అందంతో చెలగాటం-1

16
7

[ఇన్సూరెన్స్ నేపథ్యంగా శ్యామ్‌కుమార్ చాగల్ అందిస్తున్న పెద్ద క్రైమ్ కథ. ఇది మొదటి భాగం.]

[dropcap]కా[/dropcap]ర్ దిగి బంగాళా పైనున్న ఇన్సూరెన్స్ ఆఫీస్ బోర్డు వేపు చూసింది ప్రత్యూష. అటు పక్కనుండి వెళ్తున్న మగవాళ్ళు ప్రత్యూష అందాన్ని దొంగ చూపులతో చూస్తూ వెళ్ళసాగారు.

అందానికి తగ్గ దర్పం, ఖరీదైన చీరతో ఆ జీవిత బీమా ఆఫీస్ లోకి అడుగు పెట్టి చుట్టూ చూసింది ప్రత్యూష. ఆమెలో డబ్బుతో వచ్చే పొగరు కనపడుతూ వుంది.

ముందు వరసలో వున్న ఉద్యోగిని చూసి “మీ మేనేజర్ గారిని కలవాలి.. ఎటు వేపు” అని నిర్లక్షంగా అడిగింది.

చేయి లేపి వెనక వేపు అన్నట్లుగా సైగ చేసి తిరిగి పనిలో మునిగి పోయాడు అతను.

తన పొడవాటి కాళ్లతో నాజూకుగా మేనేజర్ కేబిన్ వేపు నడిచింది. ఆమె వెళ్తూ ఉంటే చీర మీది నుండి ఖరీదైన సెంట్ చుట్టూ గాలిలో తేలుతూ వుంది..

మేనేజర్ కేబిన్ తలుపులు కాస్త తోసి “ఎక్స్క్యూజ్ మీ సర్, లోనికి రావచ్చా” అని చిన్నగా నవ్వి అడిగింది.

“రండి ప్లీజ్.. కూర్చోండి” అన్నాడు మేనేజర్ నంబియార్ లేచి నిలబడి.

“నా పేరు ప్రత్యూష, మిసెస్ వివి రావు. ఓ పాలసీ చేయాలి. అందుకే వచ్చాను.” అంది.

ప్రత్యూష వొంటి మీద నగలు, ఖరీదైన చీరను గమనించిన మేనేజర్ నంబియార్ “తప్పకుండా మేడం. మా సేల్స్ మేనేజర్, మీకు మంచి సలహా ఇస్తారు.” అని చెప్పి టేబుల్ మీదున్న బజర్ నొక్కాడు.

లోనికి వచ్చిన బంట్రోతును చూసి “మనోజ్ గారిని పంపించు. అలాగే కాఫీ తీసుకుని రా” అన్నాడు.

మరో రెండు నిముషాల్లో మనోజ్ లోనికి అడుగు పెట్టాడు.

“మీట్ మిస్..” అంటూ ఆగాడు నంబియార్.

“మిసెస్ ప్రత్యూష. వివి ఎస్టేట్స్ అండ్ ఇండస్ట్రీస్” అంది కాస్త గర్వంతో.

“హలో గుడ్ మార్నింగ్ మేడం” అని చెప్పి కూర్చున్నాడు మనోజ్.

ప్రత్యూషను పరికించి, కళ్ళు తిరిగిపోయే అందం అనుకున్నాడు మనోజ్.

“ఇతను మీక్కావలిసిన సమాచారం, వివరాలు.. అన్నీ అందచేస్తారు” అని ప్రత్యూషకు చెప్పి, తిరిగి మనోజ్ వేపు చూసి “ప్లీజ్ క్యారీ ఆన్ మనోజ్” అన్నాడు.

“మీరొక సారి మా ఇంటికి వస్తే అక్కడ ప్రశాంతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం” అని మనోజ్‍ను చూసి నవ్వింది.

ప్రత్యూష నవ్వులో అందం చూసి మైమరచిపోయాడు మనోజ్. “సరేనండి.. మీ అడ్రస్ ఇవ్వండి. ఏ సమయం మీకు వీలుగా ఉంటుందో చెప్పండి” అని మర్యాదగా అన్నాడు.

