అన్నమయ్య పద శృంగారం-17

0
15

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

ముఖారి

వాకిలిగాచేయట్టివనితల మిదె నేము
జోకదప్పకురే మీరు సుదతులాలా ॥పల్లవి॥
మచ్చిక నాతఁడు నాకె మాటలాడుకొనఁగాను
అచ్చముగ మీరేల ఆలకించేరే
యిచ్చగించి వేడుకతో నేకతాన నుండఁగాను
కొచ్చి తెరయెత్తేరేలే కొమ్మలాలా ॥వాకి॥
కొత్తగా నద్దాలు చూచుకొని వారు నవ్వఁగాను
చిత్తిణిచేఁతలనేల చేరవచ్చేరే
హత్తి పందేలతోడుత నటు చదురంగమాడే –
రెత్తులేల చెప్పేరే యింతులాలా ॥వాకి॥
శ్రీ వేంకటేశుఁడు లోన దేవులఁ జెనకఁగాను
యీవేళఁ గానుకలేల యియ్యవచ్చేరే
వేవేలురుతులఁ గూడి వెసఁ బీఁటపై నుండఁగా
బావంటాఁ బైకొనేరేలే పడఁతులాలా ॥వాకి॥ (153)

భావము: స్వామి ఒక కాంతతో ఏకాంతంలో వుండగా ఇతర వనితలు ఎగబడి రావడాన్ని తెగడుతోంది ఓ వనిత.

ఓ వనితలారా! మేమందరమూ నీకు ద్వారపాలకులము. మీరు జతదప్పవద్దు. ప్రేమతో అతడు, ఆమె ముచ్చటలాడుకొంటుండగా మీరు అదే పనిగా వచ్చి వింటారెందుకు? ఇష్టపడి వారిద్దరు ఏకాంతంలో వుండగా మీరు వచ్చి (దోమ) తెర ఎత్తి చూస్తారేమిటే. వారిద్దరూ ఎదురెదురుగా నిలబడి అద్దాలు చూచుకొని నవ్వుతుండగా జారిణి పనులతో మీరు దగ్గరగా వస్తారెందుకు? ఇద్దరూ హత్తుకొని పందేలు వేసుకొని జూదమాడుతుంటే మీరు పక్కన జేరి ఎత్తుకు పైఎత్తులు చెబుతారెందుకు? శ్రీ వేంకటేశుడు లోపల తన దేవితో క్రీడించగా, ఈ సమయంలో మీరేల కానుకలివ్వడానికి వచ్చారే. ఓ పడతులారా! అనేక విధాలైన రతులలో మునిగితేలి శయనించి వుండగా ‘బావా!’ అని పిలుస్తూ మీరు పైనబడతారెందుకే.

గౌళ

చెలులాల నేనతని చెంగటనే వుండేఁగాని
పిలిచి బంగారమువీఁట వెట్టరే ॥పల్లవి॥
మొగమాటదాన నేను మోహించినదాన నేను
అగడుగాఁ బతి నేమీ నాడఁజాలనే
నగవు వచ్చు నాకు నంటున మాటలాడితే
మిగులాఁ దనతలఁపు మీరే యడుగరే ॥చెలు॥
యెమ్మెలేనిదాన నేను ఇచ్చకపుదాన నేను
వుమ్మడిదంటతనాన నొరయఁజాల
కమ్ముకొనీ సిగ్గు నాకుఁ గానుకిచ్చేనంటేను
నిమ్మపండ్లివే రెండు నేఁడు మీరె యియ్యరే ॥చెలు॥
దేవులైనదాన నేను తేజపుదాన నేను
శ్రీ వేంకటేశ్వరు గోరఁ జెనకఁజాల
కావించి నన్నేలె మతిగరఁగీఁ గొసరేనంటే
యీవల నాపొందు మీరే యీడేరించమనరే ॥చెలు॥ (154)

భావము: పతిపై గాఢానురాగం గలిగిన ఓ సతి తన పక్షాన రాయబారం నడపమని చెలులను ప్రాధేయపడుతోంది.

