[dropcap]టై[/dropcap]ముకు ఆఫీసుకు చేరానన్న సంతోషంతో తన సీటు దగ్గరకు వచ్చింది లీల. తాళాలతో టేబుల్ డ్రా ఓపెన్ చేస్తూ ఓ పదిహేను నిముషాల తరువాత పని మొదలుపెట్టవచ్చు. ఇంకా ఎవరూ రాలేదు. ఈ లోగా ఓ కప్పు టీ తాగుదామా అనుకుంటూ తమకు రెగ్యులర్‌గా టీ తీసుకువచ్చే బాయ్‌కి ఫోన్ చేయడానికి సెల్ బయటకు తీసింది. పారడైజ్ సెంటర్ లోని ఆఫీసు అది. అందులోనే హైయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది లీల.
ఇంతలో సెల్ ఆమె చేతిలోనే మొగింది. అది కరుణ నుంచి వస్తున్న ఫోన్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకుంది లీల.
“ఏంటి తల్లి ట్రాఫిక్ జామ్‌లో ఉన్నావు. ఆఫీసుకు రావడం ఇవాళ కూడా లేట్ అవుతుంది. అంతేగా లేదా ఈ రోజు మరేదన్నా కొత్త బహానా నా” అంది లీల నవ్వుతూ.
“లీలా..” అంటూ ఏడుపు అందుకుంది కరుణ.
“అయ్యో ఏం జరిగింది కరుణా. ఏడుస్తున్నావ్ ఎందుకు?” లీల గొంతులో ఆదుర్దా.
“అమ్మ మనల్ని వదిలేసి వెళ్లిపోయిందే” వెక్కిళ్ల మధ్య చెప్పింది కరుణ.
“అదేంటి. ఎప్పుడు ఎలా” కుర్చీలోనుండి లేస్తూ గట్టిగా అరచినట్లు అడిగింది లీల. పక్క సీట్లో అప్పటికే వచ్చి కూర్చున్న ఆనంద్, ఆఫీసులో అప్పుడే పని మొదలుపెట్టబోతున్నవారు కూడా ఆమె గొంతు విని అటు వైపు చూస్తున్నారు.
“రోజూ ప్రొద్దున నాలుగు గంటలకే లేస్తుంది కదా. ఇవాళ ఆరయినా ఇంకా లేవలేదని వెళ్లి కదిపాను. అప్పటికే బాడీ చల్లబడిపోయింది. అయినా ఆశ చావక ఈయనని డాక్టర్ దగ్గరకు పంపాను. ఆయన వచ్చి చనిపోయిందని డిక్లేర్ చేసారు. మాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పారు. డెత్ సర్టిఫికేట్ రాసిచ్చి వెళ్లారు. ఇప్పుడే అందరికీ ఫోన్లు చేస్తున్నాను” ఏడుస్తూనే చెప్పుకుపోతుంది కరుణ.
“నేను లీవు పెట్టి వచ్చేస్తానే” అంటున్న లీలతో. “వద్దే, ఈయన అన్నీ చూసుకుంటున్నారు. అక్క కూడా వచ్చింది. బావగారూ ఇక్కడే ఉన్నారు. ఇవాళ సాయంత్రమే అన్నీ చేసేయాలని నిర్ణయించుకున్నాం. నాకు ఒక్క సహాయం చేసి పెట్టు. తార్నాకలో ఉన్న మావయ్యను తీసుకుని మధ్యాహ్నానికి ఇక్కడకు రాగలవా. ఆయనను తీసుకురావడం ఇప్పుడు మాకు ఇబ్బంది. ఆయన ఒక్కరూ రాలేరు. ఆయనను విక్రమ్ ఇక్కడకు తీసుకు రాడు. నేను విక్రమ్ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నాను. నా ఫోన్ అని చూసి ఎత్తట్లేదేమో అని అనుమానం. అమ్మకు మిగిలి ఉన్న ఒక్క తమ్ముడు ఈ సందర్భంలో లేకపోతే అమ్మ ఆత్మ శాంతించదు. ఆయనను నువ్వే తీసుకురాగలవు. ఈ పని చేయగలవా ప్లీజ్. రాం కూడా నీకు ఈ విషయం చెప్పమన్నారు” అంది బాధతో.
“తప్పకుండానే. అలా అయితే రఘువీర్ సర్ రాగానే సంగతి చెప్పి ముందు అంకుల్ దగ్గరకు వెళతాను. అయినా ముందు విక్రమ్‌తో మాట్లాడతాను. నువ్వేం ఫీల్ అవకు” అని ఫోన్ పెట్టేసింది లీల.
కుర్చీలో కూలబడిపోయింది. ఆదుర్దాగా చూస్తున్న కొలీగ్స్‌తో “కరుణాస్ మదర్ ఎక్పైర్డ్ ఇన్ ది అర్లీ అవర్స్. ప్యూనరల్ ఇన్ ది ఈవినింగ్” అని చెప్పింది.
అందరూ అయ్యో ఎలా జరిగింది అంటూ సానుభూతి చూపించారు. లీల, కరుణల స్నేహం గురించి తెలిసిన ఆనంద్ “రఘువీర్ సార్ రాగానే చెబుతాను లీలా. మీరు వెళ్లండి. మాకు ఫోన్ లో అప్డేట్ చేస్తూ ఉండండి. ఫ్యూనరల్ టైం లోగా ఆఫీస్ స్టాప్ గ్రూప్స్‌గా వస్తాం”. అన్నాడు.
“థాంక్స్ ఆనంద్, కాని దాని కన్న ముందుగా ఆంటీ బ్రదర్ ఇంటికి ఫోన్ చేయాలి” అంటూ ఫోన్ తీసుకుంది లీల. విక్రమ్‌కి ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతుంది కాని విక్రమ్ లిప్ట్ చేయలేదు.