తన చేతులోనున్న లెదర్ హ్యాండ్ బ్యాగ్ లోనుండి కార్డు తీసి “ఇదుగోండి. సాయంత్రం ఆరు తర్వాత రండి. ఆ సమయంలో మా వారు క్లబ్‌కి వెళ్తారు.” అని చెప్పి ఆ కార్డుని నిర్లక్ష్యంగా మనోజ్‌కి ఇచ్చింది.

దాంట్లో అడ్రస్ ‘వివి ఎస్టేట్స్’ అని చూసి “రేపు మీకు ఓకేనా?” అన్నాడు.

“సరే.. రండి” అని లేచింది ప్రత్యూష.

లేచి మేనేజర్ నంబియార్‌కి థాంక్స్ చెప్పి బయటకు వెళ్తున్న ప్రత్యూష అందాన్ని అక్కడున్న ఆడవాళ్ళు ఈర్ష్యగా చూసారు.. మగవాళ్ళు కళ్ళతో నమిలి మింగేశారు.

ప్రత్యూష కార్డును మళ్ళీ ఒకసారి చూసుకుని ‘పెద్ద పార్టీ.. పెద్ద పాలసీ వచ్చే ఛాన్స్’ అనుకుని సంతోషంగా నిట్టూర్చాడు మనోజ్. ‘ఎలాగైనా పాలసీ చేయించాలి’ అనుకున్నాడు. తాను బాకీ పడ్డ బ్యాంకు లోన్స్, క్రెడిట్ కార్డులు గుర్తుకు వచ్చాయి.

పోర్ష్ కారులో ఎక్కి కూర్చొని మొబైల్ తీసుకుని ఫోన్ చేయసాగింది.

“హలో, గేలం వేసాను” అంది ప్రత్యూష.

అటువేపు నుండీ గరగర మంటూ స్వరం వినపడింది “గుడ్ జాగ్రత్త” ఆ మాటతో లైన్ కట్ అయ్యింది.

ఫోన్ పక్క సీట్ మీద పడవేసి, కారును ముందుకురికించింది ప్రత్యూష.

మరుసటి రోజు, కార్ ‘వివి ఎస్టేట్స్ గేట్’ ముందు ఆపి చూసాడు మనోజ్. ఆ కారును చూసి గేట్ పక్కనే వున్న వాచ్‌మన్ పరుగెత్తుకుంటూ వచ్చి “ఏం కావాలి సార్?” అన్నాడు..

“మేడం ప్రత్యూష గారు రమ్మన్నారు.” అన్నాడు మనోజ్.

పక్కకు నడిచి, గేట్ తీసి దారి ఇచ్చాడు వాచ్‌మన్. గేట్ నుండీ దాదాపుగా అర కిలోమీటర్ వెళ్ళాక ఎదురుగా పెద్ద బంగాళా కనిపించింది. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు దట్టంగా పెరిగి వున్నాయి. బంగళా ఎదురుగా రెండు బెంజ్ కార్లు, ఒక పోర్ష్ ఆగి వున్నాయి. వాటి పక్కన తన కార్ ఆపాడు.

వసారా మెట్లు ఎక్కి పెద్ద వరండా లోకి అడుగు పెట్టాడు. ఒక పక్కన పెద్ద ఇత్తడి ఫ్లవర్ వాజ్స్, వాటిలో రకరకాల పూల మొక్కలు అందంగా కనపడుతున్నాయి. ముందు తలుపు మంచి నల్లని చెక్కతో చేయబడి, దాని పైన కొమ్ములు తిరిగిన దున్న తల బొమ్మ వేలాడదీసి వుంది.

లోనికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించసాగాడు. అంతలో లోపల నుండీ టైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని “హలో, కం ఇన్ ప్లీజ్ మనోజ్ ‘‘ అంది ప్రత్యూష.

అదొక పెద్ద హాల్. దాన్నిండా ఎటు చూసినా రకరకాల నగిషీలు చెక్కిన రాజా సోఫాలు, టేబుల్స్ అందంగా అమర్చబడి వున్నాయి.

ఒక పక్కనుండీ పైకి పెద్ద మెట్లు కనపడుతూ ఉన్నాయి. మధ్యలో రాణి ఫోటో వేలాడదీసి వుంది.

