అన్నమయ్య పద శృంగారం-13

0
16

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

శ్రీరాగం

తానే యెఱుగు బతి తలపించరే
యీనెలత మేలుదాయ నెట్టోర్వ వచ్చునే ॥ పల్లవి॥
కొమ్మతలపోతలేడ కోవిలకూతలేడ
నిమ్మలపుమనసేడ నివ్వెరగేడ
పమ్ముకొన్న సిగ్గులేడ పట్టరానితమి యేడ
ఇమ్ముల నిట్టివలపు లెట్టోర్వవచ్చునే ॥తానే॥
కలయువేడుకలేడ కంతునిబాణములేడ
నెలకొన్న యాసలేడ నిట్టూర్పులేడ
చెలిచక్కదనమేడ చెక్కిటి చేయిచింతలేడ
ఇల నిట్టివలపులు యెట్టోర్వవచ్చునే ॥తానే॥
మంతనాన నుండు టేడ మలయు కోరికలేడ
సంతసపుమాటలేడ జాగులేడ
ఇంతలో శ్రీవేంకటేశు డిట్టె వచ్చి యాకె నేలె
యెంతయినా నీవలపు లెట్టోర్వవచ్చునే ॥తానే॥ (113)

భావము: విరహ బాధతోనున్న చెలి అవస్థను వర్ణిస్తున్నారు సఖులు.

ఏమమ్మా! అన్నీ ఆమెకు తెలుసును. పతిని గుర్తు చేయండి. ఈ భామ సొగసరి అయినది గదా ఎలా ఓర్చుకోగలము? ఈ సతి ఆలోచనలెక్కడ? కోయిల కూతలెక్కడ? నిశ్చింతగా ఉండే మనసెక్కడ? ఆశ్చరపడడమెక్కడ? ఆక్రమించిన సిగ్గులెక్కడ? భరింపరాని మోహమెక్కడ? ఈ విధమైన ఈ ప్రేమలను ఎలా ఓర్చుకోగలము? అతనితో కలిసి మెలిసి తిరిగే వేడుకలెక్కడ? మన్మథుని బాణాలెక్కడ? మనసులో నాటిన అశలెక్కడ? గాఢమైన, నిట్టూర్పు లెక్కడ? ఈ భామ అందమెక్కడ? బుగ్గపై చేయివేసి బాధ పడటమెక్కడ? ఈ భూమిపై ఈ రకమైన ప్రేమలు ఎలా ఓర్చుకోగలమే! ఏకాంతంలో ఉండడం ఎక్కడ? చుట్టుముట్టిన కోరికలెక్కడ? సంతోషపు కబుర్లు ఎక్కడ? ఆలస్యం చేయడం ఎక్కడ? ఇంతలోనే స్వామి వచ్చి ఆమెను పాలించాడు. ఎన్ని చెప్పినా నీ ప్రేమను ఎలా ఓర్చుకోవచ్చునే? సపత్నులైన ప్రియులు చెలి విరహాన్ని గమనిస్తూ ఆశ్చర్యపోతున్నారు.

తెలుగుగా(గాం)బోది

విరహమునకు నీవు వెరవవద్దు
గరిమ నేపొద్దూ నివే కాపులు నీకును ॥పల్లవి॥
చెంగలువబంతి నీవు చేతబట్టుకొనవే
సంగతి నాతనిమేనిచాయల దది
ముంగిటి తామర లురమున నొత్తుకోవే
రంగుగా జెలువుని నేత్రముల బోలు నవి ॥విర॥
కనకపుసొమ్ములెల్లా కాయముపై నించుకోవే
ఘనుని పీతాంబరపుకాంతుల బోలు
పెనచి మాణికములపేరు మెడ వేసుకోవే
కనుగొంటే నాతనికౌస్తుభముజాతివి ॥విర॥
చేవమీర ముంజేతిచిలుకతో మాటాడవే
భావింప నాతడెక్కేపక్షికులము
కోవరపునీచనుగొండ లిట్టె చూపవే
యీవేళ శ్రీ వేంకటేశు డేలె నిన్నును ॥విర॥ (114)

భావము: శ్రీవేంకటేశుని అవయవ సౌందర్యాన్ని కాంతకు వివరిస్తున్నారు చెలులు.