కరుణ కుటుంబంతో లీలకున్న స్నేహం తెలిసిన ఆనంద్ మౌనంగా టీ ఆర్డర్ చేసాడు. ఆఫీసులోకి వచ్చిన బాయ్‌తో లీలకు టీ ఇప్పించి “ముందు ఇది తాగండి. తరువాత ఫోన్ చేయవచ్చు. నేనేమన్నా చేయగలననుకుంటే నన్ను అడగండీ.” అంటూ ఎదురుగా ఏదో పాలసి విషయంగా వచ్చిన వ్యక్తి వైపుకు తిరిగాడు. అతనిచ్చిన డాక్యుమెంట్లు తీసుకుంటూ ప్యూన్‌తో రఘువీర్ సార్ రాగానే తనకు చెప్పమన్నాడు.
ప్రొద్దున్నే వచ్చిన ఈ వార్తతో ఆఫీసులో విషాదం అలుముకుంది. సుమతి ఆంటీతో పెద్దగా ఎవరికీ పరిచయం లేదు కాని తమ స్టాప్ కరుణ మదర్ మరణించారు అన్న వార్త అందరికీ చేరింది.
లీల విక్రమ్‌కి ఫోన్ చేసింది. విక్రమ్ డిగ్రీలో ఆమె క్లాస్‌సేట్. చాల క్లోజ్ కూడా. అతని తండ్రి రాఘవరావుతో ఆమెకు చిన్నతనం నుండే పరిచయం. ఆయన ఫిజిక్స్ టీచర్ అని తెలిసి ఇంటర్‌లో ఫిజిక్స్ చెప్పించుకోవడానికి ఆయన దగ్గరకు వెళ్ళేది. కరుణ ఆఫీసులో హయ్యర్ గ్రేడ్ అసిస్టేంట్‌గా హబ్సిగుడా బ్రాంచ్ నుండి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చి తన పక్క సీటులోకి చేరడంతో లీలకు ఆమెతో మంచి స్నేహం కుదిరింది. నాలుగు సంవత్సరాలుగా అది వీరి రెండు కుటుంబాలు కలిసిపోయేటంతగా గట్టిపడింది. కరుణ ఆ ఆఫీసులో జాయిన్ అయిన కొత్తలో ఆమెను కలవడానికి విక్రమ్ వచ్చాడు. పక్కకు వెళ్లి గుసగుసగా ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూసిన లీలకు మొదట విషయం అర్థం కాలేదు. ఆమెకు విక్రమ్ అతని భార్య రమ ఇద్దరూ బాగా తెలుసు. విక్రమ్‌తో కరుణకు ఏం పరిచయం అబ్బా అని అనుకుంటున్న సమయంలో వాళ్లనే చూస్తున్న లీలపై దృష్టి పడి విక్రమ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. లీలను కాలేజీ తరువాత అతను కలిసి అప్పటికే చాలా కాలం అయింది. ఆమె ఈ సంస్థలో పని చేస్తుందని తెలుసు కాని ఏ బ్రాంచో అతనికి తెలీదు. ఇక తప్పక ఆమె దగ్గరకు వచ్చి పలకరించి కరుణ తన మేనత్త కూతురని, పని మీద ఆమెతో మాట్లాడటనికి వచ్చానని చెప్పాడు.
విక్రమ్ వెళ్ళిపోయిన తరువాత కరుణ చెప్పిన సంగతులతో లీలకు విషయం అర్థం అయింది. లీల తల్లి సుమతి ఆంటీ విక్రమ్ తండ్రి రాఘవరావు అక్కా తమ్ముళ్లు. ఈ రెండు కుటుంబాలకు మెట్టుగుడలో సుమతి ఆంటీ తండ్రి తరుపున వచ్చిన ఓ ఇల్లు విషయంగా కొన్ని గొడవలున్నాయి. సుమతి ఆంటీ నాన్నగారు ఆ ఇంటిని అక్క తమ్ముళ్లకు సమానంగా రాసారు. పాతదైన ఆ ఇంటిని అమ్మాలని విక్రమ్ అతని అక్క ప్రయత్నించిన ప్రతిసారి సుమతి ఆంటీ దానికి అడ్డుపడడం వలన ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలుండేవి. ఆ ఇంటిపై సుమతి ఆంటీ కున్న పట్టుదల కరుణకు ఆమె అక్క రాధకు అర్థం అయ్యేది కాదు. అది అమ్మి అందరం తలా కొంత తీసుకుందాం, అంత పాత ఇల్లు అసలు మనకు ఎందుకు. దాని కోసం ఈ గొడవ ఎందుకు అని ఆమెతో అనేక సందర్భాలలో అనేవాళ్లు. ఏ విషయాన్ని పట్టించుకోని సుమతి ఆంటీ ఆ ఇంటిని మాత్రం అమ్మడం కుదరదని భీష్మించుకుని కూర్చుంది. దానిపై పదివేల దాకా అద్దెవచ్చేది. లక్షలలో సంపాదింస్తున్న పిల్లలకు ఆ పది వేలలో చెరి సగాన్ని ఈ అక్కా తమ్ముళ్లు తీసుకోవడం అసహ్యం అనిపించేది.
