అన్నమయ్య పద శృంగారం-22

0
14

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

దేసాళం

ఎంత వేగిరకాఁడవు యేమయ్యా నీవు
చెంతనుండి వూడిగాలు సేయనియ్యవా ॥పల్లవి॥
సముకాన మొక్కఁగానే సరసపుమాట లాడి
చెమరించఁజేసేవు చెక్కు లెల్లాను
తమితో వీడినకొప్పు తగ నే ముడువఁగానే
కొమరెనాచన్ను లాంటి భ్రమయించేవు ॥ఎంత॥
వొత్తఁగానే పాదాలు నావొడిమీఁద నీవు వేసి
చిత్తమెల్లాఁ గరఁగించి చిమ్మి రేంచేవు
హత్తి బాగా లందిచ్చి ఆకుమడి చియ్యంగానే
తత్తరాన మోవి యాని తమకింపించేవు ॥ఎంత॥
కలయఁగ నీమేనఁ గస్తూరి వూయఁగానే
బలిమిఁ గాఁగిట నించి పచ్చి సేసేవు
నిలిచి శ్రీ వేంకటేశ నీకుఁ గప్రమియ్యంగానే
వెలయ వింతరతుల వెరగందించేవు ॥ఎంత॥ (203)

భావము: ముగ్ధ అయిన కాంతను కాంతుడు మైమరపింపజేస్తున్నాడు.

శ్రీ వెంకటేశ! నీవు ఎంత తొందరకాడివయ్యా! నీకు దగ్గరగా వచ్చిన సేవలు చేసే అవకాశమివ్వవా? నీ దగ్గరగా వచ్చి సరసపు మాటలు పలకగానే చెక్కులు తడిసేలా చేశావు. మోహంతో వీడిన కొప్పును నేను ముడువబోగా అందమైన నా చనుదోయిని పట్టుకొని భ్రమింపజేశావు. పాదాలొత్తగానే నా వొడి మీద చేయి వేసి మనసంతా కరిగిపోయేలా చేసి మోహం రేకెత్తించావు. నిన్ను హత్తుకొని తమలపాకులు మడిచి యియ్యగానే తొందరపాటుతో నా పెదవినంటుకొని పరవశురాలిని చేశావు. మనమిద్దరము కలిసినప్పుడు నీ శరీరానికి కస్తూరి పూయగానే బలవంతంగా కౌగిట జేర్చి పచ్చిగా నొక్కి వేశావు. స్వామీ! నీ ముందు నిలిచి కప్పుర తాంబూలమియ్యగానే వింతవింత రతులతో భయపెడుతున్నావు. ఇది న్యాయమా స్వామీ!

దేసాక్షి

పాయరానిచుట్టమవు పడఁతికిని
సోయగపునీకన్నులఁ జూతువు రావయ్యా ॥పల్లవి॥
వినయపుకాఁగిలి వీడుఁబట్టుసేనీ నీకు
వొనరినమోవితేనె వులుప వట్టె
ఘనకుచములు నీకు కానుక లెత్తుకున్నది
పెనఁగ చెలి నిన్నుఁ బిలిచీని రావయ్యా ॥పాయ॥
పలుకుల కప్పురాలబాగా లొసగీ నీకు
మలసి మైతావి పరిమళ మున్నది
బలుచెమటపన్నీటఁ బాదాలు గడిగి నీకు
తలిరుఁబోడి ఇదె దగ్గరీ రావయ్యా ॥పాయ॥
చొక్కపుఁదనకన్నుల చూపులు నెదురుకొనె
పక్కన వలపులనే పాన్పు పరచె
అక్కున శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
యిక్కడఁ గూడితివి నీ వెప్పుడు రావయ్యా ॥పాయ॥ (204)

భావము: ముగ్ధయయిన కాంత నీకుగా యౌవనం మీదు కట్టిందని చెలులు పలుకుతున్నారు.

