అండమాన్ అనుభూతులు-2

1
9

[box type=’note’ fontsize=’16’] “అండమాన్‌లో వాన గురించి ఊహించటం కష్టమే. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. ఇక్కడ ఎనిమిది నెలలు వానా కాలం వుంటుందిట” అంటున్నారు ఎన్.వి. హనుమంతరావు తమ అండమాన్ అనుభూతులని వివరిస్తూ. [/box]

వర్షంలో ఒక రోజు:

వాన రాకడ ప్రాణం పోకడ ఊహించలేమంటారు మన పెద్దలు. నిజమే. అండమాన్‌లో వాన గురించి ఊహించటం కష్టమే. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో, భీభత్సంగా వుంటుంది. ఒక్కోసారి చాలా నిశ్శబ్దంగా పడుతుంది. పనిచేసుకుంటూ కిటికీలో నుండి చూస్తే అప్పటికే అరగంటనుండి వాన పడుతూ వుంటుంది. మే నెలలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవి అసలు వానలే కావంటున్నారు మా మిత్రులు. సునామీ తరువాత వాతావరణంలో మార్పులు వచ్చి వానలు కూడా తగ్గాయిట. నాకు మాత్రం వీటిని భరించటమే కష్టంగా వుంది. కానీ ఇక్కడి statistics ప్రకారం మే నెలలో అత్యధిక వర్షపాతం సగటున 600 మి.మీ. వుంటుంది. కానీ ఈ సారి ఇది జూన్ వరకు extend అవుతుందిట. విజయవాడలో ఎనిమిది నెలలు ఎండా కాలం వుంటే ఇక్కడ ఎనిమిది నెలలు వానా కాలం వుంటుందిట. కానీ మనిషి కాలంతో పాటు జీవించటానికి అలవాటు పడతాడు. అలాగే నేను కూడా అండమాన్‌లో కాలంతో పాటు వాతావరణంతోపాటు జీవన పోరాటం చేయటానికి సిద్ధపడ్డాను.

ఒక రోజు మా శ్రీమతిని, అబ్బాయిని తీసుకుని ఛాతమ్ నుండి బాంబూ ఫ్లాట్ (bamboo flat) వెళదామని బయలుదేరాను. ఒకసారి నేను వెళ్ళానుగాబట్టి తెలిసిన దారి కాబట్టి ధైర్యంగా వెళ్ళాను. సన్నగా తుంపర మొదలయింది. టిక్కెట్ కొనుక్కుని జెట్టీ ఎక్కాము. అది బయలుదేరగానే మొదలయింది వర్షం. మొదటిసారి అండమాన్‌లో వాన తీవ్రత ఎలా వుంటుందో అనుభవంలోకి వచ్చింది. రెండువేపుల నుండి దంచికొట్టింది. చేతిలో వున్న గొడుగు విరిగింది. ముగ్గురం తడిసి మద్దయ్యాము. మా ఆభ్భాయి భయంతో ఏడుపు మొదలెట్టాడు. కొద్ది నిమిషాల్లో ఏ స్థాయికి వెళ్ళాడంటే ముగ్గురం సముద్రంలో మునిగి చచ్చిపోతామని భయపడ్డాడు.

