అందమైన మనసు-9

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]స[/dropcap]త్యవతి షాక్ తిన్నది.

“అందుకేనా నేను ఫోన్ చేస్తే మన ఫ్రెండ్స్ ఎవరూ నాతో మాట్లాడలేదు?” అంది.

“అందుకే వదినా!”

“అంటే ఇప్పుడు మా వినీల్‌కి ఎవరూ అమ్మాయిని ఇవ్వరా?”

“ఇవ్వరా అంటే, మన ఫ్రెండ్స్‌లో అయితే ఎవరూ ఇవ్వరు వదినా! తెలియని వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో. కానీ తెలిసాక మాత్రం ఇబ్బంది అవుతుంది. దాన్ని ఫేస్ చెయ్యాలన్నా కష్టమే. అందులో ఇప్పుడిది విడాకుల సీజన్. నీకు తెలియంది ఏముంది” అంది సునీత.

“అయితే నేనిప్పుడు ఏంచెయ్యాలి వదినా?” అంటూ సలహా అడిగింది సత్యవతి.

“అడిగావు కాబట్టి చెబుతున్నా వదినా! ఇలా చెప్పానని నన్నేమీ అనుకోవద్దు”

“అనుకోను వదినా! నువ్వు నా శ్రేయోభిలాషివి. నిన్ను అనుకుంటానా? నేనంటే ఎంత అభిమానం నీకు. నాకు తెలియదా” అంది సత్యవతి.

“ఇప్పుడు వినీల్‌ని సైకియాట్రిస్టుకి చూపించటం కూడా అంత మంచిది కాదు. భవిష్యత్తులో పిచ్చి డాక్టరన్న ముద్ర పడే అవకాశం వుంది. నివేదకు గానీ, వాళ్ళ తల్లిదండ్రులకు గానీ ఇవన్నీ తెలియవు కాబట్టి నివేదను ఇచ్చి చెయ్యటమే మంచిది. వాళ్ళైతే మీ దగ్గరి బంధువులు, మీ ఉపకారం పొందినవాళ్లు కాబట్టి ఏం జరిగినా బయట చెప్పరు. నీకు, అన్నయ్యకు కూడా వాళ్లతో ఎలాంటి ఇబ్బంది వుండదు. దీనికి వినీల్ ఒప్పుకోకపోయినా వినీల్ పెళ్లి నివేదతోనే చెయ్యి. ఇదంతా అన్నయ్యకు, వినీల్‌కి చెప్పొద్దు. చెబితే ఈ పెళ్లి నువ్వు చెయ్యలేవు” అంది సునీత.

“చెప్పను వదినా” అంటూ ఫోన్ పెట్టేసి బాధ పడుతూ పడుకుంది సత్యవతి.

డిన్నర్ టైం కావటంతో “అత్తయ్యా డిన్నర్ చేద్దాం రా” అంటూ వచ్చింది నివేద.

“నాకు ఆకలిగా లేదు, మీరు చెయ్యండి” అంది సత్యవతి.

“అలాగే మా డిన్నర్ అయ్యాక నీకు పాలు తెచ్చిస్తాను. పైకెళ్ళి బావను పిలుస్తాను డిన్నర్‌కి” అంటూ సత్యవతి చెప్పక ముందే పైకి పరిగెత్తింది నివేద. అది చూసి అంత బాధలో కూడా కొద్దిగా సంతోష పడింది సత్యవతి.

గదిలో కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ వున్న వినీల్‌కి దగ్గరగా వెళ్లి “బావా” అంది.

కళ్ళు విప్పి నివేదను చూసి “నువ్వా?” అన్నాడు అదిరిపడ్డట్లు చూసి.

“నేనే బావా నివేదని. లేచిపోయానే ఆ నివేదని”

“నిన్నెవరు రమ్మన్నారు నా గదిలోకి?”