ప్రత్యూషను చూసి కళ్ళు తిప్పుకుని కూర్చున్నాడు మనోజ్. ప్రత్యూష అందాలు రెచ్చగొడుతున్నట్లుగా అనిపించి ఇబ్బందిగా కూర్చున్నాడు.

పైనుండీ సూట్ వేసుకుని పెద్ద వయసు వ్యక్తి, కిందకు దిగి, మనోజ్ కేసి ఒకసారి చూసి టక టక మంటూ షూ చప్పుడు చేసుకుంటూ కాస్త తూలుతూ బయటకు వెళ్ళిపోయాడు.

అతడిని చూస్తున్న మనోజ్‌ను నింపాదిగా చూసి “ఆయన మా వారు, మిస్టర్ వివి రావు’’ అంది.

ఆశ్చర్యపోయాడు మనోజ్. ఆవిడ దాదాపుగా అతడి వయసులో సగం ఉంటుంది.

“ఏంటి? ఆయన వయసు గురించి ఆలోచిస్తున్నారా?” అంది అదో రకంగా, మనోజ్ మొహంలో భావాలను పసిగట్టి..

“అబ్బే అదేమీ లేదండి” అని తడబడ్డాడు మనోజ్. చాలా తెలివైంది ఈవిడ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనుకున్నాడు.

“పర్లేదు.. నా తల రాత” అంది తల కిందకు దించి. ఆవిడ గొంతులో నైరాశ్యం తొంగి చూసింది. కాసేపు మౌనంగా వున్నారిద్దరు.

“మీరేదో పాలసీ అన్నారు” అన్నాడు మనోజ్ టాపిక్ మారుస్తూ.

“పది లక్షల పాలసీ చెప్పండి” అంది.

అది విని ఉస్సూరుమన్నాడు మనోజ్.

“మీ స్థాయికి కనీసం పది కోట్ల పాలసీ చేయాలి మేడం” అన్నాడు తన మార్కెటింగ్ ప్రతిభను చూపెడుతూ.

“మా వారికి చేయాలి అంత పెద్దది, నాకెందుకు” అంది.

ఆ మాట వినగానే ఒంట్లో వుషారు పెరిగింది. అమ్మయ్య, ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈవిడను అనుకున్నాడు మనోజ్.

“అదింకా చాలా తెలివైన ఆలోచన మేడం. ప్రస్తుతం మీ వారికి వున్న మొత్తం పాలసీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తే అప్పుడు మీకు తగిన పాలసీ చెప్పగలను.” అన్నాడు అత్యంత వుత్సాహంగా తన సేల్స్ ప్రతిభను ఉపయోగిస్తూ..

“అలాగే తీసి పెడతాను. రేపు ఒక సారి రాగలరా” అంది ప్రత్యూష.

ఆవిడ అందాల నుండీ బలవంతంగా చూపు తప్పించి “వస్తానండి.. ఏ సమయంలో’’ అన్నాడు.

“నేను రేపు చెప్తాను. ఒక సారి మీరు ఫోన్ చేయండి” అంది ముందుకు వంగి.

టీ షర్ట్‌లోనుండీ కనపడుతున్న అందాలను చూసి తన్ను తాను అదుపులో పెట్టుకుని “సరే ప్రత్యూష గారు” అన్నాడు. అతని గొంతులో ఏదో అడ్డం పడ్డట్టుగా అనిపించింది.

“ఏం తీసుకుంటారు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్?” అనడిగింది వెనక్కి సోఫాలో చేరగిలబడి.

“ఏదైనా పర్వాలేదు ప్రత్యూష గారు” అన్నాడు.

పనివాడిని పిలిచి చెప్పింది ప్రత్యూష.

“మీకు ఎంత మంది పిల్లలు..” అంటూ ఆగిపోయాడు.

“నాకు లేరండి, మా ఆయన మొదటి భార్యకు ఒక కూతురు” అంది దిగాలుగా మొహం పెట్టి.

“అయ్యో.. సారీ మేడం” అన్నాడు మనోజ్ నొచ్చుకుంటూ.

