అన్న ఎత్తు – మరదలి చిత్తు

1
8

[box type=’note’ fontsize=’16’] కపట బుద్ధితో తమ్ముడి ఆస్తి కాజేయాలనుకున్న అన్న ఎత్తులని చిత్తు చేసిన మరదలి తెలివిని నారంశెట్టి ఉమామాహేశ్వరరావు వ్రాసిన. “అన్న ఎత్తు – మరదలి చిత్తు” అనే పిల్లల కథలో చదవండి. [/box]

[dropcap]పూ[/dropcap]ర్వకాలంలో మాధవయ్య  అనే మోతుబరి ఉండేవాడు. ఆయనకి కన్నయ్య, పున్నయ్య  కొడుకులు. కన్నయ్య  మహా టక్కరి కాగా పున్నయ్య బొత్తిగా అమాయకుడు. అది తెలిసిన మాధవయ్య చిన్నవాడి వివాహాన్ని చదువరి,  తెలివైనది అయిన అమ్మాయితో జరిపించాడు. వారి సంసారాన్ని కోడలే చక్కబెడుతుందని భావించాడు.

పున్నయ్య పెళ్లి తరువాత పెద్ద కోడలు చీటికీ మాటికీ కలహాలు సృష్టించి మనశ్శాంతి లేకుండా చేసింది. బాగా ఆలోచించిన మాధవయ్య  ఆస్తిని మూడు భాగాలు చేసి చెరో వాటా కొడుకులకు ఇచ్చి,  తన వాటా విషయమై రహస్య వీలునామా వ్రాసాడు.

పున్నయ్య కుటుంబం తమ వాటాకు వచ్చిన ఇంటికి మారింది. వాళ్ళతో మాధవయ్య వెళ్ళాడు. చాల సంవత్సరాల తరువాత మాధవయ్య మరణించగా వీలునామా ప్రకారం పున్నయ్యకు తండ్రి వాటా కలిసింది. కన్నయ్యకు ఆ విషయం మింగుడు పడలేదు. తమ్ముడికి వాటా  భూముల్ని సొంతం చేసుకోవాలని భావించాడు. అతడి ఆలోచనలను గ్రామ పెద్దలు,  కరణంతో చెప్పి డబ్బు ఆశ చూపడంతో వారు అంగీకరించారు.

ఒకసారి తమ్ముడుని పొలంలో కలసిన కన్నయ్య  ‘నాన్న వాటాకి వచ్చిన భూముల్ని సొంతం చేసుకోవాలని ప్రక్క పొలం రైతులు మాట్లాడడం విన్నాను. అమాయకుడివైన నీవు రక్షించుకోలేవు. వాటి రక్షణ బాధ్యత నేను వహిస్తాను. కొన్నాళ్ళు నా  పేరుకి మారుద్దాం” అన్నాడు.

“భూములు, ఆస్తుల వ్యవహారాలు మీ మరదలి సమక్షంలో ఇంటి దగ్గర మాట్లాడుదాం. ఇంటికి వెళదాం” అన్నాడు  పున్నయ్య. మరదలి ముందుకి వ్యవహారం వెళితే ఏమి జరుగుతుందో తెలిసిన కన్నయ్య చల్లగా జారుకున్నాడు.

మరో సందర్భంలో తమ్ముడి ముందు మొసలి ఏడుపు ఏడుస్తూ “చాలా డబ్బు అవసరంలో ఉన్నాను. ధర్మయ్యను అప్పు అడిగితే ఆస్తి తాకట్టు కోరాడు. నా ఆస్తులు మరో దగ్గర తాకట్టులో వున్నాయి. తొందరలోనే అప్పు తీరుస్తాను. అంతవరకు నీ ఆస్తి  తాకట్టుకి  అంగీకార పత్రం రాసివ్వు” అని అడిగాడు కన్నయ్య.

“ఇంటికి వెళ్లి మీ మరదలితో మాట్లాడుదాం. ఆమె అంగీకారమయితే నాకూ సమ్మతమే ” అన్నాడు పున్నయ్య. ఖంగుతినడం కన్నయ్య వంతయింది. మరదలు వూసెత్తగానే భయంతో ఆ ఆలోచన విరమించాడు. అలా అతడి రెండో ఎత్తు కూడా చిత్తయింది.

కాలం గడుస్తోంది. ఒకసారి పున్నయ్య, కన్నయ్య కలసి దూరప్రయాణం చేసారు. నిద్రలో పున్నయ్య వున్నప్పుడు  కొన్ని పత్రాల మీద పున్నయ్య వేలిముద్రలు వేయించుకున్నాడు కన్నయ్య. ఇక మరదలు ఎలా అడ్డుపడుతుందో చూడాలి అని లోపల సంబర పడ్డాడు కన్నయ్య.  కొన్నాళ్ళకి తమ గ్రామం చేరి “పున్నయ్య అవసరానికి  డబ్బు ఇచ్చాను. నా పేరున తన  భూములు, ఇల్లు వ్రాసాడు కానీ వాటిని అప్పగించడం లేదు” అని గ్రామపెద్దల ముందుకి దావా తెచ్చాడు కన్నయ్య.