ఓ సఖులారా! నేను అతని సమీపంలోనే ఉన్నాను. అతనిని పిలిచి బంగారుపీట వేయండి. మొహమోటం కలిగిన దానిని, ఆయనపై మోహపడినదానను. వదరుపోతుగా పతిని నేను దూషింపజాలను. దగ్గరగా చేరి మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది. ఆయన మనసులో ఏముందో మీరే అడిగి చూడండి. విలాసాలు లేని దానను, ప్రీతిగలదానను. ఉమ్మడిగా వున్నపుడు ధైర్యంగా తాకలేను. దగ్గరగా వచ్చి సిగ్గును కానుకగా ఇస్తానంటే రెండు నిమ్మపండ్లు మీరే ఈ రోజే ఇవ్వండి. ఆయనకు సతి అయినదానను. ప్రకాశం గలదానిని. అట్టి నేను శ్రీవేంకటేశుని గోటితో గిల్లజాలను. అది పనిగా నన్ను ఎందుకు మనసు కరిగేలా కొసరి కొసరి అడుగుతాడు. ఇటీవల నాతో సఖ్యాన్ని సంతోషింపజేయమని మీరే చెప్పరే – అని సఖులను ప్రాధేయపడుతోంది.

ఆహిరి

ఏమిసేతుఁ జెప్పవయ్య యేది నాకు నూడిగము
కామించి వచ్చితివి నాకడకు నేఁడిపుడు ॥పల్లవి॥
నిదుర గన్నులఁ దేరీ నిమ్మపండు దెత్తునా
చెదరినవి కురులు చిక్కుదీతునా
పెదవిఁ గెంపులు నిండెఁ బేంట్లు రాలుతునా
మదమువలెఁ గారీఁ జెమటలు దుడుతునా ॥ఏమి॥
బడలివున్నాఁడవు పన్నీరు చల్లుదునా
వెడలీ నిట్టూర్పులు విసరుదునా
తడఁబడీ నడపు కైదండ నీకు నిత్తునా
కడువాడె మోము బాగాలు చేతికిస్తునా ॥ఏమి॥
భావ మెందో వున్నది పానుపు వరుతునా
దైవారీఁ గళలు నీకద్దము దెత్తునా
శ్రీ వేంకటేశుఁడ నాసేవ మెచ్చి కూడితివి
నీవు వొంటినున్నాఁడవు నేఁ దోడు వండుదునా ॥ఏమి॥ (155)

భావము: ఏకాంతంలో వున్న వేంకటేశునితో సతి ఏ సేవలో కోరుకోమని ప్రాధేయపడుతోంది.

ఓ వేంకటేశా! నీకు ఏ విధమైన సేవలు చేయగలనో చెప్పవయ్యా! ఈనాడు నీవు నన్ను మోహించి నా దగ్గరకు వచ్చావు. నిద్ర నుండి లేచి వచ్చి నీ కన్నులు తుడిచి నిమ్మపండు తెచ్చి చేతిలో పెట్టమంటావా? నీ తలవెండ్రుకలు చెదిరినవి. వాటిని సరిదిద్దమంటావా? నీ పెదవిపై గంటులు పడ్డాయి. ఆ పెళ్లలు తుడిచేదా? సంతోషంతో కారే చెమటలు తుడిచేదా? అలసిపోయి వున్నావు పన్నీరు చల్లేనా? బయటికి వచ్చే నిట్టూర్పులతో విసిరేనా? తడబడి నడుసున్న నీకు నా చేతిని అండగానిచ్చేదా? నీ ముఖం బాగా వాడిపోయింది. తాంబూలం చేతికిచ్చేదా? నీ మనసులో భావం ఎక్కడో వుంది. పానుపు పరచేదా? నీ ముఖకళలు సన్నగిల్లాయి. అద్దము తెచ్చి చూపనా? ఓ స్వామీ! నీవు నా సేవలు మెచ్చి కలిశావు. నీవు ఒంటరిగా ఉన్నావు. తోడుగా నేను పండుకోనా? – అని జాణతనంతో మాట్లాడింది సతి.

రామక్రియ

ఏల సరసములాడే వెవ్వరితోనైనాను
కాలుదాఁకినాతోనే కావలెఁగాక ॥పల్లవి॥
చెలికత్తెలకెల్లాఁ జెనకఁగవచ్చునా
వొలిసి నీపట్టపుదేవులకుఁగాక
పిలిచి పేరటాండ్లు పెండ్లిబండెక్కుదురా
అలరి సేసవెట్టినయాపె గాక ॥ఏల॥
వద్దనున్నవారెల్ల వలపులు చల్లుదురా
వొద్దికై మేనమరఁదు(ద?) లొరయుఁగాక
పొద్దువానిచుట్టాలు బువ్వానకు వత్తురా
అది కంకణము గట్టినాపై వచ్చుఁగాక ॥ఏల॥
పొరుగు పోరచివారు భోగించవత్తురా
గరిమఁ గాఁగిటిలోనికాంత కౌఁగాక
యిరవై శ్రీవేంకటేశ యేలితి విందుకే నన్ను
అరసి నీవు మన్నించినాపై యాలౌఁగాక ॥ఏల॥ (156)

