అనన్య

5
9

[dropcap]గే[/dropcap]టు ముందు ఏవో అరుపులు వినిపిస్తే బాల్కనీ నుండి బైటకు తొంగి చూసాను. ఆటో అతను ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయితో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి బిక్క మొహంతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. తను క్రింది ప్లాట్లోకి కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయి అని గుర్తుపట్టాను. వాచ్‌మన్ సర్ది చెప్పబోయినా ఆటో అతను వినిపించుకోవట్లేదు. విషయం తెలుసుకుందామని క్రిందకు వెళ్లాను. ఆటో చార్జీ నూట తొంభై ఇమ్మని అతని గొడవ. కాష్ లేదని ఈ అమ్మాయి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో కూడా డబ్బు ఉండకపోవచ్చని ఆమె అంటుంటే ఆటో అతనికి కోపం వచ్చినట్లుంది. విషయం అర్థం అయి వాచ్‌మన్‌ను పైకి పిలిపించి డబ్బులిచ్చి పంపాను.

రాత్రి భోంచేసి కాసేపు చదువుకుందామని పుస్తకం పట్టుకున్నానో లేదో కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుని తెలుపు తీసాను. బైట భర్తతో ఆ కొత్త పెళ్ళికూతురు నిల్చుని కనిపించింది. అబ్బాయి వెంటనే “ఆంటీ థాంక్స్, సాయంత్రం ఆటో కోసం డబ్బు ఇచ్చారట. అనన్య చెప్పింది. మనీ ఇవ్వడానికి వచ్చాను” అని డబ్బు ఇచ్చాడు. అతని వెనుక బెరుగ్గా నిల్చుని ఉంది ఆ అమ్మాయి. ఆ కళ్ళల్లో బెదురు చూస్తే ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపించింది.

“లోపలికి రండమ్మా” అంటూ దారి ఇచ్చాను. “పర్లేదు ఆంటీ” అంటూనే ఇద్దరూ లోపలికి వచ్చారు. హాలులో కూర్చున్నాక ఆ అబ్బాయి తనను తాను పరిచయం చేసుకున్నాడు “ఆంటీ ఐ యాం సురేష్. తను నా వైఫ్ అనన్య. నేను జీ.ఈ. లో పని చెస్తున్నాను. అనన్య పేరెంట్స్ ఏలూరులో ఉంటారు. తను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. తనకు హైదరాబాద్ కొత్త. నిన్న చిన్న కన్ప్యూజన్‌తో పర్స్ మర్చిపోయి బైటికి వెళ్లింది. మీరు హెల్ప్ చేసారని తరువాత చెప్పింది. థాంక్స్ ఆంటీ”

“నిన్ను చూస్తూ ఉంటాను సురేష్. మీకు ఈ మధ్యే పెళ్ళి అయింది కదూ” అడిగాను.

“అవునాంటీ. జస్ట్ వన్ మంత్. అనన్యకు కూడా ఇక్కడ జాబ్ చూడాలనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ అవినాష్ ఇద్దరమూ ప్రయత్నిస్తున్నాం. మా కంపెనీలో ఇప్పుడు ఓపెనింగ్స్ లేవు. వెయిట్ చేయాలి. ఈ లోగా తెలిసిన వాళ్ళకి అనన్య రెస్యూమ్ ఫార్వడ్ చేస్తున్నాం” అన్నాడు.

“అవినాష్ అంటే నీ రూం మేట్ కదూ. ఇంతకు ముందు మీరిద్దరూ కలిసి ఉండేవాళ్ళు కదా ఫ్లాట్‌లో” అన్నాను.

“అవునాంటీ అవిహాష్ నా బెస్ట్ ప్రెండ్. లాస్ట్ ఇయర్ అతని మేరేజ్ అయ్యే దాకా మేము కలిసే ఉన్నాం. ఇప్పుడు అతను, భార్య శృతితో పక్క వీధిలో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. ఇదే అపార్ట్‌మెంట్‌లో ఏదన్నా ఫ్లాట్ రెంట్‌కి దొరుకుతుందేమో అని ప్రయత్నించాం. కాని కుదరలేదు” అన్నాడు సురేష్.

‘జంట ముచ్చటగా ఉంది’ అనుకుంటూ “మొదటి సారి వచ్చారు ఏం తీసుకుంటారు చెప్పండి” అడిగాను.

సురేష్ వెంటనే “ఆంటీ నో ఫార్మాలిటీస్. ఇప్పుడే మా భోజనం అయింది కూడా. అనన్యకు ఇక్కడ ఎవరూ తెలియదు. మీతో పరిచయం అయ్యినట్లు కూడా ఉంటుందని ఇలా వచ్చాము. మరోసారి వస్తాం ఆంటీ” అంటూ వెళ్ళడానికి లేచాడు.

హాలులో పుస్తకాల అలమార వైపు ఆసక్తిగా అనన్య చూడడం గమనించాను. మా ఇంటికి వచ్చే ఈ ఈడూ వాళ్ళల్లో ఎవరూ పుస్తకాలను అంత ఆసక్తిగా ముఖ్యంగా ఆశగా చూడడం ఈ మధ్య కాలంలో జరగలేదు. తననే గమనిస్తున్న నేను “నీకు బుక్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా. అప్పటి నుండి అటే చూస్తున్నావు. నా దగ్గర తెలుగు, ఇంగ్లీషు, హిందీలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు” అన్నాను.

“అయ్యో ఆంటీ, తను తెలుగు పుస్తకాలే ఏవో చదువుతూ ఉంటుంది. ఇప్పుడు జాబ్ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావాలి. దానిపై దృష్టి పెట్టమని చెప్తూ ఉంటాను. మళ్ళీ వస్తాం ఆంటీ, థాంక్స్ ఫర్ ది హెల్ప్” అని లేచారు ఇద్దరు.

అ అమ్మాయిలో ఏదో తెలియని అమాయకత్వం ఉంది. ఈ మధ్య అలాంటి అమాయకత్వం ఉన్న ఆడపిల్లలు నాకు కనపడలేదు. ఎందుకోగానీ ఈ అనన్య నాకు బాగా నచ్చింది. ఆడపిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసం నింపుకుని ఉండాలని బోధించే నాకు ఆ అమ్మాయి అమాయక చూపులు ఆకట్టుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది.

***

రవీంద్రభారతిలో ఓ పుస్తక పరిచయ కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ సాహితీ కార్యక్రమాలు సమయానికి మొదలవ్వవు. ఐదు గంటలకు ప్రారంభం అని చెప్పి ఏడుకు కార్యక్రమం మొదలెడతారు. సమయాన్ని పాటించే అలవాటు మన సభలలో బహుశా నా తరంలో కనిపించదేమో మరి. చెప్పిన సమయానికే వెళ్లి ఒక్కదాన్నే ఖాళీ కుర్చీలను చూస్తూ ఓ పుస్తకం పట్టుకుని కూర్చోవడం, తరువాత సభా మర్యాద భంగ పరచకూడదు అని సభ మధ్య లేచి రాలేక చివరి దాకా ఉండిపోవడంతో చాలా సమయం వేస్ట్ అవుతుంది. అలా ఈ రోజు పది అయింది నేను ఇల్లు చేరే సరికి. పైగా లిప్ట్ పని చేయట్లేదు. అయిదో ఫ్లోర్‌లో ఉంటుంది నా ప్లాట్. మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్నాను. నాలుగో ఫోర్ దగ్గరకు వచ్చేసరికి కాళ్లు మొండికేసాయి. మెట్ల మధ్యలో కాసేపు నిల్చుని ఊపిరి పీల్చుకుంటున్నాను. ఓ ఆకారం పై మెట్టు మీద కూర్చుని మోకాల్లో తల పెట్టుకుంది ఉంది. కారిడార్‌లో లైట్ కూడా లేదు. ఈ సమయంలో ఎవరా అనుకుని చూసాను. ఓ ఆడపిల్ల నైటీలో వెక్కి వెక్కి ఏడూస్తూ. వెనుక నేను వచ్చి నిల్చున్న అలికిడి వినిపించిందేమో గబుక్కున తిరిగి చూసింది. కళ్ళ నుంచి బుగ్గలపైకి కారుతున్న కన్నీటితో అనన్య. కళ్ళల్లో భయం, నన్ను చూసి గుర్తుపట్టినట్లు ఉంది. కళ్ళు తుడుచుకుంటూ గబుక్కున నిల్చుంది.

“ఏమైంది అనన్యా” అని అడగబోయాను. శబ్దం రాకుండా నోరు నొక్కుకుని ఆ అమ్మాయి అక్కడ కూర్చుని ఏడవడం చూస్తుంటే మనసు చివుక్కుమంది. ఇంతలో వాళ్ల ప్లాట్ డోర్ తెరుచుకుంది. భయంతో అనన్య గబగబా మెట్లు దిగి మూడో ఫ్లోర్ సందులోకి తిరిగిపోయింది.

లోపలి నుంచి “ఏయ్ అనన్యా ఎక్కడ ఉన్నావు” అంటూ ఓ పాతికేళ్ళ యువతి మెల్లిగా అడుగుతూ అక్కడకు వచ్చింది. నన్ను చూసి కొంచెం వెనుకడుగు వేసింది. నేను మామూలుగా పై ఫ్లోర్ మెట్లు ఎక్కడం మొదలెట్టాను. ఇంతలో లోపలి నుండి సురేష్, మరో యువకుడు బైటకు వచ్చారు. ఆ అబ్బాయి ఇంతకు ముందు సురేష్ రూమ్మేట్‌గా అతనితో కలిసి ఉన్న అవినాష్. నన్ను చూసి సురేష్ నవ్వుతూ “ఆంటీ లిఫ్ట్ పని చేయట్లేదు కదా. మీకు ఇబ్బంది” అన్నాడు.

