అన్నమయ్య పద శృంగారం-10

0
18

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

వరాళి

ఇంతలో విచ్చేసితి నీకెభావమిదె చూడు
ఇంతి గోడపైరూపే యీ రూపనుచును ॥పల్లవి॥
జిగిమించు నీరూపు చిత్తరువులో జూచి
నగు నింతి తనతోను నవ్వితివంటా
మొగము చూచేవంటా ముచ్చటతో దలవంచు
చిగురుమోవి చూచి సిగ్గువడును ॥ఇంత॥
చేరి మాటలాడెనంటా జెప్పు నీకు బ్రియములు
కోరికతో దండనుండి కొలువు సేసు
సారెకు బానుపుపైకి సన్నలుసేసి పిలుచు
నేరుపుతో దములము నిన్నట్టె యడుగును ॥ఇంత॥
నివ్వెరగైతివంటా నిన్ను గొనగోర నంటు
పవ్వళించుమని చేత బట్టబూనును
నివ్వటిల్ల నంతలోనె నీవె వచ్చి కూడితివి
యివ్వల శ్రీవేంకటేశ యిట్టె వోలలాడును ॥ఇంత॥ (83)

భావము: ప్రౌఢయైన ఒక వనిత చేష్టలను స్వామికి వివరిస్తున్నారు. శ్రీవేంకటేశ! అనుకున్నంతలోనే వచ్చావు. ఈమె మనసులో భావాన్ని చూడు. ఈ భామ తన గోడపై వున్న చిత్రమే ఈ రూపం అనుకొన్నది. అందమైన నీ రూపాన్ని బొమ్మలో చూచి ఆ యింతి నవ్వుతోంది. నీవు కూడా ఆమెతో నవ్వావట! నీవు ఆమె ముఖం చూచావట! ఆమె తలవంచుకొంది. నీ మృదువైన పెదాలు చూచి సిగ్గు పడుతోంది. దగ్గరగా చేరి నీకు ప్రీతికరమైన సరససల్లాపాలాడుతోంది. ఇష్టపడి నీ దగ్గర వుండి నీకు సేవలు చేస్తోంది. మాటిమాటికీ సైగలు చేసి పడకమీదికి రమ్మని పిలుస్తోంది. ఎంతో నేర్పుతో తాంబూలమిమ్మని నిన్ను ఇలా అడుగుతోంది. నిన్ను తన కొనగోళ్లతో అంటుకోగా ఆశ్చర్యపడ్డావట! నీ చేతిని పట్టుకొని పడుకుందాం రమ్మని లాగుతోంది. (ప్రయత్నిస్తోంది). ఇంతలోపలే నీవు వచ్చి కలిశావు. స్వామీ! ఇక్కడ ఆమె ఆనందంతో వోలలాడుతుంది.

ఆహిరి

మరుతంత్రములలో మరగేటికి
శిరసు వంచి మొక్కేను చెప్పరే యాతనికి ॥పల్లవి॥
తమి యేలరేచీనే తరితీపేల సేసినే
సముకాన నున్నదాన జనవరిని
కొమరె వయసుదాన గుదురుకొనె వలపు
చెమటలు మేననిండె జెప్పరే యాతనికి ॥మరు॥
సెలవినేల నవ్వీనే సిగ్గులేల నెరపీనే
చెలిమి చేసినదాన సేవచేసేను
నలుగడ నివ్వెరగై నామనసు తనకె
సెలవుసేసితినని చెప్పరే యాతనికి ॥మరు॥
సన్నలేల సేసీనే చన్నులేల పిసికీనే
వున్నతి దనకాగిట కున్న దానను
యిన్నిటా శ్రీ వేంకటేశు డింతలో దానన్ను నేలె
చెన్నగునాసంతోసము చెప్పరే యాతనికి ॥మరు॥ (84)