జెట్టీ బయలుదేరిన ఐదు నిమిషాల తరువాత మళ్ళీ వెనక్కు వచ్చింది. వాన effect ఎక్కడైనా ఇలానే వుంటుంది. కానీ సముద్రం మీద మరోలా వుంటుంది గదా. అదే ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. ఈ లోపల నేను జెట్టీలో పనిచేసే ఒక అబ్బాయితో మాటలు మొదలెట్టాను. Bamboo flat లో మీ ఇల్లుందా అని అడిగాడు. లేదు సరదాగా వెళుతున్నాము అన్నాను. సముద్రం మీద వాతావరణం బాగోలేదు వెనక్కు వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చి అక్కడ గుడిసెలాగా వున్న చిన్న హోటల్‌లో నేనూ మా ఆవిడా టీ తాగి వర్షంలో అలాగే తడుచుకుంటూ కారు ఎక్కి ఇంటికి చేరాము. ఆవిధంగా వానలో ఉదయం గడిచింది. ఈ అనుభవం ఆ రోజు అంతటితో ఆగలేదు. మధ్యాహ్నానికి వాన కొంత తెరిపిచ్చింది. దానితో మా మిత్రుడు నాగరాజన్ కుటుంబాలతో సహా “కార్బిన్స్ కోవ్” బీచ్ వెళదామని ప్రతిపాదించాడు. వానకు భయపడుతూనే ఒకే కారులో బయలుదేరాము. పోర్ట్ బ్లయర్ పట్టణానికి దగ్గరగా వున్న ఏకైక అందమైన బీచ్ “కార్బిన్స్ కోవ్“ . దాదాపు పది కి.మీ. దూరం వుంది. మెరీనా పార్క్ నుండి సముద్రం పక్కగా ప్రయాణం. ఓ పక్క సముద్రం మరోవేపు ఎత్తైన కొండలు, చెట్లు, వంపు సొంపుల రహదారి. బీచ్‌లో ఓ పక్కన కొబ్బరి చెట్లు గోవాను తలపిస్తాయి. దూరంగా ఓ జపనీస్ బంకర్ కూడా వుంది. మేము అక్కడ దాకా వెళ్ళలేదు. అండమాన్‌లో చాలా చోట్ల ఈ విధమైన బంకర్లు వున్నాయిట. మేము బీచ్ చేరేసరికి సాయంత్రం ఐదు గంటలయింది. ఆకాశం ముసురు పట్టింది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. నాకు మళ్ళీ వాన భయం పట్టుకుంది. పిల్లలు మాత్రం ఉషారుగా నీళ్ళలోకి దిగి ఆడుకోవటం మొదలు పెట్టారు.

మా అబ్బాయి ఉత్సాహంగా ఇసుకలో ఇండియా మ్యాప్ గీసి ఆనందించాడు. ఓ గంటకు పైగా గడిపాము. అందరమూ పూర్తిగా తడిసిపోయాము. వర్షం మాత్రం ఆగుతూ అగుతూ పడుతూనే వుంది. మేము కూడా సాహసం చేస్తూ తిరుగుతున్నాము. బీచ్‌లో ఆ కొసదాకా వెళ్ళాము. అక్కడ కొన్ని water sports వున్నాయి. వాతావరణం బాగాలేక ఆ రోజు రద్దు చేసారు. బీచ్‌లో ఓ పక్కన waves అనే ఓ రెస్టారెంటు వుంది. డిన్నర్ అక్కడే ముగించాము. నీలకంఠ అని అక్కడ పనిచేసే తెలుగు వ్యక్తి కలిసాడు. ఆ హోటల్‌లో ఫుడ్ మాత్రం కొంచెం వెరైటీగా వుంది. చాలా మంది ఇంటినుండి భోజనం తెచ్చుకుని బీచ్‌లో enjoy చేస్తారుట. నేను కూడా ఈసారి అలా వెడదామని నిర్ణయించుకున్నాను.

రాత్రి తొమ్మిది గంటలకు తిరుగు ప్రయాణం. ఐదు నిమిషాల తర్వాత మొదలయింది మళ్ళీ వాన. వంపులు తిరిగిన రహదారి. చిమ్మ చీకటి. కుంభవృష్టి. కారు డ్రైవ్ చేస్తున్న నాలో టెన్షన్. కారులో ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు పిల్లలు. అదీ భయానికి కారణం. గుండె చిక్కపట్టుకుని మొత్తానికి నగరంలో ప్రవేశించాము. మెరీనా పార్క్ దగ్గరకు రాగానే ఆశ్చర్యం. వాన తగ్గింది. క్షేమంగా ఇంటికి చేరాము. ఇకనుండి అండమాన్‌లో వర్షం కురిస్తే ప్రయాణాలు చేయకూడాదని decide అయ్యాను. ఏమో మళ్ళీ ఏమవుతుందో?

