అందమైన మనసు – 1

0
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]జ[/dropcap]నరల్ సర్జన్‌గా డాక్టర్ వినీల్‌కి మంచి పేరుంది. అతని వయసు ఇరవైఏడేళ్ళు. పేషంట్లను చాలా ఓపిగ్గా, ప్రేమగా చూస్తాడు. వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటాడు.

నవ్వుతూ మాట్లాడుతూ మందులు రాస్తాడు. అతనలా నవ్వుతూ మందులు రాస్తున్నప్పుడే వాళ్ళకి సగం వ్యాధి తగ్గినట్లవుతుంది. పైగా ఆ హాస్పిటల్ కూడా డాక్టర్ వినీల్ లాగే చాలా ప్రశాంతంగా వుంటుంది.

పేషంట్లు బయటకి వెళ్ళాక మెడికల్ షాపులో మందులు కొంటూ డాక్టర్‌ని పొగడటం వినీల్ తండ్రి హరనాథరావు అప్పుడప్పుడు వింటుంటాడు.

ఒక మంచి డాక్టర్‌గా తన కొడుకు అంత గొప్పగా ఎదగడం, పేషంట్ల రద్దీ పెరగడం చూస్తుంటే హరనాథరావుకి ఆనందంగా ఉంటుంది. నిజానికి ఆ హాస్పిటల్ కట్టించటమనేది ఆయన డ్రీమ్. వినీల్ ఎమ్మెస్ చేస్తున్నప్పుడే హాస్పిటల్ కట్టించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే స్థలం కొన్నాడు. డిస్టిక్ట్ & హెల్త్ ఆఫీసర్ దగ్గరకి వెళ్లి పర్మిషన్ తీసుకున్నాడు. వినీల్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే హాస్పిటల్ కట్టించాడు.

వినీల్ ఓపి అయ్యాక తన కారులో ఇంటికెళ్ళాడు.

ఇంటికెళ్ళగానే ప్రెషప్ అయి తన గదిలో కూర్చుని మెడికల్ జనరల్ బుక్ పట్టుకున్నాడు. నివేద కాఫీ తెచ్చి ఇచ్చింది. నివేద వినీల్ వాళ్ళ మేనత్త కూతురు. నివేదను చూడగానే అమ్మ గుర్తొచ్చింది వినీల్‌కి.

“అమ్మకి ఇంకా కాలు నొప్పి తగ్గలేదా నివేదా నువ్వొచ్చావ్? నేను హాస్పిటల్‌కి వెళ్ళే ముందు నొప్పి కాస్త తగ్గిందనే చెప్పింది. ఇప్పుడెలా వుంది?” అడిగాడు వినీల్.

“అత్తయ్య పడుకునే వుంది బావా! నువ్వు రాగానే కాఫీ ఇమ్మని చెప్పింది. నొప్పి ఇంకా తగ్గినట్లు లేదు. అందుకే నన్ను పంపింది పైకి” అంది నివేద.

“సరే కాఫీ కింద కొచ్చి తాగుతాను. ముందు అమ్మను చూడాలి” అంటూ గది లోంచి బయటకొచ్చి గబ గబ మెట్లు దిగాడు వినీల్.

అతని వెంట ఆమె కూడా మెట్లు దిగింది.

వాళ్ళను చూడగానే వినీల్ తల్లి సత్యవతి లేచి కూర్చుంది.

వినీల్ వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాడు.

“ఎలా వుందమ్మా?” అన్నాడు.

“నివేద బాగా కంగారు పడుతోంది వినీల్! ఉదయం నుండి నన్నే కనిపెట్టుకుని వుంది. నాకోసం కాలేజీకి కూడా వెళ్ళలేదు. తను లెక్చరర్‌గా కాలేజీలో జాయిన్ అయి గట్టిగా పది రోజులు కూడా కాలేదు. వద్దని ఎంత చెప్పినా వినలేదు. నువ్వైనా చెప్పు నాకేం కాదని” అంది నివేదవైపు మందలింపుగా చూస్తూ సత్యవతి.

