అందమైన జ్ఞాపకం

0
6

[dropcap]రై[/dropcap]లు రాజమండ్రి స్టేషనుకి చేరుకోగానే లగేజ్ సర్దుకుని దిగడానికి డోరు దగ్గరకి వచ్చి నిలబడ్డాను.

“హలో! ఐయామ్ సూరిబాబు! మీరు ప్రసన్నే కదూ?” చెయ్యి అందిస్తూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.

వయసు నాకన్నా ఏడెనిమిదేళ్లు ఎక్కువుండొచ్చు. ఇరవై ఆరు, ఇరవై ఏడు ఉంటుందేమో…

జీన్స్ మీద ఆరెంజ్ కలర్ టీషర్ట్… ఒంటికి పట్టినట్టుగా ఉంది. ఓపెన్ చేసి ఉన్న బటన్స్ మధ్యనుండి మెరుస్తూ పులిగోరు కనపడుతోంది. రేబాన్ గ్లాసెస్… ఒత్తుగా పైకి దువ్విన క్రాఫు.

“నన్నెలా పోల్చుకున్నారు?” అతని వెనకే స్టేషను బయటకు దారితీస్తూ అడిగాను.

“అక్క మీ గురించి అంతా చెప్పింది. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు… ఏజ్ ఎంత ఉంటుందో… అన్ని గుర్తులూ చెప్పింది. రిజెర్వేషన్ కోచ్ మీదున్న చార్టు చూస్తుంటే, డోరు దగ్గర ఎవరికోసమో వెదుకుతున్నట్టు చూస్తూ మీరు కనిపించారు. పోల్చుకోవడం పెద్ద కష్టం కాలేదు” నవ్వుతూ పార్కింగ్ లో పెట్టిన ‘యమహ’ తీసి, ఎక్కమన్నట్టు సైగ చేసాడు.

సీటు మీద ఇబ్బంది పడుతూ కూర్చున్న నా ముఖాన్ని వ్యూ మిర్రర్ లో చూసి, తను నవ్వడం గమనించి మొహం తిప్పుకున్నాను.

“నేనుండేది ఇన్నీసుపేటలో… నాన్నగారు తణుకు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్… అమ్మా, నాన్నగారు నిడదవోలులో మకాం వుంటారు” దారిపొడుగునా ఏవేవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు.

గేటు తీసుకుని ఇంటి ఆవరణలోకి అడుగుపెడుతుంటే రంగు రంగుల పూల మొక్కలు స్వాగతం చెప్పినట్టు అనిపించింది. మేడ మీద తను అద్దెకుంటున్న రూమ్ తాళం తీసి, లోనికి రమ్మంటూ కర్టెను పక్కకి జరిపాడు.

“మీరు బ్యాచిలరా?” ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనుమానంగా అడిగాను.

“అవును. మీకిక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు… ముందు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడే వస్తాను” చెప్పి బయటకు వెళ్లినవాడు అరగంట తర్వాత చేతిలో ఇడ్లీ, సాంబారు ప్యాకెట్లతో ప్రత్యక్షమయ్యాడు.

“మీ అమ్మమ్మా, మా అమ్మమ్మా మేనత్త మేనమామ బిడ్డలు. నేను వరసకి మీకు మావయ్య అవుతాను” తింటూనే చెబుతున్నాడు.

“అమ్మ అన్నీ చెప్పింది… నాకు రాజమండ్రీలో ఎవరూ పరిచయం లేదు. నాన్నగారు ఆఫీసు పనిమీద పూణే వెళ్లారు. అమ్మమ్మకి పక్షవాతం… మంచం మీదనే ఉండడంతో అమ్మకి రావడానికి అవ్వక ఈ పెళ్లికి నన్ను వెళ్ళిరమ్మంది” లేచి చెయ్యి కడుక్కున్నాను.

“పర్వాలేదే! జీన్స్‌లో వస్తారనుకున్నాను… చుడీదార్లో కనిపించారు. పెళ్లికి నేనూ వస్తున్నాను. ఈ రోజంతా మీకు కంపెనీ ఉంటాను” ఓ కంట నన్ను పరిశీలిస్తూనే, పెళ్లికి తయారవమన్నట్టు గుర్తు చేసాడు.

చీరలు కట్టడం కొత్త. కొంచెం ఇబ్బందిగా అనిపించినా తప్పలేదు.

“బయల్దేరదామా?” అంటూ రూమ్ తాళం వేసాడు సూరిబాబు. జాంపేటలో ఉన్న కళ్యాణ మండపానికి వెళ్తూ మధ్య దారిలో ఒక జిమ్ దగ్గర ఆపాడు.

