అన్నమయ్య పద శృంగారం-15

0
10

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

వరాళి

[dropcap]దం[/dropcap]డనున్న సతులెల్లా తలలు వంచుకొనేరు
కొండవంటిదొరవు సిగ్గులు చేర్చరాదా ॥పల్లవి॥
పచ్చడములోననే పాదాలొత్తీ నాపె నీకు
గచ్చుఁజేఁతల నీవాపెఁ గరఁగించేవు
పచ్చిదేరి మోవెల్ల భావపుఁగళలు దాఁకీ
ఇచ్చటనే ఆఁటదాని నింత సేతురా ॥దండ॥
దోమతెరమాఁటుననే తూరి యాపై సేవ సేసీ
చేముట్టి మర్మములంటి చిమ్మిరేఁచేవు
మోమునఁ జొక్కులుదేరె మూసీ మంతనపురతిఁ
గామిని నిందరిలోనఁ గడుఁగాకు సేతురా ॥దండ॥
పూదండలసందినే పొదిగి కూడీ నాపె
ఆదెసఁ జెమట నోలలార్చేవు నీవు
తోదోపులనే వీడెఁ దురుము శ్రీ వేంకటేశ
సాదువంటి జవరాలి సారెఁ గాకుసేతురా ॥దండ॥ (133)

భావము: అలసత్వంతో తన చెలిని స్వామి చూడటాన్ని ఎత్తి పొడుస్తున్నారు చెలులు.

శ్రీవేంకటేశ, నీ చుట్టూ వున్న సతులందరూ సిగ్గుతో తలలు వంచుకొన్నారు. ధీరుడవైన నాయకుడవుగదా! నీవు వారి సిగ్గులు తీర్చరాదా? దుప్పటిలో చేయిదూర్చి ఆమె నీ పాదసేవ చేస్తోంది. మాయచేష్టలతో నీవామెను పరవశింపజేస్తున్నావు. పచ్చి అయిన పెదవిపైనంతా శృంగార భావపు కళలు విస్తరించాయి. ఇక్కడే నాట్యకత్తెను ఇంత గౌరవిస్తారా? దోమతెర చాటుమాటున దూరి ఆమె నీ సేవలు చేస్తోంది. నీవేమో చేతులు ముట్టుకొని మర్మస్థానాలు తాకి విజృంభిస్తున్నావు. ఏకాంతంలో రహస్యంగా సాగిన రతిక్రీడలో ముఖంపై గాట్లు కనిపిస్తున్నాయి. ఇందరిలో ఆ కాముకురాలిని ఇలా అవమానిస్తారా? పూలదండల మధ్యలోనే ఆమె దూరుకొని నీతో క్రీడించింది. నీవు అటు వైపున ఆమె చెమటలు పోగొడుతున్నావు. మీ యిద్దరి తోపులాటలో ఆమె కొప్పు వూడిపోయింది. సాధువువంటి ఆ ముద్దరాలైన యువతిని ఇలా అవమానిస్తారా! స్వామీ!

బౌళి

ఎందుకని సిగ్గువడే వేమే నీవు
కందువ నాపచ్చడము గప్పుకోవే యిపుడు ॥పల్లవి॥
ముదిత జారినకొప్పు ముడుచుకోఁగడఁగితే
వదలి పయ్యద కానవచ్చెఁ జన్నులు
అది చక్కఁ బెట్టుకొనేనంటాఁ గొంగు బిగించితే
పొదిగి కట్టినయట్టిపోఁకముడి వీడెను ॥ఎందు॥
సరుగ నావలిపెమే చక్కఁగట్టుకొనఁగాను
గరిమఁ దొడలనిగ్గు గానవచ్చెను
పరగ నందుకు లోఁగి పాపట దువ్వుకొంటే
కరమూలములసొంపు గడుబయలాయను ॥ఎందు॥
చెలరేఁగి యందుకు నవ్వి చేత విడెమిచ్చి తేను
పులకలే నీమర్మములు దెలిపె
అలమితి నందుకుఁగా నట్టె శ్రీ వేంకటేశుఁడ
చెలపలచెమటలు చెమరించె నీకును ॥ఎందు॥ (134)

భావము: పారవశ్యంతో తనను తానే మరచిన చెలిని ఆటపట్టిస్తున్నారు చెలులు.