వినీల్ నివేద వైపు చూసాడు.

“ఏం కాదు. తగ్గిపోతుంది. రేపటి నుండి కాలుకి ఫిజియోతెరఫి చేపిద్దాం. ఒక వారం రోజులు చేయిస్తే తగ్గిపోతుంది. ఆ తరువాత మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. నువ్వు రేపు కాలేజీకి వెళ్ళు” అన్నాడు వినీల్.

“అలాగే..” అంది నివేద.

వినీల్ సత్యవతితో మాట్లాడుతుంటే హరనాథరావు వచ్చాడు.

భార్యను పలకరిస్తూ కొడుకు పక్కన కూర్చున్నాడు

నివేద వెళ్ళి అందరికి కాఫీ తెచ్చింది.

వాళ్ళు కాఫీ తాగుతూ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటుంటే నివేద తన గదిలోకి వెళ్ళింది.

నివేద గదిలోకి వెళ్ళగానే అలేఖ్య ఫోన్ చేసింది.

అలేఖ్య, నివేద ఒకే కాలేజిలో బీటెక్ చేసారు. ఇద్దరు చాలా క్లోజ్‌గా వుంటారు. ఇద్దరిదీ ఒకే వయసు. ఇరవైమూడు. కాకపోతే అలేఖ్యకు పెళ్ళి అయింది. నివేదకు కాలేదు. అంతే తేడా.

నివేద వెంటనే కాల్ లిఫ్ట్ చేసి “చెప్పవే అలేఖ్యా” అంది.

“నాకీ హౌస్ వైఫ్ జాబ్ నచ్చట్లేదు వేదా! అస్సలు వర్కవుట్ కావట్లేదు. నేను కూడా నీలాగే జాబ్ చేస్తాను. మీ కాలేజీలో నాక్కూడాఏదైనా లెక్చరర్ పోస్ట్ వుంటే చూడు. వచ్చి జాయిన్ అవుతాను” అంది అలేఖ్య.

“ఏమైంది అలేఖ్యా? ఎందుకలా మాట్లాడుతున్నావ్? మల్లికార్జున్ ఏమైనా అన్నాడా?” అడిగింది నివేద అనుమానంగా. మల్లికార్జున్ అలేఖ్య భర్త.

“మల్లికార్జున్ ఏమంటాడు? ఏమీ అనడు. నేనేమైనా మాట్లాడితేగా అనటానికి. మల్లి అంటే నాకు చాలా భయం తెలుసా. అందుకే అతని ముందు నేనేం మాట్లాడను. ఏం మాట్లాడినా నీతోనే. కానీ నాకు అతను నచ్చటం లేదు “

“ఎందుకు నచ్చటం లేదు?”

“ఎందుకంటే ఏం చెప్పాలి? నేనేం కావాలని మనసులో అనుకుంటానో అవి తీసుకురాడు. ఏవేవో తెస్తాడు. అవి ఎవరిక్కావాలి? అవి కూడా వెంటనే తేడు. ఎప్పుడో తనకి వీలున్నప్పుడు, తను ఖాళీగా వున్నప్పుడు తెస్తాడు. అప్పుడెవరిక్కావాలి. నేనేమైనా వాటి కోసం ముఖం వాచి వున్నానా? నాకేం అవసరం లేదు. అస్సలు మల్లికి నేనంటే లెక్క లేదు. ఇంట్రెస్ట్ లేదు. నా వల్ల కాదు అతనితో” అంది అలేఖ్య.

నివేద మాట్లాడలేదు.

“ఏంటీ మాట్లాడవు?” అడిగింది అలేఖ్య.

“ఏం మాట్లాడాలి? నేనేం మాట్లాడినా ఈ విషయంలో నీకు నచ్చదు” అంది నివేద.

“అలా అని మాట్లాడవా?”

