అన్నమయ్య పద శృంగారం-16

0
12

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

పాడి

ఎంత బత్తిసేసీ నీపై ఇదే సందుగాఁ దాను
వింతలేక సేవసేసీ వేడుకెంతో తనకు ॥ పల్లవి॥
చన్ను లురమున నాని చక్కదిద్దీ నీనామము
మన్నించితే నేమి యెంతమందెమేళము
చిన్ని పెదవులు దాఁక చెవిలోనే మాటలాడీ
యెన్నరాదు చూడు దీని కెంతగర్వము ॥ ఎంత॥
తొడమీఁదఁ దొడవేసి దొరతనమున నీ-
యడుగులొత్తీ నెంతఅహంకారము
వెడదగోళ్లు సోఁక విడెము నీకిచ్చీని
తడిచెమటలతోనే తన కెంతపగటు ॥ ఎంత॥
జమళిచంకలు రాయ జవ్వాది నీ మేనఁ బూసి
తమకించీ నెటువంటిదంటతనము
అమర శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
సముకాన నీకె కెంత సంగడిదాష్టీకము ॥ ఎంత॥ (143)

భావము: తన విభునితో క్రీడిస్తున్న మరొక వనిత దాష్టీకాన్ని నిందిస్తోంది మరో కాంత. శ్రీ వేంకటేశ! ఈవిడ ఎంతో భక్తితో సందు చేసుకొని వింత లేకుండా సరదగా నీకు సేవలు చేస్తోంది. చనుదోయి నీ గుండెకు తాకించి నీ నామాన్ని సరిచేస్తోంది. ఒకవేళ నీవు మన్నించినా ఎంతటి చనవు తీసుకొంటోంది. నీ పెదవులకు తన చిన్ని పెదవులు తాకించి చెవిలో ఏదో గుసగుసలు చెబుతోంది. లెక్కించరాదుగాని దీనికెంతటి గర్వము? నీ తొడల మీద తన తొడ వేసి దొరతనం ప్రకటిస్తూ నీ అడుగులొత్తుతోంది. ఎంతటి అహంకారము! తన వాడియైన గోళ్లు సోకగా నీకు తాంబూలమిస్తోంది. శరీరమంతా చెమటలతో తడిసిపోయిన తనకెంత లావణ్యము. రెండు చంకలు తగిలించి నీ శరీరానికి జవ్వాది పూసి మోహంతో ప్రవర్తిస్తోంది. ఆవిడ కెంత పొగరు. నీ సముఖాన ఆవిడ కెంతటి దౌర్జన్యము – అంటూ నిందారోపణ చేస్తోంది.

రామక్రియ

ఏమే సేసినమేలు ఇయ్యకోవద్దా
సాములేలే గందవొడి చల్లేనంటేను ॥ పల్లవి॥
మొక్కేవేమే వద్దంటాను మోహాన నీరమణుఁడు
యిక్కువతో నాకుమడిచి యిచ్చేనంటేను
పిక్కటిల్లుచన్నులతోఁ బెనఁగులాడేవేమే
చుక్క బొట్టు నొసలఁ జక్కఁబెట్టేనంటేను ॥ ఏమే॥
అండుకాచే వదియేమే ఆదరించి యాతఁడు
పెండెము నీపాదమునఁ బెట్టేనంటేను
వెండియు నాతనివెనవెనక కేఁగేవేమే
కొండవలెఁ దొడమీఁదఁ గూచుండుమంటేను ॥ ఏమే॥
వేవేలుచందముల వేఁడుకొనే వదియేమే
శ్రీవేంకటేశుఁ డక్కునఁ జేర్చేనంటేను
భావించి వినయాలే పచరించే వదియేమే
యీవేళ నిన్నెనసి మోవిమ్మని యంటేను ॥ ఏమే॥ (144)

