అనంతుడి వీణ

0
9

[బాలబాలికల కోసం ‘అనంతుడి వీణ’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]అ[/dropcap]నంతుడికి తాతలనాటి నుండి సంక్రమించిన ఒక సంగీత వాయిద్యాల దుకాణం ఉండేది. అనంతుడు చాలా శ్రద్ధగా ఆయా వాద్య పరికరాలకు ఉపయోగించే చెక్కతో ఆయా వాద్య పరికరాలు తయారు చేసేవాడు. అందుకే అతని దుకాణం లోని వాద్య పరికరాలకు ఉత్తమమైనవని పేరు. ఒక్కొక్క పరికరం నాణ్యమైనదిగా తయారు చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది.

ఒకసారి బాలమురళి అనే వీణ వాద్యకారుడు అనంతుని దుకాణానికి వచ్చి ఓ మంచి వీణ కావాలని చెప్పాడు. అప్పటికి దుకాణంలో వీణలు లేవు.

“నాకు మూడు నెలల వ్యవధి ఇస్తే నాణ్యమైన వీణ తయారు చేసి ఇస్తాను” చెప్పాడు అనంతుడు.

“సరే నేను మూడు నెలల తరువాత వస్తాను, ముందరే కొంత డబ్బు ఇచ్చేదా?” అడిగాడు బాలమురళి.

“వద్దు తమరిని గురించి విన్నాను. నేను తయారు చేసి నా సహాయకుడి చేత కబురు పంపుతాను” చిరునవ్వుతో చెప్పాడు అనంతుడు.

రెండో రోజు అనంతుడు అడవిలోకి వెళ్ళి మంచి పనస చెట్ల కోసం వెదక సాగాడు. ఎందుకంటే వీణ తయారుకు ఉపయోగపడేది పనస చెక్కనే! చిత్రంగా ఎక్కడా పనస చెట్లు కనబడలేదు. అలా అడవిలో చాలా దూరం అనంతుడు, అతని సహాయకుడు వెళ్ళారు.

వారికి దూరంగా రెండు పెద్ద పనస పండ్లతో పనస చెట్టు కనిపించింది! వెంటనే ఆ చెట్టు వద్దకు వెళ్ళి పెద్ద కొమ్మలు కొట్టాలని చూడసాగారు. చిత్రంగా కొమ్మల నుండి వింత కాంతి వచ్చింది. అనంతుడు అతని సహాయకుడు ఆ కాంతిని చూసి భయపడ్డారు.

“నాయనా అనంతా, నీవూ అడవి అంతా తిరిగావు కానీ నీకు పనస చెట్టు దొరకలేదు. కొన్ని చెట్లు అతి అరుదుగా కొన్ని నేలల్లో మాత్రమే పెరుగుతాయి. ఇక్కడ ఈ చెట్టు ఒకటే ఉంది. కొన్ని కారణాల వలన పనస చెట్లు ఇతర ప్రదేశాల్లో పెరగలేదు. నీవు ఒక పని చేయి ఈ చెట్టుకు ఉన్న రెండు పనస పండ్లను జాగ్రత్తగా ఇంటికి తీసుకవెళ్ళి  పనసగింజలు ఎంగిలి చేయకుండా తిని ఆ గింజలను రాజుగారి వద్దకు తీసుకవెళ్ళు. ఆయన కోటపక్కన పది ఎకరాల పనస చెట్లకు పనికి వచ్చే స్థలం ఉంది. అందులో ఈ చెట్టు గింజలను నాటించు. రాజు గారు అందుకు ఒప్పుకుంటారు, స్థలంలో రెండు పనస చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలతో వీణా వాద్యం తయారుచేయి” అని చెప్పింది ఆ అశరీరవాణి.

“తమరు ఎవరు?” అనంతుడు అడిగాడు.

“నేను ఈ అరణ్య దేవతను. ఈ అడవి పచ్చదనాన్ని కాపాడుతుంటాను. ఇక నీకు అంతా మేలు జరుగుతుంది” చెప్పింది అశరీరవాణి.

అనంతుడు అతని సహాయకుడు నమస్కారం పెట్టి రెండు పనసపండ్లు కోసుకుని వెళ్ళి వనదేవత చెప్పినట్టు చేశారు. ఒక పనసపండు రాజుగారికి ఇచ్చారు.

రాజుగారికి ఆ విత్తనాల విశిష్టత వివరించారు. రాజుగారు సంతోషంతో ఆ విత్తనాలను కోట పక్కస్థలంలో నాటించి తనకిచ్చిన పండు లోని విత్తనాలను కూడా నాటించారు. రాజు గారి స్థలంలో ఉన్న రెండు చెట్ల కొమ్మలతో వీణ తయారుచేసి పరీక్షిస్తే అద్భుతంగా పలికింది. అనంతుడు దానిమీద చక్కని కీర్తన వాయించాడు. తాను ఇంతకు ముందు వాయించినదాని కన్నా ఈ వీణ మీద అధ్బుతంగా వాయించగలిగాడు!

విద్వాంసుడు బాలమురళికి కబురు పంపి వీణను ఇచ్చాడు. ఆయన వీణను వాయించి అపరిమిత ఆనందం పొందాడు.

అప్పటినుండి వీణ తయారు చేయాలంటే అనంతుడు రాజుగారి స్థలంలోని పనసచెట్ల కొమ్మలనే వాడసాగాడు. అనంతుడు ఇచ్చిన విత్తనాలతో మొలచి పెద్దవైన చెట్లు రెండేళ్ళకు కాపు కాసాయి.

అనంతుడి కృషికి వనదేవత సంతోషించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here