అన్నమయ్య పద శృంగారం-19

0
12

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

పాడి

చెప్పేదేమి ఇఁకను నీచిత్తము గాక
తప్పులెంచి నే నిన్నుఁ దడవఁగఁగలనా ॥పల్లవి॥
తూకొని మాటలెల్లాను దొంతులువెట్టేవు గాక
ఆకెతోడ నేకతములాడవా నీవు
సాకిరిచెప్పేవారిని సన్నలేల సేసేవు
దీకొని నీచేఁతలు నేఁ దెలుపఁగఁగలనా ॥చెప్పే॥
పాటించి నవ్వులు నవ్వి భ్రమయించే వింతేకాక
సూటిగా నా పెమొగము చూడవా నీవు
నీటున నీకన్నులలో నిద్దురేలణఁచేవు
జూటరినీ మహిమలు సోదించఁగఁగలనా ॥చెప్పే॥
వేసదారివినయాలు రాసులువోసేవు గాక
ఆసపడి యాపెచన్ను లంటవా నీవు
లాసి శ్రీ వేంకటేశ మెల్లనె యేల చొక్కించేవు
నీసుద్దు లెన్నఁటికిని నే మఱవఁగలనా.. ॥చెప్పే॥ (173)

భావము: దక్షిణ నాయకుడైన పతిని నాయిక నర్మగర్భంగా ప్రశ్నిస్తోంది.

శ్రీవేంకటేశ! నీ చిత్తం వచ్చినట్లు చేస్తావు, ఇంక నేను చెప్పేదేముంది? నీ తప్పులను లెక్కపెట్టి నీతో ప్రస్తావించగలదాననా? దెప్పిపొడపు మాటలనన్నింటినీ నీవు వరుసలు పేరుస్తావుగాక నీవు ఆమెతో ఏకాంతంలో క్రీడించలేదా? సాక్ష్యాలు చెప్పే వారికి సైగలు చేస్తావెందుకు? నిన్ను ఎదిరించి నీ చేష్టలు నేను వివరించగలనా? నా వద్ద నవ్వులు నవ్వి మాయ చేస్తున్నావు. ఆమె ముఖాన్ని సూటిగా నీవు చూడలేదా చెప్పు! అందమైన నీ కళ్లలో కన్పిస్తున్న నిద్రమత్తును అణచుకోవడం దేనికి? మోసకారివైన నీ మహిమలను నేను వెదకగలనా? బహువిధాల వేషాలు ధరించే నీవు వినయాలు కుప్పలుపోసి నటిస్తున్నావు గానీ ఆశపడి ఆమె చనుదోయిని ముట్టుకోలేదా? నాకు దగ్గరగా సమీపించి నన్ను పారవశ్యంలో ముంచనేల? నీ మాయ మాటలన్నీ నేను మరచిపోగలనా స్వామి! అని నిందిస్తోంది.

కన్నడగౌళ

పెంచితి నిన్ను నేము పెద్దవైతి వింతలోనే
యెంచిచూడ నీకతలు యెవ్వరు నేరిపిరే ॥ పల్లవి॥
చిత్తడిచెమలేల చిందీనే
వత్తివలె మేనేల వసివాడీనే
చిత్తిణివిద్యలనేల చిమిడేవే
యిత్తల నేఁ డిఁ(డిం?) తేసి యెక్కడఁ గలిగెనే ॥పెంచి॥
నెమ్మది నివ్వెరగులు నీకేఁటికే
వుమ్మగిలునిట్టూర్పు లెందుండివచ్చెనే
కుమ్మరింపుఁజింతలేల గుబ్బతిలీనే
యిం(యి)మ్ముల నీ చేఁతలకు నేరీతి నోమితివే ॥పెంచి॥
చెక్కునఁబెట్టినచేతిసిగ్గు లేఁటికే
ముక్కర గదల నవ్వి మొఱఁగనేలే
యిక్కడ శ్రీ వేంకటేశుఁ డేలెనా నిన్ను
యెక్కె మోమునఁ గళలు యిన్నిటా మేలే ॥పెంచి॥ (174)

భావము: చెలులు ప్రౌఢతనం తెచ్చుకున్న సఖిని ఆటపట్టిస్తున్నారు.