నేను కూడా “అవును సురేష్ మూడు రోజుల దాకా ఈ బాధలు తప్పవు మనకు. ఏదో మేజర్ రిపేర్ అట. నిన్నే వాచ్‌మన్ చెప్పి వెళ్ళాడు” అన్నాను. ఆ కొత్త అమ్మాయిని ఆసక్తిగా చూస్తున్న నన్ను గమనించి సురేష్ “ఆంటీ దిస్ ఈజ్ శృతి. అవినాష్ మిసెస్” అన్నాడు. “ఓ అవునా హాయ్ శృతి” అని పలకరించాను.

చాలా పాష్‌గా ఉంది ఆ అమ్మాయి. షార్ట్ జీన్స్, టీ షర్ట్, పార్లర్‌లో ఎంతో ఖర్చుతో సెట్ చేసుకున్న హేయిర్, ముఖాన మేక్‌అప్, అద్భుతమైన కాన్పిడేన్స్ ఆమె ముఖంలో.

“హాయ్ అంటీ” అని బదులిచ్చింది శృతి.

“ఆంటీ లెక్చరర్, మన ప్లాట్ పైనే వారి ఇల్లు” అని శృతికి నన్ను పరిచయం చేసాడు సురేష్

అనన్య గురించి అడగాలని అనుకుని అనుభవం ఇచ్చిన ఆలోచనతో ఓ క్షణం ఆగి “ఏంటి సురేష్ బైటికి వెళ్తున్నారా” అని అడిగాను

“లేదాంటి. ఇప్పుడే బైటి నుండి ఇంటికి వచ్చాం. వీకెండ్ ఇక్కడే స్పెండ్ చేద్దామని అనివాష్ వాళ్ళు కూడా వచ్చారు. రేపంతా ఇక్కడే ఉంటారు. అనన్య వేస్ట్ బాస్కెట్ బైట పెట్టడానికి వచ్చింది. వాచ్‌మన్ దగ్గరకి వెళ్ళిందేమో మరి” అంటూ క్రిందికి చూస్తున్నాడు సురేష్. చాలా సహజంగా మాట్లాడుతున్న అతనితో అనన్య విషయం కదపాలనిపించలేదు.

“ఓకే గుడ్ నైట్ సురేష్” అని అవినాష్, శృతి వైపు నవ్వుతూ చూసి నా ప్లాట్‌కి వెళ్ళిపోయాను.

నోట్లోంచి శబ్దం రాకుండా చేతులతో గట్టిగా నోరు నొక్కుకుని మోక్కాళ్లలోకి తల పెట్టుకుని మౌనంగా కన్నీళ్లు చిందిస్తున్న అనన్య ముఖం ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు.

***

ఆదివారం ప్రొద్దున తొమ్మిది దాకా నిద్రపోవడం నా అలవాటు. పని అమ్మాయి వచ్చినా తలుపు తీసి నా గదిలోకి వెళ్ళి పడుకుండిపోతాను. ఇల్లు చిమ్మి తుడిచి ఆమె తలుపు దగ్గరకు వేసుకుని వెళ్లిపోతుంది. మామూలుగానే ప్రొద్దున్నే లేవడం అంటే చాలా కష్టం నాకు. రాత్రి వెంటనే నిద్రపట్టలేదు. అర్ధరాత్రి దాకా మెలకువగానే ఉండి క్రింది నుండి ఏమన్నా చప్పుళ్ళు వినిపిస్తాయేమో అని గమనిస్తూ ఉన్నాను. ఎప్పుడో మూడు గంటలకు పట్టింది నిద్ర. లేచేసరికి తొమ్మిదిన్నర. పాలపాకెట్టు కోసం వీధి తలుపు తీసాను. టీ పెట్టుకుంటూ ఇక ఆదివారం సర్దడాలు, ఉతుక్కోవడాలు లాంటి పనులలో పడాలి అనుకుంటున్నాను. ఇంట్లో ఉంటే రాత్రి దాక మెయిన్ డోర్ గడి పెట్టే అలవాటు నాకు లేదు. వంట గదిలోకి వెళ్లి టీ పెట్టుకుని కప్పు తీసుకుని వెనక్కు తిరిగితే, నా వెనుక అనన్య, ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని మౌనంగా వచ్చి నిలబడి ఉంది. ఉలిక్కిపడ్డాను. అలాంటి షాక్ ఇచ్చినందుకు ఆ అమ్మాయి మీద కోపం కూడా వచ్చింది. గట్టిగా ఏదో అనేలోపల కళ్ళిత్తి నా వైపు చూసిన ఆ అమ్మాయి ముఖం చూసి ఆగిపోయాను.

ఆమె చేయి పట్టుకుని “ఏమైంది అనన్య” అని మాత్రమే అడగగలిగాను.

రాత్రి చూసిన నైటీలోనే ఉంది ఆమె. ముఖం పీక్కుపోయి, కళ్ళు లోపలికి పోయి ఎన్ని గంటల నుంచి ఏడుస్తుందో అన్నట్లుంది. పెదాలు వణుకుతున్నాయి. ఆమెను పట్టుకున్న నా చేతిని గట్టిగా తన చేతితో పట్టుకుని “ఆంటీ నన్ను అమ్మ వాళ్ళ దగ్గరకు పంపించేయండి. అమ్మ వాళ్ళని వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పండి ప్లీజ్. నాన్న నంబరు ఇది. ప్లీజ్ ఆంటీ, ఫోన్ చేసి నేను రమ్మన్నానని వాళ్ళకు చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మను రమ్మని చెప్పండీ” అని కాళ్లపై పడబోయింది.

“అరే. అసలేం జరిగింది అనన్య” అని అడేగేంతలోనే ఆమె భయంతో “ప్లీజ్ అంటీ నన్ను ఏం అడగకండి. నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మ కావాలి” అని ఎవరో తరుముతున్నట్లు ఓ కాగితం నా చేతిలో పెట్టి వచ్చినంత వేగంగా, చప్పుడు చేయకుండా బైటికి వెళ్లిపోయింది అనన్య.

నా చేతిలో ఏదో పుస్తకంలోనించి చించినట్లున్న ఓ చిన్న కాగితం, దానిపై ఓ సెల్ నెంబర్. బైటికి వెళ్లి చూద్దాం అనుకుంటూనే ఆగిపోయాను. అ అమ్మాయి ఏదన్నా ప్రమాదంలో ఉంటే నా దగ్గరకు వచ్చినట్లు ఎవరికీ తెలియకుండా ఉండడం మంచిదేమో అనిపించింది. పైగా ఆ అమ్మాయి ప్రతి సారి బైటి నుండి ఎవరో వస్తారని భయం భయంగా చూడడం కూడా నాకు ఆందోళన కలిగించింది.

అ అమ్మాయికి అంత ప్రమాదం ఏం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లో భార్యా భర్త ఇద్దరే ఉంటారు. సురేష్ ఆ ఫ్లాట్స్‌లో రెండు సంవత్సరాల నించి ఉంటున్నాడు. ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ఎవరో స్నేహితులు వచ్చి పోతూ ఉంటారు కాని ఆ ఫ్లాట్ నుండి ఏ డిస్టర్బెన్స్ కూడా నాకు ఎప్పుడూ వినిపించలేదు. రాత్రిళ్ళు లేటుగా నిద్రపోయే అలవాటు ఉన్న నాకు ఆ ఇంట్లో ఏదన్నా గోల జరిగితే వినిపించకుండా ఉండే సమస్యే లేదు. అవినాష్, సురేష్ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఏ న్యూసెన్స్ లేకూండానే రోజులు గడిచిపోయినయి. అనన్యతో కూడా సురేష్ ప్రేమగానే ఉంటాడనిపించేది. కొత్తగా పెళ్ళైన జంటగానే ఇద్దరూ ప్రవర్తించేవాళ్లు. ఇంటికి కావల్సిన వస్తువులన్నీటినీ సురేషే తీసుకువస్తూ ఉంటాడు. చాలా సార్లు ఫుడ్ బైటి నుంచి జొమాటొలో వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇది మామూలే. ఆర్థికంగా ఓ స్థాయి మెయింటెయిన్ చేస్తున్నట్లే కనిపిస్తారు. ఈ మధ్యనే సురేష్ కారు కూడా కొన్నాడు. భార్యతో ఎప్పుడూ కారులోనే బైటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఏవన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి మామూలే అనుకోవాలి. కాని అనన్య ఇంత భయపడడం మాత్రం నాకు సహజంగా అనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలోని కాగితాన్ని మళ్ళీ చూసాను. హడావిడిగా నంబర్ రాసినట్లు కనిపిస్తుంది. ఏం జరిగి ఉంటుంది. నేను ఫోన్ చేయడం మంచిదేనా. లేదా ఓ సారి వారి ప్లాట్‌కి వెళ్ళి చూసి రానా?