భావము: సఖి చెలులతో తన మదనతాపాన్ని వెల్లడిస్తోంది. సఖులారా! మదనతంత్రాలలో దాపరికాలు ఎందుకు? నేను శిరసువంచి మొక్కుతున్నాను. ఆతనికి ఆ విషయం విన్నవించండి. నాలో మోహాన్ని ఏల పెంచాలి? సంతోషం ఎందుకు కలిగించాలి? చనువులతో ఎదురుగా ఉన్నదానిని గదా? యౌవనంలో ఉన్నదానిని, అతనిపై ప్రేమ కుదురుకొన్నది. నా శరీరమంతా చెమటలు పట్టాయి. ఆతనికి ఈ వివరాలు చెప్పండి. పెదవులపై అతనికి నవ్వులేల? సిగ్గుపడనేల? ప్రేమించినదానిని. ఆతని సేవలు చేస్తాను. అన్ని వైపులా ఆశ్చర్యం నిండి నా మనసు అతనిపై చిక్కుకొంది. నన్ను నేను తనకు అర్పించుకొన్నానని ఆతనితో చెప్పండి. సైగలు చేయడమెందుకు- చనుదోయి పిసకడమెందుకు? ప్రీతిగా ఆతని కౌగిలికి ఎదురు చూస్తున్నదానిని. ఇంతలో వేంకటేశుడు తానై వచ్చి నన్ను ఏలుకున్నాడు. అందమైన నా సంతోషాన్ని అతనికి చెప్పండి.

గుండిక్రియ

ఏల సిగ్గువడేవు ఇందరము జూచేమని
చాలవలచేవలపు చల్లించుకోవయ్యా ॥పల్లవి॥
చేకొని విడెము చేతికిచ్చి జవరాలు
ఆకుమడిచియ్యజూచీ నందుకోవయ్యా
మేకొని గందము నీమేన బూసేనంటా వచ్చె
యీకడ నిట్టె పూయించుకొనవయ్యా ॥ఏల॥
చేరి పువ్వులసరులు చేతబట్టుకున్నది.
కోరి యట్టె ముడిపించుకొనవయ్యా
గారవాన బాదాలొత్త గడువేడుకపడిని
వూరడించి పాదాలు నీ వొత్తించుకొనవయ్యా ॥ఏల॥
పిలిచి నీగరిడీలో బెనగేనంటా నున్నది.
చెలగి యాపెతో సాము సేయవయ్యా
యెలమి శ్రీ వేంకటేశ యిట్టె నన్ను గూడితివి
సొలసీ నాపె నిన్ను సొలయించుకోవయ్యా ॥ఏల॥ (85)

భావము: సిగ్గుపడుతున్న స్వామికి హితవు చెబుతున్నారు చెలులు. శ్రీవేంకటేశ! మేమందరము చూస్తున్నామని సిగ్గుపడనేల? అధికంగా ప్రేమించే ఆమె ప్రేమను నీపై చల్లించుకో! ప్రేమతో ఆ ముద్దరాలు నీ చేతికి తాంబూలం అందించింది. ఆకు మడిచి యివ్వడం చూచి తీసుకోవయ్యా! దగ్గరగా వచ్చి నీ శరీరానికి గంధం పూస్తానంటోంది ఇక్కడ ఇలా పూయించుకోవయ్యా! నిన్ను చేరి పూలమాలలు పట్టుకొని నిల్చున్నది. కోరికతో ధరించవయ్యా! ఎంతో గౌరవంతో నీ పాదాలొత్తాలని సంబరపడుతోంది, ఆమెను ఋజ్జగించి పాదాలొత్తించుకో! నిన్ను పిలిచి నీ గరిడీలో (తాలింఖానాలో) నీతో పెనగులాడుతానంటోంది. నీవు విజృంభించి ఆమెతో రతి సాము చేయవయ్యా! స్వామీ! నీవు నన్ను కలిశావు. ఆవిడ అలసి సొలసిపోయింది. నీ శ్రమ తీర్చుకోవయ్యా!

దేసాళం

తప్పించుకొనరాదు తలగా రాదు
చెప్పితి నిట్టె మన్నించి చిత్తాన బెట్టుమీ ॥పల్లవి॥
నా తలపుకొడి సాగి నంటున దీగెవంటిది
ఆతలనీతల నీమై నల్లుకున్నది
కాతరపునాచూపు గబ్బితుమ్మిదవంటిది
గాతల నీయందే గూడుగా బెట్టుకున్నది ॥తప్పించు॥
వేడుక నాయాస ఇది వేటమెకమువంటిది
కూడి నీపాదాల దగులుకున్నది
వోడక నావలపు నీవొళ్లినీడవంటిది
వీడక నీవెంటవెంట వెస బాయకున్నది ॥తప్పించు॥
దాగక నాచన్నులివి తమ్మి మొగ్గలవంటివి
కాగిటిలో నీకు బూజై కాచుకున్నది (వి?)
చేగదేర నేలితివి శ్రీవేంకటేశ నన్ను
మాగిననామోవితేనె మంచివిందై వున్నది ॥తప్పించు॥ (86)