శ్రీ వేంకటేశ! మా కాంతకు నీవు విడదీయరాని చుట్టమవు. నీ అందమైన కనులతో నీవే చూతువుగాని రావయ్యా! ఆమె వినయంతో కూడిన తన కౌగిలిని నీకు నివాసస్థానం చేసింది. తన పెదవుల తేనెను కానుక పట్టుకొచ్చింది. ఘనమైన చనుదోయిని కానుకలుగా ఎత్తుకొంది. పెనగులాడటానికి రమ్మని మా చెలి నిన్ను పిలుస్తోంది రావయ్యా! తన మృదువైన మాటలతో నీకు కప్పురపు విడెములిస్తోంది. శరీరానికి సహజమైన పరిమళముంది. తన శరీరంపై చెమటలతో మా చెలి నీ పాదాలు కడుగుతోంది. వెంటనే దగ్గరగా రావయ్యా! అందమైన తన క్రీగంటి చూపులతో నీకు స్వాగతం పలుకుతోంది. దగ్గరలోనే వలపుల పానుపు పరచింది. నీ దగ్గరనే వున్న ఈమె అలమేలుమంగ! ఇక్కడే ఆమెతో క్రీడించావు. నీవింకా రావేమయ్యా!

ఆహిరి

ఎన్ని చేఁతలదానవే ఇన్నిటా నీవు
విన్న కన్న జాడ గాదు వెరగయ్యీ మాకు ॥పల్లవి॥
మొక్కి కొలువుసేసేవు ముందటనుండి పతితో
మక్కళించి మక్కళించి మాటలాడేవు
జక్కవచన్ను లొరయ సారెఁ బాదాలొత్తేవు
నిక్కి వలపులుచల్ల నేరుతువే నీవు ॥ఎన్ని॥
సెలవులు నవ్వేవు సిగ్గువడ కాతనితో
సొలసి సొలసి మేను సోఁకించేవు
తళుకుఁజూపులఁ జూచి దండఁ గూచుండ వచ్చేవు
యెలయింప జాణవైతి విపుడే నీవు ॥ఎన్ని॥
కూరిమి శ్రీ వేంకటేశుఁ గొనచూపులనుఁ జూచి
చేరి చేరి వూడిగాలు సేయవచ్చేవు
యీరీతి నన్నీ తఁడేలె యే నలమేల్మంగను
తారుకాణలాయ మంచిదానివే నీవు ॥ఎన్ని॥ (205)

భావము: ప్రౌఢయయిన నాయిక గడుసరితనాన్ని చెలి హెచ్చరిస్తోంది:

ఓ గడుసరీ! అన్ని రకాలుగా నీవు ఎన్ని చేష్టలు నేర్చుకున్నావే! మేము లోగడ ఎన్నడూ ఇటువంటివి విన్నవి, కన్నవి జాడలేదు. సవరించి, సవరించుకొని మాట్లాడుతున్నావు. నీ పతితో ముందటి నుండి నీవు మొక్కి కొలువు చేశావు. జక్కవ పక్షులను బోలు చనుదోయి తాకిస్తూ మాటిమాటికీ పాదాలొత్తావు. నిక్కి చూస్తూ వలపు జల్లులు చల్ల నేర్చావు. సిగ్గరితనం ఏమీ లేకుండా చిరునవ్వులు చిందించావు. అలసి సొలసిన శరీరాన్ని ఆతనికి తగిలించావు. తళుకుమనే చూపులతో చూచి ఆతని పక్కనే వచ్చి కూచొన్నావు. అతనిని కౌగలించుకొనేటంత జాణవైనావు ఇప్పుడే. శ్రీ వేంకటేశ్వరుని ప్రేమతో కడగంటి చూపులతో చూచి, దగ్గరకు చేరి సేవలు చేయడానికి వచ్చావు. ఈ విధంగా నన్ను ఈతడు పాలించాడు. నేను అలమేలుమంగను. నీ పనులన్నీ ఇందుకు తార్కాణలాయెను. నీవు మంచి దానవే – అని గడుసరితనాన్ని గుర్తు చేస్తోంది.

వరాళి

మంచిదయ్యా వలపులు మారుబేరా లాడేవు
పొంచి నెట్టువడినది పొరుగా మీఁదను ॥పల్లవి॥
కచ్చుపెట్టి యాపె నిన్నుఁ గతలెల్లా నడుగఁగా
మచ్చిక నీ వెవ్వరితో మాటలాడేవు
అచ్చముగ నీమొగము అట్టె తప్పకచూడఁగా
ఇచ్చకము సేసుకొని యెక్కడ చూచేవు ॥మంచి॥
చెలరేఁగి యాపె నీతో సెలవుల నవ్వఁగాను
నలువంక నెవ్వతెతో నవ్వులు నవ్వేవు
సలిగెతో నిట్టె నిన్ను సారె సారెఁ జెనఁకఁగా
వెలినున్న యాపెనేల వెలిగోర నూఁదేవు ॥మంచి॥
కప్పురపు విడెము కలికి నీకు నొసఁగఁగా
దప్పిదేర నాపెకేల తమ్మ వెట్టేవు
అప్పుడె శ్రీ వేంకటేశ అలమేలుమంగ గూడె
చొప్పుననే యాపె కెంతచుట్టమయేవు ॥మంచి॥ (206)

భావము: దక్షిణ నాయకుని కొంటెతనాలు ప్రియురాలు తెగనాడుతోంది.