“అది కాదు అలేఖ్యా! అతనేదో బిజీగా వుండి నీకేం కావాలో తేలేక పోవచ్చు. ఈ రోజు కాకపోయినా రేపు తెస్తాడుగా. ఆ మాత్రం ఓపిక లేకుంటే ఎలా? నీకు నచ్చకపోవటం. నీ వల్ల కాకపోవటం ఏముంది ఇందులో” అంది.

“నువ్వు అతన్ని సమర్థించకు వేదా! అతను మారాలి. అతను మారితేనే నా మాటకు విలువ, ప్రాధాన్యత ఇస్తాడు. అప్పుడు నాకేం కావాలో అడిగి తెలుసుకుంటాడు. నేను ఏమడిగినా వెంటనే తెస్తాడు. లేకుంటే నా బ్రతుకంతా ఇలాగే వుంటుంది” అంది.

“సరే మార్చవే. నీ మాట నేనెందుకు కాదనాలి” అంది నివేద.

“నాకు మారతాడా?” అంది అలేఖ్య.

“నీకు మారడా? అంటే నా మొగుడ్ని నువ్వు మార్చు అని దానిక్కూడా ఇంకో మనిషినేమైనా పెడతావా” అంది నవ్వింది నివేద.

“నా బాధ నీకు నవ్వుగా వుందానే” అంటూ కోపంగా కాల్ కట్ చేసింది అలేఖ్య.

నివేద మొబైల్ పక్కన పెట్టి రేపు కాలేజీలో చెప్పబోయే లెసన్ గురించి చదువుకుంటూ కూర్చుంది.

మళ్ళీ కాల్ చేసింది అలేఖ్య.

నివేద లిఫ్ట్ చేసి “నవ్వానని కోపంగా ఫోన్ పెట్టేసావ్‌గా” అంది.

“నవ్వితే నవ్వావులే. రేపు నువ్వు నాకో హెల్ప్ చెయ్యాలి. అదైనా చేస్తావా?” అడిగింది అలేఖ్య.

“నేను చేసే హెల్ప్ ఏముంటుంది నీకు?”

“నువ్వలా అంటుంటే ఆశ్చర్యంగా వుంది వేదా! నిజంగానే పెళ్ళయ్యాక నేను, ఉద్యోగం వచ్చాక నువ్వు ఒకరితో ఒకరికి హెల్ప్ లేనంతగా మారామా? చెప్పు వేదా? నాకు అలా అనిపించట్లేదు. నీ అవసరం నాకు, నా అవసరం నీకు ఎప్పుడూ వుంటుందనే అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు నీ అవసరం వుంది నాకు. నువ్వు లేకుండా నేను ఈ పని చెయ్యలేను. ఈ పని చేస్తేనే మల్లికార్జున్ మారతాడు. నన్ను బాగా చూసుకుంటాడు. నేను ఉదయం నుండి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నువ్వు నాకీ హెల్ప్ చేస్తావా? నాకు తోడుగా వస్తావా?” అంది అలేఖ్య.

“ఎక్కడికి రావాలో చెప్పు వస్తాను. అంత నిష్ఠూరం దేనికి?”

“రేపు నీకు కాలేజ్‌లో క్లాస్ ఎన్ని గంటలకి వుంది?”

“ఒక క్లాస్ లేదు. లేట్ గానే వెళతాను కాలేజ్‌కి”

“అయితే ఎలాగూ ఒక క్లాస్ లేదు కాబట్టి ఆ టైంలో నా దగ్గరకి రా. మల్లికార్జున్ కూడా ఆ టైంలో వుండడు. ఇద్దరం కలిసి ఒక చోటుకు వెళదాం” అంది అలేఖ్య.

“ఏ చోటు?” అడిగింది నివేద అర్థం కాక.

“రేపు చెబుతాను” అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య.

మొబైల్‌తో ఇక పని లేనట్లు దిండు కిందకి నెట్టి బుక్ పట్టుకుంది నివేద.

