అందీ అందని ఆశ

0
12

[శ్రీ షేక్ అమీర్ బాషా రాసిన ‘అందీ అందని ఆశ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]ధారణంగా మనిషి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాడు. గతాన్ని తలచుకొని ఆనందించడం చాలా అరుదు. 70 ఏళ్లు నిండిన జాన్ భాస్కర్ వర్తమానాన్ని గురించి ఆలోచించడు, భవిష్యత్తు ఆశించడు. కేవలం గతాన్ని తలుచుకుంటూ అందులోనే ఆనందాన్ని, బాధని అనుభవిస్తూ ఉంటాడు. అది అతని నిత్యకృత్యం. భాస్కర్ జ్ఞాపకాల పొరల నుంచి జాలువారినదే ఈ కథ.

చిన్ననాటి నుంచి జాన్ భాస్కర్ చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో తండ్రి అకాల మరణం చెందారు. అతనికి ముగ్గురు చెల్లెళ్ళు. తల్లి ప్రమీల రాణి. భర్త సంపాదిoచిన మూడు ఇళ్ళను అద్దెకు ఇచ్చి ఆ ఆదాయంతో పిల్లలను పోషిస్తూ వారికి చదువు చెప్పిస్తుంది. చిన్న పోర్షన్లు తక్కువ అద్దెల రాబడి కావడంతో నోటికి ఐదు వేళ్ళు అందేవి కావు.

ప్రభుత్వ సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుందరయ్య ఓ పోర్షన్‌లో అద్దెకు ఉన్నాడు. ఆయన భార్య ఇందిర. ఆ దంపతులకు అనిత, సంగీత, సునీత అని ముగ్గురు ఆడపిల్లలు. ఇంచుమించు ప్రమీలమ్మ ఆడపిల్లల వయసువారు. సుందరయ్య రెండు చేతుల సంపాదించేవారు. ఇందిరతో ప్రమీల రాణికి మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. అవసరమైనప్పుడు ఇందిర ప్రమీలారాణికి ఆర్థిక సహాయం కూడా చేసేది. జాన్ భాస్కర్‌ను ఇందిరమ్మ చాలా ఆప్యాయంగా చూసేది.

ఆ రోజు 12వ తరగతి ఫలితాలు పేపర్లో వేశారు. భాస్కర్ సంతోషంగా తల్లికి పేపర్ చూపిస్తూ తాను మొదటి శ్రేణిలో పాస్ అయినట్లు తెలిపాడు. ప్రమీలమ్మ నుదుట ముద్దు పెట్టుకుని “వెళ్లి ఈ విషయం ఇందిరక్కకు చెప్పరా” అంది. అంతే సంతోషంగా భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇందిరమ్మ అనితకు జడ వేస్తూ కూర్చుని ఉంది. భాస్కర్ ఫలితాల గురించి చెప్పగానే ఆవిడ లేచి లోపలికి వెళ్లి ఓ స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చింది. అందులో నుంచి ఓ లడ్డు తీసి భాస్కర్ నోట్లో పెట్టి “నాకు తెలుసు నాన్నా, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. అందుకే నిన్ననే స్వీట్లు తెప్పించి పెట్టాను. తీసుకెళ్లి అందరికీ పంచు” అంది. మొదటి లడ్డు అనితకు ఇచ్చాను. తీసుకొని నవ్వుతూ ‘సాధించావు’ అన్నట్లు బొటనవేలు చూపించింది. అనితకు 14 సంవత్సరాలు ఉంటాయి. మితభాషి. స్కూల్ నుంచి రాగానే ఇంటి పనుల్లో అమ్మకు చేదోడు వాదోడుగా ఉండేది. రెండవ అమ్మాయి సంగీతకు 11 ఏళ్లు. చాలా చురుగ్గా ఉండేది. సునీతకు ఐదేళ్లు. వీళ్ళిద్దరూ ఎక్కువగా ప్రమీలమ్మ కూతుర్లతో ఆటల్లో మునిగి ఉండేవారు.

మరుసటి రోజు మధ్యాహ్నం ఇందిరమ్మ భాస్కర్‌ని పిలిచి బిర్యానీ వడ్డించింది. తృప్తిగా తిన్న భాస్కర్ అక్కడే వరండాలో ఓ కథల పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. ప్రమీల రాణి కూడా అక్కడికే వచ్చి కూర్చుని ఇందిరమ్మతో మాట్లాడసాగింది. ఇద్దరూ తన భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నారని తెలుసుకున్న భాస్కర్ చదువుతూనే శ్రద్ధగా వినసాగాడు.