భావము: ప్రౌఢయైన ఆ కాంత శ్రీకాంతునికి తన సర్వస్వం అర్పించుకొంటోంది. ఓ వేంకటేశ! నిన్ను తప్పించుకోలేను. వదలుకోలేను. ఈవిధంగా విన్నవించుకొంటున్నాను. మన్నించి నీ మనసున పెట్టుకో! నా ఆలోచనలు కొనలుసాగిన అంటు తీగవలె ఉన్నాయి. తర్వాత నిన్ను అటూ, ఇటూ అందంగా అల్లుకొంది. ఉత్సాహంతో కూడిన నా చూపు గర్వించిన (మత్తెక్కిన) తుమ్మెద వంటిది. గొడవపడి నీయందే గూడు చేసుకున్నది. సరదాపడ్డ నా ఆశ వేటమృగం వంటిది. అది నీ పాదాలకు తగులుకున్నది. వదలిపెట్టని నా ప్రేమ నీ శరీరపు నీడవంటిది. అది వదలకుండా నిన్ను వెంబడిస్తోంది. దాగని నా చనుదోయి తామర మొగ్గలవంటివి, కౌగిట్లో నీ పూజకై కాచుక కూచున్నవి. చేవదేరేలా స్వామీ! నన్ను ఏలుకున్నావు. బాగా పండి మాగిన నా పెదవుల తేనె నీకు మంచి విందుగా నున్నది.

మాళవిగౌళ

లలనలస(సం)తలోని లాబగాడవు
తలచనితలపులు రైలువారె నిపుడు ॥పల్లవి॥
వేడుకతో నీవాపైపై వేసినపూవుల చెండ్లు
తోడువచ్చి నిలుచున్న తాయ్యలి దాకె
కూడాబట్టి యిద్దరిని గొబ్బున బెండ్లాడవయ్య
యీడనే నీబేర మొక టినుమడి యాయను ॥లల॥
చెలరేగి యాపెమీద జిమ్మినట్టి పన్నీరు
మెలుపున జెలికత్తెమీద నిండెను
కలసి నీవిద్దరిని గాగిలించుకొనవయ్య
వలపు లినుమడించి వడ్డివచ్చె నీరును ॥లల॥
పిక్కటిల్ల నీవాపెపై బెట్టినటువంటి సేస
పక్కన నూడిగపుసతిపై జిందెను
యిక్కువ శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
మొక్కలాన నీ మేలు ముయ్యడ నాగాయను ॥లల॥ (87)

భావము: దక్షిణనాయకుడైన శ్రీ వేంకటేశునితో చెలులు సరసాలాడు తీరిది.. శ్రీవేంకటేశ! వనితల సంతలో లాభం పొందిన వ్యాపారివి నీవు. అనుకోని ఆలోచనలు పొంగి పొరలాయి. సరదగా నీవు నీ భామినిపై వేసిన పూలచెండు తోడుగా వచ్చి నిలుచున్న చెలికత్తెకు తగిలాయి. ఇద్దరినీ ఒక చోట చేర్చి త్వరగా పెండ్లాడవయ్యా! ఇక్కడనే నీ బేరం రెట్టింపు అయినది. ఉద్రేకంతో నీవు ఈమె మీద చల్లిన పన్నీరు ఉల్లాసంగా చెలికత్తె వొంటి మీద నిండింది. ఇద్దరినీ కలిసి నీవు కౌగిలించుకోవయ్యా! ప్రేమలు రెట్టింపై (ఈ వ్యాపారంలో) నీకు వడ్డీ గిట్టింది. విసురుగా నీవు ఆమెపై విసిరిన అక్షతలు పక్కనే నిలుచున్న సేవకురాలిపై చిందాయి. ప్రేమతో స్వామీ! నన్ను ఏలుకున్నావు. ఉత్సాహంతో నీవు చేసిన మేలు మూడు దిక్కులలో వృద్ధి పొందింది (మూడింతలైనది).

వనితల వలపును సంత బేరంగా పోల్చడం అద్భుతం..