శ్రీ వెంకటేశ! నీవు ప్రేమలను మారు బేరాలాడుతున్నావు. చాలా మంచిదయ్యా! పక్కనే వున్న వనితపై రహస్యంగా నీ మనసు చెలరేగింది. కోరికపడి ఆమె నిన్ను ఏవో కథలు చెప్పమని అడుగగా నీవు ఎవరితోనో మచ్చిక చేసుకొని మాట్లాడుతున్నావు. ఆమె అచ్చముగా నీ ముఖాన్నే అదే పనిగా చూడగా, నీవు ప్రీతితో ఎక్కడో చూచావు. విజృంభించిన ఆమె పెదవులపై నవ్వులు నీ వైపు కురిపించగా నీవు నలుదిక్కులా చూచి ఎవతెతోనో నవ్వులు రువ్వావు. చనువుతో మాటిమాటికీ ఆమె నిన్ను కదియగా బయటవున్న మరొకతెను గోటితో నొక్కావు. మా సఖి నీకు కర్పూరపు తాంబూలము అందివ్వగా, మరొకతెకు దప్పి దీరునట్లుగా వీడెము అందించావు. ఇంతలో స్వామీ! అలమేలుమంగ నిన్ను కలియగా, నీవు ఆమెకు ఎంతటి దగ్గరి చుట్టమయ్యావయ్యా! – అని దెప్పి పొడుస్తోంది.

సామంత

కానీలేవే యందుకేమి కందము నీసరితలు
నానఁగానే వలపులు నయమిచ్చీని ॥పల్లవి॥
నెలకొని రమణుఁడు నీపై బత్తిగలఁడంటా
సలిగేలు చూపేవు సవతులకు
బలిమినే మంచమెక్కి పాదాలు పైఁదీసుకొని
వలవనిదొరతనములు సేసేవు ॥కానీ॥
చేరి నిన్ను మెచ్చీనంటా చేకొని నీ ప్రియునికి
నేరుపుతో నూడిగాలు సారెఁ జేసేవు
కోరి చిటికలుదీసి కొత్తగా వచ్చితినంటా
వూరకే చుట్టరికము లొనర నవ్వేవు ॥కానీ॥
యేపున శ్రీ వేంకటేశు నెన్నఁడో కూడితినంటా
కాపురాలు సేసిసేసి కడ గానవు
వోపిక నలమేల్మంగ నురముపై నున్న దాన
పైపైఁ జాయసేసుక పక్కన మెచ్చేవు ॥కానీ॥ (207)

భావము: గడుసరితనము చూపుతున్న ప్రౌఢకు హెచ్చరిక చేస్తోంది సఖి:

ఓ గడుసరీ! నీ చరిత్రలు మాకు తెలియనివిగావు. అందుకు ఏమి అనగలము. కానీ లేవే. బాగా ముదిరితే ప్రేమలు ఆనందం కలిగిస్తాయి. నీ ప్రియుడు నీపై భక్తి గలవాడని నీవు సవతులవద్ద లేనిపోని స్వతంత్రత చూపుతున్నావు. బలవంతంగా అతని మంచమెక్కి అతని పాదాలు నీ పైకి తీసుకొని లేనిపోని దొరతనాలు చేస్తున్నావు. నీకు దగ్గరగా చేరి నిన్ను మెచ్చుకుంటున్నాడనే మిషతో నీప్రియుడికి నేర్పుతో మాటిమాటికీ సేవలు చేశావు. చిటికెలు దీసి కొత్తగా వచ్చానంటూ వట్టి మాటలతో బంధుత్వం కలిపి నవ్వావు. ఆధిక్యంతో శ్రీవెంకటేశ్వరుని ఎన్నడో కలిశానంటూ కాపురం చేసి దానికి అంతం ఎరగలేవు. ఓపికగా విభుని ఉరముపై వున్న అలమేలుమంగను నేనుండగా పైపై జాడలు కనుగొని పక్కన చేరి మెచ్చుతున్నావు.

