అందమైన మనసు-12

0
11

[ఇంటికి చేరిన నివేద తాను మావయ్యని తిట్టి వచ్చేసానని తల్లిదండ్రులకి, అన్నయ్యకి చెబుతుంది. వారు విస్తుపోతారు. తనకి ఇష్టం లేకపోయినా వినీల్‌తో పెళ్ళి చేయాలని చూస్తున్నారని అంటుంది. వినీల్‌తో పెళ్ళి అంటే మంచిదేగా అని అమ్మ, అన్న చైత్రన్ అంటారు. కానీ వినీల్ డా. సహస్ర అనే మరో అమ్మాయిని ప్రేమించాడని చెబుతుంది. సహస్ర నీ పెళ్ళికి అడ్డురాదనీ, వినీల్‌ని పెళ్ళి చేసుకోవాల్సిందే అని ఒత్తిడి చేసి గదిలో పెట్టి తాళం వేస్తాడు చైత్రన్. ఇంతలో నివేద నుంచి ఫోన్ రాలేదు, తాను చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని – సూర్యదేవ్ – అలేఖ్యకి ఫోన్ చేస్తాడు. అలేఖ్య నివేద అమ్మకి ఫోన్ చేసి వివరాలు కనుక్కుని సూర్యదేవ్‍కి అందిస్తుంది. సూర్యదేవ్ ఇద్దరు పోలీసులతో మఫ్టీలో నివేద ఇంటికి వెళతాడు. గది తాళం తీసి నివేదని బయటకు తీసుకురమ్మంటాడు. మాటల సందర్భంలో డా. సహస్ర కనబడకపోవటానికి కారణం చైత్రనేనని గ్రహిస్తాడు సూర్యదేవ్. – ఇక చదవండి.]

[dropcap]నా[/dropcap]గేశ్వరి, బ్రహ్మయ్య లోపలకి పరిగెత్తి “అమ్మా నివేదా! ఏమైందమ్మా!” అంటూ నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లారు.

సూర్యదేవ్ కంగారు పడ్డాడు.

చైత్రన్‌ని వదిలి నివేదకు దగ్గరగా వెళ్లాడు.

మోకాలి మీద కూర్చుని “వేదా! ఏమైంది?” అన్నాడు ఆతృతగా.

అతని గొంతులోని ఆతృతను, ఆర్ద్రతను నాగేశ్వరి గమనించింది. విస్తుపోయి అతన్నే చూసింది.

నివేద లేచింది.

ఇక్కడేదో జరిగేలా వుందని అక్కడ నుండి పారిపోవాలని ప్రయత్నించాడు చైత్రన్. గన్‌మెన్లు అతన్ని పట్టుకున్నారు. కుర్చీలో కూర్చోబెట్టారు. చేతి కందిన తాడు తీసుకుని ఆ తాడుతో చైత్రన్‌ని కుర్చీకి కట్టేసారు. అది చూసి బ్రహ్మయ్య, నాగేశ్వరి బాధతో కుమిలిపోయారు.

సూర్యదేవ్ వచ్చి చైత్రన్‌కి ఎదురుగా కూర్చున్నాడు. ఇంతసేపు సరిగా చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే సూర్యదేవ్ చైత్రన్ కళ్ళకి ఐరన్ రాడ్‌లా అనిపించాడు. సూర్యదేవ్ ఏమీ అడక్కముందే అతన్ని చూసి చైత్రన్ భయపడ్డాడు.

“నాకేం తెలియదు ఏ.ఎస్.పి. గారు! నన్ను విడిచిపెట్టండి” అన్నాడు.

“నీకు తెలియదంటే ఎవరు నమ్ముతార్రా? డాక్టర్ సహస్రను మర్డర్ చేసి దర్జాగా తిరుగుతున్నావా? అంత తమాషాగా వుందా మనిషిని చంపటం?” అన్నాడు సూర్యదేవ్.

“నేను చంపలేదు”

“మరెవరు చంపారో చెప్పు?”

“నాకు తెలియదు” అన్నాడు. ఏం చెబితే ఏమో అన్నట్లు వణికాడు.

బ్రహ్మయ్య అంతకన్నా వణుకుతున్నాడు.