భావము: స్వామి పక్షాన ఒక చెలి అలమేలుమంగ గడుసుదనాన్ని గుర్తుచేస్తోంది. ఏమమ్మా! నీ పతి చేసిన మేలుకు గుర్తుగా ప్రతిఫలం యివ్వవద్దా. దేవుల మీద చల్లే గంధవొడి నీపై చల్లుతున్నాడు గదా! ప్రేమతో నీకు మోహంతో తాంబూలం అందిస్తున్న నీ ప్రియునికి మొక్కి వద్దంటావేమే! నుదుటి మీద చుక్క బొట్టు పెట్టబోతే బలిసిన నీ చనులతో పెనగులాడుతావేమే. అతను నీ పాదానికి గండపెండేరం ఆదరించి పెట్టబోతే, దగ్గరగా తిరిగి రహస్యాలు కనిపెడతావేమే. తన తొడ మీద బలంగా కూచోమని అడుగుతుంటే అతని వెనకబడి పోతావేమే. వెంకటేశుడు నిన్ను కౌగిలిస్తానంటే రకరకాలుగా వద్దని వేడుకొంటావు. ఎంత జాణవే. ఈ వేళ నిన్ను కలిసి పెదవి ఆననీమంటే, ఏదో ఊహించుకొని వినయాలు వొలకబోస్తావు. ఎంత గడసరివే.

ఇష్టమే అయినా అలమేలుమంగ చతురత ప్రదర్శిస్తోంది.

లలిత

తేరిచూడ నిన్నీ నాకు దిష్టమాయను
రారాఁపు లిఁకనేల రమ్మనవే పతిని ॥ పల్లవి॥
ఆడఁగనాడఁగ సరసా లాసలు పుట్టించును
చూడఁబోతే మోహములు చుట్టుకొనును
వాడిక దరచైతేఁ గైవశముగాఁ జేసును
యీడనే పంతములాడనేలే నాకిఁకను ॥ తేరి॥
వినఁగవినఁగ మాట వేడుకలు వొడమించు
పెనఁగితేఁ దనువులు ప్రేమరేఁచును
మనిమని యేకతాలు మర్మములు గరఁగించు
యెనసి పంతములాడనేలే నాకిఁకను ॥ తేరి॥
సేయఁజేయఁ జెలుములు చిత్తములు మరిగించు
రాయడింపుఁజెనకులు రతి వుట్టించు
పాయక శ్రీ వేంకటపతి నన్నుఁ గూడినాఁడు
యేయెడఁ బంతములాడనేలే నాకిఁకను ॥ తేరి॥ (145)

భావము: పతిపై విరహాన్ని చెలితో చెప్పి బాధపడుతోంది సతి. ఓయమ్మా! పతిని త్వరత్వరగా రమ్మని చెప్పవే. ఇంకా కలహాలు ఎందుకు. తేరిపార చూస్తున్న నాకు నిన్న దిష్టి తగిలింది. మాటలాడగా సరసాలు కల్పిస్తాడు. ఆతనిని చూడబోతే మోహ పరవశనవుతాను. నా దగ్గరకు రావడం అధికమైతే నన్ను కైవశం చేసుకుంటాడు. ఇంకా నేను ఇక్కడే వుండి పంతాలు పట్టనేల?

ఆతని మాటలు వినే కొద్దీ అతనిపై సరదా ఎక్కువౌతుంది. అతనిని కౌగిలించి పెనగితే శరీరంలో ప్రేమ పెచ్చు రేగుతుంది. ఏకాంతంగా జీవిస్తే మర్మాలు కరిగిస్తాయి. వేధించే కలయికలు రతికి దారితీస్తాయి. నన్ను వదలి పెట్టక వెంకటేశుడు నన్ను కలిసిన వేళ ఇంకా పంతాలు, పట్టింపులేల? త్వరగా రమ్మనవే – అని వేడుకొంటోంది.

