అన్నమయ్య పద శృంగారం-2

0
11

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

శుద్ధవసంతం

విభునితో నికనేలే వేసాలు
సుధసోభ (శుభశోభ) నములెల్లా జూపవలెగాని ॥ పల్లవి॥
చేరి సంగడి గూచుండి సిగ్గులువడితే బోదు
వూరకే తలవంచుక వుండగరాదు
గోరగీరగా నొడ్డుకొంటే సంగతి గాదు
కూరిమితో రతి కియ్యకొనవలెగాని ॥ విభు॥
తప్పక మొగాలు చూచి తలవంచుకొంటే బోదు
ముప్పిరి జిరునవ్వులు ముయ్యగరాదు
పిప్పిగా మోవి యాన బెనగేది బుద్దిగాదు
కుప్పలు దెప్పలుగా గూడవలె గాని ॥ విభు॥
జిగి జన్నులు సోకించి చెమరించితే బోదు
అగపడి కాగిలించి యలయరాదు
వెగటు లేక యేల శ్రీ వేంకటేశు డిట్టె నిన్ను
తగులై యిట్లానే పొందగవలె గాని ॥విభు॥ (6)

~

భావం: చెలికత్తెలు అలమేలుమంగకు హితవు చెబుతున్నారు. ఓయమ్మా! ఇప్పుడు నీవు సింగార లక్షణములు చూపాలి. వూరక సిగ్గుతో తలవంచుకొని కూచుండరాదు. దగ్గరగా చేరి కూచొని సిగ్గులు పడితే సరిపోదు. ప్రేమతో రతికి అంగీకరించాలి గానీ, గోటితో అతడు గీరితే అడ్డుపడటం భావ్యంకాదు. ఒకరి ముఖం ఒకరు చూచుకొని సిగ్గుతో తలవంచుకోరాదు. చిరునవ్వులు పెనవేసుకొనగా ఆపరాదు. మాటిమాటికి రతి క్రీడ చేయవలెను గానీ, పెదవులు పెనగులాట మంచిదిగాదు. వెంకటేశుడు ఇట్లే నిన్ను క్రీడించవలెనుగాని, నీ అందమైన చనులు తాకించి చెమటలు పడితే సరిపోదు. అతని దగ్గరి చేరి కౌగిలించుకొని అలసిపోరాదు. ఇట్లు నిన్ను వెగటు లేకుండా ఆ స్వామి ఏలుకున్నాడు. ఆ సంబంధం అలానే నిలుపుకోవాలి. గట్టిగా పెదవులానితే పెనుగులాడరాదు.

రేకు 802

కాంబోది

నీవేల సిగ్గుపడేవే నెలతా
యీవల జెలికత్తెల మెగసక్కె మాడేమా ॥పల్లవి॥
చుక్కలవలె నీమోవి సూదివాటు లుండగాను
యిక్కున నీకెంగేల నేల మూసేవే
తక్కక గజరుజేతలవాడు నీమగడు
యెక్కడా లేనిదా యందుకేమాయనే ॥నీవే॥
నాటుకొని (కోనీ?) చెక్కులపై నవచంద్రకళ లుండగాను
గాటపుగస్తూ రెంతకడు మెత్తేవే
మేటియైన నీ విభుడు మిక్కిలి నారజకాడు
ఆటదానికి గలదే యందుకేమాయనే ॥ నీవే॥
తగ నీమెయి నాడాడ తమ్మచదురు లుండగ
పొగరుగుంకుమలేల పూసుకొనేవే
జగములో శ్రీ వేంకటేశ్వరుడె జాజరకాడు
అగపడి నిన్ను నేలె నందుకు నేమాయనే ॥నీవే॥ (7)

~

భావం: చెలికత్తెలు అలమేలు మంగ శరీరముపై గల రతిచిహ్నములను జూచి సరసాలాడుతున్నారు.