నాకు ఎవరి ఇంటికీ వెళ్ళి కబుర్లు చెప్పే అలవాటు లేదు. ఈ ఐదు సంవత్సరాలలో నేను ఏ ఫ్లాట్ లోకి వెళ్లింది లేదు. ఇప్పుడు ఏం చెప్పి ఆ ప్లాట్ లోకి వెళ్ళాలో అర్థం కాలేదు. పోని వాచ్‌మన్‌ని పంపుదాం అంటే ఏం చెప్పి పంపాలో తెలియట్లేదు. కనీసం వారింట్లో ఎవరు పని చేస్తున్నారో కూడా నాకు తెలీదు. అలా అని ఏం జరగనట్లు ఊరుకోవడం నాకు మనస్కరించట్లేదు.

ఇక లాభం లేదనుకుని వాచ్‌మన్ భార్యను ఓ సారి రమ్మని కబురు చేసాను. కొన్ని సార్లు అవసరానికి ఏదో డబ్బు సహాయం చేసానని లక్ష్మి నా పట్ల కొంచెం శ్రద్దగానే ఉంటుంది. పిలవగానే పైకి వచ్చింది. “లక్ష్మీ నిన్న క్రింది ప్లాట్‌లో ఏదన్నా గొడవ జరిగిందా. రాత్రంతా ఎవరో ఏడుస్తున్నట్లు, గట్టిగా అరుచుకుంటున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి” అని అడిగాను.

“అవునా అమ్మా. అలాంటిదేమీ లేదే. ఇప్పుడు మెట్ల మీద నుండే పైకి వస్తున్నాను కదా. ఏవో మంచి వాసనలు వస్తున్నాయి. ఎవరో వచ్చినట్లు ఉన్నారమ్మా. నవ్వులు కూడా వినిపిస్తున్నాయి. ఏం అమ్మా పిలిచారు” అడిగింది.

“అవునా అయితే సరీ. ఓ చిన్న పని ఉంది. ఒక సారి పైకి రాగలడేమో అని ఆ క్రిందింటి సార్‌ని అడిగి రావా” అన్నాను.

“ఏం పని అని చెప్పాలమ్మా” ఆరాగా అడిగింది లక్ష్మి.

“కంప్యూటర్ పని అని చెప్పవా. టైం ఉంటే కొంచెం రాగలడేమో కనుక్కోవా” అని చెప్పి పంపించాను.

వెళ్లిన కొంత సేపటికే పైకి వచ్చి “అమ్మా ఓ అరగంటలో వస్తాం అని చెప్పారు” అని చెప్పి వెళ్లింది లక్ష్మి.

ఏం పని చెప్పాలో ఆలోచించుకుని సురేష్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

ఓ నలభై నిముషాల తరువాత తలుపు మీద చిన్నగా కొట్టిన చప్పుడు. “ఆంటీ ఉన్నారా” అంటూ లోపలికి వచ్చాడు సురేష్, అతనితో అవినాష్ కూడా ఉన్నాడు.

“ఆ రండి సురేష్, సారీ ఇలా పిలిపించవలసి వచ్చింది” అన్నాను

“పర్లేదు ఆంటీ, ఏదో ప్రాబ్లం అని చెప్పింది లక్ష్మి” అడిగాడు సురేష్.

“ఏమీ లేదు సురేష్, ఓ ఫైల్ పీ.డీ.ఎప్. లోనే పంపాలి అంటున్నారు. నాకు అది రావట్లేదు. ఇరవై పేజీలు ఉంటుంది అది. పైగా తెలుగులో టైప్ చేసి పెట్టుకున్నాను. దాన్ని పీ.డీ.ఎప్.లోకి కన్వర్ట్ చేయడం రావట్లేదు. ఒక్క సారి చూపిస్తే నేర్చుకుంటాను. ఇది నాకు చాలా అవసరం కూడా. చూపించగలవా, అదీ నీకు టైం ఉంటేనే” అడిగాను.

“అంతేనా అంటీ. అది పది నిముషాల పని. జస్ట్ ఒక చిన్న డౌన్లోడ్ చేసుకోవాలి. ఏది మీ సిస్టం ఇదేనా, అంటూ అప్పటికే నేను డైనింగ్ టేబిల్ మీద ఓపెన్ చేసి పెట్టుకున్న లాప్టాప్ దగ్గరకు వెళ్లాడు అవినాష్. అతని కలుపుగోలుతనానికి ముచ్చటేసింది.

సురేష్ నవ్వుతూ “సిస్టం పై వర్క్ అంటే అవినాష్‌కి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఆంటీ” అని నవ్వుతూ తనూ మరో కుర్చీలో కూర్చుండి పోయాడు.

అవినాష్ గబగబా గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చెస్తూ పోయాడు. నేను చెప్పిన ఫైల్ ఓపెన్ చేసి చెప్పినట్లుగానే పది నిముషాలలోనే మెయిల్ పంపేసాడు. నాకు మరో సారి పీడీయెప్ కన్వర్టర్‌ని ఎలా వాడుకోవాలో చూపించాడు.

చురుగ్గా పని చేస్తున్న అవినాష్‌ని చూస్తూ ఉండిపోయాను. పని అయిపోయింది. “హాలిడే రోజు కూడా నా కోసం వచ్చి ఈ హెల్ప్ చేసారు. కనీసం టీ అయినా తాగి వెళ్లండి” అని వారిని కూర్చోబెట్టేసాను.

వంట యింట్లో పని చేసుకుంటూ ఇద్దరినీ గమనిస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉన్న ఆ యిద్దరిని చూస్తూ అనన్య గురించి ఎలా అడగాలో తెలియట్లేదు. ఇంతలో అవినాష్ పుస్తకాల రాక్ దగ్గరకు వెళ్లడం చూసాను.

బుక్స్ గమనిస్తూ “ఆంటీ మంచి కలక్షన్ ఉంది మీ దగ్గర” అన్నాడు అవినాష్.

“బుక్స్ చదువుతావా నువ్వు” నవ్వుతూ అడిగాను.

“అప్ కోర్స్ ఆంటీ. ఓహ్ మార్సెల్ ప్రాస్ట్ ‘ఇన్ సర్చ్ ఆప్ లాస్ట్ టైం’ అన్ని పార్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. నేను నాలుగు మాత్రమే చదివాను. ఆంటీ ఇవి నాకు చదవడానికి ఇస్తారా” అన్నాడు.

“ఆంటీ ‘జాన్ అప్డైక్’ సీరిస్ కూడా ఉన్నాయి. మీరు ఇంత ట్రెడిషనల్‌గా కనిపిస్తారు ఇవన్నీ చదివారా” అడిగాడు.

“ట్రెడిషినల్‌గా ఉన్నంత మాత్రాన, అన్ని ఐడియాలజీలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండదా అవినాష్” అడిగాను.

ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ “ఇవి మీరు చదివారంటే నేను నమ్మలేకపోతున్నాను ఆంటీ” అన్నాడు. “పైగా రసల్‌వి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక నేను ఆదివారాలు ఇక్కడే సెటిల్ అవుతాను సురేష్” అన్నాడు

నేను నవ్వుతూ వారికి టీ అందిస్తూ “యూ ఆర్ వెల్కం అవినాష్, సురేష్ అనన్య కూడా పుస్తకాలు చదువుతుంది అన్నావు. తనను కూడా కావలసినవి తీసుకొమ్మన్నాను. ఇంట్లో లేదా ఈ మధ్య కనిపించట్లేదు” అడిగాను.

అనన్య ప్రస్తావన రాగానే సురేష్‌లో కొంత అసహనం కనిపించింది. “అనన్య ఇలాంటి పుస్తకాలు చదవదనుకుంటాను ఆంటీ. రెండు రోజుల నుంచి ఫీవర్ అంటుంది. ఎంతైనా తను చాలా స్లో ఆంటీ. అన్ని రకాలుగా వెనుకబడే ఉంది” అన్నాడు

“ఏంటీ అనన్య కూడా బుక్స్ చదువుతుందా? ఏ యద్దనపూడి లేదా మిల్స్ అండ్ బూన్ చదువుతుందేమో మరి. షి నీడ్స్ టూ బీ గ్రూమ్డ్ ఎ లాట్, చాలా నేర్చుకోవాలి తను” అన్నాడు అవినాష్ సురేష్ వైపు చూసి కన్ను కొడుతూ. సురేష్ పెదవులపై ఓ క్షణంలో వచ్చి పోయిన ఆ చిరునవ్వు వెనుక ఏదో తేలిక భావం.

టీ తాగి వెళ్లిపోతూ సురేష్ ఏదో గుర్తువచ్చినట్లు ఆగిపోయి. “ఆంటీ ఏదన్నా హెల్ప్ కావాలంటే మీరు డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేయవచ్చు. ఎనీ టైం. నా ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకోండి. ప్రతి సారి లక్ష్మి కోసం ఇబ్బంది పడక్కర్లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఆంటీ. బట్ స్టిల్ ఏ పని ఉన్నా మొహమాటపడకండీ” అంటూ తన నంబర్ ఇచ్చి వెళ్ళాడు. వెనుక నవ్వుతూ అవినాష్ “ఆంటీ నెక్స్ట్ సండే వచ్చి ప్రాస్ట్ పుస్తకాలు ఫైవ్ టూ సెవెన్ తీసుకెళతాను. నో అనకండి ప్లీజ్” అంటూ వెళ్ళిపోయాడు.

