అండమాన్ అనుభూతులు-5

0
7

[box type=’note’ fontsize=’16’] నీల్ ద్వీపంలో జరిపిన ఒక రోజు విహారం మరి కొన్ని రోజులు ఆ ఊళ్ళో జీవించే శక్తినిచ్చిందంటున్నారు ఎన్.వి. హనుమంతరావు. [/box]

సమతల ప్రదేశం-నీల్ ద్వీపం:

[dropcap]చా[/dropcap]లా రోజుల తర్వాత మిత్రులతో కలసి ఆదివారం (19 ఫిబ్రవరి 2017) ఎక్కడికన్నా వెళ్ళాలని ప్లాన్ చేసాము. ఒంటరి జీవులకు జీవితం మీద మొహం మొత్తింది. ఎక్కడికెళ్ళినా ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి రావాలి. మిత్రుడి విజయకుమార్ సూచన ప్రకారం నీల్ ద్వీపం వెళ్ళటానికి నిర్ణయించుకున్నాము. ఒక రోజు ముందుగా టికెట్ బుక్ చేసుకున్నాము. ప్రస్తుత మేము ఇక్కడ స్థానికులం కాబట్టి గవర్నమెంట్ ఓడలో వంద రూపాయలకు రానూ పోనూ టికెట్ దొరుకుతుంది. నీల్ ద్వీపానికి సంబంధించిన సమాచారం కొంచెం సేకరించాను. అదీ కాక నా దగ్గర దాసరి అమరేంద్ర గారు అండమాన్ గురించి రాసిన పుస్తకం వుంది. అది చాలా ఉపయోగపడింది. దాదాపు పాతికేళ్ళ క్రితం డిల్లీలో ఉన్నప్పుడు ఆయన రాసిన “మూడు నగరాలు” అనే పుస్తకం చదివాను. అప్పటినుండి travelogues చదవటం అలవాటు చేసుకున్నాను. నిజానికి నేను ఇలా రాయటానికి ఆయనే నాకు inspiration. మొత్తానికి ఆదివారం ఉదయం 5.30కు మా ప్రయాణం మొదలయింది. యథాప్రకారం checking అంతా అయ్యాక ఆరు గంటలకల్లా మా సీట్లలో ఆసీనులయ్యాము. మా ఫెర్రీ ఆరున్నరకల్లా ఠంచనుగా బయలుదేరింది. తెల్లవారు ఝామున లేవటంవలన నాకు చిన్న కునుకు పట్టింది.

ఓ అరగంట తరువాత కళ్ళు తెరిస్తే పక్కన మిత్రులు లేరు. వాళ్ళని వెతుక్కుంటూ ఓడ పై భాగానికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళు ఓ మూల సర్దుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికే అక్కడ అన్ని వయసుల వాళ్ళు సామానుతో సహా సర్దుకుని ప్రయాణాన్ని అస్వాదిస్తున్నారు. సముద్రం మధ్యలో మా ఫెర్రీ. ఆహ్లదకరమైన వాతావరణం. నులివెచ్చని సూర్య కిరణాలు. చుట్టూ రకరకాల మనుషులు. నేనూ మా మిత్రద్వయంతో అక్కడే సెటిలయ్యాను. ఓ గంట తరువాత దూరంగా కొన్ని ద్వీపాలు కనపడ్డాయి. అందరిలోనూ ఎందుకో తెలియని ఉద్వేగం. మోములో ఒక రకమైన ఆనందం. సరిగ్గా ఎనిమిదింపావుకు నీల్ ద్వీపంలో అడుగుపెట్టాము.

