ఆకట్టుకునే “చేలో గుడ్డెద్దు” “అంధాధున్”

0
9

[box type=’note’ fontsize=’16’] “కథ అల్లిక చాలా బిగువుగా వుండి సినెమాను రెండో సారి చూడటానికి ప్రేరేపించేలా వుంది. ఈ మధ్య కాలంలో గుర్తుండిపోయే చిత్రం ఇది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “అంధాధున్” సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]స[/dropcap]స్పెన్స్, థ్రిల్లర్లు ఇష్టపడేవారికి శ్రీరాం రాఘవన్ పేరు గుర్తుంటుంది . జాని గద్దార్, బద్లాపుర్ లాంటి చాలా మంచి చిత్రాలు తీశాడు ఈ FTII graduate. బహుశా అంధాధున్ అతని ఇప్పటిదాకా వచ్చినవాటిలో అత్యుత్తమమైనది. వో ఫ్రెంచ్ లఘు చిత్రం ఆలివర్ ట్రైనెర్ ది “L’Accourderu (The Piano Tuner)” దీనికి ఇన్స్పిరేషను. సినిమా టైటిల్స్ అప్పుడు దీన్ని ప్రకటించాడు కూడా. అయినా వో లఘు చిత్రానికి చాలా ఉపకథలు జోడించి తీసిన ఘనత అతనిదే.

చిత్రం మొదట్లో వో సన్నివేశం. క్యాబేజీ తోటలో క్యాబేజీలన్నీ కొరికేస్తున్న కుందేళ్ళ బెడదకు విసిగిపోయి ఆ రైతు గన్నుతో వేటకు బయలుదేరుతాడు. పారిపోతున్న వో వొంటి కన్ను కుందేలుపై గురి పెడతాడు. తర్వాత సన్నివేశం వో ఇంటిలో పియానో వాయిస్తున్న కళ్ళులేని ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా), పక్కనే అతని తెలుపు నలుపు కలసిన రంగుల్లో పిల్లి! అతన్ని చూపించే మొదటి షాట్ కిటికీ వూచల గుండా. ఇలాంటి చిన్న చిన్న డీటైల్స్ యెందుకు వ్రాస్తున్నానంటే దర్శకుడు వాచ్యంగా చెప్పకుండా తన కథను ఇలాంటి అనేక సూచనల ద్వారా కూడా చెబుతాడు. మరో పక్క పాతకాలం నటుడు ప్రమోద్ సినహా (అనిల్ ధవన్) తన రెండవ భార్య సిమి (టబు) లు కలిసి యెండ్రకాయ సూప్ చేస్తుంటారు. అంతలో అతని కూతురు దాని విడియో కాల్ వస్తుంది. తను చేస్తున్న పని మీదే ధ్యాస పెట్టి మాట్లాడుతుంది సిమి ఔపచారికంగా. యెండ్రకాయను నేరుగా ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తే దానికి కష్టంగా వుంటుందని, ముందుగా దాన్ని వో రెండు గంటలపాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టి తర్వాతే ఉడుకుతున్న నీళ్ళో వేస్తుంది. ఆ సూప్ మంచి వాజీకరణమంటుంది. అనుకోకుండా సోఫి (రాధికా ఆప్టే) రోడ్డు పక్కన చూసుకోకుండా ఆకాశ్ ను తన ద్విచక్రవాహనం తో పొరపాటున గుద్దుతుంది. ఆ తర్వాత అపరాధ భావనతో అతన్ని ఇంటిదాకా వదిలిపెడుతుంది. ఆ విధంగా వాళ్ళ మధ్య స్నేహం కుదురుతుంది. వొకసారి ఆమె కఫేలో పియానో వాయిస్తున్న ఆకాశ్‌ను చూసి ప్రమోద్ మర్నాడు తన ఇంటికి వచ్చి కేవలం తమ దంపతులకొరకు ప్రత్యేకమైన షో చేయమంటాడు, విసిటింగ్ కార్డూ, కొంత సొమ్మూ ఇచ్చి. మర్నాడు ఆకాశ్ వెళ్ళే సరికి తన భర్త లేడు, మర్నాడు రమ్మంటుంది తలుపు తీసిన సిమి. ఇతను గొణుక్కుంటాడు. యెదురింటి ఆమె తలుపు తీసి యేమిటా అని చూసే సరికి, ఇక తప్పక సిమి తలుపు తీసి ఆకాశ్‌ను అయిష్టంగా లోపలికి ఆహ్వానిస్తుంది. వాళ్ళ దృష్టిలో ఇతను అంధుడు, కాని ఇతనికి అన్నీ కనిపిస్తాయి. లోపల నేలపై సిమి భర్త శవం, బాత్రూంలో ఆమె ప్రియుడు గన్నుతో. అలా వో విచిత్రమైన పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు ఆకాశ్. దీని తర్వాత యెన్నో మలుపులు, సస్పెన్సులు. సినెమా మొత్తం నవ్వులతో పాటు ఉత్కంఠను కూడా కలిగించేలా వుంటుంది కథనం. ఇక్కడ యెక్కువ వివరిస్తే చూడబోయే వాళ్ళకి బాగుండదు.