 “నీ నిర్ణయం మంచిది కాదు రాణి. ఇంత చిన్న వయసులో వాడు పనిలోకి పోవడం ఏమిటి? చదువుకోవాల్సిన వయసు. చదివిస్తే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.” సలహా ఇచ్చింది ఇందిరమ్మ.

“నిజమే, కానీ కాలేజీ చదువులు చెప్పిచ్చేటంత స్తోమత నాకు లేదు. వాడి తర్వాత ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లని కాస్తో కూస్తో చదివించాలి, వాళ్లకి పెళ్లిళ్లు చేయాలి. ఇవన్నీ ఆలోచించి వాడిని ఏదో ఒక పనిలో పంపించాలి ఉన్నాను. టైలరు లేదా మెకానిక్ అయితే వాడి బ్రతుకు వాడు బ్రతకడమే కాక, నాకు ఆడపిల్లలకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఈ లోపల మీ ఆయన దయతో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరవచ్చు. డిగ్రీ ఆ పైన చదువులు కావాలంటే మరో ఐదు సంవత్సరాలు పడుతుంది. అంత ఖర్చు భరించేందుకు నా దగ్గర ఏముంది చెప్పు” ప్రమీల సంజాయిషి.

“రాణి, మంచోచెడో నేను ఓ మాట చెప్తాను విను. నీ కొడుకు కాలేజీ చదువులకు ఆపై చదువులకు అయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను, కానీ ఓ కండిషన్. కండిషన్ ఏo కాదు, ప్రతిపాదననుకో.” అంది ఇందిర.

“ఏంటో చెప్పమ్మా. మీకంటే ఆప్తులు మా మంచి కోరేవాళ్లు వేరే ఎవరున్నారు నాకు” అడిగింది ప్రమీల.

“రాణి మనసులో మాట చెబుతున్నాను. మరోలా అనుకోవద్దు. భాస్కర్ చదువుకు ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. వాడి మంచి చెడులన్నీ నేనే చూసుకుంటాను. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిద్దాం. తర్వాత నీ కొడుకు నా ఇంటి అల్లుడు కావాలి”.

వింటున్న భాస్కర్ ఉలిక్కిపడ్డాడు. అలాంటి ఉలికిపాటే ప్రమీలారాణిలో కనిపించింది. ఆశ్చర్యంగా ఇందిరను అడిగింది “ఏం మాట్లాడుతున్నావ్ ఇందిరా? కులమతాల మాటేంటి? మీ ఆయన అభిప్రాయం కనుక్కున్నావా? నాకంతా అయోమయంగా ఉంది.”

ఓ నిట్టూర్పు విడుస్తూ ఇందిరమ్మ చెప్పడం మొదలుపెట్టింది. “ఇందులో అయోమయం ఏమీ లేదు. నీకు తెలుసు, నా ఆరోగ్యం బాగాలేదు. ఉంటానో ఉడుతానో తెలీదు. ఇంకా కులమతాలేంటి? మనం పాత ఆచారాలను పట్టుకుని ఊగులాడకూడదు. మా ఆయన్ను నేను ఒప్పిస్తాను. మన స్నేహం బంధుత్వంగా మారడం నీకు ఇష్టం లేదా?”

“అంత మాట అనకు ఇందిరా” అని భాస్కర్ వేపు చూసి “ఒరేయ్ రేపు కాలేజీకి వెళ్లి అప్లికేషన్ తీసుకురా. నీ ఫ్రెండ్ బబులు రేపు కాలేజీకి ఎప్పుడు వెళతాడు తెలుసుకోరా. వెళ్ళు.” పురమాయించింది. భాస్కర్ లేచి వెళ్లిపోయాడు.

ప్రమీలారాణి ఇందిర చేతులు పట్టుకొని “ఇందిరా మీ సహయం జన్మ జన్మలకు మరచిపోలేను” అంది.

