అన్నమయ్య పద శృంగారం-12

0
7

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

పాడి

ఎంతనోము నోచితినో యేమిచెప్పేది.
మంతు కెక్క నింకా నింత మన్నించేవుగాక ॥ పల్లవి॥
మేకొని నీ వాడేటిమేలములు కావా
లాకలై నామోమున గళలు రేచేవి
జోకతోడ నీతోడిచుట్టరికమే కాదా
యేకాలమును నిన్ను నెడయనియ్యనిది ॥ ఎంత॥
ననుపున నీవు నాతో నవ్విననవ్వులే కావా
తనివిదీరకుండా దలపించేవి
పెనగి కొప్పుపై నీవు పెట్టినసేసలే కావా
యెనసి నీకాగిటిలో నింతకు దెచ్చినవి ॥ ఎంత॥
చన్నులపై నీవు చేయిచాచినరతులే కావా
పన్నినవలపులై పాదుకొన్నవి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేడు
కన్నులచూపులేకావా కామించజేసినవి ॥ ఎంత॥ (103)

భావము: తన ప్రియుని అనురాగాన్ని సతి గొప్పగా అతనికి విన్నవిస్తోంది.

శ్రీవేంకటేశ! పూర్వజన్మలో ఎన్ని నోములు నోచానో ఏమి చెప్పగలను? ప్రసిద్ధికెక్కేటట్లు నన్ను ఆదరించావు. మాయజేసి నీవు నటించే చమత్కారాలు అంకురించి నాముఖంపై కళలు రేపాయి. అందమైన నీతో బంధుత్వమే కదా అన్ని వేళలా నీకు నన్ను దూరం కాకుండా చేసినది. ప్రీతితో నీవు నాతో నవ్విన నవ్వులే తృప్తిలేకుండా ఊహలు రేపేవి. పెనగులాడి నా శిరసుపై నీవుపెట్టిన సేసలే గదా నీ కౌగిలిలో ఇంతగా చేర్చినవి. నా చనుదోయిపై నీవు చేయి చాచి చేసిన రతులే గదా అధికమైన ప్రేమలై నిలదొక్కుకున్నవి. ఇన్ని రకాలుగా ఓ స్వామీ! నన్ను నీవు నేడు ఏలుకొన్నావు. నీ కంటి చూపులే గదా నన్ను కామించేలా చేసినవి – అని తన అశక్తతను, ఆత్మీయతను వెల్లబుచ్చింది.

గౌళ

ఊరకే విఱ్ఱవీగేవు వువిదలలోననెల్లా
యీరీతి నుండితేను నాయీడుదానవైతివా ॥ పల్లవి॥
పంతముతో బిగిసితే పగటుదానవైతివా
సంతసుద్దులు చెప్పితే జాణవైతివా
బంతి గూచుండితేనే పట్టపుదేవివైతివా
వంతుతోడ వలపించవలెగాక విభుని ॥ఊర॥
సారె సారె నవ్వితేనే చనవరివైతివా
తోరపుగొప్పు పెట్టితే దొరవైతివా
చేరి యంటుకొంటేనే చేతలాడివైతివా
దారకాన దక్క గొనదగుగాక పతిని ॥ఊర॥
పెనగి దండ గూచుంటే పెండ్లికూతురువైతివా
పనులు సేసితే నేరుపరివైతివా
యెనసి శ్రీవేంకటేశు డేలె నన్నిందుకు, నీవు
చెనకి మెచ్చేది మంచిదిగాక ఇతనిని ॥ఊర॥ (104)

భావము: ఒక నాయిక మరొక నాయిక ఆరడితనాన్ని నిరసిస్తోంది.