ఓ సఖి! నీవెందుకు సిగ్గుపడుతున్నావే. ప్రీతితో ఆ దుప్పటి కప్పుకోవే. తత్తరపాటుతో నీవు జారిన కొప్పు సరిచేసుకోబోతే పైట జారి వెనకవున్న చన్నులు కనిపిస్తున్నాయి. దానిని కప్పి పుచ్చుకోవాలని పైట కొంగు బిగిస్తే అందంగా కట్టుకున్న చీరముడి వీడిపోయింది. ఆ చీరను సరిదిద్దుకోబోతే నీ తొడల నిగారింపు బయటపడింది. దానికి లోబడి తలపై పాపట దువ్వుకొంటే బాహుమూలముల అందం బయటపడింది. అది గమనించి నీవు నవ్వి ఆతని చేతికి తాంబూలం అందించబోతే నీ శరీరంపై పులకలు నీ రహస్యాన్ని తెలిపాయి. వొంటి నిండా పట్టిన చెమటలు నీకు చెమరించాయి. అందుకు శ్రీ వెంకటేశుడు చూడగా చింతించావు.

లలిత

అందుకేమి దోసముగా దానతీవయ్యా
విందులుగా వీనులను వినే నేను ॥పల్లవి॥
మగువలతోనెల్లా మాఁటలు నీ వాడఁగానో
చిగురాకు నీమోవి చేగయెక్కెను
మొగి వారితోడ సాములు నీవు సేయఁగానో
జిగిమించుచెక్కులెల్లాఁ జెమరించెను ॥అందు॥
సారె సారెఁ జెలరేఁగి సరసములాడఁగానో
చీరుమూరై మేనెల్ల జీరలాయను
చేరిచేరి లోలోను సేసలు చల్లుకోఁగానో
కూరిములు చూపట్టఁ గురులు చెదరెను ॥అందు॥
ననుపులు సేసుకొని నవ్వులు నవ్వఁగానో
నినుపుగా నిట్టూర్పులు నిగుడఁజొచ్చె
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
కనుపట్టి నీమోమునఁ గళలు దైవారెను ॥అందు॥ (135)

భావము: దక్షిణ నాయకుడైన నీవు ఇతర ప్రియురాండ్రతో సరసాలాడగా నాకు విరహం అధికమైందని కొంత విన్నవిస్తోంది.

శ్రీ వేంకటేశ! ఇతర పత్నులతో నీవు కలియడం దోషమేమీకాదు. నీవు చెప్పదలచుకొన్న మాటలు చెప్పవయ్యా! నా చెవులకు విందుగా నేను వింటాను. అందరు వనితలతో నీవు సరససల్లాపాలు ఆడగా చిగురాకు వంటి నీ పెదవి చేవదీరింది. పూనికగా వారితో రతిక్రీడల సాముగరిడీలు చేయగా అందమైన నీ చెక్కులు చెమర్చాయి. మాటిమాటికీ పెనగులాడి వారితో సరసాలాడగా చిందరవందరగా మారి శరీరమంతా గీరలు పడ్డాయి. మీరు అందరు దగ్గరగా చేరి లోలోపల సేసబాలు చల్లుకోగా వారి ప్రేమలు బయటపెడుతూ సిగలు చెదిరాయి. ప్రీతితో నవ్వులు నవ్వగా వారికి నిట్టూర్పులు అధికమయ్యాయి. స్వామీ కనిపించేలా నీముఖంపై శృంగారకళలు పొటమరించాయి. ఘనుడవైన నీవు నన్ను ఏలుకొన్నావు.

మంగళ కౌశిక

అనేకపంతగాఁడవు అందగాఁడవు
మునుకొన్న మావెంగేలు ముంచుకొనీనా ॥పల్లవి॥
కొసరితే నేమాయ కొంగువట్టితే నేమాయ
మసలక తగులైనమగవానిని
యెసఁగ నేఁ జెనకితే నేలతప్పించుకొనేవు
కసుఁగందనిచన్నులు కాండీనా నిన్నును ॥అనే॥
సారె నంటించితే నేమాయ జంకించితే నేమాయ
వేరులేనిచుట్టరికమైన విటరాయని
వూరక నవ్వితేను వొడ్డించుకో నీకేఁటికి
ఆరితేరి నాచూపులు ఆయములు రేఁచీనా ॥అనే॥
చెక్కు నొక్కితే నేమాయ చిక్కించుకొంటే నేమాయ
అక్కరతో నాయకుఁడైనవానిని
యిక్కడ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
మిక్కిలి నారతులివి మేరమీరీనా ॥అనే॥ (136)