“నేనే వచ్చా. డిన్నర్‌కి పిలుద్దామని”

అసహనంగా చూసాడు.

“ఏం నువ్వు పిలవకుంటే నేను రాలేనా? వస్తున్నా వెళ్లు” అన్నాడు విసుగ్గా.

ఆమె వెళ్లలేదు. కావాలని అక్కడే నిలబడింది.

“చెబితే అర్థం కాదా నీకు. నా ముందు నిలబడ వద్దని ఎన్ని సార్లు చెప్పాలి? వెళ్లు వెళ్లు” అన్నాడు.

“నీ ముందేమి నిలబడలేదు. కొంచెం పక్కకే నిలబడ్డాను. కావాలంటే చూడు. నాకు తెలియదా లేచిపోయిన దాన్ని ఎక్కడ నిలబడాలో” అంది.

ఆమె వైపు చూడటం ఇష్టం లేనట్లు ముఖం పెట్టాడు. అతనలా ముఖం పెట్టటం, ఉడుక్కోవటం నివేదకు బాగుంది.

డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అలాగే జరిగింది. సున్నితంగా మాట్లాడుతూనే మాటలతో పొడిచింది. అలా మాట్లాడుతుందని అతను ఊహించలేదు. నివేద ముందు కూర్చుని తినాలంటే ఇబ్బంది పడ్డాడు. నివేద కావాలనే ఇంకా ఇబ్బంది పెట్టింది.

డిన్నరయ్యాక సత్యవతికి పాలు ఇచ్చి పడుకుంది నివేద.

***

తెల్లవారింది. సత్యవతి ఇంకా పడుకునే వుంది.

“కాఫీ తాగండి అత్తయ్యా” అంటూ కాఫీ తీసికెళ్ళి ఇచ్చింది నివేద.

“లేవలేకపోతున్నా నివేదా! లేవాలంటే నిస్సత్తువగా వుంది. కాఫీ తాగి కొద్దిసేపు పడుకుంటాను” అంది సత్యవతి.

“అలాగే అత్తయ్యా మీరు పడుకోండి. నేను వెళ్లి బావకు కాఫీ ఇచ్చి వస్తాను” అంటూ ఒక కాఫీ కప్పును ట్రేలో పెట్టుకుని పైకి వెళ్ళింది నివేద.

“బావా కాఫీ తెచ్చింది నివేద. మీరు తాగేసి కప్పు ఇస్తే వెళ్ళిపోతాను” అంది.

ఉలిక్కి పడి చూసాడు వినీల్.

“రావద్దంటే ఎందుకొచ్చావ్?” అన్నాడు కోపంగా.

“నిన్న కదా రావొద్దన్నది. ఈరోజు వస్తే ఏమైంది బావా? కాఫీ తీసుకో. పాపం అత్తయ్య పడుకుని వున్నారు. లేచే ఓపిక లేదు. తీసుకోండి బావా” అంటూ దగ్గరకి వెళ్ళింది.

ఆ కాఫీ కప్పు లాగి నివేద ముఖాన కొట్టాడు. కప్పు వెళ్లి ఆమె నుదురు తగిలి రక్తం వచ్చింది. అలా కొడతాడని నివేద ఊహించలేదు. కాఫీ ముఖం మీద పోస్తాడనుకుంది. అందుకే చల్లటి కాఫీ తెచ్చింది. కానీ ఆమె అనుకున్నట్లు కాఫీతో కాకుండా కప్పుతో ముఖం పగలగొట్టాడు.

నొప్పిగా వుంది. నెత్తురు ఆగలేదు.

“కాఫీ ఇవ్వాలని వస్తే ముఖం పగలగొడతావా? నేనంటే అంత చిన్న చూపా నీకు? ఉండు నీమీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా” అంటూ కోపంగా కిందకి పరిగెత్తింది నివేద.

బిత్తరపోయాడు వినీల్.

