అన్నమయ్య పద శృంగారం-14

0
12

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

బౌళి

ఎట్టు నేసినా నీచిత్త మెదురాడేదానఁ గాను
పట్టి నీపాదాలసేవే పదివేలు నాకు ॥పల్లవి॥
ఆసపడి మోహించిన అతివను నే నీతో
వాసులు వంతులు నెంచవచ్చునా మరి
పోసరించి జవ్వనమే పోగై వున్న దానను
వేసరఁ జెల్లునా నిన్నే వేఁడుకొనేఁగాక ॥ఎట్టు॥
యెప్పుడు వత్తువోయని యెదురుచూచే నేను
తప్పులుఁ దారులుఁ బట్ట దగవా నిన్ను
వుప్పతిల్లి సేసపాలు వొడిఁగట్టుకుందానను
నెప్పున నే నలిగేనా నీతో నవ్వేఁగాక ॥ఎట్టు॥
నెమ్మది నీ కాఁగిలి నీకే మీఁదెత్తుకుండి
యెమ్మెలు నేతులుఁ జూపనేలా ఇఁక
నమ్మించి శ్రీ వేంకటేశ నన్నిట్టె యేలుకొంటివి
కమ్మటి నే మరిచేనా కడుమెచ్చేఁ గాక ॥ఎట్టు॥ (123)

భావము: దక్షిణనాయకునితో ముద్దరాలు తన చిత్తాన్ని వ్యక్తపరుస్తోంది.

శ్రీ వేంకటేశ! నీవు ఏవిధంగా చేసినా నీ మనసుకు ఎదురు మాట్లాడే దానిని కాను. నీ పాదాలు పట్టుకొని సేవించడమే నాకు పదివేలు. నీపై ఆశలు పెంచుకొని మోహించిన వనితను నేను. నీతో వన్నెవాసులు మరి లెక్కించగలనా? మదించిన యౌవనమే, ఒక్కచోట పోగైయున్న దానిని. నిన్ను పలుమార్లు వేడుకుంటానేగాక నీపై విసుగుపడటం నాకు చెల్లుతుందా? నీవు నావద్దకు ఎప్పుడెప్పుడు వస్తావోనని యెదురు చూచే నేను నీవు తప్పుదారులు పట్టావని మాట్లాడటం భావ్యమా! సంతోషంతో నీవు చల్లిన సేసబాలు వొడిలో కట్టుకొన్న దానినే. నీతో నవ్వాను గాని, కోపంతో అలిగానా? ఇంకా నీ విలాసాలు, నయగారాలు చూపడమెందుకు? నా మనస్సులో నీ కౌగిలిని నీకే మీదు గట్టాను. నిన్ను మెచ్చుకోవడమేగాని, తియ్యగా నన్ను నమ్మించి ఏలుకొన్న విశేషాలు నేను మరువగలనా? అని బాధ పడింది.

గౌళ

ఓయమ్మ తానెంత వొడఁబరచీనే నన్ను
చేయి మీఁదాయఁ దనకుఁ జేతిలోనిదాననే ॥పల్లవి॥
చెంతనుండి వూడిగము సేసేయిల్లాలఁగాక
పంతమాడేయిల్లాలనా పతితోను
వింతలేక తనమాట విననేరుతుఁ గాక
యెంతైనా తనకు నేనెదురాడనేర్తునా ॥ఓయ॥
సిగ్గుతోడఁ బాదాలొత్తి చిమ్మి రేఁగేదానఁగాక
యెగ్గుపట్టేదాననా యెంతైనాను
వొగ్గి తనచేఁతలెల్లా వొడిఁగట్టుఁకొందుఁగాక
వెగ్గళించి యేమైనా వేసారుకొందునా ॥ఓయ॥
ఇచ్చకమై నెర పేటిదిది నాగుణము గాక
నచ్చుకొట్టి కొసరేది నాగుణమా
అచ్చపు శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁగూడె
కొచ్చి తనగుణాలు నేఁ గొనాడ నావసమా ॥ఓయ॥ (124)

భావము: ముద్దరాలైన సతి తన బేలతనాన్ని చెలికి వివరిస్తోంది.