***

తెల్లవారింది…

వినీల్ కారులో హాస్పిటల్ కి వెళ్ళాడు.

హరనాథరావు తన బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాడు.

సత్యవతికి ఫిజియోథెరఫీ చేసే అమ్మాయి వచ్చింది.

పనమ్మాయి సత్యవతి పనులు చూస్తూ ఆమె దగ్గరే వుంది.

నివేద కాలేజ్‌కి వెళుతున్నానని సత్యవతికి చెప్పి అలేఖ్య దగ్గరకి వెళ్ళింది.

అలేఖ్య నివేదను చూడగానే సంతోషంగా హగ్ చేసుకుంది.

తరువాత వదిలి “కూర్చో” అంది.

నివేద కూర్చోకుండానే “ఎక్కడికో వెళదామన్నావుగా ఇక వెళదామా? నువ్వు రెడీ యేనా?” అంది.

“రెడీ నే. వెళదాం. ముందు నువ్వీ స్కార్ఫ్‌తో నీ ముఖాన్ని కవర్ చేసుకో” అంటూ ఒక స్కార్ఫ్‌ను నివేదకు ఇచ్చి తను కూడా ఒక స్కార్ఫ్‌తో కళ్ళు మాత్రమే కనిపించేలా చుట్టుకుంది.

“స్కార్ఫెందుకే” అంటూనే స్కార్ఫ్ చుట్టుకుంది నివేద.

“ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళేది ఎవరికీ తెలియకూడదు” అంటూ డోర్ లాక్ చేసి బయటకు నడిచింది అలేఖ్య.

“అంత తెలియకూడని ప్లేసా మనం వెళ్ళేది?”

“అవును. మనం వెళ్ళేది ఎవరికీ తెలియకుండానే అక్కడకి వెళ్ళాలి. మన పని పూర్తి చేసుకుని అలాగే బయట పడాలి” అంది కళ్ళు, చేతులు హుషారుగా కదిలించి అలేఖ్య.

అలేఖ్య చామనచాయ రంగులో, ఎత్తుగా,బలంగా వుంటుంది. మాట్లాడాలంటే నాకు భయం అంటుంది కానీ అదంతా పైకే. గొంతు లేపిందంటే తట్టుకోవటం కష్టం ఎవరికైనా.

ఏ.ఎస్.పి కార్యాలయం రాగానే ఆగింది అలేఖ్య.

“ఇక్కడ ఆగావెందుకు?”

“మనం వెళ్ళేది ఇక్కడికే”

“ఇదేదో పోలీస్ స్టేషన్ లాగా వుంది. నేను రాను. ఇక్కడకి వచ్చినట్లు మా మామయ్యకు తెలిస్తే నన్ను చంపేస్తాడు” అంటూ అదిరిపడింది నివేద.

“ఎలా తెలుస్తుంది? అయినా దీన్ని పోలీస్ స్టేషన్ అనరు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో వున్నట్లు కేసులు, ఎఫైఆర్‌లు వుండవు. జస్ట్ మల్లికార్జున్ గురించి ఏ.ఎస్.పి గారితో మాట్లాడదాం. ఆయన మల్లికి భయం చెబుతారు. అయినా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని మనల్ని చూడటానికి. లోపలకి వెళ్ళి ఏ.ఎస్.పి గారితో మాట్లాడి వెంటనే వచ్చేద్దాం” అంది అలేఖ్య.

“ఇదంతా ఎందుకు. మల్లికార్జున్‌తో నీకంతగా ఇబ్బంది అనిపిస్తే మీ పేరెంట్స్‌తో చెప్పు. ఆ భయమేదో వాళ్ళే చెబుతారు” అంది నివేద.

“వాళ్ళు అలా చెప్పరు. మొత్తం సర్దేసుకుని వచ్చెయ్యమంటారు. వాళ్ళది సర్దుకుపోయే స్వభావం కాదు. నాకు మల్లిని వదిలి వెళ్ళాలని లేదు. అందుకే ఇలా వచ్చాను. నా సమస్యకు పరిష్కారం ఇక్కడే వుంది” అంది అలేఖ్య.