ఓ చిత్తినిజాతి స్త్రీ! మేమూ నిన్ను చిన్నతనం నుండి పెంచి పోషించాము. ఇంతలోనే నీవు పెద్దదానినైనావు (యౌవనవతివి) ఈ రకమైన కధలు నీకు ఎవరు నేర్పారే? మిక్కిలి తడి గలిగిన చెమటలు చిందుతున్నాయే. నీ శరీరమంతా వత్తివలె వాడిపోయింది. చిత్తిని జాతిస్త్రీ నేర్చిన విద్యలను ఎందుకు చిందిస్తున్నావే? ఈ విధమైన స్థితి ఈనాడు యింతగా ఎక్కడ కలిగిందే. నీ మనసులో ఆశ్చర్యాలు ఎందుకే. నీలో ఉడికిపోయే నిట్టూర్పులు ఎక్కడి నుండి వచ్చాయే? అధికమైన ఆలోచనలు ఎందుకు పుట్టాయి? ఈ విధమైన నీ పనులకు నీవు ఏవిధంగా నోములు నోచావో గదా! బుగ్గపై చేయిపెట్టుకొని సిగ్గు పడనేటికే? ముక్కర కదిలేటట్లు నవ్వి మొరగడమెందుకే? ఇక్కడ శ్రీ వేంకటేశుడు నిన్ను ఏలినందున నీ ముఖంపై కళలు అన్ని రకాలుగా మేలైనట్లు అధికమైనాయి అని చెలి ఉడికిస్తోంది.

రేకు 830

గుజ్జరి

అందులోనే కానవచ్చె నన్ని పనులు
మందలించి యాపెతోడిమాటలు మానుమా ॥పల్లవి॥
మనసిచ్చి నీవు నన్ను మన్నించేవాఁడవైతే
ననిచిన యాకెతోడ నవ్వకుండుమా
యెనసి యేపొద్దు నన్ను నెడయనివాఁడవైతే
పొనిఁగి యాపెయింటికిఁబోక ఇట్టె వుండుమా ॥అందు॥
చేకొని నాచెప్పినట్టు సేసేటి వాఁడవైతే
జోకలుగా నాపెదిక్కు చూడకుండుమా
నాకిచ్చినబాసతోడ నమ్మించినవాఁడవైతే
దాకొని యాపెపొందులు తలఁచక వుండుమా ॥అందు॥
మిక్కిలి నామీఁదను మేలుగలవాఁడవైతే
అక్కరతో నాపెకాని కందకుండుమా
యిక్కడ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
అక్కున నన్నుఁబెట్టితి వాకె నంటకుండుమా ॥అందు॥ (175)

భావము: దక్షిణ నాయకుడైన విభునితో నాయిక తనపై ప్రేమవర్షం కురిపించమని ప్రాధేయపడుతోంది.