ఆ ఇద్దరి కలుపుగోలుతనం, సహాయం చేసే తత్వం, ఇవన్నీ చాలా ఆకట్టుకున్నాయి. ఇలాంటి మగపిల్లలు ఉంటే ఎంత అండగానో ఉంటుంది కదా అని అనిపించింది. కాని అనన్య గుర్తుకు వచ్చిన వెంటనే మళ్ళీ ఓ అసహనం. ఇంత చక్కని పిల్లవాడితో అనన్యకు ఏం సమస్య ఉండి ఉంటుంది అని అనిపించింది. అనన్య మొహంలో ఆ అంతులేని దుఖం, భయం గుర్తుకు వస్తూనే ఉన్నాయి. కాని సురేష్‌ని చూసాక అనన్య దుఖానికి కారణం తను కాదేమో అనిపించింది

ఇవే ఆలోచనలతో రాత్రి దాకా అనన్య ఇచ్చిన నంబర్‌కి ఫోన్ చేయలేకపోయాను. సాయంత్రం ఏడు గంటలకు అవినాష్ శృతి ఇద్దరూ బై చెప్పి వెళ్లిపోవడం కూడా వినిపిస్తూనే ఉంది. ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ బాల్కనీలో నిలబడి ఉన్న నాకు ఆ పక్కన కారిడార్లో అనన్య క్రిందికి చూస్తూ కనిపించింది. కొద్ది సేపటికి తల ఎత్తి నా వైపు జాలిగా చూసింది. ఆ కళ్ళల్లో ఏమో మోసపోయిన ఫీలింగ్. సురేష్, అవినాష్ ఇద్దరినీ పైకి పిలిపించానని తనను తెలిసి ఉంటుంది. ఏం ఊహిస్తుందో మరి. ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వబోయాను. చప్పున తల దించుకుని లోపలికి వెళ్లిపోయింది అనన్య. దెబ్బ తిన్న పక్షిలా నా వైపు చూసిన ఆమె చూపు గుండేల్లో గుచ్చుకుంది.

పాపం ఏం అడిగింది. తల్లికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పింది. తనెవరి మీదా ఏ నేరం చెప్పలేదే. తల్లికి దూరంగా ఉన్న ఓ బిడ్డ తల్లిని చూడాలనుకోవడం తప్పు కాదే. నన్ను వచ్చి అడిగింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ మాత్రం సహయం చేయలేనా? దానికి ఎందుకింత వెనుకాడుతున్నాను. పెళ్ళి చేసుకుని పరాయి ఊరు వచ్చిన పిల్ల ఈ సహాయం చేయమని అడిగితే ఇంతగా ఆలోచించడం తప్పమో. ఇక ఆగలేదు వెంటనే అనన్య ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేశాను.

***

ఓ రెండు రోజుల తరువాత లక్ష్మి చెబితే తెలిసింది అనన్య తల్లి తండ్రి ఇద్దరూ వచ్చారని. పోనీలే అని సంతోషించాను. పైగా అల్లుడు అత్త మామలకి చాలా సేవ చేస్తున్నాడని, స్వయంగా బిరియానీ వండి తినిపించాడని కూడా లక్ష్మి చెబుతూ “ఆ అమ్మాయే ఏదో తింగరిదండీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. బంగారం లాంటి ఆ బాబు లాంటి భర్త ఎంత మందికి దొరుకుతారు చెప్పండి. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు సుఖపడడం కూడా రాదు. ఇవాళ ప్రొద్దున్నె బస్‌కి వెళతానంటే అల్లుడే తెల్లవారు మూడు గంటలకి కారులో మామగారిని తీసుకెళ్ళి బస్ ఎక్కించి వచ్చాడు. గేట్ తీయమని మా ఆయనని లేపితే అప్పుడు నేను వచ్చి చూసానండి. ఎంత మంచోడండి ఆ బాబు” అంది

అనన్య నాన్నగారు ఊరు వెళ్లిన రెండో రోజు చామన చాయతో అనన్య పోలికలతో ఉన్న ఓ స్త్రీ నన్ను కలవడానికి వచ్చింది. ఆమె అనన్య తల్లి అని నాకు అర్థం అయింది. లోపలికి రమ్మని పిలిచాను. బైట ఎవరూ చూడట్లేదు కదా అని గమనిస్తూ ఈమె లోపలికి వచ్చింది.

ఒక ఐదు నిముషాల మౌనం తరువాత ఆమె నా చేయి పట్టుకుని “మీకు నంబర్ ఇచ్చి ఫోన్ చేయించానని చెప్పింది అను. మీరు ఫోన్ చేసినట్లు నేను అబ్బాయికి చెప్పలేదు.” అంది. “అది ఒట్టి పిచ్చిదండి, బ్రతకడం రాదు. కొన్ని విషయాలలో మౌనంగా సర్దుకుపోవాలని తెలీదు. అన్ని కాపురాలు ఒకలా ఉండవు కదా. మనం పెరిగిన పరిస్థితులు అత్తగారి ఇంటి పరిస్థితులు ఒకేలా ఉండవు. మగవాళ్ల కోరికలు ఒకొకరివి ఒకోరకంగా ఉంటాయి. భార్య తమను సుఖపెట్టాలనే కదా భర్త కోరుకుంటాడు. అవి కూడా బైటేసుకుంటామా. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి చాటుగా పరిష్కరించుకోవాలి. భర్త ఇష్టపడ్డట్లుగా ఉండడం నేర్చుకోకపోతే ఇక కాపురం సాగుతుందా? చిన్న విషయాలు పెద్దవి చేయవద్దని తనకు చెప్పేవాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. ఆ శృతి చూడండి, ఎంత చక్కగా కాపురం, ఉద్యోగం సంబాళించుకుంటూ, పుట్టింటికి కూడా డబ్బు పంపుతూ ఆ ఇంటి బాధ్యతలు కూడా మోస్తుంది. దీనికి అలాంటి ఇబ్బందులేమీ లేవు. కొంచెం అబ్బాయి చెప్పినట్లు నడుచుకుంటే కొంత కాలానికి వాళ్ళే మారతారు. శరీరాలు చల్లబడ్డాక ఓ బిడ్డ పుట్టాక సంసారంలో పడిపోరా మగవాళ్లు. అప్పటిదాకా ఓర్చుకుంటే రాబోయే రోజులు మనవేగా. ఇది తెలియట్లేదు ఆ పిల్లకి. నేను సర్ది చెప్పాను. మీరు కొంచెం కనిపెట్టుకుని విషయం పెద్దదవకుండా చూడండి. అయినా అమ్మాయి మీకు ఏం చెప్పిందండీ?” అడిగిందావిడ.

“అయ్యో నాకు ఏ విషయమూ తెలియదండి. మిమ్మల్ని చూడాలని ఫోన్ చేయించమని చెప్పింది. మీకూ అదే చెప్పాను కదా. మీ అమ్మాయి ఎప్పుడు నా దగ్గర తన ఇంటి విషయాలేవీ చెప్పలేదు. అలా చెప్పే మనిషి కూడా కాదు”

“అవును మా పెంపకం అలాంటిది. చిన్న విషయానికి బెదిరిపోయే పిచ్చిది అది. అంతే. ఏ గొడవ పడకుండా కొంచెం సర్ది చెబుతూ ఉండండి. ప్రపంచం తెలియకుండా పెరిగింది. మా కన్నా పై స్థాయి ఉన్న అల్లుడు ఇష్టపడేట్లుగా మారడానికి ఇబ్బంది పడుతుంది అంతే. అయినా ఇప్పుడు ఎవరికి వాళ్లు వారిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. దానికి అలవాటు పడాలి. అంతేగా కాపురం అంటే” అంటూ కాసేపు కూర్చుని వెళ్లింది.

మొత్తానికి ఏవో పర్సనల్ అడ్జెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. సమస్య చిన్నదే కాని పాపం అమాయకురాలు దేనికో భయపడినట్లు ఉంది. మొత్తానికి అనన్య కోరుకున్నట్లు ఆమె తల్లి వచ్చి వెళ్లింది. అనుకుని తృప్తిగా నిద్రపోయాను ఆ రాత్రి.

***

ఓ రెండు వారాల తరువాత శనివారం రాత్రి ఏదో రాసుకుంటూ కూర్చున్నాను. తలుపు పై దబ దబ బాదిన చప్పుడు. టైం చూసాను రాత్రి ఒకటిన్నర. ఈ సమయంలో ఇలా తలుపు బాదడం ఎంటి? తలుపు తియ్యాలా వద్దా అని అనుకునేంతలో మళ్ళీ తలుపు పై భయంతో ఎవరో బాదుతున్న చప్పుడు. కాలింగ్ బెల్ కొట్టకుండా ఇలా తలుపు బాదడం. ఇంకేం ఆలోచించకుండా తలుపు తీసాను. ఒక్కుదుటున లోపలికి వచ్చింది అనన్య. అక్కడే ఉన్న నన్ను తోసుకుని ఓ పది అడుగులు వేసి గోడకు తల కొట్టుకుంటూ ఏడుస్తుంది. జుట్టంతా రేగిపోయి భయంకరంగా ఉంది. ఈ రెండు వారాలలో భోజనం చేసినట్లు లేదు. మనిషి సగం అయిపోయి ఉంది. బిత్తరపోయాను నేను. అంత హిస్టీరిక్‌గా ఉన్న ఆమెను ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఇంతలో లోపలికి గబుక్కున వచ్చింది శృతి. ఆమెను చూడగానే అనన్య ఇంకా గట్టిగా తలను గోడకేసి బాదుకోవడం మొదలెట్టింది. శృతిని ముట్టుకోనివ్వట్లేదు. పరిస్థితి అర్థం అయి శృతిని పక్కకు నెట్టి నేను గట్టిగా అనన్యను పట్టుకున్నాను. అంత హిస్టీరిక్ బిహేవియర్‌లో కూడా నోటి నుండి శబ్దం రానివ్వట్లేదు తను. అప్పటికే నుదురు చిట్లి నెత్తురు కారుతుంది. అంత బక్క పలచని మనిషిలో అంత బలం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కాలేదు.