ఓయమ్మా! ఆతడు నన్నెంత అంగీకరింపజేస్తున్నాడే! అతనిది పైచేయి అయినది. నేను తనకు లోబడినదానినే గదా! నేను పతిదగ్గర వుండి సేవలు చేసే భార్యనే గాక తగవు పెట్టుకొనే ఇల్లాలినా చెప్పు. ఆశ్చర్యపోకుండా తన మాటను చెవియొగ్గి విన నేర్చిన దాననేగాక, ఎంత చెప్పినా ఆయనకు ఎదురు మాట్లాడగలదాననా? సిగ్గుపడుతూ పాదసేవ చేసే దానినేగాని, చెలరేగేదానినా? ఎంతైనా తప్పొప్పులు పట్టుకొనే దానినా? ఆతని చేష్టలనన్నిటినీ తలయొగ్గి అంగీకరించి నా వొడిలో భద్రంగా దాచుకోనే దానినేగాక, అతిశయించి ఏమైనా విసుగుపడేదానినా? ప్రీతితో జీవించడం అనేది నా స్వభావమే గాక, నేర్పుతో (విభజించి) కొసరడం నా గుణమా? శ్రీ వేంకటేశుడు ఇంతలోనే నన్ను కలిశాడు. గుచ్చిగుచ్చి తన గుణాలను కొనియాడడం నాకు వశమా? అని ప్రాధేయపడుతోంది.

పాడి

చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా
ముప్పిరిఁ జేత మొక్కవే మోసపోతిననక ॥పల్లవి॥
మనసార నాతనితో మాటలెల్లా నాడవే
చెనకవే ఇప్పుడేల సిగ్గువడేవు
పెనఁగవే చేయిపట్టి పిలువవే యింటికి
వెనక మరిచివచ్చి విచారము సేయక ॥చెప్పి॥
తలయెత్తి చూడవే తనియ నాతనిదిక్కు
నిలువవే ముందటను నీకేల కొంక
వెలయఁగ నవ్వవే విడెము చేతి కివ్వవే
మలసి యింకొకమారు మరచితిననక ॥చెప్పి॥
పానుపుపైఁ గూచుండవే పాదాలొత్తఁగదవే
మౌనముతో నిఁకఁ దెఱమఱఁ గేఁటికి
పూని శ్రీ వేంకటేశుఁడు పొందుసేసి నిన్నుఁ గూడె
కానుకమోవి చేకోవే కడమాయననక ॥చెప్పి॥ (125)

భావము: అభిమానవతియైన కాంత పతి ఆగడాలకు కోపించింది. ఆమెను చెలులు సమ్మతింపజేస్తున్నారు.

ఓ సఖీ! నీ చెలులమైన మేము నీకు ఇప్పుడే తగిన బుద్ధులు చెప్పాముగదా! ఆతని వల్ల మోసపోయానని బాధపడక పెనగొని మొక్కవే! మనసు తీరా అతనితో మాట్లాడవే, ఇప్పుడేల సిగ్గు నటిస్తావు – గుచ్చవే. గతంలో జరిగినవన్నీ మరిచిపోయి వచ్చి దిగులుపడక తృప్తిగా ఆతని దిక్కు తలయెత్తి చూడవమ్మా! నీవు భయపడనేల? మరచిపోయాననక, మరొకమారు విజృంభించి అతని ముందు నిలుచో! అందంగా నవ్వి తాంబూలం చేతికందివ్వవే! ఇంకా మౌనమెందుకు? చాటుమాటు తెర మరగులెందుకు? పానుపు మీదికెక్కి కూచొని పాదాలొత్తవే! అతడు నీకు దూరమయ్యాడని అనకుండా అతని పెదవిని కానుక స్వీకరించవే! నీ పొందు కలిపి శ్రీవేంకటేశుడు నిన్ను కలిశాడు గదా!