ఏమమ్మా చెలీ! నీవెందులకు సిగ్గుపడెదవు? ఇక్కడ చెలికత్తెలమైన మేము ఎకసక్కెమాడుతున్నామా? నీ పెదవిపై సూది గంటులు చుక్కలవలె కనిపిస్తుండగా నీ అందమైన చేతితో కళాస్థానాన్ని మూసిపెట్టెదవు? నీ మగడు (మాయగాడు) కామపు చేష్టలవాడు. ఈ విధానము ఎక్కడా లేనిదా? అందుకేమైనదమ్మా! నీ బుగ్గలపై కొత్తగా చంద్రకళలు కనిపిస్తుండగా దానిపై దట్టంగా కస్తూరి పూత ఎందుకు మెత్తుతావు? ఘనుడైన నీ భర్త మిక్కిలి సరసుడు. ఆ క్రీడ దానికి వున్నదా? ఇంతకు ఏమైనదోయమ్మా! నీ శరీరం అక్కడక్కడ తాంబూలం తుంపురులుండగా దట్టమైన కుంకుమ పూశావెందుకు? ఈ లోకంలో మాయగాడైన శ్రీవెంకటేశ్వరుడు కనిపించి నిన్ను ఏలాడు, అందుకు ఏమైనదమ్మా! ప్రశ్నార్థకంగా చెలులు సరసమానుతున్నారు.

శంకరభరణం

పోలించి చూచితేను పొసగు నిద్దరికిని
మేలువారు తొల్లె మీరు వోలలాడరయ్యా ॥పల్లవి॥
కదిసి యింతి నీతో కడు మాటలాడగాను
అదె మోవిచిగురులు యల్లాడ జొచ్చె
యిదె వసంతకాలము యెదిరించె నీకు నేడు
సదరాన వలపులు చల్లులాడరయ్యా ॥పోలిం॥
కందువ గాంత నిన్ను గాగిలించుకొనగాను
అందమై బాహులతలు అల్లుకోజొచ్చె
వింతజాజరకాలము వేడుకతో దలపించె
సంతోసపు చిరునవ్వు చల్లులాడరయ్యా ॥పోలిం॥
అంచెల రతివేళల నంగన నిన్ను గూడగా
మించి గుబ్బలపూగుత్తులు మెరయ జొచ్చె
కొంచక శ్రీ వేంకటేశ కూడె నామనికాలము
చంచలించక యింపులు చల్లులాడరయ్యా ॥పోలిం॥ (8)

~

భావం: ఇందులో అన్నమయ్య వసంతకాలంలో శ్రీ వెంకటేశుని రతిక్రీడలను అమ్మ చెలులు ముచ్చటించడాన్ని వర్ణించాడు.

ఓ వెంకటేశ! పోల్చి చూస్తే మీ ఇద్దరికి వొద్దిక కనిపిస్తోంది. మీరు ముందుగా మేటివారు ఆనందంతో ఓలలాడండి. నిన్ను సమీపించి ఆమె ముచ్చటలాడగా అదుగో! చిగురాకు పెదవులు అదరసాగాయి. నేడు నీకు వసంత కాలము. ఇప్పుడే ఛలోక్తులతో వలపుల వసంతాలాడుకోండి. ఇప్పుడే ఎదురు వచ్చినది. స్నేహపూర్వకముగా మీరు ప్రేమను పంచుకోండి! రహస్యంగా మా చెలి నిన్ను కౌగిలించుకోగా అందంగా బాహువులనే లతలు అల్లుకోసాగాయి. అవి చూస్తే వింతవింతగా వసంత కాలం వేడుకగా వచ్చినట్లున్నది. సంతోషపు చిరునవ్వులతో జలక్రీడలాడండి. ఉపరతి సమయంలో ఆమె నిన్ను పైకొనగా బలిష్ఠమైన చనుదోయి పూగుత్తులు ప్రకాశిస్తున్నాయి. అదుగో వసంతకాలం రానే వచ్చింది. చపలత్వం చూపక క్రీడించండి.

బౌళిరామక్రియ

ఇంతటిమీది పనులు యింక నీ చేతిలోనివి
పంతమున మోహము నీపై వేసుకొన్నది ॥పల్లవి॥
వెలయగ నీకు నన్ని విన్నపములును జేసి
తల వంచుక వున్నది తరుణి
కలయ నీమేనెల్లా కందువచూపుల జూచి
తలచుకొంటా నున్నది తనలోనను ॥ఇంత॥
పనివడి తెచ్చి నిమ్మపండు నీచేతికిచ్చి
నినుపుసిగ్గులతోడ నిలుచున్నది
ననుపున గొంతచిరునవ్వు నీముందర నవ్వి
తనియక చెమటల దైవారీని ॥ఇంత॥
కడునిచ్చకముగాగ గక్కన నీపాదా లొత్తి
పుడివోని బత్తితోడ నోలలాడీని
యెడయక శ్రీ వేంకటేశ నీవు గూడగాను
చిడుముడి జెలులతో జెప్పి మెచ్చిని ॥ఇంత॥ (9)