ఇది నేను ఊహించినంత తేలికైన విషయంగా అనిపించలేదు. అనన్యకి ఏదన్నా మానసిక సమస్య అన్నా ఉండి ఉండాలి. లేదా చాలా పెద్ద సమస్యనైనా ఆమె అనుభవిస్తూ ఉండి ఉండాలి. ఇది అర్థం అయ్యాక సిట్యుయేషన్ నేను చేతిలోకి తీసుకోవడానికి వెనుకాడదల్చలేదు. శృతిని చూసి “విషయం ఏంటి అన్నది నా కనవసరం. ఈ సమయంలో అనన్యకి విశ్రాంతి కావాలి. ఆమెను ఇక్కడి నుండి పంపను. ఇంటికి వెళ్ళు శృతి. నేను పిలిచే దాకా నువ్వు కాని సురేష్ కానీ ఇక్కడకు రావడం నా కిష్టం లేదు. వెళ్ళు” అన్నాను గట్టిగా. ఓ రకమైన నిర్లక్ష్యంతో క్రిందకు వెళ్లిపోయింది శృతి.

అనన్యలోని ఆవేశాన్ని తగ్గించడానికి చాలానే కష్టపడవలసి వచ్చింది. ఆమె సర్దుకోవడానికి ఓ గంట పైగానే పట్టింది. నుదుటి గాయానికి కట్టు కట్టి, తాగడానికి కాసిని వేడి పాలు ఇచ్చి బలవంతంగా తాపించిన తరువాత కొంచెం కామ్ అయింది. నేను తననేమీ అడగదల్చుకోలేదు. ఆమె కూడా ఏమీ చెప్పే పరిస్థితులలో లేదు. భయం తగ్గడానికి తన పక్కనే కూర్చున్నాను. నా చేయి పట్టుకుని నిద్రపోయింది. నిద్రలో కూడా చేయి వదలకుండా పడుకున్న ఆమె ముఖం చూస్తూ కూర్చుండిపోయాను తెల్లారే దాకా.

కాలింగ్ బెల్ మ్రోగింది. టైం చూస్తే ఐదు. అనన్య గాఢ నిద్రలో ఉంది. తలుపు తీస్తే బైట శృతి ఉంది. లోపలికి రమ్మని జరిగాను. లోపలికి వస్తూ “అనన్య” అడిగింది.

“నిద్రపోతుంది. లేపకు” అన్నాను.

బాగ్ లో నించి ఓ సిగరెట్ తీసి “ఇప్ యూ డోంట్ మైండ్” అడిగింది శృతి

“సారి నాకు స్మోక్ పడదు” గట్టిగానే అన్నాను.

“ఓ కే. విషయానికి వస్తాను. ఆంటి అవినాష్ మీరు చాలా చదివారని, ఫ్రీ థింకర్ అని చెప్పాడు. హీ ఎడ్మైర్స్ యు. అందుకని మీ దగ్గర దాచాల్సింది ఏమీ లేదు. అనన్య మీకు ఏమీ చెప్పి ఉండదని మాకు తెలుసు. ఎదో అబ్యూస్ అనుకుని మీరు సురేష్‌ని అనుమానించడం నాకు ఇష్టం లేదు. అందుకే మీకు విషయం చెబుతామని వచ్చాను” అంది కూర్చుంటూ.

మౌనంగా ఆమె చెప్పేది వింటున్నాను.

“ఆంటీ సురేష్, అవినాష్ ఇద్దరూ స్కూల్‌మేట్శ్. ఒకరికి ఒకరంటే ప్రాణం. చిన్నప్పటి నుండి ప్రతిదీ పంచుకుని పెరిగారు. ఒకేసారి ఒకే రోజు సిగరెట్టు మొదలెట్టారు. ఒకే రోజు మందు మొదలెట్టారు. ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్లు. చిన్నప్పటి నుండి వారిద్దరిదీ ఓపెన్ మైండ్‌సెట్. ఇది నాది, అది నీది లాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. ఒకరి క్రష్‌ని ఇంకొకరికి పరిచయం చేసుకుని ఎంజాయ్ చేసారు. వీరి సర్కిల్‌లో అందరికీ తెలుసు వీరిలో ఎవరితో డేటింగ్లో ఉన్నా మరొకరిని షేర్ చేసుకోవాలని. అంతగా ఇద్దరూ కలిసి జీవించారు”.

“అవినాష్‌తో నేను పెళ్ళికి ముందు రెండు సంవత్సరాలు డేటింగ్‌లో ఉన్నాను. అవినాష్ సురేష్ కన్నా ఆస్తిపరుడు. అతను పెళ్ళి చేసుకుంటాడని వారి ఫామిలీకి అస్సలు నమ్మకం లేదు. అలాంటి సమయంలో లైప్‌లో ఒక స్టేబిలిటీ కావాలని అనిపించింది అతనికి. దానివలన కొన్ని లాభాలూ ఉన్నాయి. ముందు అవినాష్ తల్లి తండ్రుల నమ్మకం సంపాదించాలి. అవినాష్ ఫ్రీ లివింగ్ వల్ల అతని తండ్రి అతనికి దూరం అవుతున్నాడు. ఆస్తి విషయంలో అతను అవినాష్‌ని నమ్మట్లేదు. ఫామిలీ సపోర్టు సంపాదించలేకపోతే అవినాష్‌కి కెరీర్ పరంగా కూడా ఎదుగుదల ఉండకపోవచ్చు అని ఆలోచించి అప్పటి దాకా లివ్ ఇన్‌లో ఉన్న మేము పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం. అయినా పెళ్లి అంటే ఓ పేపరే కదా. అంత కన్నా ఈ మారేజ్ సిస్టంపై మాకు ప్రత్యేకమైన నమ్మకం లేదు. అప్పటికే రెండు సంవత్సరాలుగా కలిసే ఉన్నాం. అవినాష్, సురేష్ ఇక్కడ ఒకే ప్లాట్‌లో ఉండేవాళ్ళు, నేను పక్క వీధిలో రాధికా ఎంక్లేవ్‌లో ఉంటున్నాను. పెళ్ళితో అవినాష్ అమ్మ నాన్నలు తృప్తి పడ్డారు. అవినాష్ సురేష్ దగ్గర నుండి నా దగ్గరకు వచ్చేసాడు.”

“కాని అవినాష్ నేను సురేష్ ముగ్గురం కలిసే ఉండేవాళ్ళం. కలిసే అంటే అర్థం అవుతుందిగా ఆంటీ. ఇవాళ రేపు ఇవన్నీ కామన్. మీ జనరేషన్లో అందరికీ ఇది అర్థం కాకపోవచ్చు. భార్య అనే పేరుతో ఒక్కడికే సొత్తుగా స్త్రీని మార్చి అతనికి పిల్లలను కనే యంత్రంగా మార్చింది ఈ పితృస్వామ్య వ్యవ్యస్థ. అదంటే మా తరానికి ద్వేషం. స్త్రీకి సెక్సువల్ లిబరేషన్ కావాలి. మేం ముగ్గురం ఇది నమ్ముతాం. ఏ రకమైన ‘నా’ అనే స్వార్థం లేని స్నేహం వారిద్దరిది. భార్య మీద మాత్రం ‘నా’ అన్న ముద్ర ఎందుకు. నాకు సురేష్ అన్నా ఇష్టమే. కొన్ని విషయాలలో అవినాష్ కన్నా సురేష్ అంటే ఇంకా ఇష్టం. అతనితో అనుభవం బావుంటుంది కూడా. సురేష్, అవినాష్ ఇద్దరూ కూడా నేను వారి లైప్ లోకి రాక ముందు నుంచే తమ భార్యల పట్ల లిబరల్‌గా ఉండాలనే నిర్ణయించుకున్నారు. నేను వారికి అలాగే సహకరించాను. ఇన్‌ఫాక్ట్ వారి భావాలు నాకు అర్థం అయ్యాయి. వాటిలో స్త్రీ స్వేచ్ఛ కెంత ప్రాధాన్యత ఉందో నాకు తెలుసు. అంతా బాగా జరుగుతుందనుకున్నప్పుడు మొదలయింది పెద్ద సమస్య”

విషయం పూర్తిగా అర్థం అయి ఈ ఆధునిక యువతి ఆధునిక భావజాలాన్ని, స్త్రీ స్వేచ్ఛ గురించి ఆమెకున్న అవగాహనను, పితృస్వామ్య వ్యవ్యస్థను విమర్శించే ఆమె స్త్రీవాదాన్ని గమనిస్తూ ఉండిపోయాను. ఆమె చెబుతున్నది వింటూనే లోపల బెడ్‌పై అనన్యను చూస్తూ ఉన్నాను. ఆమె ముఖంలో భయం, నిద్రలో కూడా ఆమెను అంటుకునే ఉంది.