“అత్తయ్యా నీ కొడుకు చూడు నా ముఖం ఎలా పగలగొట్టాడో” అంటూ సత్యవతి దగ్గరకు వెళ్ళింది.

కారుతున్న రక్తాన్ని డ్రస్ నిండా పూసుకుంది. అది చూసి సత్యవతి కళ్లు తేలేసింది.

“అత్తయ్యా నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి. నొప్పిగా వుంది. బ్లడ్ బాగా వస్తోంది” అంది.

వినీల్ వేగంగా మెట్లు దిగి కిందకి వచ్చాడు.

నివేదను పట్టుకుని “ఇలా కూర్చో. నేను చూస్తాను” అంటూ కూర్చోబెట్టాడు.

“వద్దు. నేను కూర్చోను. నేను వేరే డాక్టర్ దగ్గరకు వెళతాను” అంటూ లేచింది నివేద.

“సర్జన్‌ని నన్ను ఇంట్లో పెట్టుకుని ఇంకో డాక్టర్ దగ్గరకు వెళతావా? నీకేమైనా పిచ్చా? దెబ్బ బాగానే తగిలింది. నా గదిలోకి వెళదాం పద.. కుట్టు వేస్తాను” అన్నాడు.

“కుట్టు వేస్తావా? అమ్మో అంతలా కొట్టావా? అసలు నా మొహమే నా ఆస్తి. నీకసలు మైండ్ పని చెయ్యట్లేదా అలా ఎలా కొట్టావ్? నువ్వు డాక్టర్‌వా? సైకోవా?” అంటూ కోపంగా అరిచింది నివేద.

అందరూ వింటారని వెంటనే ఆమె నోరు మూసాడు వినీల్.

“నీకేం కాదు అరవకు. తగ్గిపోతుంది. నేను తగ్గిస్తాను” అంటూ బలవంతంగా పైకి తీసికెళ్ళాడు.

“మొండిగా చెయ్యకు నివేదా ప్లీజ్” అంటూ ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

“నువ్వు డాక్టర్‌వి కావు. సైకోవి. ఒక మనిషిని చంపావ్. నన్నిప్పుడేం చేస్తావో ఏమో” అంటూ అతన్ని దూరంగా నెట్టేసింది.

అతను మళ్ళీ ఆమె దగ్గరకి రాబోయాడు.

“ఆగు బావా దగ్గరకు రాకు. నాకు నీ ట్రీట్‌మెంట్ అవసరం లేదు. నేను బయటకు వెళ్ళాలి. నిన్ను మాత్రం వదిలేది లేదు. చూస్తూ వుండు. నిన్నేం చేస్తానో” అంటూ అసలే బలంగా వుండే నివేద ఆ కోపంలో ఒక్క సెకెన్ కూడా అక్కడ ఆగకుండా మెట్లు దిగింది. రోడ్డు మీదకి పరిగెత్తి ఆటో ఎక్కింది.

నివేద బయటకు వెళ్ళాక వినీల్‌కి చెమట్లు పట్టాయి. నివేద వెళ్ళింది పోలీస్టేషన్‌కే అనుకున్నాడు. ఏంచేయాలో తోచలేదు. వెంటనే సూర్యదేవ్‌కి ఫోన్ చేసాడు.

ఫోన్ లిఫ్ట్ చేసి “హలో డాక్టర్ వినీల్! హౌ ఆర్ యు?” అన్నాడు సూర్యదేవ్.

“నేనిప్పుడు చాలా డేంజర్ సిట్యువేషన్‌లో వున్నాను సూర్యదేవ్!” అన్నాడు వినీల్.

“ఏం జరిగింది వినీల్?”

“మా ఇంట్లో వుండే మా బంధువుల అమ్మాయి నామీద కంప్లైంట్ ఇస్తానని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది”

“కంప్లైంట్ దేనికి వినీల్! నువ్వేం చేసావ్?”

“కోపంలో ముఖం పగలగొట్టాను సూర్యదేవ్!”