విక్రమ్ బిజినెస్ సమయంలోనూ అతని అక్క ఫారిన్ వెళ్ళే సమయంలోనూ వారికి కొంత లోన్ తీసుకోవలసి వచ్చినా కరుణ, రాధలు ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నించినా సుమతి ఆంటీ ఆ పాత ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదు. దానిపై వచ్చే అద్దె బాంకులో ప్రతి నెల జమ అవుతూనే ఉంది. విక్రమ్ తల్లి కొన్నేళ్ళ క్రితం మరణించాక అతనికి వ్యాపారంలో ఏవో ఇబ్బందులెదురయ్యాయి. ఆ ఇల్లు అమ్మితే తనకు కొంత అప్పు తీరుతుందని చెప్పాడు. అతనిపై భార్య రమ ఒత్తిడి ఎక్కువుండేది. కాని సుమతి ఆంటీ మాత్రం ఇల్లు అమ్మేదే లేదని భీష్మించుకుని కూర్చుంది. అప్పుడు ఆమెతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు వాళ్లు. రాఘవరావు అంకుల్‌కి మాత్రం అక్క అంటే ప్రేమ. అక్క తనను చిన్నతనంలో పెంచిందన్న అభిమానం. ఆమె కన్నా పది సంవత్సరాలు చిన్నవాడవడంతో ఆమెని ఏమీ అనలేకపోయేవారు. తన చదువు, ఉద్యోగాల కోసం లేటుగా వివాహం చేసుకున్న అక్క అంటే ఆయనకు ఇష్టం కూడా.
సుమతి అంటీకి డబ్బుపై పెద్ద మోజు ఉండేది కాదు. భర్త పెళ్ళయిన అయిదు సంవత్సరాలకే చనిపోతే కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం తీసుకుని తన పిల్లల్ని పెంచింది. పెద్ద అమ్మాయి రాధ ఎస్.బి.ఐ.లో ఆఫీసర్. ఆమె భర్త రవి కుమార్ రైల్వేలో అకౌంట్స్ సెక్షన్లో మంచి పోస్ట్‌లో ఉన్నాడు. ఇక లీల ఈ సంస్థలో పని చేస్తుంది. ఆమె భర్త శ్రీరాం ఇక్రిసాట్‌లో సైంటిస్ట్. అయినా ఆ ఇంటి విషయంగా మాత్రం సుమతి ఆంటీ పట్టు వదలలేదు. ఆ ఇంటి మీద వచ్చే అద్దెలో తమ్ముడి సగభాగం ప్రతి నెల బాంకులో వేస్తుంది. దీన్ని విక్రమ్ ఎన్నో సార్లు వ్యంగ్యంగా ఎత్తి పొడిచేవాడు. ఆ చిల్లర పెంకుల అవసరం మా నాన్నకు లేదు అంటూ ఆమె ముందే ఎన్నో సార్లు అనేవాడు. కాని ఆమె చిరునవ్వు నవ్వేదే తప్ప బదులు పలికేది కాదు. ఆ మిగిలిన సగ భాగాన్ని తాను తీసుకుని తనకొచ్చే పెన్షన్‌తో ఆమె తన ఖర్చులు జరుపుకునేది అని కరుణ చెప్పేది. పిల్లల పెళ్లిళ్లు అయ్యేక, వారికి పిల్లలు పుట్టేదాకా రెండు గదుల అద్దె ఇంట్లోనే ఆమె ఉండేది. గత రెండు సంవత్సరాలుగా కరుణ భర్త శ్రీరాం పోరి ఆమెను తమ వద్దకు తీసుకుని వచ్చాడు. ఆయనకు తల్లి తండ్రి ఇద్దరూ లేరు. రాధకు అత్తగారు మామగార్ల బాధ్యత ఉంది. కరుణకు పెద్ద దిక్కుగా ఎవరూ లేరని, పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఎంతో బ్రతిమాలితే ఆమె వీరి ఇంటికి వచ్చింది. దీనికి కరుణ కన్నా ఆమె భర్త తీసుకున్న చొరవ ఎక్కువ. అప్పటి నుండి ఆ ఇంటి మీద వచ్చే అద్దె భాగం అంటే ఐదు వేలు అల్లుడికి ఇచ్చివారి ఇంట్లో ఉండేది ఆంటీ. దానికి కరుణ విక్రమ్ కొన్ని సార్లు ఒకరితో ఒకరు చెప్పుకుని నవ్వుకునే వారు కూడా. ఆ పదివేలలో చెరి ఐదు పంచుకుని ఆ అక్కా తమ్ముళ్లు మనకు మేడలు మిగిలించి వెళతారురే అని హాస్యం ఆడేవారు. విక్రమ్‌కి ఎంత ప్రెషర్ పెట్టినా ఆ ఇల్లు అమ్మడానికి అడ్డుపడుతున్న మేనత్తంటే చాలా కసి. అందుకని ఆమెతో పూర్తి సంబంధాన్ని తెంచుకున్నాడు. కరుణ భర్త కలుపుగోలుతనం వలన వీరితో మాట కలుపుతాడు కాని స్వతహాగా సుమతి ఆంటీ అంటే మాత్రం అతనికి చాలా కోపం.
రెండో సారి విక్రమ్‌కి ఫోన్ చేసింది లీల. అతని ఫోన్ ఎత్తలేదు. బహుశా డ్రైవింగ్‌లో ఉన్నాడేమో అనుకుంటూ కాల్ ఇమ్మీడియెట్లీ అని వాట్స్అప్ మెసేజ్ పెట్టింది. కరుణ బేగంపేటలో ఉంటుంది. లీల ఉండేది అమీర్‌పేటలో. ఆఫీసుకు రావడానికి ఆమె కరుణ ఇంటి మీదుగా రావాలి. అందువలన చాలా సార్లు కరుణను తన కారులో ఎక్కించుకుని ఆఫీసుకు తీసుకువస్తూ ఉండేది లీల. మళ్లీ సాయంత్రం ఆమెని డ్రాప్ చేయడనికి వెళ్ళేటప్పుడు సుమతి ఆంటీతో పరిచయం అయింది తనకు. ఆమెలో ఏదో ఓ విలక్షణత కనిపించేది లీలకు. పుస్తకాలు బాగా చదివే అలవాటున్న లీలకు సుమతి ఆంటీ కూడా విపరీతంగా చదువుతారని తెలిసిన తరువాత ఆమె పట్ల ఓ ఆత్మీయ భావం కలిగింది. ఆ వయసున్న ఇతర స్త్రీల కన్నా ఈమె భిన్నం అని ఆమెకు అనిపిస్తూ ఉండేది. కరుణ మాత్రం అమ్మకు పెద్ద సెంటిమెంట్లు లేవు. ఆమె ఏదో లోకంలో ఉంటుంది. మనకు అర్థం కాదు, అనవసర విషయాలకు పట్టుదలలకు పోతూ ఉంటుంది. ఎవరినీ లెక్క చేయదు లాంటి మాటలు చెబుతూ ఉంటుంది.
