అందుకే వాడు ఇక రాడు

0
9

[dropcap]ఇం[/dropcap]ట్లో అడుగుపెడుతూనే ఓ సారి చటుక్కున ఆగి ఇంట్లో అన్ని వైపులా పరిశీలనగా చూసింది. ఆ తర్వాత ముక్కుని చీర చెంగుతో శుభ్రంగా తుడుచుకుని కొంచెం కొంచెంగా గాలి పీలుస్తూ నాలుగు వైపులా వాసన చూసింది. పోయినసారిలా ఇంట్లో మందు కంపు కానీ సిగరెట్ వాసన కానీ రాలేదు. ‘బహుశా పొద్దున్నొచ్చి అంట్లు తోమి ఇల్లు తుడిచే పనామెతో తడిగుడ్డ పెట్టించి ఆ తర్వాత ధూపం వేయించి ఉండవచ్చు లేదా రూం స్ప్రే చేసి ఉండవచ్చు’ అని ఆమె ట్రాలీ బ్యాగుని బెడ్ రూంలో పెట్టేసి నేరుగా వంట గదిలోకి వెళ్లింది. బియ్యం డబ్బా వెనక చేయితో తడిమి చూసింది. ఏ సీసా చేతికి తగలలేదు. అయినా ఆమె పట్టుదల వదలలేదు. అనుమానం సడలలేదు. తర్వాత అల్మరాలో అతని మంచం కిందా కబోర్డు పైనా పుస్తకాల మధ్యలో ఇలా అంతా ఏంతో లోతుగా ఆతృతగా వెతికి చూసింది. కానీ లాభం లేదు. ఏం దొరకలేదు. కానీ పోయిన సారి లలిత పుట్టింటికి వెళ్లి వచ్చినప్పుడు మాత్రం బోలెడు మందు బాటిళ్లు దొరికాయి. ఇక్కడా అక్కడా అని కాకుండా ఎక్కడ బడితే అక్కడ దొరికాయి. ఆ బాటిళ్లన్నిటినీ ఇంటికొచ్చి సీసాలు దినపత్రికలూ కొనే వారికి అమ్మి తాను ఆ డబ్బులతో ఓ కాటన్ చీర కూడా కొనుక్కుంది. కానీ ఈ సారి చాలా విచిత్రంగా ఒక్కటంటే ఒక్క సీసా కూడా దొరకలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించిందామెకి. ఔను ఇలా కాదనుకుని నేరుగా మధుకి ఎదురుగా వెళ్లి “నిజం చెప్పండి” అని ఓ సారి మధు వంక అనుమానంగా గుచ్చి గుచ్చి చూసింది లలిత.

“అబ్బా లలితా నువ్వనుకున్నట్టు ఏం జరగలేదు. నేనూ అలాంటివేం చేయలేదు. వాడు కూడా మన ఇంటి చుట్టు పక్కలకు రాలేదు. నువ్వు వెళ్లేప్పుడు చెప్పావుగా. మందు సీసాని టీవీలో కూడా చూడొద్దని. అందుకే మొన్న నాగేశ్వర్రావు గారి దేవదాసు సినిమా క్లయిమాక్స్ చూడాలని అనిపించినా నీ మాట గుర్తొచ్చి చానల్ తిప్పేసాను. అలాగే బార్లు లేని దార్లు ఎంచుకుని మరీ ఇల్లు చేరుతున్నాను. ఇక సిగరెట్టు కూడా అలాంటి పట్టుదలతోనే మానేసాను. సిగరెట్టు కాల్చాలని అనిపించినపుడల్లా సిగరెట్ తీసి అగ్గిపెట్టెతో వెలిగింది ఆర్పేసేవాడిని. తర్వాత్తర్వాత నికోటిన్ బబుల్గంని నోట్లో వేసుకుని మేకలా కసాపిసా నమిలేయడం ప్రారంభించాను. మొన్న ఆఫీసు బయట ఎవరో సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకోగానే అతని నోటికాడి సిగరెట్ని చేత్తో తీసి నేలకేసి కొట్టి కాలితో తొక్కేసాను. ఇలా ఆ రెంటి మీదా మొదట బలవంతంగా అసహ్యాన్ని చూపిస్తూ వచ్చాను. ఆ తర్వాత ఆ అసహ్యామే వాటి యెడ అలవాటయిపోయి మొత్తానికి ఎలాగొలా మానగలిగాను. అంటే నువ్వు చెప్పిందే నేను తూచ తప్పకుండా పాటించాను. నువ్వు ఇది మారాం చేయక నమ్మి తీరాలి మరి” చెప్పాడు.

