ఉంటావు)

ఒంటరి స్త్రీని నలిపివేసి ఆమెను కఠినాత్మురాలిగా మార్చివేసే సమాజపు కట్టుబాట్లు, స్వార్థాల నడుమ ఆమె ఆ బిడ్డను పెంచుకుంటుంది. వాటినుండి ఆ బిడ్డను కాపాడుతూనే అవన్నీ ఆ బిడ్డకు అర్థం కావాలని ఆమె కోరుకుంటుంది. ఆమెను అర్థం చేసుకోగలిగే తోడు లేనప్పుడు ఆ బిడ్డ ఆ తోడుగా ఎదగాలని కోరుతుంది. అతను కేవలం కొడుకుగా కాదు ఓ తోడుగా మారాలని, తనను అర్థం చేసుకోవాలని ఆమె బలంగా కోరుతుంది. ఎన్ని మాటలు, ఎన్ని క్రూరపు ఆకలి చూపుల నడుమ ఆమె ఆ బిడ్డను పెంచుతుందో ఆ బిడ్డకు అర్థం కావాలి. ఆదే ఆశయంగా ఆమె ఆ బిడ్డను పెంచుకుంటుంది.

మై తుఝె రహమ్ కె సాయే మే నా పల్నే దూంగీ

జిందగానీ కీ ఖడీ ధూప్ మే జల్నే దూంగీ

తాకె తప్ తప్ కే తూ ఫౌలాద్ బనె, మా కీ ఔలాద్ బనే, మా కీ ఔలాద్ బనే

జబ్ తలక్ హోగా తెరా సాథ్ నిభావూంగీ మై

ఫిర్ చలీ జావూంగీ ఉస్ పార్ కే సన్నాటో మే

ఔర్ తారోం  సె తుఝె ఝాంఖూంగీ

(నేను నిన్ను ఇతరుల దయా దాక్షణ్యాల మీద బతకనివ్వను. జీవితంలోని ఈ మంటల్లో నిన్ను కాలుస్తూనే పెంచుతాను. నీవు ఆ సమ్మెట పోట్ల మధ్య ఓ కఠినమైన ఉక్కు గుండుగా మారాలి, ఈ తల్లికి కొడుకుగా మారాలి. నాకు ఓపిక ఉన్నంత వరకు నీకు తోడుగా నిలుస్తాను. తరువాత ఆ వైపు నిశబ్దంలోకి చేరిపోయి పైనున్న తారల మధ్య  నుండి నిన్ను చూస్తాను)

ఆ తల్లి ఇతరుల దయతో బిడ్డను పెంచాలనుకోదు. అది ఆమె ఆత్మగౌరవానికి విరుద్ధం. తన కాయకష్టంతో ఆమె ఒంటరిగా ఆ బిడ్డను పెంచుతుంది. కాని కష్టాలు తెలియకుండా అతని దారిలో పువ్వులు పరచాలనుకోవట్లేదు. సమాజంలోని కష్టాల కొలిమిలో ఆ బిడ్డ కాలాలని కోరుతుంది. ఆ నిప్పుల అనుభవంతో ఆ బిడ్డ ఉక్కు గుండుగా మారాలన్నది ఆమె సంకల్పం. తన ఉక్కు హృదయాన్ని, ఆ బిడ్డ వారసత్వంగా పొందాలన్నది ఆమె కోరిక. ఓపికున్నంత వరకూ ఆ బిడ్డే ప్రపంచంగా ఆమె తన జీవితాన్ని అంకితమిస్తానంటుంది. కాని ఏదో ఒక రోజు మరణం ఆమెను ఆ బిడ్డకు దూరం చేస్తుందన్న సంగతి ఆ తల్లికి తెలుసు. అందుకే శరీరంలో ఓపిక నశించాక నేను నీకు దూరం అవ్వవలసి వస్తుంది అన్న జీవిత సత్యాన్ని ఆ బిడ్డకు చెబుతునే కాని తారల్లోకి చేరి ఆ బిడ్డను తాను చూస్తూనే ఉంటానని చెబుతుంది. తన ఆశయాలను ఆ బిడ్డ ఎలా నెరవేరుస్తాడో ఆమెకు తెలియాలి. ఆ బిడ్డనుంచే ఆమె ఆశించేది అదీ. అది తన హక్కు అని కూడా ఆమె ఇక్కడ ప్రస్తావిస్తుంది.

