అందమైన మనసు – 5

0
9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]వా[/dropcap]ళ్ళు వెళ్ళాక కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు వినీల్.

సూర్యదేవ్ గుర్తు రాగానే క్లబ్ గుర్తొచ్చింది. చాలా రోజులైంది క్లబ్‌కి వెళ్లి అని అనుకుంటూ లేచి గబగబా స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాడు. కారు బయటకు తీసి క్లబ్‌కి వెళ్ళాడు.

వినీల్‌ని చూడగానే “హాయ్ వినీల్! హౌ ఆర్ యు. చాలా రోజులైంది కలసి” అన్నాడు సూర్యదేవ్.

“ఫైన్ సూర్యదేవ్. థ్యాంక్ యు” అంటూ వెళ్లి అతనికి ఎదురుగా కూర్చున్నాడు వినీల్.

“డాక్టర్ సహస్ర ఫోన్ చేసారా?” అడిగాడు సూర్యదేవ్.

“లేదు” అన్నాడు పొడిగా

“అదేంటీ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్లుగా ‘లేదు’ అన్నావ్ సింపుల్‌గా?” అన్నాడు సూర్యదేవ్.

“ఎందుకు ఇంట్రెస్ట్ సూర్యదేవ్? ఇంకా ఎవరిని చంపాలి? ఆ రోజు జరిగిన ఆ సంఘటన గుర్తొస్తేనే బాధగా వుంటుంది. సిగ్గుగా వుంటుంది. దానికి కారణం సహస్ర. సహస్ర మీద వున్న ప్రేమ. ఆ ప్రేమ వల్లనే నా చేతిలో ఒక మనిషి ప్రాణాలు పోయాయి. జైలుకి పోయాను. ఇంతకన్నా అవమానం, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వుంటుందా ఎవరికైనా? ఎంత మంచి ఉద్దేశంతో ఎమ్మెస్ చేశాను. ఎన్ని కలలు కని మెడిసన్ చదివాను. అదంతా ఒక అమ్మాయిని ప్రేమించినందుకు, ఆరాదించినందుకు పోగొట్టుకోవాలా?” అన్నాడు.

సూర్యదేవ్ వింటున్నాడు.

“ఎక్కడుందో తెలియదు. ఫోన్ చెయ్యదు. అయినా నేను ఆమె కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ ఆమె నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాలా తెలివిగా దూరమైంది. నన్ను మోసం చేసింది. ఇన్ని రోజులు నేనెంత పిచ్చి ప్రేమలో బ్రతికానో నా చేతిలో ఒక మనిషి ప్రాణాలు పోయే వరకు తెలియలేదు. నేను ప్రాణాలు పోసేవాడినే కానీ తీసేవాడిని కాదు సూర్యదేవ్!

అందుకే నాకు ఆమె అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆమె గురించి మాట్లాడటం అంతకన్నా ఇష్టం లేదు. ఇంతవరకు నన్ను నేను బాధ పెట్టుకున్నది చాలు. ఇంకా ఎందుకు?” అన్నాడు.

వినీల్ బాధ అర్ధమైంది సూర్యదేవ్‌కి. ఇంట్రెస్ట్ లేదు అన్నాడే కానీ ప్రేమ లేదు అనలేదు. అది గమనించాడు సూర్యదేవ్.

“సహస్ర గురించి ఒక్క నీకు తప్ప ఎవరికీ తెలియదు సూర్యదేవ్! ఇంట్లో చెబుదామనుకునే లోపలే ఇలా జరిగింది. చెప్పకపోవటమే మంచిది అయింది. చెప్పివుంటే అమ్మా, నాన్న గారు చాలా బాధ పడేవాళ్ళు. ఇప్పుడా బాధ లేదు వాళ్లకు” అన్నాడు వినీల్.

“సో.. ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ అన్న మాట” అన్నాడు సూర్యదేవ్.

