అందిన ద్రాక్ష

0
8

[dropcap]“వ[/dropcap]సూ! ఇంకా ఎంతసేపిలా ముసుగుతన్ని పడుకుంటావు? మా వదిన చూడు.. ఉదయాన్నే లేచి, పూజ చేస్కుని, మనకి తినడానికి వేడివేడిగా టిఫిను రెడీ చేసే పనిలో పడిపోయింది. బాగుండదు. లేచి వెళ్లి కాస్త సాయం చెయ్యి” అర్థింపుగా అంటున్న ప్రీతమ్ చేతిని కూడా తన దుప్పట్లోకి లాక్కొని ‘ఊహూ!’ అంటూ లేవలేను అన్నట్టు మారాం చేస్తోంది వసుధ.

వెల్లింగ్టన్ కంటోన్మెంట్.. కున్నూరు ఆర్మీ రెజిమెంట్ క్వార్టర్స్.. దూరంగా అక్కడక్కడా ఉన్న సింగిల్ బెడ్రూమ్, పాత ఒంటి ఇటుక కట్టడాలు. అందులోనే ఒకదానిలో డిఫెన్స్‌కు చెందిన మురళీకృష్ణ, తన భార్యా, పద్దెనిమిదేళ్ల కొడుకుతో కాపురం ఉంటున్నాడు. కొత్తగా పెళ్ళైన ప్రీతమ్, వసుధలు హనీమూన్‌కి ఊటీ వస్తుంటే, కున్నూరులో రెండు రోజులు ఉండమని ఆహ్వానించాడు. వెల్లింగ్టన్ బ్రిడ్జి దగ్గరే వెహికిల్ దిగి, సన్నని మలుపుల గుండా ఆర్మీ క్వార్టర్స్ ఉన్న కంటోన్మెంట్‌కి చేరుకోవడం.. కొత్త జంటకి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. చుట్టూ అడవిలాంటి ప్రదేశం.. ఎత్తైన చెట్ల మధ్య దూరం దూరంగా ఉన్న ఇళ్ళు. నవంబర్ నెల కావడంతో 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి.

చెట్ల చాటునుంచి గెంతుతూ, ఇళ్ల మధ్యలో తిరుగాడుతున్న బలిష్టంగా వున్న అడవి కుందేళ్లు ఇళ్ల మధ్యలో అప్పుడప్పుడూ కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, తన ఐ ఫోన్‌లో బంధించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రీతమ్.

రెండు రోజులు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తూ, వెలకట్టలేని అనుభూతులను పొందడమే కాకుండా, ఇండియన్ ఆర్మీ అత్యంత రహస్యంగా ఉంచే ఆయుధ భాoడాగారాలకు నెలవైన ఆ ప్రదేశం గురించి, అక్కడి ప్రజల జీవనం గురించీ పుస్తకాలలో చదవని ఎన్నో విషయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. రెండు రోజుల బస అనంతరం తన పెదనాన్న కొడుకు, మురళీకృష్ణ దగ్గర సెలవు తీసుకుని, ఊటీకి బయలుదేరారు.

***

దారి పొడుగునా స్టెప్ ఫార్మింగ్‌లో వ్యవసాయ క్షేత్రాలూ, పెద్ద విస్తీర్ణoలో టీ ప్లాంట్స్ చూడముచ్చటగా ఉన్నాయి. పెద్ద పెద్ద వెదురు బుట్టల్ని, వెనక మెడ మీదుగా వీపుకి కట్టుకుని, తయారైన తేయాకును చకచకా కోసి, బుట్టల్లోకి నేర్పుగా విసురుతూ, శ్రమ తెలియకుండా పాటలు పాడుతున్న అమ్మాయిలు.. తోటల్లో మొక్కల మధ్యన రంగురంగుల సీతాకోకచిలకల్లా ఉన్నారు. అక్కడ దొరికే రకరకాల తేనీటిని రుచి చూస్తూ, ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తున్నారు కొత్తజంట. టీ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఆడవాళ్లకు సాయంగా, లేత తమలపాకుల్లాంటి చేతులతో తేయాకును తెంపుతున్న చిన్నారుల వైపు విస్మయంగా చూస్తుండిపోయింది వసుధ.

బొటానికల్ గార్డెన్స్ వైపుగా వాహనం కదులుతోంది. అద్దాలు కిందికి దించి ఆసక్తిగా అక్కడి ప్రజల జీవనశైలిని గమనిస్తున్నాడు ప్రీతమ్. ఎక్కడ చూసినా చకచకా చీమల్లా పనిచేసుకుపోతున్నవారే. పిల్లా, పెద్దా తేడాలేకుండా అందరూ అన్ని పనుల్లోనూ ఆరితేరి ఉన్నారనిపించింది. గార్డెన్స్ బయటవున్న మార్కెట్‌లో మఫ్లర్‌లు, స్వెట్టర్లు, టీషర్టులు కొనుక్కుని గార్డెన్ లోకి ఎంటరవబోతుంటే.. పది, పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలు టూరిస్టులని ఆకర్షిస్తూ, చిన్న చిన్న వస్తువులూ, సంవత్సరం పొడవునా ఫ్రెష్‌గా ఉండే డ్రై ఫ్లవర్స్ అమ్మడం కనిపించింది.