శ్రీ వేంకటేశ! నేను నీ అలమేలుమంగను సుమా! నీవు ఆమె యింట్లో చేసిన అన్ని పనులు నాకు తెలిశాయి (కనిపించాయి). ఆమె నయగారాలను మందలించి, ఆమెతో మాట్లాడటం ఇకపై మానుకో! నీవు నాపై మనసుపడి, మన్నించేవాడివైతే ఇష్టపడుతున్న ఆమెతో నవ్వులాటవద్దు. అన్నివేళలా ప్రేమతో నన్ను వదలనివాడవైతే, పూనికతో ఆమె ఇల్లు తొక్కకుండా ఇక్కడే నా వద్ద ఉండిపో! నేను చెప్పిన మాట ప్రకారం చేసేవాడివైతే వేడుకగా ఆమెవైపు చూడకుమా! నాకిచ్చిన మాట నిలుపుకొనే వాడివైతే, నన్ను నమ్మించిన వాడివైతే ఆమెను సమీపించి ఆమెతో పొందులు కావాలనే ఆలోచన చేయకు! నాకు అధికంగా మేలుచేసేవాడివైతే అక్కరపడి ఆ నయగారాల వనితకు అందకుండా వుండు! ఇక్కడ స్వామీ! నన్ను అక్కున చేర్చుకున్నావు. ఇకపై ఆమెను ముట్టుకోవద్దు – అని అలమేలుమంగ కట్టడి చేసింది.

బౌళి

ఈకె గలిగివుండఁగా నింకా నొకరా నీకు
పైకొని పెండ్లాడితివి పదారువేలను ॥పల్లవి॥
కలికితనాల నాపై కతలుచెప్పనేరుచు
వలపులు చల్లుతా నవ్వఁగనేరుచు
మెలుపున వద్దనుండి మేను విసుకనేరుచు
తిలకించి చిటుకలు దియ్యనేరుచుక ॥ఈకె॥
చక్కనిది జవరాలు సరసమాడనేరుచు
పక్కన మదిగరఁగఁ బాడనేరుచు
చక్కెరమోవి చూపి చవిపుట్టించనేరుచు
మిక్కిలిరతుల నిన్ను మెప్పించనేరుచు ॥ఈకె॥
పొందినచిత్తమురాఁ గాఁపురము సేయనేరుచు
ముందుముందే వేఁడుకొని మొక్క నేరుచు
అందపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
యిందె నిన్నుఁ గూడె నన్ను సేవించాఁ దా నేరుచు ॥ఈకె॥ (176)

భావము: పదహారువేలమందిని పెండ్లాడిన నిన్ను ఈ అలమేలుమంగ అన్ని వేళలా అలరింపగలదని చెలులు విన్నవిస్తున్నారు.

శ్రీ వేంకటేశ! ఈమె అందమైన అలమేలుమంగ. ఇక్కడే నిన్ను కలిసింది. నిన్ను సేవించడం ఆమె నేర్చుకొంది. ఈమె వుండగా నీకు మరొకరెందుకు? పైపెచ్చు పదహారువేల మందిని పెండ్లాడావు. మా చెలి కలికితనంతో రకరకాల కథలు చెప్పగలదు. ప్రేమలు వొలకబోస్తూ నవ్వగలదు. ఉల్లాసంగా నీ దగ్గరే వుండి నీ వొళ్లు పట్టగలదు (పాద సేవనం). నిన్ను చూచి చిటికెలు వేయగలదు. అందమైన ఈ యువతి నీతో సరసాలాడగలదు. నీ పక్కనే జేరి మనసు కరిగేలా పాడగలదు. తన తియ్యని పెదవి రుచిచూపగలదు. అధికమైన రతులలో నిన్ను మెప్పించగలదు. నిన్ను పొందాలనే ఆలోచనతో నీతో కాపురం చేయగల నేర్పరి. ముందుగానే వేడుకొని నీకు మొక్కగలదు. – ఇదిగో మా చెలి అలమేలుమంగ అని సఖి పలుకుతోంది.