“అవినాష్ పెళ్ళి చేసుకున్నాడని తెలిసి సురేష్ వాళ్ల ఇంట్లో కూడా అతని పెళ్ళి చర్చలు మొదలయ్యాయి. సురేష్ తండ్రి ఓసారి మా ప్లాట్‌కు వచ్చి వెళ్ళాడు. అతనికేమి అర్థం అయ్యిందో కాని అదే వారం సురేష్ తాను చెప్పిన అమ్మాయినే పెళ్ళి చెసుకోవాలని, హైదరాబాద్‌లో సురేష్ స్నేహితులకు సంబంధించి ఏ అమ్మాయిని తాను కోడలిగా స్వీకరించలేనని గొడవ మొదలెట్టాడు. సురేష్ తండ్రికి ఇప్పటికీ పిత్రార్జితంగా యాభై ఎకరాల పైగా భూములున్నాయి. సురేష్ ఒక్కడే కొడుకు. అతను ఏవో ఉద్యమాలలో తిరుగుతాడట. తండ్రి మాట వినకపోతే ఆ ఆస్తి తనకు రాదని స్పష్టం అయ్యింది సురేష్‌కి. అయినా అప్పటికే ఎందరో ఆడపిల్లలను చూసి ఉన్నాడు. ఒక్కసారి ఓ వర్జిన్‌తో అనుభవం కావాలనిపించింది. తండ్రి వల్లనే అలాంటి పిల్ల దొరుకుతుందని అనిపించింది. అందుకని సరే అన్నాడు. అలా అనన్యతో పెళ్ళి చూపులు జరిగాయి. పెళ్ళి చూపులకు అవినాష్ కూడా వెళ్ళాడు. సురేష్ కన్నా అవినాష్‌కి అనన్య బాగా నచ్చింది. హీ సింప్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. అవినాష్‌కి అనన్య నచ్చడంతో సురేష్ పెళ్ళికి సరే నన్నాడు.”

“పెళ్లి అయిన తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత ఓ నెలరోజు వారిద్దరినీ వదిలేసాం. తరువాత అనన్యను మా లైఫ్ స్టయిల్‌కు అలవాటు చేద్దామని ముగ్గురం అనుకున్నాం. హైదరాబాద్ వచ్చాక సురేష్ అనన్యకు ఎంత ఫ్రీ లైఫ్ చూపించాడో తెలుసా ఆంటీ. మరో అమ్మాయి అయితే స్వర్గంలోకి వచ్చానని అనుకుంటుంది. కాని ఈ అనన్య ఎక్కడో అడవిలో పెరిగినట్లు ఉంది. అసలు ఈ కాలంలో ఆమెలా ఎవరైనా ఉంటారా. షీ సింప్లీ హేటేడ్ ఎవ్రీ థింగ్. అప్పటికీ ఆమెను మార్చాలని నేను ఎంతో ట్రై చేసాను. వీక్ ఎండ్లో నేను తన ముందే సురేష్‌తో గడుపుతూ ఉంటే ఏడుపు మొహంతో చూస్తూ నిల్చుందే తప్ప, అవినాష్‌తో కో-ఆపరేట్ చేయలేదు. ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి. అఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఫన్. ఈ వైప్ స్వాపింగ్ ఎంత కామన్‌గా జరుగుతోందో ఇప్పుడు. కాని తను అస్సలు మాకు కో-ఆపరేట్ చేయకుందా పెద్ద తలనొప్పి అయి కూర్చుంది.”

“అవినాష్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ జంటిల్‌మేన్. అందుకే తన కోరిక ఆమెకు చెప్పి ఆమె యెస్ అనడం కోసం ఎదురు చూస్తున్నాడంతే. ఆమెను బలవంత పెట్టట్లేదు. ఆమెను మార్చే ప్రయత్నం చేస్తున్నాం ముగ్గురం. సురేష్, అవినాష్ ఇద్దరూ చాలా మంచి వాళ్ళు ఆంటీ. మీరు వాళ్లను చూసారు కదా. వాళ్లకు ఆఫీసులో కూడా చాలా మంచి పేరుంది. షి విల్ ఎంజాయ్ లైఫ్ విత్ దెమ్. అది తనకు అర్థం కావట్లేదు. ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకుని అమ్మను పిలిపించుకుని అంతా చెప్పి సురేష్‌తో ఉండనని చెప్పింది. ఆమె తరువాత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్లకి. పెద్ద కూతురు భర్తను వదిలి వస్తే మిగతా పిల్లల పెళ్ళిల్లు కావని వాళ్ళ అమ్మే తనకు కొంచెం సర్దుకోమని చెప్పి వెళ్లింది. అప్పుడయినా ఈమెకు బుద్ధి ఉండొద్దు. సురేష్ వాళ్ల పేరెంట్స్‌ని ఎంత బాగా చూసుకున్నాడో. చివరకు వాళ్ల చెల్లెళ్ల పెళ్లికి డబ్బు సహాయం చేయడానికి వాళ్ళ నాన్నను ఒప్పించాడు కూడా. దీనికి సురేష్ నాన్నగారు, మామగారు ఇద్దరూ ఎంతో సంతోషించారు. సురేష్ మంచితనం వాళ్లకి అర్థం అయింది కాని ఈమె మాత్రం మారలేదు. షీ ఈజ్ ఏ ఫూల్ ఆంటీ” అంది.

అంతా వింటున్న నాలో అనన్య పట్ల ప్రేమ పొంగింది. అనన్య అర్థం అవుతుంది. ఆమె పడుతున్న బాధ తెలుస్తోంది.

“శృతి నిన్న ఏం జరిగింది?” అడిగాను

“వాట్ ఆంటీ” ఏదో ఫ్లో లో చెప్పుకుంటూ వెళుతున్న ఆమె ఆగింది.

“నిన్ననా.. ఓ ఆంటీ అనన్య పేరెంట్స్ వచ్చినప్పటి నుండి అనన్యను అవినాష్ గదిలోకి రమ్మని అడగడం మానేసాడు. వీకెండ్‌కి ఇద్దరం వస్తాం. నేను సురేష్‌తో ఉన్నంత సేపు పాపం అవినాష్ జాలిగా అనన్యని చూస్తూ ఒంటరిగా కూర్చుంటున్నాడు. ఈ మధ్య దీనికి సురేష్ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నాతో మామూలుగా ఎంజాయ్ చేయలేకపోతున్నడు. నిన్న మేం వచ్చిన తరువాత అతను నా దగ్గరకు రాకుండా అనన్యతో గడపాలని ఆశ పడ్డాడు. కాని సురేష్ ఆమెపై చేయి వేస్తే ఏదో రేప్ జరిగినట్లు అనన్య బిహేవియర్ ఎంత అబ్సర్డ్‌గా ఉండిందో తెలుసా. అవినాష్‌తో ఎంజాయ్ చేయడం ఇష్టం లేకపోతే సురేష్‌ని దూరం పెట్టడం తప్పు కదా. తప్పక సురేష్ ఆమెతో బలవంతంగా సెక్స్ జరిపాడు. అతనికా హక్కు ఉంది కదా. మరి భర్తే కావాలనుకున్నప్పుడు భర్తనైనా సుఖపెట్టాలి కదా. గది బైటకు వచ్చి ఎదురుగా ఉన్న అవినాష్‌ని చూసి అలా పిచ్చి పట్టినట్లు తలుపు తీసుకుని పైకి పరుగెత్తింది. చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుని పోయేదానికి ఇంత రచ్చ అవసరమా ఆంటీ”

“శృతి స్త్రీ స్వేచ్ఛ గురించి ఇంత బాగా చెబుతున్నావు. అనన్యకు తన పార్టనర్ విషయంలో స్వేచ్ఛ ఉండకూడదా, తన జీవితాన్ని తాను చూజ్ చేసుకునే అవకాశం ఆమెకు అక్కర్లేదా” అడిగాను.

“ఆంటీ ఈ పతివ్రతలు ఎందుకు ఇలా అడ దేవదాసుల్లా ఉంటారో తెలుసా. వీళ్లకు ఆక్సెప్ట్ చేయడం రాదు. జీవితం అంటే సమస్యలు లేకుండా చేసుకోవడం. ఎక్కడికక్కడ ఎడ్జెస్ట్ అవడం. ఇది నేర్చుకుంటే ఇలా ఏడుస్తూ తల బాదుకుంటూ గడపాల్సిన అవసరం ఉండదు. ఇంత చిన్న విషయం తెలుసుకోరు కాబట్టే అర్దం లేని వాల్యూస్ కోసం జీవితాంతం ఏడుస్తూ ఉండిపోతారు. ఈ వాల్యూస్‌తో ఏం సుఖం ఉంది ఆంటీ” అడిగింది శృతి.

నిన్న స్కూల్‌లో ఓ పేరెంట్‌తో జరిగిన చర్చ గుర్తుకు వచ్చింది, “మా అబ్బాయి ఎప్పుడన్నా కొంత మందు తీసుకుంటాడేమో కాని వీడు తాగడమ్మా. మా ఇంట్లో వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్” అంది ఓ తల్లి, బాత్ రూమ్‌లో గంజాయి కొడుతున్న ఆమె కొడుకుని పట్టుకున్నప్పుడు.