అలేఖ్యతో ఆర్గ్యూ చెయ్యకుండా ఆలోచించింది నివేద.

మామయ్య ముంబై వెళ్ళాడు. వినీల్ హాస్పిటల్లో ఉంటాడు. అత్తయ్య బయటకు రాలేదు. ఇక ఎవరున్నారు తనని చూడటానికి? ఉన్న ఒక్క ఫ్రెండ్ తనతోనే వుంది. లోపలకి వెళ్ళినా ఏం కాదు అని ఆ క్షణంలో ఆమె అంతవరకే ఆలోచించింది. లోపలకి వెళ్ళాక జరిగే పరిణామాలని ఊహించలేదు.

“సరే పద” అంటూ ధైర్యం చేసి అలేఖ్యతో లోపలకి వెళ్ళింది నివేద.

లోపల రైటర్ కూర్చుని వున్నాడు. అక్కడ చాలా నిశబ్దంగా వుంది.

“మేం సార్‌తో మాట్లాడాలి. లోపలకి వెళ్ళొచ్చా?” అడిగింది అలేఖ్య రైటర్ని.

“సార్ లోపల వేరేవాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు రాగానే పంపిస్తాను” అన్నాడు రైటర్.

వాళ్ళు కొద్ది సేపు వెయిట్ చెయ్యగానే లోపల వున్నవాళ్ళు బయటకు వచ్చారు.

“ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు” అన్నాడు రైటర్ అలేఖ్య వైపు చూసి.

వాళ్ళు వెళ్ళారు.

ఏ.ఎస్.పి సూర్యదేవ్ వాళ్ళను చూడగానే “కూర్చోండి” అన్నాడు.

వాళ్ళు కూర్చున్నారు.

“చెప్పండమ్మా ఏంటి ప్రాబ్లం?” అంటూ నివేద వైపు చూసాడు.

నిటారుగా కూర్చుని వున్న నివేద అందమైన శిల్పంలా కదిలి “ప్రాబ్లం నాది కాదు సర్ తనది” అంటూ తడబడి అలేఖ్య వైపు చూపించింది.

నివేద తడబడిన తీరుకి సూర్యదేవ్ చూపులు ఆమె మీద కొద్ది సేపు అలాగే నిలిచాయి. ఆ తరువాత అలేఖ్య వైపు చూసాడు.

అలేఖ్య ముందుగా తన గురించి చెప్పుకుని ఆ తరువాత మల్లికార్జున్ గురించి చెప్పటం మొదలు పెట్టింది.

ఆమె చెప్పేది వింటూ అప్పుడప్పుడు నివేదను కూడా గమనిస్తున్నాడు. నివేదకు అక్కడకి రావటం ఇష్టం లేదన్నది ఆమెను చూస్తుంటే అర్థమైంది సూర్యదేవ్‌కి.

అలేఖ్య మాటలు వింటుంటే ఇవి కూడా సమస్యలేనా అనిపిస్తాయి ఎవరికైనా. కానీ ఆమెలో కోపం, బాధ, అసంతృప్తి ఎక్కువగా వుంది.

సూర్యదేవ్ ఆమెనే చూస్తున్నాడు.

“ఇంట్లో నేనూ, ఆయన మాత్రమే వుంటాం సర్! నేను ఆరు గంటలకే నిద్ర లేస్తాను. ఇంటి పనులు అయ్యాక టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఈ పనులు చేస్తూనే కాఫీ కలుపుతాను. నాకేమో ఆయనతో కలిసి కాఫీ తాగాలని వుంటుంది. ఒక్కరోజు కూడా నాకా కోరిక తీరలేదు. టిఫిన్ తినాలని వుంటుంది. అదికూడా అంతే. కిచెన్‌లో నేను పని చేస్తున్నంత సేపు ఆయన కూడా నా పక్కన వుంటే బాగుండనిపిస్తుంది. వుండరు” అంది.