బాధగా చూసాడు వినీల్. ఆ బాధ ఎందుకో సూర్యదేవ్‌కి అర్ధం కాలేదు.

“కొన్నిటిని మరచిపోతే కొన్నిటిని పొందగలమట సూర్యదేవ్! అందుకే నాన్నగారు నాకు పెళ్లి చేస్తానంటున్నారు. నేను కూడా నా కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాను. పెళ్లి కాగానే నన్ను నా భార్యతో ఎటైనా వెళ్లి రమ్మంటున్నారు. జస్ట్ చేంజ్ కోసం. అప్పటివరకు నా హాస్పిటల్‌ని డాక్టర్ రఘు చూసుకుంటారు” అన్నాడు వినీల్.

“బాగుంది వినీల్! డాక్టర్ సహస్రను మరచిపోవటం కోసం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావన్న మాట. మధ్యలో ఎప్పుడైనా సహస్ర గుర్తొస్తే ఏం చేస్తావ్? ఇది నీకు ఎలా వుందో కానీ నాకైతే నచ్చలేదు. నీ కెరీర్‌ని కాపాడుకోడానికి ఇంకో అమ్మాయి మనసుతో ఆడుకుంటున్నట్టుగా వుంది”

వినీల్‌కి కోపం వచ్చింది.

“ఆడుకోవడమా? నాకిప్పుడు ఇరవైఏడేళ్ళు సూర్యదేవ్! పద్దెనిమిదేళ్ల కుర్రాడిని కాదు. ప్రేమ, అమ్మాయి తప్ప అమ్మా, నాన్న, చదువు, కెరీర్, నాకంటూ ఒక జీవితం ఉందని ఆలోచించలేని వయసులో నేను లేను. నువ్వు కూడా తెలిసీ తెలియని వయసులో వున్నవాళ్ళలా ఆలోచించకు. అయినా నేను నా భార్య మనసుతో ఆడుకుంటున్నట్లుగా ఇంకా పెళ్లి కాకముందే ఎలా డిసైడ్ చేస్తావ్? అలా ఆడుకుంటే నాశనం అయ్యేది నా జీవితమే” అన్నాడు.

“అదికాదు వినీల్. మనసును డైవర్ట్ చేసుకోవాలంటే పెళ్లి తప్ప మరో ఆప్షన్ లేదా?” అన్నాడు సూర్యదేవ్.

“పెద్దవాళ్ళు ఆ ఆప్షన్నే చెబుతున్నారు. వాళ్ళు బాగా ఆలోచించే చెబుతారు కదా! ఈ విషయంలో నేను వాళ్లనే ఫాలో అవుతాను సూర్యదేవ్! నాక్కూడా నా వయసుకి, మనసుకి మార్పు కావాలీ అంటే అదే సరైన ఆప్షన్‌లా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. నిద్ర రావటం కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. దీన్ని బట్టి నన్ను అర్థం చేసుకో సూర్యదేవ్ నేను ఎలాంటి స్థితిలో వున్నానో..” అన్నాడు వినీల్.

“మనల్ని మాత్రమే అవతలి వాళ్ళు అర్థం చేసుకోవాలని ఎవరికైనా వుంటుంది వినీల్! కానీ ఎదుటి వాళ్లు ఏం కోరుకుంటున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి” అంటూ ఫోన్ రావటంతో మొబైల్ వైపు చూసాడు.

“నేను అర్జంట్‌గా వెళ్ళాలి వినీల్! తరువాత కలుద్దాం. ఎవరో చెప్పారని కాకుండా ఏ నిర్ణయమైనా నీ అంతటి నువ్వే బాగా అలోచించి తీసుకో” అంటూ లేచి క్లబ్ లోంచి వెళ్ళిపోయాడు సూర్యదేవ్.

సూర్యదేవ్ వెళ్ళాక వినీల్ మనసు కలవరపడింది.