“ఒక అమ్మాయి ముఖం పగలకొట్టావా?”

“అవును సూర్యదేవ్! అనుకోకుండా జరిగింది. అలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కావటం లేదు. ఎలాగైనా నన్ను నువ్వే సేవ్ చెయ్యాలి” అన్నాడు వినీల్ రిక్వెస్ట్‌గా.

“దెబ్బ బాగా తగిలిందా?”

“తగిలినట్లే వుంది. బ్లడ్ బాగా వచ్చింది. నేను ట్రీట్‌మెంట్ ఇస్తానంటే వినకుండా కంప్లైంట్ ఇస్తానంటూ కోపంగా వెళ్ళిపోయింది”

“అవునా! మరి అంత కోపంగా వుండే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా వూరుకుంటుంది? మీకు సంబంధిత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తప్పకుండా కంప్లైంట్ ఇస్తుంది. అది ఆ అమ్మాయి హక్కు” అన్నాడు సూర్యదేవ్.

“హక్కా! మరిప్పుడెలా సూర్యదేవ్! నాకేమైనా ఇబ్బంది అవుతుందా?”

“ఏమవుతుంది వినీల్! ఎందుకంత భయపడుతున్నావ్? నువ్వన్నట్లు ఆ అమ్మాయి నిజంగానే కంప్లైంట్ ఇస్తే ఇన్‌స్పెక్టర్ గారు దాన్నివెంటనే రిసీవ్ చేసుకుంటారు. ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి పంపిస్తాడు. గాయం చిన్నదయితే ఆ అమ్మాయి ఇచ్చిన దరఖాస్తు మీద 323 ఐపిసి అని, గాయం పెద్దదయితే 324 లేదా 325 ఐపిసి ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తారు. సాక్షులను విచారించి స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసుకుంటారు. నిన్ను అరెస్ట్ చేస్తారు” అన్నాడు సూర్యదేవ్.

“నన్ను అరెస్ట్ చేస్తారా?” అంటూ షాక్ తిన్నాడు వినీల్.

“అవును అరెస్ట్ చేస్తారు. మెడికల్ సర్టిఫికెట్ వచ్చాక చార్జిషీట్ చేస్తారు. తరువాత కోర్టులో నేరం ఋజువైతే శిక్ష పడుతుంది. అప్పుడు నిన్ను జైలుకి పంపుతారు” అన్నాడు సూర్యదేవ్.

“జైలుకా? మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలా? మరిప్పుడెలా సూర్యదేవ్! నన్ను కాపాడే మార్గమేమీ లేదా?” అన్నాడు దీనంగా.

“అంత వరకు రానివ్వు వినీల్! అప్పుడు చూద్దాం”

“అప్పుడేముంది చూడ్డానికి. నేను లోపలకి వెళ్ళడమేగా” అన్నాడు వినీల్ కొండమీద నుండి జారుతున్నట్టుగా.

“అంత పరిస్థితి రాకుండా వుండాలంటే ఆ అమ్మాయిని మంచి చేసుకో. సారీ చెప్పు. సరిపోతుంది. నువ్వేమి టెన్షన్ పడకు. ఏమైనా ఉంటే తరువాత కాల్ చెయ్యి “ అన్నాడు సూర్యదేవ్.

“ఓకే సూర్యదేవ్! నువ్వు చెప్పినట్లే చేస్తాను. బై.. ” అంటూ ఫోన్ పెట్టేసాడు వినీల్.

నివేద ఎప్పుడొస్తుందా అని నివేద కోసం ఎదురుచూస్తున్నాడు. రాగానే సారీ చెప్పాలనుకున్నాడు.

***

నివేద ఇంటి కొచ్చింది. ఆమె నుదుటి మీద చిన్న ప్లాస్టర్ వేసివుంది. సత్యవతి లేచి నివేదకు ఎదురు వెళ్లి “ఎలా వుంది వేదా?” అంది.