వరాళి

నీవే ఇంత నేయంగాను నే మాపెను దూరేదేమి
వోవలఁ బెట్టఁగా నాపెవోజ చక్కనయ్యీనా ॥పల్లవి॥
సంగడిఁబెట్టుక నీవు సరసములాడఁగాను
కంగి యాపె సవతులఁ గైకొనీనా
అంగవించి మూలనుంచు కాపె నీవు పూజించఁగా
సంగతి నెవ్వరినైనా సరకుగొనీనా ॥నీవే॥
ప్రియపడి నీవే ఇంత పెద్దరికానఁ బెంచఁగా
నయాన వినయా లాపె నాకుఁ జేసీనా
దయతో నాపెగుణాలు తగ నీవు వొగడఁగా
నియతాన వంచనలు నేరఁబోయీనా(?) ॥నీవే॥
వలచి యాపెకు నీవు వసమై వుండఁగాను
తిలకించి మొక్కినా తేరిచూచినా
అలమేలుమంగపతివైన శ్రీ వేంకటేశ్వర
యిల నన్నుఁ గూడితివి యీకె మెచ్చకుండీనా ॥నీవే॥ (177)

భావము: మరొక సతిపై ప్రేమను కనబరచే నాయకునితో అలమేలుమంగ తన అవస్థను వెల్లడిస్తోంది.

శ్రీ వేంకటేశ్వర! నీవే యింతలేసి పనులు చేయగా, మేమింక ఆమెను దూషించేది ఏముంది? నీవు బలవంత పెట్టగా ఆమె స్వభావం చక్కబడుతుందా? నీవు స్నేహంతో ఆమెతో సరసాలాడితే పరవశించిపోయిన ఆమె సవతులను లెక్కపెడుతుందా? నీవు ఆమెను దగ్గరగాజేరి రహస్యంగా వుంచి పూజిస్తే దగ్గరలో వున్న ఇతరులను లెక్కబెడుతుందా? నీవు ఎంతో ప్రీతితో ఇంత పెద్దరికంతో పెంచగా నయమైన రీతిలో ఆమె నాతో వినయంగా ఉంటుందా? ఎంతో దయతో నీవామె గుణగణాలను పొగడగా తప్పకుండా వినయాలు నేర్చుకొంటుందా? నీవామెను ప్రేమించి ఆమెకు వశపడి ఉండగా మేము ఆమెను చూచి మొక్కినా మావైపు తేరిపార చూచేనా? అలమేలుమంగ భర్తవైన ఓ స్వామీ! భూమిపై నన్ను కలిశావు. ఆమె మెచ్చదా?

కురంజి

ఎఱిఁగించవయ్య నాకునేల దాఁచేవు
మెఱసి యాపెకు నీకు మేనవావై యున్నది ॥పల్లవి॥
ముంగిట మొక్కులుమొక్కి మోహము నీపైఁ జల్లి
చెంగలి చూపులఁ జూచీఁ జెలియ నిన్ను
చెంగటఁ దొల్లిటిపొందో వేసేఇప్పటినేస్తమా
ఇంగీతాకారమైతే నిటువలె నున్నది ॥ఎఱిఁ॥
సెలవుల నవ్వు నవ్వి సిగ్గుతోఁ దలవంచి
కలువపూవుల వేసీఁ గమ్మటి నిన్ను
చలపట్టి చెనకీనో సలిగ నీవిచ్చితివో
తలఁచుకొంటే మీలో తగులు మిట్లున్నది ॥ఎఱిఁ॥
నూఁగినమోవి చూపి మఱఁగున సన్న సేసి
కాఁగిలించుకొని శ్రీ వేంకటేశ నిన్ను
దాఁగక యలమేల్మంగతమకమో నీయింపో
వీఁగక నన్నేలితి మీ వేడుక యిట్లున్నది ॥ఎఱిఁ॥ (178)

భావము: ఇతర స్త్రీలతో నీ వలపు నాకు తెలుసు. ఆమె నయగారాలు తెలుసు – అంటోంది.