“ఎందుకుండరు? మీరు చెబితే వుంటారేమో. ఒకసారి చెప్పి చూడండి. చెప్పందే ఎలా తెలుస్తుంది ఏదైనా? భార్యతో ఎలా వుండాలి ? ఎలా అర్థం చేసుకోవాలి? అన్నది అతనికి తెలియొచ్చు, తెలియక పోవచ్చు” అన్నాడు సూర్యదేవ్.

“చాలా సార్లు చెప్పాను సర్! అయినా నువ్వు చెప్పే పనులేమీ నాకు చేతకావు. నన్ను పడుకోనివ్వు అంటారు. ఒక్క రోజు కూడా ఉదయాన్నే నాతోపాటు నిద్ర లేవరు. సరిగ్గా తొమ్మిదిన్నరకి నిద్ర లేచి పది గంటలకి ఆఫీస్ కి వెళతారు. రాత్రి పది గంటలకి వస్తాడు. రాగానే తిని ఫోన్ పట్టుకుంటారు.

కనీసం ఇంటికి వచ్చాక అయినా నాతో కొంచెం మాటాడతాడేమో అని ఉదయం నుండి నేను ఎదురు చూస్తూనే వుంటాను. ఆయన నేను అనుకున్నట్లేమీ నాతో వుండరు. నాకంటూ ఒక మనిషి తోడుగా ఇంట్లో వుండి కూడా లేనట్లుగానే వుంటోంది. ఆయనతో కలిసి పని చేసే ఆయన కొలీగ్స్ ఉదయాన్నే నిద్ర లేస్తారు. ఈ విషయం నేను మా ఇంట్లో చెబితే అంత బద్ధకస్తుడితో నువ్వేం చేస్తావ్ వచ్చెయ్యి అంటారు. అందుకే ఇంట్లో చెప్ప లేదు. మీకు చెబితే మీ భయంతో నైనా ఆయన మారొచ్చని మీదగ్గరకు వచ్చాను “ అంది అలేఖ్య చాలా ఎమోషనల్‌గా.

అయినా కూడా ఆ ఏ.ఎస్.పి గారు తన మాటల్ని పట్టించుకుంటున్నారో లేదో నన్న అనుమానం వచ్చింది అలేఖ్యకు. వెంటనే నివేద వైపు చూసింది.

నివేద టేబుల్ మీద వున్న సూర్యదేవ్ నేం ప్లేట్ వైపు చూస్తోంది.

“కావాలంటే ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ సర్! పేరు నివేద. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. తనని అడిగినా చెబుతుంది నేను పడే బాధలు” అంది అలేఖ్య.

ఇదేంటి ఇది నన్ను అడగమంటోంది? ఇప్పుడు నేను ఈ ఏ.ఎస్.పి గారితో మాట్లాడాలా? అనుకుంటూ లేడి పిల్లలాగా బెదిరినట్లు చూసింది నివేద. ఆమె అలా చూడకపోతే సూర్యదేవ్ నివేద వైపు చూసేవాడు కాదు. ఇప్పుడు స్పష్టంగా ఆమె భుజాలనుండి ముఖంలోకి చాలా నిశితంగా చూసాడు.

వెంటనే “అవసరం లేదు” అంటూ పిటీషన్ పై ఎండార్స్ చేసి సంబంధిత ఇన్‌స్పెక్టర్‌కి ఫోన్ చేసాడు సూర్యదేవ్.

ఫోన్ లోనే ఆ ఇన్‌స్పెక్టర్‌కి తగు సూచనలు ఇచ్చాడు.