అది విని పకపకమంటూ నవ్వసాగింది ప్రత్యూష. తెల్లబోయి చూసాడు మనోజ్. ఆవిడ నవ్వుతుంటే అందాలన్నీ యెగిరి పడసాగాయి. మనోజ్ లోని కోరికలు జుమ్మంటూ ఉవ్వెత్తున ఉప్పొంగాయి. అతి కష్టం మీద వాటిని అణచుకుంటూ కూర్చున్నాడు. కాఫీ తీసుకుని వచ్చాడు పనబ్బాయి.

తీసుకుని కప్‌ని చూసాడు. వెండి కప్పులకు బంగారు పూల డిజైన్ వేసి ఉంది.

“మీకు పెళ్లయిందా’’ ఆకస్మికంగా అడిగింది ప్రత్యూష.

“ఇంకా కాలేదండి” అన్నాడు మనోజ్.

‘‘ఎవరినయినా ప్రేమించారా?” నవ్వుతూ అడిగింది.

ఆమె నవ్వుతో రెట్టింపైన అందం చూసి మతిపోయింది మనోజ్‌కు.

“అబ్బెబ్బే అంత అదృష్టం నాక్కలగ లేదు లెండి” అన్నాడు.

“ఏం.. మీకేం స్మార్ట్‌గా ఉన్నారుగా..” అని చిరునవ్వుతో అతడి కళ్ళలోకి సమ్మోహనంగా చూసింది ప్రత్యూష.

నవ్వి ఊరుకున్నాడు మనోజ్.

“రేపు మా వారిని పరిచయం చేస్తాను. నేను మిమ్మల్ని పిలిచానని, మీ ఆఫీస్‌కు నేను వచ్చినట్లుగా చెప్పకండి. ఉద్యోగంలో భాగంగా వచ్చానని చెప్పండి’’ అంది.

ఆ మాటలలో ఏదో అనుమానం, అపశకునం తోచింది మనోజ్‌కు. ఇదేదో తలనొప్పి వ్యవహారం లాగుంది, వదిలేయటం మంచిదేమో అనుకున్నాడు. అతనలా చేస్తే అతని జీవితం, భవిష్యత్ వేరేలాగా ఉండేది. కానీ అతను వదిలేయ లేదు.

ఇంటికెళ్లిన మరుసటి రోజు ఉదయం నుండే ప్రత్యూష ఫోన్ కొరకు ఎదురు చూడసాగాడు. ఆమె అందాలు ప్రతీ క్షణం కళ్ళ ముందు కనపడసాగాయి. ఆమెతో ఎలాగైనా సాన్నిహిత్యం, స్నేహం కుదిరితే అది నా అదృష్టం అనుకున్నాడు.

ఆ రోజంతా ప్రత్యూష నుండీ ఫోన్ రాలేదు. దాంతో మనోజ్‌కు ఏమీ పాలుపోవటం లేదు. ఏ పని చేస్తున్నా ప్రత్యూష అందమే కళ్ళ ముందు కనపడసాగింది. ఏ పని మీద కూడా మనసు లగ్నం చేయలేక పోయాడు. చాలా సార్లు ప్రత్యూషకి ఫోన్ చేద్దామా అని మొబైల్ చేతిలో తీసుకుని, కాసేపు ఆలోచించి, దాన్ని పక్క న పెట్టేసాడు..

రాత్రి వరకూ ఫోన్ తీసి పదే పదే చూసుకున్నాడు. రాత్రి చాలా వరకూ నిద్ర పోలేదు..

మరుసటి రోజు కూడా ఫోన్ రాలేదు. కేబిన్‌లో మేనేజర్‌తో మాట్లాడుతూ ఉండగా వున్నట్లుండి మొబైల్ మ్రోగసాగింది. ఉలిక్కి పడి వెంటనే ఫోన్ తీసుకుని “హలో హలో” అన్నాడు కంగారుగా.

“హలో నేనేనండీ.. ప్రత్యూష. మీరు వచ్చేయండి” అంది.

“సరేనండి, ఇదుగో బయలుదేరుతున్నాను” అంటూ టేబుల్ మీద పేపర్లు అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి హడావిడిగా బయటకు పరుగులు తీసాడు మనోజ్.

