శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారి జయంతి సభ ప్రెస్ నోట్

0
11

[dropcap]కీ.[/dropcap]శే. అంగర వెంకట కృష్ణారావు గారి 101వ జయంతి పురస్కరించుకొని, విశాఖ సాహితి ఆధ్వర్యంలో 19-09-2021 సాయంత్రం 5:30 గం.ల నుండి విశాఖ సాహితి స్వర్ణోత్సవ సభలలో భాగంగా, శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారి జయంతి సభ అంతర్జాల మాధ్యమం ద్వారా జరిగింది.

డా. మంగిపూడి వాణీ సుబ్రహ్మణ్యం గారి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ సభకు అధ్యక్షత వహించిన విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, 4-4-1971 తేదీన ఆవిర్భవించిన విశాఖ సాహితి నేటికీ ముఖ్యమైన సాహితీ సంస్థగా కొనసాగడానికి వ్యవస్థాపకులు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారి సంకల్పబలమే కారణమని, వారి 101వ జయంతి సందర్భగా వారిని స్మరించుకోవడం సముచితమని అంటూ, వారి కథలు సంకలన రూపంలో వెలువరిస్తే వారికి సరియైన నివాళి ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.

విశాఖ సాహితి పూర్వ కార్యదర్శి, రచయిత శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ అంగర వారి ‘విరామం’ నవలని పరిచయం చేసి, ఆ నవలా రచనలో శ్రీ కృష్ణారావుగారు ప్రదర్శించిన రచనా పటిమను కూలంకషంగా చర్చించారు.

ప్రముఖ సాహితీ విశ్లేషకులు, విశాఖ సాహితి ఉపాధ్యక్షులు డా. దామెర వెంకట సూర్యారావు గారు శ్రీ అంగర వారి కథా సాహిత్యం గురించి మాట్లాడుతూ, 300 పైగా వారు కథలు వ్రాసినా 11 కథల సంకలనంగా ‘కదిలే బొమ్మలు’ వెలువరించారని అన్నారు. శ్రీ అంగరవారి కొన్ని కథలను డా. సూర్యారావు గారు సమీక్షిస్తూ, అంగర వారి కథలలోని రచనా శిల్పం అద్భుతమైనదని సోదాహరణంగా వివరించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు తమ ప్రసంగంలో విశాఖ సాహితి వ్యవస్థాపకులు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు, తొలి అధ్యక్షులు శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారు, శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు గార్లను గుర్తు చేసుకుంటూ, వారు ఆ సమయంలోని తమవంటి ఎందరో రచయితలను తీర్చిదిద్దారని అన్నారు.

శ్రీ అంగరవారి కుమార్తె శ్రీమతి అంగర వెంకట రమణి గారు, తమ చిన్నతనంలో వారింట్లో జరిగిన సాహితీ సమావేశాలలో శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీ పురిపండా అప్పలస్వామి గారలు వంటి ప్రసిధ్ధ సాహితీవేత్తలు పాల్గొనేవారని గుర్తుచేసుకుంటూ, సాహితీ సంపద, సంస్కారం వారసత్వంగా తమకు లభించాయని పేర్కొని, తమ తండ్రిగారి పేరిట జయంతి సభ నిర్వహిస్తున్నందుకు విశాఖ సాహితికి ధన్యవాదాలు తెలియజేసారు.

రచయిత, విశాఖ సాహితి తొలి సంయుక్త కార్యదర్శి, అంగరవారి సోదర పుత్రులు శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు మాట్లాడుతూ, తమ చిన్నతనంలోని ఎక్కువ భాగం శ్రీ అంగరవారి ఇంట్లోనే గడిచిందని, వారి ప్రేరణతోనే తాము కథారచన ప్రారంభించామని అన్నారు. కథా రచనలలో ‘నెగిటివిటీ’ ఉండకూడదని, ‘పాజిటీవిటీ’ ఉండాలని అంగర వారు చేసిన సూచన తాము తమ తొలి రచనలలో అవలంబించకపోయినా, తరువాతి రచనలలో ఈ సూచన అనుసరిస్తున్నానని పేర్కొన్నారు.

దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారు సమన్వయకర్తగా వ్యవహరించి, వందన సమర్పణ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here