ఓ సఖీ! ఈ విరహబాధకు నీవు భయపడవద్దు. ఎల్లప్పుడు నీ సౌభాగ్యమే నీకు రక్ష. అతనిని వశపరచుకోవే! చేతిలో కలువపూల బంతిని పట్టుకో! కలువపూల ఛాయ వంటిది నీకు దగ్గరలో వున్న అతని శరీరఛాయ. మీ వాకిటి ముందున్న తామరలను నీవు ఎదకు హత్తుకోవే! అవి నీ ప్రియుని కనులవంటివి. బంగారు సొమ్ములన్నీ నీ శరీరం మీద నింపుకో! ఆ మహానుభావుడు ధరించిన పీతాంబరపు కాంతుల వంటివవి. మాణిక్యపు సరాలు మెడలో ధరించవే. ఆలోచించి చూస్తే ఆతని వక్షస్థల కౌస్తుభము జాతికి చెందినవవి. నీ ముంజేతిలోని చిలుకతో పలకరించవే. ఆలోచింపగా అతని వాహనమైన గరుడ పక్షి జాతిదది. బలిసిన నీ చనుకొండలను అతనికి చూపించవే! శ్రీవేంకటేశ్వరుడు ఈ రోజు నిన్ను పాలించాడు.

ఆహిరి

తలపులో కోరికలు దైవారీని
యెలమి గానుక లిచ్చి యీడకు రమ్మనవే ॥పల్లవి॥
చెప్పరే యాతనిరాక చెలులాల
వుప్పతిల్లుగాకలకు నోపనే నేను
కుప్పలు దెప్పలునాయ కోరికలు
ఇప్పుడు కొలువులో దా నేమిసేసీనే ॥తల॥
చూపరే యాతనిమోము సుదతులాల
పైపై నాతమకము పట్టగరాదు
మోపాయ జవ్వనము మొగి నా మేన
యేపున దనకు నన్ను నీడేర్చదగును ॥తల॥
పొందు సేయరే యాతని బొలతులాల
విందువలె దానె శ్రీవేంకటేశుడు
యిందుకే వచ్చి కలసె నిదివో నన్ను
అందమైనయిల్లాల నే నలమేలుమంగను ॥తల॥ (115)

భావము: విరహతప్తయైన అలమేలుమంగ తన బాధను పతికెరిగించమని సఖులను వేడుకొంటోంది.

ఓ భామలారా? నా మనసులో కోర్కెలు అధికమయ్యాయి. అతనికి వివిధములైన కానుకలిచ్చి యిక్కడకు రమ్మని చెప్పరే! ఈ విరహబాధకు నేను ఓర్చుకోలేను. ఆతని రాకను తెలియజేయండి. ఇప్పుడు తన కొలువులో తాను ఏమి చేస్తున్నాడోగదా. కోర్కెలు అధికమయ్యాయి. సఖులారా! అతని ముఖం నాకు చూపమనరే! అధికమైన మోహాన్ని భరించలేకున్నాను. యౌవనము నా శరీరంపై దట్టమైంది. ఆతడు వచ్చి త్వరగా నన్ను రక్షించాలి. వనితలారా! అతనితో జత కలపండి. శ్రీవేంకటేశుడు విందువలె తానే స్వయంగా ఇందుకే వచ్చి నన్ను కలిశాడు. అందాలరాశినైన అలమేలుమంగను నేనే అని తన విరహాన్ని వ్యక్తం చేసింది.

సాళంగనాట

అన్నిటాను నెరజాణ వౌదువే నీవు
మన్నన లందితివే మగనిచే నీవు ॥పల్లవి॥
చొక్కపుజూపుల బతి జూడనేర్తువే
మొక్కుతానే కొనగోరు మోపనేర్తువే
చిక్కనినవ్వులతోడ సిగ్గువడనేర్తువే
చెక్కు నొక్కి ప్రియములు చెప్పనేర్తువే ॥అన్ని॥
చెప్పక వూడిగాలెల్లా జేయనేర్తువే
చెప్పరానిసన్నలు సేయనేర్తువే
చొప్పులుగా చనుగవ సోకించనేర్తువే
దప్పిదేర మోవి చూపి తమిరేచనేర్తువే ॥అన్ని॥
ననుపులు సేసుక పెనగనేరుతువే
యెనసి బాగాలు నీ వియ్యనేర్తువే
అనుగు శ్రీవేంకటేశునలమేలుమంగవు నీవు
తనియగ గూడితివి తలపించనేర్తువే ॥అన్ని॥ (116)

భావము: ప్రౌఢయైన కాంతతో సరసాలాడుతున్నారు చెలులు.