భావము: శ్రీ వేంకటేశ నీవు పట్టుదలగల అందగాడవు. మా వ్యంగ్యపు మాటలు ముంచుకొచ్చాయా? కొసరితో ఏమైంది? కొంగు పట్టుకొంటే ఏమైంది? నేను నిన్ను గీరితే ఏల తప్పించుకొంటున్నావు? చెక్కు చెదరని చనుదోయితో తాటించనా? మాటిమాటికీ నిన్ను తాకినా, బెదిరించినా ఏమైంది? దూరమైన బంధుత్వం కాని విటరాయడవు నీవు. నేను వూరకే నవ్వితే నీవు ఆనందించడమెందుకు? నా కడగంటి చూపులు నీ కళాస్థానాలను రెచ్చగొట్టాయా? నేను నీ చెక్కులు నొక్కినా, చిక్కించుకొన్నా ఏమైంది? అవసరానికి నాయకుడవైనావు. నేను అలమేలుమంగను. నా రతిక్రీడలు అధికంగా హద్దులు మీరాయా?

పాడి

ఏమాయ నందుకునేల వేగిరించేవు
నీమాటలన్నియును నిజమయ్యీఁగాక ॥పల్లవి॥
సందడిలో నిన్ను నాచన్నులు దాఁకితేను
కందువల నిది యెంతగబ్బి యనేవు
గందవొడి చల్లుకోఁగా గాలి నీపైఁ బారితే
కెందమ్మిపువ్వులనేల కెరలి వేసేవు ॥ఏమా॥
కురులు దువ్వుకోఁగా కొప్పు నీపై జారెనంటా
గొరబుసేసి నన్ను గోర గీరేవు
పరగ మేడ యెక్కఁగా పైఁజిందెఁ జెమటలంటా
సరుగఁ గప్పురమేల చల్లేవు నామీఁదను ॥ఏమా॥
యిట్టె బంతిఁ గూచుండఁగ నెంగిలి సోఁకెనంటాను
బెట్టుగఁ గాఁగిట గుచ్చి బిగియించేవు
నెట్టన శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
చుట్టమవై నన్ను నెంత చొక్కులఁ బెట్టేవు ॥ఏమా॥ (137)

భావము: నాయిక తన చేష్టలను సమర్థించుకొంటూ స్వామిపై ఎదురుదాడి చేసి కవ్విస్తోంది.

ఓ వెంకటేశ! నీమాటలన్నీ నా పట్ల నిజమవుతున్నాయి గాక! ఏమైంది? అందుకు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు. గుంపులో తిరుగాడుతున్నప్పుడు నా చనుదోయి నిన్ను తాకితే, ఏకాంతంగా వున్నప్పుడు ఇది ఎంత ‘కంపు’దని ఎగతాళి చేస్తావు. నేను నా శరీరంపై గందవొడి చల్లుకోగా గాలివాటున అది నీపై వీచితే నీవు తామరపూలు నాపైన విసిరావు. నేను తలదువ్వుకొనే సమయంలో ఏమరుపాటున నాపైట జారితే వేషాలు వేసి నన్ను గోటితో గీరుతున్నావు. నేను మేడమీది కెక్కుతుండగా చెమట బిందువులు నీపై చిందగా నీవు నామీద కర్పూరం చల్లుతున్నావు. ఇద్దరం పంక్తి భోజనం చేస్తుంటే నా ఎంగిలి నీకు తగిలిందని బెట్టుగా కౌగిట్లో బిగించావు. ఓ స్వామీ! నేను నీ అలమేలుమంగను. బంధువువై నన్ను ఎంత పరవశింపజేస్తున్నావు.

ముగ్ధవలె మాటాడుతూ పతి సాన్నిధ్యాన్ని కోరుకొంటోంది.