జెట్టీనుండి పది అడుగులు లొపలికి వేయగానే welcome to Neil అని బోర్డు కనపడింది. చుట్టూ సముద్రం తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగులలో అద్భుతంగా దర్శనమిచ్చింది. ఆ తరువాత రోడ్డుమీదకు రాగానే ఆకలి గురుతుకొచ్చింది. మరో రెండు అడుగులు వేయగానే కుడివైపు ఒక south Indian hotel కనపడింది. ముగ్గురం అందులోకి దూరిపోయాము. టిఫిన్ తింటూ మా భవిష్యత్ కార్యక్రమానికి ఒక రూపం ఇవ్వటానికి ప్రయత్నించాము. అండమాన్ ద్వీప సమూహాలలో అత్యంత సమతల ప్రదేశం నీల్ ద్వీపం. అందుకే ఇక్కడ కూరలు ఎక్కువగా పండిస్తారు. Vegetable bowl of Andaman అని కూడా ఈ ద్వీపాన్ని పిలుస్తారు. ఇక్కడనుండి మళ్ళీ పొర్ట్ బ్లయర్ వెళ్ళటానికి return ticket పది గంటలకు ఇస్తారుట. అంటే ఇంకా గంటన్నర సమయం వుంది. ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంటే మా తమిళ మిత్రుడు నాగరాజన్ ఆ హోటల్ ఓనరుగారితో మాటలు కలిపి కొంత సమాచారం సేకరించాడు. అక్కడనుండి కనపడుతున్న చెట్లపొదల్లో నుండి అడ్డంగా ఐదు నిమిషాలు నడిస్తే భరత్‌పూర్ బీచ్ చేరుకోవచ్చు. ముందు అక్కడికి వెళ్ళి ఆ తరువాత return ticket తీసుకుంటే సాయంత్రందాకా ఏం చేయాలో ఆయన ప్లాన్ చేస్తాడట. తమిళంలో మాట్లాడితే కలిగిన ఫలితం ఇది. చలో అంటూ ముగ్గురం భరత్‌పూర్ వేపు దారి పట్టాము.

సమతల ప్రదేశం-నీల్ ద్వీపం-2:

మన దేశంలో అనేక ప్రదేశాలలో ఎన్నో బీచ్‌లు వున్నాయి. మనకు వీలునప్పుడల్లా వాటిని సందర్శిస్తూ వుంటాము. అయినా మనకు బోర్ కొట్టదు. ఈ అండమాన్ అంతటా ఎక్కడ చూసినా వున్నది అంతా బీచ్ సౌందర్యమే. అయినా వీటిని చూడటానికి మొహం మొత్తదు. ఎందుకంటే దేని సౌందర్యం దానిదే. Every beach has its own specialty and beauty. భరత్‌పూర్ బీచ్‌లో అడుగుపెట్టాగానే ఈ విషయం మరోసారి confirm అయింది. చల్లని చెట్లు, వాటికింద కూర్చోవటానికి అనువుగా బెంచీలు ఏర్పాటు చేసారు. షాపింగ్ చేసుకోవటానికి, అకలి వేస్తే తినటానికి చాలా దుకాణాలు వున్నాయి. ఇహ కొబ్బరిబోండాలకు కొదువలేదు. ఉదయం పూట కాబట్టి అప్పుడే జనం మెల్లగా చేరుకుంటున్నారు. వాతావరణం మొత్తానికి చాలా ఆహ్లాదకరంగా వుంది. ఇక హిందూ మహాసముద్రం వేపు దృష్టి సారిస్తే అదొక అద్భుతమైన కనువిందు. మూడు రంగులలో ముచ్చటగా సముద్ర జలం. దూరంగా వస్తూ పోతున్న ఫెర్రీలు. పెద్దగా అలలు లేకపోవటం వలన ఒడ్డునున్న పడవలు కదలలేదు. కొద్ది దూరంలో సముద్రంలో కొన్ని కుటుంబాలు కేరింతలు కొడుతున్నారు. అక్కడక్కడా దూరంగా కొన్ని హనీమూన్ జంటలు ప్రణయ ప్రఫంచంలో మునిగిపోయాయి. నీల్ ద్వీపంలో స్నానం చేయాలంటే ఇక్కడే చేయాలట. నీళ్ళు పూర్తి స్థాయిలో లేకపోవటం వలన, అదీగాక return ticket తీసుకోవాలి కాబట్టి పదిగంటలదాకా అక్కడే భరత్‌పూర్ బీచ్ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మళ్ళీ జెట్టీ దగ్గరకెళ్ళి tickets కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ south Indian hotel దగ్గరకు చేరాము. ముగ్గురం తేనీరు సేవించి సేద తీరాము. ఇహ మేము చూడవలసినవి మూడున్నాయి. అవి Natural Bridge, లక్ష్మణ్‌పూర్ బీచ్, సీతాపూర్ బీచ్. ఆ ఊళ్ళో మూడు దిక్కులలో వున్నాయి.