సూర్యదేవ్ అన్నట్లు నిజంగానే తను ఒక అమ్మాయి మనసుతో ఆడుకోబోతున్నాడా!

***

సత్యవతికి దూరపుబంధువులైన ఇద్దరు ఆడవాళ్లు సిటీలో ఏదో ఫంక్షన్‌కి వచ్చి, వెళుతూ వెళుతూ సత్యవతి దగ్గరకి వచ్చారు. వాళ్ళను చూడగానే చాలా మర్యాదగా, గౌరవంగా, ప్రేమగా చూసుకుంది సత్యవతి. సత్యవతి అభిమానం చూస్తుంటే తమ కూతుళ్లను వినీల్‌కి ఇచ్చి చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి.

ఇద్దరు ఒకేసారి కాకుండా ఒకరికి తెలియకుండా ఒకరు సత్యవతితో మాట్లాడాలనుకున్నారు.

ఇదే మంచి సమయం అని ఆ ఇద్దరిలో ఒకరైన సునీత మెల్లగా సత్యవతి దగ్గరకి వెళ్లి కూర్చుంది.

“ఆవిడ ఇప్పుడే స్నానానికి వెళ్లారు వదినగారు! మీతో కొంచెం మా అమ్మాయి గురించి మాట్లాడాలని వచ్చాను. అదిప్పుడు డాక్టరయింది. వినీల్‌కి ఇస్తే బాగుంటుందని నేనూ, మా ఆయన అనుకున్నాం. ఈ ఇంట్లో మీ మాట, అన్నయ్య మాట ఒకటే అని విన్నాను. అందుకే అన్నయ్య లేకపోయినా మీతో మాట్లాడుతున్నాను. వినీల్‌కి మీరు తొందరలోనే పెళ్లి చెయ్యాలని ఉన్నట్లు తెలిసింది” అంది వినయంగా సునీత.

నివేద వినీల్ కోసం కాఫీ కలుపుతూ వంటగదిలో వుంది. ఆవిడ మాటలు నివేదకు వినిపిస్తున్నాయి.

“వినీల్‌కి మేం పెళ్లి చెయ్యాలని వున్న మాట వాస్తవమే వదినా! కానీ వేరే అమ్మాయితో కాదు. మా మేనకోడలు నివేదతో” అంది సత్యవతి.

సునీతతో పాటు వంటగదిలో వున్న నివేద కూడా షాక్ తిన్నది.

“నివేదతోనా! ఆశ్చర్యంగా వుందే. ఇలా అని ఎవరూ అనలేదు మాతో. ఇలా వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నట్లు మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు?” అంది సునీత సర్వం కోల్పోయిన దానిలా. “ఈమధ్యనే వదినా!”

“నివేద డాక్టర్ కాదు. పైగా పేదపిల్ల. మీరు చదివిస్తే చదువుకుని ఏదో ప్రయివేటు కాలేజీలో ఉద్యోగం చేసుకుంటుంది. ఇప్పుడు కూడా మీ ఇంట్లోనే తల దాచుకుని వుంది. ఏదో ఆ అమ్మాయికి తగిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యటం సరైన పద్ధతేమో. ఎందుకంటే ఏవిధంగా చూసుకున్నా మీకు వాళ్ళ కుటుంబం సరిపోదు. ఇది నేనేకాదు ఎవరైనా అంటారు. మీకు వాళ్లతో చాలా దగ్గరి బంధుత్వం వుంటే వుండొచ్చు. అదొక్కటే వియ్యం అందుకోవాలంటే సరిపోతుందా వదిన గారు?” అంది సునీత చాలా మెత్తగా.