శుద్ధదేశి

కానవచ్చె నాపై నీపైఁగల మోహమెల్లాను
ఆనుకొన్న వవి యెట్టియడియాసలో ॥పల్లవి॥
చిత్తగించి చూడవయ్య చిరునవ్వు నవ్వి నాపె
యిత్తల నీయాపై సం(సం?)ది నెంత వనికో
కొత్తకొత్తచెమటలు గోర నీ పైఁ జిమ్మీని
తత్తరాన నది యెట్టితడఁబాటులో ॥కాన॥
వేడుకతో వినవయ్య విన్నవించఁ బూనీ నాపె
వోడక నీకాపై కెంత వొడఁబాటులో
వాడికసన్నలవే వలపులు నీపైఁ జల్లీ
యీడుజోడయినసుద్దు లెటువంటివో ॥కాన॥
అఁ(అం?)ది కాఁగిలించుకొనవయ్య నీకు మొక్కీ నాపె
విందుల నీకాపె కెట్టివేడుకలో
యిందునె శ్రీ వేంకటేశ యేలితి వీకె నింతలో
సందడిసేఁత లేరీతి సరసములో ॥కాన॥ (126)

భావము: శ్రీవేంకటేశునికి సతిపై గల ప్రేమను సఖులు విడమరచి చెబుతున్నారు.

శ్రీవేంకటేశ! మీరిద్దరు అంగీకరించి (వొట్టు పెట్టుకున్న) అత్యాశలు ఎంతటివోగాని ఆ తర్వాత నీపై గల మోహమంతా కనిపించింది. ఇక్కడ నీకు, ఆమెకు మధ్య సందున ఎంత పనియోగాని ఆమె చిరునవ్వులు చిందిస్తోంది. దయతో చూడవయ్యా! తొందరపాటులో ఎంత తడబడుతున్నదోగాని అప్పుడే కొత్తగా పుట్టిన చెమటలను కొనగోటితో నీపై చిమ్ముతోంది. మీ యిద్దరికీ మధ్య ఎంత వొడంబడికలోగాని నీవు ఆమె చెప్పే విన్నపాలు సరదాగా వినవయ్యా! మీ యిద్దరికీ ఈడుజోడైన ముచ్చటలెటువంటివో అలవాటుపడిన సైగలతో వలపులు నీపై కుమ్మరిస్తోంది. నీకు, ఆమెకు విందులలో ఎట్టి సరదాలలోగాని, ఆమెను దగ్గర చేర్చుకొని కౌగిలించుకోవయ్యా! నీకు మొక్కుతోంది. తత్తరపాటు పనులు ఏవిధంగా సరసాలోగాని ఓ స్వామి! ఇంతలోనే నీవామెను ఏలుకొన్నావు.

రేకు 822

కాఁ(కాం)బోది

ఊరకే వుండేనంటే వుమ్మగిలీ వలపులు
యేరీతి మన్నించేవో ఇంక నీచిత్తము ॥పల్లవి॥
తలెత్తి చూడకుండితే తనివియుఁ దీరదు
సొలసితేఁగాని వాసులు మించవు
తెలియమాటాడకుండితే నొక్కమనసు గాదు
చెలఁగి విన్నపాలెల్లాఁ జేసితి నీచిత్తము ॥ఊర॥
సరసమాడితేఁగానీ చవులెల్లా రేఁగవు
సొరిదిఁ గూచుండక సొంపులు వుట్టదు
తెరలోనికిఁ దియ్యక తీర దెంతైనా సిగ్గు
సరవి నివెల్లా జాడలు నీచిత్తము ॥ఊర॥
తనువులు సోఁకక తనివో దెంతైనాను
ననుపునఁ బెనఁగక నాఁటదు ప్రేమ
యెనసితివి శ్రీవేంకటేశ ఇంతలో నన్ను
కనుఁగొంటి నీమేలు గట్టిగా నీచిత్తము ॥ఊర॥ (127)

భావము: తన పట్ల ఉదాసీనంగా వున్న పతికి తన విరహాన్ని సఖి వ్యక్తం చేస్తోంది.