కరుణ కొంచెం డాంబికంగా బ్రతకాలనుకునే రకం. ఓ చీర కొనుక్కోవాలన్నా దాని ద్వారా తన హోదా ప్రకటించుకోవాలనుకుంటూ ఉంటుంది. పెద్ద పెద్ద బార్డరులున్న చీరలు, మాచింగ్ నగలు పెట్టుకోవడం ఆమెకు ఇష్టం. భర్తతో లోన్ తీయించి పెద్ద ఇల్లు కట్టుకుంది కూడా. అందులో ప్రతి ఒకటీ రిచ్‌గా ఉండేలా జాగ్రత్త పడింది. పొరపాటున కూడా అటో ఎక్కాలన్నా ఆమెకు ఇష్టం ఉండదు. పిల్లలను కూడా పెద్ద స్కూల్‌లో చేర్పించింది. ఇంగ్లీషు భాష వాళ్ల ఇంట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో సుమతి ఆంటీ, కరుణ భర్త శ్రీరాం ఇద్దరే కొంచెం విరుద్దంగా కనిపిస్తారు. ఎక్కువగా మాట్లాడకపోయినా రాంకి సుమతి ఆంటీ అంటే చాలా ఇష్టం అని అర్థం అవుతూ ఉంటుంది చూసేవాళ్లకు. ఆమెకు పెద్ద పని లేకుండా ఆయన వంట మనిషిని, పని మనిషిని పెట్టారు కూడా.
కరుణ అక్క రాధ ఆ ఇంటికి వచ్చిన ప్రతి సారి లక్క బంగారంలా కలిసిపోయిన ఆ రెండు అక్క చెల్లెళ్ళ కుటుంబాలను చూసి, లీల ఎంతో సంతోషించేది. ఎన్నో సార్లు “ఆంటీ యూ ఆర్ వెరీ లక్కీ” అని సుమతి ఆంటీతో అంటుండేది. దానికి ఆమె ఓ చిరునవ్వు నవ్వేది. అంత గొప్పగా సెటిల్ అయిన పిల్లల మధ్య ఆమె ఎంత గర్వంగా తిరగాలి. కాని ఎందుకో ఆ గర్వం ఆమెలో కనిపించేది కాదు. చాలా వాటి పట్ల ఓ నిర్లిప్తత ఆమెలో కనిపిస్తూ ఉండేది. లీల ఎన్నో సార్లు వారందరితో పండుగలను, పిక్నిక్ లను ఎంజాయ్ చేసింది. ఎప్పుడన్నా కరుణ ఇంట్లో లేకపోయినా ఆ ఇంటికి వెళ్లే చనువు ఆమెకు ఉండేది. ప్రతి సారి టీ అంటే లీలకు ఇష్టం అని ఆంటీ స్వయంగా టీ చేసి కప్పుతో ఎదురు వచ్చేది. తరువాత ఎన్నో పుస్తకాల పై చర్చలు సాగేవి. ఆంటికి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యం పై ఉన్న అవగాహన కొన్ని సార్లు లీలను ఆశ్చర్యానికి గురి చేసేది. కరుణతొ ఆ విషయం చెప్పబోయినా. “ఆ ఎప్పుడూ ఆ చదువే కదా. ఓ అచ్చటా లేదు ముచ్చట లేదు. ఆమె దగ్గర ఉన్న రోజులన్నీ ఆ చదువు గోలతోనే గడిచాయి తల్లి. ఇప్పుడేగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటుంది. నీకు తెలియదు కాని చదువు దగ్గర రాక్షసే తల్లి తను” అని మాట మళ్లించేది.
ఏమయినా తనకు శ్రీపాదను, రావిశాస్తిని ఒకేసారి పరిచయం చేసిన ఆంటీ, అయన్ రాండ్ ఆబ్జెక్టివిజం పై, నీషే ఫిలాసఫీ పై చాలా సేపు మాట్లాడగల ఆంటీ ఈ రోజు నుంచి లేరంటే లీలకు బాధగా అనిపించింది. ఎంత ఆలోచించినా సుమతి ఆంటీతో తాను చేసిన చర్చలు ఇప్పుడు మరో స్త్రీతో సాధ్యపడతాయా అనుకున్నప్పుడు ఆ స్థాయి ఉన్న ఏ స్త్రీ తనకు గుర్తు రావట్లేదు. సుమతి ఆంటీలో ఓ లోతు కనిపించేది లీలకు. తనెంతో ఎక్జయిట్మెంట్‌తో కుటుంబ ప్రేమల గురించి, స్నేహాల గురించి ప్రస్తావించినప్పుడు చిరునవ్వుతో వినేది తప్ప ఎప్పుడూ కాంట్రడిక్ట్ చేసేది కాదు.