సాహస యాత్ర-1:

టూరిజంలో అనేక రకాలు వుంటాయిగదా. అందులో adventure tourism ఒకటి. కానీ నాకనిపించింది ఇక్కడ అండమాన్‌లో అన్నీ సాహస యాత్రలే. ఈ మధ్య నేను కూడా కుటుంబంతో సహా చిన్న సాహస యాత్ర చేశాను. అదే బారా టంగ్ (BARA TAANG) యాత్ర. పోర్ట్ బ్లయర్‌కు ఉత్తరాన దాదాపు వంద కి.మీ. దూరంలో వున్నది బారా టంగ్. ఈ యాత్ర ప్రారంభమే అర్ధరాత్రి మొదలవుతుంది, టాక్సీ ప్రయాణం అయితే అర్ధరాత్రి 2.30 గం.లకు, అదే బస్సు అయితే 3.45 గం.లకు. కాబట్టి మేము బస్సులో వెళ్ళటానికి ప్రాధాన్యమిచ్చాము. యథాప్రకారం నేను మా నాగరాజన్ కుటుంబసమేతంగా సిద్దమయ్యాము. మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా పిల్లలు కూడా సమయానికి రెడీ అయ్యారు. నాగరాజన్ కుటుంబం మళ్ళీ చెన్నయ్ వెడుతుండటం వలన వానలు పడుతున్నా ఈ విహార యాత్ర చేయటానికి సాహసం చేశాము. మొత్తం మూడు గొడుగులతో సహా బయలుదేరాము. మా బస్సు వివిధ ప్రదేశాల్లో ఓ ముప్పయిమంది ప్రయాణీకులను ఎక్కించుకుని పోర్ట్ బ్లయర్ నగరం దాటింది. చల్లదనానికి మంచి నిద్ర పట్టింది. మళ్ళీ 5.15 గం.లకు మెలకువ వచ్చింది. అప్పుడే సూర్యుడు మెల్లిగా తొంగి చూస్తున్నాడు. వంపులు తిరుగుతూ సన్నని ఘాట్ రోడ్డులో బస్సు వెడుతోంది. రోడ్డుకిరువైపులా పొడవాటి చెట్ట్లు. బయట వాతావరణం చాలా ఆహ్లదకరంగా వుంది. అలా ఒక పావుగంట ప్రయాణించాక జిర్కాటంగ్ అనే సురక్షిత అటవీ ప్రాంతంలో బస్సు ఆగింది. అక్కడ అప్పటికే ఒక కిలోమీటరు మేర వాహనాలు నిలిచివున్నాయి.

జిర్కాటంగ్ అటవీ ప్రాంతం అండమాన్ లోని ప్రముఖ ఆదివాసీయులు ’జార్వా’ తెగకు ఆవాసప్రాంతం. ఇక్కడనుండి అన్ని వాహనాలు ప్రభుత్వ అనుమతితో ఒక క్యూ పద్ధతిలొ ప్రయాణిస్తాయి. మా డ్రైవరు అనుమతి కోసం వెళ్ళాడు. అందరికి అరగంట సమయం ఇచ్చాడు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి అరకొర ఏర్పాట్లు. బస్సు దిగగానే వేడివేడి టీతో తమిళ సోదరులు సిద్దంగా వున్నారు. సరిగ్గా ఆరు గంటలకు వాహనాలు కదిలాయి. మా అబ్బాయి ఉత్సాహంగా బస్సులో ముందున్న సింగిల్ సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు. అడవిలో వంపులు తిరుగిన సన్నని దారిలో ఒకదాని వెనక మరొకటి కదులుతున్నాయి. ఇరుపక్కల పొడవాటి చెట్ట్లు. అక్కడక్కడా వానకు నిలిచిన గుర్తులు. అడవిలో కొంతదూరం ప్రయాణించగానే మా బస్సులో అందరిలోనూ ఉత్కంఠ. ఎక్కడన్నా జార్వాలు కనబడతారన్న ఆశ. అప్పుడే డ్రైవరు మాకు హెచ్చరిక చేశాడు. జార్వాలు కనపడితే ఫోటోలు తీయకూడదు, ఎలాంటి సైగలు చేయకూడదు. మేము కూడా బయటికి తీసిన కెమెరా లోపల పెట్టాము. అప్పుడే మొదటి జార్వా కనపడ్డాడు. జనజీవన స్రవంతిలో కలుస్తున్న జార్వాలకు ప్రతినిధిలాగా జీన్స్, టీ షర్ట్ లో కనపడ్డాడు. మరికొంతసేపటికి ముందుకూర్చున్న మా కౌండిన్య పెద్దగా అరిచాడు. ఎడమవైపు చిన్న గుట్టమీద ఇద్దరు జార్వాలు. సాంప్రదాయ దుస్తులలో చేతిలో విల్లంబు, బాణాలు. అలా ఉత్సుకతో సాగిన మా ప్రయాణంలో అటవీ ప్రాంతంలో ఆరుగురు జార్వాలను చూశాము. అడవి దాటిన తరువాత మా అందరిలో ఒక అనుమానం. ఆ సమయంలో ఈ అదివాసీయులు రోడ్డుమీద తిరుగుతున్నారా లేక టూరిస్టుల కోసం ప్రభుత్వం కానీ టూర్ ఆపరేటర్లు కానీ వీళ్ళని ఇలా కనపడేలా ఏర్పాటు చేశారా? ఏమో. మాకు మాత్రం అండమాన్‌లో ఒక ఆదివాసీ తెగను చూశామన్న తృప్తి కలిగింది. అటవీ ప్రాంతం దాటి మరో పావుగంట ప్రయాణించాక బారా టంగ్ చేరుకున్నాము. ఇక్కడ సముద్ర ఒడ్డున అన్ని టూరిస్ట్ వాహనాలు పద్దతిగా క్యూలో నిలిపారు.