ఓ సఖీ! నీవు అన్ని రంగాలలోను జాణవయినావు. నీ భర్త ఆదరాన్ని పొందగలిగావే. నీ పతిని పారవశ్యపు చూపులతో చూడ నేర్చినదానవే! మొక్కులు మొక్కుతూ కొనగోటితో నొక్కగల దానివే! అందమైన నవ్వులతో సిగ్గులు కురిపించ గలదానవే! బుగ్గ గిల్లి ముద్దుముచ్చటలు చెప్పగల నేర్పరివే. మాట్లాడకుండా సేవలు జేయగల జాణవే. చెప్పరాని సైగలు చేయగల దిట్టవే. వంతులుగా చనుదోయి తాకించగల ధీరవు. దప్పిక తీరేటట్లు నీ పెదవి రుచిచూపి అతని మోహాన్ని రెచ్చగొట్టగల దానివే. ప్రీతి గొలుపుతూ పెనగులాడగలదానివే! దగ్గరగా చేరి తాంబూలమియ్యగల దానివి. శ్రీవేంకటేశుని ప్రియురాలివైన అలమేలు మంగవు నీవు. తృప్తిగా అతనితో క్రీడించి గుర్తుండేలా చేయగల దానివే – అని సరసాలాడారు.

మంగళ కౌశిక

వీడెమిత్తువు రావమ్మా వీడె పానుపుపై నున్నాడు
జోడైనవయసులే సొంపులు వుట్టించీని ॥పల్లవి॥
సొలసి నీవు చూచినచూపులెల్లా బతికిని
కలువపూవుదండలై కమ్ముకొనెను
నెలత నీవు చక్కనినెమ్మోము చూపితేను
వలుదచంద్రబింబమై వలపులు రేచెను ॥వీడె॥
అరిది నాతనితోడ నాడినమెల్లనిమాట
తరితీపుతేనెలై దైలువారెను
సరుగ నీవప్పుడు సన్న సేసిన సన్న
సురతపులతలై చుట్టుకొనెను ॥వీడె॥
యెనసి శ్రీవేంకటేశు యెదుట నవ్విననవ్వు
చెనకి పైజల్లినసేస లాయను
పెనగి చేతులు వట్టి పిలిచినపిలుపులు
తనివోనికంకణదారా లాయను ॥వీడె॥ (117)

భావము: ప్రౌఢయైన నాయిక చేష్టలు పతికి భ్రమలు కలిగించగా ఆమెను రమ్మని చెలులు బ్రతిమాలుతున్నారు.

ఓ సఖీ! నీ పతి పాన్పుపై చేరాడు. నీవు తాంబూల మివ్వడానికి రావమ్మా! ఈడుజోడైన నీ యౌవనమే ప్రేమ పుట్టిస్తోంది. ప్రేమతో నీవు చూచిన వాలు చూపులు నీ పతికి కలువపూలదండలై విరిశాయి. ఓ వనితా! నీవు నీ చక్కని ముఖబింబాన్ని చూపితే అది విస్తారమైన చంద్రబింబమై ప్రేమలు రేకెత్తిస్తోంది. అప్పుడప్పుడు అతనితో నీవు మాట్లాడిన మెత్తని మాటలు వలపు తేనెలై పొంగిపొరలాయి. ఎన్నడో నీవు చేసిన సైగలు రతిక్రీడాలతలై అతనిని చుట్టుకొన్నాయి. శ్రీవేంకటేశుని ముందు నీవు నవ్విన అందాల నవ్వు తలపైన చల్లిన సేసబాలు అయినాయి. పెనగులాడుతూ నీవాతని చేతులు పట్టుకొని పిలిచిన మాటలు తృప్తి చెందని చేతికంకణాల దారాలైనాయి అని స్వామిపక్షాన పలుకుతోంది – ఓ చెలి.