“మేమిలా ఆలోచించలేదు”

“ఆలోచించాలి. మనకోసం కాకపోయినా సొసైటీ అనేది ఒకటి వుందిగా. అందులో మన వ్యాల్యూస్‌కి తగినట్లుగానే మన సంబంధాలు, బంధుత్వాలు వుండాలి. జాలి పడటం వల్లనో, చిన్నపాటి అభిమానం వల్లనో ఇప్పుడు మనం చేసే ఇలాంటి తప్పుల వల్ల పిల్లలు చాలా కోల్పోతారు. ముఖ్యంగా వినీల్ లాంటి వాళ్ళు. ఆ అబ్బాయి మాములు వ్యక్తి కాదు. శస్త్ర చికిత్సలు చెయ్యటంలో నిపుణుడు. అది కూడా మీరు ఆలోచించాలి” అంది సునీత .

“ఆలోచించాము వదినా! మాకు ఏంకావాలో అది నివేదలో వుంది. అందుకే నివేదకు, వినీల్‌కు పెళ్లి చెయ్యబోతున్నాం. మీరు ఇలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా పెళ్ళికి రండి. ఇక దీనిగురించి మీరేం మాట్లాడకండి. మీరంటే నాకు చాలా గౌరవం వుంది” అంది సత్యవతి.

“మరి ఈ విషయం వినీల్‌కి చెప్పారా? ఒప్పుకున్నాడా?” అంది సునీత

“ఒప్పుకున్నాడు”

“నివేద కూడా ఒప్పుకుందా?”

“నివేదకు ఇంకా చెప్పలేదు. చెప్పినా తను వద్దనదు. సంతోషపడుతుంది. ఈ పెళ్లి తనకి అక్షయపాత్ర లాంటిది. అందుకే చెప్పలేదు. తొందరేముంది? తరువాత చెబుతాను” అంది సత్యవతి.

ఇక సునీత మాట్లాడలేదు. ఆమెతోపాటు వచ్చినావిడతో ఈ విషయం చెప్పాలని వెంటనే లేచి వెళ్ళింది. ఆమె బాత్రూం లోంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది.

నివేద పరిస్థితి మాములుగా లేదు. చాలా అలజడిగా, అల్లకల్లోలంగా వుంది. కాఫీ కప్పుతో వినీల్ దగ్గరకి వెళ్లాలంటేనే కాళ్ళు రావటం లేదు.

అయినా తనకి వినీల్‌తో పెళ్లేంటి? వీళ్ళు ఎందుకిలా ఆలోచిస్తున్నారు? తన పెళ్లి గురించి తన తల్లిదండ్రులు ఆలోచించాలి కానీ వీళ్ళు ఆలోచించటమేంటి? దయతో చదివించారు. ఆ కృతజ్ఞత తనకి ఎప్పుడూ వుంటుంది. అంతవరకే… కానీ ఇదంతా ఏమిటి?

వెళ్లాలనిలేకపోయినా, బలవంతంగా మెట్లెక్కి వినీల్ దగ్గరకు వెళ్ళింది.

వినీల్ ఎప్పటిలాగే కాఫీ తీసుకున్నాడు.

ఇక నువ్వు వెళ్లొచ్చు అన్నట్లుగా చూసాడు.

అతను ఎప్పుడైనా అంతే! నివేదతో అలాగే వుంటాడు. నివేద అంటే అతనికి వున్న అభిప్రాయం కేవలం నివేద తన తండ్రి హరనాధరావు చెల్లెలు కూతురు. వాళ్ళు ఆమెను చదివించలేక తమ ఇంట్లో వుంచారు. అమ్మ పైకి రాలేనప్పుడు టైంకు కాఫీ తెచ్చి ఇస్తుంది. పనిపిల్లతో గదిని శుభ్రం చేయిస్తుంది. అది ఆ అమ్మాయి డ్యూటీ అన్నట్లుగానే వుంటుంది. అంతకు మించి ఇంకేమి ఉండదు.

నివేద కిందకి వెళ్ళింది.

ఆ ఇంట్లో ఎప్పటిలా తిరగలేక తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది.

ఒక గంట తరువాత బంధువులు వెళ్లిపోయారు.