ఆ హోటల్ ఓనరు గారు మాకు ఓ ఆటో మాట్లాడిపెట్టారు. డ్రైవరు పేరు ప్రకాష్. బెంగాలీ. అక్కడే పుట్టి పెరిగాడట. చాలా హుషారుగా వున్నాడు. ముందుగా మా ప్రయాణం Natural Bridge వేపు సాగింది. ఆటో డ్రైవరు మాకు అరగంట మాత్రమే సమయమిచ్చాడు. దూరం నుండి చూసి రమ్మన్నాడు. ఓ వందగజాలు మట్టి దిబ్బలు ఎక్కుతూ ప్రయాణం. అవతలి వేపు మళ్ళీ సముద్రం. ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు. ఈ bridge ఏమిటో అర్ధం కాలేదు. దారిలో ఎదురుపడ్డ ఓ ఉత్తర భారత జంటను వాకబు చేసాము. ఈ రాళ్ళు, చెట్లను దాటుకుని వెళ్తే సహజంగా శిలాకృతిలో ఏర్పడ్డ బ్రిడ్జ్ వున్నది. చూడండి అన్నారు. కొంచెం కష్టపడుతూనే ముందుకెళ్ళాము. అప్పుడు అక్కడ ఆవిష్కరించింది అద్భుత దృశ్యం. సముద్రపు ఒడ్డున సహజంగా పెద్ద పెద్ద శిలలతో ఏర్పడిన Natural Bridges. దగ్గరలో వున్న bridge దగ్గర కూర్చుని అందరం ఫోటోలు తీసుకున్నాము. “అక్కడనుండి వందగజాల దూరంలో పొడవాటి bridge ఒకటి కనపడుతోంది. దానవతల సముద్రపు అందాలు ఇంకా బాగుంటాయి. ప్రయత్నించండి” అంటూ ఓ యువజంట సెలవిచ్చింది. కానీ అప్పటికే ప్రకాష్ మాకిచ్చిన సమయం గడిచిపోయింది. Next trip లో ఈ సాహసం చేద్దామనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో మసాలా వేసిన మామిడికాయ ముక్కలు తిన్నాము. వీటి రుచి మాత్రం కొత్తగా అనిపించింది. Neil Island అని ముద్రించిన T shirt కొన్నాను. మా నాగరాజన్ ఒక కొబ్బరిబోండాం లాగించాడు. కొద్దిగా కాళ్ళు నొప్పులు పుట్టినా ఈ సందర్శన తృప్తిగానే వుంది. ఇక మా ఆటో అక్కడికి మూడు కి.మీ. దూరంలో వున్న లక్ష్మణ్‌పూర్ వేపు సాగింది.

సమతల ప్రదేశం-నీల్ ద్వీపం-3:

లక్ష్మణ్‌పూర్ బీచ్ ఎక్కువగా విదేశీయుల అడ్డా అని ఆటో డ్రైవర్ ప్రకాష్ చెప్పాడు. అక్కడ నీళ్ళల్ళో కరెంట్ వుంటుందని, మమ్మల్ని నీళ్ళలో దిగద్దని, ఒకవేళ దిగినా సముద్రపు లోపలికి దాకా పోవద్దని ముందే హెచ్చరించాడు. సన్నని రోడ్డు మీద మా ప్రయాణం సాగుతోంది. దారిలో విదేశీయులు సైకిళ్ళపై వస్తూ ఎదురుపడ్డారు. మమల్ని ఒడ్డున దింపి మళ్ళీ ఒకటిన్నరకు వస్తానని మాయమయ్యాడు. మిట్ట మధ్యాహ్నం ఆ బీచ్‌లో అడుగుపెట్టగానే దాని అందానికి మేము డంగైపోయాము. కనుపుచూపు మేరంతా సముద్రమే. ముఖ్యంగా అక్కడి ఇసుక తెల్లని తెలుపు రంగులో చాలా మెత్తగా దాదాపు మైదా పిండి లాగా వుంది. సముద్ర జలాలు తెలుపు, ఆకుపచ్చ, నీలి వర్ణాలలో దర్శనమిచ్చాయి. లోపలికి అడుగుపెట్టగానే కుడి, ఎడమల వేపు రెండు మలుపులు వున్నాయి. మేము స్నానాలు చేయాలని, ఎవరూ వుండరనుకుని ఎడమవేపు తిరిగి కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడి దృశ్యం చూసి మొదట బిత్తరపోయాము. దాదాపు అరడజనుమంది విదేశీయులు మండుతున్న ఇసుకమీద అర్ధనగ్నంగా ఆనందంగా sun bath చేస్తున్నారు. అందులో నలుగురు స్త్ర్రీలు బికినీలు దరించి వున్నారు. మరో నలుగురు సముద్రంలో ఈత కొడుతున్నారు. ఆ దృశ్యాలు తిలకిస్తూ, డ్రస్ మార్చుకుని మేము కూడా నీళ్ళలోకి దిగాము. ఆ సమయంలో చాలా వేగంగా అలలు వస్తూ పోతున్నాయి. నీళ్ళలో చల్లదనం పైన మండుతున్న సూర్యుడు. అదో అనుభవం. మరో పావుగంట గడిచాక మరికొంచెం లోపలికి వెళ్ళగానే వేడి తగ్గి నీటి చల్లదనం పెరిగింది. అలా ఒంటిగంట దాకా మిత్రులం జలకాలాడి ఒడ్డుకు చేరి ముగ్గురు బట్టలు మార్చుకున్నాము. అప్పుడు కడుపులో కదలిక మొదలయింది. ప్రకాష్ రావటానికి ఇంకా అరగంట సమయముంది. మెల్లగా రోడ్డుమీదకెళ్ళి చెట్లకింద విశ్రమించాము. వెంట తెచ్చుకున్న డిల్లీ ఆలూ పరోటాని ఆంధ్రా టమోటా పచ్చడితొ లాగించాము. అలసట, సముద్ర స్నానం ఆ తరువాత మంచి ఆహారం. చిన్న కునుకు తీద్దామని ప్రయత్నిస్తుంటే ప్రకాష్ ప్రత్యక్షమయ్యాడు. బద్దకాన్ని వదిలించుకుని ముగ్గురం మళ్ళీ ఆటోలో కూలపడ్డాము. సీతాపూర్ అక్కడనుండి పన్నెండు కి.మీ. దూరం. నీల్ ద్వీపం బుల్లి బుల్లి గ్రామాలతో నిండిన ఓ పెద్ద గ్రామం. రోడ్డుకిరువైపులా చెట్లు, సముద్రపు గాలి, మిట్ట మధ్యాహ్నం ప్రయాణం కూడా ఆహ్లాదంగా సాగుతోంది. అలా రెండుగంటలకు సీతాపూర్ బీచ్ చేరుకున్నాము. ఇక్కడ కూడా జనం పెద్దగా లేరు. లోపలకు అడుగు పెట్టి ఒక్కసారి తేరిపార చూస్తే అప్పుడనిపించింది. మన సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్స్ వున్నారు. అందులో ఎవరు ఎక్కువ అందంగా వున్నారంటే ఏం చెప్పగలం. ఎవరి అందం వారిది. అలాగే ఈ బీచ్‌లు కూడా. అర్ధ చంద్రాకారంలో మరింత వయ్యారంగా వుంది ఈ బీచ్. ఇక్కడ సముద్రం బాగా లోతుగా వుంటుందిట. అందుకే నీళ్ళు నీలి వర్ణంలో మెరుస్తున్నాయి.

    

ఇద్దరు మిత్రులతో కబుర్లు చెపుతూ అర కి.మీ. నడిచి మళ్ళీ తిరిగి బయలుదేరిన ప్రదేశానికి వచ్చాను. ఆటో డ్రైవరు రెడీగా వున్నాడు. మమ్మల్ని త్వరగా జెట్టీ దగ్గర దించి మరో గిరాకి వెతుక్కునే హడావుడిలో వున్నాడు. మాకు కూరలు తీసుకు వెళ్ళాలని వుంది. కానీ ఐదు తరువాత కానీ దుకాణాలు తీయరట. ఇక ఎటువంటి కార్యక్రమాలు లేకుండా మా బృందాన్ని మళ్ళీ south Indian hotel దగ్గర దించాడు. వేడి తేనీరు సేవించి ఓనరు గారికి thanks చెప్పి నాలుగున్నరకు మళ్ళీ తిరుగు ప్రయాణానికి ఫెర్రీ ఎక్కాము. ఫెర్రీ కదలగానే అలసి పోవటంవలన ముగ్గురికి ఓ గంటపాటు మంచి కునుకు పట్టింది. అప్పుడు సామానుతో సహా ఫెర్రీ పైకి చేరాము. దాదాపు పోర్ట్ బ్లయరుకు సమీపంలో వున్నాము. మొత్తానికి ఏడు గంటలకల్లా ఇళ్ళకు చేరుకున్నాము. ఆ రోజు ఆ విధంగా మా నీల్ ద్వీప విహారం ఆనందంగా ఆహ్లాదకరంగా ముగిసింది. ఒక రోజు విహారం మరి కొన్ని రోజులు ఈ ఊళ్ళో జీవించే శక్తినిచ్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here