“మీరు ఇవన్నీ చేసారా, అది నేను నమ్మాలా? అయినా మీ పేరు మధుబాబు కాదండీ మందుబాబు అని పెట్టాల్సింది” చెప్పిందామె.

“అయినా మనిషన్నాక కాస్త నమ్మకముండాలి. అయినా పోయిన సారి వేరు. ఏదో ఉద్యోగంలో ప్రమోషన్ రావడం. అంతా పార్టీ కావాలని పోరు పెట్టడం. బయట అయితే బార్ బిల్లుకి జేబు గుల్లయిపోతుందని భయపడి ఇంట్లో చిన్న పార్టీ ఇచ్చాను. దాంతో మరుసటి రోజు నాతో పనిచేసే ఆ రాంబాబు బాటిల్‌తో సహా వచ్చేసరికి సరే అని మొహమాటానికి పోయి వాడితో కలిసి తాగాను. అంతే వాడూ రోజూ బాటిల్‌తో రావడం ఇద్దరం కలిసి తాగడం అలవాటయిపోయింది. కానీ నువ్వు వచ్చి నాతో జిమ్మీ మీద ఒట్టేయించుకున్నాక ఇక వాడితో మందు తాగలేదు. అయితే ఈ సారి నువ్వు పుట్టింటికి వెళ్లినపుడు మాత్రం నేను వాడితో ఖరాఖండిగా చెప్పేసాను. మా ఇంటికి మామూలుగా కూడా రావద్దని. ఒకవేళ మామూలుగా వచ్చినా మందు బాటిలుతో మాత్రం రావద్దని చెప్పాను. ఒకవేళ మందు బాటిలుతో వచ్చినా నన్ను మాత్రం తాగమని బలవంతం చేయకు అని మరీ మరీ చెప్పాను. వాడూ సరే అన్నాడు. కానీ విధి ఈ మధ్య వాడు ఏదో స్దలం కొన్నాడట. దాంతో పార్టీ ఇస్తా పార్టీ ఇస్తా అన్నాడు. నేను కూడా కాస్త బలహీనంగా మారి సరే అనేసాను. కనుక ఒక్క సారి ఒక్కటంటే ఆ ఒక్కసారే వచ్చాడు. అంతే. ఆ తర్వాత రాలేదు నిజం” చెప్పాడు మధు.