బంగళా ముందు కార్ ఆపి దిగాడు మనోజ్. అతని శరీరమంతా చెప్పలేని ఉద్రేకంతో నిండి పోయింది.

గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ముందు ద్వారం దగ్గరే ఎదురైంది ప్రత్యూష. నీలం రంగు చీరలో అప్సరసలా మెరిసి పోతూ వుంది.

“హలో రండి” అంది నిర్వికారంగా. ఆమె మొహంలో ఎక్కడా నవ్వు కనిపించ లేదు.

ఆకాశం నుండీ దిగి వచ్చిన దేవత లాగా వయ్యారంగా నడుస్తూ లోపలికి దారి తీసి సోఫా చూపించి “కూర్చోండి.. ఆయన వస్తారు” అని చెప్పి వెళ్లిపోయింది.

“హలో హౌ అర్ యు” అంటూ మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చి కూర్చున్నాడు వివి రావు.

“ఫైన్ సర్ థాంక్యూ” అని లేచి నిలబడ్డాడు మనోజ్.

“కూర్చోండి” అన్నాడు వివి రావు గంభీర మైన స్వరంతో.

కూర్చొని బ్రీఫ్ కేసులో నుండీ కొన్ని పేపర్లు తీసి వివరించాడు మనోజ్. వివి రావు టాక్స్ పేపర్స్ అన్నింటినీ చూస్తూ కొన్ని పాయింట్స్ రాసుకున్నాడు.

మనోజ్‌నే గమనించ సాగాడు వివి రావు. దాదాపుగా అరగంట సేపు మనోజ్ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత “ఇంతకీ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి?” అన్నాడు.

ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోతూ సమాధానం చెప్పాడు మనోజ్.

“ఇంత మంచి చదువు, ఇన్ని తెలివితేటలు పెట్టుకుని, ఈ వుద్యోగంలో ఎందుకు చేరారు?” అన్నాడు.

మళ్ళీ ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలీక “నిరుద్యోగ సమస్య మన దేశంలో ఎక్కువ కదండీ” అని నవ్వాడు మనోజ్.

“ఇప్పుడు మీకిస్తున్న శాలరీ కంటే మూడు రేట్లు ఇస్తాను, నా దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా చేస్తారా?” సూటిగా అడిగాడు వివి రావు.

ఏం మాట్లాడాలో తెలీక విస్తుపోయాడు మనోజ్. “సార్ అదీ అదీ..” అంటూ ఆగిపోయాడు.

“చెప్పండి” అన్నాడు వివి రావు

“నాది ఇందులో ఫ్రీలాన్స్ వుద్యోగం, ఆఫీస్ వెళ్లాల్సిన పని లేదు. వ్యాపారాన్ని బట్టి నా రాబడి ఉంటుంది. కానీ మీ పనిలో నా కెలాంటి అనుభవం లేదు మరి.” అన్నాడు కాస్త వెనక్కి తగ్గి రెండు చేతులు కట్టుకుని.

“నేనన్నీ నేర్పిస్తాను. అడ్వాన్స్‌గా అయిదు లక్షలు ఇస్తాను, రేపటినుండి నాతోనే ఉండాలి. ఉదయం ఎనిమిది గంటలనుండీ సాయంత్రం ఆరు వరకూ.” అని చెప్పి మనోజ్ ముఖ కవళికలను గమనించసాగాడు రావు.

అంతలో లోపలి నుండీ ప్రత్యూష వచ్చి “రావు! ఇప్పుడు కొత్తగా పిఏ అవసరమా?.. ఆలోచించు” అంది కాస్త చిరాకుగా.

“ఇది పూర్తిగా నా వ్యాపార వ్యవహారం” అన్నాడు. అతని మొహం కేసి చూసాడు మనోజ్. రావు కళ్ళలో ఆమె పట్ల అర్థం కానీ ఏహ్యభావం కనపడింది.

పరిస్థితి గమనించి వెళ్లి పోవటం మంచిదేమో అని ఆలోచనలో పడ్డాడు మనోజ్. అంతలోనే రావు గారు మనోజ్ ఇబ్బందిని గమనించి “చూడండి మనోజ్, నా ఆఫర్ మీకు నచ్చితే చెప్పండి” అన్నాడు.

