రంగుల హేల 39: అందచందాలు

13
11

[box type=’note’ fontsize=’16’] “చక్కని మానవసంబంధాలతో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళెంతో అందంగా కనబడతారు. వాళ్ళ అందం మనసుది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]అం[/dropcap]దం అందరికీ ఆనందం కలిగిస్తుంది. అందం అంటే ప్రకృతి. ప్రకృతి కన్నా అందమైనదీ, నిత్యనూతనమయినదీ లేనే లేదు. ఆ తర్వాత అనేక రకాల కళలు అందగిస్తూ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. మనుషుల అందానికొస్తే స్త్రీలది ప్రథమ స్థానం తర్వాతే పురుషులది. ఈ మాట పురుషులన్నదే. ఇక పోతే చిట్టి పొట్టి పాపాయిలది పాలుగారే అందం.

సృష్టిలోని చెట్టుచేమలూ, పూలూ, పక్షులూ, జంతువులూ ఎంతో సహజంగా అందమైనవి. చూసే కళ్ళకు రస దృష్టి, కళాత్మకమైన మనసూ ఉంటే చాలు మన చుట్టూ ఉన్నదంతా అందమే. ఆనందమే! సూర్యోదయం నిత్యం నూతనంగా ఉంటుంది. పొద్దున్నే లేచి చూస్తే ఆ ఉదయపు చల్లని గాలులూ, పక్షుల కలకలారావాలూ, లేలేత సూరీడూ కురిపించే అందాలు చూడడానికి మన రెండు కళ్ళూ చాలవు. అలాగే నారింజ సూర్యాస్తమయాలూ, పిట్టలు గూళ్లకు చేరే కువకువలూ, సంజె గాలీ ఎంత అద్భుతంగా ఉంటాయో! ఈ ఉదయాస్తమయాలను నది పక్కన గానీ, సముద్రం పక్కనగానీ నిలబడి చూస్తే ఆ అందం వందల రెట్లుగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఆరుబయట నిలబడితే ఎన్నెన్ని అందాలో! ఏ టూరిస్ట్ ప్రాంతానికో వెళ్ళినప్పుడు తప్ప నిత్యం ఈ అందాలను పట్టించుకోము. ఆ సమయానికి ఉదయం అయితే ఇంట్లో అసలు నిద్ర లేవం. లేచినా వంటలు చేసుకుంటూనో,ఇంకేవేవో పనులు చేసేసుకుంటూనో ఉండిపోతాం. సాయంత్రం అయితే ఏ టీవీ ముందో సోఫాలో పడి ఉంటాం. కాస్త బైటికెళ్లి చూద్దామన్న ఆలోచనే రాదు.

ఇక ఆ తర్వాత అందరినీ ఆహ్లాదపరిచే అందం సినిమాదే. సినిమా అంటేనే సర్వకళల సమ్మిశ్రితమ్. అన్ని కళల సారాన్నీ తగుపాళ్లలో కలిపి తయారుచేసే రుచికరమైన వంటకం అది. సినిమా ప్రెజెంటేషన్ అనేది అందాలకి పరాకాష్ట. సహజమైన ఉషోదయ,సూర్యాస్తమయ అందాలు, అద్భుతమైన లొకేషన్స్, సెట్టింగ్స్, ఆహ్లాదకరమైన భావయుక్తముగా సంగీతం కూర్చిన పాటలు, చక్కని పదునైన సంభాషణలు అన్నీ కలిసిన రాశీభూతమైన అందంగా ఒప్పేది సినిమా.అన్ని వర్గాలవారికీ సినిమా అనేది చక్కని కల. మూర్తీభవించిన కళా రూపం.స్థాయీ భేదం, వయోభేదం మరిచి, సమస్త మనవాళీ ఆస్వాదించే తియ్యని వస్తువు సినిమా. రెండున్నర గంటలు మనల్ని మైమరిపించే మంత్రం అది.