“ప్రీతమ్ ఈ పిల్లల్ని చూస్తుంటే బాధగా లేదూ? కుటుంబ పోషణలో వీళ్ళూ భాగం పంచుకుంటూ, చదువుకోవాల్సిన వయసులో ఇలా..” వసుధ మాటల్లో బాధ అర్థమైనవాడిలా “తప్పదు వసూ! పరిస్థితులు వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు” అంటూ సర్దిచెప్పాడు ప్రీతమ్.

“నిజానికి మనకన్నా వాళ్ళకే తెలివితేటలు ఎక్కువ. గమనించావా? రకరకాల ప్రదేశాలనుంచి వచ్చే టూరిస్టులతో వీళ్ళు అన్ని భాషలూ మాట్లాడగలుగుతున్నారు. చదువుకుంటే ఇంకెంత ప్రయోజకులు అయ్యేవారో కదా!” నిట్టూర్చింది వసుధ.

“అవును వసూ! బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం చట్టాలు అయితే తేగలిగింది కానీ, వీళ్ళ సమస్యకి సరైన పరిష్కార మార్గాలు మాత్రం చూపించలేకపోయింది. కుటుంబంలో అందరూ కష్టపడితేనే వీళ్ళకి రోజు గడిచేది.” గార్డెన్ అందాలను ఆస్వాదించడానికి ముందుకి కదులుతూ చెప్పాడు ప్రీతమ్.

అక్కడినుంచి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన హిల్ స్టేషన్ ‘దొడబెట్ట’కు పయనమయ్యారు. దారిపొడుగునా పైన్ ట్రీస్, యూకలిప్టస్ చెట్లు.. నిలువుగా నుంచుని రోడ్డుకిరువైపులా పహారా కాస్తున్నట్టు ఉన్నాయి.

పైనుంచి కింద లోయల్లోకి చూస్తుంటే కళ్ళు తిరిగాయేమో.. భయంతో ప్రీతమ్‌ని గట్టిగా పట్టుకుంది వసుధ. పైకి చేరుకున్నాక చలికి దవడలు కొట్టుకుపోతుంటే మాట రాలేదు. వేడిగా గొంతులోకి టీ ఒంపుకుంటే కానీ స్థిమితపడలేకపోయారు. రోడ్డు పక్కనే చిన్న చిన్న జంగిడీలలో తాజా కాయగూరలు, ముల్లంగి, కీరా, ఇంకా ఉడికించిన మొక్క జొన్నలు.. నిమ్మకాయ, ఉప్పూ-కారం రాసి ఇస్తూ టూరిస్టులకి చలిబాధ తెలియకుండా చేస్తున్నారు అమ్మేవాళ్ళు. అక్కడ కూడా పదిహేను సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు కొందరు, కుటుంబ పోషణకోసం ఇవన్నీ అమ్ముతూ కనిపించారు. అక్కడే కాదు, ఊటీకి చేరుతున్నప్పుడు కూడా ఇళ్ల నిర్మాణంలో ఇటుకలు మోస్తూ, గుట్టల్ని చదునుచేస్తూ, వయసుకి మించిన భారాన్ని తలకెత్తుకున్న ఎంతోమంది పిల్లల్ని చూసారు.

అక్కడి నుంచి పయకారా లేక్ వైపు సాగింది ప్రయాణం. లేక్ అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తుంటే, తనివితీరా ప్రకృతి అందాలలో మునిగితేలారు.

టూర్ పూర్తయ్యి తిరిగి హైదరాబాదుకు వెళ్తూ, తన అన్నయ్య మురళీకృష్ణకు ఫోన్ చేసి, థాంక్స్ చెప్పిన ప్రీతమ్, తమను కలచివేసిన ఆ చిన్నారుల జీవితాల గురించి కూడా చెబుతూ.. “అందని ద్రాక్షగా మారిన విద్యను ఈ చిన్నారులకు అందించి, చక్కని భవితవ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలేమా? బాధ్యతగల పౌరులుగా ఇలాంటివారికోసం ఏమీ చెయ్యలేమా?” అంటూ తన మనసులోని ఆవేదననంతా మాటల్లో వ్యక్తం చేశాడు.

సరిగ్గా రెండు నెలల తరువాత.. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఆర్టికల్‌ను చూసి ప్రీతమ్ ఆశ్చర్యపోయాడు. అవును.. తాను చదివింది నిజమే.. ఊటీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోని బడికి వెళ్లలేని పిల్లలందరికీ ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తూ, వారానికి రెండురోజులు వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేoదుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మురళీకృష్ణను అభినందనలతో ముంచెత్తాడు ప్రీతమ్. దేశ రక్షణలోనే కాదు.. దేశ పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దేoదుకూ కృషి చేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ, టీవీలో స్క్రోలింగ్‌తో వెళుతున్న వార్తల వంక కళ్ళింతింత చేస్కుని చూస్తోంది వసుధ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here