“నా కొడుకును వదలండి సార్! వాడికేం తెలియదంటున్నాడుగా. వాడు మర్డర్ చెయ్యడు సార్! వాడొట్టి పిరికివాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను” అంటూ సూర్యదేవ్ కాళ్ళు పట్టుకోబోయాడు.

“నువ్వాగు పెద్దాయనా! నీ కొడుకు నువ్వనుకునేంత మామూలోడు కాదు. వీడి వెనక పెద్ద చరిత్రే వుంది. అదెలా బయట పెట్టించాలో మాకు తెలుసు” అంటూ గన్‌మెన్ల వైపు తిరిగి “వీడిని ముందు మన వెహికిల్ ఎక్కించండి. అక్కడ మన పద్ధతిలో అడిగితే చచ్చినట్టు చెబుతాడు. ఇక్కడ చెప్పడు” అంటూ గన్‌మెన్ల వైపు చూసాడు సూర్యదేవ్.

వాళ్ళు వెంటనే కట్లు విప్పి “పద వెళదాం” అన్నారు.

“నేను మీతో రాను” అన్నాడు చైత్రన్.

“వీడు మాటలతో చెబితే వినడు. మన పద్ధతిలోనే తీసుకుపోండి” అన్నాడు సీరియస్‌గా సూర్యదేవ్.

గన్‌మెన్లు వెంటనే చైత్రన్ రెక్క పట్టుకుని వెహికిల్ దగ్గరకి లాక్కెళ్లారు.

కొద్దిదూరం వెళ్ళగానే “వద్దు. నన్ను తీసికెళ్ళొదు. నువ్వైనా చెప్పు నివేదా నన్ను తీసికెళ్ళొద్దని” అంటూ ప్రాధేయపడ్డాడు.

“మరి నీకేం తెలుసో చెప్పు అన్నయ్యా! ఇంకా ఎందుకు దాస్తావు? ఏ.ఎస్.పి. గారు అన్నంత పని చేస్తాడు. నీకాయన సంగతి తెలియదు” అంది నివేద.

“చెబుతాను. ఇక్కడే చెబుతాను. నన్ను తీసికెళ్ళొద్దు. ప్లీజ్..” అన్నాడు.

గన్‌మెన్లు చైత్రన్‌ని వెనక్కి తీసుకొచ్చి ఏ.ఎస్.పి. గారి ముందు కూర్చోబెట్టారు.

చైత్రన్ చెబుతుంటే అందరు వింటున్నారు.

“నా ఎంబీఏ పూర్తయ్యాక జాబ్ సెర్చింగ్ టైంలో నాకు ప్రియాంక పరిచయం అయింది. ఇద్దరం బాగా దగ్గరయ్యాం. పెళ్లి చేసుకోవాలంటే మా ఇద్దరిలో ఒక్కరికి కూడా జాబ్ లేదు. జాబ్ వచ్చేవరకు పెళ్లి గురించి ఆలోచించకూడదనుకున్నాం. నేను జాబ్ లేకుండా సిటీలో వుండలేకపోయాను. నా దగ్గర డబ్బులేదు. నాన్న పంపనన్నాడు. నేను మా ఊరిలోనే ఖాళీగా వుండిపోయాను. ఒక రోజు మా సత్యవతి అత్తయ్యకు కాలు బాగలేదంటే అందరం చూడటానికి వెళ్ళాం. అప్పుడు వినీల్ నా గురించి అడిగాడు. నేను మనీ ప్రాబ్లం వల్ల సిటీకి వెళ్లకుండా వున్నానని తెలుసుకుని ‘నీకు డబ్బు పంపిస్తాను, సిటీకి వెళ్లి ఏమైనా కోర్సులు నేర్చుకో. ఖాళీగా వుండొద్దు’ అన్నాడు. ఆ రోజే నన్ను తన హాస్పిటల్‌కి తీసికెళ్ళాడు. నా కన్నా చిన్నవాడైన వినీల్ అంత పెద్ద హాస్పిటల్‌ని అంత సమర్థవంతంగా నడపడం అబ్బురమనిపించింది. అతనికి నా చెల్లెలు నివేదను ఇస్తే ఆ హాస్పిటల్‌పై నా ఆధిపత్యం నడుస్తుంది. చేతినిండా డబ్బు వుంటుంది. నేను కష్టపడకుండానే అనుభవించవచ్చు అనుకున్నాను.