ఆ పిటీషన్ని అలేఖ్యకు ఇచ్చి “మీరు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ని కలవండి! ఆయన మాట్లాడతారు. అప్పుడు కూడా మీ పని కాకపోతే మళ్ళీ వచ్చి నన్ను కలవండి. పర్వాలేదు. నేను మాట్లాడతాను. ఇది నా ఫోన్ నంబర్. ఏదైనా వుంటే నాకు ఫోన్ కూడా చెయ్యొచ్చు” అన్నాడు సూర్యదేవ్ ఫోన్ నెంబర్ ఇచ్చి.

సూర్యదేవ్ మాటలు చాలా సౌమ్యంగా వున్నాయి. మృదుగంభీరంగా వున్నాయి. కళ్ళార్పకుండా అతన్నే చూసింది నివేద.

అలేఖ్య సూర్యదేవ్‌కి నమస్తే చెప్పి పిటీషన్ తీసుకుని కుర్చీ లోంచి లేచింది. నివేద కూడా నమస్తే చెప్పి లేచింది.

ఇద్దరు ఆ గదిలోంచి బయటకొచ్చారు. అప్పుడే వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ని కలిశారు.

ఇన్‌స్పెక్టర్ వాళ్ళను చూడగానే చాలా మర్యాద చూపించాడు. ఏ.ఎస్.పి తరుపున వచ్చిన వాళ్ళను చూసినట్లు చూసాడు. వెంటనే మల్లికార్జున్‌కి ఫోన్ చేసాడు. మల్లికార్జున్ ఏమన్నాడో తెలియదు కానీ ఇన్‌స్పెక్టర్ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.

వాళ్ళ వైపు చూసి “ఇక మీరు వెళ్లొచ్చు” అన్నాడు.

నివేద అక్కడనుండి కాలేజీకి వెళ్ళింది. అలేఖ్య ఇంటికెళ్లింది.

ఆ రోజు రాత్రి ఏడు గంటలకు ఏ.ఎస్.పి సూర్యదేవ్, డాక్టర్ వినీల్ ఎప్పటిలాగే ఆఫీసర్స్ క్లబ్ లో కలుసుకున్నారు. షెటిల్ ఆడారు. ఆట మధ్యలో వినీల్ కి ఫోన్ వచ్చింది.

“ఎక్స్క్యూజ్ మీ” అంటూ పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చాడు వినీల్.

సూర్యదేవ్ వినీల్ వచ్చే వరకు అక్కడే కూర్చున్నాడు రిలాక్స్ గా.

“కాల్ చేసింది ఎవరో కాదు. నా ఫియాన్సీ డాక్టర్ సహస్ర సూర్యదేవ్! నేను ఎంత పనిలో వున్నా ఆమె కాల్‌ని లిఫ్ట్ చెయ్యకుండా వుండలేను. నాలో వుండే బలహీనత అదొక్కటే. రోజుకి ఒక్కసారైనా ఆమెతో మాట్లాడాలి. ఆమె ప్రాక్టీస్ గురించి నాకు, నా ప్రాక్టీస్ గురించి ఆమెకు చెప్పుకోనిదే వుండలేము. ఆమె మనసులాగే మాట కూడా చాలా మృదువుగా, అందంగా వుంటుంది” అన్నాడు వినీల్.

అందం అనగానే నివేద గుర్తొచ్చింది సూర్యదేవ్‌కి. తనలో తనే నవ్వుకున్నాడు.

“ఏంటి సూర్యదేవ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్” అంటూ సూర్యదేవ్‌కి ఎదురుగా కూర్చున్నాడు వినీల్.

“ఈ రోజు నా దగ్గరకి ఇద్దరమ్మాయిలు వచ్చారు వినీల్! ఆ ఇద్దరిలో ప్రాబ్లంతో వచ్చిన అమ్మాయి కాక ఇంకో అమ్మాయి చాలా అందంగా వుంది. నేనెప్పుడూ అంత అందమైన అమ్మాయిని అంత దగ్గరగా చూడలేదు. పాలు,తేనె కలిపి నట్లున్న చాయతో కళ్ళు అటు ఇటు తిప్పుతూ కొంచెం బెరుగ్గా ఎంత అమాయకంగా కూర్చుందో నా ఎదురుగా. మరచిపోలేకపోతున్నాను. నువ్వు నమ్ముతావో లేదో ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడింది కూడా ఇప్పుడే” అన్నాడు సూర్యదేవ్.