“అయినా మిమ్మల్నెవరు నమ్మొచ్చారూ? నా అనుమానం నాది. అయినా ఇదివరలో ఈ మందుతో పాటు మీకు ఉన్న ఆ దిక్కుమాలిన ఆ సిగరెట్ అలవాటు మానమని ఎన్ని ప్రయత్నాలు చేసాననీ. మానారా? వానర బుధ్దితో అలా కాల్చి కాల్చి ఇంటిని మాపేసారు. ఆఖరికి మీరు ప్రాణంగా పెంచే పెంపుడు కుక్క జిమ్మీని ఎక్కడైనా వదిలేస్తాను అని బెదిరిస్తే అప్పుడు అప్పడు సైకియాట్రిస్టు దగ్గరకి వెళ్లి సిగరెట్టు మానేసారు. ఆ తర్వాత ఈ రాంబాబుతో కలిసి మళ్లీ మొదలెట్టారు. ఆ తర్వాత జిమ్మీని ఏమైనా చేస్తానేమోననే భయంతో నాకు చెప్పా పెట్టకుండా దాన్ని మీ అమ్మ వాళ్లింట్లో వదిలేసారు. అయినా ఆ కుక్క ఎంత మీ మాజీ ప్రేయసి మీకు బహుమతిగా ఇస్తే మాత్రం మరీ ఇంత ప్రేమా? దాని మెళ్లోకి వెండి చైను. దానితో పొద్దునే మార్నింగ్ కాఫీ. అది కూడా మీరు కప్పులో తాగుతూ దానికి సాసర్‌లో పోయడం. మనం తినే వంటలే దానికీ పెట్టడం.. ఎవరైనా వింటే నవ్విపోతారు. పైగా ఇంకెప్పుడూ దానిమీద ఒట్టు వేయకు అని మీరు మీమీద నాచేత ఒట్టు వేయించుకున్నారు. కనుక దానిమీద ఒట్టు వేయమని అడగలేను కనుక ఇప్పుడు ప్రస్తుతానికి నా కళ్లలోకి నిలువుగా చూసి నిజం చెప్పండి. మీ స్నేహితుడు రాంబాబు మన ఇంటికి రాలేదూ! అసలే ఆ పంది మందుకి బానిస. నేను ఇంట్లో లేనని తెలిసి బార్ అటెండర్‌లా బాటిల్‌తో సహా వచ్చి వాలిపోయాడు. మీతో కూడా తాగించాడు. పోయిన సారి నేను ఊరెళ్లినపుడు కూడా ఇదేగా జరిగింది. ఈసారి రోజూ అదే జరిగిందా. జరిగే ఉంటుంది. ఇదంతా నా ప్రారబ్ధం. అనుభవించక తుప్పుతుందా” చెప్పిందామె. సాగదీసి చెప్పి శివాలెత్తిపోయిందామె.

“చెవిటోడి చెవిలో శంకం ఊదినట్టుంది నా పని. వాడు రోజూ రాలేదు. చెప్పానుగా. నువ్వెళ్లిన మరుసటి రోజు మాత్రమే బాటిల్‌తో వచ్చాడు. ఆ రోజు కూడా నేను వాడిమీద కోప్పడ్డాను. ఇలాంటి అలవాటు మంచిది కాదని నచ్చచెప్పాను. అయినా వాడు ఒప్పుకుని సరే అంటేనా నా మాట వింటేనా! మందు తాగితే మత్తుతో పాటు గమ్మత్తుగా కూడా ఉంటుంది అన్నాడు. మందు తాగితే ధైర్యం పెరుగుతుందీ అని మరో సారి వాదించాడు. దేవతలే సురాపానం అంటూ తాగారుగా అని ఏమార్చే ప్రయత్నం కూడా చేసాడు. ఇక వాడి వితండ వాదమే తప్ప నా మాట వినకపోయోసరికి నాకు కోపం నషాలనికొచ్చింది. అంతే వాడు తెచ్చిన ఆ మందు బాటిల్ పగలకొట్టేసాను” చెప్పాడు ఆవేశంగా.

“అలాగా చాలా మంచి పని చేసారు. అంతేనండీ ఒకసారి మందుకు బానిస అయితే అంతే. మా బాబాయి కూడా అంతే. సంతోషంగా ఉన్నా మందే, బాధలో ఉన్నా మందే. కష్టం వచ్చినా మందే, వ్యాపారంలో నష్టం వచ్చినా మందే. అతను అలిగినా మందే, అతనికి డబ్బు కలిగినా మందే. నీరసంగా ఉన్నా మందే, హుషారుగా ఉన్నా ఆ మందే. ఇలా వేళా పాళా అని లేకుండా అన్ని వేళలా మందు తాగి చనిపోయాడు. పాపం మా పిన్ని ఎప్పుడూ ‘వద్దండీ, పిల్లల ముఖం చూసైనా మానండీ’ అంటే విన్నాడా. వినలేదు పోయాడు. కనీసం తొంబై ఏళ్లు బ్రతకాల్సిన మనిషి, ఎనభైకే గుడ్ బై చెప్పేసాడు” అని ఓ క్షణం ఆగి “మీ ఒట్టు తీసి గట్టుమీద పెట్టేసాను. ఇప్పుడు మీ పెంపుడు ఊర కుక్క జిమ్మీ మీద ఒట్టేసి నిజం చెప్పండి.నిజంగా ఆ మందు బాటిలు పగలకొట్టారా?” అడిగిందామె మరోసారి సూటిగా మధు కళ్లలోకి చూస్తూ.