“అంతంత పెద్ద మాటలు వద్దులే రాణి. ఇదిగో ఈ పైకం ఉంచి వాడికి నాలుగు జతల బట్టలు కుట్టించు. వాడి చదువు పూర్తయ్యేంతవరకు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. వాడికి మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఏసుప్రభువును వేడుకో” అంటూ కొన్ని నోట్లు ప్రమీలకు ఇచ్చింది.

ఆ విధంగా ఇందిర సహాయంతో జాన్ భాస్కర్ కాలేజీ చదువులకు శ్రీకారం చుట్టబడింది.

ఆ విధంగా ఇందిరమ్మ ఆర్థిక సహాయంతో జాన్ భాస్కర్ డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువులకు యూనివర్సిటీకి వెళ్ళాడు. ఐదు సంవత్సరాలు చదువుకైన ఖర్చులు కాక పై ఖర్చులకు, పుస్తకాలకు,టూర్లకు ఖర్చు తానే భరించింది. జాన్ భాస్కర్ కూడా ఆమె పట్ల గౌరవాభిమానాలు చూపేవాడు. అతను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ చెప్పుకోతగ్గ సంఘటన జరిగింది .

ఆరోజు ఆదివారం. జాన్ భాస్కర్ ఉదయం సినిమాకి వెళ్లి వచ్చాడు. వరండాలో ఒంటరిగా కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు. ప్రమీలమ్మ తన ముగ్గురు ఆడపిల్లలతో ఇందిరమ్మ ఇంట్లోనే ఉంది. ఆరోజు ఇందిరమ్మ ఇంట్లో సమూహ భోజనాలు. ఇందిరమ్మ రెండవ కూతురు భాస్కర్ దగ్గరకు వచ్చి అల్లరి చేయసాగింది. సంగీత మాటకారే కాక అందంగా చలాకీగా ఉంటుంది. తనను అల్లరి పెడుతున్న సంగీతను రెండు చేతులతో పట్టుకొని ఆ అమ్మాయి బుగ్గ కొరికాడు. అదే సమయంలో భాస్కర్‌ను భోజనానికి పిలవడానికి అక్కడికొచ్చిన ఇందిరమ్మ అది చూసింది. భాస్కర్ సిగ్గుతో తలదించుకున్నాడు. తల్లి వేపు భయంగా చూసి సంగీత బయటికి పరుగు తీసింది. ఇందిరమ్మ భాస్కర్ దగ్గరకు వచ్చి”చూడు బాబు నువ్వు నాకు కాబోయే అల్లుడివి. దాని అర్థం నా ముగ్గురు అమ్మాయిలకు మొగుడని కాదు, నీవు తీసుకోపోయేది అనితని. సంగీత, సునీత నీకు మరదళ్ళు, అంటే చెల్లెళ్లతో సమానం. బోoచేద్దాం రా, అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు” అంటూ మెత్తగా మందలించింది. భాస్కర్ తలదించుకొని ఆమె వెంట వెళ్లాడు.

ఈ సంఘటన తర్వాత అతను అనితనే అర్ధాంగిగా ఉంచుకొని కలలు కనేవాడు. అవకాశం వచ్చినప్పుడల్లా అనిత తోనే మాట్లాడేవాడు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగిసిన ఆరు నెలల అనంతరం భాస్కర్‌కు హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరేందుకు వెళుతున్న భాస్కర్‌కు వీడ్కోలు చెప్పడానికి తల్లితో పాటు ఇందిరమ్మ కూడా స్టేషన్‌కు వచ్చింది. రైలు ఎక్కే ముందు భాస్కర్ జేబులో కొంత పైకం పెట్టిందామె.

ఓ రోజు తనను వెంటనే ఊరికి రమ్మని ఆఫీసుకు ట్రంకాల్ చేసింది ప్రమీలమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి వచ్చిన భాస్కర్, అక్కడి వాతావరణాన్ని చూసి భయపడ్డాడు. తమ ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు. అందులో సుందరయ్య ఇందిరమ్మల బంధువర్గం కనిపించారు. విషయం తెలుసుకున్న భాస్కర్ భోరున ఏడ్చేసాడు. గత ఆరేళ్లుగా టీబీతో బాధపడుతున్న ఇందిరమ్మ కాలం చేసింది. ఆమెకు ఆ జబ్బు ఉందని సుధరయ్యకు, ప్రమీలరాణికి, మాత్రమే తెలుసు. ఇందిరమ్మ కూతుర్లలో అనిత ప్రతిరోజు ఎక్కువగా అమ్మ తోనే కాలం గడిపేది. పైగా ఊహ తెలిసిన అమ్మాయి. తల్లి పోయిన బాధ నుంచి కోల్కోలేక పోతుంది. ఇందిరమ్మ పెద్దకర్మ వరకు సెలవు పెట్టి ఇంటిపట్టునే ఉండిపోయాడు భాస్కర్. మరో మూడు నెలల తర్వాత సుందరయ్య ఇల్లు ఖాళీ చేసి తమ సొంత ఊరికి వెళ్లిపోయారని తల్లి ఉత్తరం ద్వారా భాస్కర్‌కు తెలిసింది. కాల గమనంలో మరో సంవత్సరం గడిచిపోయింది.