“కొద్దిగా నొప్పి వుంది అత్తయ్యా! నేను నా గదిలోకి వెళ్లి పడుకుంటాను. ఈరోజు కాలేజీకి రానని ప్రిన్సిపాల్‌కి ఫోన్ చేసి చెప్పాను” అంటూ తన గదిలోకి వెళ్ళింది నివేద.

నివేదతో సత్యవతి కూడా గదిలోకి వెళ్ళింది. నివేదను తడుముతూ, బాధ పడుతూ పక్కనే కూర్చుంది.

“ఇదేంటి నివేదా ఇలా జరిగింది? ఏమైంది వాడికి. ఇలా ఎందుకు చేసాడు?” అంది బాధగా.

“ఏమో అత్తయ్యా నాకేం తెలుసు. బావని అడగలేదా?” అంది నివేద.

“అడగాలని వెళ్ళాను వేదా! గదిలోంచి బయటకు రాలేదు. తలుపు తియ్యమన్నా తియ్యలేదు. వాడికేదో అయింది వేదా!”

“అయ్యే ఉంటుంది అత్తయ్యా! నాక్కూడా అదే అనుమానంగా వుంది. బావ ఎప్పుడు ఇలా లేరు. నీకో విషయం చెప్పనా అత్తయ్యా!” అంది నివేద.

“చెప్పు నివేదా!” అంది సత్యవతి.

“బావ హాస్పిటల్‌కి వెళ్లడు కాని బయటకు మాత్రం ఎప్పుడుపడితే అప్పుడు బాగానే వెళుతుంటాడు అత్తయ్యా! ఆదివారం అమావాస్య రోజు బయటకు వెళ్లితే ఒక్కోసారి ఇలాగే వుంటారట. నాన్నకు చెప్పండి. ఇప్పుడే మా ఊరి నుండి మంచి భూతవైద్యుడిని తీసుకొస్తాడు. వాళ్ళ గాలి సోకితే బావ మామూలైపోతాడు. లేకుంటే ఇంతే. ఈరోజు నన్ను, రేపు మిమ్మల్ని కొడతాడు” అంది నివేద.

సత్యవతి భయపడింది.

బ్రహ్మయ్యకు ఫోన్ చేసింది.

సత్యవతి ఆపదలో వుందంటే బ్రహ్మయ్య తట్టుకోలేడు.

వెంటనే భూతవైద్యుడిని వెంటబెట్టుకుని బస్సెక్కాడు బ్రహ్మయ్య.

ఆ భూతవైద్యుడు ముందుగానే ఒక బ్యాగ్‌లో వేపమండలు, కొరడా పెట్టుకుని వచ్చాడు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు బస్ దిగాక కొన్నాడు.

ఇంటికెళ్ళగానే సత్యవతి పక్కన వున్న కూతుర్ని చూసి “ఏంటమ్మా ఈ గాయం?” అన్నాడు బాధగా బ్రహ్మయ్య.

“అదంతా తరువాత చెబుతాను నాన్నా! ముందు బావ పని చూడండి. అత్తయ్య కంగారు పడుతుంది” అంది.

బ్రహ్మయ్య సత్యవతి వైపు చూసి “నువ్వు నిశ్చింతగా వుండమ్మా! వినీల్ సంగతి ఆయన చూసుకుంటాడు. ఇలాంటి వాటిలో సిద్ధహస్తుడు” అంటూ ఆయనను వినీల్ వుండే గదిలోకి తీసుకువెళ్లారు.

వాళ్ళను చూస్తుంటే వినీల్ కేమీ అర్థం కాలేదు. వాళ్లెవరూ లేకుంటే నివేదకు సారీ చెప్పాలని వున్నాడు.

కానీ ఆ భూతవైద్యుడు వినీల్ వుండే గదిలో నిర్భయంగా తన కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అదంతా చూసి వినీల్ నిర్ఘాంతపోయాడు.