మాళవి

ఎంతజాణలే వీరు యింతులాల
వింతలుగ వీదివీది వినోదించేరు ॥పల్లవి॥
ఇద్దరు దేవుళ్లుఁ దాము నెదురుదేరులమీఁద
కొద్దిమీర నిమ్మపండ్లఁ గుచ్చి చిమ్మేరు
వొద్దికతో నవ్వుకొంటా నుంటవింట గందపు
ముద్దలు దాఁకవేసి మోదములు చూచేరు ॥ఎంత॥
వెనకాముందరాను వేడుకతోఁ దేరులు
అనువుగా వెంటవెంట నంటఁదోలేరు
తనువులు సోఁకఁ జేతితామరనాళముల
పెనఁగి పైఁబారఁ జాఁచి పిలిచేరు మోవులు (ల?) ॥ఎంత॥
సందడిలోపలనే సంగడిఁ దేరులు నిల్పి
కందువతోఁ జౌకళించి కాఁగిలించేరు
పొంది శ్రీ వేంకటేశుఁడు భూదేవీ నలమేల్మంగా
పెందలికాడనే పెండ్లిపీఁటపై నున్నారు ॥ఎంత॥ (138)

భావము: శ్రీదేవీభూదేవులతో గూడిన శ్రీ వేంకటేశుడు తేరులపై నెక్కి వీధులలో సంచరించడాన్ని చెలులు వినోదిస్తున్నారు.

ఓ ఇంతులారా! మీరు ఎంతటి నేర్పరులే. వింతలుగా మీరు వీధులలో వినోదిస్తూ తిరుగుతున్నారు. దేవేరులిద్దరూ ఎదురెదురు రధాలమీద కూచొని తృప్తిగా నిమ్మపండ్లు గుచ్చి విసురుతున్నారు. వారు స్నేహంగా నవ్వుకొంటూ వుండటంచేత గంధపుముద్దలు ఒకరిపై ఒకరు విసురుకొని ఆనందం పంచుకుంటున్నారు. రథాలు రెండింటినీ వెనక ముందరలుగా వేడుకతో నడిపి వెంటవెంటగా కలిసేటట్లు తోలుతున్నారు. శరీరాలు దగ్గర కాగా తామర తూడులవంటి చేతులతో బారగా చాచి పెదవులతో పిలుస్తున్నారు. సమూహం మధ్యలోనే స్వేహపూర్వకమైన రథాలు నిలిపి ఏకాంతంలో ఇరువురూ కలసి కౌగిలించుకున్నారు. భూదేవి, అలమేలు మంగలతో కలిసి వేంకటేశుడు పెందలకాడనే పెళ్లి పీటల మీద కూచున్నాడు.

సౌరాష్ట్రం

ఎంతమోహమో నీకీ ఇంతిమీఁదను
వింతవింత వేడుకల విఱ్ఱవీఁగేవు ॥పల్లవి॥
తరుణిగుబ్బలు నీకుఁ దలగడబిల్లలుగా –
నొరగుకొన్నాఁడవు వుబ్బున నీవు
దొరవై పయ్యదకొంగు దోమతెరబాగుగ
సరుగ మాఁటుసేసుక జాణవై వున్నాఁడవు ॥ఎంత॥
భామినితొడలు నీకు పట్టెమంచములాగున-
నాముకొని పవ్వళించే వప్పటి నీవు
గోముతోడ పట్టుచీరకుచ్చెల పరపుగాఁగ
కామించి ఇట్టె కోడెకాఁడవై వున్నాఁడవు ॥ఎంత॥
వనితకాఁగిలి నీకు వాసన చప్పరముగ –
నునికి సేసుకున్నాఁడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీ వేంకటేశ యలమేల్మంగను
అనిశము సింగారరాయఁడవై వున్నాఁడవు ॥ఎంత॥ (139)

భావము: శృంగార పురుషుడైన శ్రీవేంకటేశునికి అలమేలుమంగ తన శరీరాన్నే పానుపుగా అమర్చినదని చెలి స్వామికి విన్నవిస్తోంది.

ఓ వెంకటేశ! అలమేలుమంగపై నీకు ఎంతటి మోహమో? వింతలైన వేడుకలతో విర్రవీగిపోతున్నావు. మా చెలి చన్నులే నీకు తలగడ దిండ్లుగా సంతోషంగా వొరిగిపోయావు. గడుసరి దొరవై, జాణకాడవై పైటకొంగు దోమతెరగా చేసుకొని గుట్టుగా క్రీడిస్తున్నావు. భామ తొడలే నీకు పట్టెమంచము వలె నుండగా పైకొని నిద్రించావు. ముద్దుగా ఆమె పట్టుకుచ్చెల చీరను పరుపుగా పరచుకొని కామంతో కూడిన నీవు వయసులో కోడెకాడవైనావు. వొద్దికగా ఆమెను చేరి ఆమె కౌగిలి నీకు పూపొదరిల్లుగా ఏర్పరచుకున్నారు. నిత్య పెళ్లి కొడుకువు, (శృంగారరాయడవు) అయిన నీవు అలమేలుమంగను క్రీడించావు.