భైరవి

అన్నిటా నెరజాణడైననాయకుడు తాను
సన్నల చాయల దానే సరిచూడుమనవే ॥పల్లవి॥
మనసులోని వలపు మాటలలోనే తోచు
తనువుపై వేడుకలు తమియై రేగు
కనుచూపులలో యాస కడగు జాగరములై
తనకు నే జెప్పనేల తలచుకొమ్మనవే ॥అన్ని॥
మొలచినసిగ్గులు ముసిముసినవ్వులౌను
నెలకొన్న తలపోత నిట్టూర్పు లగును
చెలగి యెడమాటలు చిగిరించు గోరికలై
తిలకించి నాభావము తెలుసుకొమ్మనవే ॥అన్ని॥
చిప్పిలుగళలతోట చిందు మోవితేనియలై
చెప్పరాని సంతోసము చెమటలౌను
యిప్పుడె నన్నేలినాడు ఇదె శ్రీవేంకటేశుడు
యెప్పటికి నిదేమాట యెరుగుకొమ్మనవే ॥అన్ని॥ (88)

భావము: ముగ్ధయైన నాయిక తన ప్రేమను చెలి ద్వారా స్వామికి విన్నవిస్తోంది. ఓయమ్మా! అన్ని రకాలుగా అతడు నెరజాణయైన నాయకుడు. నా దరిదాపులలో తానే సరిచూడమని చెప్పవే. నా మనసులోని ప్రేమ మాటలలో కన్పిస్తోంది. శరీరంమీది వేడుకలు మోహంతో పెట్రేగిపోతున్నాయి. కంటి చూపుల్లో వున్న ఆశ సాహసంతో జాగరములై పోతోంది. ఆతనికి నే చెప్పవలసిన పనిలేదు. ఆయననే ఆలోచించుకోమను. అప్పుడే మొలిచిన సిగ్గులు క్రమంగా ముసిముసి నవ్వులవుతున్నాయి. మనసులో నాటుకున్న ఆలోచనలు నిట్టూర్పులవుతున్నాయి. సంధిగా చెప్పిన మాటలు కోరికలుగా చిగురించాయి. నా మాటలు విని నా భావం తెలుసుకోమని చెప్పవే! పొంగుతున్న మన్మథభావాలు పెదవిపై తేనియలయ్యాయి. చెప్పలేనంత సంతోషం చెమటరూపం దాల్చింది. ఇప్పుడు నాస్వామి నన్నేలుకున్నాడు. ఎన్నటికైనా ఇదేనా మాట అని తెలుసుకో మనవే – అని పలువిధాలుగా భంగపడింది.

నాట

ఊరకే గుట్టుతోడ నుందువు గాక
మేరమీరి ఇంత మందెమేళ మేటికే ॥పల్లవి॥
వేరొకతెమీద బెట్టి విభుడు నవ్వినందుకు
సారె సారె నీవే జంకించేవే
చేరి నీరతిసుద్దులు చెలులతో జెప్పి తేను
గీరుచు గోరు నీవెంత గిలిగించేవే ॥ఊర॥
నెట్టన నెవ్వతెసొమ్మో నీమేన బెట్టినందుకు
ఇట్టె వాడి చూపుల నీవేల చూచేవే
జట్టిగొని పెదవులసన్నలనే తిట్టితేను
గట్టిగా బెదవి యేల గంటిసేసేవే ॥ఊర॥
కాంతలు చూడగ నిన్ను గాగిలించుకొన్నందుకు
చెంతనుండి నీవేల సిగ్గువడేవే
ఇంతలో శ్రీవేంకటేశు డేకతాన నిన్ను గూడె
పంతమున నీవె(వెం?)త పచ్చిసేసేవే ॥ఊర॥ (89)

భావము: ప్రౌఢయైన నాయికతో చెలులు సరసాలాడుతున్నారు. ఏమమ్మా! నీవు ఊరకే రహస్యంగా ఉండక హద్దుమీరిన చనవులేల? మరెవరి మీదో నెపము పెట్టి నీభర్త నవ్వితే, మాటిమాటికీ నీవేల బెదిరిస్తున్నావు? నీతో చేసిన రతి ముచ్చట్లు నీ చెలులతో చెప్పితే గోటితో గీరుతూ నీవు ఎంతగా గిలిగింతలు పెడుతున్నావే! ఎవరివో ఆభరణాలు నీ శరీరంపై అందంగా అలంకరిస్తే, తీక్షణమైన చూపులతో చూస్తావెందుకు? నీతో జతగూడి పెదవుల సైగలతోనే తిడితే, నీవు గట్టిగా పెదవి మీద గంట్లు పెట్టావెందుకే! ఇతర భామలు చూస్తుండగా నిన్ను కౌగిట జేరిస్తే, దగ్గరగా వుండి నీవెందుకు సిగ్గుపడతావు? ఇంతలో ఏకాంతంలో వెంకటేశుడు వచ్చి నిన్ను క్రీడించాడు. నీవు పంతంతో ఎంత ఆరడి చేస్తున్నావే!