ఏమమ్మా! ఇంతమంది స్త్రీలలో గొప్పదానినని నీవు ఊరకే విర్రవీగుతున్నావు.. ఈవిధంగా ఉండటానికి నా వయసుతో సమానమైన దానివా? పంతం బట్టి బిగుసుకొని కూచొంటే నేర్పరివవుతావా? పంక్తిలో స్వామి పక్కన కూచోగానే పట్టపురాణివైనావా? ప్రియుని పోటీపడి ప్రేమించాలిగాని, మాటిమాటికీ నవ్వితేనే స్నేహితురాలివవుతావా? దగ్గరగా చేరి అంటుకొని కూచొంటే చేతలు గల స్త్రీవి అవుతావా? బాల్యచేష్టలతో పతిని దక్కించుకోవాలి గాని, పెనగులాడి పక్కన కూచొంటే పెండ్లికూతురివైపోతావా? ఆయనకు సేవలు చేసిపెడితే నేర్పరివైపోతావా? నన్ను ఇందుకుగా శ్రీ వేంకటేశుడు ఏలుకొన్నాడు. ఇతనిని నీవు నొక్కులు నొక్కి మెచ్చుకోవడం శుభదాయకం – అని సలహా ఇస్తోంది సఖి.

హిందోళవసంతం

ఏమని చెప్పుదునే వీడెమ్మెకాడు
చేముట్టి వేడుకొనీనే చెలిమికాడు ॥పల్లవి॥
చలపాదిసరసాలజాజరకాడు
వలపులు చల్లీ బెక్కువలపుకాడు
తలపించీ దనపొందు దాయగాడు
వెలయించీ నన్ను నింత వేడుకకాడు ॥ఏమ॥
బచ్చనపరాకులపంతగాడు
కొచ్చికొచ్చి చెనకీని కోడెకాడు
అచ్చుగా నాసరులంటీ నాసోదకాడు
యిచ్చటనే కాచుకున్నా డెలయింపుకాడు ॥ఏమ॥
వద్దనుండే యెలయించీ వన్నెకాడు
అద్దుకొనీ గాగిట నందగాడు
వొద్దికై శ్రీవేంకటేశు డుబ్బరికాడు.
పెద్దరికపు లాబాలబేరగాడు ॥ఏమ॥ (105)

భావము: శ్రీవేంకటేశుని వివిధరకాల స్వభావాలను వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తోంది.

ఏమమ్మా! ఏమని చెప్పగలను. ఇతడు విలాసపురుషుడు, చేతులు పట్టుకొని వేడుకొనే స్నేహితుడు. పట్టుదలగల సరసాలజాజరకాడు (వేషగాడు). ప్రేమను పలువిధాలుగా వెదజల్లే ప్రేమికుడు. తన సౌఖ్యాన్ని భావింపజేసే శత్రువు. నన్ను ఈ విధంగా ఆరడిపెట్టిన సరదాపరుడు. నిత్యము పరాకుపడే పౌరుషవంతుడు. గుచ్చిగుచ్చి నొక్కులు నొక్కే విటుడు. నేర్పుతో నా పూదండలను తాకిన చోద్యపు మనిషి. ఇక్కడే నాకొరకు కాచుకొని కూచున్న సొగసుగాడు. దగ్గరనే వుండి సొగసులు చూపే వన్నెగాడు. కౌగిటికి అద్దుకొన్న అందగాడు. వొద్దికైన శ్రీ వేంకటేశ్వరుడు ఉబ్బిపోయే వ్యక్తి. ఇతడు పెద్దరికం పేరుతో వుండే లాభాల బేరగాడు అని వ్యంగ్యోక్తులాడింది.

భైరవి

ఎప్పుడు చిత్తగించేవో యేగతి మన్నించేవో
వొప్పనసేసితి నీకు నుడివోనివయసు ॥పల్లవి॥
పంతమాడి వలచితి పైకొని నే నీకు
సంతోసాన బొగడితి సారెకు నిన్ను
చింతదీర మొక్కితి చెలగి నీపాదాలపై
ఇంతకంటే మరి నే నేమిసేతు నికను ॥ఎప్పు॥
సన్నలనే చవిగొంటి సరసపునీమోవి
కన్నులను సొలసితి గక్కన నిన్ను
చన్ను మొనల నొత్తితి సంగడికి వచ్చి నీమై
యెన్నికలు నెరవేరె నేమి సేతు నికను ॥ఎప్పు॥
విరులసేస పెట్టితి వేడుక నీకొప్పుమీద
నిరతిమై గాగిట నించితి నిన్ను
సిరుల నన్నేలితివి శ్రీ వేంకటేశ్వర
యిరవైతి నూడిగాన కేమి సేతు నికను ॥ఎప్పు॥ (106)

భావము: పతిపై అనురక్తిగల కాంత తన ప్రేమను నాధునికి వివరిస్తోంది.