ఒకప్పుడు నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో సిగరెట్టు తాగుతున్న పిల్లలను వింతగా చూసి అదో పెద్ద తప్పుగా వారికి నీతులు చెప్పేవాళ్ళం. తరువాత అది దాటి మందు తాగే పిల్లలకు కౌన్సలింగ్‌లు చేసేవాళ్ళం. తల్లి తండ్రులలో కూడా పర్లేదు సిగరెట్టే తాగుతాడు మా వాడు నించి పర్లేదు కాస్త మందే తాగుతాడు మా వాడు స్థాయికి ఆక్సెప్టెన్స్ వచ్చేసింది. తప్పులు ఇంకా హెచ్చు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. చిన్న కరెప్షన్లు ఇంటర్నేషనల్ లెవల్ లోకి మారుతున్నాయి. చిన్న వాటిని మనం ఆక్సెప్ట్ చేసేస్తూ జీవితాలను సౌకర్యవంతం చేసుకోవడమే ధ్యేయంగా బ్రతికేస్తున్నాం. మనం ఒకప్పుడు తప్పు అనుకున్న వాటిని ఇప్పుడు ఒప్పుగా మార్చుకుని ఇప్పటి తరం ప్రోగ్రెస్ అయిపోయారు, అనో ఇప్పుడు ఇవన్నీ మామూలే అనో మనకు మనం సర్ది చెప్పుకుని నీతులను కుదించుకుని రీఫార్మ్ చేసుకుంటూ బ్రతకవలసి వస్తుంది. కాని ఇది అందరికీ సాధ్యం కాదే. ఇప్పటికీ సిగరెట్టూ, మందు చాలా పెద్ద తప్పులు అనే బాటలో నేనుండబట్టే కదా ఈ అలవాటుని సమర్థించే అందరికీ దూరం జరిగి ఒంటరిగా నేను బ్రతుకుతుంది. నలుగురు ఎప్పుడేది మంచి అంటే దాన్ని మంచి అని ఎప్పుడు ఎవరు దేన్ని చెడు అంటే అది చెడ్డదని నమ్మి సర్తుకుపోతూ జీవించడం మనసు ఉన్న మనుష్యులకు సాధ్యం అవుతుందా? ఎవరి వేల్యూ సిస్టంని వాళ్ళే నిర్మించుకుంటారు. ఆ నిర్మించుకోవడంలోని స్వేచ్ఛ అర్థం కాని మనుష్యులు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఎలా మాట్లాడగలరు? కాని వాళ్ళే ఎక్కువగా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలిస్తూ ఉంటారు.

శృతికి తాను జీవిస్తున్న జీవితంలో సౌకర్యాలు ముఖ్యం. దాని కోసం తనను మార్చుకుంది. అనన్య కొన్ని విలువలను నమ్మి వాటి బేస్‌గా జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంది. భర్త తప్ప మరో మగాడిని పక్కలోని రానివ్వను అన్నది ఆమె జీవితంలో ఆమె నిర్మించుకున్న విలువ. కాని ఆ విలువకు తిలోదకాలిచ్చి మా సౌకర్యాలను నీ సౌకర్యాలుగా మార్చుకుని బ్రతుకు అని ఆమె కన్న తల్లే ఆమెకు చెప్పి వెళ్ళింది. దాని వల్ల తన కుటుంబం కొన్ని సమస్యలు తప్పించుకోవచ్చని ఆమె అనుకుంది. తామే ఏర్పరుచుకున్న విలువలను, తమ అవసరార్థం మార్చుకోవడానికి చాలా మంది సందేహించరు. తాము మరో తరానికి అప్పజెప్పిన విలువలకు తిలోదకాలిచ్చి ఎప్పటికప్పుడు సౌకర్యాల కోసం కాంప్రమైజ్ అయి బ్రతికే హిపోక్రసి అందరికీ ఉండదుగా. సౌకర్యాల కోసం కాంప్రమైజ్ అయ్యేవి విలువలెందుకవుతాయి? తమ సౌకర్యం కోసం ఎటు గాలి వీస్తే అటు ఊగిపోయే వారికి అన్ని తుఫానులకు తల వంచుకుని గడ్డిపరకలా బ్రతకడం ఇష్టం. గాలికి ఎదురొడ్డి పెళ పెళ విరిగిపోయి, పడిపోయి నానా భీభత్సాన్ని అనుభవించే మర్రి చెట్టు చాలా సందర్భాలలో గడ్డి పరకలకు చులకన అవుతుంది. ఎలాంటి స్థితిలోకి మానవ సమాజం ఉంది మనసులో ఏదో తెలియని బాధ సుళ్ళు తిరుగుతుంది.

“ఆంటీ అనన్యకు ఏమి తక్కువ చెప్పండి. మాలా జీవించమని అంటున్నాం. దాని వలన తనకు లాభమే కాని నష్టం కాదు కదా. సురేష్ కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా అనన్య వాళ్ళ కన్నా పై స్థాయిలో ఉంది. పైగా ఈ సంబంధం వలన సురేష్ ఆ కుటుంబానికి కూడా అండగా ఉండడానికి సిద్దపడుతున్నాడు. తెలివైన ఆడపిల్లలు ఎవరూ సురేష్‌ని దూరం చేసుకోలేరు. కాని అనన్య ఏవో అర్థం లేని కాంప్లెక్సులతో అందరికీ ప్రాబ్లం అవుతుంది” అంది శృతి.

ఆమెను సూటీగా చూస్తూ “ఒక్కటి అడుతాను శృతి నిజం చెప్పు” అన్నాను

“అడగండి ఆంటీ” అంది శృతి.

“మీ ప్రెండ్స్‌లో నీకు అస్సలు నచ్చిని ఓ మగ స్నేహితుని పేరు చెప్పు” అడిగాను.

“సారధి అంటే నాకు అసహ్యం ఆంటీ. హీ ఈజ్ ఏ హిపోక్రెట్” అంది శృతి.

“సరే ఏదో కారణంతో ఇదే ఓపెన్ కాన్సెప్ట్‌తో సారధితో అవినాష్ వైఫ్ స్వాపింగ్ చేయాలనుకుంటే నీకు కంఫర్టబుల్‌గా ఉంటుందా” అడిగాను.

“ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ పర్క్స్ వీ గెట్ ఆంటీ” టక్కున బదులిచ్చింది శృతి.

“అంటే నీవు కోరుకునే లాభం కోసం నువ్వు ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తితో కూడా గడపగలవు అంతేనా” అడిగాను.

“లైఫ్ అంటే మన ప్రయారిటీస్‌ని నిర్ణయించుకుని కొన్ని కాంప్రమైజ్‌లు చేసుకుంటూ కొన్నిటిని ఆక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే కదా ఆంటీ” చాలా సీరియస్‌గా చెప్పింది శృతి.

“అంటే అలా బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నావు. కాని నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే బ్రతకాలని నువ్వు నిర్ణయించడం తప్పు కాదా” అడిగాను.

“కాని అలా బ్రతకడానికి ఒప్పుకోక వాళ్లు సాధించేదేమిటి ఆంటీ? అందరికీ తలనొప్పి అవడం తప్ప” అడిగింది శృతి.

“మీ లైఫ్ స్టైల్‌తో మీరు అనన్యకు తల నొప్పి అవుతున్నారేమో” అడిగాను.

“కమాన్ ఆంటీ, బ్రాడ్‌గా ఆలోచించండి. మా లాగా జీవించలేక అనన్య పొందేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువ” అంది శృతి.

“అది మీరెలా నిర్ణయిస్తారు శృతి. అనన్య ఈ కంపర్ట్స్ కోసం బ్రతకాలనుకోవట్లేదు. ఆమె వ్యక్తిత్వంలో అమెకో జీవన విధానం ఉంది. మీ అందరి కోసం దాన్ని మార్చుకోవడానికి సిద్దంగా లేదేమో. నీవనుకున్నట్లు ఆమెలో సాంప్రదాయ భార్య ఆలోచనలూ లేవు. అవి ఉంటే ఈ రోజు తన భర్తతో శరీరాన్ని పంచుకోవలసిన పరిస్థితిలో ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యేది కాదు. అవినాష్‌తో తనను పంచుకోవడానికి సిద్ధపడిన సురేష్‌ని, నీతో తనతోనూ కూడా మంచం పంచుకునే సురేష్‌ని ఆమె భర్తగా అంగీకరించలేకపోతుంది. కాబట్టే సురేష్ ఈ రోజు ఆమెతో జరిపిన సెక్స్‌ను ఆమె రేప్ గానే ఫీల్ అయింది. కాబట్టే అంతలా డిస్టర్బ్ అయ్యింది. అనన్య తన విలువలను మీ అంత సులువుగా కాంప్రమైజ్ చేసుకోగల వ్యక్తి కాదు. ఆమెలో ఓ బలమైన వాల్యూ సిస్టం ఉంది. దాన్ని మీరు అంగీకరించకపోవచ్చు. మీకు అర్థం కాకపోవచ్చు కూడా. ఆమె కోసం మీ జీవన పంథా మార్చుకోలేకపోతున్నారు కదా మీరు. ఆమెను మారమని ఎలా బలవంత పెడుతున్నారు? మీ కన్నా ఆమె నిర్మించుకున్న విలువలకి ఆమె ఎక్కువ సిన్సియర్‌గా లోబడి జీవిస్తుంది. ఆ సిన్సియారిటీ మీకు నచ్చక మీలో ఆమెను కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు.”