ప్రేక్షకులకి నచ్చే విధంగా నటీనటుల అందానికి మెరుగులు పెడతారు. ఇహ నాయికా నాయకులైతే చెప్పనక్కరలేదు. ఒడ్డూ, పొడుగూ, తీరైన కళ్ళూ, ముక్కూ, నోరూ ఉండే అందమైన వారినే హీరోహీరోయిన్‌లుగా ఎన్నుకుంటారు. ఆ పై వారిని మరింత అందగాళ్లుగా అత్యద్భుతమైన మేకప్‌తో లైటింగ్‌తో సినిమాలో చూపిస్తారు. సిల్వర్ స్క్రీన్‌పై కెక్కాక ఎటువంటి అందాలైనా పదింతలవుతాయి. నిజ జీవితంలో మనం ఎంతో మంది అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ చూస్తాం. మరీ అంత అచ్చెరువొందే అందగాళ్ళు తరచుగా కనబడరు. వెయ్యిమందిలో ఒకరు వుంటారేమో ఏ వంకా లేని వాళ్ళు. అంతే. ఒకోసారి సాధారణ అందగాళ్లనే తీసుకెళ్లి తెరమీద చూపిస్తే కళ్ళు తిప్పుకోలేం.

ఏ రంగుల హంగులు లేకుండా మనతో పాటే మన ఊర్లోనే ఉంటే, మనం ఐశ్వర్య రాయ్‌ని వెనకా ముందూ చూడకుండా పిల్లికళ్ళ పిల్ల అనేస్తాం. దీపికాని తాడి కాళ్ళమ్మాయ్ అని వెక్కిరిస్తాం. తమన్నాని పిండిమొహం అమ్మాయి అంటాం. రాణీ ముఖర్జీని బొంగురు గొంతు పిల్లనీ, శ్రీదేవిని బండముక్కు పిల్లనీ, రజనీకాంత్‌ని నల్లబ్బాయ్ అనీ, కమల్ హాసన్‌ని పొట్టి కుర్రాడు అనేసేవాళ్ళం. వీళ్లంతా వెండితెరపైకెక్కి దేవతల అందాన్ని సంతరించుకుంటారు కాబట్టి మనం వాళ్ళని చూస్తూ మైమరచిపోతూ ఆరాధిస్తాం. కెమెరా మాయ చేసి లోపాల్ని సవరించి సౌందర్యవంతులుగా మార్చేస్తుంది.

అసలు అందం ఎదుటి వస్తువుల్లోగానీ,ఎదుటి వ్యక్తుల్లో గానీ ఉండదనీ కేవలం చూసేవాళ్ల కళ్ళలోనే ఉందనీ మార్గరెట్ మేడం ఏనాడో చెప్పి పెట్టింది. మనకి నచ్చిందే అందం అని మనం కూడా అనుకుంటాం. పక్క వాడిని కూడా ఒప్పించాలని ప్రయత్నిస్తాం. మన చిన్నప్పుడు నాగేశ్వర్ రావు అభిమానులూ, ఎన్టీఆర్ అభిమానులూ కొట్టుకునేవారు, మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని. ఒకళ్ళ హీరోని మరొకళ్ళు వెక్కిరించి ఆట పట్టించుకునేవారు. వాల్ పోస్టర్స్ మీద పేడముద్దలుండేవి. పిచ్చితనం కాకపొతే ఇద్దరికీ అభిమానులుగా ఉండకూడదా? అదేమైనా పెళ్లా ఒకరినే ఇష్టపడాలనుకోవడానికి. అసలిద్దరూ అందగాళ్లే, గొప్ప నటులే. ఒకరెక్కువా మరొకరు తక్కువా కానే కాదు. ఇష్టాన్ని అతి చేసుకుని మరో హీరోని తక్కువచెయ్యడం అవసరమా? అంటే అది దురభిమానం. పరిమితులు దాటిన పిచ్చితనం.

ఇప్పటికీ జనాలకి ఈ అమాయకత్వం పోలేదు. రాజకీయాలపై మోజుకలిగిన ఉత్సాహవంతులైన కొందరు, అంతా ఒక తానులో గుడ్డలే అన్న సత్యాన్ని మరిచి, ఏదో ఒక రాజకీయ పార్టీని అభిమానించడం మొదలుపెడతారు. తెలీకుండానే ఒక గుడ్డిప్రేమకులోనై ఆ పార్టీని సమర్థించడం మొదలు పెడతారు. మరో అడుగు జారి, ఆ పార్టీ వాళ్ళుచేసే ప్రజాస్వామ్య వ్యతిరేక పనులని కూడా డిఫెన్సు లాయర్స్‌లా సమర్థిస్తూ బుర్ర పాడుచేసుకుంటారు. విచక్షణ కోల్పోతారు. జడ్జ్ చెయ్యలేని దుస్థితిలో పడతారు. ఆ పార్టీ లోటుపాట్లను ఎత్తిచూపే వారిపై కోపంతో వాదనలకు దిగి తలనొప్పి తెచ్చుకుంటారు.