బిడ్డను తల్లి హక్కుగా చూడడం, బిడ్డ నుంచి తన మాతృత్వపు రుణాన్ని తానుగా కోరడం చాలా మందికి మింగుడు పడని విషయం. తల్లి ఆశయాల పట్ల, ఆదర్శాల పట్ల, జీవన వైనం పట్ల కూడా పిల్లలకు బాధ్యత ఉండాలి అన్న సంగతి మర్చిపోయిన తరం మధ్య ఆ తల్లి కఠినంగా కన్పిస్తుందేమో కాని, తనది అనబడే ఆ ఒక్క ప్రాణి పట్ల తన కర్తవ్యాన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య నెరవేర్చాక బదులుగా ఆ బిడ్డ తన ఆత్మగౌరవాన్ని కాపాడే ఉక్కు మనిషిగా ఈ ప్రపంచంలో మిగలాలి అని కోరుకోవడం ఆ తల్లి దెబ్బ తిన్న హృదయంలోని కోరిక. దీన్ని అర్థం చేసుకోగల ఒంటరి తల్లుల బిడ్డలు చాలా చాలా తక్కువ. సాహిర్ ఆ బిడ్డగా నిలవడమే కాక ఆ తల్లుల ఆక్రోశాన్నిసమయం వచ్చినప్పుడల్లా తన గీతాలలో బైట పెట్టడానికి వెనుకాడలేదు.

జఖ్మ్ సీనే మె లియె, పూల్ నిగాహో మే లియె

మేరా హర్ దర్ద్ తుఝే దిల్ మే బసానా హోగా

మై తేరి మా హూ మెరా కర్జ్ చుకానా హోగా

మేరి బర్బాది కే జామిన్ అగర్ ఆబాద్ రహే

మై తుఝె దూద్ నా బక్షూంగీ తుఝె యాద్ రహే తుఝే యాద్ రహే

(నా జీవితపు గాయాలని నీలో నింపుకుని నువ్వు నీ కళ్లల్లో పూవుల అందాన్ని కనబరుస్తూ జీవించాలి. నా గుండె నొప్పిని నీదిగా మార్చుకోవాలి. నేను నీ తల్లిని, నా రుణం నువ్వు తీర్చుకోవాలి. నలిగి, మోడుగా మారిన నా జీవితానికి అర్థం ఉండాలంటే నువ్వు నా రుణం తీర్చుకోవాలి. గుర్తు పెట్టుకో నా పాల రుణం నువ్వు తీర్చుకోవాలి లేదా నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను.)

ఒంటరి తల్లిలోని ఆక్రోశాన్ని ఇంత గొప్పగా స్పృశించిన కవి మరొకరు లేరు. తల్లి బిడ్డను కఠినంగా మారమంటుంది. పైకి సున్నితత్వాన్ని చూపుతూ లోపల తాను జీవితాంతం మోసిన ఆ నొప్పిని తన నొప్పిగా మార్చుకుని తన కష్టానికి, తనకు జరిగిన దుర్మార్గానికి ప్రతీకారం తీర్చుకొమ్మంటుంది. అనునిత్యం తన ఒంటరితనాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సమాజంలో కొడుకుగా తన కర్త్యవ్యం నెరవేర్చమంటుంది. తాగిన తన పాల రుణం తీర్చుకోవడం అతని కర్త్యవ్యం అని, అలా చేయలేకపోతే తాను అతన్ని ఎప్పటికీ క్షమించలేనని చెబుతుంది.

బిడ్డలు ఏం చేసినా క్షమిస్తూ పోవడమే తల్లి గుణం అని మాతృత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ పితృస్వామ్య సమాజం ఈ పాటలో తల్లిని క్రూరురాలని అనవచ్చు. బిడ్డను పెంచడం ఆమె కర్తవ్యం, బిడ్డను కనడం వరకే ఆమె ఉపయోగం. ఆ బిడ్డలనుంచి ఆమె ఏమీ కోరకూడదు. బిడ్డలు తల్లి ఆశయాలకు వారసులు కారు అనే ఖలిల్ జిబ్రన్ సూక్తులకు బిన్నంగా ఓ ఒంటరి తల్లి తన ఆత్మ ఘోషకు ప్రతీకారంగా బిడ్డ మారాలని కోరుకోవడం తప్పని చాలా మంది వాదించవచ్చు. కాని సమాజంలో ఒంటరి తల్లిగా మారిన స్త్రీలో తప్పకుండా ఉండే కోరిక ఆక్రోశం ఇలాగే ఉంటుంది. ఇది అతి సహజమైన ఓ ఒంటరి తల్లి కోరిక.