క్రిస్మస్ పండుగకు ఇంటికి వచ్చిన భాస్కర్‌తో పెళ్లి ప్రస్తావన తెచ్చింది ప్రమీలమ్మ. “అంతా నీ ఇష్టం మమ్మీ” అన్నాడు.

మరుసటి రోజు ఆదివారం కావడంతో ప్రమీలా రాణి సుందరయ్యతో మాట్లాడటానికి వాళ్ల ఊరు వెళ్ళింది. ఆమెను చూసి సుందరయ్యతోపాటు పిల్లలు కూడా సంతోషపడ్డారు. అనిత భాస్కర్‌ల పెళ్లి ఫిబ్రవరి నెలలో చేస్తే బాగుంటుంది అని ఏదో చెప్పింది ప్రమీల. సుందరయ్య ఓ నిట్టూర్పు విడచి సౌమ్యంగా ఇలా చెప్పాడు – “చూడు చెల్లెమ్మ, మన కుటుంబాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను, ముఖ్యంగా నా భార్య మాటను చాలా గౌరవిస్తాను. మీరిద్దరూ మాట్లాడుకున్న వృత్తాంతాన్ని ముందుగానే నాకు చెప్పింది ఇందిర. తాను మీ కొడుకు మీద పెడుతున్న ఖర్చుకు నేను ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. పైగా ఓ మంచి పనిచేస్తున్నదని అభినందించాను. ఆశలు, ఆశయాలతోపాటు మనం వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం వేరువేరు మతాలకు సాంప్రదాయాలకు చెందిన వాళ్ళం. భాస్కర్ తర్వాత మీకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అదే విధంగా అనిత తరువాత నాపై ఇద్దరి కూతుర్ల బాధ్యత ఉంది. వాళ్ల పెళ్లిళ్లకు, వాళ్ల జీవితాలకు మన ఆశయాల ఈ పెళ్లి అడ్డంకి కాకూడదు. కులమతాల తారతమ్యాలు ఈ సమాజంలో ఇంకా తొలగిపోలేదు, తొలగవు కూడా. మీరు కూడా చదువుకున్న వారు. బాగా ఆలోచించండి. భాస్కర్‌కు ఊర్లోనే మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేయండి. నా భార్య వాడిని బాగా చదివించి ప్రయోజకుడిగా చేసింది. అవసరం అయితే, నేను వాడి పెళ్లి ఖర్చు భరించి ఓ ఇంటివాడిని చేస్తాను.”

సుందరయ్య మృదువుగా తిరస్కరించిన తరువాత ఆమె ఏమి చెప్పలేక తిరుగుముఖం పట్టింది. జరిగిందంతా కొడుక్కి చెప్పింది. అంతా విని భాస్కర్ “నీ ఇష్టం మమ్మీ, ఏ నిర్ణయం అన్నా తీసుకో” అన్నాడు.

ఇది జరిగిన ఆరు నెలల తర్వాత జాన్ భాస్కర్‌కు ఊరి పాస్టర్ కూతురు స్వర్ణతో పెళ్లి జరిపించింది ప్రమీలా రాణి. భాస్కర్ జీవితంలో అనిత ‘అందీ అందని ఆశ’గా మిగిలిపోయింది.

ఇందిరమ్మ, అనిత గుర్తుకొచ్చినప్పుడల్లా చిన్నగా నవ్వుకొని ‘మాన్ ప్రపోసస్, గాడ్ డిస్పోజస్’ అనుకుంటాడు ముసలి భాస్కర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here