వీలు కాదని చెపుదామని అనుకున్నాడు మనోజ్. కానీ కట్టవలసిన బ్యాంకు వాయిదాలు ఇంట్లో పరిస్థితి గుర్తుకు వచ్చి “సరే సర్.. వస్తాను” అన్నాడు.

“ఓకే. మీరు, రేపటినుండి వచ్చేయండి.” అన్నాడు రావ్.

“వెళ్ళొస్తాను సర్, థ్యాంక్యూ మేడం” అని లేచాడు మనోజ్.

మనోజ్ వేపు చూసి అదోలా చూసింది ప్రత్యూష.

ఇంటికెళ్లి భోజనం చేసి గదిలో పడుకుని ఆలోచించసాగాడు. రేపటి నుండీ ప్రత్యూషను రోజూ చూడొచ్చు అనే ఆలోచన, ఉత్సాహం అతడికి నిద్ర లేకుండా చేశాయి.

ఉదయం త్వరగా లేచి బయలుదేరి, ఎస్టేట్స్ బంగాళా ముందు కార్ ఆపి, పైకి మెట్లు ఎక్కి వరండాలో నిలబడ్డాడు.

అక్కడే వున్న ప్రత్యూష “కూర్చో మనోజ్” అని లేచి వెళ్లి పోయింది.

కొద్దిసేపటికి రావు వచ్చి, లోనికి రమ్మంటూ సైగ చేసి తన ఆఫీస్ గది లోకి తీసుకెళ్లి ఒక పక్కగా వున్నటేబుల్, కుర్చీ చూపించి “ఇక్కడ కూర్చొని మీరు పని చేసుకోవాలి. అదుగో నా ఫైల్స్ అండ్ బుక్స్ ఓ రెండు రోజులు వాటిని తిరగెయ్యండి. కాస్త అవగాహన వస్తుంది. ఇంకాసేపటికి మనం కాఫీ ఎస్టేట్స్ కు వెళ్ళాలి. డ్రైవర్ రాలేదు. అందుకే వెయిటింగ్” అన్నాడు.

ఆఫీస్ అంత కలయ చూసాడు మనోజ్. చుట్టూ గాజు అల్మెరాలు. వాటిల్లో లెక్క లేనన్ని పుస్తకాలు చిందర వందరగా వున్నాయి.

ముందు వేపున్న పెద్ద టేబుల్ ముందు కూర్చొని సిగార్ వెలిగించుకున్నాడు రావు. ఆ టేబుల్ మీద కూడా ఫైల్స్ దొంతరలుగా పడి వున్నాయి.

“నాకు డ్రైవింగ్ వచ్చు సార్. నేను తీసుకెళ్తాను.. పదండి” అన్నాడు మనోజ్.

“నైస్.. పద” అంటూ లేచి మెల్లిగా తూలుతూ బయటకు నడిచి మెట్లు దిగాడు రావు.

జీపెక్కి స్టార్ట్ చేసాడు మనోజ్. పై అంతస్తు గది కిటికీ లో నుండీ చూస్తున్న ప్రత్యూష మొహంలో చిన్న చిరునవ్వు కదిలింది.

కాఫీ ఎస్టేట్స్‌కు వెళ్తున్నంత సేపు ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు రావు.

కాఫీ తోటలో ఎత్తైన ఒక ప్రదేశంలో వున్న పెద్ద గెస్ట్ హౌస్ ముందు జీప్ ఆపాడు మనోజ్. రావు జీప్ దిగ గానే పక్క నుండీ సూపర్‌వైజర్ రాములు, మరో ఇద్దరు పని వాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి నమస్కరించి నిలబడ్డారు.

అందరి వేపూ ప్రేమగా ఒక సారి చూసి గెస్ట్ లోనికి వెళ్ళాడు రావు.

పెద్ద రోజ్‌వుడ్ తో చేసిన టేబుల్, కుర్చీలు, సోఫా లతో అందంగా వుంది ఆఫీస్. చుట్టూ మూడువైపులా గ్లాసుల్లో నుండీ కాఫీ తోట కనపడుతూ వుంది. టేబుల్ మీద టీ కప్స్ పెట్టాడు సూపర్ వైజర్.