భావము: దక్షిణ నాయకుని చెలులు నిలదీసి అడుగుతున్నారు. కట్టుకున్న భార్య వుండగా ఇతరులతో ప్రమేయమేల? అని.

శ్రీ వేంకటేశ! నీ కాలుతొక్కి పెండ్లాడిన వనితతో గాక ఇతరులతో సరసాలాడేవెందుకు? నీ పట్టపురాణులకే గాక మిగతా స్నేహితురాండ్రను తాకవచ్చునా? నీపై సేసలు చల్లిన వనితగాక మిగతా పేరంటాండ్లు అందరు పిలిచి పెండ్లి బండి ఎక్కడం న్యాయమా? నీ మేనమరదలు దగ్గర వుండగా నీ దగ్గర వున్న వనితలందరూ ప్రేమ జల్లులు చల్లుతారా? నీ చేతికి కంకణం కట్టిన వనిత వుండగా పనీపాటాలేని బంధువులు బంతి భోజనానికి వస్తారా? నీ కౌగిట్లో వున్న కాంతయేగాక ఇరుగు పొరుగు యాచించే స్త్రీలు నీతో భోగిస్తారా? నీవు మన్నించిన స్త్రీగాక ఇతరులకేమిపని? నన్ను యిందుకే ఏలావు స్వామీ! అంటోంది.

సామంతం

ఏమిసేతు నమ్మలాల యెందుకౌను నాయకుఁడు
బూమిలోఁ జెప్పఁగొత్త యీ పురుష విరహము ॥పల్లవి॥
తొయ్యలి రాకకుఁ బతి తొంగిచూడఁబోతేను
దయ్యము వలెఁ జంద్రుఁడు తలచూపెను
చయ్యన నందు కతఁడు జడిసి తలవంచితే
నుయ్యివలెనే తోఁచె నూలుకొని మనసు ॥ఏమి॥
మగువయెలుఁగు విన మతి నాలకించితేను
పగవానిరీతినే పల్కెఁ గోవిల
వెగటై యందు కతఁడు వీనులు మూసుకొంటే
మొగులువలెనే కప్పె ముంచుక విరహము ॥ఏమి॥
నలినాక్షిరూపు మనసునఁ దలఁచఁబోతే
చిలుకుగాలమై తోఁచెను మరుఁడు
అలసె శ్రీ వేంకటేశుఁ డంతలోన సతి గూడె
నెలకొని కొండవలె నిలిచె సంతోసము (157)

భావము: సాధారణంగా నాయికల విరహాన్ని కవులు వర్ణిస్తారు. ఇక్కడ అన్నమయ్య పురుష విరహాన్ని కల్పన చేశాడు విచిత్రంగా.

ఓ అమ్మలక్కలారా! నేనేమి చేసేది? మా నాయకుడేమవుతాడుగదా! భూలోకంలోనే వింత గొలిపే ఈ పురుష విరహం విన్నారా? కన్నారా? తన ప్రియసఖి వస్తోందా? అని తొంగి చూడబోతే చంద్రుడు దయ్యమువలె ఆకాశంపై పొడచూపాడు (చంద్రోదయమైంది). వెంటనే అతడు అందుకు భయపడి తలవంచితే మనసంతా గుబులుపుట్టి నూతివలె తోచింది. తన సఖి గొంతు విందామని మనసుపడి వింటే కోకిల పగవానివలె కూసింది. దానికి వెగటుచెంది అతడు చెవులు మూసుకొంటే విరహము మేఘంవలె ముంచుకొచ్చి కప్పివేసింది. ఆ వనిత రూపం మనసులో భావించబోతే మన్మథుడు గాలం వేసినట్లయింది. అలసి సొలసిన వెంకటేశుడు అంతలోనే సతిని గూడాడు. వెంటనే సంతోషము కొండవలె నిలిచి అడ్డుపడింది.