ఇహ ఇక్కడనుండి ఓ పెద్ద ఫెర్రీలో పావుగంట ప్రయాణం. మాతో పాటు డ్రైవరు కూడా వచ్చాడు. ఈ ప్రాంతం పేరు నీలాంబర్ జెట్టీ. సమయం ఎనిమిదయింది. ఇక్కడనుండి అసలయిన విహారం మొదలువుతుంది. ఒక ప్రక్కగా సముద్రం మీద చిన్న వంతెన, చెక్కతో చేసిన మూడు హట్స్ వున్నాయి. వాటిలో విశ్రాంతి. అందరికీ అల్పాహారం (నాలుగు చిన్న పూరీలు) అందచేశారు. అనంతరం మా రెండు కుటుబాలకు తోడు ఓ బెంగాలీ జంటకు కలిపి టాటా సుమో ఏర్పాటు చేశారు.

 

మా తదుపరి ప్రయాణం mud volcano. పోర్ట్ బ్లయర్‌లో అనేక చోట్ల దీని గురించి చదవటం వలన ఇది ఏమిటో చూడాలనే కుతూహలం ఏర్పడింది. మెయిన్ రోడ్డు మిదనుండి యాభై గజాలు పైకి ఎక్కాలి. ఇది ఒక ‘మట్టి జ్వాలాముఖి’ మట్టి ఒక ఊబిలా ఏర్పడి పైకి తన్నుకొచ్చి గుట్టలుగా పడివుంది. కాలు పెడితే దిగపడిపోయేలా వుంది. అందుకే ఆ ప్రాంతమంతా కంచె కట్టారు. 2003, 2004లో ఇక్కడ మట్టి భారీ విస్ఫోటనం చెందటం వలన ఈ జాగ్రత్త తీసుకున్నారు. అక్కడనుండి అంతగా పేరులేని ఒక బీచ్‌కు తీసుకెళ్ళాడు. అక్కడ మొసళ్ళు వున్నాయని ఎక్కువ సమయం ఇవ్వలేదు. ఆ సుమో డ్రైవరు మాతో కూడా వచ్చి ఐదు నిమిషాల్లో వెనక్కు తెచ్చాడు. మరో పావుగంటలో తెచ్చిన చోట దింపాడు. అతనికి మేము చెల్లించినది ఆరువందలు. అసలు విషయం ఏమిటంటే అతను మరో గిరాకీ వెతుక్కోవాలి. ఎక్కడ టూరిజం వుంటుందో అక్కడ ఇలాంటి ఖర్చులుంటాయని సర్దుకున్నాం. ఇలా తిరగటం వలన మట్టి ఊబి చూశాము. బారా టంగ్ గ్రామం చూశాము. ఈ దారిలోనే మా దూరదర్శన్ ట్రాన్సిమిటర్ కార్యాలయం కూడా చూశాము. మా తదుపరి ప్రయాణం లంచ్ తరువాత అని ప్రకటన. అక్కడ చిన్న బస్ స్టాండ్ దానిమీద క్యాంటిన్ కూడా వుంది. మా భోజన ఏర్పాట్లు అక్కడే. రోడ్డు పక్కన చెట్టు కింద విశ్రాంతి తిసుకున్నాను. అప్పుడు కొంతమంది తెలుగులో మాట్లాడుకోవటం వినిపించింది. నేను కూడా మాటలు కలిపాను. అందులో పెద్దాయన విశాఖపట్నం నివాసి. బెంగుళూరుకు చెందిన construction company లో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కంపెనీ బారా టంగ్‌లో టూరిస్టులకు ప్రత్యేకంగా జెట్టీ నిర్మిస్తున్నారుట. నెలకు ఇరవైరోజులు బారా టంగ్ మిగిలిన పదిరోజులు విశాఖలో కాపురం. అనంతరం అక్కడ వున్న క్యాంటిన్‌లో భోజనం ఏదో అయిందనిపించాము.