శ్రీవేంకటేశ! నీవు ఊరకున్నావంటే ప్రేమలు ఉక్కబెడుతున్నాయి. ఆపైన ఏవిధంగా నన్ను మన్నిస్తావో నీ యిష్టము. నీవు తలఎత్తి నా వైపు చూడకపోతే నాకు తృప్తి తీరదు. సొమ్మసిల్లితేగాని పరిమితులు మించవు. నీ మనసు తెలియకుండా నీవు మాట్లాడితే నిన్ను తాకడానికి మనసు రాదు. ఈ విధంగా అనేక రకాల విన్నపాలు చేశాను. ఆపైన నీ చిత్తము. సరససల్లాపాలు ఆడితేగాని రుచులు విజృంభించవు. అందంగా మనమిద్దరం కూచొంటేగాని పాలుపోదు. తెరచాటుకు చేరిస్తే తప్ప సిగ్గు తొలగిపోదు. వరుసగా ఇవి అన్నీ దాని జాడలు. ఆపై నీ చిత్తము. రెండు శరీరాలు కలిస్తే తప్ప తృప్తి తీరదు. ప్రీతితో పెనగులాడకపోతే ప్రేమ నాటుకోదు. ఇంతలోనే నన్ను నీవు కదిశావు. నీవుచేసిన మేలు గట్టిగా గమనించాను. అంతా నీ చిత్తము – అంటోంది సతి.

ఆహిరి

నీ దిక్కే చూచి వాఁడే నీ మగఁడు
సాదించీ, మీ మోహములు సందడించీఁజుమ్మీ ॥పల్లవి॥
చక్కనినీవదనము సారెనేల వంచేవే
చిక్కనినీనగవులు చిందీఁజుమ్మీ
చెక్కిటిమీఁద నటు చేయి యేల పెట్టేవే
అక్కజపుమోముకళ లంటుకొనిఁజుమ్మీ ॥నీది॥
సన్నలనే నీబొమ్మలజంకెన లేల చూపేవే
మిన్నక వజ్రాలబొట్టు మెరచీఁజుమ్మీ
చన్నులమీఁదిపయ్యద చక్క బిగించుకొనే
మున్నే జక్కవపిల్లలు మూఁతులెత్తీఁ జుమ్మీ ॥నీది॥
సిగ్గుతో నేల ముంజేతిచిలుకతో మాటాడేవే
వొగ్గి తరితీపులెల్ల నూరీఁజుమ్మీ
అగ్గమై శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
తగ్గక యీసింగారము దైవారీఁజుమ్మీ ॥నీది॥ (128)

భావము: యౌవన ప్రారంభదశలోనున్న కాంత శారీరక సౌందర్యాన్ని చెలి వర్ణిస్తోంది.

ఏమమ్మా! నీభర్త నీవైపే చూస్తున్నాడు. మీ యిద్దరి మధ్య సాధించబడిన ప్రేమలు అధికమైనాయి సుమా! అందమైన నీ నవ్వులు వికసించగా నీవు మాటిమాటికీ తలవంచనేల? అధికమైన ముఖం మీద కళలు అతిశయించాయిగదా నీవు బుగ్గమీద (దిగాలుగా) చేయిపెట్టనేల? అందంగా వున్న నీ వజ్రాల బొట్టు మెరుస్తుండగా సైగలనే నీ కనుబొమలతో బెదిరింపులు ఏల చేస్తావు? నీకు యౌవనం పొటమరించి చన్నుల మీద పయ్యెద బిగించుకోవడానికి ముందే పిల్ల జక్కవ పక్షులు తలలెత్తి చూస్తున్నాయి సుమా! (చనులు వృద్ధిపొందాయి) నీ మనసులో ప్రేమలు ఊరుతుండగా సిగ్గుతో నీవు నీముంజేతిలో వున్న చిలుకతో మాట్లాడటమెందుకు? ఇంతలోనే శ్రీ వేంకటేశుడు నిన్ను కలియగా నీ శృంగారమంతా పొంగిపొరలుతోంది సుమా!