వినీల్ ఇచ్చిన డబ్బు తీసుకుని ఆ రోజే సిటీకి వెళ్ళాను. హాస్టల్లో చేరాను. ప్రతి నెలా నాకు వినీల్ డబ్బు పంపిస్తూనే వున్నాడు. నేను అడగాల్సిన అవసరం కూడా రానివ్వటం లేదు.

ప్రియాంక వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో వుండి రోజూ నన్ను కలుస్తూనే వుంది.

ఒక రోజు అనుమానం వచ్చి ప్రియాంక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది. పాజిటివ్ అని రాగానే ఇద్దరం భయపడి పోయాం. ధైర్యం తెచ్చుకుని మాకు దగ్గరలో వుండే హాస్పిటల్‌కి వెళ్ళాం. అక్కడ డాక్టర్ సహస్రను కలిసాం.

ఆమె ప్రియాంకకు అబార్షన్ చెయ్యనన్నది. ఎంత సేపు రిక్వెస్ట్ చేసినా లాభం లేకపోయింది. అప్పుడే డాక్టర్ సహస్ర ఫోన్‌కి కాల్ వస్తుంటే స్క్రీన్ మీద వినీల్ ఫొటో కనిపించింది. ఆమె నా ముందే లిఫ్ట్ చేసి “నేను బిజీగా వున్నాను డాక్టర్ వినీల్! కాల్ యు లేటర్” అంటూ ఫోన్ టేబుల్ మీద పెట్టి పని మీద పక్కకెళ్లింది. వినీల్ ఫొటో ఆమె ఫోన్లో ఎందుకుందో అర్థం కాలేదు. క్యూరియాసిటీ పెరిగి వెంటనే ఆ మొబైల్ అందుకుని చూసాను. ప్రతి రోజూ వాళ్ళు చేసుకున్న చాటింగ్ కనిపించింది. అక్కడ చదివే టైం లేక ఆ చాటింగ్ మొత్తం నా ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆమె ఫోన్ అక్కడే పెట్టి ప్రియాంకను తీసుకుని హాస్పిటల్ లోంచి వెళ్ళిపోయాను” అంటూ ఆగాడు.

అందరు ఉత్కంఠతో వింటున్నారు.

“ఊఁ.. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు?” అన్నాడు సూర్యదేవ్.

“ఆ రాత్రికి నా మొబైల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న వాళ్ళ చాటింగ్‌ని చదివాను. వాళ్ళ రిలేషన్ అర్థమైంది. నా మనసు మండిపోయింది. నా ఆశలన్నీ ఉరి పోసుకున్నట్లనిపించింది. నా కళ్ళముందు హాస్పిటల్ తప్ప ఇంకేం లేదు. నా చెల్లెల్ని వినీల్ చేసుకుంటేనే నేను అనుకున్న విదంగా నేను బ్రతకగలను. అలా బ్రతకాలంటే డాక్టర్ సహస్ర మనసులోంచి వినీల్‌ని తప్పించాలి. అప్పుడే అది సాధ్యం అనుకున్నాను. తెల్లవారి ప్రియాంకను తీసుకుని డాక్టర్ సహస్రను కలిసాను. మమ్మల్ని చూడగానే ‘ఎన్నిసార్లు చెప్పాలి మీకు అబార్షన్ చెయ్యనని. ఎందుకొచ్చారు?’ అంటూ కోప్పడింది.

‘ప్లీజ్ మేడం! ఒకసారి నేను చెప్పేది వినండి. ఈ అమ్మాయి నిజానికి నా కజిన్ కాదు. మా మామయ్య కొడుకు డాక్టర్ వినీల్‌కి లవర్. ఇలా చేయించమని నన్ను రిక్వెస్ట్ చేసాడు. తన పేరు బయటకు రావద్దన్నాడు. ఇప్పుడు మీరు అబార్షన్ చెయ్యనంటుంటే తప్పనిసరై ఇదంతా చెబుతున్నాను’ అన్నాను.