చిన్నప్పటి నుండి ఎంతో ప్రొటెక్టివ్‌గా పెరిగిన లీల తల్లి తండ్రులకు ఒక్కతే కూతురు. కోరినది చదువుకుంది. కోరిన ఉద్యోగం తెచ్చుకోగలిగింది. ఆమె భర్త సాగర్ ఓ పెద్ద సాప్ట్‌వేర్ కంపేనీ ఓనర్. పిల్లలిద్దరూ మిడిల్ స్కూలుకు వచ్చారు. ఏ సమస్య లేని లీల జీవితంలో కొన్ని సార్లు తనకు తోడబుట్టీన వారు లేరే అన్న భావం మాత్రం అప్పుడప్పుడు కలుగుతూ ఉండేది. ఏర్‌ఫోర్స్ లో ఆఫీసర్ అయిన తండ్రితో ఇండియా మొత్తం తిరగుతూ ఓ స్థాయి జీవితాన్ని ఆమె ఎంజాయ్ చేసింది. పెద్దగా బంధువులెవరూ లేరు ఆమెకు. తమకు తెలిసిన స్నేహితుల కుటుంబంలోకే కోడలిగా వెళ్ళడం వలన, లీల జీవితంలో చెప్పుకునే సమస్యలు లేవనే చెప్పాలి. ఇప్పటికి ఏది అడిగినా నిముషాలలో ఆమెకు అమిరిపోతుంది. స్ట్రగుల్ తెలియ కుండానే ముప్పై అయిదు సంవత్సరాలు గడిపేసింది లీల. కరుణతో స్నేహంలో ఓ సోదరి భావాన్ని ఆమె అనుభవిస్తూ ఉంటుంది. అందుకే సుమతి ఆంటీ చనిపోయారంటే మనసంతా వెలితిగా అనిపిస్తూ ఉంది.
సెల్ రింగ్ అయింది. ఆదుర్దాగా అందుకుంది లీల. విక్రమ్ చేస్తున్నాడు. “హలో” అంది కాస్త గట్టిగా.
“ఏంటి లీలా సంథింగ్ సీరియస్” అడిగాడు విక్రమ్.
“హాయ్ విక్రమ్. ఓ బాడ్ న్యూస్. సుమతి ఆంటీ రాత్రి చనిపోయారు. కరుణ నీ కోసం ట్రై చేస్తుంటే నువ్వు దొరకలేదు. ఇవాళ సాయంత్రమే ఫ్యూనరల్” అంది లీల.
అటు పక్క ఓ రెండు క్షణాలు మౌనం
“హలో.. హలో.. విక్రమ్ ఆర్ యూ దేర్” అంది లీల
“యెస్ అయమ్ హియర్” అన్నాడు విక్రమ్. “నేను కోదాడలో రమ ఇంటికి వచ్చాను లీల. ఇప్పుడే తిరిగి రాలేను. కొన్ని బిజినెస్ గొడవలతో అంకుల్ హెల్ప్ కోసం వచ్చాను. అయినా మా కోసం ఆగవలసిన అవసరం లేదు కదా”. అన్నాడు విక్రమ్.
“విక్రమ్. అంకుల్ హాస్ టూ బీ దేర్. ఆయన సొంత అక్క ఆమె. చివరి సారి ఆమెను చూడాలని ఆయన అనుకోవచ్చు కదా” అంది లీల.
“ఆయనకు ఆస్తమా ప్రాబ్లం ఉందని తెలుసు కదా. ముగ్గురు పని వాళ్లున్నారు ఇంట్లో. వారికి ఈయనను జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి ఇలా వచ్చాం. ఇప్పుడు ఆయనకి ఈ న్యూస్ చెప్పి ఎగ్జైయిట్‌మెంట్ ఇవ్వడం అవసరమా లీలా” అన్నాడు విక్రమ్.
మనసు చివుక్కుమంది లీలకు. అయినా విక్రమ్ మీద ఉన్న చనువుతో. “చూడు విక్రమ్ ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటి. సాగర్‌కి చెప్పి రమ్మంటాను. ఇద్దరం అంకుల్‌కు ఈ విషయం చెప్పి దగ్గర ఉండి కరుణ వాళ్లింటికి ఆయనను తీసుకు వెళతాము. మీరు వచ్చే దాకా మా దగ్గర అంకుల్ ఉంటారు. హీ ఈజ్ ఆల్వేస్ కంఫర్టబుల్ విత్ సాగర్. ప్లీజ్ హీ డీజర్వ్స్ ది లాస్ట్ సైట్ ఆఫ్ హర్” అంది లీల.
అటు పక్క విక్రమ్ మౌనం. “ఆర్ యూ ష్యూర్ దట్ యూ కేన్ మేనేజ్” తిరిగి అడిగాడు.
“నువ్వేం భయపడకు విక్రమ్. సాగర్ నేను జాగ్రత్తగా అంకుల్‌ని చూసుకుంటాం. సాగర్ ప్రెండ్ విల్సన్ పల్మనాలజిస్ట్. అంతా అయిపోయాక ఆయన హెల్ప్ కూడా తీసుకుని అంకుల్‌ని జాగ్రత్తగా తీసుకు వచ్చి ఇంట్లో దిగబెడతాం. అప్పటికి నువ్వు వచ్చేస్తావేమో కదా. ట్రస్ట్ మీ” అంది లీల.
“ఓకే లీల గో అహెడ్. నీ ఇష్టం. గివ్ మై కండోలెన్సెస్ టూ కరుణ అండ్ శ్రీరాం”. అంటూ ఫోన్ పెట్టేసాడు విక్రమ్.
వెంటనే సాగర్‌కు కాల్ చేసింది లీల. విషయం తెలిసిన వెంటనే సాగర్, “లీల నేను జూబ్లీ హిల్స్‌లో ఉన్నాను. ఒక పని చేయి, కారు తీసుకుని తర్నాక వెళ్ళిపో. అంకుల్‌కి ఈ విషయం స్లోగా చెప్పు. ఈ లోపు నేను నాగరాజ్‌తో నా కారులో వచ్చేస్తాను. ఇద్దరం అక్కడి నుండి అంకుల్‌ను తీసుకుని బేగంపేట్ వెళదాం”. అన్నాడు.