శ్రీ వేంకటేశ్వర! నా యౌవనాన్ని నీకు అర్పణ చేశాను. నీవు ఎప్పుడు ఆలకిస్తావో? ఏ రకంగా ఆదరిస్తావో తెలియదు. నేను నిన్ను పైకొని పంతాలాడి ప్రేమించాను. నిన్ను మాటిమాటికీ సంతోషంతో పొగిడాను. చింతలు తొలగిపోయేలా నీ పాదాలపై మ్రొక్కాను. ఇక ఇంతకంటే అధికంగా నేనేమి చేయగలను? సైగలతోనే అందమైన నీ పెదవిని రుచి చూశాను. వెంటనే నిన్ను కనులారా చూచి అలసి సొలసి పోయాను. నీ దగ్గరగా వచ్చి నీ శరీరాన్ని నా చనుదోయితో వొత్తాను. నేను కోరుకున్న కోర్కెలు నెరవేరాయి. ఇంకేమి చేయగలను? నీ తల మీద పూల అక్షతలు వేడుకగా చల్లాను. నిన్ను కోర్కెతో కౌగిట్లో బంధించాను. ఓ స్వామీ! సంపదలతో నన్నేలుకొన్నావు. ఇకపై నాకు ప్రీతిగా ఏవిధమైన సేవలు చేయగలను?

తన సమస్తము విభునికరణ చేసినది అలమేలుమంగ.

నాగగాంధారి

మేలుకు మేలేకాక మిక్కుటమేలా
కోలుముందై మీద గుట్టు సేయనేలా ॥పల్లవి॥
పచ్చిగా మగువ నీతో బలుకగాను
అచ్చగా నూకొందు గాక అలయనేలా
ముచ్చట నాపె నీకు మొక్కగాను
యిచ్చగించుకొంటగాక యిక సిగ్గులేలా ॥మేలు॥
ననుపున నాకె నీతో నవ్వగాను
చనువు లిచ్చుటగాక జాగులేలా
వినయముతో నిన్ను వేడుకోగాను
యెనయుటగాక మరి యెలయింపులేలా ॥మేలు॥
ప్రియమున నీతో నాపై పెనగగాను
దయతో గూడుటగాక తాలిములేలా
క్రియతో గాగిలించగా శ్రీ వేంకటేశా
నయమే మంచిదిగాక నాలితనములేలా ॥మేలు॥ (107)

భావము: పరాఙ్మఖుడైన పతితో చెలులు హితబోధ చేస్తున్నారు.

శ్రీవేంకటేశా! మీ సఖ్యము మేలుకు మేలేగాక, అధికమేలా? హద్దులు ముందు పెట్టుకొని ఆపైన దాచనేలా? ఆ యింతి నీతో బాహాటంగా పలుకగా నీవు అచ్చంగా ఊకొట్టక విసుగు చెందుతావెందుకు? ముచ్చటపడి ఆమె నీకు మొక్కితే అంగీకరించాలిగాని యింకా సిగ్గుపడనేలా? ప్రియంగా ఆమె నీతో నవ్వితే చనవు చేసి చేరదీయాలిగాని ఆలస్యమెందుకు? ఆమె వినయంగా నిన్ను వేడుకొంటుంటే ఆమెను సంగమించాలిగాని బాధించనేల? ఆమె నీతో ప్రేమతో పెనగులాడగా కలిసుకోవాలిగాని, సహించడమెందుకు? దగ్గరగా వచ్చి ఆమె నిన్ను కౌగిలించగా స్వామీ! నయముగా చూడటం మంచిదిగాని కపటత్వం ఎందుకు?