వరాళి

వినోదించవయ్యా ఇందు వేడుకసేసీ నీకు
ఘనసింగారవనము కామిని పెంచెనయ్యా ॥పల్లవి॥
తెగరానియాసలు తీగెలువారగాను
జిగిమించి చింతలు చిగిరించగా
నిగిడి నివ్వెరగులు నీడలు గప్పగాను
తగుసింగారవనము తరుణి వెంచెనయ్యా ॥వినో॥
చిత్తమే జొంపాలుగట్టి చీకట్లుగొనగాను
హత్తి కోరికవిరులు గుత్తులై మించె
బొత్తుగా బెంజెమటల పూవుదేనెలు గురియ
కొత్తసింగారవనము కోమలి వెంచెనయ్యా ॥వినో॥
నెయ్యముతో జనుల నిమ్మపండ్లు వండగాను
పయ్యదవెలుగు చుట్టిబయలు గాగా
ఇయ్యెడ శ్రీవేంకటేశ యీకె నేలితివి
వొయ్యనె సింగారవన మువిద వెంచెనయ్యా ॥వినో॥ (118)

భావము: అలమేలుమంగా శ్రీ వేంకటేశుల శృంగారాన్ని ఒక వనంగా వర్ణిస్తూ వివిధ అంశాలను పోలుస్తున్నారు – చెలులు.

ఓ వెంకటేశ! ఇక్కడ వేడుకలు చేసికొని నీవు వినోదించవయ్యా. ఈ భామ శృంగార వనమని భావించవయ్యా! ఆ వనంలో అంతులేని ఆశలే తీగెలుగా సాగాయి. అందంగా అలోచనలు చిగిరించాయి. ఆశ్చర్యాలు పెరిగి నీడలైనాయి. మనసు పొదరిళ్లుగా మారి చీకట్లు కమ్ముకున్నాయి. గాఢమైన కోరికలు పూలగుత్తులై ప్రకాశించాయి. అధికమైన చెమటలు పూలతేనెలు కురిపించాయి. ఈ విధంగా ఒక కొత్త శృంగారవనాన్ని ఆ భామ పెంచిందయ్యా! స్నేహంతో చనుదోయి నిమ్మపండ్లుగా పండి పైట వెలుగు చుట్టి బయటపడ్డాయి. ఇక్కడ ఓ స్వామీ! నీవు ఆమెను ఏలుకొన్నావు. ఆ విధంగా భామ శృంగారవనాన్ని పెంచిందయ్యా! అని సరసమాడింది.

పాడి

నన్నెంత వొగడేవయ్యా నాగుణాలు మంచివంటా
చిన్నదాన నే నీవుసేసినమానిసిని ॥పల్లవి॥
తనకుబాతియైనతరుణులెల్లా నింపులే
మనసెనసినవారిమాట లింపులే
ననుపుగలుగుచోటి నవ్వులెల్లా నింపులే
పెనగి పైకొనేవారిప్రియములు నింపులే ॥నన్నెం॥
సేవలు సేసేవారిసేతలెల్లా నింపులే
కైవసమైనవారిగతు లింపులే
వావిగలసినవారివాడికలెల్లా నింపులే
నీవద్ద బాయనివారినిండుసిగ్గు లింపులే ॥నన్నెం॥
సరసములాడేవారిసంగాతాలెల్ల నింపులే
సురత వేళల మేనిసోకు లింపులే
ఇరవై శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలివితి
మరిగినయడాటాన మంతనము లింపులే ॥నన్నెం॥ (119)

భావము: తన గుణగణాలను పొగడుతున్న స్వామికి వినయంగా భామిని వివరిస్తోంది.