బ్రహ్మయ్య, సత్యవతి, నివేద భూతవైద్యుడికి ఒక పక్కగా నిలబడి వినీల్ వైపు దిగాలుగా చూస్తున్నారు. భూతవైద్యుడు ముగ్గు వెయ్యటం పూర్తిచేసాడు.

“ఇదంతా ఏంటి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను” అంటూ వినీల్ ఫోన్ అందుకోబోయాడు.

“అత్తయ్యా మీరు కొంచెం బావ ఫోన్ లాక్కోండి! ఈ వైద్యం కాస్త పూర్తయ్యేవరకు ఆ ఫోన్ ఇవ్వకండి” అంది నివేద.

సత్యవతి వినీల్ దగ్గరనుండి ఫోన్ తీసుకుంది.

“కొద్దిసేపు నువ్వు సైలెంట్‌గా కూర్చో వినీల్! ముందు నీకు పట్టింది పోవాలి. ఆ తరువాతే ఏదైనా” అంది సత్యవతి.

“నాకేం పట్టింది? నాకేం పట్టలేదు. నన్ను ఒంటరిగా వదిలేసి మీరంతా నా గదిలోంచి వెళ్లిపోండి” అంటూ అరిచాడు వినీల్.

“చూసారా ఎలా అరిచాడో. నన్ను చూసినా ఇలాగే అరుస్తాడు” అంది నివేద.

అది వినగానే భూతవైద్యుడు తలపంకించాడు.

“నువ్విలా వచ్చి ఈ ముగ్గు ముందు కూర్చో బాబు” అంటూ వినీల్‌ని పిలిచాడు భూతవైద్యుడు.

“నేను కూర్చోను. నాకిలాంటివి నచ్చవు” అన్నాడు వినీల్.

“బ్రహ్మయ్యగారు, అబ్బాయి ఒంటి మీద చొక్కా వుండకూడదు. వెంటనే తొలగించండి” అన్నాడు.

వినీల్ “నేను చొక్కా విప్పను” అన్నాడు. బ్రహ్మయ్య బ్రతిమాలి విప్పించాడు.

భూతవైద్యుడు వినీల్ ముఖంలోకి చూస్తూ గట్టిగా మంత్రాలు చదివాడు. వినీల్ ఏమాత్రం చలించలేదు. అలాగే చూస్తున్నాడు. ముఖాన్ని విసుగ్గా పెట్టాడు.

“ఇది పక్కా ఆడ దెయ్యం. కదలకుండా, మెదలకుండా ఎలా చూస్తుందో చూడు” అంటూ వినీల్ మీద ఏదో పసుపు, ఎరుపు రంగుతో వున్న పొడిని చల్లాడు.

ఆ పొడి కళ్ళలో పడగానే కళ్ళు మూసుకున్నాడు వినీల్.

“చూసారుగా కళ్ళు ఎలా మూసుకుందో. ఇక పారిపోతుంది చూడండి” అంటూ వేపమండలతో వినీల్ వీపు మీద కొడుతుంటే వినీల్ అరుస్తున్నాడు.

“ఎంత అరిచినా వదిలేది లేదు నిన్ను. పోతావా పోవా?” అంటున్నాడు భూతవైద్యుడు.

సత్యవతి కళ్ళు మూసుకుని దేవునికి మొక్కుకుంటోంది. నివేద ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో వినీల్‌ని చూస్తూ లోలోన సంబరపడుతోంది.

ఆయన వేపమండలు పక్కనపెట్టి కొరడా అందుకున్నాడు.

“అబ్బాయి డాక్టర్! దెబ్బలని తట్టుకోలేడు. కాస్త చూసి కొట్టండి భూతవైద్యులు గారు!” అన్నాడు బ్రహ్మయ్య.