నాదరామక్రియ

నెలచక్కదనమే నిండుబండారమునీకు
గలిగె గనకలక్ష్మి కాంతుడవైతివి ॥పల్లవి॥
పడతినెమ్మోమునకు బంగారుకళలు దేరీ
వెడలేసెలవినవ్వే వెండిగనులు
అడియాలమగుమోవి న(య?) దె పగడపుదీగె
నిడువాలుదురుమే నీలములరాశి? ॥నెల॥
తరుణిపాదపుగోళ్లు తళుకులవజ్రములు
పరగుజేతిగోళ్లె పద్మరాగాలు
అరిదికన్నులతేట లాణిముత్తెపుసరులు
సరి బచ్చలకొండలు చనుమొనలు ॥నెల॥
చెలితేనెమాటలు జిగి బుష్యరాగాలు
వలపు తెరసిగ్గులు వైడూర్యాలు
తొలకుననురాగాలే దొడ్డగోమేధికములు
కలసి తికెను శ్రీ వేంకటేశ కాగిటను ॥నెల॥ (108)

భావము: సతి శరీరంలోని వివిధ భాగాలను, చెలి నవరత్నాలతో పోలుస్తోంది.

వేంకటేశ! మా చెలి అందమే నీకు నిండైన భాండాగారమైనది. నీవు బంగారు లక్ష్మి భర్తవైనావు. వనిత అందమైన ముఖానికి బంగారు కళలు అబ్బాయి. ఆమె పెదవులపై నవ్వులే వెండిగనులు, బుజువైన పెదవిపై అదిగో పగడపుతీగె. పొడవైన కేశములే నీలాలరాశి. వనిత పాదాల గోళ్లు తళుక్కుమనే వజ్రాలు. చేతిగోరులు పద్మరాగాలు. అరుదైన కంటి చూపులు ఆణిముత్యాల దండలు. చనుదోయి పచ్చలకొండలు. మా చెలి తియ్యని తేనెపలుకులు పుష్యరాగాలు. ప్రేమ నిండిన సిగ్గులు వైఢూర్యాలు, అతిశయించిన ప్రేమలే గోమేధికాలు. నీవు ఈమె కౌగిటిలో చేర్చావు.

వనిత నవరత్నశోభిత వర్ణన ఇది. బంగారు, వెండి, పగడము, నీలాలు, వజ్రాలు, పద్మరాగాలు, ముత్యాలు, పచ్చలు, పుష్యరాగాలు, వైఢూర్యాలు, గోమేధికాలు. అవి నవరత్నాలతో కలిపి వెండి, బంగారులను వనిత శరీర సౌందర్యం వర్ణించబడింది.

నాగవరాళి

వీడుదోడాయ వలపు వెలదికి నీకును
చూడజూడ వేడుకాయ చూచువారికిని ॥పల్లవి॥
సిగ్గుతోడ బాగాలు చెలి నీకు నందియ్యగా
వొగ్గుచు నందుకొంటివి వొయ్యన నీవు
నిగ్గులు దేరేయట్టి నీపుక్కిటితములము
అగ్గలపుమోహమున నాపెకు బెట్టితివి ॥వీడు॥
చన్నులు బటువులుగ సతి నీకు నానించితే
వున్నతి నొరుగుకొంటివి వొద్దికై నీవు
యెన్నిక జేతులు రెండు నీపెమేని కాదారుగ
చెన్ను మీర మెడదండసేసి కాగిలించితి ॥వీడు॥
పడతి నీకు దప్పికి బన్నీ రందియ్యగా
కడగి శ్రీవేంకటేశ కైకొంటివి
తడయక అధరామృతపుపానకము నేడు
యెడనెడ మారుకుమారిచ్చితివి నీవు ॥వీడు॥ (109)

భావము: చెలి వేంకటేశునితో సతీపతుల సరసాన్ని విశదంచేస్తోంది.

శ్రీవేంకటేశ! నీకు, వనితకు ఈడుజోడైనది. చూచేవారికి చూడచూడగా సరదా పుట్టుతోంది. మా చెలి నీకు సిగ్గుపడుతూ తాంబూలం అందివ్వగా ఆనందంగా నీవు స్వీకరించావు. నీ పుక్కిటనుండే తాంబూలము వన్నెలుదేరగా అధికమైన మొహంతో నీవు ఆమె నోట్లో పెట్టావు. తన చనుదోయిని ఆమె నీకు ఆధారంగా ఆనించితే నీవు వొద్దికగా వాటిపై వాలావు. నీ బలిష్ఠమైన చేతులు రెండూ ఆమె శరీరానికి ఆధారముగా అందంగా ఆమె మెడలో దండ వేసి కౌగిలించావు. వనిత నీ శరీరశ్రమ తీరడానికి పన్నీరందివ్వగా నీవు స్వీకరించావు. ఈనాడు నీ పెదవులమీది అమృతపుపానకాన్ని ఆలస్యం చేయకుండా బదులుకు బదులిచ్చినావు.