అది వినగానే ‘నో.. డాక్టర్ వినీల్ అలాంటివాడు కాదు’ అంటూ అరిచింది డాక్టర్ సహస్ర.

‘మీరలా అరిస్తే నేను మిమ్మల్ని నమ్మించలేను మేడం! కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ అమ్మాయి కోసం ప్రతి నెలా నా అకౌంట్‌కి వినీల్ డబ్బు పంపిస్తుంటాడు. కావాలంటే చూడండి’ అంటూ నా బ్యాంకు పాస్ బుక్‌లో వుండే స్టేట్‌మెంట్ చూపించాను. ‘మీరు డాక్టర్స్ కాబట్టి ఒకవేళ మీకు మా వినీల్ తెలిస్తే నేనిలా మీకు చెప్పానని చెప్పకండి. నన్ను చంపేస్తాడు. ఈ పని రహస్యంగా చేయించటమే నా విధి. అయినా ఈ అమ్మాయిని వినీల్ పెళ్లి చేసుకోడు. అబార్షన్ చేయించి కొంత డబ్బు ఇచ్చి పంపించి వేయమన్నాడు. ఫ్యూచర్లో తనే ఈ అమ్మాయికి ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాడట’ అన్నాను. అది వినగానే డాక్టర్ సహస్రకు కళ్ళు తిరిగి టేబుల్‌పై పడుకుంది” అన్నాడు చైత్రన్.

“తరువాత ఏం జరిగింది?” అన్నాడు గట్టిగా, కోపంగా సూర్యదేవ్.

“కొద్దిసేపు అయ్యాక డాక్టర్ గారు లేచి లోపలకి వెళ్లారు. ఆమె సీట్లోకి వేరే డాక్టర్ వచ్చి కూర్చున్నారు. ఆమె నావైపు చాలా ఇంట్రెస్ట్‌గా చూసి ‘డాక్టర్ సహస్ర మీ కేస్ నన్ను చూడమన్నారు. రేపు ఉదయాన్నే రండి అబార్షన్ చేస్తాను’ అంది. ఆమె చెప్పినట్లే తెల్లవారి ప్రియాంకను తీసికెళ్ళాను. అబార్షన్ చేసింది. నేను చాలా సంతోషపడ్డాను. సహస్ర మేడం కనిపిస్తుందని చూసాను. కనిపించలేదు. ఆ డాక్టర్‌ని అడిగాను ‘సహస్ర మేడంని కలవాలి’ అని.. ‘డాక్టర్ సహస్ర లేరు. ఇవాళ ప్లైట్‌లో అరుణాచల్ వెళ్లారు. ఇక రారు. జాబ్‌కి రిజైన్ చేశారు’ అన్నారు. నేను అవాక్కయ్యాను. ప్రియాంకను తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్లిపోయాను. అదీ సర్ జరిగింది” అన్నాడు చైత్రన్.

సూర్యదేవ్ వెంటనే ఛైత్రన్ చెంప చెళ్ళు మనిపించాడు.

“వినీల్ జీవితంతో ఆడుకున్నావు కదరా! అన్నం పెట్టిన చేతిని కరవటమంటే ఇదే! నేను అరుణాచల్ వెళ్లి ఫోన్ చేసేవరకు నువ్వు ఇక్కడే వుండు. కాదని ఎటైనా వెళ్ళావో అరెస్ట్ చేస్తాను” అన్నాడు.

“వెళ్ళను సర్ ఇక్కడే వుంటాను” అన్నాడు చైత్రన్.

“వేదా! డాక్టర్ వినీల్ నా స్నేహితుడు. అతను సహస్రను ప్రేమించినట్లు నా ఒక్కడితోనే చెప్పాడు. ఇంట్లో చెప్పాలనుకునే లోపలే ఇదంతా జరిగిపోయింది” అన్నాడు.

నివేద అప్పటికే చాలా బాధ పడుతోంది. ఇది విని ఇంకా బాధ పడింది.

“నువ్వు నాతోరా వేదా! ఇద్దరం కలిసి వినీల్‌తో మాట్లాడదాం” అన్నాడు సూర్యదేవ్.