“మీరు ఊరుకోండి నాన్నా! ఆ దెబ్బలు తగిలేది బావకు కాదు. కాస్త ఓపిక పడితే ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. బావ మళ్ళీ హాస్పిటల్‌కి వెళతాడు. అత్తయ్య ఇంతచేసేది బావ కోసమే కదా! అత్తయ్య చూడు ఎంత బాధ పడుతుందో” అంది సత్యవతి వైపు జాలిగా చూసి.

సత్యవతి బాధ పడటం ఆయన చూడలేడు. అందుకే “మీరు కానివ్వండి. అయితే కొరడాతో కాదు” అంటూ వేపమండలతో మాత్రమే కొట్టటానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా పక్కకి తిరిగాడు బ్రహ్మయ్య.

భూతవైద్యుడు కొరడాను పక్కన పెట్టి వేపమండలతోనే ఆ దెయ్యాన్ని బాగా కొట్టి “పారిపోయింది. ఇక ఈ గదివైపుకి రమ్మన్నా రాదు. వస్తే కబురు చెయ్యండి” అంటూ ఆయన పని ఆయన చేసి వెంటనే మెట్లు దిగాడు.

ఆయన వెంట అందరు కిందకి వచ్చారు.

వినీల్ మాత్రమే పైన వున్నాడు. అతని వీపు మీద వేపమండలతో కొట్టిన వాతలు కనిపిస్తున్నాయి.

భూతవైద్యుడికి అడిగినంత డబ్బు ఇచ్చి బాధగా చూసింది సత్యవతి. బ్రహ్మయ్య ఆమెను మరోలా అర్థం చేసుకున్నాడు.

“అమ్మా సత్యవతీ! ఇతని రేటు కాస్త ఎక్కువే. ఎక్కువగా పెద్దవాళ్ళ దగ్గరకే వెళుతుంటాడు. మొన్ననే మిస్టర్ గారి అబ్బాయికి బాగుచేసాడు. ఇప్పుడతను బాగున్నాడు”

“మనం కూడా బాగుండాలనే చేయించాం అన్నయ్యా! డబ్బు గురించి కాదు నా ఆలోచన “

“మరింకేంటమ్మా? నువ్వు ఫోన్ చేసి అడగ్గానే అతను వేరే చోటుకి వెళుతుంటే ఆపి ఇటు తీసుకొచ్చాను. అతను కొట్టింది దెయ్యాన్నే కానీ అబ్బాయిని కాదు. అదేనా నీ బాధ?”

“అది కూడా కాదు. ఇదంతా తెలిస్తే ఆయన ఏమంటారో. అదే నా బాధ”

“అదేంటి, నువ్వు బావగారికి ఫోన్ చేసి చెప్పలేదా?”

“చెప్పలేదు అన్నయ్యా! వద్దంటారని. వద్దంటే వినీల్ ఇలాగే ఉంటాడన్న భయంతో ఆయనకు చెప్పకుండా చేయించాను”

“నీ భయం కూడా కరక్టే నమ్మా! కానీ నువ్వు నచ్చచెబితే బావగారు ఏమీ అనరు. మరి మేము వెళతాము”

“అలాగే అన్నయ్యా”

వాళ్ళు వెళ్లిపోయారు.

అక్కడే వున్న పనిమనిషిని పైకి పంపింది సత్యవతి గదిని శుభ్రం చేసి రమ్మని.

పని మనిషి గదిలోకి రాగానే గబగబా లేచి షర్ట్ వేసుకున్నాడు వినీల్.

“ఏమైంది డాక్టర్ బాబు? బయటకెళ్లినప్పుడు ఏమైనా తొక్కారా?” అంది భూతవైద్యుడు వేసిన ముగ్గు వైపు చూసి.

చిరెత్తుకొచ్చింది వినీల్‌కి. “ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను తొక్కుతా” అంటూ వాష్ రూములోకి వెళ్ళాడు.