తెలుగుగాంబోది

చక్కనిదానవు నీవు జవరాలవు
మక్కువ నీపై జేయక మానవచ్చునా ॥పల్లవి॥
కన్నులజూచినచూపు గండుతుమ్మిదల పూపు
సన్నలనవ్విననవ్వు జాజిపువ్వు
పన్ని నీమోములో సిగ్గు వెన్నెల తేటనిగ్గు
వన్నెలనీరమణుడు వలచు టేమరుదే ॥చక్క॥
మలయునీపలుకులు మరునంపచిలుకులు
కలికికొప్పుజారు మేఘపుదీరు
నిలువుజక్కదనము నిండుజవ్వనవనము
బలిమి నాతడు నీకు భ్రమయు టేమరుదే ॥చక్క॥
వాడిగోరిచెనుకులు వజ్రాలమినుకులు
పోడిమి నీకెమ్మోవి పొగరుగావి
నేడు శ్రీవేంకటేశుడు నిన్ను నింతలోనె కూడె
నాడే యీతడు నీకు ననుపాటేమరుదే ॥చక్క॥ (90)

భావము: కాంతపై నాయకుడు భ్రమపడుట సహజమేనని చెలులు నిర్థరించారు. ఓ సఖీ! అందగత్తెవు, యౌవనవతివి అయిన నీపై ప్రేమ చూపడం మానగలడా? నీ కడగంటి చూపు బలసిన తుమ్మెదల పూనిక. పక్కనే నిలబడి నవ్విన నవ్వు విరిసిన జాజిపూవు. నీ ముఖం మీది సిగ్గు వెన్నెలలోని ప్రకాశం. అట్టి వేళ వన్నెల నీ ప్రియుడు నిన్ను వలచుటలో ఆశ్చర్యమేమున్నది? మృదువైన నీమాటలు మన్మథుని అమ్ములపొదిలోని బాణములు. వనిత జారిన కొప్పు మేఘాలను పోలి వున్నది. నే నిలువెత్తు అందము వికసించిన యౌవనవనము. అట్టి వేళ ఆతడు నిన్ను చూచి భ్రమపడటంలో ఆశ్చర్యమేముంది? వాడియైన గోటి గిల్లుడు వజ్రాల మెరుపులు, నీ ఎర్రనైన పెదవి ముదురు ఎరుపు. ఈనాడు శ్రీవేంకటేశుడు ఇంతలోనే నిన్ను క్రీడించాడు. ఆనాడే ఈతడు నీకు ప్రియుడు కావడంలో ఆరుదేమి? అని చెలులు సరసాలాడారు.

దేశాక్షి

ఎలయించీ సారెకు నిన్నెవ్వతో కాని
వలపులు చల్లీని వాడుదేరిచీని ॥పల్లవి॥
కలువల వేసి సతి గక్కన నీవు చూచితే
మొలకసన్నలనే మోవి చూపీని
అలరి చదురంగములాడేపరాకున నుంటే
యెలుగెత్తి పాటపాడి యెచ్చరించీని ॥ఎల॥
యింతి చన్నుల నిన్నొత్తి ఇవ్వలిమోము నీవైతే
అంతలోనే కన్నుల నీకటు మొక్కీని
పంతాన బానుపుమీద బవ్వళించి నీవుండితే
చెంతనుండి యెరుకలు సేయుచు నవ్వీని ॥ఎల॥
నిమ్మపండు గానుకిచ్చి నీవు చేతనందుకొంటే
కమ్ముక నిన్నింతలోనే కాగిలించీని
నెమ్మది శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
కమ్మర నను గూడితే కందువ చెప్పిని ॥ఎల॥ (91)