దేసాళం

చిత్తగించి చూడవయ్య చెలిలాగు
బిత్తరపుజవ్వనము పెచ్చుపెరిగీని ॥పల్లవి॥
చెలివీనులజవ్వాది చెక్కుల గరగి జారీ
వెలి నిన్ను బాసినవిరహానను
మలసినకోరికలు మతిలో దీగెలువారీ
వలపుల చెమటలవానలను ॥చిత్త॥
వేవేగ బెట్టినకొప్పు వెడజారీ మూపుమీద
నీవొద్దికి వచ్చేటినిబ్బరానను
పూవులదండలోనిపుప్పొడి దుమ్ములు రేగీ
కావరపునిట్టూర్పులగాలిచేతను ॥చిత్త॥
మునుకొని మొరసీని ముంజేతికంకణములు
తనివార నిన్ను గూడేతమకమున
యెనసితివి శ్రీ వేంకటేశ యింతలోనె యీకెను
వినయాన నీకు మొక్కీ వేడుకలను ॥చిత్త॥ (110)

భావము: చెలి తమ సఖి విరహాన్ని స్వామికి విన్నవిస్తున్నది.

శ్రీ వేంకటేశ! మా చెలి బాధను కనికరించి చూడవయ్యా! ఆశ్చర్యంగా యౌవనం క్రమక్రమంగా వృద్ధి పొందుతోంది. నీకు దూరంగా వున్న విరహబాధతో మా చెలి చెవులకు పూసిన జవ్వాది చెక్కులమీదికి జారుతోంది. ప్రేమవలన కలిగిన చెమటలు వర్షంలో పెరిగిన కోర్కెలు మనసులో అధికమయ్యాయి. నీ దగ్గరకు చేరే హడావిడిలో త్వరత్వరగా పెట్టిన కొప్పు వీపుమీదికి జారింది. అధికమైన నిట్టూర్పుల గాలితో పూలదండలలోని పుప్పొడి దుమ్ములు అలముకొన్నాయి. తృప్తి దీర నీతో క్రీడించే మోహంతో ముంజేతి కంకణాలు గట్టిగా శబ్దం చేస్తున్నాయి. ఇంతలోను ఈమెను స్వామీ! నీవు సమీపించావు. నీకు వినయంతో వేడుకగా మాచెలి నమస్కరిస్తోంది – కరుణించు!

సింధురామక్రియ

ఎంతలేదు పరాకు నీ కేపొద్దును
వింతొకచూపు మరి వేడొకచ వెందురు ॥పల్లవి॥
వేడుకతోడుత నీకు విన్నపాలు సేయవచ్చె
ఆడరాదా కతము లాపెతోడను
తోడనే సింగారించుక తొంగిచూచీ నల్లదివో
చూడరాదా యాదిక్కు జోడుగా నీవు ॥ఎంత॥
విందుగా బయ్యదలోన వెస నేమో మూసితెచ్చె-
నందుకోరాదా లోన నాపెచేతను
పొందుగా గొలువుసేసీ పూనుకొని యెదుటనె
చెంది వూడిగ మేమైనా జేయించుకొనరాదా ॥ఎంత॥
వినోదాన దా నేర్చిన విద్యలు చూపగడగీ
మనసార జూడరాదా మాటున నుండి
యెనసితివి శ్రీవేంకటేశ యిం (యి) న్నిటా నన్ను
పెనగి యాపెవలపు బెడరేచరాదా ॥ఎంత॥ (111)

భావము: ముభావంగా వుండే వేంకటేశునితో చెలులు విన్నపాలు చేస్తున్నారు.