శ్రీ వేంకటేశ! నీ సంగతులన్నీ నాకు తెలుసు. నా వద్ద దాపరికం ఎందుకు? అన్నీ చెప్పవయ్యా! ఆమెకు, నీకు మేనమామ వరస ఉన్నదిలే. ఆమె నీ ముంగిట మొక్కులు మొక్కి, నీపై ప్రేమను జల్లింది. ప్రేమచూపులు చూచి ఆ చెలి నీ దగ్గరగా చేరి పూర్వపు కలయికను గుర్తు చేసిందా? లేక ఈనాటి స్నేహమా? ఈ మదనవికారం చూస్తే ఇట్లా తోస్తోంది. పెదవులపై నవ్వులు విరియించి, సిగ్గుతో తలవంచింది. అందగాడవైన నీపై కలువపూలు విసిరింది. పంతంతో నిన్ను గీరుతోంది, ఆ చనువు నీవిచ్చావా? ఆలోచించి చూడగా మీ యిద్దరి బంధము ఇలా కనిపిస్తోంది. పండిన పెదవి రుచి చూపి, రహస్యంగా సైగ చేసి కౌగిలించుకోనీయవయ్యా! ఆ అలమేలుమంగకు దాగని మోహమో, నీ ప్రీతియో గాని నన్ను ఏలుకొన్నావు. మీ సరదా ఇలా వుంది – అని నిలదీసి అడిగింది.

దేశాక్షి

ఏల పొద్దులు గడపే వింతికడకు రావయ్యా
నాలిసేయ నిఁకవద్దు నమ్మి యాపె వున్నది ॥పల్లవి॥
చక్కని సతిమోమున చంద్రోదయంబాయ
వెక్కనపునవ్వుల వెన్నెల గాసె
చొక్కపుకొప్పువిరులు చుక్కలు గానుపించె
పక్కన నెంచితే పట్టపగలు రేయౌను ॥ఏల॥
సతికుచగిరులనే జక్కవలు జోడుగూడె
తతి వికసించెఁ గన్నులఁ దామరలు
మితిలేనిరత్నకాంతి మించె సూర్యోదయము
మతి నెంచుకొంటేను మాపే రేపౌను ॥ఏల॥
కలికిమెయిచెమటల గడియారపు నీరెక్కె
తెలిసిగ్గులనే పెండ్లితెర వేసెను
అలమె శ్రీ వేంకటేశ అంతలో నీవు రాఁగాను
నెలవై యిట్టె వుండితే నిచ్చ కల్యాణమవును ॥ఏల॥ (179)

భావము: సతి సరసన వుంటే ఆనందమయమని చెలులు చెబుతున్నారు.

శ్రీవేంకటేశ! ఊరకే కాలక్షేపం చేయడమెందుకు? భామ దగ్గరకు రావయ్యా! ఇంకా పరిహాసం చేయవద్దు. నిన్నే ఆమె నమ్మియున్నది. అందమైన కాంత ముఖంలో చంద్రోదయమైనది. అధికమైన నవ్వుల వెన్నెలలు కాశాయి. అందమైన కొప్పులోని పూలు చుక్కలుగా కనిపించాయి. ఆమె నీ పక్కన ఉన్నట్లు భావిస్తే పగలే రాత్రి అవుతుంది. ఆమె చనుదోయి పర్వతాలనే జక్కవపక్షుల జంట కూడింది. కనులలో తామరలు వికసించాయి. అతిశయించిన రత్నాలకాంతి సూర్యోదయాన్ని మించిపోయింది. మనసులో భావిస్తే రాత్రియే పగలౌతుంది. భామ శరీరంపై చెమటలు గడీరపు కడవలో నీరైనాయి. తెల్లని సిగ్గులనే పెండ్లి తెరను కాంత వేసింది. అంతలో నీవు వచ్చి ఇక్కడే వుండిపోవడంతో నిత్యకల్యాణం పచ్చతోరణమైనదని – చెలులు ఉపమించారు.