~

భావము: ఓ వెంకటేశ! మా చెలి పంతముతో నీపై మోహమును పెంచుకొన్నది. ఆపైన పనులన్నీ యిక నీ యిష్టము. మా చెలి నీకు అన్ని రకములుగా విన్నపాలు చేసి సిగ్గుతో తలవొంచుక నిలుచున్నది. నీ శరీరమంతా చాటుమాటు చూపులతో చూచి తనలోతాను తలపోస్తున్నది. అది పనిగా నిమ్మపండు తెచ్చి నీ చేతికిచ్చి సిగ్గులనిగారంతో నిలుచున్నది. ప్రియంగా కొద్దిపాటి చిరునవ్వు నీ ముందునవ్వి, తృప్తి చెందక వాళ్లంతా చెమటలతో తడిసిపోయింది. ప్రీతితో నీ పాదాలు వొత్తి అత్యంత భక్తిలో ఓలలాడుతోంది. నీవు తనతో క్రీడించిన విశేషాలు చెలులకు చెప్పి మెచ్చుకొంటోంది.

నీలాంబరి

ఎంతవేడుకో నీకు యీ పెమీదను
వింతలెల్లా జూచి మాకు వెరగయ్యీ నిపుడు ॥పల్లవి॥
ప్రియ* (ప్రేమ?) మున నీతోడ ప్రియురాలు మాటాడగ
ఆముకొని వినేవు నీ వప్పటనుండి
గోమున నేపొద్దు నీకు గొలువులు సేయగాను
జామటనుండి యిట్టె సంతోసించేవు ॥ఎంత॥
అప్పటిని బాగాలిచ్చి ఆకుమడిచియ్యగాను
పుప్పతిల్లుగళలతో నుబ్బేవు నీవు
చిప్పిలగ నిన్ను జూచి సెలవుల నవ్వగాను
చెప్పరాని తమకాన జిమ్మి రేగేవు ॥ఎంత॥
నేరుపులెల్లా మెరసి నీకు బాదా లొత్తగాను
బోరున నీనిలువెల్ల బులకించేవు
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నీ దేవుల
గారవపురతులను గడుజొక్కేవు ॥ఎంత॥ (10)
*గురువు, ప్రాస – రెండు తప్పాయి, పరిష్కర్త ‘ప్రేమ’ అని సరిదిద్దారు.

~

భావము: చెలులు స్వామితో సరదాగా మాట్లాడుతున్నారు:

ఓ స్వామీ! వేంకటేశా! నీకు మా చెలి మీద ఎంత ప్రేమయో! ఆ వింతలన్నీ చూచి మాకిప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నీతో ప్రియురాలు ప్రేమగా మాట్లాడగా అప్పటి నుండి నేను పైకొని వింటున్నావు. ప్రేమ మీరగా అన్ని వేళలా నీకు సేవలు చేయగా జాము సేపు నుండి పొద్దులు గడిపి సంతోషించావు. పూర్వం వలె ప్రేమతో ఆకుమడిచి వీడియ మివ్వగా అతిశయించిన కళలతో సంతోషపడుతున్నావు. అతిశయించిన ప్రేమతో నిన్ను చూచి పెదవుల చిరునవ్వు నవ్వగా చెప్పలేనంత మోహంతో పెచ్చురేగిపోతున్నావు. నేర్పుగా నీకు పాదసేవ చేయగా నీ శరీరమంతా పులకింపజేశావు. ఓ స్వామీ! ఈ విధంగా నీ దేవేరులను గౌరవించి రతులలో అలసి సొలసి ఏలుకొంటున్నావు.