దన్నాశి

ఏల తలవంచుకొనే వెదురుకట్టుకు రానే
నాలితో సిగ్గువడితే ననుపులయ్యీనా ॥పల్లవి॥
సరసములాడఁగానే చవులుపుట్టీఁగాక
విరసాన నుండితేను వేడుకయ్యీనా
సరుసఁ గూచుండఁగానే సమేళము లౌఁగాక
యెరవై మాఁటుననుంటే ఇంపులు పుట్టీనా ॥ఏల॥
వొనర మాటాడితేనే మనసు గరఁగుఁగాక
మునుపే వెంగెమాడితే ముచ్చటారునా
చెనకి పైకొంటేను చెల్లుబడి యౌఁగాక
పెనఁగి బిగిసితేను ప్రియములయ్యీనా ॥ఏల॥
కలకల నవ్వఁగానే ఘనత లీడేరుఁగాక
చలము సాధించితేను సమ్మతమయ్యీనా
యెలమి శ్రీ వేంకటేశుఁ డింతలో నిన్ను నేలె
కలసీఁగాక చుట్టరికము లింక వీడునా ॥ఏల॥ (208)

భావము: ముగ్ధగా ముద్దులొలికే భామకు హితవు చెబుతోంది సఖి:

శ్రీదేవీ! నీవు తలవంచుకొని నిలబడ్డావేమి? ఎదురుగా వచ్చి నిలుచోని కపటంగా సిగ్గుపడితే ప్రీతి కలుగుతుందా? ప్రియునితో సరసాలాడితే రుచులు పుట్టుతాయిగాని, విరసంగా వుండిపోతే సరదా కలుగుతుందా? పక్కన కూర్చొంటే వొద్దిక కలుగుతుంది గాని, అపరిచితురాలివలె చాటుమాటున దాగి వుంటే ప్రీతి కలుగుతుందా? ప్రియంగా మాట్లాడితే విభుని మనసు కరగతుంది గాని, ముందుగానే వ్యంగ్యంగా మాట్లాడితే ముచ్చట కలుగుతుందా? దగ్గరగా వెళ్లి పైకొంటేనే పని జరుగుతుంది గాని, పెనగులాడి బిగుసుకొంటే మాట చెల్లుబడి అవుతుందా? కలకలమని నవ్వగానే కోరిన గొప్పపనులు సాధ్యమవుతాయిగాని, పట్టుదలతో సాధిస్తే ఆంగీకారమవుతుందా? ఇంతలోనే వేంకటేశుడు నిన్ను ఏలుకున్నాడు. కలసి మెలసి ఉంటే బంధుత్వాలు వదులుకొంటాయా ? అని గుర్తు చేస్తోంది.

నాట

సగము మానిసిరూపు సగము మెగమురూపు
అగణితప్రతాపుఁ డహోబలేశుఁడు ॥పల్లవి॥
గద్దెమీఁదఁ గూచున్నాఁడు కంబములోఁ బుట్టినాఁడు
కొద్దిమీరఁ గడునవ్వుకొంటా నున్నాఁడు
వొద్దనె శ్రీసతిచన్ను లొరయుచు నున్నవాఁడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుఁడు ॥సగ॥
పెనుమీసాలవాఁడు పెదపెదగోళ్లవాఁడు
ఘనునిఁగాఁ బ్రహ్లాదునిఁ గాచుకున్నాఁడు
మనసిచ్చినసురలతో మాటలాడుచున్నవాఁడు
అనుపమతేజుఁడమ్మ అహోబలేశుఁడు ॥సగ॥
వేవేలుచేతులవాఁడు వెన్నెలచాయలవాఁడు
భావించి కొల్చినవారిపాలిటివాఁడు
శ్రీ వేంకటగిరిమీఁదఁ జేరి భవనాశిదండ
నావల నీవల మించె నహోబలేశుఁడు ॥సగ॥ (209)

భావము: అహోబల నారసింహుని వర్ణన ఇందు ప్రత్యేకం:

నృసింహావతార రూపంలో వున్న అహోబల నారసింహుడు సగము మనిషి రూపము, సగము మృగరూపము కలిగి లెక్కింపరానంత శౌర్యము గలవాడు. వేదిక మీద కూచొన్నాడు. స్తంభంలో జన్మించాడు. కొద్దిగా నవ్వుకొంటున్నాడు. వద్దని వారిస్తున్నా శ్రీదేవి చన్నులు మర్దిస్తున్నాడు. అదిగదిగో అహోబలేశుని చూడరమ్మా! పెద్ద మీసాల వాడు. పెద్ద గోళ్లు గలవాడు. ప్రహ్లాద వరదుడాతడు. తనను నమ్మిన దేవతలతో మాట్లాడుతున్నాడు. ఆ నారసింహుడు గొప్ప తేజస్సుగలవాడమ్మా! వేనకు వేల చేతులుగల సహస్రభుజుడు. వెన్నెలవంటి తెల్లని శరీరఛ్చాయగలవాడు. తననే ధ్యానించి కొలిచిన వారి పాలిటి రక్షకుడు, భవనాశి ఏటికి ఇటూ, అటూ వెలసి మించిన అహోబల నారసింహుడు తిరుమల గిరులపై కొలువుదీరాడు.