ఆహిరి

ఎదురుచూచి చూచి యేఁకరినట్టయ్యీని
నిదుర గంటికి రాదు నేనిఁక నేమందునే ॥ పల్లవి॥
వొప్పఁజెప్పి నాచేతివుం(కుంట) గరము తానే యిచ్చె
అప్పటి వచ్చేనంటా నానవెట్టెను
కప్పురపుఁదమ్ములము కందువగా నోరు నించె
యెప్పుడుగాని రాఁడో యేమిసేతుఁ జెలియా ॥ ఎదు॥
కూరిమితో జారిన నాకొప్పు తానే చక్కఁబెట్టె
గారవించి నమ్మించి కాఁగిలించెను
వూరడించి వొకతె నావద్ద నప్పసమువెట్టె
చేర నెప్పుడు వచ్చీనో చెప్పఁగదే చెలియా ॥ ఎదు॥
ఆదరించి చిక్కు వడ్డహారములు తానె దిద్ది
పోదిసేసి మోవియిచ్చి బుజ్జగించెను
యీదెస శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
యేదెస నుండెనోకాని ఇందాఁకా జెలియా ॥ ఎదు॥ (146)

భావము: పతి కోసం ఎదురుచూచిచూచి అతడింతకుముందు చేసిన శృంగార చేష్టలు చెలికి చెప్పి బాధపడుతోంది. ఓ చెలీ! అతని రాక కోసం ఎదురు చూచి చూచి ముఖం దిగులుతో వాచిపోయింది. కంటికి నిద్రరాదు. నా అవస్ధను ఏమని చెప్పను? చేతిలో చేయి వేసి నా చేతికి తానే ఉంగరం తొడిగాడు. ఇప్పుడే వస్తానని బాస చేశాడు. కర్పూరపు తాంబూలాన్ని నోట్లో దురిమాడు. ఎంతసేపైనా రాలేదు. నేనేమి చేసేది. ఓ చెలియా! ప్రేమతో జారిన నా కొప్పును తానే సవరించాడు. నమ్మించి గౌరవంగా కౌగిలించాడు. నన్ను ఓదార్చి నాకు కట్టడిగా ఒకతెను వుంచివెళ్లాడు. అతడు నన్ను చేరడానికి ఎప్పుడు వస్తాడో చెప్పు. చిక్కువడిన నా మెడలోని హారాలు ప్రేమతో తానే సవరించాడు. దగ్గరకు తీసుకొని పెదవి యిచ్చి బుజ్జగించాడు. ఈ విధంగా శ్రీ వేంకటేశుడు యిప్పుడే నన్ను కలిశాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు – అని భంగపడింది..

ముఖారి

ఏలే ఆఁటదానికి యెమ్మెలింతేసి
వోలిఁ గడుగుట్టుతోడ నుండవలెఁగాక ॥ పల్లవి॥
జవ్వాది యెంతవూసేవే చన్నులేల మూసేవే
చివ్వన నెన్నిచేఁతలు సేసేవే
నవ్వులేమి నవ్వేవే నలిఁ గొప్పేమిదువ్వేవే
రవ్వలాయ నీవలపు రమణునియెదుట ॥ ఏలే॥
సిగ్గులేల విడిచేవే చెమటేల తుడిచేవే
మొగ్గవిరు లిన్నేల ముడిచేవే
వొగ్గి కాలేల తొక్కేవే వూరకేల మొక్కేవే
యెగ్గులుఁదప్పు లెవ్వరి నెంచనివాఁడతఁడు ॥ ఏలే॥
మఱి యెందాఁ కాఁ బాడేవే మాటలెన్ని యాడేవే
గుఱిగాఁ గాఁగిట నెంత కూడేవే
యెఱుకతో శ్రీ వేంకటేశుఁడు నన్నిటు గూడె
మెఱసి యాతనికేల మేకులు సేసేవే ॥ ఏలే॥ (147)

భావము: వలచి వలపించుకోవాలని చూచే కాంతతో ఎకసెక్కాలు ఆడుతోంది ఆమె చెలి. నంగనాచివలె ఎందుకు తిరుగుతావని ప్రశ్నిస్తోంది.