మెరిసేదంతా బంగారం కాదు.అందంగా ఉండేవాళ్లంతా మనసున్నవాళ్ళుకాదు.ఇవన్నీ విన్నవే. ఎన్నన్నా ‘అప్పియరెన్సెస్ రియల్లీ డూ మేటర్!’ చక్కగా ముస్తాబయ్యి వచ్చిన వారిని చూస్తుంటే కంటికి ఆహ్లాదంగా ఉంటుంది. టేబుల్ ఫ్యాన్‌లా వాళ్ళ వైపే తిరగాలనిపిస్తుంది. ముద్దు సీతాకోక చిలుకల్లా ఉన్న అమ్మాయిల్ని చూస్తే మనమూ అబ్బాయిల్లా మురిసిపోతాం. అసలు పెళ్లిళ్లలో అందమంతా ఆడవాళ్ళవల్లా, పెళ్లి మండపానికి చేసిన పూల అలంకరణవల్లా వస్తుంది. ఆ తర్వాత ఆకర్షణీయంగా సర్ది ప్రేమగా పిలిచి వడ్డించే ఫుడ్ వల్ల కూడా అనుకోండి. మనం ఏ మీటింగ్ కయినా ఇస్త్రీ బట్టలేసుకుని ఓపిగ్గా తయారయ్యి వెళ్లి అందరితో మాట్లాడుతూ ఉంటే మన మీద మనకే గౌరవం పెరుగుతుంది. ఈ సారి ప్రయత్నించి గమనించండి. మనల్ని కూడా మనం అందంగా ఉంచుకుంటే మంచిదేమో కదా!

ఎవరైనా ప్రశాంతమైన కళ్ళతో నవ్వుతూ మన వైపు చూసి “బావున్నారా?” అంటూ చెయ్యి కలిపితే ఎంత బావుంటుందో! ఈర్ష్యాసూయలు నింపుకున్న కళ్ళ తాలూకు మనుషులు ఎంత అందంగా తయారయినా అనాకారుల్లానే కనబడతారు. కొందరు అపరిచితుల్ని కూడా ప్రేమగా పలకరించే మహానుభావులుంటారు. వాళ్ళెంత అందగాళ్లో కదా ! కంటికి నచ్చిన అందానిదేవుంది? అది మీసాలపై తేనియలాంటిది. క్షణ భంగురం.ఎందుకంటే కంటియొక్క జ్ఞాపకం తాత్కాలికం. మనసు జ్ఞాపకం మాత్రం శాశ్వతం. ఎప్పటికీ అపురూపంగా తలచుకుంటుంది. మననం చేసుకుంటుంది.

ఒకానొక ఆపదలో మనం చిక్కుకున్నప్పుడు ఎవరి ద్వారానో అది తెలుసుకుని పరుగున వచ్చి తగిన సహాయం చేసి మనల్ని సమస్య నుండి బైట పడేసిన ఆపద్భాంధవుని అభిమానం జీవితాంతం గుర్తుండే అందం కదూ! అటువంటి వారి సౌజన్యం, మానవత్వం గుబాళించే పరిమళం అజరామరమైన అందం కదా! మన మనస్సులో త్యాగమూర్తులుగా మిగిలిపోయిన మన తల్లితండ్రుల, గురువుల స్థానం మన మదిలో ఎంత అందమైనదో! పవిత్రమైనదో! మన ఊరి చెట్టూ, చేమా, గోదారీ, మనింటి వీధి అరుగులూ, వాకిలీ, కూర్చునే సీడీలూ, గవ్వలాడుకునే వసారాలూ ఎంత అందమైనవో?

దూర కాలాల నుండీ మన వెంట వస్తూ ఉన్న ప్రాణ స్నేహితుల, అనుంగు మిత్రుల పట్ల మనకుండే అనురాగం కూడా అందమైనదే. స్నేహ సుగంధం వెదజల్లే అమూల్య మిత్రులుగా మన మనస్సులో వారి స్థానం ఉంది తప్ప వారి బాహ్య సౌందర్యం మన మనసులో ముద్రించబడలేదు. వారి సుహృత్ భావనలు మన మనసుల్లో నిత్యం గుబాళించే మధురిమలే. తళ తళా మెరిసే వారి ఆత్మసౌందర్యం ముందు వారి శరీరపు మెరుపులు నిలబడలేవు. వారి ప్రేమతత్వం, వాత్సల్యం, అభిమానం, ఆసరా మనపై చూపే గౌరవాభిమానాలు మనకు అందమైన వెన్నెల చల్లదనాన్నిస్తాయి.