బౌళి

మేలు మేలు నీకతలు మెచ్చితిమయ్యా
యేలుకొంటి విందరిని యెంతవాఁడవయ్యా ॥పల్లవి॥
చల్లువెడమాట లాడి సతులవలపులెల్ల
కొల్లగాఁ గలయఁబెట్టి గుంపుసేసేవు
అల్లిబిల్లి సేసి కూడి ఆసలు మోపులుగట్టి
యెల్లవారిమీఁద వేసే వెంతవాఁడవయ్యా ॥మేలు॥
వాడికనవ్వులు నవ్వి వనితలమానములు
కూడపెట్టి లోలోనే గుదిగుచ్చేవు
యీడుజోడుగాఁ బెనఁగి యింపులు మచ్చులువేసి
యీడేరించితివి మమ్ము నెంతవాఁడవయ్యా ॥మేలు॥
మోవితీపులు మరపి ముదితల జవ్వనాలు
భావములు వడివెట్టి పచ్చి రేఁచేవు
శ్రీ వేంకటేశ నా పై సిగ్గులు నానఁబెట్టి
యీవల నన్నుఁ గూడితి వెంతవాఁడవయ్యా ॥మేలు॥ (140)

భావము: దక్షిణ నాయకుడైన స్వామి ఎందరి ప్రేమనో కొల్లగొట్టాడని సతులు ఏకరువుపెడుతున్నారు.

శ్రీ వేంకటేశ! నీ కథలన్నీ భళాభళి మెచ్చాము. ఎందరినో ఏలుకున్న నీవు ఎంత మొనగాడవు! వృథా మాటలు గుప్పించి కాంతల ప్రేమలనన్నిటినీ గుత్తగా కొల్లబెట్టి అందరినీ చేర్చావు. అల్లిబిల్లి మాటలు మాట్లాడి ఆశలనే మోపులు గట్టి అందరి నెత్తి మీద వేసే నీవెంతవాడివయ్యా. నీకు అలవాటైన నవ్వులు నవ్వి స్త్రీల మానాలు దొంగిలించి లోలోపల మూటగట్టావు. ఈడూ జోడుగా మాతో పెనగులాడి ప్రేమలనే మచ్చులు పైనవేసి మమ్ము నెరవేర్చావు. ఎంత మొనగాడివయ్యా. నీ పెదని తీపులు మరగజేసి స్త్రీల యవ్వనంలోని భావాలు తొందరపెట్టి మోహాన్ని రెచ్చగొట్టావు. ఓ స్వామీ! నాపైన సిగ్గు లొలకబోసి ఇక్కడ నన్ను కూడావు. నీవెంతవాడవయ్యా అని ఆశ్చర్యపోతోంది.

పాడి

ఎంతవేడుకకాఁడ వేమిచెప్పేది
అంతేపో నేరుపరివౌదువయ్య నీవు ॥పల్లవి॥
చిక్కనివి నవ్వులు చిమ్మిరేఁగేవి సిగ్గులు
చక్కఁగ మాతోనేల జాణతనాలు
లక్క బుఱ్ఱవంటినోరు లలిఁ బగడపుమోవి
పిక్కటిల్ల గంటి సేయఁ బెనఁగేవు నీవు ॥ఎంత॥
గట్టులివి చన్నులు కడుబయలు నడుము
నెట్టన మాతోనేల నెరతనాలు
దట్టపుమేఘము కొప్పు దంతికుంబాలు పిరుఁదు
ముట్టి సరసములాడ మొనసేవు నీవు ॥ఎంత॥
పసనితీగె మేను పాయరానివి యాసలు
యెసగి మాతోనేల యేలాటాలు
వసమై నన్నేలితివి వాసితో శ్రీ వేంకటేశ
పొసఁగె నన్నిటా నన్నుఁ బొదిగేవు నీవు ॥ఎంత॥ (141)

భావము: కాంత అవయవాలను కవి సమయాలతో పోలిస్తూ తన సౌందర్యాన్ని భామిని వర్ణిస్తోంది.