“అంటే అదీ మరీ ఆ మందు బాటిల్ పగలు కొట్టిన మాట మాత్రం నిజం. కానీ మందు వృధా అవుతుందని తాగేసాక పగలకొట్టాను” చెప్పాడు నేల చూపులు చూస్తూ.

“ఛఛ మీరు మారరండీ. ఈ వారం అంతా ఆఫీసు అయ్యాక సాయంత్రం పూటలు వాడితో కలిసి మన ఇంట్లో మందు తాగుతూ తూలుతూ వాడితో చెత్త వాగుతూ ఆ మత్తులో తేలిపోయి చెలరేగిపోయారన్నమాట. నేను ఈరోజు వస్తున్నానని తెలిసి నాకు ఏం తెలియకూడదని ఇలా ఇల్లంతా అద్దంలా ఉంచారన్నమాట. అయినా నామీద ప్రేమా దోమా నా మాటంటే విలువా పాడా. ఏదో ఉండబట్టలేక నాలుక పీకేదాకా చెప్పగలను కానీ మీ పీక పట్టుకోలేను కదా. వ్యసనం వద్దని నొచ్చుకుని నచ్చచెప్పగలను కానీ మీతో ఆ వ్యసనం మాన్పించలేను కదా. నన్ను ఏమారుస్తారని తెలిసినా మీరు మారతారని నమ్మడం నా వెర్రి భ్రమ. అంతేగా” అడిగిందామె అసహనంతో.

“లేదు లల్లీ, మొదట్నుండీ చెప్తున్నట్టు ఆ ఒక్క రోజే. తర్వాత ఒక్క చుక్క కూడా తాగలేదు. ఆఖరికి దగ్గు వచ్చినా కూడా దగ్గగలిగినంత సేపు దగ్గాను. ఆ తర్వాత ఆ దగ్గుకి నీరసం వస్తే బలానికి టానిక్ తాగానే కానీ దగ్గుమందు మాత్రం వేసుకోలేదు. కారణం అందులో కొంత ఆల్కహాలు ఉంటుందని ఎవరో చెప్పారు అందుకని. ఇక, ఆ రోజు తర్వాత ఆ రాంబాబుకి ఫోను చేసి మనింటికి మామూలుగా రమ్మన్నా రాలేదు. ఇక జీవితంలో నీ గుమ్మం తొక్కనురా దరిద్రుడా అనేసి ఫోను పెట్టేసాడు. నిజం మన జిమ్మీ మీద ఒట్టు” చెప్పాడు మధు.

“ఏ ఏం పోయే కాలం?” అడిగిందామె

“ఏవుంది. ఒట్టి ఉడుకుబోతుతనం. చిన్నపిల్లల మనస్తత్వం వాడికి ఇంకా పోలేదు. అయినా ప్రతిదానికీ చిన్నబుచ్చుకోవడం వాడికో అలవాటు. అయినా బోడి ఖాళీ బాటిలు పగలకొట్టానని వాడు కోపం తెచ్చుకున్నాడు. అర్థం పర్థం ఉందా? సారీ చెప్పినా కూడా వినకుండా నాతో కటీఫ్ అనేసాడు బడవ” చెప్పాడు చేతులు నలుపుకుంటూ.

“బోడిగుండుకీ మోకాలికి ముడేసినట్టుంది మీరు చెప్పింది. అయినా ఖాళీ బాటిలు పగలుకొడితే వాడికెందుకూ అంత కోపం?” అని ఓ క్షణం ఆగి “ఇప్పుడు జిమ్మీ మీద ఒట్టేసి నిజం చెప్పండి” అడిగింది లలిత.

“”అదీ మరీ ఆ ఖాళీ బాటిల్ని పగలకొట్టింది వాడి నెత్తిమీదే. వాడి తలకి నాలుగు కుట్లు కూడా పడ్డాయట. అందుకే అనకుంటాను వాడికి అంత కోపం” చెప్పాడు మధు అమాయకంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here