నాదరామక్రియ

ఎంత వలతువో కాని యీతనికిని
చింతలెల్ల జిగిరించి చిమ్మి రేగెనే ॥పల్లవి॥
చక్కని నీరమణుడు సరసము లాడితేను
లక్కవంటి నీమనసు లలి గరగి
చెక్కులపై చెమటలు చిరుమోవితేనెలు
వొక్కమాటే చెలరేగి పూట్లెత్తెనే ॥ఎంత॥
మచ్చికతో నీమగడు మాటలాడినంతలోనె
పచ్చినీజవ్వనమెల్ల పదనెక్కి
పచ్చనిమెయిపులకలు బాగుగా మోముకళలు
విచ్చనవిడి దోడుతో వెదలై మొలచెనే ॥ఎంత॥
యెన్నగ శ్రీ వేంకటేశు డిట్టె నిన్ను గూడగాను
చన్నులై నీవురమున నెన్నులు వెళ్లి
కన్నులజూచేకాంక్షలు కాగిటిలోనిరతులు
పన్ని యిరువంక నొక్కపరే రాసులాయనే ॥ఎంత॥ (11)

~

భావము: ఓ యింతీ! ఈతని నీవెంతగా ప్రేమిస్తున్నావో ఏమో – ఆతనికి కోర్కెలు చిగిరించి వృద్ధి పొందుతున్నాయి. అందగాడైన నీ ప్రియుడు నీతో సరసాలాడితే లక్కవంటి నీమనసు కరిగిపోయి చెక్కులపై చెమటలు, పెదవిపై తేనెలు ఒక్కసారిగా అతిశయించి ఊటలూరాయి. ప్రేమతో నీమగడు మాట్లాడినంతలోనే నీ యౌవన సౌందర్యము పదునెక్కి పచ్చని నీ శరీరంపై పులకలు పుట్టి ముఖంపైన కళలు విచ్చలవిడిగా తోడై మొలిచాయి. శ్రీవేంకటేశుడు నిన్ను కలియగానే నీ ఎదపైని చన్నులు ఎన్నులుగా (కంకులుగా) వెళ్లి కళ్లతో చూచే కోరికలు, కౌగిలిలోని రతులై రెండువైపులా ఒక్కసారిగా రాసులైనది.

తెలుగుగా(గాం)బోది

వెంగెములు నిన్నాడను వేసరించను
సంగతిగ నీకు నిచ్చకమే సేసేను ॥పల్లవి॥
తలపోత లెన్ని లేవు తమకము లెన్ని లేవు.
వలచినయటువంటివనితకును
కలువల వేసి నన్ను గమ్ముక యెంతడిగేవు
నెలకొన్న నీచేఁతలు నీవెరగవా ॥వెంగె॥
వాడుమోవైతే నేమి వంచినతలైతే నేమి
వోడక విరహముతో నున్న దానికి
యీడకు వచ్చితివిగా యిప్పుడు వేడుకోనేల
వేడుకకాడవు నీకు వెలితున్నదా ॥వెంగె॥
నివ్వెరగులు గడమా నిండునవ్వులు గడమా
వువ్విళ్లూర నిన్ను గూడి వున్న నాకును
యివ్వల శ్రీ వేంకటేశ యెంత నన్ను లాలించేవు
నివ్వటిల్లునేర్పరివి నీకు నేడు గొత్తలా ॥వెంగె॥ (12)

~

భావము :- అలమేలు మంగస్వామితో తన ముచ్చటలాడుతున్నది:

ఓ స్వామీ! నేను నీతో వ్యంగ్యంగా మాట్లాడలేదు. విసిగి వేసారించలేదు. ఇష్టపూర్వకంగా నీకు ప్రీతిని గూరుస్తున్నాను. ప్రేమించిన స్త్రీకి ఎన్ని ఆలోచనలు లేవు. మోహాలు ఎన్ని లేవు. కలువలు సాపై విసిరి నన్నులోగొని నీవు ఎంతలేసి మాట్లాడిన మాటలు, నీ చేష్టలు నీకు తెలియవా? విరహముతో నున్న నాకు వాడిపోయిన మోవి, వంచిన తల అయితేనేమి? నా దగ్గరకు వచ్చావుగదా యిప్పుడు విన్నపాలేల? సరసుడవైన నీకు కొరత ఏమున్నది? పారవశ్యము తక్కువా? నిండునవ్వులు తక్కువా? ఉవ్విళ్లూరుతూ నిన్ను కలిసిన నాకు కొదవేమి? నన్ను ఎంతగానో లాలించడంలో గడుసరివైన నీకు ఈనాడు కొత్త లేమున్నవి?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here