తల్లి జీవితపు కష్టాన్ని అర్థం చేసుకోవలసిన భాద్యత పిల్లలకు ఉండి తీరాలి. ఒంటరి తల్లిగా నిందలతో కష్టాలతో ఆ తల్లి బిడ్డను పెంచవలసిన అవసరం ఏంటీ. మగాడు బిడ్డను వదిలేసినట్లు ఆమె ఆ బిడ్డను వదలలేదే. ఇదే సమాజంలో మోసం చేసిన వాడు ఆనందంగా అనుభవిస్తుంటే ఆ తల్లి మాత్రం కఠినమైన పరిస్థితుల మధ్య సర్వం కోల్పోతుంది. అయినా బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. తన కర్తవ్యం మరవదు. దాని కోసం ఎన్నో కష్టాలు పడుతుంది. ఆ బిడ్డ ఆ తరువాత అన్నీ మరిచి సుఖంగా బ్రతకడం కాదు తన దీక్షను అర్థం చేసుకోవాలని ఆమె కోరుతుంది. అందుకే ఆ బిడ్డ నుండి ప్రతిఫలం ఆశించే హక్కు ఆ తల్లి తీసుకుంటుంది. దీన్ని ఇంత స్పష్టంగా వ్యక్తీకరించిన గీతం మరొకటి సినిమా ప్రపంచంలో కనిపించదు. స్త్రీ హృదయాన్ని, ఒంటరి స్త్రీ ఆక్రోశాన్ని, ఆ తల్లి పట్ల బిడ్డల బాధ్యతను ఇంత గొప్పగా రాసిన సాహిర్ గీతాలలోని స్త్రీవాదం ఎందరికో ఆదర్శం. నిజానికి ఈ పాటలో సాహిర్ వ్యక్త పరచిన భావాలన్నీ సాహిర్ తన తల్లి ద్వారా విన్నవే!

 సాహిర్ ఒక జాగీర్దార్ కొడుకు. కానీ, సాహిర్ పసితనంలోనే అతని తల్లి భర్తతో విభేదించి సాహిర్ ను తీసుకుని వేరు వచ్చేసింది. దాన్ని అవమానంగా భావించిన ఆ జాగీర్దార్ సాహిర్ ని కిడ్నాప్ చేయించాలని తీవ్రంగా ప్రయత్నించాడు. తల్లినుంచి పిల్లవాడిని వేరు చేయాలని ప్రయత్నించాడు. చివరికి సాహిర్ ను చంపించాలనీ ప్రయత్నించాడు. కానీ, సాహిర్ తల్లి, తన భర్త దాడులను సివంగిలా ఎదిరించింది. తన పిల్లవాడిని ప్రాణాలు పణంగా పెట్టి కాపాడింది. తాము ఎక్కడ వున్నామో ఆ జాగీర్దార్ భర్త కు తెలియకూడదని రాత్రికిరాత్రే ఊళ్ళు వదలి వెళ్ళిపోయేవారు. ఇదంతా సాహిర్ ప్రత్యక్షంగా అనుభవించాడు. తనకోసమే జీవిస్తున్న తల్లి అతనికి ఆరాధ్య దేవత. తనను కాపాడటంకోసం ఆమె పడ్డ పాట్లు ఎదుర్కొన్న కష్టాలూ సర్వం సాహిర్ కు తెలుసు. ఫలితంగా సాహిర్ జీవితాంతం ఆ తల్లికి కృతజ్ఞుడిగా వున్నాడు. తల్లిపట్ల అతనికి వున్న అపారమైన ప్రేమ గౌరవాలవల్ల మరో స్త్రీకి దగ్గర కాలేక పోయాడు. ఆమె పలు సందర్భాలలో తనతో చెప్పిన మాటలే ఈ పాటలో పొందుపరచాడు సాహిర్.

ఓ ఒంటరి తల్లిగా జీవించిన నేను సాహిర్ నా మనసులోని భావాలలే ఈ గీతంగా మార్చి రాసారని అనిపిస్తుందని చెప్పడానికి వెనుకాడను. నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడితే ఇది ప్రతి ఒంటరి తల్లి కోరిక అన్నది వాస్తవం. అది గొంతుకగా మార్చలేని ఎందరో అసహాయ స్త్రీలకు సాహిర్ అండగా ఈ గీతంతో నిలిచినందుకు అతని పట్ల కృతజ్ఞతా భావంతో మనసు నిండిపోతుంది.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here