బౌళి

కానీవయ్యా చుట్టాలమై కలిగితి మిదే నీ
వీనులకు చవులు నీవేడుకలే కావా ॥పల్లవి॥
తగవులు చెప్పేవు తరుణికి నాకును
మగఁడవు నీవేకావా మాకిద్దరికి
వెగటుదీర సరిగా విడెములు వెట్టేవు
జిగిమించ నిన్నియు నీచేఁతలే కావా ॥కానీ॥
వొడివట్టి మొక్కించేవు వొకరొకరిని మాలో
నడుమ నీవేకావా నాయఁగాడవు
తొడిఁబడ నీవిట్టె పొత్తులఁ గూచుండుమనేవు
జడిగొన్న నీగుణాలసహజమే కాదా ॥కానీ॥
వొగ్గి కాఁగిటిలో మమ్ము నొద్దికతోఁ గూడేవు
సిగ్గులు నీవే కావా శ్రీ వేంకటేశా
తగ్గులేకుండా మమ్ము దయతో మన్నించితివి
వెగ్గళమై నీకుఁగలవిద్య లివే కావా ॥కానీ॥ (129)

భావము: ఇద్దరు పత్నులను మురిపిస్తున్న విభునితో ఒక వనిత ఎకసెక్కము లాడుతోంది. (శ్రీదేవి, భూదేవీ విభుడు)

శ్రీ వేంకటేశ! మేము నీతో బంధుత్వం కలవారము. నీ యిష్టం వచ్చినట్లు కానీవయ్యా! నీ వేడుకలే నీ చెవులకు రుచికరాలు కావా? ఆమెకు, నాకు న్యాయం చెబుతున్నావు మాకిద్దరికీ నీవే కదా భర్తవు. మా యిద్దరికీ తృప్తిగా తాంబూలాలు అందిస్తున్నావు. ఇవి అన్నీ నీ చేష్టలే గదా! మా వొడి పట్టుకొని ఒకరినొకరు మొక్కేలా చేశావు. మాయిద్దరి మధ్య నాయకుడవు నీవే గదా! తొట్రుపాటుపడుతున్న మమ్ము నీ దగ్గరగా కూచోమని చెప్పావు. వృద్ధి చెందిన నీ గుణాలకు అది సహజమే కదా. అందంగా కౌగిలిలో మమ్మల్నిద్దర్నీ ప్రేమగా బంధించావు. ఈ సిగ్గులన్నీ నీవే గదా! హెచ్చుతగ్గులు చూపకుండా మా యిద్దరినీ దయతో ఆదరించావు. నీకున్న అతిశయించిన విద్యలివేగదా! అని నిలదీసింది ఒక భామ.