ఏమమ్మా! ఆటకత్తెవైన నీకు ఇంతటి విలాసాలెందుకు? ఆడేటప్పుడు ఎంతో రహస్యంగా ఉండాలని తెలియదా? జవ్వాది ఎంతగానో పూసి చన్దోయిని కప్పి పుచ్చుతావెందుకు? తటాలున ఎన్ని చేష్టలు చేశావే! ఎన్నిరకాల నవ్వులు నవ్వావే. నీ తలకొప్పు దువ్వుతున్నావే. నీ ప్రియుని ఎదుట నీ ప్రేమ బట్టబయలైంది. సిగ్గులు ఎందుకు విడిచిపెడుతున్నావు. వొంటికి పట్టిన చెమటలు ఎందుకు తుడుస్తున్నావు? పూలమొగ్గలు యిన్నింటిని తలలో ఎందుకు తురిమావు? దగ్గరగా చేరి కాలు ఎందుకు తొక్కావు. వట్టి పుణ్యానికి మొక్కడమేల? నీ ప్రియుడు ఎవరినీ దోషాలుగానీ, తప్పులుగాని లెక్కపెట్టడు. నీ పాటలు ఎంత దాకానే. ఎన్నిమాటలు మాట్లాడావే. గురిపెట్టి కౌగిట్లో చేరావు గదవే. తెలిసి తెలిసి అతడు నిన్ను కలిశాడు. ఇంకా అతనికి పరిహాసాలతో అడ్డంకులెందుకు చెబుతావు? అని గద్దిచింది.

శంకరాభరణం

ఇందవె యాతఁడు నీకిచ్చినసొమ్ము
కందువ నీమేలులోనికాంతలము గదవే ॥ పల్లవి॥
చిప్పిలుఁజెమటలేలే సిగ్గులువడఁగనేలే
తప్పక వినరాదా యాతనిసుద్దులు
రెప్పలు మూసుకొనేవు రిచ్చ లోలో నవ్వేవు
చొప్పుగాఁ బెండ్లికూఁతుర విప్పుడే యైతివా ॥ ఇంద॥
పయ్యదమరఁగులేలే భావపుఁగరఁగులేలే
ఇయ్యకొనవే చనవులిచ్చినాఁడు
వొయ్యనే మాటాడేవు వొగిఁ బాపట దువ్వేవు
ఇయ్యెడఁ గన్నె పడుచ విందుకే యైతివా ॥ ఇంద॥
బట్టబయలీఁదనేలే పరాకు లిఁకనేలే
అట్టె వద్దికి రారాదా యాతఁడు వచ్చె
చుట్టమై శ్రీ వేంకటేశుఁడు తానె నిన్నుఁ గూడె
ఇట్టె పట్టపుదేవి వింతలో నయితివా ॥ ఇంద॥ (148)

భావము: సిగ్గు లొలకబోసే భామను చూచి సఖులు పరాచికాలు ఆడుతున్నారు. ఏమమ్మా! నీ ప్రియుడు నీకిచ్చినది ఇదిగో తీసుకో! ఏకాంతంలో నీ మేలు కోరే చెలులము గదా! ఆతడు చెప్పే మాటలు తప్పకుండా వినరాదా! ఇంతలో చెమటలు అధికం కావడం, సిగ్గులు పడటం ఎందుకు? కళ్లు మూసుకోవడం, ఆశ్చర్యంగా నవ్వడం దేనికి? నీవు ఇప్పుడే పెళ్లి కూతురివైనావా?