కేవలం సస్పెన్సు కాకుండా తాత్త్వికత, moral dilemma, మనిషిలో వుండే తెలుపు నలుపులు ఇలా చాలా వాటిని యెలాంటి తీర్పులూ చెప్పకుండా చూపిస్తాడు. ఆయుష్మాన్ ఖురానా, టబుల నటన చాలా బాగుంది. అలాగే మానవ్ విజ్, జాకిర్ హుస్సైన్, రాధికా ఆప్టే లది కూడా. ఆఖరికి చిన్న చిన్న పాత్రలు చేసిన అశ్వినీ కాల్సేకర్, చాయా కదం లు కూడా. ఆయుష్మాన్ మంచి గాయకుడుగా మనకు ఇదివరకే తెలుసు, ఈ చిత్రంకోసం పియానో వాయించడం కూడా నేర్చుకున్నాడు. లేకపోతే చాలా వాటిల్లో పియానో వాయిస్తున్న వారి వేళ్ళు ఆ సంగీత దర్శకుడివో మరొకరివో పెడతారు క్లోసప్ లో. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం చాలా కొత్తగా, అందంగా వుంది. మోహనన్ చాయాగ్రహణం కూడా. యే సినెమా అయినా పెద్ద పని, ముఖ్యమైన పని, కీలకమైన పని రాతబల్ల మీదే. ఆ రాత పని ఇందులో అయిదుగురు చేశారు. శ్రీరాం రాఘవన్, అరిజిత్ బిస్వాస్, పూజా లధా సురతీ, యోగెష్ చందేకర్, హేమంత్ రావు లు. కథ అల్లిక చాలా బిగువుగా వుండి సినెమాను రెండో సారి చూడటానికి ప్రేరేపించేలా వుంది. ఇక ఇలాంటి చిత్రాలకు సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది. ఇప్పటి కాలంలో మేధావి అమిత్ త్రివేది. నేపథ్య సంగీతమూ, పాటలూ, అతని గాత్రమూ అన్నీ A1. వీలు దొరికినప్పుడల్లా పాత చిత్రాలలో నేపథ్య సంగీతమిచ్చిన ఆర్ డి బర్మన్ కు నివాళిగా అతని మార్కు సంగీతమూ కూర్చాడు.

సినెమాలో చాలా రెఫరెన్సులు వుంటాయి, వోపికగా గుర్తించాలి. “తేరీ గలియోన్ మైన్ న రఖెంగే కదం” అన్న పాట కొన్ని సార్లు వస్తుంది. ఇది అనిల్ ధవన్ చిత్రం లోదే. వస్తువు మోసకారి ప్రియురాలిపై ప్రియుని కినుక. షోలే లో కనుచూపు సన్నగిల్లిన ఏ కె హంగల్ అంటాడు “ఇతనా సన్నాటా క్యూ హై భాఇ” అని. ఇందులో దాన్నే ఆకాశ్ అంటాడు. “లేడీ మేక్బెథ్” సిమి కూడా శవం వున్న గదిలో ఆకాశ్ ఆవేశంగా పియానో వాయిస్తుంటే వరసగా చప్పట్లు కొడుతూ “మార్వలెస్” అంటూ వుంటుంది. ముఖంలో భావనలు దాచుకోదు, ఇక పోరా బాబూ నా టెన్షన్లు నాకున్నాయి అన్నట్టు వుంటాయి. అతను అంధుడు అని నమ్మడం వల్ల భావాలు దాచుకోదు. ఇక ఆ పేరు చూడండి సిమి, ఇదివరకు వచ్చిన కర్జ్ లో ఇలాంటి పాత్రే సిమి గరేవాల్ పోషించింది. వో సన్నివేశంలో పోలీసు అధికారి అడుగుతాడు ఆకాశ్ ని “నీ పిల్లి యే రంగు?” అని. తెలుపు నలుపు అంటాడు. నీకెలా తెలుసు?, నీకు కనబడదుగా! అని అడుగుతాడు. అందరూ అనడం బట్టి అంటాడు. ఇలాంటి చర్చలు చాలా వున్నాయి. యెవరికి కనిపిస్తుంది, యెవరికి కనబడదు, యెవరు చూసీ చూడకుండా వుంటారు లాంటి ప్రశ్నలెన్నో లేస్తాయి. సినెమా కథ చర్చించకుండ చాలా విషయాలు చర్చించలేము. కాబట్టి అందరూ ఈ సినెమా తప్పకుండా చూడండని చెబుతాను. ఈ మధ్య కాలంలో గుర్తుండిపోయే చిత్రం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here