“తీసుకో” అని మనోజ్‌కి చెప్పి తాను ఒక కప్ తీసుకున్నాడు రావు.

అక్కడున్న లెడ్జెర్, ఖాతా పుస్తకాలు తీసుకుని చూడసాగాడు మనోజ్. గంట తర్వాత పుస్తకాలు పక్కన పెట్టి రావు వేపు చూసి అన్నాడు “రాబడి బాగా తగ్గింది. ఖర్చులు మాత్రం ఎక్కువై పోయాయి. బ్యాంకులో కట్ట వలసిన బాకీ సమయం దాటి పోయింది. అయితే మనకు రావాల్సిన బకాయిలు మాత్రం చాలా వున్నాయి.” అని రావు వేపు చూసాడు.

ఒకసారి నిట్టూర్చి “ఇంతకు ముందున్న, నా భార్యకు తెలిసిన మేనేజర్ ఒక సంవత్సరం చేసాడు. నా భార్య, అతనూ చూసుకుంటారని ధీమాతో నేనూ సరిగ్గా పట్టించుకోలేదు. ఇలా జరిగింది. అందుకే ఇప్పుడు నిన్ను తీసుకున్నాను” అన్నాడు రావు.

పక్కన నిలబడి వున్న సూపర్‌వైజర్‌ని చూసి “ఇతను మనోజ్ అని నా కొత్త పి.ఎ. ఇప్పటి నుండీ అన్నీఇతనే అన్నీ చూసుకుంటాడు” అని మనోజ్‍ని చూపించాడు రావు. మనోజ్ వేపు చూసి నమస్కారం చేసాడు సూపర్‌వైజర్ రాములు. ఆ రోజంతా అక్కడి పనులు చూసుకున్నాడు మనోజ్. రాములును వెంట బెట్టుకుని ఎస్టేట్ అంతా తిరిగాడు.

కొందరు పనివాళ్ళు చెట్ల పైన మందు చల్లుతూ కనిపించారు. చల్లని నీరెండలో చుట్టూ ప్రశాంతంగా వున్న కొండల మీద నుండీ వస్తున్నచల్లని గాలి ని ఆస్వాదిస్తూ నిలబడ్డాడు మనోజ్.

అప్పుడు మెల్లిగా సంశయిస్తూ అన్నాడు రాములు “సార్ చాల మంచివారు. మొదటి భార్య ఉండగా చాలా సంతోషంగా వుండేవారు. పోయిన ఏడాది మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మార్పు వచ్చింది.”

రాములుని ప్రశ్నార్థకంగా చూసాడు మనోజ్.

రాములు ఇక ఏమీ మాట్లాడ లేదు. కొన్ని అడుగులు ముందుకు వేసాక మళ్ళీ అన్నాడు “అంతకు ముందెన్నడూ తాగి ఎరగని సార్ ఇప్పుడు దానికి మొత్తంగా బానిస అయిపోయాడు.”

అది విన్న మనోజ్ ఆలోచిస్తూ, అక్కడ నుండీ గెస్ట్ హౌస్ లోకి దారి తీసాడు.. లోపలికి అడుగు పెట్టగానే ఆల్కహాల్, విస్కీ వాసన గుప్పుమని ముక్కుపుటాలకు తగిలింది. హాలులో సోఫా మీద పడుకుని వున్నారు రావు. టీపాయ్ పైన సోడా, విస్కీ బాటిల్స్ ఖాళీగా వున్నాయి.

పక్కన వున్న రాములు వేపు తిరిగి ఏం చేద్దామన్నట్లుగా చూసాడు మనోజ్.

“ఆయనింక లేవ లేరండీ.. ప్రొద్దున వరకూ ఇక్కడే, బెడ్ రూమ్‌లో పడుకో పెట్టాలి” అన్నాడు.

ఇద్దరూ రావుని మోసుకుంటూ వెళ్లి మంచం మీద పడుకో పెట్టారు.

దుప్పటి కప్పి వెనక్కు తిరుగుతుండగా “మనోజ్ ఇలా.. రా. కొద్దిసేపు కూర్చో” అని మూలిగాడు రావు.

అది విని బయటకు వెళ్లి పోయాడు రాములు.

ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు మనోజ్.

“మనోజ్ నే చేసిన మొదటి తప్పు రెండవ పెళ్లి చేసుకోవటం..” అని ఆగి ఆయాసంగా ఊపిరి పీల్చాడు.

ఏమీ మాట్లాడకుండా రావుని చూసాడు మనోజ్.

“చిన్న హోటల్‌లో పనిచేస్తున్న ఈమెను చూసి అందానికి పిచ్చివాడిని అయ్యాను” అని చిన్నగా వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు.

ఏమని సముదాయించాలో తెలీక ఇబ్బందిగా బాధతో చూస్తున్నాడు మనోజ్.

“ఆవిడ బీదరికం చూసి, డబ్బుతో కొనే ప్రయత్నం చేయకుండా, పెళ్లి చేసుకుని, మంచి జీవితం, హోదా, డబ్బులు ఇచ్చాను. డబ్బు మీద చూపే ప్రేమలో నన్ను తాను పది శాతం ప్రేమించినా నేను ఎంతో సంతోషంగా వుండేవాడిని.” అని ఆగాడు.

మౌనంగా కూర్చున్నాడు మనోజ్.

“అది ఆడది కాదు.. క్రూర మృగం” అని గొణిగాడు. అలా తనలో తాను ఏదో అనుకుంటూ కొద్దీ సేపట్లో గురక మొదలు పెట్టాడు రావు.

ఈ వయసులో చిన్న వయసు అమ్మాయిని చేసుకోవటం ఆయన తప్పు అనుకుని, మెల్లిగా లేచి బయటకు సవ్వడి కాకుండా అడుగులు వేసి జీప్ ఎక్కాడు మనోజ్.

అంతలో సడన్‌గా జేబులో మొబైల్ మ్రోగసాగింది.

తీసి చూసాడు ప్రత్యూష మేడం అని పేరు కనపడింది.

“హలో చెప్పండి మేడం” అన్నాడు.

“రావు గారు పడుకున్నారా” అంది ప్రత్యూష తీయగా నవ్వుతూ.

“అవునండీ” అన్నాడు మనోజ్. ప్రత్యూష గొంతు వినగానే అతని వొంట్లో రక్తం వేగంగా పరుగులు తీసింది..

“సరే ఒక ముఖ్య మైన విషయం మాట్లాడాలి వస్తారా?” అంది నవ్వుతూ.

“వస్తాను మేడం” అన్నాడు. ఎక్కడ లేని హుషారు వచ్చేసి జీప్ స్టార్ట్ చేసాడు మనోజ్.

ఇంతలో రాములు వచ్చి చిన్నగా “సార్.. కాస్త జాగ్రత్త” అన్నాడు చేతులు కట్టుకుని తల కిందకు వంచుకుని.

‘‘సరే” అని జీప్ ముందుకురికించాడు మనోజ్.

వివి ఎస్టేట్స్ బంగాళా ముందు జీప్ ఆపి దిగాడు మనోజ్. పోర్టికో, వరండా అంతా లైట్స్‌తో బంగాళా దేదీప్యమానంగా వెలుగుతోంది.

వేగంగా మెట్లెక్కి వరండాలో అడుగు పెట్టేసరికి ప్రత్యూష తలుపుకు ఆనుకుని ఎదురుగా నిలబడి మనోజ్‌ని తదేకంగా చూసింది.

“గుడ్ ఈవెనింగ్ మేడం” అన్నాడు మనోజ్.

సన్నని నైలాన్ చీరలో అత్యంత అద్భుతంగా మలచిన శిల్పంలా వుంది ప్రత్యూష. వదులుగా వేసుకున్న జడ. దాన్నిండా మల్లె పూల మాల తురిమింది.

ఇంత అందమైన భార్య ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ దొరకదనిపించింది మనోజ్‌కి.

“రండి పైన లోపల కూర్చుందాం” అని పై మెట్ల వేపు దారి తీసింది ప్రత్యూష.

లోపల ఎక్కడా పని వాళ్ళ అలికిడి వినిపించలేదు.

అది గమనించి “ఎవరూ లేరు, సినిమా వెళ్తామంటే పంపించేసాను” అని అంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here