రాత్రికి డిన్నర్ టైంలో నివేద వెళ్ళలేదు. గదిలోనే వుంది.

హరనాధరావు, సత్యవతి వెళ్లి “డిన్నర్ చేద్దాం రా” అంటూ నివేదను పిలిచారు. ఆమె రాలేదు.

వినీల్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వున్నాడు.

“నివేద డిన్నర్ చెయ్యటానికి రాకుండా గదిలోనే వుంది వినీల్! నువ్వు వెళ్లి పిలిస్తే వస్తుందేమో వెళ్లి పిలువు” అంది సత్యవతి.

వినీల్‌కు, నివేదకు పెళ్లి చెయ్యాలని అనుకున్నప్పటి నుండి వాళ్ళను కాస్త దగ్గర చెయ్యాలన్నదే ఆమె ప్రయత్నం. వినీల్ ఏమాలోచిస్తున్నాడో ఆమె మాటను పట్టించుకోలేదు. ఆమె మనసు చివుక్కుమంది. ఒక్కోసారి పిల్లలు చెప్పిన మాట వినకపోతే బాధనిపిస్తుంది.

అప్పుడే సూర్యదేవ్ ఫోన్ చేసాడు నివేదకు.

ఆమె లిఫ్ట్ చెయ్యగానే “ఏం చేస్తున్నావ్ వేదా?” అన్నాడు.

“పడుకున్నాను” అంది నివేద.

“ఈటైంలో నువ్వు పడుకోవే. చదువుకుంటూనో, ఏవో బుక్స్ సర్దుకుంటూనో వుంటావుగా” అన్నాడు ఆమె గురించి బాగా తెలిసిన మనిషిలా.

“ఊఁ..” అంది.

“చాలా నీరసంగా అనిపిస్తుంది నీ వాయిస్. ఏంజరిగింది? ఒంట్లో బావుండలేదా?”

“అదేం లేదు. ఒంట్లో బాగానే వుంది”.

“లేదు నువ్వు రోజులాగా లేవు. ఆ మాత్రం నేను తెలుసుకోలేనా!”

ఆమె మాట్లాడలేదు.

“డిన్నర్ చేసావా?”

సమాధానం లేదు.

“నువ్వు డిన్నర్ చెయ్యలేదు. నాకు తెలుస్తోంది. మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవలా? మొన్న అన్నావుగా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ వున్నాయి అని.. చెప్పు వేదా ఏం జరిగింది?” అన్నాడు సూర్యదేవ్. ఏదో జరిగింది అని అతనికి అర్థమవుతోంది.

ఆమెకు మాటలు రావటం లేదు.

“సరే నువ్వు వుండే ఏరియా చెప్పు నేను వస్తాను. అలేఖ్య దగ్గరకి వెళుతున్నానని నువ్వు బయటకు రా. నాతో కలిసి డిన్నర్ చేద్దువు. తిరిగి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మరి నువ్వు ఈ టైంలో బయటకు రాగలుగుతావా? చెప్పు వేదా! నువ్వు బయటకు వస్తానంటే ఇపుడే వస్తాను” అన్నాడు.

అప్పటికే నివేదకు కన్నీళ్లొస్తున్నాయి. ప్రేమపూర్వకమైన ఆ సంభాషణను తట్టుకోలేకపోతోంది. నన్ను ఇంతగా పట్టించుకునే వాళ్ళు కూడా వున్నారా? అన్న భావన ఆమెను చాలా మృదువుగా కుదిపేసింది. వెంటనే ఫోన్ కట్ చేసింది.

సూర్యదేవ్‌కి ఆమె ఫోన్ ఎందుకు కట్ చేసిందో అర్థం కాలేదు. ఎవరైనా వచ్చారేమో అనుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే బాగుండదని ‘గుడ్ నైట్’ అని మెసేజ్ పెట్టాడు.

నివేద కూడా ‘గుడ్ నైట్’ అని రిప్లై ఇచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here