సాహస యాత్ర-2:

భోజనం అయ్యాక సముద్రం మీద మా ప్రయాణం మొదలయింది. మా రెండు కుటుంబాలకు కలిపి (మొత్తం ఏడుగురు) ఒక బోట్ ఏర్పాటు చేశారు. అందరము ముందు జాగ్రత్తగా లైఫ్ జాకెట్స్ వేసుకున్నతరువాత మా బోటు సున్నపురాయి గుహలు (limestone caves) వైపు బయలుదేరింది. పావుగంట ప్రయాణించిన తరువాత సన్నని దట్టమైన మడ అడవులగుండా ఐదు నిమిషాలు ప్రయాణం సాగింది. ఈ ప్రయాణం బ్రహ్మాండం అని అక్కడవాళ్ళు చెప్పుకుంటారు కానీ నాకు మాత్రం దీనికన్నా కేరళలో మడ అడవులలో పడవ ప్రయాణం అధ్భుతం అనిపించింది. అలా సాగిన పడవ చివరకు ఒక చిన్న వంతెన దగ్గరకి చేరింది. వెదురుతో నిర్మించిన ఆ వంతెన దాదాపు రెండువందల గజాలు వుంటుంది. విశ్రాంతి తీసుకోవటానికి చిన్న కుటీరాలు కూడా వున్నాయి. బహుశ సూర్య కిరణాలు కూడా పడనంత దట్టంగా వుంది ఆ ప్రాంతం. మేము వెళ్ళిన రోజు సూర్యుడు కనపడే అవకాశమే లేదు. అలా ఆ వంతెన దాటగానే విశాల మైదాన ప్రదేశం. దూరంగా అక్కడక్కడా కొన్ని ఇళ్లు. ఒక్కసారిగా చాలా ఆశ్చర్యమనిపించింది. అక్కడ వ్యవసాయం చేస్తున్న ఆనవాళ్ళు కనిపించాయి. మాతో వచ్చిన గైడు ఇవన్ని వివరించే స్థితిలో లేడు. ఎప్పుడు పని అవుతుందా వెనక్కి వెళదామన్న మూడ్‌లో వున్నాడు. అలా ఓ అరగంట నడిచాక సున్నపు రాయి గుహల దగ్గరికి చేరాము. అలసిపోయి వచ్చిన వాళ్ళకోసం అన్నట్టు నిమ్మకాయ నీళ్ళు అమ్ముతున్నారు. గ్లాసు పదిహేను రూపాయలు. నాలుగు ఇళ్ళు కూడా వున్నాయి. ఇళ్ళలోంచి టి.వి. సౌండ్ వస్తుంటే పరికించి చూసాను. ఎక్కడా కరెంట్ స్థంభాలు లేవు. ఒక ఇంటి ముందు అమ్మాయిని ఇదే విషయం అడిగితే సోలార్ ద్వారా కరెంటు వున్నది అని చెప్పింది. ఈ రోజుల్లో టెలివిజన్ వుంటే చాలు అది సముద్రమైనా అడవి అయినా పెద్ద బాధ వుండదు. అలా ఆ ఇళ్ళు దాటగానే అప్పుడు కనపడ్డాయి సున్నపు రాతి గుహలు. కొన్నివేల సంవత్సరాలు ప్రకృతిలో జరిగిన రసాయనిక చర్యల ద్వారా ఏర్పడిన గుహలు.

