అన్నమయ్య పద శృంగారం-1

0
13

[వైశాఖ పూర్ణిమ (మే 6, 2023) తాళ్ళపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని ‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

[dropcap]స్వ[/dropcap]స్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశకవరుషంబులు ౧౩౪౬ అగు నేటి క్రోధి సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన పదారుయేండ్లకు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేనే అది మొదలుగాను శాలివాహనశకవరుషంబులు ౧౪౨౪ అగు నేటి దుందుభి సంవత్సర ఫాల్గుణ బహుళ ౧౨ నిరుధానకు తిరువేంగళనాథుని మీదను అంకితముగాను తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన శృంగార సంకీర్తనలు.

రేకు. 801

కన్నడగౌళ

ఏమని పొగడవచ్చు నిదివో నీ దేవులను
కామించి నీచిత్త మెంత గరఁగెనో కాని ॥ పల్లవి ॥
పలచనికెమ్మోవి బలువరుసల కెంపు
దొలక మాటలాడీ దొయ్యలి
కలువరేకుగన్నుల దళుకులు మెరువగా
సొలసీ నిన్ను జూచి సొబగులుదేరను ॥ ఏమ ॥
ముసిముసినవ్వులతో మోమున జంద్రకళలు
విసరుతా సిగ్గువడీ వెలది
పసిడివన్నెలగుబ్బపాలిండ్లు గదలగా –
నొసగీ బాగాలు నీకు నుడివోనియాసల ॥ ఏమ ॥
సోగకరములగోళ్ళు సోకకుండా నీకు నిట్టె
బాగుగ బాదాలొల్తీ బడతి
లాగుగ శ్రీ వేంకటేశ లలితాంగి గూడితివి
యీగతి రతి జొక్కించీ నిట్టె నిన్ను నింపుల ॥ ఏమ ॥ (1)

~

భావం: శ్రీ వెంకటాశా! ప్రేమతో మనసెంత కరిగిపోయిందో గదా! నిన్ను అలా అలరించిన నీ సతులను ఎంతగా పొగడవచ్చునో! ఇదిగో! ఆమె పెదవుల ఎర్రదనంతో పలువరస ప్రకాశిస్తుండగా నీతో మాట్లాడింది. కలువ రేకుల వంటి కనులలో తళుకులు మెరియగా నీ అందాలు చూచి సొమ్మసిల్లింది.

ముసిముసి నవ్వులతో ముఖంలో చంద్రకళలు విసురుతూ ఆ కాంత సిగ్గుపడింది.

చెప్పరాని ఆశలతో బంగారు చనుదోయి కదలగా నీకు తాంబూలం అందించింది. ఎంతో అందంగా వున్న ఆమె చేతి వేళ్ల గోళ్లు నీకు తగలకుండా జాగ్రత్తగా పాదాలొత్తింది. అట్టి వనితను నీవు పొందావు. ఆమె ఇంపు సొంపులతో ఈ విధంగా నిన్ను రతి పారవశ్యంలో తేల్చింది.

ధన్నాసి

చెలికత్తెలతో నేల చేరి సరసమాడేవు
వలపించితినా నీ వద్ద నుంటి గాక ॥ పల్లవి ॥
పలుకుదేనెల నిన్ను భ్రమయించ వచ్చితినా
చెలియమాటలు నీకు జెప్పితిగాక
కలికితనాల నీకు గడుగుట్టు సేసితినా
వెలి నిన్ను జూచి చూచి వెరగందితి గాక ॥ చెలి ॥
అక్కరతో నీకు నడియాసలు చూపితినా
యిక్కువ లంటగా గాను కిచ్చితి గాక
మక్కువ సేయుమనుచు మర్మము లంటితినా
చేతులు నొక్కగ జేత మొక్కితి గాక ॥ చెలి ॥
యెనయుమనుచు నీతో నెరుకసేసితినా
వొనర నే నీపాదా లొత్తితి గాక
ఘనుడ శ్రీ వేంకటేశ కాగిట నన్నేలితివి
మనసు సోదించితినా మరిగితి గాక ॥ చెలి ॥ (2)