అఫీసులో లీవ్ విషయం చెప్పమని లీల తన కారు కీస్ తీసుకుని రాఘవరావు గారింటికి బయలుదేరింది. ట్రాఫిక్ దాటుకుని వెళ్ళడానికి అరగంట పట్టింది. ఆ సమయంలో వచ్చిన లీలను చూడగానే రాఘవరావు గారి మనసు కీడును శంకించింది. ఆయన పక్కన కూర్చుని లీల మెల్లిగా సుమతి ఆంటీ లేరన్న విషయాన్ని చెప్పింది. ఆయన కళ్లల్లో కన్నీటి పొర. “విక్రమ్‌కి చెప్పావా” అడిగారాయన. “చెప్పాను అంకుల్. ఆంటీ దగ్గరకు మిమ్మలను తీసుకు వెళ్ళాలని వచ్చాను” అంది లీల. కాసేపు మౌనంగా కళ్లు మూసుకుని కూర్చున్నారాయన. పని వానికి చెప్పి కొంచెం వేడి నీరు తెమ్మని చెప్పింది లీల. ఆయన టీ కాఫీలు తాగరు. ఆస్తమా కారణంగా రెండు గంటలకు ఓ సారి కొంచెం వేడి నీరు సిప్ చేస్తారంతే. వద్దని వారించారాయన. మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఓ చిన్న బాగ్ సర్ధుకుని వచ్చారు. “అంకుల్ కొంచేం సేపు కూర్చోండీ సాగర్ వస్తున్నారు” అంది హాలులో ఆయన్ని కూర్చోబెట్టింది లీల.
ఎటో చూస్తూ ఉన్న రాఘవరావు గారు “నేను చదువులో ముందుండేవాడిని కాని మనుష్యులను అంచనా వేయడంలో నాకు పెద్దగా తెలివితేటలు లేవు. అక్కే నన్ను కాపాడుకుంటూ వచ్చింది. యూనివర్సిటిలో చాలా త్వరగా నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాబ్ వచ్చినప్పుడు దూరపు చుట్టరికం గుర్తు చేస్తూ రత్న తండ్రి మా యింటికి వచ్చారు. అక్క వారిని పెద్దగా ఇష్టపడేది కాదు. కాని అసలు బంధువులంటూ ఎవరూ తెలియని నాకు రత్న ఆమె తరుపు కుటుంబీకుల పట్ల గొప్ప ఆకర్షణ కలిగింది. అందుకే పెద్దాయన మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటే ఏమీ ఆలోచించకుండా సరే అన్నాను. నేను మాట ఇచ్చానని అక్క మౌనంగా మా పెళ్లి జరిపించింది. ఆ తరువాత సంవత్సరానికి తన కన్నా వయసులో చాలా పెద్దవాడు, భార్య మరణించిన మా బావ అనారోగ్యం సంగతి తెలిసి కూడా పెళ్లి చేసుకుని దూరం వెళ్ళిపోయింది. అక్కకు నేను ఏమీ చేయలేకపోయాను కాని తన జీవితాన్ని ఆమే తీర్చిదిద్దుకుంది”.
“బావ చనిపోయిన తరువాత వచ్చిన ఉద్యోగం చేస్తూ ఆడపిల్లలిద్దరినీ తనే పెంచి పోషించింది. రత్న ఓ రకంగా అక్కను దూరంగానే ఉంచింది. ఆ డాబు దర్పంతోనే విక్రమ్, రాశిలు పెరిగారు. కాని అక్క ఏ రోజూ ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. ఆ పాత ఇల్లు దగ్గర మాత్రం పట్టుదల చూపేది. ఆ ఇంటితో మా బంధాన్ని నిలుపుకోవాలని తను ప్రయత్నిస్తున్నట్లు అనిపించేది నాకు. అయినా కొన్ని సార్లు అంత పట్టుదల అవసరమా అని కూడా అనుకునేవాడిని. ఆ ఇంటిపై వచ్చే ఐదువేలు బ్యాంకులో ఆమె వేసిన ప్రతి సారి రత్న, ఆమె పిల్లలు చాలా గేలి చేసేవారు. వాళ్లను ఏమీ అనలేక ఉక్రోషంతో ఆ ఇల్లు అమ్మేద్దాం అనే ఆలోచన నాకూ వచ్చేది. అక్క పడనిచ్చేది కాదు. దానితో ఆ కాస్త మాటలూ లేకుండా పోయాయి. అమ్మాయి అమెరికా వెళ్లిపోయింది. రత్న చనిపోయింది. ఆమె ఉన్నంత వరకు నా పరిస్థితి కొంత బాగుగా ఉండేది కాని, ఆమె చనిపోయిన తరువాత పూర్తిగా కోడలి అధీనంలోకి కుటుంబం వెళ్లిపోయింది. నాదనేదేదీ లేకుండా మిగిలిపోయాను నేను. నా పెన్షన్ కూడా ఏవో లోన్లకు వెళ్ళేలా అడ్జెస్ట్ చేసాడు విక్రమ్. నా వాళ్ళకి ఏమన్నా ఇద్దామన్నా చేతిలో డబ్బు ఆడని స్థితి నాది. నా పేరు మీద చాలా ప్రాపర్టీలు ఉన్నాయి. కాని నౌకర్లకు ఏదన్నా ఇద్దామన్నా పర్సనల్‌గా నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నీకు తెలుసా లీలా అప్పుడు అర్థం అయింది అక్క ఆ చిన్న మొత్తాన్ని ఇన్ని సంవత్సరాలుగా నా కోసం బ్యాంకులో ఎందుకు వేస్తూ వచ్చిందో. మొన్న రాజు ఊరికి వెళుతున్నాను సర్ అని అడిగినప్పుడు అతని పిల్లలకి ఇద్దామన్నా నా దగ్గర కాష్ లేదు. రత్న ఉన్నప్పుడు ఆమెను అడిగి ఇచ్చేవాడిని. కోడలిని అడగడానికి మొహమాటం అడ్డు వచ్చింది. అప్పుడు మొదటి సారి ఆ అకౌంట్ నుండి కార్డుపై నాలుగు వేలు డ్రా చేసుకుంటున్నప్పుడు అక్క చాలా గుర్తుకు వచ్చింది. అక్క ఏదీ ఏ కారణం లేకుండా చెయ్యదు. ఆమెను మేమే అర్థం చేసుకోలేదు. అప్పటి నుండి తనను కలవాలని అనుకుంటూనే ఉన్నా. ఫోన్ చేద్దామన్నా ఎక్కడ తన గొంతు వినగానే ఏడ్చేస్తానేమో, ఇంట్లో వాళ్లు గమనిస్తారేమో అని భయం. నిన్నటి నుండి తను బాగా గుర్తుకు వస్తుంది. ఈలోగా ఇది” అంటూ లీలను పట్టుకుని వల వల ఏడ్చేసారు రాఘవరావు గారు.
