అనన్య భక్తితో శ్రీ సాయి ఆరాధన

0
13

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అనన్య భక్తితో శ్రీ సాయి ఆరాధన’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]శ్రీ[/dropcap] కృష్ణ భగవానుడు భగవద్గీత (9 వ అధ్యాయం, 26 వ శ్లోకం) లో “శ్రద్ధా భక్తులతో నా భక్తులు ఎవరైనా గాని పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, నీరు గాని సమర్పించినచో వాటిని నేను ఎంతో ప్రేమతో గ్రహించెదను” అని ప్రవచించి వున్నారు. భక్తితో  ఎంగిలి పళ్ళను సమర్పించిన శబరి, కన్నప్ప వంటి భక్తాగ్రేసరులను ఆ భగవంతుడు ఆశీర్వదించి సద్గతి ప్రసాదించిన కథనాలను పురాణాలలో చదివి వున్నాము.

కలియుగ దైవం, పరిశుద్ధ పరమేశ్వర స్వరూపం అయిన శ్రీ సాయికి సంబంధించి ఒక విశిష్టత ఏమంటే తన భక్తులు ఏదైనా వస్తువును సమర్పిస్తానని సంకల్పించి, తర్వాత ఏవో కారణాల వలన మరిచిపోతే, వారికి శ్రీ సాయి ఆ విషయం జ్ఞాపకం చేసి, ఆ నివేదనను రప్పించుకొని, స్వీకరించి, ఆ భక్తులను ఆశీర్వదించేవారు. అట్టి ఒక కథనాన్ని ఇప్పుడు స్మరించుకుందాం.

రామచంద్ర ఆత్మారాం ఊరఫ్ బాబా సాహెబ్ తార్ఖడ్ ఒకానొక సమయంలో ప్రార్ధనా సమాజస్థుడు, తర్వాత సాయి కటాక్షంతో తన ఆలోచనా విధానాన్ని మార్చుకొని సాయికి అత్యంత ప్రియభక్తుడైనాడు. తార్ఖడ్  యొక్క భార్యా పుత్రులిద్దరూ మొదటి నుండి శ్రీ సాయికి అత్యంత ప్రియ భక్తులు. ఒక సంర్భంలో శ్రీమతి తార్ఖడ్ సాయికి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, కోవాలను నైవేద్యంగా సమర్పించాలని సంకల్పించింది.

ఒకసారి బాంద్రాలో నివసించే రఘువీర భాస్కర పురందరే తన భార్యతో కలిసి శిరిడీ బయలుదేరాడు. శ్రీమతి తార్ఖడ్ రెండు పెద్ద వంకాయలను శ్రీమతి పురందరే చేతికి ఇచ్చి కూర, పచ్చడిలను చేసి సాయికి నైవేద్యం పెట్టమని అభ్యర్థించింది. శిరిడీ చేరిన తర్వాత శ్రీమతి పురందరే వంకాయ పెరుగు పచ్చడి చేసి మశీదుకు వెళ్ళి సాయికి నివేదించగా శ్రీ సాయి మిగతా పదార్ధాలను పక్కన పెట్టి పెరుగు పచ్చడితో భోజనం చెసి తృప్తిగా త్రేంచి మిగితా పచ్చడిని భక్తులందరికీ పంచిపెట్టమని ఆదేశించారు. వెంటనే వంకాయ వేపుడు కూర కూడా కావాలను అడగగా భక్తులు రాధాకృష్ణ మాయికి కబురు పంపించారు. ఆది వంకాయలు దొరికే కాలం కాదు, కావున ఏం చెయ్యాలనే సందిగ్ధంలో మాయి పడింది. వెంటనే పెరుగు పచ్చడి తెచ్చినది ఎవరా అని ఆరా తీయగా అసలు విషయం అవగతమయ్యింది. శ్రీమతి పురందరే వెంటనే వెళ్ళి వంకాయ వేపుడు కూర చేసి సాయికి నివేదించింది. భక్తులపై శ్రీ సాయి కనబరిచే అనిర్వచనీయమైన ప్రేమకు అందరూ కళ్ళ నీళ్ళ పర్యంతరమయ్యారు.

మరొక సందర్భంలో 1915 డిసెంబరులో గోవింద మాంకర్ అనువాడు శిరిడీలో తన తండ్రికి సంవత్సరీకం చేయదలిచి ఆత్మారాం ఇంటికి వచ్చి శిరిడీ వెళ్తున్న సంగతి తెలియజేసాడు. శ్రీమతి తార్ఖడ్ ఇల్లంతా గాలించగా ఒక కోవా బిళ్ళ (అది కూడా ఇంతకు ముందు శ్రీ సాయికి నైవేద్యంగా అర్పింపబడినది)  దొరికింది. చేసేది లేక ఆ బిళ్ళనే మాంకర్‌కు ఇచ్చి సాయికి నివేదించమని శ్రీమతి తార్ఖడ్ కోరింది. శిరిడీ చేరాక విధి కర్మలను పూర్తి చేసాక మాంకర్ సాయిని దర్శించాడు. వెంటనే సాయి “నా కోసం ఏమి తెచ్చావు?” అని అడిగారు. తండ్రి మరణించినందున పుట్టెడు దుఃఖంలో వున్న మాంకర్ తాను ఏమీ తేలేకపోయానని విన్నవించుకున్నాడు. అప్పటికి సాయి ఊరుకున్నారు కానీ మళ్ళీ మళ్ళీ అడుగనారంభించారు. ప్రతీసారి మాంకర్ నుండి ఒకటే సమాధానం ఎదురయ్యింది. ఛివరకు శ్రీ సాయి “ఆత్మారాం భార్య నా కోసం ఎంతో ప్రేమతో పంపిన కోవా బిళ్ళ నీ దగ్గర వుంది కదా! వెంటనే వెళ్ళి దానిని తీసుకురా!” అని ఆజ్ఞాపించారు. మాంకర్ అసలు సంగతి గుర్తుకు తెచ్చుకొని బసకు వెళ్ళి ఆ కోవా బిళ్ళను తీసుకు వచ్చి శ్రీ సాయికి సమర్పించగా శ్రీ సాయి ఎంతో ఆత్రంతో దానిని తిని “నా భక్తులు నన్ను ఎట్లు భావించెదరో, నేను వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను” అని పలికారు. ఆత్మారాం భార్య బాబాకు కోవా బిళ్ళ సమర్పించాలనుకొని, ఆ తర్వాత మరిచిపోతే శ్రీ సాయి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నైవేద్యాన్ని రప్పించుకొని స్వీకరించిన వైనం పరమాద్భుతం.

ఈ కథలు మనకు నిత్య జీవితంలో మార్గదర్శకాలు కావాలి! భగవంతునికి కావలసింది వైభోవపేతంగా చేసే పూజలు, ఖరీదైన ప్రసాదాలు, పూజా మండపాల డెకరేషన్లు కాదు. పవిత్రమైన హృదయం, అకుంఠిత భక్తి, సేవా తత్పరత. వీటితో మంచి నీటిని సమర్పించినా ఎంతో సంతోషంగా స్వీకరించి ఆశీర్వదిస్తారు. ప్రేమ, భక్తి లేని పూజలు ఫలించవు. డబ్బు, సమయం వృథా తప్ప ఫలితం శూన్యం. అనన్య భక్తితో సాయిని ఆరాధించి, ఆయన కృపకు పాత్రులయ్యెందుకు కృషి చేద్దాం!

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జనః సుఖినోభవంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here