పాడి

కనుఁగొనేఁ గానీ లేవే కామిని నీజాడలు
మనసే తమకించితే మఱి యేమిసేసేవో ॥పల్లవి॥
కలువల వేసితేనే కాఁతాళించేదానవు
యెలమి మరునమ్ముల కేమిసేతువో
సెలవుల నవ్వితేనే చీఁదరరేఁగేదానవు
లలి వెన్నెలకు నెంతలావుగా రేఁగుదువో ॥కనుఁ॥
నెమ్మి నే మాఁటలాడితే నేరుపులెంచేదానవు
తుం(తు)మ్మిదమోఁతల నెంతదూరుదువో
చిమ్ముఁజూపులఁ జూచితే చేత నొడ్డేదానవు
యిమ్ముల మెఱఁగులకు నెంత వొడ్డుకొనేవో ॥కనుఁ॥
గట్టిచన్నులు నేనంటఁగా సిగ్గుపడేదానవు
అట్టె తమ్మి మొగ్గల నెంతాడుకొందువో
నెట్టన నన్నుఁ గూడితి నేను శ్రీ వేంకటేశుఁడ
మట్టున నింకా నన్ను మతి నెట్టు గూడేవో ॥కనుఁ॥ (180)

భావము: ఓ భామా! నేను శ్రీ వేంకటేశుడను, నీవు నన్ను కలిశావు. ఈ విధంగా దగ్గరై నన్ను నీ మనసులో ఇంకెంతగా కూడేదానివో గదా! ఓ భామా! నీ వన్నెచిన్నెలు అన్నీ నేను చూశానులేవే. మనస్సు మోహపడితే మరి ఎంత చేసే దానివో! నీపైన కలువలు విసిరితేనే కోపించేదానవు. మరి మన్మథుని బాణాలకు ఏం చేస్తావో! పెదవులపై నవ్వులు కనిపిస్తేనే చిరాకుపడేదానివి, వెన్నెలను చూసి ఎంత ఎక్కువగా బాధపడతావో. నేర్పుగా నేను మాట్లాడితేనే నేర్పులు లెక్కించేదానివి, తుమ్మెదల ఝుంకారానికి ఎంతగా తిట్టుకొనేదానివో, మోహపుచూపులు చూస్తే, చేతితో అడ్డుపడేదానివి. మెరుపులు కనిపిస్తే ఎంత అడ్డుపడే దానివో, నీ ఘనమైన చనుదోయి నేను ముట్టుకొంటేనే సిగ్గు లొలకబోసే దానివి, తామర మొగ్గలతో ఎంత ఆడుకొందువో గదా- అని పరియాచకలాడాడు స్వామి.

రామక్రియ

కొత్తగా నాతో పొందుగూడి నిన్ను భ్రమయించి
ఇత్తల నిన్నొకటై యెలయించీఁగాక ॥పల్లవి॥
కన్నులనాచూపు నిన్నుఁ గాఁడిపారెనటవే
వున్నతి నీమోహ మటువున్నది గాక
సన్నలు నేఁ జేసితేనే జల్లనీనా నీగుండె
కన్నెరో నీమతి నిన్నే కరఁగించీఁగాక ॥కొత్త॥
వేడుక నా నవ్వు నిన్ను వెన్నెలై వేఁచీనటవే
కూడుదాఁకా విరహము గొసరీఁగాక
ఆడిననామాట జిగురై నిన్ను నంటించినా
యెడలేనినీకోరిక లింత సేసీఁగాక ॥కొత్త॥
యిట్టె నాతో పొందు బయలీఁదించెనటవే
చుట్టుకొన్ననీకాఁగిలే చొక్కించెఁగాక
దిట్ట శ్రీ వేంకటేశుఁడు రట్టు సేసెనా నిన్ను
చుట్టరికపునీమేలే జట్టిగొనెఁ గాక ॥కొత్త॥ (181)

భావము: దక్షిణ నాయకుడు తన భామినితో సరసోక్తులాడుతున్నాడు.