~

భావం: ఓ స్వామీ! వెంకటేశా! నా చెలికత్తెలతో నీవు సరసపు మాటలాడనేల? నీ వద్ద వున్నాను గానీ, వలపించితినా? చెలిమాటలు నీకు చెప్పాను గాని, తియ్యని మాటలతో నిన్ను భ్రమపెట్టేందుకు వచ్చానా? నిన్ను చూచి భయపడితిని గాక, చిలిపితనాలతో మాయలు చేశానా? మర్మస్థానము లంటునట్లు కానుకిచ్చానుగాని, అక్కరగా వచ్చి నిన్ను అడియాసల పాలు చేయలేదుగదా! చేతులు నొక్కుటకు నా చేతితో మొక్కానుగాని, నాపై ప్రేమ చూపమని మర్మస్థానములు ముట్టలేదు. నీ పాదాలను వొత్తానుగాని పొందునిమ్మని గుర్తు చేశానా? నీపై మరులుగొన్నాను గాని, నీమనసు వెదకలేదు. ఓ ఘనుడా! నన్ను నీ కౌగిట జేర్చి ఏలుకున్నావు.

దేశాక్షి

తడవాయ నీవద్దికి తానే వచ్చునో యేమో
యెడయక నీవునీవే యెరుగుదువయ్యా ॥ పల్లవి ॥
విందువలె నాకెమాట విన్నవించితిమి నీకు
అందుకు మారుమాట లానతీవయ్యా
సందడికొలువు నీకు సతులెందరో కలరు
మందలిం చాకెకిచ్చినమాట దలచవయ్యా ॥ తడ ॥
గక్కన నాపెయంపినకాను కిచ్చితిమి నీకు
యిక్కువైనఆనవాలు యియ్యవయ్యా
పెక్కు పనులవాడవు ప్రేమ నీ కెందునుండునో
యెక్కువ నీచుట్టరిక మెంచుకొనవయ్యా ॥ తడ ॥
చెలగి యా కెమారు చేయెత్తి మొక్కితిమి
తిలకించి నీవిందుకు దీవించవయ్యా
యెలమి శ్రీ వేంకటేశ యిట్టెవచ్చి కూడితివి
మలసి యీననుపులు మరువకువయ్యా ॥ తడ ॥ (3)

~

భావం: ఓ వెంకటేశా! ఇంత ఆలస్యమైనది. ఆమె తానే నీవద్దకు వచ్చునేమో! ఆ ఆలస్య కారణము నీకే తెలుసును. ఆమె చెప్పిన తియ్యని మాటలు నీకు విన్నవించాము. దానికి సమాధానం సెలవియ్యవయ్యా! నీ చుట్టూ కొలువు దీరిన సతులు ఎందరో వున్నారు. వారిని మందలించి ఆమెకిచ్చిన మాట నిలుపుకో! ఆమె పంపిన కానుక నీకిచ్చాము. దానికి సరియైన గుర్తు మాకియ్యవయ్యా, నీవు అనేక పనులు గలవాడవు. నీ ప్రేమ ఎక్కడ వుండునో, ఎక్కువగా వున్న నీ చుట్టరికాన్ని గుర్తుంచుకో! ఆమెకు బదులుగా మేము నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాము. అది చూచి నీ విందుకు ఆశీర్వదించు. ఓ స్వామీ! నీవు ఏమరుపాటుగా వచ్చి పొందు కోరావు. ఆ అనురాగాన్ని మరవకుమయ్యా!

ఈ కీర్తనలో అన్నమయ్య తనను తాను, అమ్మ చెలికత్తెగా భావించుకొని రాయబారిగా వెంకటేశునికి విన్నపాలు చేస్తున్నాడు.