సామవరాళి

చెప్పవయ్య వినేఁగాని చెవులపండుగగాను
యిప్పుడే మొక్కులు మొక్కీ నెంతచుట్టరికమో ॥పల్లవి॥
కొమ్మ గేదఁగిరేకులు కొప్పునఁ జెరుగుకొని
యెమ్మెలు పచరించీ నీయెదుట నదె
నెమ్మది వద్దఁగూచుండి నీతో మాటలాడీని
యిమ్ముల మీకిద్దరికి నెంతచుట్టరికమో ॥చెప్ప॥
సింగారించుకొని వచ్చి చిరునవ్వు నవ్వుకొంటా
కొంగు నిన్ను దాఁకించి కొసరీనదె
సంగతిగా నప్పటిని సారె విడెమిచ్చుకొంటా-
నెంగిలిపొత్తు గలసీ నెంత చుట్టరికమో ॥చెప్ప॥
ఆదిగొని కంకణాలు అద్దె గల్లు గల్లనఁగా
పాదాలు గుద్దీ నీకు పాన్పుపై నిదె
పోదితో శ్రీ వేంకటేశ పొంచి నన్నుఁ గూడితివి
యీదెసఁ దనకు నీకు నెంతచుట్టరికమో ॥చెప్ప॥ (130)

భావము: కాంతుడు తన ప్రియురాలితో ముచ్చటించుకోవడాన్ని చెలులు పరాచికాలాడుతున్నారు.

శ్రీ వేంకటేశ! చెవులకు ఇంపుగా వింటుంది చెప్పవయ్యా. ఇప్పుడే ఎన్నో మొక్కులు మొక్కుకొంది. మీకిద్దరికీ ఎంతటి చుట్టరికమో గదా. విలాసాలు పోతూ నీకెదురుపడి భామ మొగలిరేకులు జడలో తురుముకొని వచ్చింది. నెమ్మదిగా వచ్చి నీ దగ్గరగా కూచొని నీతో మాట్లాడుతోంది. మీకిద్దరికీ ఈ విధంగా ఎంతటి బంధుత్వమో గదా! అందంగా అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ తన పైటకొంగు నీకు తాకించి కొసరి కొసరి అడుగుతోంది. స్నేహంగా అప్పటికప్పుడు మాటిమాటికి తాంబూలం అందిస్తూ తన ఎంగిలి పొందిక కలిపింది. మరి ఎంత చుట్టరికమో, తాంబూలం అందుకొని చేతి కంకణాలు ఘల్లుఘల్లుమనగా తన పాదాలు నీకు తగిలించి పాన్పుపైకెక్కింది. ఈ విధంగా ఆమెకు, నీకు ఎంతటి చుట్టరికమో గదా! స్వామీ! కాచుకొని వైభవంగా నన్ను కలిశావు – అని సపత్నిపై మచ్చరం వెలిబుచ్చింది.

హిజ్జిజి

ఏల మూసి దాఁచేవు యిదేమయ్యా
ఆలుగాదా నీకు నాపె అదేమయ్యా ॥పల్లవి॥
బత్తితోడ నిన్నుఁజూచి పడఁతి మాటలాడఁగా
యిత్తల సిగ్గువడేవు యిదేమయ్యా
బొత్తుగాఁ బువ్వులచెండు పూఁచి కానుకియ్యఁగాను
హత్తిచేత నందుకొన వదేమయ్యా ॥ఏల॥
ముందరనే నిలుచుండి మోహ మాపె చల్లఁగాను
ఇందుకు రమ్మనరాదా ఇదేమయ్యా
విందువలెఁ జెవిలోన విన్నపాలు సేయఁగాను
అందుకు నేమీనన వదేమయ్యా ॥ఏల॥
నెఱతనమున వచ్చి నీపాదము దొక్కఁగాని
యెఱఁగనట్టే వున్నాఁడ విదేమయ్యా
మఱి నన్నుఁ గూడితివి మరిగి శ్రీవేంకటేశ
అఱమఱచే వాసెను అదేమయ్యా ॥ఏల॥ (131)

భావము: ముభావంగా వున్న నాయకునితో తమ చెలి విన్నపాలు సఖులు తెలియజేశారు.