ఓ కన్యా! కొత్తగా నీతో సౌఖ్యాన్ని పొంది, నిన్ను భ్రమపెట్టి నిన్నుయొక విధంగా బాధించినదేగాని, నా కంటిచూపు నిన్ను కలత పెట్టినదా? అధికమైన నీ మోహం అలా వుంది గాక. నీ మనను కరిగించింది గాని, నేను సైగలు చేయగానే నీ గుండె జల్లుమనినదా? నాతో పొందు కలిగేటంత వరకు నీకు విరహము కొసరినదిగాక సరదాగా నా నవ్వులు వెన్నెలయై నిన్ను బాధించినవటవే. ఎక్కడా ఎన్నడూ చూడని నీకొర్కె వింత గొలిపినదిగాక నేను మాట్లాడిన మాట జిగురువలె నీకు అంటుకొన్నదా? ఈ విధమైన నాతో సౌఖ్యము నీకు వట్టి యాసలు కల్పించినవా? నీవు గాఢంగా కౌగిలించినందున అలసిపోయావుగాక. నీవు కలిపిన చుట్టరికమే మేలై బంధాన్ని పెంచినదిగాని, నిన్ను శ్రీవేంకటేశ్వరుడు రచ్చజేశాడా?

కాంబోది

ఏల సిగ్గులువడేవే యెలయించినట్టయ్యీని
వాలాయించి నీకుఁగానే వలచినాఁ డతఁడు ॥పల్లవి॥
పాడి చూపఁగదవే నీపతి వేడుకపడిని
వీడ(డె?) మందుకొనవే వేవేగమే
చూడవే యాతనిదిక్కు సుద్దు లడుగఁబూఁచీని
కూడేటి కూటములకు గుబ్బతిల్లీ నతఁడు ॥ఏల॥
అట్టె పాదాలొత్తవే అందుకే తమకించీ
పెట్టుకోవే తానిచ్చిన పెను సొమ్ములు
గుట్టుతోడఁ గూచుండవే కొంగుపట్టి వేఁడుకొనీ
గట్టిగా నీ పొందులే కడుఁగోరీ నతఁడు ॥ఏల॥
సెలవులు నవ్వవే శ్రీ వేంకటేశుఁడు నవ్వి
పిలిచీ నూఁకొనవే ప్రియముతోడ
లలి గుబ్బలనొత్తవే లాలనసేసి నిన్ను
తలఁపించి నీరతికే తమకించీ నతఁడు ॥ఏల॥ (182)

భావము: ముగ్ధయైన నాయికకు చెలి సుద్దులు చెబుతోంది.

ఓ ముద్దరాలా! నీవు సిగ్గుపడటం వల్ల అతనిపై ఆసక్తి చూపినట్టైంది. నిర్బంధించి నిన్నే అతడు ప్రేమించాడు. నీ పతి వేడుక పడుతుండగా న్యాయం చూపాలి గదా! వెంటనే అతడందించిన తాంబూలం స్వీకరించవే. సుద్దులు అడగాలని పూనుకున్న అతని దిక్కు చూడవే. మీ యిద్దరి పొందుల కోసము అతడు ఉత్సాహం చూపుతున్నాడు సుమా. అతడు నీ కొంగు పట్టుకొని దీనంగా వేడుకొంటున్నాడు గదా నీవు (ఊరక) గుట్టుగా కూచోరాదా? మోహంతో తపించే అతని పాదసేవనం చేయవే. ఆతడిచ్చిన విశేషమైన సొమ్ములు ధరించవే. అతడు గాఢమైన నీ పొందులనే కోరుకొంటున్నాడు. పెదవులపై నవ్వరాదా! శ్రీ వేంకటేశుడు నవ్వుతూ నిన్ను పిలవగానే ప్రియంగా అంగీకరించరాదటవే. నిన్ను లాలించే అతనిని నీ చనుదోయితో వొత్తరాదా? (హత్తుకోరాదా?) అతడు నీ రతినే గుర్తుకు తెచ్చుకొని మోహపడుపోతున్నాడు సుమా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here