చంద్రోదయము, కోకిలారావాలు, మన్మధుని బాణాలు వెంకటేశుని విరహాన్ని తీవ్రం చేశాయని వినూత్నంగా అన్నమయ్య చెప్పాడు.

భైరవి

ఏమని చెప్పుదునే మీకింతులాల
చేముంచి నాకు వలపు చిమ్మిరేంచె నతఁడు ॥పల్లవి॥
మలసి నాపతిరూపు మతి నెంతదలఁచినా
తలపోతలే ని తమివోదు
కలలోన నెటువలెఁ గాఁగిలించుకొనినాను
వెలినున్న మేనిమీఁదివిరహము దీరదు ॥ఏమ॥
యేలినవానిగుణాలు యెంత వీనుల వినినా
ఆలకింపులే కాని ఆసలు వోవు
పాలుపడి యాతఁడుఁ(డుం?) డేపానుపుపైఁ బండినాను
తాలిమితో నావేడుక తనివొందదు ॥ఏమ॥
ముంగిటఁ దనరాకకు మొగమెత్తు కుండినాను
తొంగిచూపులే కాని తుందుడుకు వోదు
చెంగట నంతలో వచ్చి శ్రీవేంకటేశుఁ కూడె
కుంగని నాసంతోసము గురుతువెట్టరాదు ॥ఏమ॥ (158)

భావము: విరహ బాధతో వున్న నాయిక తన బాధలు చెలులకు చెబుతోంది:

ఓ వనితలారా! నాకు ప్రేమ తలపులు నా అధీనం తప్పి రేగగొట్టాడు. మీ కేమని చెప్పేను. నా భర్త రూపాన్ని మనసులో ఎంత ఊహించినా ఆలోచనలేగాని తృప్తి లేదు. కలలోనెలా కౌగిలించుకున్నా బయట నా శరీరంపై విరహబాధ తీరదు. నన్నేలిన నా విభుని గుణగుణాలు చెవియోగి వినినా, ఆలకించి వినడమేగాని, అతనిపై ఆశలు తీరవు. వశపరచుకొని అతడున్న పాన్పుపై పండుకొన్నా ఓర్పుతో నాలోని వేడుక తృప్తిపొందదు. నా పతి రాకకోసం వాకిటి ముంగిట కూచొని మొహమెత్తి చూస్తూ కూచున్నా తొంగి తొంగి చూడడమేగాని, తొందరపోదు. అంతలోనే పక్కకు చేరి వేంకటేశుడు కూడాడు. తగ్గని నా సంతోషానికి హద్దులు లేవు. ఎంతటి అభిమానమోగల ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది.

పాడి

కరఁగి యిందు కతఁడు కాఁగిలించుకొనవద్దా
ఇరవెఱింగేల యల ఇంచెనోకాక ॥పల్లవి॥
మోమునఁ జెమటగారీ మొక్కితేనే కొప్పు జారీ
యేమని వినయాలు పతి కెంతసేసేవే
కోమలపుదానవు సిగ్గులు నీకిఁ(కిం?) కా నానవు
గోమున నేపొద్దుదాఁ కాఁ గొలువుసేసేవే ॥కరఁ॥
చిగురాకు నీమోవి చెదరీఁ గమ్మనితావి
పొగడి పొగడి యెంత పొందుచూపేవే
దగదొట్టే నూరుపులు దయరేఁచీ నేరుపులు
నగవు లెందాఁకా నవ్వి నయములు చూపేవే ॥కరఁ॥
సారెం బయ్యద వదలీ చనుఁగవ గదలీని
చేరి చేరి యెంతవడి సేవసేసేవే
యీరీతి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
తారుచు నెం తాతనిచేఁతలకు లోనయ్యేవే ॥కరఁ॥ (159)

భావము: నాయిక చర్యలను చెలులు పరిహాసమాడుతున్నారు.