మాళవి

ఏమని చెప్పఁగవచ్చు నిద్దరిజాణతనాలు
కామించి చూడరే కడుఁగన్నులపండుగలు ॥పల్లవి॥
యెదురుగొండలెక్కి ఇందిరా నౌభళేశుఁడు
మదము చెక్కిళ్ళఁగార మాటలాడేరు
పొదిగొన్న వేడుకెంతో పూవులఁ దమలోఁ దాము
చెదరనియాసలతో సేసలు చల్లేరు ॥ఏమ॥
రేఁగిరేఁగి భవనాశి రెండుదరులా నుండి
మాఁగినమోపులు చూపి మతిఁ జొక్కేరు
తోఁగితోఁగి చూచుకొంటా తొడిఁబడి రతులకు
దాఁగని ముచ్చటలతోఁ దమకించేరు ॥ఏమ॥
సమదిష్టి నొండురులు సంగడివనాల నీడ
జమళికాఁగిళ్లకు సమకూడేరు
అమర శ్రీ వేంకటాద్రి నందూనిందూఁ దావుకొని
చెమటమేనులతోడ సెలవులు నవ్వేరు ॥ఏమ॥ (210)

భావము: ఇద్దరు పత్నుల నారసింహుని ప్రాపుకోసం సవతులు పడే బాధ ఇందులో వర్ణితం.

ఔరా! నారసింహుని ఇద్దరి పత్నుల జాణతనాలు ఎన్నెన్ని చెప్పగలం. మిక్కిలి కన్నుల పండువ అయిన ఈ సరసాలు కోరి చూడరే. అహోబల నారసింహుడు కొండలపై ఇందిరతో కూడి వుంటే ఈ సపత్నులు ఎదురు కొండలపై కెక్కి చెక్కిళ్లపై మదము కారగా మాట్లాడుతున్నారు. వారి లోపల దాగి వున్న సరదాలెంతటివో! తమలో తాము పూలతో సేసలు చల్లుకొంటూ చెదిరిపోని ఆశలతో వున్నారు. భవనాశి ఏటికి రెండు వైపులా నిలిచి విజృంభించి బాగా పండిన పెదవులు చూపి మనసులో సొక్కిపోతున్నారు. ఒకరినొకరు తొంగి చూచుకొంటూ తొందరపడి దాగనటువంటి ముచ్చటలతో రతిక్రీడలకు ఉబలాటపడుతున్నారు. సమానమైన దృష్టితో దగ్గరలోవున్న వనాలనీడలో ఒకరినొకరు చూచుకొని ఉభయులూ కౌగిళ్లకు తయారవుతున్నారు. తిరుమలగిరులపై అక్కడక్కడా నెలకొని చెమట పట్టిన శరీరాలతో పెదవులపై నవ్వులు విరియజేస్తున్నారు.

కాంబోది

మానాపతివై (నై?) వుండఁగా మన్నింతువుగాక నీవే
నానారీతులఁ గెలసి నవ్వ నాకుఁ దగునా ॥పల్లవి॥
కొత్తకొత్తమాట లాడి గుట్టుదెలుసుకు నీపై
బత్తిచూపి వలపులు పైఁజల్లీ నాకె
పొత్తుల నీడువెట్టేవు పొరుగాపెతో నన్ను
ఇత్తల నే నిల్లాలసేనేసి నింతసేయఁదగునా ॥మానా॥
మేసోఁక సేవలుసేసి మెప్పించుక నీకుఁ గడు –
నాసరేఁచి వీడెము లందిచ్చీ నాకె
ఆసేఁతలు నేరుచుకొమ్మనేవు నీవు నన్ను
సేసపెండ్లికూఁతురను సిగ్గువడఁదగనా ॥మానా॥
కన్ను చూపులు నాఁటించి కై వసముగాఁ జేసుక
చన్నుల కూచున్నది సంగడి నాకె
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఇంతలో నన్నేలితివి
కన్నె దాన నాపెవలె గర్వించవచ్చునా ॥మానా॥ (211)