శ్రీ వేంకటేశ! నా గుణగణాలు మంచివని నన్ను ఎంతగా పొగుడుతున్నావయ్యా! నేను ఎంతో చిన్నదానిని. నీవు తయారు చేసిన మనిషిని నేను. నీకిష్టమైన కాంతలందరూ ఇంపులే. నీ మనసు తెలుసుకున్న వారి మాటలన్నీ ఇంపులే. ప్రేమగలిగిన చోట నవ్వులన్నీ ఇష్టమే. పెనగులాడి నీతో క్రీడించేవారి చేష్టలు ఇంపులే. నీకు సేవలు చేసేవారి చేష్టలన్నీ ఇష్టమే. నీకు వశమైన వారి నడవడికలు ఇంపులే. అతనిని క్రీడించినవారి అలవాట్లు ఇష్టమే. ఎల్లప్పుడూ నిన్ను ఎడబాయని వారి నిండుసిగ్గులు ప్రీతికరమే. సరసాలాడే వారి స్నేహమంతా ఆనందమే. రతిసమయంలో శరీరస్పర్శలు ఇష్టమే. మరిగిన ప్రదేశంలో ఏకాంతాలన్నీ ఇంపులే. స్వామీ! ప్రియంగా నన్ను నీవు ఇన్ని విధాలుగా ఏలుకొన్నావు అని నాయిక విన్నివిస్తోంది.

దేవగాంధారి

చూడరే వోచెలులాల సుదతిసింగారము
వేడుకతోడ దోడ విలాసము మించెను ॥పల్లవి॥
అలరిననెమ్మోము అద్దమయినకతన
మెలుపున గళల నేమించులు మించె
లలి దురుమెల్లా నీలపురాలై నకతన
కలికిచూపుల నిండుగాంతు లిట్టె మించెను ॥చూడ॥
పగటున మోవి బింబఫలమైయున్న కతన
పొగడొందుమాటలతీపులు మించెను
తగునాభి సరసియై తనరినకతమున
నిగిడి మొక్కులకరనీరజములు మించె ॥చూడ॥
నెట్టన మేను లతై నెగడినకతమున
కిట్టి శ్రీ వేంకటేశుకాగిట బాకెను
అట్టె చన్నులు నిమ్మపండ్లయి వుండినకతన
పట్ట నితనిచేతుల బాదుకొని మించెను ॥చూడ॥ (120)

భావము: తమ సఖి అందాన్ని చూసి ముచ్చటపడుతూ ఒకరికొకరు మాట్లాడుకొంటున్నారు.

ఓ చెలులారా! ఆ యింతి శృంగారాన్ని చూడవే! వేడుకతో అందం వెంట వెంటనే మించిపోతోంది. తన అందమైన ముఖమే అద్దమైనందున కాంతులు సమృద్ధిగా మెరిశాయి. తలపై కేశాలు నీలపురాళ్లయినందున ఆ భామ చూపులలో అధికమైన ప్రకాశం మించిపోయింది. పారవశ్యంతో పెదవి దొండపండై యున్నందున ప్రియమైన పలుకులు తియ్యందనాలైనాయి. తన నాభి కొలను అయి ప్రకాశించడం వల్ల నమస్కారాలనే హస్త పద్మాలు మించాయి. శరీరం తీగ అయినందున అది శ్రీవేంకటేశ్వరుని కౌగిలిలోకి పాకింది. అదేవిధంగా చనుదోయి నిమ్మపండ్లయినందున ఇతడు చేతులతో పొదుగుకొని పట్టగా ప్రకాశించాయి.

నారాయణి

ఆడనుండే చూచి వెరగందితి నేను
యీ నన్ను గాగిలించే వేటిదో యెఱగను ॥పల్లవి॥
సొలపుజూపుల జూచి సుద్దులు నీతో జెప్పి
వలపులు చల్లె(ల్లీ?)నాపై వాడికగాను
కలువల వేసి కందువకు రమ్మని
పిలిచితి వెటువంటిప్రియమో నీకును ॥ఆడ॥
చనుగవపై పయ్యద చక్కబెట్టుకొంటాను
వినయాన మొక్కీ నాపె వేడుకగాను
ననిచి కైదండవట్టి నగరిలోనికి దీసి
పెనగితి వాపె యెంతప్రియమో నీకును ॥ఆడ॥
చేరి జాఱుగొప్పు చేత జెక్కుకొంటా మోముచూపి
సారె సన్న సేసీ నాకె సమ్మతిగాను
గారవించి నన్నేలితివి గక్కన శ్రీ వేంకటేశ
బీరాన నాపై నెంతప్రియమో నీకును ॥ఆడ॥ (121)

భావము: దక్షిణనాయకుడైన ప్రియునితో పరకాంత వ్యామోహాన్ని వివరిస్తోంది..