ఏమే సఖి! నీపై మోహపడి అతడు కౌగిలించుకోవద్దా? నీ కళ స్థానము తెలుసుకొని ఎందుకు నిన్ను అలసిపోయేలా చేశాడో? నీకు ముఖంపై చెమటలు కారాయి. నీవు మొక్కుతుంటే కొప్పు జారింది. వినయాలుపోతూ ఎంత సేవలు పతికి చేశావే! సుకుమారివైన నీకు సిగ్గులు ప్రియము. చిగురాకు వంటి నీ పెదవిపై కమ్మని వాసనలు చెదరాయి. పొగడ్తలతో ఎన్ని రకాలుగా స్వామికి పొందుచూపావే! దాహంగొన్న నిట్టూర్పులు, దయను పెంచే నేర్పులు ఎంతో నవ్వులు ఎందుకు నవ్వి ప్రియాన్ని చూపుతావే. మాటిమాటికీ పైట సడలగా చనుదోయి కదులుతోంది. దగ్గరగా చేరి ఎంతసేపు సేవలు చేస్తావే. ఈవిధంగా శ్రీ వేంకటేశుడు నిన్ను కలిశాడు. కాముకురాలివైన నీవు ఆతని చేష్టలకు ఎంతగా లోనవుతావో గదా- అని ఎకసెక్కములాడుతోంది.

బౌళి

ఎగసక్కేలే సేసి నిదే మీతఁడు
నగవు వచ్చీఁ దననాఁటకములకును ॥పల్లవి॥
నేఁ గానుకిచ్చిన గొప్పతమ్మిపువ్వందుకు
వేరొకతెచన్ను దాఁకవేసీనె తాను
సారెకునెవ్వతో మేనిజవ్వాది పై నడిసితే
మీరమీరి యది నామేనఁ దుడిచీనే ॥ఎగ॥
చేతికిచ్చినవిడెము సేసి పుక్కిటఁ బెట్టుక
కాతరానఁ బెట్టీఁ దమ్మకడ(డి?) దానికి
రాతిరెల్లా జాగరాలు రతి నెందోసేసి వచ్చి
యీతల నిద్రించీ మాయింటిలోనను ॥ఎగ॥
అద్దము నాచేఁ తెప్పించి యండనున్న సతిమోము
నిద్దమై తనమోమునీడ చూచీనే
అద్దుక శ్రీవేంకటేశుఁ డల్లాకె మేనిగందము
ఉద్దండాన నాకాఁగిట నొనర నంటించినే ॥ఎగ॥ (160)

భావము: దక్షిణనాయకుడైన విభుడు తన యితర ప్రియురాండ్రపై మోహం చూపడాన్ని ఓర్చుకోలేని వనిత ఆక్రోశమిది.

ఏమమ్మా! ఈతడు ఎకసెక్కాలు చేస్తున్నాడు. ఇదేమి విచిత్రమే. అతడు చేసే నాటకాలకు నవ్వు పుడుతోంది. ప్రీతితో నేను కానుకగా ఇచ్చిన తామరపూవు అందుకొని వేరొకతె చనుదోయి తాకేలా వేశాడు. మాటిమాటికీ ఎవ్వతో తన శరీరంపై జవ్వాది పూస్తే, హద్దుమీరి అది నా శరీరంపై తుడిచాడే. నేను చేతికిచ్చిన తాంబూలము తన పుక్కిట బెట్టుకొని ఆదరంతో వేరొకతెకిచ్చాడు. రాత్రి అంతా వేరెక్కడో జాగరాలు చేసి రతి చేసి, యిక్కడ మా యింటికి వచ్చి నిద్రించాడే. అద్దం నాచేత తెప్పించి, తన పక్కనున్న సతి ముఖాన్ని తన ముఖం నీడలో చూచాడే. శ్రీవేంకటేశుడు ఆమె శరీరంపై గంధం అద్దుకొని ఘటికుడై నా కౌగిలిలో నటిస్తున్నాడే!

మనసొక చోట, మనిషి ఒకచోట అన్న తీరు ఇది.

సాళంగనాట

సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాఁడు
బిగ్గెం గాఁగిలించుకొని పెనఁగినఁగాక ॥పల్లవి॥
పెదవిపై మాటలఁ బ్రియములు వుట్టునా
వుదుటుగుబ్బలఁ బతి నూఁదినఁగాక
సదరపుఁజెనకుల చవులు వుట్టీనా
సదమదముగ రతి సలిపినఁగాక ॥సిగ్గు॥
సెలవుల నవ్వితేనే చిత్తము గరఁగునా
సొలయుచు మోవిచవి చూపినఁగాక
ములువాఁడిచూపుల మోహములు వుట్టునా
లలిఁ దమ్ములముపొత్తు గలసినఁగాక ॥సిగ్గు॥
సరసములాడితేనే సంగాతా లెనయునా
సరుసఁ దనువు లొక్కజ(జం?) టైనఁ గాక
యిరవై శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
పరుపుపైనే చాలునా వురమెక్కినఁగాక ॥సిగ్గు॥ (161)

భావము: ముగ్ధయైన సఖికి శృంగార రహస్యాలు వల్లెవేస్తున్నారు చెలులు.