శ్రీ వేంకటేశ! ఇదేమయ్యా! ఈ గోప్యత ఎందులకు ఆమె నీ భార్యకాదా? ఇదేమయ్యా! ప్రేమతో నిన్ను చూచి మా చెలి మాట్లాడగా ఇవతల నీవు సిగ్గుపడుతున్నావు. ఇది భావ్యమా! నిండైన పూచిన తన ఎదను (పూలచెండ్లవంటి వాటిని) నీకు కానుకగా ఆమె ఇవ్వగా ఎదకు హత్తుకొని చేయి పుచ్చుకోరాదా? నీ ముందట నిలబడి ఆమె తన మోహాన్ని నీపై వెదజల్లగా నీదగ్గరకు రమ్మని పిలువవు – ఇదేమయ్యా! నీ చెవికింపుగా ఆమె తన విన్నపాలు చెప్పగా నీవు దానికి ఏమీ సమాధానమవ్వవు. ఇది న్యాయమా? జాణతనంతో వచ్చి ఆమె నీ పాదం తొక్కితే, నీవు ఎరగని అమాయకుడిలా వుండటం ఏమిటయ్యా! స్వామీ! నన్ను కలిశావు. పారవశ్యం అధికమైంది. అదేమి చిత్రమయ్యా!

రామక్రియ

సందుసుడికత్తెవు జాణవు నీవు
యిందరు నుండఁగా నీ వెంతలాచేవే ॥పల్లవి॥
వుంగరము నీదంటా వూరకే వేలువట్టేవు
కొంగు దాఁకించకుమంటా గోరఁ జిమ్మేవు
సింగారించనేర్తునంటా చేరి వద్దఁ గూచుండేవు
ఇంగితము చూపి పతి కెంతలాచేవే ॥సందు॥
సున్నము పెట్టుకొంటా చుట్టరికాలు సేసేవు
వున్నదా నిమ్మపండంటా వొడివట్టేవు
చన్నులు చూచితినంటా సారెఁ దగులనాడేవు
యెన్నికతో రతులకు నెంతలాచేవే ॥సందు॥
కోవిల గూసీనంటా కుచ్చి కాఁగిలించేవు
దేవులనైతినంటాఁ దెర వేసేవు
చేవమీర నన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁడు
యీవేళ నీవాసపడి యెంతలాచేవే ॥సందు॥ (132)

భావము: తనతో కూడియున్న పతిని వేరొక కాంత ఆశపడటాన్ని ఎద్దేవా చేస్తోంది.

ఓ జాణా! నీవు సందుచూచుకొని నడుమలో దూరే స్త్రీవి. ఇంతమంది స్త్రీలు ఇక్కడ వుండగా నీవెంత పెనగులాడుతున్నావే? ఇదిగో ఆ ఉంగరం నాదని వూరకే అతని వేలు పట్టుకున్నావు. నాపైటకొంగు పట్టుకోవద్దని బెదిరిస్తూ గోటితో చిమ్ముతున్నావు. నీకు అలంకారం చేయించగలనంటూ దగ్గరగా వచ్చి కూచున్నావు. నీ లౌకిక జ్ఞానమంతా చూపి పతితో ఎంతగానో పెనగులాడుతున్నావు. తాంబూలంలోకి సున్నం ఇవ్వమని అడిగి చుట్టరికాలు కలిపావు. నా దగ్గర నిమ్మపండు వుంటే ఇవ్వమని నీ కొంగు పట్టావు. నా చనుదోయి చూశావా అంటూ మాటిమాటికి వొంటికి తగిలేలా తిరిగావు. ఎంచుకొన్న రతి క్రీడలకు ఎంతగా పెనగులాడావే. కోకిల కూసిందంటూ భయం నటించి గుచ్చి కౌగిలించావు. నేను నీ దేవేరిని అంటూ పాన్పుపై తెర వేశావు. ఈ రోజు నీవు ఎంతగానో ఆశపడి ఎంతో పెనగులాడడమెందుకు? ప్రీతితో శ్రీ వేంకటేశుడు నన్ను కలిశాడులే – అని చెణుకులు విసిరింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here