అందుకే దూరం పెరిగింది

1
6

[dropcap]తా[/dropcap]గిన కాఫీ కప్పు కింద పెడుతూ, “అదేంట్రా మధూ అలా అంటావు. రాక రాక చెల్లి, బాబాయి వస్తే ఇలా అంటావా. అయినా చెల్లి ఏమడిగింది, తన ఇంజినీరింగ్ సెకండ్ కౌన్సెలింగ్‌కి ఆంధ్రా యూనివర్సిటీ విజయనగరం ప్యాలెస్‌కి తీసుకు వెళ్లమంది. అంతేగా. పైగా తెలియని ఊరు. బాబాయి వాళ్ళు మన విశాఖపట్నం రావడం ఇది రెండో సారో, మూడో సారో. పైగా బాబాయి జర్నీ చేసి అలసిపోయాడు. జ్వరం కూడా ఉందట. అందుకే నిన్ను వెళ్లమనేది” చెప్పారు మూర్తిగారు అసహనంగా.

“అవును నాన్నా. నువ్వు చెప్పింది నిజమే. కానీ నాకు కాలేజీలో చాలా ఇంపార్టెంట్ సెమినార్ ఒకటి ఉంది. దానికి గత రెండు వారాలుగా చాలా ప్రిపేర్ అయ్యాను కూడా. ఇప్పుడు వెళ్ళడం ఆలస్యమైతే నన్ను సెమినార్‌లో మాట్లాడనివ్వరు. బాబాయికి నువ్వే ఏదోటి నచ్చజెప్పు నాన్నా..” చెప్పాడు మధు తన బ్యాగ్‌ని చక చకా సర్దేసుకుంటూ.

“అలా అంటే ఎలా రా. అయినా పోయిన ఏడాది వేసవిలో మనం వాళ్ళ ఊరు వెళ్ళినపుడు మనల్ని కాలు కింద పెట్టనిచ్చాడా. అన్నీ తానే దగ్గరుండి చూశాడు. ఆఫీసుకి కూడా సెలవు పెట్టాడు. వరసకి చిన్నాన్న కొడుకనే కానీ నన్ను సొంత అన్నకంటే ఎక్కువ గౌరవిస్తాడు రా. పోనీ నేను వెళ్దామంటే ఈ కీళ్ల నెప్పులు వేరే. ఏం చేయాలిపుడు” అని ఓ క్షణం దీర్ఘంగా ఆలోచింది, “ఆ… ఓ పని చేయిరా. అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఫణికి ఓసారి ఫోన్ చేసి మనింటికి రమ్మనమను. వాడు వచ్చి, అమ్మాయిని కౌన్సిలింగ్ సెంటర్‌లో దించేసి వెళ్ళిపోతాడు” చెప్పాడాయన

“సరే నాన్నా, అదే మంచి ఆలోచన. ఎలాగూ నా సెమినార్ మధ్యాహ్నానికి అయిపోతుంది. అప్పటికి నేను ఫ్రీ అయిపోతాను. కనుక అప్పుడు నేనే వెళ్ళి చెల్లిని ఇంటికి తీసుకు వస్తాలే” అని హడావుడిగా అతనికి ఫోన్ చేసి విషయం చెప్పి, బయటికి వెళ్ళిపోయాడు మధు.

మధ్యాహ్నం పూట కల్లా సెమినార్ ముగించుకుని ఇంటికి వచ్చేశాడు మధు. ఖాళీగానే ఉండటంతో, కౌన్సిలింగ్‌కి వెళ్ళిన తన చెల్లెలిని తీసుకు రావడానికి గాను, సెంటర్‌కి వెళ్ళాడు. ఆమె అతన్ని చూస్తూనే ఓ పెద్ద నవ్వు నవ్వేస్తూ, “అన్నయ్యా, ముందు కంగ్రాట్స్ చెప్పు. నాకు రాదేమో అనుకున్న కంప్యూటర్ సైన్స్‌లో సీటు వచ్చింది. నేను చాలా చాలా హేపీ అన్నయ్యా” చెప్పింది ఉబ్బి తబ్బిబ్బైపోతూ. దాంతో మధు కూడా ఆమెకి కంగ్రాట్స్ చెప్పి షేక్ హాండ్ ఇచ్చాడు. తర్వాత, తన చెల్లెల్ని బైక్‌పై ఇంటికి తీసుకుని వచ్చేశాడు.

దానికి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అతని వంక చాలా చిత్రంగా చూస్తూ “ఇదేంటన్నయ్యా మనం ఇంటికి ఇంత త్వరగా వచ్చేసాము. పొద్దున బావతో వచ్చినపుడు అరగంటకి పైగా టైమ్ పట్టిందనుకో” చెప్పిందామె ఆశ్చర్యపోతూ.

మధుకి అసలు విషయం అర్దమైంది. అంటే మరదలిని బైక్ వెనుక కూర్చొబెట్టుకుని కులాసాగా కబుర్లు చెబుతూ ఊరంతా తిప్పి తిప్పి తీసుకెళ్ళాడన్నమాట. ఇలాంటివి మంచివి కాదని వాడికి ఓ సారి వాడికి అర్దమయ్యేలా నచ్చజెప్పాలి.. ఇంకా నయం వాడు ఇంకా చొరవ తీసుకుని ప్రవర్తించుంటే నాన్నకి ఎంత చెడ్డ పేరు.

“అయినా అలాంటి వాడితో నా కూతుర్ని ఎలా పంపించావ్ అన్నయ్యా” అని చిన్నాన్న నాన్నని అడిగితే అది ఎంత అవమానం అని మనసులో అనుకుని, పైకి, చిన్నగా ఓ చిరునవ్వు నవ్వేసి, “ఓహో అదా! ఏం లేదమ్మా. పొద్దున్న అటువైపంతా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఒకసారి జామ్ అయితే గంటలు పట్టేయవచ్చు కదా. బహుశా అటుగా వెళ్తే, మీరు ఆ ట్రాఫిక్ జామ్ మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదముందని గ్రహించినట్టున్నాడు. అందుకే చుట్టూ తిప్పి తీసుకు వెళ్ళాడు. అందుకే మనింటికి, మీ కౌన్సిలింగ్ సెంటర్‌కీ దూరం పెరిగింది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది. దాంతో ఇలా మనం తిన్నగా, త్వరగా ఇంటికి వచ్చేసాం అంతేనమ్మా” చెప్పాడు మధు.

కానీ తర్వాత ఆమె కాలేజీలో జాయిను అయ్యాక కూడా ఎప్పుడూ అతనితో ఆమెని పంపలేదు. ఎక్కడికైనా మధే తీసుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడూనూ. తర్వాత ఫణికి, మధుకీ మధ్య కూడా దూరం పెరిగింది. ఎందుకంటే, ఓసారి ఒకరిపై నమ్మకం పోతే అది మళ్ళీ వారిపై కుదరడం దాదాపు అసాధ్యం. పైగా ఈరోజు ఇది, రేపు మరోటి జరగదనేముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here