ఏమమ్మా! గట్టిగా కౌగిలించుకొని పెనగులాడితే తప్ప నీవు సిగ్గుపడి భయపడితే పురుషుడు. చేతికి చిక్కునా? గట్టివైన చనులతో పతిని తాకితే తప్ప పెదవి మీది మాటలకు ప్రీతి కలుగుతుందా? నలిగిపోయేలా రతి చేస్తే తప్ప స్పష్టమైన నొక్కులలో రుచులు పుట్టిస్తాయా? పారవశ్యంతో పెదవి రుచి చూపితేగాక పెదవులపై చివర నవ్వితేనే మనసు కరగుతుందా? అందంగా తాంబూలం ఇచ్చి పొందు కలిసితేగాక ములుకులవంటి క్రీగంటి చూపులతో మోహాలు పుడతాయా? పక్కనే చేరి రెండు శరీరాలు ఒక జంట అయితే గాక సరససల్లాపాలు ఆడితే స్నేహాలు వృద్ధి పొందుతాయా? ఇంతలోనే వేంకటేశుడు నిన్ను కలిశాడు. నీవు గుండెలపై చేరితేగాక, పరుపుమీదికి చేరితే సరిపోతుందా? – అని సరదా పట్టిస్తోంది చెలి.

సౌరాష్ట్రం

ఏమిచెప్పేవే మాతో నింపులైన నీసుద్దులు
ప్రేమముగలవారికి పెనఁగులా టరుదా ॥పల్లవి॥
నవ్వుతా మాటలాడేవు నయగారాలే సేసేవు
యివ్వల నీకతఁడు మోహించు టరుదా
పువ్విళ్లూర నేపొద్దు నొద్దనే కాచుకుండేవు
నివ్వటిల్ల చనవులు నీకు నిచ్చుటరుదా ॥ఏమి॥
తేలించి చూచేవు తేనెలమోవి చూపేవు
కోలుముందై పతి మరుగుట యరుదా
తాలిమితో సన్నలనే తరితీపులే చల్లేవు
వాలాయించి నీకతఁడు వసమవు టరుదా ॥ఏమి॥
ఇచ్చకములే సేసేవు యిన్నిటా మెప్పించేవు
కొచ్చి శ్రీవేంకటేశుఁడు గూడుటరుదా
నిచ్చలు నన్నేలించేవు నీ వలమేలుమంగవు
యిచ్చట నీకితఁ డిట్టె యిరవౌటరుదా ॥ఏమి॥ (162)

భావము: అలమేలుమంగను చెలులు ఆట పట్టిస్తున్నారు.

ఏమమ్మా! అలమేలుమంగా! మీరు ప్రీతితో గూడిన ముచ్చటలు మాకు ఎన్ని రకాలుగా చెబుతున్నావే! ప్రేమభావన గలవారి మధ్య పెనుగులాటలు అరుదా? నవ్వుటాలుగా మాట్లాడుతూ నీ నయగారాలను వొలకబోస్తున్నావు. ఇక్కడ నిన్ను అంతగా ప్రేమించడంలో ఆశ్చర్యమేముంది? ఉత్సాహం చూపుతూ అన్ని వేళలా అతని వద్దనే కూచొని వుంటున్నావు. ప్రేమలతో గూడిన చనువులివ్వడంలో ఆశ్చర్యమేముంది? పారవశ్యంతో చూచి తియ్య తేనెల పెదవులందించావు. మున్ముందుగా నీ పతి నిన్ను మరగడంలో అరుదేమి? విరహంతో సైగలు చేసి ప్రేమను వొలకబోస్తున్నావు. నీ నిర్బంధంలోపడి అతడు నీకు వశంవదుడు కావడం అరుదేమి? మెరమెచ్చు పనులు చేస్తూ అన్ని రకాలుగా మెప్పిస్తున్నావు, శ్రీవేంకటేశుడు నిన్ను గుదిగుచ్చి కూడటం అరుదేమి? నీవు అలమేలుమంగవు. ఇక్కడ పతితో నన్ను ఏలించావు. ఇక్కడ నీకతడు సులువుగా ప్రీతిపాత్రుడు కావడం అరుదా? అని సరసాలాడింది చెలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here