పైట కప్పిపుచ్చుకోవడాలు, మనసులో కరిగిపోవడాలు ఎందుకు? అతడు నీకు ఎంతో చనవులిచ్చినాడు గదా! సొగసుగా మాట్లాడుతున్నావు. తల పాపిట దువ్వుతున్నావు. ఇక్కడ ఇప్పుడే ఇందుకే కన్య పడుచువైనావా? ఆకాశంలో (బయట) ఈదనేల? ఏదో మాట్లాడుతూ పరాకులెందుకు? ఆతడు నీ దగ్గరగా చేరినప్పుడు నీవు వొద్దికగా కూచోరాదా? వెంకటేశుడు తనకుతానే చుట్టరికం కలిపి నిన్ను కలిశాడు. ఇంతలోనే నీవు పట్టపు రాణివైనావా? అని చెలులు ఎకసెక్కములాడుతున్నారు.

భైరవి

ఇప్పుడే విన్నవించితి నెంచుకో మీఁదటియెత్తు
వొప్పుగ ధీరుఁడవైతే నొనరు నాకాఁగిట ॥ పల్లవి॥
నాతో మాటాడఁగ నీనాతు లేమందురో నిన్ను
చేతులెత్తి యేమేమి సేతురో
యీతలనాతల నిన్ను నెక్కడనుండి చూచేరో
బీతి(తు?)లేనివాఁడవై తే పెనఁగు నాతోను ॥ ఇప్పు॥
నీవు నాచన్ను లంటఁగ నిన్నేమందురో వారు
వావాత నెన్నేసి నీకు రేఁతురో
యీవేళ మనమాఁటలు యేడ వింటానున్నారో
ఆవుద్దండాల కోపితే నండకు రా నీవు ॥ ఇప్పు॥
యీడ నిట్టె వుండఁగా నెంతసాదింతురో తాము
కూడితి శ్రీ వేంకటేశ కోరి నన్నును
వీడే లియ్య నేడ నిన్ను వెదకుతానున్నారో
నీడాక చూపనోపితే నెట్టుకో మాయింటను ॥ ఇప్పు॥ (149)

భావము: ఓ వేంకటేశా! మనమాడే రతిక్రీడా చదరంగంలో తరువాతి ఎత్తు ఏమి వేస్తావో నీవే అలోచించుకో! ఇప్పుడే విన్నవిస్తున్నాను. నీవు మగధీరుడవైతే కౌగిటిలో వొదిగిపో. నీవు నాతో మాట్లాడడం చూచిన ఈ భామలు నిన్ను ఏమంటారో! చేతులూపుతూ ఏమేమి చేస్తారో! అక్కడా ఇక్కడా నిలబడి ఎక్కడి నుండి చూస్తారో? నీకు ఏమాత్రం భయం లేకపోతే నాతో క్రీడించు!

నీవు నా చనుదోయి పట్టుకొంటే వారేమంటారో? నోరార ఎన్నిమాటలతో దెప్పి పొడుస్తారో? ఇప్పుడు మన మాటలు వారు దాగి వుండి ఎక్కడ వింటున్నారో! ఆ ఘటికురాండ్రను తట్టుకోగలిగితే నా దగ్గరకు రా! నీవిక్కడ ఉండగా నిన్ను ఎంతగా సాధింపు మాటలంటారో! శ్రీ వేంకటేశా! ఇప్పుడు నన్ను కూడావు. వారందరూ నీకు తాంబూలాలు ఇవ్వడానికి ఎక్కడ వెదుకుతున్నారో? నీ పటుత్వం చూపగలిగేతే మా యింట్లోకి వచ్చి వుండవయ్యా – అని దక్షిణ నాయకుని హెచ్చరిస్తోంది.