మాళవశ్రీ

కంటిమి కొత్తలు గొన్ని కన్నులపండుగగాను
అంటితివో లేదో నాతో నానతీవయ్యా ॥ పల్లవి ॥
చనవరిమాటలు సారెకు నీతో నాడి
చెనకీ నెవ్వతో కాని చెలి నిన్ను
తనివోనియాసలతో తగులువిరితనాన
పెనగులాడుతా నీపై బ్రేమము చల్లీని ॥ కంటి ॥
సందడి దానేమౌనో సరసనే కూచుండి
అంది విడేలియ్యవచ్చీ నప్పటి నీకు
మందెమేళాలు సేసుక మలసి సొలసి నవ్వి
సందుసుడి దనమోవిచౌలు చూపీ ॥ కంటి ॥
పచ్చిదేర నాడానీడా పంచల బొలసుకొంటా
యెచ్చరిక లేల సేసి నేమీ యాపె
యిచ్చట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేడు
నచ్చుకొట్టుతా గొంత నవ్వగ లాచీని ॥ కంటి ॥ (4)

~

భావం: ఓ వెంకటేశా! కనులపండువగా కొన్ని కొత్త పోడుములు చూశాము. ఆమెను కలిశావో లేదో నాకు చెప్పు. మాటిమాటికి నీతో చనవుతో ఎవరో సఖి నిన్ను తాకి తృప్తి చెందని ఆశలతో ప్రేమపూరిత లాలనతో నీమీద ప్రేమను చల్లి పెనగులాడుతోంది. ఆ సందడిలో నీ ప్రక్కనే కూచొన్న ఆమె నీకు తాంబూలాలు అందిస్తోంది. చనువు చేసుకుని విజృంభించి నవ్వుతూ సందు చేసుకుని తన పెదవి రుచులు చూపుతోంది. మరుగు లేకుండా అక్కడక్కడా నీ పంచలలో తిరుగుతూ ఆమె ఏవో హెచ్చరికలు చేస్తోంది. ఓ స్వామీ! ఇక్కడ నన్న నీవు ఏలుకున్నావు. బాధ పడుతూనే కొంత నవ్వుటాలు ఏర్పరచుకొంటాను.

దేవగాంధారి

చక్కనివాడ వన్నిటా జాణవు నీవు
మక్కువ నీకు జేయుటే మాభాగ్యము గాదా ॥ పల్లవి ॥
వన్నె కెక్క నీకు నేను వలవ నావసమా
కన్నులనే చూచి చొక్కగల గాక
చన్నుల నొత్తి కాగిలించగ నావసములా
సన్నలనే నీమోవి చవిగొంట గాక ॥ చక్క॥
ఆయమెరిగి పెనగ నప్పటి నావసమా
కాయమంటే సంతోసించగల గాక
చేయిముట్టి నే నిన్ను జెనకగ వసమా
చాయలకు నీతో సరసమాడుట గాక ॥ చక్క॥
పిలిచి నిన్ను రతుల గలయగ వసమా
చెలరేగి నీసేవ సేయుట గాక
యెలమి శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
తలచ నిన్ను వసమా తగులుట గాక ॥ చక్క॥ (5)

~

భావం: ఓ వెంకటేశా! నీవు చక్కని వాడవు, అన్నిటా జాణవు. నీపై ప్రేమను చూపడమే మా భాగ్యము గదా! కంటితో చూచి అలసి పోగలనో, గాని నీవు మెచ్చుకొనునట్లు నిన్ను ప్రేమించుట నాకు శక్యమా? సైగలతో నీ పెదవి నంటి రుచిచూచుటేగాని, చన్ను లొత్తి కౌగిలించుట నా తరమా! నీ శరీరాన్ని అంటి సంతోషించుట గానీ మర్మమెరిగి పెనవేసుకొనుట నా వశమా! నీ సమీపమున నీతో సరసాలాడటమేగాక నిన్ను తాకి కవ్వించగలనా! ఆనందంతో నీ సేవ చేయడమేగాని, నిన్ను పిలిచి నీతో రతులలో కలియగలనా? ఓ స్వామీ! యిన్నింటిలోను నన్ను పాలించావు. నీతో సంబంధమేగాని తలపోయడం నా వశమా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here