“అలాగే సర్! అమ్మా నేను బావతో మాట్లాడి వస్తాను” అంటూ సూర్యదేవ్‌తో వెళ్లి వెహికిల్ ఎక్కింది నివేద. వెహికిల్ కదిలింది.

నివేదకు తన అన్నయ్య డబ్బు కోసం అలా చేసాడని తెలిసినప్పటి నుండి సూర్యదేవ్ ముఖం లోకి చూడాలంటేనే సిగ్గుగా వుంది. బాధగా వుంది.

సూర్యదేవ్ అది గమనించి ‘బాధ పడొద్దు’ అన్నట్లుగా చూసాడు.

డాక్టర్ వినీల్‌కి ఫోన్ చేసాడు.

వినీల్ వెంటనే లిఫ్ట్ చేసి “చెప్పండి సూర్యదేవ్” అన్నాడు.

“నేను అర్జెంట్ గా మాట్లాడాలి వినీల్. హోటల్ రాధికాలో వుంటాను. అక్కడకి రండి” అన్నాడు సూర్యదేవ్.

“ఇప్పుడే వస్తాను సూర్యదేవ్” అంటూ ఫోన్ పెట్టేసి తన కారులో హోటల్ రాధికా దగ్గరకి వెళ్ళాడు వినీల్.

సూర్యదేవ్ పక్కన నివేదను చూసి ‘నివేద ఏంటి సూర్యదేవ్ పక్కన వుంది? సూర్యదేవ్‌కి నివేద ఎలా తెలుసు? అసలే నామీద కోపంగా వుంది. ఇప్పుడు సూర్యదేవ్‌తో నన్నేమైనా చేయిస్తుందా?’ వినీల్ మనసు నిండా ప్రశ్నలు తప్ప జవాబులు లేవు.

“కూర్చో వినీల్! ఏంటీ నివేద వైపు అలా చూస్తున్నావ్? నాకు నివేద ఎలా తెలుసు అనా? నాకు నివేద చాలా కాలంగా తెలుసు. కానీ నీ మరదలు అన్న విషయం ఈరోజే తెలిసింది” అన్నాడు.

వినీల్‌కి నవ్వు రాకపోయినా నవ్వి కూర్చున్నాడు. వాళ్ళ వైపు చూడలేక, చూడాలనిపించక మొబైల్ పట్టుకున్నాడు.

‘నన్నెందుకు రమ్మన్నారో ఇంకా చెప్పరేం’ అని మనసులో అనుకుంటున్నాడు వినీల్.

“డాక్టర్ సహస్ర గురించి మాట్లాడాలని పిలిచాను వినీల్” అన్నాడు సూర్యదేవ్.

“నాకు ఇష్టం లేదు సూర్యదేవ్, నేను వెళతాను” అంటూ లేవబోయాడు.

“నువ్వు వెళ్ళిపోతే చాలా నష్టపోతావ్ వినీల్, కూర్చో” అన్నాడు సూర్యదేవ్.

“ఇంకేముంది నష్టపోటానికి? ఆ సహస్ర వల్ల నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయింది. ఆ పేరు కూడా వినాలనిలేదు నాకు. ఆ జ్ఞాపకాలను వదిలేద్దామనే ఒకసారి మా పేరెంట్స్ పెళ్లి చేస్తామంటే ఒప్పుకున్నాను. నీతో చెప్పాను. పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్ల లైఫ్‌తో ఆడుకుంటావా? అన్నావ్. నిజమేననిపించింది. పెళ్లి వద్దనుకున్నాను. కానీ నివేద వెళ్ళిపోయినప్పుడు నా వల్లనే నివేదను ఎవరో కిడ్నాప్ చేసారని అమ్మ అన్నది. దాన్ని తట్టుకోలేకనే లేచిపోయిందన్నాను. అలా అనటం కరెక్ట్ కాదు. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటావా? అని నివేదను అడిగాను. అలా ఎందుకంటే అప్పుడైనా నాకు నివేద పట్ల మంచి అభిప్రాయం వుందని తెలుసుకుంటుంది. అయినా నామీద బాగా కక్ష పెట్టుకుంది. వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. నిజానికి నివేద మా ఇంట్లో వుండి చదువుకుని వుద్యోగం చేస్తున్నా ఆమె పట్ల నాకు పెళ్లి చేసుకోవాలన్న భావన ఎప్పుడూ రాలేదు. ఇక రాదు. నేను చేసిన ప్రతి తప్పుకి సహస్రనే కారణం. అందుకే అంటున్నా సహస్ర గురించి కాకుండా ఇంకేం మాట్లాడినా వింటాను” అన్నాడు.