సాళంగనాట

ఇట్టె నామోము చూచి యేమినవ్వేవు
చుట్టమవై వూరికెల్లాఁ జూపట్టినవాఁడవు ॥ పల్లవి॥
ఆసపడేవారి నెంత అలయించావు పెండ్లి –
సేసుకోరాదా యేల సిగ్గువడేవు
దోసముగా దెందరైనా దొడ్డిఁ బెట్టుకొనవచ్చు
బేసబెల్లిరేపల్లెఁ బెరిగినవాఁడవు ॥ ఇట్టె॥
తోడనే మాటాడేవారిఁ దోయనేల సరసము –
లాడరాదా యేఁటికి నీవండుకాచేవు
వాడికగా వలపులవల్లెలు వేయఁగవచ్చు
కోడెల నావులఁ గాచేగొల్లమందవాఁడవు ॥ ఇట్టె॥
ననిచి చుట్టాలై మొక్కినవారిఁ గాఁగిలించు –
కొనరాదా మరియేమి గుట్టు సేసేవు
పెనఁగులాడఁగవచ్చు బెట్టుగా శ్రీ వేంకటేశ
యెనసితి గోవర్ధనమెత్తినట్టివాఁడవు ॥ ఇట్టె॥ (150)

భావము: శ్రీ కృష్ణావతార కాలంలో గోపాలురతో కలిసిమెలసి జీవించిన కృష్ణుని ఎత్తిపొడుస్తోంది భామ.

ఓ వెంకటేశ! ఊరికందరికీ చుట్టంగా కన్పించే నీవు, నా ముఖ్యం చూచి నవ్వుతావెందుకు? నీమీద ఆశలు పెట్టుకొన్నవారిని శ్రమపెట్టే నీవు సిగ్గుపడటమెందుకు? వారిని పెండ్లాడతావా?

నీవు నీ దొడ్డిలో (ఇంట్లో) ఎందరినైనా ఉంచుకోవచ్చు. అది తప్పుగాదు. నంగనాచివై రేపల్లెలో పెరిగిన వాడవుగదా. దగ్గరగా వచ్చి మాట్లాడే వారిని దూరంగా నెట్టడమెందుకు? వారితో సరసాలాడవచ్చు గదా! అక్కడ కాపు కాయడమెందుకు? కోడెదూడలను, ఆవులను కాచే గొల్లమందకు చెందిన నీవు అలవాటు ప్రకారం ప్రేమ మాటలు వల్లె వేయవచ్చు. ప్రేమతో నీ బంధువులమని మ్రొక్కిన స్త్రీలను కౌగిలించుకోరాదా? ఎందుకు గుట్టుగా బెట్టు చేస్తావు? అలవోకగా గోవర్ధన పర్వతమెత్తిన వాడవుగదా బెట్టుగా పెనగులాడవచ్చు గదా – అని వాదిస్తోంది భామ.

శుద్ధవసంతం

వేడుకకాఁడవు నీకు వెఱపేఁటికి
యేడ నీవేమి సేసినా నెగ్గులున్నవా ॥ పల్లవి॥
నిలుచుండి నిన్నుఁ దప్పకచూచితే
చెలరేఁగి సిగ్గులతోడఁ జిమ్మి రేఁగేవు
కలపనసేసి నీకు గందము వూయరాఁగా
బలిమిఁ బచ్చడమేల పైఁగప్పేవు ॥ వేడు॥
చెంగట నుండి నీసతి చేఁతలెల్లాఁ బొగడితే
వెంగమంటా నీవేల వింత సేసేవు
వుంగరము చూతమని వొయ్యనే వేలుపట్టితే
కొంగువట్టి యాపెనెంత కొచ్చిచూచేవు ॥ వేడు॥
విడెమిచ్చి తమ్ములము వెలఁది వుమియుమంటే
నడుమ నీవేమిటికి నవ్వునవ్వేవు
యెడయక శ్రీ వేంకటేశ యీకెఁ గూడితేను
తడఁబాటులెల్లా మాని దయదలఁచేవు ॥ వేడు॥ (151)