తీరుగా చేసే పనిలో ఎంత అందం ఉంటుందో? ఒక చెట్టునో, కొమ్మనో, కుదురుగా తయారయ్యి పూచిన పువ్వునో చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు. దేవుడు నేనున్నానని రుజువులు మనకి చూపించలేక లేకపోవచ్చు గాక. ఈ పుష్పాలని చేసిన వాడు మాత్రం దేవుడే అనిపిస్తుంది. ఎవరి తలపులు మనకి అందమైన జ్ఞాపకాల్నీ, వైభవాన్నీ, గుర్తు చేస్తాయో వాళ్లంతా అందగాళ్ళేగా? ఏ పరిసరాలు మన హృదయాలలో కళ్ళకు కట్టినట్టున్నట్టు గుర్తు వస్తూ సదా ఆనందపు తుంపర్లు మనలో జల్లుతాయో ఆ పరిసరాలు అందమైనవి కాక మరేమిటి?

చూడగానే అందంగా కనబడి ఆ తర్వాత ఆ మనుషుల ప్రవర్తన బాగోకపోతే ఒక్కసారి వాళ్ళ అందమంతా ఆవిరైపోయి వాళ్ళు అందంగా లేరనేస్తాం. చక్కని మానవసంబంధాలతో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళెంతో అందంగా కనబడతారు. వాళ్ళ అందం మనసుది. అది సుగంధంలా వారి చుట్టూ అలుముకుని ఉంటుంది. అసలైన అందం అదే. వ్యక్తిత్వం ద్వారా వచ్చే ఆ అందమే స్థిరమైనది. అంతటి అందగాళ్లుగా అవ్వాలని మనమంతా ప్రయత్నించడం మంచిది కదూ. ఉదాత్త గుణమే అసలైన సౌందర్యం. అదొక అందమైన ప్రవాహం. సౌందర్య దృష్టి ఉన్నవాళ్లు ప్రాపంచిక సుఖదుఃఖాల కతీతంగా ఆనందం పొందగలుగుతారు. ఇతరులకు దాన్ని పంచగలుగుతారు.

కొందరు ఆడవాళ్లు ఇంటినెంత అందంగా తీర్చిదిద్దినట్టుగా పెట్టుకుంటారో! వాళ్ళు ఈ ఇంట్లోకి ఇప్పుడే దిగి సర్దుకున్నారేమో అన్నట్లుంటాయి వారి వస్తువులు. చిందర వందరగా ఇల్లంతా పుస్తకాలూ, వాటిల్లో నోట్స్ రాసిపెట్టిన చిన్న చిన్నకాగితాలూ, రెండు, మూడు రాసుకునే పాడ్‌లూ, చెత్తబుట్టలో చింపిన పేపర్ ముక్కలూ, ఓ పది పెన్నులూ, పెన్సిళ్ళూ ఇలా ఇల్లంతా చెత్త కుండీలా పెట్టుకునే మనలాంటి వాళ్ళకి అలాంటి ఇంటి అందం మరీ మరీ స్ఫూర్తిని కలిగించి మనల్ని కూడా కాస్త వళ్ళు వంచి సర్దుకునేలా చేస్తుంది.

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదన్నారు శ్రీశ్రీ. సౌందర్యం అంటే సత్యమే అన్నారు మా గురువు గారు. శారీరక సౌందర్యం చూడగానే వెంటనే ఆకర్షిస్తుంది. కానీ ఆత్మ సౌందర్యం ఆ మనిషిని చాలా కాలం గమనించాక అనుభవంలో కొస్తుంది. అది తరగని, వన్నె తగ్గని శాశ్వత నిధి. దాన్ని పంచుకునే వారంతా సంతోష పడతారు. కొందరికి అమృత హృదయం ఉంటుంది. అది సదా చిగురిస్తూ లతలుగా, తీవెలుగా సాగుతుంటుంది. అటువంటివారు తోటి వారినందరినీ ఆత్మీయంగా కలుపుకుంటూ ఆనంద నందనవనం తయారు చేస్తారు. ప్రేమనూ,స్నేహాన్నీ అక్షయంగా పంచుతూ ఉంటారు. వారుకదా అందరికన్నా అందమైనవారు! అటువంటి వారికివ్వాలి అందాల సుందరి అవార్డులు.