“ఏంటో డాక్టర్ గారికి ఇంకా తగ్గినట్లు లేదు. అమ్మగారప్పుడే ఆ భూతవైద్యుడికి డబ్బులిచ్చి పంపారు. డబ్బులన్నీ వేస్ట్” అని మనసులో అనుకుంటూ గదిని శుభ్రం చేసి వెళ్ళింది పనిమనిషి.

పుట్టాక ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచుకున్న తన కొడుకును తనే దగ్గరుండి, డబ్బులిచ్చి కొట్టిచ్చినట్లైంది. అయినా తన కొడుకు కూడా డబ్బులు తీసుకుని ఒక రోగికి బాగు చెయ్యాలని కత్తితో కోసి ఆపరేషన్లు చెయ్యట్లేదా! తను చేసింది కూడా అంతే అని మనసుకు సర్దిచెప్పుకుంది సత్యవతి. చాలా సేపు గదిలోంచి బయటకు రాలేదు.

నివేద తన గదిలోకి వెళ్ళింది. ఆమె కళ్ళకి భూతవైద్యుడు, వేపమండలే కనిపిస్తున్నాయి.

“ఏం నివేదా! ఇప్పుడు నీకు ఆనందంగా వుందా?” అని ఆమె మనసు ఆమెను అడిగింది.

“ఆనందం ఎక్కడ? బావ అన్ని దెబ్బలు తింటే. నేను మరీ అంత కఠినాత్మురాలినా? నాకు మనసు లేదా? నాకు బాధ లేదా? అయినా దేవుడు ఎవరికి వేయాల్సిన శిక్ష వాళ్ళకి వేస్తాడట. ఇప్పుడు బావకు కూడా అలాగే జరిగింది. ఇందులో నా తప్పు ఏంలేదు. బావ నన్ను లేచిపోయింది అంటే నాకెంత బాధనిపించింది. ఆ మాటలకు నా తల్లి,దండ్రులు ఎంత బాధ పడివుంటారు?” అని మనసుకి నచ్చ చెప్పింది.

“నువ్వు తెలివిగా సమర్ధించుకోకు వేదా! అది కావాలనే చేయించావు. ఆ దెబ్బలకి కారణం నువ్వే, కానీ దేవుడి మీదకు నెట్టేస్తున్నావు. ఇది కూడా ఒక రకంగా పాపమే. నువ్వు చిన్నప్పుడు నేర్చుకునే వుంటావు. ‘మనకు చెడు చేసిన వాళ్ళు మన ముందుకి వస్తే వాళ్ళకి మంచి చెయ్యాలే కానీ చెడు చెయ్యకూడదు’ అని… ఇప్పుడు నువ్వూ వినీల్ ఒకటేగా? అతను కేవలం నాలుకనే వాడాడు. నువ్వు ఏకంగా వేపమండలనే వాడావు. ఏం మనిషివి నువ్వు?” అని ఆమె మనసు నిలదీసింది.

నివేద విలవిల్లాడుతూ ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చింది.

అంతలో “వేదా! ఒకసారి ఇలా వచ్చి వెళ్ళు “ అంటూ సత్యవతి పిలిచింది.

మెల్లగా తలుపు తీసి “ఏంటత్తయ్యా?” అంటూ వెళ్ళింది నివేద.

“ఇదిగో మీ బావ ఫోన్ నా దగ్గరే వుంది. పైకెళ్ళి ఇవ్వు” అంది.

“సరే అత్తయ్యా ఇస్తాను” అంటూ మొబైల్ తీసుకుంది. ఆ మొబైల్ లోకే చూస్తూ నెమ్మదిగా మెట్లెక్కి వినీల్ దగ్గరకి వెళ్ళింది.

“బావా ఇదిగో నీ ఫోన్. అత్తయ్య ఇచ్చి రమ్మంది” అంటూ మొబైల్‌ని బెడ్ మీద పెట్టింది.

వినీల్ నివేద వైపు ఉరిమి చూసాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here