ఓ వేంకటేశా! నీవు సరదాలు కోరేవాడివి. నీ సంగతి ఏమని చెప్పేది. అంతేగాదు నీవు మాటనేర్పరివయ్యావు. చక్కగా నాతో నీ జాణతనాలు చూపవద్దు. నా నవ్వులు చిక్కనివి. సిగ్గులు మోహాన్ని రేగగొట్టేవి. నోరు ఎర్రని లక్క బుర్ర పెదాలు పగడం వలె ఎర్రని పెదవిని గంట్లు పెట్టాలని పెనగులాడుతున్నావు. నా చనులు కొండలు. సూక్ష్మమైన నడుము అటువంటి నాతో నీ జాణతనం ఎందులకు? నా కేశాలు దట్టమైన నల్లని మేఘాలవంటివి. ఏనుగు కుంభస్థలాలు (చనుదోయి) వంటి పిరుదులు ముట్టుకొని నాతో సరసాలాడాలని ముందుకురుకుతున్నావు. మృదువైన సన్నని తీగెవంటి శరీరము, నా ఆశలు వదలి పెట్టనివి. అటువంటి మాతో పరిహాసాలెందుకు? స్వామీ! అన్నిరకాలుగా నన్ను కౌగిలించావు. అధికంగా నన్నేలుకొన్నావు – అని కాంత విన్నవిస్తోంది.

గుజ్జరి

సేసినట్టు సేయవయ్యా చిత్తమువచ్చినట్టల్లా
వాసివంతు లెంచుకొని వద్దన నేఁ జాలను ॥పల్లవి॥
పిలిపించినవాఁడవు ప్రియముగలవాఁడవు
చెలఁగి యెంతనవ్వినాఁ జెల్లు నీకు
వలపించినవాఁడవు వసమైనవాఁడవు
అల మెంత బోగించినా నమరు నీకు ॥సేసి॥
వొడివట్టినవాఁడపు వొద్దఁబాయనివాఁడపు
తడవి యెంతపై కొన్నాఁ దగు నీకు
విడెమిచ్చినవాఁడవు వేడుకపడ్డవాఁడపు
కడఁగి చన్నులు విసుకఁదగవే నీకు ॥సేసి॥
పెనఁగేటివాఁడపు పెండ్లాడినవాఁడవు
ననిచి మోవి యానఁగ నాయమే నీకు
యెనసితివి శ్రీ వేంకటేశ యిన్నిటా నన్ను-
నొనగూడి మన్నించను నుచితమే నీకు ॥సేసి॥ (142)

భావము: శృంగారంలో ధీరుడైన వెంకటేశుని గడుసరితనాన్ని కాంత వివరిస్తోంది.

శ్రీ వేంకటేశ! నీ మనసుకు తోచినట్లల్లా ఇష్టం వచ్చినట్లు చేయవయ్యా! హెచ్చుతగ్గులు లెక్కించి నిన్ను వద్దనడానికి నేను సరిపోను. అది పనిగా పిలిపించిన వాడివి, నాపై ప్రీతిగలవాడివి, నీకు ఎంతలేసి నవ్వులైనా చెల్లుబాటు అవుతాయి. ప్రేమింపజేసికొన్నవాడవు, నాకు వశమైనవాడవు. నన్ను కౌగిలించి ఎంత భోగించినా నీకే చెల్లును. నా వొడిని పట్టుకొన్నవాడివి. నన్ను ఎడబాయని వాడివి. శరీరాన్ని నిమిరి ఎంత దగ్గరైనా నీకే తగును. నాకు తాంబూలమందించావు. నా మీద సరదాపడ్డవాడవు. అటువంటి నీవు పూనుకొని నా చన్నులు పిసకడం భావ్యమా! నన్ను కౌగిలించిన వాడవు, పెళ్లాడిన వాడవు, నా పెదవులు ముద్దాడడం న్యాయమా? స్వామీ నన్ను పొందావు. సఖ్యంతో మన్నించడం నీకు ఉచితమా? తన కిష్టమైన వ్యక్తితో శృంగార చేష్టలను కాదంటూ మెచ్చుకొంటోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here