“ఇప్పుడు సహస్ర గురించే మాట్లాడాలి వినీల్” అన్నాడు.

సడెన్‌గా లేచి ఎంట్రన్స్ వరకు వెళ్ళాడు వినీల్.

“ఆగు వినీల్! నిన్ను అరెస్ట్ చేసి అయినా సహస్ర గురించి చెబుతాను. నువ్వు నా ఫ్రెండ్‌వి. నీకు హెల్ప్ చెయ్యకుండా వుండలేను” అన్నాడు సూర్యదేవ్.

వినీల్ ఆగి వెనక్కి వచ్చి కూర్చున్నాడు.

“చెప్పండి సూర్యదేవ్” అన్నాడు వినీల్.

“మీ ఇంట్లో గొడవ పడి నివేద వాళ్ళ ఊరు వెళ్లిన విషయం నీకు తెలిసే వుంటుంది”

“తెలుసు అమ్మ చెప్పింది”

“ఊరు వెళ్ళాక నివేద అన్నయ్య చైత్రన్ నివేదను హౌస్ అరెస్ట్ చేసాడు”

“అవునా ఎందుకు? ఇది నాకు తెలియదు”

“నిన్ను పెళ్లి చేసుకోమంటే నివేద చేసుకోనన్నదట. అందుకు హౌస్ అరెస్ట్ చేసారు. నాకు ఈ విషయం అలేఖ్య ద్వారా తెలిసి వెంటనే నివేద వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ వాళ్ళ మాటల్లో చైత్రన్ నోటి వెంట డాక్టర్ సహస్ర గురించి విన్నాను. సహస్ర నీ నుండి విడిపోటానికి చైత్రన్ ఏదో చేశాడన్న అనుమానం వచ్చింది. ఎంత అడిగినా చెప్పలేదు. మా స్టైల్లో అడగ్గానే చెప్పాడు” అన్నాడు సూర్యదేవ్.

“ఏం చెప్పాడు సూర్యదేవ్? అయినా చైత్రన్ మా బావ. నా విషయంలో అతనేమీ చెయ్యడు” అన్నాడు వినీల్.

“చేస్తాడని నువ్వే కాదు. ఎవరూ అనుకోరు. కానీ చేసాడు. నీ మీద అసహ్యం కలిగేలా ఒక స్టోరీ క్రియేట్ చేసి సహస్రకు చెప్పాడు. ఆమె వెంటనే రిజైన్ చేసి అరుణాచల్ వెళ్లిపోయిందట” అన్నాడు సూర్యదేవ్.

“నా మీద స్టోరీ చెప్పాడా? నేను నమ్మను. చైత్రన్ బావకు నేనంటే గౌరవం, కృతజ్ఞత వున్నాయి” అన్నాడు వినీల్.

“అంతకు మించి ఆశ, అత్యాశ, పేరాశ వున్నాయి వినీల్. అందుకే అలా చెప్పాడు. లేకుంటే ఎందుకు చెబుతాడు?”

“ఇంతకీ ఏం చెప్పాడు సూర్యదేవ్? ఏం చెప్పినా సహస్ర నమ్మదు. అంత ప్రేమ నేనంటే తనకి”

“ప్రేమ కాబట్టే నమ్మి వుండొచ్చు. నీ బలహీనతల్ని గౌరవించి వెళ్లిపోయిందేమో! అలా ఎందుకు ఆలోచించవు?”

“నా బలహీనతలా? నాకేం బలహీనతలు వున్నాయి? నాకంతా గందరగోళంగా వుంది”

“చైత్రన్ నీ మీద ఏం చెప్పాడో వింటే నీకింకా గందరగోళంగా వుంటుంది. చెప్పనా?”

“చెప్పు సూర్యదేవ్”.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here