భావము: సరసుడైన శ్రీవేంకటేశుడు సతుల నారడి పెట్టడం వర్ణించాడు. ఓ వెంకటేశా! నీవు సరదాల మనిషివి. నీకు భయమెందుకు? నీవు ఏమి చేసినా  దోషాలున్నాయా? తదేకంగా నిన్ను గాఢంగా సిగ్గులతో చూస్తే పెచ్చుమీరిపోతావు. అరగదీసిన గంధం నీ శరీరానికి పూయడానికి దరిజేరగా, బలవంతంగా నీ దుప్పటిని పైన కప్పుతావెందుకు? నీ దగ్గరగా వచ్చి నీ సతి నీ శృంగార చేష్టలన్నిటినీ పొగడితే వ్యంగ్యపు మాటలని నీవు వింతలు చేస్తావెందుకు? నీ చేతిలో వుంగరం చూద్దామని నీ వేలు పట్టుకొంటే, ఆవిడ కొంగు పట్టుకొని ఎంత ఆరళ్లు పెట్టావు. ఆమె తాంబూలము నోటికందించి నిన్న ఉమ్మి వేయమంటే, మధ్యలో నీవు నవ్వుతావేమిటికి? ఈమె నిన్ను వదలక కలిస్తే, ఏ విధమైన తత్తరం లేకుండా దయదలచావు.

దేశాక్షి

చెలియ మేనే నీకు సింగారపుఁదోఁటాయ
యెలమితో వినోదింతు విప్పుడిట్టె రావయ్య ॥ పల్లవి॥
వేసవియండలు గాసె వెలఁది విరహమున
వాసికెక్కఁ జెమటలవాన గురిసె
మోసులెత్తేపులకలు(ల?) మోలచెఁ బైరులెల్ల
యీసతినీమనోరాజ్య మేలుదువు రావయ్య ॥ చెలి॥
కమ్మటి చన్నుల నారికడపుఁగాయలు గాచె
పమ్మి మోవితేనెల పంటలు వండెను
వుమ్మగిలునూరుపుల నొనరె నాయిటిగాలి
తమ్మికంటి జవ్వనపుఁదతి వచ్చె రావయ్య ॥ చెలి॥
మఱి తోఁగిచూపుల మంచిచంద్రోదయమాయ
నెఱయ నవ్వులనేవెన్నెల గాసెను
యెఱిఁగి శ్రీ వేంకటేశ యిటు వచ్చి కూడితివి
తెఱవ నేలఁగ దినదినము రావయ్య ॥ చెలి॥ (152)

భావము: వలపుల వానలో శృంగారపుతోట పండిందని అద్భుతంగా అన్నమయ్య వర్ణించాడు. ఓ వేంకటేశా! మా చెలి శరీరమే నీకు శృంగారపు ఉద్యానవనమైంది. ప్రీతితో ఇక్కడ విహరించడానికి రావయ్యా. ఆమె విరహంలో వేసవి ఎండలు కాచాయి. ఇంతలో అధికమైన చెమటల వాన కురిసింది. అప్పుడప్పుడే మోసులెత్తిన శరీరంపై పులకలనే పైర్లు మొలిచాయి. నీ మనస్సు అనే రాజ్యానికి అధిపతివై ఈ సతిని ఏలుకొందువు రావయ్యా. గట్టి చన్నులనే కొబ్బరికాయలు కాచాయి. అందమైన పెదవులపై తేనెలపంటలు పండాయి. ఆవిరిచే ఉడికినట్లు నిట్టూర్పులలో సుడిగాలి వీచింది.

బ్రహ్మదేవుడిచ్చిన యౌవన పుష్టి ఆమెకు వచ్చింది. నీవు రావయ్యా! మత్తెక్కిన చూపులే మంచి చంద్రోదయకాంతులైనాయి. నవ్వులనే వెన్నెల కురిసింది. ఇవన్నీ తెలిసిన నీవు ఇక్కడికి వచ్చి ఆమెను కలిశావు. ఆమెను ఏలుకోవడానికి రోజూ రావయ్య!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here