“ఈ జిమ్ నాదే. ఇక్కడ ముగ్గురు ఇన్‌స్ట్రక్టర్లు, ఒక యోగా మాస్టర్ ఉన్నారు” చెబుతూనే… “ఈమె మా అక్కయ్య గారి అమ్మాయి, ప్రసన్న” అంటూ ఒక్కొక్కరినీ నాకు పరిచయం చేశాడు.

కండలు తిరిగిన అతన్ని చూడగానే అనుకున్నాను జిమ్ బాడీ అని… కానీ ఏకంగా జిమ్మే నడుపుతున్నాడనుకోలేదు.

***

రాత్రి పదకొండూ యాభై మూడు నిముషాలకి ముహూర్తం. మధ్యాహ్నం భోజనాలయ్యాక కళ్యాణమండపంలో అందరూ రిలాక్స్ అవుతున్నారు.

“ఏంటీ? బోర్ కొడుతోందా?” కుర్చీ నాకు దగ్గరగా జరుపుకుంటూ అడిగాడు సూరిబాబు.

“అదేం లేదు. ఇక్కడ నాకు పెద్దగా ఎవరూ పరిచయం లేరు కదా. కొంచెం లోన్లీగా అనిపిస్తోంది” మెల్లగా చెప్పాను.

“పద! మా ఊరు చూపిస్తాను” చనువుగా అంటూ, నా సమాధానం కోసం చూడకుండా బయల్దేరదీసాడు.

సీతంపేట కోటి లింగాల రేవు దగ్గరకి తీసుకొచ్చి బండి ఆపాడు.

వెన్నెల వెలుగుల్లో… గోదావరి గల గలలు… గుళ్లో హారతి గంటలు మ్రోగుతుంటే, మనసుకి ఎంత హాయిగా అనిపించిందో చెప్పలేను.

కోటిలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నాక, రేవులో మెట్లమీద ఒక అరగంటసేపు కూచుని, వెన్నెల్లో గోదారిని చూస్తూ గడిపాo.

దూరంగా రోడ్డు కం రైలు బ్రిడ్జి పై వెళుతున్న రైలు ప్రతిబింబం, కింద మెరుస్తున్న గోదావరి నీటిలో… అద్భుతంగా ఉందా దృశ్యం.

పిల్లగాలికి కదులుతున్న నీటి అలలపై తేలుతున్న పున్నమి చంద్రుడి లేత కిరణాల స్పర్శకి మనసు పులకించింది.

ఆ చల్లని వాతావరణంలో సూరిబాబు చెప్పడం మొదలు పెట్టాడు.

తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించీ, తను ప్రేమిస్తున్న పద్మలత గురించీ, అన్ని విషయాలూ నాతో పంచుకున్నాడు. చక్కని స్నేహితుడిలా అనిపించాడు ఆ క్షణం నాకు.

రాత్రి పెళ్లయ్యాక, కళ్యాణమండపం నుండి ఇద్దరం ఇంటికి వచ్చేసాం.

అలసిపోయానేమో… బాగా నిద్రపట్టేసింది.

గంధపు వాసనలు వెదజల్లుతూ, అగరుబత్తి వాసన గది నిండా వ్యాపిస్తుంటే మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను.

దేవుడి మందిరం ముందు కూర్చుని, గాయత్రి చేసుకుంటున్న సూరిబాబు, నా అడుగుల చప్పుడుకి తలెత్తి చూసాడు.

అయిదు నిముషాలు… అన్నట్టు సైగ చేసాడు.

వెండి తీగకి చుట్టిన స్పటిక పూసల దండ… మధ్యలో వేలాడుతున్న ఏకముఖి రుద్రాక్ష… అతని ఏకాగ్రతని మరింత పెంచాయి.

ఆరోజు రైల్వే స్టేషన్‌లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిస్తూ… జాగ్రత్త అన్నట్టు చెయ్యి వూపాడు.

ట్రైను కదలబోతుంటే ఏదో గుర్తొచ్చినవాడిలా పరుగెత్తుకెళ్లి, కోక్ బాటిలూ… బిస్కట్లూ కొని తెచ్చి, చేతిలో ఉంచాడు.

నవ్వుతూ బై చెప్పిన నేను… తర్వాత మరెప్పుడూ అతనిని కలవలేదు. కానీ వెన్నెల్లో గోదారిని చూడడం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఓ అందమైన జ్ఞాపకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here