భావము: దక్షిణనాయకుడైన పతిని అలమేలుమంగ వివిధ రకాలుగా ప్రశ్నిస్తోంది. శ్రీవేంకటేశ! నేను అలమేలుమంగను. మాటిమాటికీ ఎవ్వతోగాని నిన్ను రెచ్చగొట్టి ప్రేమను చల్లి నిన్ను ఘటికుణ్ణి చేస్తోంది. నీవు ఆమెపై కలువపూలు విసిరి ఆమెను చూస్తే, చిరు సంజ్ఞలతోనే నీకు పెదవి అందించింది. నీవు సంతోషంగా ఆమెతో చదరంగమాడుతూ పరాకుగా వుంటే, గొంతెత్తి పాటపాడి హెచ్చరికలు చేస్తోంది. ఆ భామ తన చనుదోయితో నిన్ను వొత్తితే, నీవు పెడమోముపెడితే, అంతలోనే ఆమె నీకటువైపు చేరి కళ్లతో మొక్కింది. నీవు పంతంబట్టి పడకమీద పడుకొంటే దగ్గరగా వచ్చి తన గుర్తులు చెబుతూ నవ్వుతోంది. నీవు ఆమెకు నిమ్మపండు కానుకగా ఇచ్చి చేయి అందుకొంటే, నిన్ను ఆక్రమించుకొని ఇంతలోనే కౌగిలించింది. మళ్లీ నీవు నన్ను కలిసితే ప్రియాలు చెబుతోంది – అని అలమేలుమంగ ప్రశ్నిస్తూ హెచ్చరిస్తోంది.

ధన్నాశి

ఇంతులచేతకు లోనే యెప్పుడును మగవాడు
యింతేసిపంతాలు మాతో నేలాడేవయ్యా ॥పల్లవి॥
కన్నుల జూచినయాస కాగిటికి బెనగించు
సన్నలు సేసినయాస సంగడి బెట్టు
చన్నులుసోకినయాస సమరతి కొనగూర్చు
యిన్నేసి మాతో నేరా లేలాడేవయ్యా ॥ఇంతు॥
మాటలాడించినయాస మర్మములు గరగించు
చోటిచ్చినయాస రతి జొక్కించును
నాటించినగోరియాస ననుపులు వెడరేచు
యీటున నీయాచారాలు యెంత చెప్పేవయ్యా ॥ఇంతు॥
సరసమాడినయాస జంట లప్పుడే సేయు
సరుగ నవ్వినయాస చవులు రేచు
ఇరవై శ్రీవేంకటేశ యిట్టె నన్ను గూడితివి
యెరవులవెడమాయ లేల సేసేవయ్యా ॥ఇంతు॥ (92)

భావము: పురుషులు ఎప్పుడూ స్త్రీలకు వశులేనని అలమేలుమంగ నిర్ధారిస్తోంది.

శ్రీవేంకటేశ! ప్రతి పురుషుడు స్త్రీల చేష్టలకు వశమైనవాడే. మరి నీవు యిన్ని రకాల పంతాలు ఎందుకాడుతావు. రకరకాలు ఆశలు స్త్రీలు కలిగిస్తారు. స్త్రీ క్రీగంటితో చూపిన ఆశకు పురుషుడు కౌగిలి కోరుతాడు. సైగలు చేసి చూపిన ఆశ స్నేహన్ని కోరుతుంది. చనుదోయి తాకించిన ఆశ సమరతికి దారితీస్తుంది. అట్టివేళ ఇన్నిరకాలుగా నీవు దోషంగా మాట్లాడుతావెందుకు? మాట్లాడించిన ఆశ రహస్యస్థానాలను పులకింపజేస్తుంది. దగ్గరగా వచ్చిన ఆశ రతిలో పరవశింపజేస్తుంది. గోటి నొక్కుల ఆశ ప్రేమలను రెచ్చగొడుతుంది. ఈ తీరుగా నీ పనులు ఎంతగా చెప్పగలనయ్యా! సరసంగా మాట్లాడిన ఆశ అప్పటికప్పుడే ఇద్దరినీ జతగూరుస్తుంది. అందంగా నవ్విన ఆశ రుచులు రేపుతుంది. స్వామీ! ప్రియంగా నీవు నన్ను కలిశావు. ఇంతలో విలక్షణంగా అనవసరపు మాయలెందుకు చేస్తావు? అని అలమేలుమంగ గద్దించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here