భావము: ముద్దరాలైన తాను గడుసరియైన సపత్ని వేషాలు భరించలేనని మొరపెడుతోంది:

శ్రీ వేంకటేశ! నేను అభిమానవతినై వుంటే నన్న గౌరవిస్తావుగాని, అనేకవిధాలుగా విర్రవీగి నవ్వడం నా వంటిదానికి తగునా? ఏవేవో కొత్త మాటలు మాట్లాడి నీ రహస్యాలు తెలుసుకొని నీపై భక్తిని జూపి ఆమె వలపులు కుమ్మరిస్తోంది. పొరుగున వున్న ఆమెతో నాకు పొత్తు గలపడం భావ్యమా! ఇక్కడ నేను ఎంతైనా ఇల్లాలిని గదా! ఇంత సేయవచ్చునా? శరీరం తాకించి నీకు సేవలు చేసి నిన్ను మెప్పించి, నీలో ఆశలు రేకెత్తించి ఆమె తాంబూలం నీకు అందిస్తోంది. అలాంటి చేష్టలు నన్ను నేర్చుకోమని నీవు చెప్పడం భావ్యమా? సేసలు పోసి పెండ్లాడిన వనితను గదా సిగ్గుపడుట అవసరమా? క్రీగంటి చూపులు నాటించి నిన్ను వశపరచుకొని చనుదోయి తగిలించి నీ సమీపంలో ఆమె కూచున్నది. ఇంతలో స్వామీ! నన్ను ఏలుకొన్నావు. కన్యనైన నేను ఆమెవలె గర్వించడం తగునా? – అని స్వామికి నివేదిస్తోంది.

రామక్రియ

ఈ పనికి నేము వచ్చి యెంతవడైనాఁ గద్దు
కాపాడి ఇంతటను కరుణించవయ్యా ॥పల్లవి॥
వాకున నేగతినై నా వలపులు చెప్పఁగవచ్చు
పైకొని వెలిఁ దెచ్చిచూపఁగరాదు
చీకాకుపడినట్టి చిత్తమే యెఱుఁగును
ఆకె నీకెదురుచూచీ నండకురావయ్యా ॥ఈప॥
వేడుకతొ నా పెచెప్పేందుకు రమ్మనవచ్చు
వాడిక నందలిరుచి వర్ణించరాదు
కూడిమాడి యారగించేకోరికలే యెఱుఁగును
జాడతో నాపె చెప్పంపెఁ జనవియ్యవయ్యా ॥ఈప॥
పొలఁతికి నీపైఁగలపొందు లెరిఁగించవచ్చు
చెలిమి కాఁగిటఁదెచ్చి చిక్కించరాదు
వొలిసి కూడితిరి మీ వొడఁబా టైరుఁగును
అలరి శ్రీ వేంకటేశ ఆదరించవయ్యా ॥ఈప॥ (212)

భావము: చెలుల ద్వారా తన ఎడబాటును తెలియజేస్తోంది ప్రియురాలు!

శ్రీ వేంకటేశ! ఈ పని మీద మేము నీ దగ్గరకు వచ్చి ఎంతో సేపు అయినది. మమ్ములను కాపాడి ఇంతటిలో కరుణించవయ్యా! ఏ విధంగానైనా మాటలతో వలపులు వర్ణించవచ్చు గాని, పైబడి లోపల తమకము సానబెట్టి చూపలేము. ఆమె చికాకుపడిన విషయం మనసుకు తెలుసు. ఆమె నీ కోసం ఎదురు చూస్తోంది. నీవు అండగా నిలువవయ్యా! సరదాగా ఆమె చెప్పే విందుకు రమ్మని కోరవచ్చు. అలవాటుపడిన అందలి రుచిని వర్ణించలేము. సఖ్యతతో భుజించే కోరికలకు విషయం తెలుసు, గుర్తుగా ఆమె సందేశం చెప్పి పంపింది. నీవు ఆమెకు చనవునియ్యవయ్యా! ఆ వనితకు నీపైగల సఖ్యత తెలియజేయవచ్చుగాని స్నేహంతో కౌగిటజేర్చి చిక్కిపోయేలా చేయగూడదు. ఒకరినొకరు వలచి కలుసుకొన్నారు. అందువల్ల మీ వొప్పందాలు తానెరుగును, ఓ స్వామీ! సంతోషించి ఆమెను ఆదరించవయ్యా.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here