“నేను నమ్ముతాను సూర్యదేవ్. ఇదే అమ్మాయి నువ్వు సివిల్ సర్వీస్ రాయక ముందు కనపడి వుంటే ఇరవైరెండు ఏళ్లకే నువ్వు ఏ.ఎస్.పి అయ్యేవాడివి కాదు. ఇప్పుడు నీ వయసు ఇరవైనాలుగు. అంటే నాకన్నా చిన్నవాడివి. ఇలాంటివి నాకొంచెం ఎక్కువే తెలుసు అనుకోవాలి. ఆ అమ్మాయి నీకు కనిపించి అదృష్టవంతురాలైంది. నీకు మళ్ళీ ఆ అమ్మాయి కనిపించాలని కోరుకుంటున్నా” అంటూ నవ్వాడు.

“లేదు వినీల్! ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించే ఛాన్స్ లేదు” అన్నాడు సూర్యదేవ్.

వినీల్ మళ్ళీ షెటిల్ ఆడటం మొదలు పెట్టాడు. సూర్యదేవ్ రోజు కన్నా చాలా ఉత్సాహంగా ఆడుతుంటే వినీల్ ఆశ్చర్యపోయాడు.

***

రెండు రోజుల తరువాత అలేఖ్య ఫోన్ చేసి “ఎక్కడున్నావు నివేదా?” అంది.

“ఇంట్లోనే మా బావ గదిలో వున్నాను” అంటూ ఫోన్ పట్టుకుని గదిలోంచి బయటకొచ్చింది నివేద.

“మీ బావ గదిలో వున్నావా? అక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అడిగింది అలేఖ్య.

“అత్తయ్య మెట్లు ఎక్కకూడదు కదా. సర్వెంట్‌తో మా బావ గదిని శుభ్రం చేయిస్తూ వున్నా” అంది నివేద.

“ఏం నువ్వు లేకుంటే మీ సర్వెంట్ చెయ్యలేదా?”

“దాని మొహం అదేం చేస్తుంది. అక్కడ కొంచెం. అక్కడ కొంచెం చేస్తుంది. మిగతాది వదిలేస్తుంది. బావకు అలా వుంటే నచ్చదట. అత్తయ్య చెప్పింది. అత్తయ్య చెప్పింది నిజమే అలేఖ్యా! బావ గది ఈ ఇంట్లో అన్ని గదులు కన్నా స్పెషల్‌గా, నీట్‌గా వుంటుంది. ఆ గదిలోకి వెళితే బయటకు రావాలనిపించదు. అంత నీట్‌గా ఎలా పెట్టుకుంటాడో ఏమో. ఆ గది లాగే మా బావ కూడా నీట్ గానే వుంటాడనుకో” అంది నివేద.

“అంటే నువ్వా గదినే కాక మీ బావను కూడా ప్రేమిస్తున్నావా?” అల్లరిగా అడిగింది అలేఖ్య.

“నాకు లేనిపోని డవుట్స్ పెట్టకు. అసలే ఆ గది అన్నా, ఆ గదిలోంచి వచ్చే పరిమళం అన్నా నా ముక్కూ, కళ్ళు తెగ ఆరాటపడతాయి. ఇంకా మనసునెందుకు కెలుకుతావ్? ఇది సరిపోదనా?” అంది.

“ఎలా సరిపోతుంది? చేయి చాపితే అందేంత దూరంలో అంత మంచి డాక్టర్ వుంటే ఏ అమ్మాయి అయినా వదులుకుంటుందా? నువ్వెందుకు వదులుకోవాలి? గదిని ప్రేమించినట్లే అతన్ని కూడా ప్రేమించు. నీకేం తక్కువ?” అంది అలేఖ్య.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here