శ్రీ వేంకటేశ! నీవు అన్ని వేళలా ఎంత విసుగు చూపుతావు. వింతయైన ఒక చూపు ఒకవేడి రుచిగా చెబుతారు. సరదాపడి ఆమె నీకు విన్నవించుకోవాలని వచ్చింది. ఆమెతో వ్యవహారాలు నడపరాదా? వెంటనే అలంకరించుకొని అల్లదిగో నీవైపుతొంగి చూస్తోంది. ఈడు జోడుగా నీవూ అటు వైపు చూడరాదా? ఆమె తన పైటలోపల ప్రయత్న పూర్వకంగా ఏవో మూసి తెచ్చింది. లోపల వాటిని ఆమెచేత అందిపుచ్చుకోరాదా? నీ ఎదుట అదే పనిగా నిలబడి నీ కొలువు చేస్తోంది. ఆమెచేత ఏవైనా సేవలు చేయించుకోరాదా? తాను నేర్చుకున్న విద్యలనన్నిటినీ ఎంతో ఆసక్తితో వినోదంగా చూపుతోంది. నీవు దాగి వుండి మనసు తీరా చూడరాదా? ఇన్నిరకాలుగా నన్ను నీవు కలిశావు. పెనగులాడి మా చెలి ప్రేమను వృద్ధి పొందించరాదా? అని సరసాలాడుతున్నారు.

పాడి

ఎంత యెడ గొల్లకత్తె వేమే నీవు
జంతవై వలపు లిట్టిచవులుగొనేవు ॥పల్లవి॥
కురులు దువ్వేనంటా గుబ్బల నొత్తుకొనేవు
సరులు గట్టేనంటా సారెకు గాగిలించేవు
శిరసం టేనంటాను చెక్కుజెక్కు మోపించేవు
బెరసి విభుని నెంత పిప్పి సేసేవే ॥ఎంత॥
కైదండ యిచ్చేనంటా కాయము సోకించేవు
పాదాలొత్తేనంటా దొడపైకి దీసుకొనేవు
ఆదట జలకమార్చేనంటా నొరసుకొనేవు
గోదిలిమోహాన నెంతగుబ్బతిలేవే ॥ఎంత॥
తములాన కొగ్గేనంటా తగ మోవి దాకించేవు
చెమట దుడిచేనంటా సిగ్గులంటి పెనగేవు
అమర శ్రీ వేంకటేశు డన్నిటాను నన్ను గూడె
భ్రమసి నీవెందాకాను బాతిపడేవే ॥ఎంత॥ (112)

భావము: ప్రౌఢనాయిక చేష్టలను సతి ఎద్దేవా చేస్తోంది.

ఏమే! నీవు ఎంత దూతికవే. గయ్యాళిదానివై ప్రేమ పేరుతో ఈ విధంగా రుచులు మరిగావు. నీ చేష్టలు విచిత్రాలు. తల దువ్వుతానంటూ చనుదోయితో హత్తుకొన్నావు. పూలమాలలు ధరింపజేస్తానని మాటిమాటికి కౌగిలిస్తున్నావు. తలంటుతానంటూ బుగ్గలకు బుగ్గలు ఆనిస్తున్నావు. మొత్తానికి భర్తను ఎంత బాధిస్తున్నావే! చేయి ఆసరాగా ఇస్తానని శరీరం తాకిస్తున్నావు. పాదసేవ చేస్తానంటూ పాదాన్ని నీ తొడపైకి తీసుకుంటున్నావు. ఆపైన స్నానం చేయించే నెపంతో హత్తుకొంటున్నావు. జంకే మోహంతో అందంగా లోలోపల ఎంత ఉడికిపోతున్నావే! తాంబూలం ఇస్తానంటూ అందంగా నీ పెదవి అంటిస్తున్నావే. ఒంటికి పట్టిన చెమట తుడుస్తానని మర్మస్థానం ముట్టి పెనగులాడుతున్నావు. శ్రీ వేంకటేశుడు అన్ని విధాలుగా నాతో క్రీడిస్తున్నాడు. నీవు భ్రమపడి ఎంతదాకా భ్రాంతి పడతావే – అని హెచ్చరిస్తోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here