శ్రీ వేంకటేశ! దూరంగా నిలిచి నేను ఆమె లక్షణాలన్నీ చూచాను. మరి ఇక్కడ నీవు నన్ను కౌగిలించుకోవడం ఎటువంటిదో తెలియదు. ఆమె అలవాటు ప్రకారం నీపై వలపులు చల్లుతూ క్రీగంటి చూపులు చూస్తూ ముద్దు ముచ్చట్లు నీతో చెబుతోంది. ఆమెపై కలువ పూలు విసిరి ఏకాంతానికి రమ్మని పిలిచావు. నీకు ఆమెపై ఎటువంటి ప్రియమో తెలియదు. చనుదోయిపై పయ్యెద సరిచేసుకొంటూ వినయంతో ఆమె సరదాగా నీకు మొక్కింది. ప్రీతితో ఆమెచేతిని పట్టుకొని అంతఃపురంలోనికి తీసుకొని వెళ్లి ఆమెతో పెనగులాడావు. ఆమె నీకెంత ప్రియురాలో! నీ దగ్గరగా చేరి తలకొప్పు చేతితో సరిచేసుకుంటూ నీ ముఖాన్ని చూచి మాటిమాటికీ తన అంగీకారాన్ని నీకు సైగచేస్తోంది. ఓ స్వామీ! నీవు నన్ను గౌరవంతో పాలించావు. శౌర్యంతో ఆమె నీకెంత ప్రియురాలో గదా!

పాడి

వేగిరించకురే మీరు వెలదులాల
పోగైనమంచిగుణాలబుద్దులవా డతఁడు ॥పల్లవి॥
వలపించనేర్చునట వద్దికి రానేరడా
తలపెందున్నదోకాక తనకు నేడు
యెలయించ గలడట యెనయగలేడా
కలిగినతనబత్తి కందము గాక ॥వేగి॥
కోరితెచ్చుకొన్నవాడు కూడుకొననేరడా
వూరకే పనిగలిగి వున్నాడో కాక
వేరులేనిచుట్టరికమటే వీడెమంప మరచీనా
తారుకాణలై మనకు దానే వచ్చీగాక ॥వేగి॥
మంచముపై కిట్టె వచ్చి మాటలాడు నేరడా
యెంచుక నన్నెంతగా మన్నించీనోకాక
అంచెల శ్రీ వేంకటేశు డన్నిటాను నన్ను గూడె
నించినయీపొందు లిట్టె నెరవేరీ గాక ॥వేగి॥ (122)

భావము: తన పతియోగ్యుడని అలమేలుమంగ చెలులతో వాదిస్తోంది.

ఓ కాంతలారా! మీరు నన్ను తొందర పెట్టకండి. అతడు సద్గుణాల బుద్ధులు పోగైనవాడు. తనను వలపించుకొనే నేర్పుగలవాడు గదా. అతని మనసు ఈ రోజు ఎక్కడున్నదోగాక దగ్గరకు రానేరడా? నా భక్తికి అందంగాక ఏదైనా పనిమీద ఉన్నాడేమో గాక, తానే కోరి నన్ను తెచ్చుకున్నవాడు నన్ను సంగమింపలేడా! మనకు తార్కాణం చూపడానికి తనకు తానే వచ్చాడు గాక విడదీయరాని చుట్టరికం మా యిద్దరిది గదా, తాంబూలం పంపడం మరిచిపోయాడా? అభిమానించి నన్ను ఎంతగా ఆదరించెనోగాక పడకమీద చేరి మాట్లాడలేడా? మా కలయికలు ఇదే రకంగా నెరవేరుతున్నాయిగాక శ్రీ వేంకటేశుడు వంతుల వారీగా అన్ని విధాలుగా కలిశాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here