లీలకు ఎలా స్పందించాలో తెలియదు. ఇంత ఆస్తిపరులకు, పదుల సంఖ్యలో ప్రాపర్టీలు ఉన్న రాఘవరావు గారికి కూడా డబ్బు ఇబ్బందులా. ఆశ్చరపోయింది లీల. ఆమెకు కొంత అర్థం అయీ అవనట్లు ఉంది పరిస్థితి. ఈ లోపు సాగర్ వచ్చేసాడు. సెల్ప్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వెళ్లిన సాగర్ ఏదైనా అవసరం రావచ్చని కంపెనీ డ్రైవర్ నాగరజుని వెంటబెట్టుకుని వచ్చాడు. వస్తూనే రాఘవరావుగారిపై మృదువుగా చేయి వేస్తూ “వెళ్దామా సార్” అంటూ సున్నితంగా అతన్ని పట్టుకున్నాడు. సాగర్‌కి ఇలాంటీ సిట్యుఏషన్లు మేనేజ్ చేయడం బాగా వచ్చు. అతను పక్కనుంటే లీలకు ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. నౌకర్లకు చెప్పి, వారిని ఇల్లు జాగ్రత్తగా చూసుకొమ్మని ఏదయినా అవసరమయితే తనకు ఫోన్ చేయమని తన నంబర్ కూడా ఇచ్చి సాగర్ రాఘవరావుగారిని కారు ఎక్కించారు. లీల వచ్చిన కారులో వెనుక నాగరాజు ఫాలో అవుతూ ఉంటే లీల సాగర్లు రాఘవరావు గారిని బేగంపేటలోని కరుణ ఇంటికి తీసుకువచ్చారు.
ప్రశాంతంగా చిన్న చుక్కలున్న నేత చీరలో ఐస్ బాక్స్‌లో నిద్రిస్తున్న అక్కను చూసి రాఘవరావు గారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. పెదాలు వణుకుతుండగా అక్కని అలా చూస్తూ ఉండిపోయారు. కరుణ రాధలు ఆంటీ పక్కన కూర్చుని ఉన్నారు. ఇద్దరి మొహాలు కూడా భావరహితంగా ఉన్నాయి. ఏదో అసహజంగా అనిపించింది అక్కడి వాతావరణం. రాధ భర్త బైట కూర్చుని ఉన్నారు. వారి స్నేహితులు తప్ప ఆంటీకి సంబంధించిన వారెవ్వరూ అక్కడ కనిపించట్లేదు. లీల తన స్టాప్‌ను గుర్తించింది. వారి వద్దకు వెళ్ళి కూర్చుంది. శ్రీరాం గంభీరంగా తమ పిల్లలు, రాధ పిల్లలను భోజనాలు చేయమని పురమాయిస్తున్నాడు. స్టాప్ కరుణతో ఓ రెండు నిముషాలు మాట్లాడి బైటకు వెళ్లిపోయారు. సాగర్ శ్రీరాంతో ఏదో మాట్లాడుతున్నాడు. గంభీరంగా కూర్చున్న కరుణను పిల్లలు ఏదో అడిగితే లోపలికి వెళ్లింది. లీల కూడా ఆమెను అనుసరిచింది.
లీలను చూడగానే కరుణ కళ్లల్లో నీళ్లు పొంగుకువచ్చాయి. ఆమెను దగ్గరకు తీసుకుంది లీల. “చూశావా లీల అమ్మ చనిపోయిన తరువాత అందరి నిజస్వరూపాలు తెలుస్తున్నాయి” అంది కోపంగా. ఏదో జరిగింది అనిపించింది కాని విషయం అర్థం కాలేదు లీలకు. అలాగే చూస్తూ ఉన్న లీలతో కరుణ “అమ్మ దగ్గర పెద్ద నగలంటూ ఏమీ లేవు. ఓ చిన్న గొలుసు, ఆ చేతికున్న గాజులే ఆమె కున్న బంగారం. ఆ గొలుసు రాధకు ఒక్కదానికే కూతురు కదా అని దానికి ఇచ్చేసింది. తన చేతి గాజులు మమ్మల్నిద్దరినీ తీసుకోమంది. కుడి చేతి గాజులు రాధ కని ఎడం చేతివి నాకని చెప్పింది. సరే అనుకున్నాం కాని ఇంతలో రాధ తన బుద్ధి బయట పెట్టేసింది చూశావా” అంది వెక్కుతూ.