ఈ దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ తమ శారీరక అందం మీద ధ్యాస పెరిగిందట. గల్లీ గల్లీల్లో బ్యూటీ పార్లర్‌లు వెలిసాయి. వీధికో యోగా సెంటర్ ఉంటోంది. ప్లాస్టిక్ సర్జరీలూ, లైపోసక్షన్లూ, రైనో ప్లాస్టీలూ, తెల్లబడే క్రీములూ, జుట్టు స్టైల్స్ ఒకటేమిటి? వెయ్యివిధాల అందం పెంచే సాధనాలు. కోట్లలో వాణిజ్యం. వాటితో పాటుగానే తోటి మానవులపై సానుభూతి, సహానుభూతి ఉండడం, వారి కష్టంలో పాలు పంచుకోవడం చేస్తూ ఒక చక్కని మానవీయ దృక్పథం ఏర్పరచుకునే దిశలో అందరూ అందాన్ని పెంచుకునే ట్రైనింగ్ కేంద్రాలు కూడా ఉంటే ఎంత బావుంటుంది!

ఈ అందం ఒకోసారి మన మనస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు అన్నీ అందంగా కనబడతాయి. మనసు బాగా లేనప్పుడు అందం గుర్తించలేం. మనకు గౌరవం ఉన్న వ్యక్తిలో అతని గొప్పతనం ముందుగా కనబడి అతని శారీరక అందం వెనక్కి పోతుంది. ఉత్తమ వ్యక్తిత్వం గలవారి వ్యక్తిత్వపు అందం చెక్కుచెదరనిది. కాలాతీతమైనది. కాలేజీ రోజుల్లో మనల్ని ప్రేమించి అభిమానించిన వారిని గుర్తుపెట్టుకుంటాం కానీ కాలేజీ బ్యూటీని కాదుకదా. అందాలపోటీలో ప్రపంచ సుందరిగా ఎన్నికైన పిల్ల ఫోటో చూసి “అబ్బా! ఈ పిల్ల కన్నా మన పక్కింటి పిల్ల వెయ్యిరెట్లు బావుంటుందే” అని ముక్కు విరుస్తాం. అందాల పోటీలో పాల్గొన్న అమ్మాయిల శరీర భాగాల కొలతలను బట్టి మార్కులు వేస్తారట. ఆ పై ఇంటర్వ్యూ లో బట్టీ కొట్టిన దేశసేవా దృక్పథపు చిలకపలుకులు (అందాల పోటీ ట్రైనింగ్‌లో నేర్పించినవి) అప్పగిస్తారు, మనస్సులో యాడ్ ఏజెన్సీల, సినిమా ప్రొడ్యూసర్ల కోసం ఎదురుచూస్తూ. కొలతలదేముంది? ముక్కులకీ, పెదాలకీ, పలువరసలకీ దిద్దుళ్ళుంటాయి. మరంచేత ఏటా గెలుస్తున్న మిస్ యూనివర్స్‌లనీ, మిస్ వరల్డ్‌లనీ చూసి మేం చచ్చినా ఒప్పుకోం అంటూ మనం జుట్టుపీక్కుని గుండెలు బాదుకోనక్కర్లేదు. ఆ అందాల లెక్కలే వేరు మరి.

శరీర లావణ్యం కన్నా ఆత్మవిశ్వాసం అందం. అందంగా తయారవడం అనేది టెంపరరీ. నిశ్చలమైన, నిజమైన అందం కావాలంటే ఉన్నత వ్యక్తిత్వం ఏర్పరచుకోవడం కన్నా మార్గాంతరం లేదు. ఎటువంటి అందగాళ్లున్నారీ లోకంలో? వెతికి పట్టుకునే పూనిక మనకి ఉండాలి గానీ. వారిని తలచినంత మాత్రానే రోజు పవిత్రమయ్యేంత ఉన్నతులున్నారు. ఎక్కడో అడవిలో పుట్టి ప్రపంచమంతా వారి పేరు చెప్పుకునేంతగా లోకం కోసం శ్రమ పడి, తమ జీవితాల్ని త్యాగం చేసిన మహామహులున్నారు. అలాంటి లోకోపకారపు అందమైన మనసున్న వారినందరినీ తలచుకుంటూ మన వంతు మంచి మనం చేస్తూ అందమైన మనసులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. నిలువెల్లా ప్రేముడితో నిండిపోయి, చెలిమి దారంతో అందరినీ బంధిస్తూ సాగిపోయే అందమైన మార్గంలో కలిసి నడుద్దాం. ఇవండీ అందాల యొక్క చందాలు. బావున్నాయా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here