అమాయకుడైన  పున్నయ్య గ్రామ పెద్దల ఎదుట వాదించుకోలేక పోయాడు. దాంతో తీర్పును ఏకపక్షం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు గ్రామ పెద్దలు. పున్నయ్య భార్యకు విషయం తెలిసి పరుగున వెళ్ళింది.  “నా భర్త అమాయకుడు. దేవుడి దయ వలన మాకు డబ్బు అవసరం కలగలేదు.  నాకు చెప్పకుండా ఆయన అప్పు తీసుకోవడం జరగదు” అని  వాదించింది పున్నయ్య భార్య.

“నీ భర్త బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. కన్నయ్య వైపు సాక్ష్యాలు ఉన్నాయి. మీ ఆస్తులు అతడికి అప్పగించండి” అన్నారు పెద్దలు.

“నా భర్తకి అప్పు ఇచ్చినప్పుడు ఉన్న సాక్షులను పిలిపించండి” అంది పున్నయ్య భార్య.  “మేమిద్దరం దూరప్రయాణం చేస్తుండగా అప్పు ఇచ్చాను. తమ్ముడి అప్పుకి వేరే వాళ్ళు అవసరం లేదని సాక్షులను పిలవలేదు. ఆ డబ్బుతో వేరే స్నేహితుడి అవసరం తీర్చాడు. కావాలంటే పత్రం చూడండి” అన్నాడు కన్నయ్య.

“ఆ పత్రాలు చూపించండి’ అని పున్నయ్య భార్య అడగగానే పత్రాలను పెద్దలకి పరిశీలనకు ఇచ్చాడు కన్నయ్య.  ఆ పత్రాలు చదివిన పెద్దలు, కరణం కూడా సరిగానే వున్నాయని చెప్పారు.

“నేను వీటిని నమ్మను” అంది పున్నయ్య భార్య. “ఇదిగోమ్మా పత్రాల మీద పున్నయ్య వేసిన వేలిముద్రలు” అన్నాడు కరణం కోపంగా అందరికీ కనబడేలా చూపిస్తూ.  అందరూ తమలో తామే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఫక్కున నవ్వింది పున్నయ్య భార్య.  “ఏదో మోసం జరిగిందన్న నా మాటలే నిజమయ్యాయి’ అంది.  “మోసమా?” ఆశ్చర్యపోయారు పెద్దలు మరియు కరణం. “అవును. సంతకం పెట్టడం తెలిసిన నా భర్త వేలిముద్ర ఎందుకు వేస్తాడు? నిద్రలో వుండగా వేయించిన  వేలిముద్రలతో ఆస్తి కాజేయాలని చేసిన కుట్ర ఇది ” అంది పున్నయ్య భార్య.

పెద్దల ముందు సులభంగా సంతకం చేసి చూపించిన పున్నయ్యని, అతడి భార్య వాదనల్ని నమ్మారు గ్రామ పెద్దలు. తప్పుడు వేలిముద్రలతో  పత్రాలు సృష్టించి  మోసానికి  పాల్పడిన కన్నయ్యకు నగదు జరిమానా విధించడమే కాకుండా నానా చివాట్లు పెట్టారు.

“అమాయకుడైన నా భర్త మోసపోరాదని పెళ్ళయిన కొన్నాల్లకే  సంతకం నేర్పాను. అనేక జాగ్రత్తలు చెబుతూ ఉండేదాన్ని. నాతో  చర్చించిన మీదటే సంతకం చేయాలని సూచించాను. అందువల్లనే ఈ మోసం బయటపెట్టగలిగాను. మన గ్రామస్తులు కూడా మా ఆయనలా కాకుండా చదువులు నేర్వాలి. సొంతంగా సంతకం చేయడం భద్రత అని  గుర్తించాలి. అప్పుడే ఇతరులెవరూ మనల్ని  మోసం చేయలేరు” అంది పున్నయ్య భార్య.

ఆమె మాటలు విన్న కన్నయ్య “తెలివైన మరదలు వలన నా ఎత్తులన్నీ చిత్తయ్యాయి. ప్రయోజనం లేకపోయింది” అని బాధ పడ్డాడు. అప్పటి నుండి తమ్ముడి ఆస్తి మీద ఆశ వదులుకుని బుద్ధిగా జీవించాడు కన్నయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here