అక్కడి నుండి ప్రశాంతంగా పడుకుని ఉన్న అంటీ ముఖం కనిపిస్తూనే ఉంది లీలకు. చేతులు కట్టుకుని పడుకున్నట్లున్న అమె రూపం చూస్తూ అమె చేతులపై దృష్టి నిలిపింది లీల. ఆంటీ చేతులకు ఎప్పటివో పాత గాజులు ఉన్నాయి. చెబితే తప్ప అవి బంగారంవి అని ఎవరికీ అనిపించవు. చాలా పల్చగా, పట్టుకుంటే ఇరిగిపోయేటంతగా ఆ చేతులకు అరిగిపోయి ఉన్న పాత గాజులు అవి.
పక్క గదిలో మాట్లాడుకుంటూన్న శబ్దం విని కావచ్చు రాధ లోపలికి వచ్చింది. కరుణను దగ్గరగా తీసుకుని మాట్లాడుతున్న లీలను చూసి “నువ్వు చెప్పు లీల అమ్మ నన్ను కుడి చేతి గాజులు తీసుకోమంది. కరుణకు ఎడం చేతి గాజులు ఇమ్మని చెప్పింది. కుడి చేతికి నాలుగు గాజులు, ఎడం చేతికి మూడు గాజులే ఉన్నాయి. ఒకటి అరిగి ఎక్కడో పోయి ఉంటుంది. అది నా తప్పా చెప్పు. ఇది మాత్రం కుడి చేతి గాజులు తాను తీసుకుంటానని, అమ్మ తన గొలుసు కూడా నా కూతురుకి ఇచ్చేసింది కాబట్టి ఆ నాలుగు గాజులు తనకు కావాలని పట్టుబడుతుంది. ఇదేమన్నా బావుందా చెప్పు” ఉక్రోషంగా అడిగింది రాధ.
బుర్ర గిర్రున తిరుగుతున్నట్లనిపించింది లీలకు. ఆంటీ ఇంకా గదిలోనే ఉన్నారు. ప్రాణం లేని శవమే అది కాని అది ఆంటీనే కదా. ఓ విరిగిపోయిన గాజు గురించి ఇప్పుడు చర్చా. పంపకాలను చర్చించే సమయమా ఇది. ఇంత పెద్ద ఉద్యోగాలలో ఉన్న కూతుర్లకు ఇప్పుడు గుర్తుకు వచ్చేవి అమ్మ గాజులా. ఆశ్చర్యంగా నిలబడిపోయింది లీల.
రాధ అన్నదానికి ఇంకా ఉక్రోషంతో “ఇన్నాళ్ళు అమ్మ ఉన్నది నా దగ్గరేగా. ఆమెను నువ్వు చూసుకోలేదుగా కనీసం అది నీకు గుర్తుకు రాలేదా” అంది కరుణ.
“అమ్మ ఏమీ ఫ్రీగా నీ దగ్గర ఉండలేదే. తన ఇంటి అద్దె ఐదు వేలు నీకే ఇచ్చిందిగా. పైగా తన అంతక్రియలకు కూడా డబ్బు తీసిపెట్టింది అని రాం ఇప్పుడే చెప్పాడు కదా” అంతే పదునుగా అంది రాధ.
ఇదంతా ఊహించాడేమో శ్రీరాం బైట నుండి “లీలా ఓ సారి ఇలా రండి. మీ ఆఫీసర్ వచ్చారు. మీరు పలకరిస్తే బావుంటుంది” అని లీలను గట్టిగా పిలిచాడు. బైటికి వచ్చిన లీల కళ్లలోకి లోతుగా చూస్తున్న శ్రీరాం కళ్లలో సన్నటి నీటి పొర, ఓ నిస్సహాయత మొదటి సారిగా కనిపించింది లీలకు. ఆనంద్, రఘువీర్ సార్లను పలకరించడానికి బైటికి నడిచింది. హాలులో సుమతి ఆంటీ శరీరం అంతే ప్రశాంతంగా నిద్రపోటున్నట్లు ఉంది. ఆమె పెదవులపై లీల ఎప్పుడూ చూసే చిరునవ్వు అలాగే నిలిచి ఉంది. ఆ చిరునవ్వులో “ఇంకా నీవు తెలుసుకోవలసినది చాలా ఉంది అమ్మాయ్” అన్న భావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది లీలకు. ఆంటీ తల వద్ద తల దించుకుని కళ్లు మూసుకుని రాఘవరావు అంకుల్ కూర్చుని ఉన్నారు.
ఆంటీ ఓ సారి ఏదో విషయంలో వివరణ ఇస్తూ “A pure soul is a pure lie” అని చెప్పిన రోజు గుర్తుకు వచ్చింది లీలకు. అదే వాకిట్లో రెండు కుర్చీలు ఎదురెదురుగా వేసుకుని నీషె గురించి మాట్లాడుకుంటూ “అతనో పెస్సిమెస్ట్ అని తనకు అనిపిస్తూ ఉంది” అని ఆంటీతో తను అన్నప్పుడూ నీషే కోట్ చెబుతూ అదే చిరునవ్వుతో “వాస్తవం అంతే లీలా, అందమైన అబద్ధాల చుట్టూ కనిపించేవే అందమైన జీవితాలు” అని ఆంటీ తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో చెప్పడం లీలకు ఇప్పుడు కన్నీళ్ళ మధ్య కనిపిస్తుంది. ఆ చిరునవ్వును గుర్తు తెచ్చుకుని మండిపడిపోయే విక్రమ్, కరుణ, రాధలను దాటుకుని ఆంటీ తనకు చాల దగ్గరగా వచ్చిన ఫీలింగ్ కలిగింది లీలకు. తన కొలీగ్స్‌ని పలకరించే బాధ్యతను నెరవేర్చడానికి వారి దగ్గరకు వెళుతున్న లీలకు కొన్ని వేల సంవత్సరాల జ్ఞానాన్ని ఒక్క రోజే సంపాదించి మౌనంలోకి జారుతున్న బరువైన ఫీలింగ్.