ఆ గుహలు ఎలా ఏర్పడ్డాయి, వాటిలో రకాలు ఏమిటి ఇత్యాది వివరాలు తెలియజేసే ముడు బోర్డులున్నాయి. అవన్ని వీలయినంతవరకు చదివి లోపలికి వెళ్ళాము. చిమ్మ చీకటి. మాతో వచ్చిన కుర్ర గైడు టార్చిలైట్ సహాయంతో గుహల ప్రాముఖ్యాన్ని వివరించటం మొదలుపెట్టాడు. తెల్లని సున్నపు రాయి వివిధ ఆకృతులలో ఏర్పడ్డాయి. వినాయకుడు, శివలింగం, ఏనుగు… ఇలా చూసినవారికి చూడగలిగినన్ని రూపాలు. పై కప్పు నుండి నేలమీదకు పరుచుకున్న సున్నపురాయి తెల్లని రంగులో మెరిసిపోతున్నాయి. సన్నని సూర్యకాంతి పడినా ఆమేరకు రాయి నల్లని రంగులోకి మారుతోంది. ఇలా తిరుగుతుంటె వీటిని ఎక్కడో చూసిన గుర్తు. వెంటనే తట్టలేదు. అందరం బయటకొచ్చి అలసిపోయి నిమ్మకాయ నీళ్ళు తాగుతుంటే అప్పుడు తట్టింది మన విశాఖ జిల్లాలో బుర్రా గుహలు కూడా ఇలానే వుంటాయని. వీటికంటే బుర్రా గుహలు బాగా maintain చేయబడుతున్నాయి. పబ్లిసిటీ మాత్రం చాలా తక్కువ. ఆ విధంగా మళ్ళీ అంతదూరం నడుచుకుంటూ మా బోట్ దగ్గరకు చేరాము. పిల్లలు మాత్రం బాగా enjoy చేసారు. వచ్చేటప్పుడు మాత్రం కొంచెం వాన పడితే మేము తెచ్చుకున్న గొడుగులకు పనిపెట్టాము. ఇందుగలడందు లేడన్నట్లు అండమాన్‌లో తెలుగువాళ్ళు కనపడతారు. మమ్మల్ని చూసి బోట్ నడిపే ఇద్దరు వ్యక్తులు తెలుగులో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళ తండ్రులు 50 ఏళ్ళ క్రితం వచ్చి స్థిరపడ్డారుట. వీళ్ళు మాత్రం పూర్వీకుల ఊరు శ్రీకాకుళం ఇంతవరకూ చూడలేదట. అలా కబుర్లు చెబుతూ direct గా బారాటంగ్ తీసుకోచ్చారు. కొద్దిసేపటికి జెట్టీలో మిగిలిన వాళ్ళు కూడా రావటంతో దాదాపు ఒకే సమయానికి చాలా వాహనాలు కదిలాయి. ఎవరైనా మధ్యాహ్నం మూడులోపల బయలుదేరితేనే అటవీ ప్రాంతం దాటగలుగుతారు. లేదంటే ఆ రాత్రికి అక్కడే వుండిపోవాలి. అలా వాహనాలన్నీ అటవీ ప్రాంతం దాటి జిర్కాటంగ్ రాగానే ఓ పావుగంట విడిదిచేసి మంచి టీ తాగాము. అలసి వుండటంతో చాలామంది నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం ఆరుగంటలకు పోర్ట్ బ్లయర్‌లో ఎక్కడ బయలుదేరామో అక్కడికి చేరుకుని క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నాము. అలా అండమాన్ లో మా చిన్న సాహసయాత్ర ఆనందంగా ముగిసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here