“అనన్య లాగా విలువలకోసం అన్నిటినీ అందరినీ వదులుకునే వ్యక్తులు మీకు మూర్ఖులుగానే కనిపించవచ్చు. వారు నమ్ముకున్న విషయాల పట్ల మీకు గౌరవం లేకపోవచ్చు. కాని ఆ నమ్మకంలోని సిన్సియారిటీని కూడా మీరు ఒప్పుకోలేకపోతున్నారే. మీలో ఎటుపడితే అటు లొంగగలిగే గుణం ఉంది. మీరు నమ్ముకున్న వాటి పట్ల కూడా మీకు గౌరవం లేదు. అందుకే పరిస్థితికి అనుకూలంగా మీరు మారిపోగలరు. మీ వాల్యూ సిస్టంపై మీకు లేని కమిట్మెంట్ మరొకరికి ఉండడం వలన ఆమెను మీలో కలుపుకోవడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను ఎవరి నైతికతను ప్రశ్నించట్లేదు. మీకు ఓ జస్టిఫికేషన్ ఉన్నట్లే అనన్యకీ ఉంటుంది కదా. ఆమెను ఆమెలా జీవించనివ్వండి. దాని వలన ఆమె కొన్ని సౌకర్యాలు వదులుకోవడానికి సిద్ధపడితే అది ఆమె చాయిస్. ఆమెను విమర్శించి ఆమె జీవితాన్ని ఎగతాళి చేసి ఆమెనో మూర్ఖురాలిగా పరిగణిస్తూ మీ గొప్పతనం చాటుకోవలసిన అవసరం లేదు కదా. ఇందులో నాలాంటి వారికి మీ ఇన్సెక్యూరిటి కనిపిస్తుంది” కొంచెం గట్టిగా స్పష్టంగానే చెప్పాననుకున్నాను.

“ఆంటీ వాట్, మాకు ఇన్సెక్యూరిటీయా. అనన్య మూర్ఖత్వాన్ని మార్చాలని ఆమెకు జీవితాన్నిఎంజాయ్ చేయడం నేర్పాలనుకోవడం మీకు మా ఇన్సెక్యూరిటీలా కనిపిస్తుందా. ఇందులో మా కన్సర్న్ మీకు కనపడట్లేదా. దిస్ ఈజ్ టూ మచ్” శృతి మొహం ఎర్రబడింది.

“అందరికీ ఎంజాయమెంట్ ఒకే దారిలో దొరకదు శృతి. ఎంజాయ్‌మెంటే అందరి ప్రయారిటీ కానవసరం లేదు. వాడు తాగుతున్నాడని, వాళ్ళు తిరుగుతున్నారని చూసి, మీరు అవి చేసి చూపడం వలన మీకు కావలసినది ఏంటో స్వయంగా నిర్ణయించుకునే శక్తిని మీరు పోగొట్టుకుని ఓ ఒరవడిలో కొట్టుకుపోతున్నారేమో ఆలొచించు. ఎన్ని ప్రలోభాలు చూపినా, అవి నాకు వద్దు అన్న వారిలో ఓ క్లారిటీ ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ కూడా మీ జీవన శైలిని అనన్య అంగీకరించక తన జీవితాన్ని నష్టపరుచుకుని, ఇబ్బంది పడడానికి కూడా సిద్ధపడుతుంది అంటే, అమెలో స్పష్టంగా ఏర్పడ్డ కొన్ని సిద్దాంతాలను కాంప్రమైజ్ చేసుకునే పరిస్థితిలో ఆమె ఖచ్చితంగా లేదు. ఆమెలో ఓ క్లారిటీ ఉంది. అది మీకు నచ్చకపోవచ్చు. మీ ఆలోచనలకు విరుద్ధంగా ఉండవచ్చు. కాని ఆ క్లారిటీ కారణంగా మీ ప్రెషర్‌కు ఆమె తలవంచలేకపోతుంది. తనకేం కావాలో మీకన్నా ఆమెకు స్పష్టంగా తెలుసు. అది దొరికితేనే ఆమె సుఖపడుతుంది. లేదా బాధపడుతుంది. కాని ఆమె దారి మళ్ళించాలని ప్రయత్నిస్తే ఆమె ఒప్పుకోలేకపోతుంది. నీకు సురేష్‌తో సంబంధం బావుంది. సురేష్ అంటే నీకు ఇష్టం. అందుకని అతనితో గడపగలుగుతున్నావు. కాని సారధి అంటే ఇష్టం లేకపోయినా అతని ద్వారా ఏదో లాభం ఉంటుందంటే అతనితో కూడా గడపడానికి నువ్వు సిద్దపడగలవు. కాని అనన్యకు అవినాష్‌తో సంబంధం ఇష్టం లేదు. అది ఆమె మనసు ఒప్పుకోవట్లేదు. నీతోనూ తనతోనూ గడపాలనుకునే సురేష్‌ను ఆమె భర్తగా అంగీకరించలేకపోతుంది. కనీసం బాధ్యతగానయినా తన శరీరాన్ని అతనికి ఇవ్వలేకపోతుంది. ఆమెలో సౌకర్యాలకన్నా మించిన ఓ జీవన సూత్రం ఉంది. దానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమెను ఆ విలువలకే వదిలేయండి. ఆమెను బలవంతంగా మీలో కలుపుకోవాలని అనుకుంటే ఆమె ఎక్కువ రోజులు బ్రతకలేదు. జస్ట్ లెట్ హర్ లివ్. దాని కోసం ఆమె వదులుకోవాలనుకున్న వాటిని వదులుకోనివ్వండి. ఈ భూమిలో మనిషికి కనీసం తాను అనుకున్నట్లు బ్రతికే అవకాశాన్ని ఇవ్వడమే కదా స్వేచ్ఛ అంటే. ఇది మీ లాంటే స్వేచ్ఛా జీవులకు అర్థం కావాలి కదా.

“అంటే అనన్యను ఆమె తల్లి తండ్రుల దగ్గరకు పంపిస్తారా. వాళ్ళు దీనికి సిద్ధపడి ఉంటే అప్పుడే ఆమెను తమతో తీసుకెళ్ళే వాళ్ళు కదా” అడిగింది శృతి.

“లేదు, అనన్యకు తల్లి తండ్రుల సపోర్ట్ దొరకదు అని నాకు అర్థం అయింది” అన్నాను.

“మరి మీరు ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా” శృతి మొహంలో ఓ చాలెంజ్, వ్యంగ్యంతో కూడిన నవ్వు.

“ఎవరి జీవిత భాద్యత ఎవరు తీసుకోగలరు శృతీ. నేను అంత శక్తి ఉన్న దాన్ని కాదు” అన్నాను.

“మరి ఏం చేద్దామనుకుంటున్నారు ఆంటీ? షీ యీజ్ హియర్” లోపల పడుకున్న అనన్యను చూపిస్తూ అడిగింది శృతి.

“ఈ మొత్తం కథలో నాకు ఒక మార్గమే కనిపిస్తుంది. సురేష్ నాన్నగారు. అనన్యను అర్థం చేసుకున్నా, ఆమెకు సహాయపడినా ఈ కథలో ఆయన ఒక్కరికే సాధ్యం. ఆయనకే కబురు చేస్తాను. అనన్య జీవితానికి ఆయన ఏదన్నా దారి చూపగలరేమో చూద్దాం. లేదా కొంత సమయం గడిచి అనన్య కోలుకున్నాక, ఆమె తన జీవితాన్నినిర్ణయించుకునే శక్తిని సమకూర్చుకుంటుందేమో” అన్నాను.

“వాట్ సురేష్ నాన్నగారిని ఇన్వాల్వ్ చేస్తారా. ఆయన ఇప్పుడిప్పుడే సురేష్‌ని కలుపుకుంటున్నారు. దీని వలన సురేష్ కెంత నష్టమో అర్థం అవుతుందా ఆంటీ. మీరు చాలా దారుణంగా ఆలోచిస్తున్నారు” అంది శృతి.

“సురేష్ వల్ల అనన్యకు అయిన నష్టం కూడా తక్కువేమీ కాదు కదా శృతి. ఇద్దరూ ఎవరి పరిస్థితులను బట్టి వారు నష్టపోతారేమో. కాని ఓ పరిష్కారం వీరికి చూపాలంటే ఈ దారొక్కటే కనిపిస్తుంది. ఇంటి పెద్దగా, సురేష్ తండ్రిగా, ఆలోచనాపరుడిగా ఆయన వీరి జీవితాలకు ఏ దారి చూపుతారో చూద్దాం” అన్నాను.

“చివరికి అనన్య మా దారికే వస్తుందేమో” ఓ రకమైన కాన్పిడెన్స్ శృతిలో.

“అది ఆమె నిర్ణయం శృతి. అనన్య ఏం చేయాలో చెప్పే హక్కు నాకు లేదు. ఇప్పుడు తానున్న పరిస్థితిలో నేను ఏం చేయాలో అది చేయడమే నా బాధ్యత. సురేష్ నాన్నగారికి ఇవాళే ఫోన్ చేస్తాను. ఆయనకి అనన్యను అప్పగించడం వరకే నా పని. ఇప్పుడు మాత్రం తను క్రిందకి రాదు. మీరు కూడా ఆమెను డిస్టర్బ్ చేయకండి” కాస్త కటువుగానే చెప్పాననుకున్నాను.

మంచం పై అనన్య కదులుతుంది. ఆమె ముఖంపై భయం అలాగే ఉంది. తను నా దగ్గర ఉన్న ఆ కాసేపు ఆమెను కంఫర్టబుల్‌గా ఉంచడం తప్ప నేను మాత్రం ఏం చేయగలను? ఆమెలాగే నేనేర్పరుచుకున్న విలువల కోసం ఒంటరిగా జీవిస్తున్న స్త్రీని. చాలా మంది దృష్టిలో మూర్ఖురాలిని, మొండిదాన్ని, సుఖపడడం చేతకాని దాన్ని. కాని ఇలా తప్ప మరోలా బ్రతకలేని అశక్తురాలిని. అందుకే నా సహాయం కోసం వచ్చిన మరో అశక్తురాలికి కాస్త ఓదార్పు ఇవ్వగలనేమో మరి. ప్రయత్నిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here