అన్నమయ్య పద శృంగారం-23

0
12

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

సాళంగం

ఇద్దరును మేనవారే ఇయ్యకోలే ఇందరికి
పొద్దువొద్దుకు నిచ్చల భోగింతురుగారా ॥పల్లవి॥
మెలుఁతుకు నీవైతే మేలువాఁడవు తొల్లె
నెలకొని యాపెయును నీకు వలచు
యెలమిఁ జెలికత్తె లెడమాట లేమాడేరు
తలంచుక మీరే రతిఁదగులుట గాక ॥ఇద్ద॥
ఆకెమనసుమర్మము లన్నిటా నీవెరుఁగుడు
దాని నీమన సాకె తా నెరుఁగును
యీకడాకడిచుట్టాలు యేమిబుద్దులు చెప్పేరు
మేకొని సరసములు మీరే యాడుట గాక ॥ఇద్ద॥
నీదేవులమంచముపై నీవు పాదాలు చాంచితే
ఆదటఁ జేయి నీమంచాన నాపై చాచెను
యీదెస శ్రీ వేంకటేశ యేమని యెచ్చరించేము
పోదితోఁ గూడితి రిట్టె పొసఁగుట గాక ॥ఇద్ద॥ (213)

భావము: చెలులు తమ సఖి గోడును స్వామికి విన్నవిస్తున్నారు:

శ్రీ వెంకటేశ! మీరిద్దరు మేనరికపు వరుస గలవారే. ఇంతమందికీ అది ఇష్టమే. నిత్యమూ మీరు ఇష్టంగా భోగాలు అనుభవిస్తున్నారుగా. ఇంతకుముందే నీకు మా సఖి ఇష్టమైనది. ఆమెకూడా నిన్నే ప్రేమించింది. మధ్యలో చెలికత్తెలు పలికే వ్యర్థపు మాటలతో పని ఏముంది? తలపోసి మీరిద్దరే రతి సౌఖ్యంలో తేలియాడుదురుగాక! ఆమె మదిలోని మర్మములన్నీ నీ వెరుగుదువు. దగ్గరగా వున్న ఆమెకు నీ మనసు తెలుసు. అక్కడా ఇక్కడా వున్న చుట్టాలు. ఏ విధమైన బుద్ధులు చెప్పగలరు? మీ అంతట మీరే సరసాలాడుకోవాలి. నీ దేవి మంచంపైన నీవు పాదాలు చాచితే వెంటనే మంచంపై ఆమె చేయి చాచింది. ఇట్టి సమయంలో స్వామీ! సఖ్యతతో మీరిద్దరూ ఈ విధంగా కూడి వుండాలిగాని మేము ఏమని హెచ్చరించగలము? – అని హితవు చెబుతున్నారు చెలులు.

శ్రీరాగం

ఇంపుగలిగినచోట నెగ్గులుపట్టఁగనేల
గుపించి మీరే ఆడుకొనేరే సవతులు ॥పల్లవి॥
కూరిమితో రమణునిఁ గొంత సొలసినసతి
వేరులేని మాటల వేఁడుకొనును
బీరముతో రతివేళ బిగిసి పెనఁగులాడి
చేరి యంతతోఁ గరఁగి చెక్కు నొక్కును ॥ఇంపు॥
చనవున బొమ్మలను జంకించిన కాంత
మునుకొని యాసరేఁచి మోవి చూపును
కొనగోరఁ జిమ్మిచిమ్మి గుట్టుతో నొట్టుపెట్టి
తనివారాఁ గాఁగిలించి దప్పిచేర్చును ॥ఇంపు॥
శిరసువంచుక లోలో సిగ్గులువడినలేమ
సరికి బేసికి సరసములాడును
ఇరవై శ్రీ వేంకటేశుఁ డిన్నిటాఁ గూడెం గనక
పరగఁ బెండ్లిపీఁటపైఁ గొలువుండును ॥ఇంపు॥ (214)

భావము: ముద్దరాలైన లేమ తన పతితో సరసాలాడగలదని చెలులు ప్రకటిస్తున్నారు:

ఏమమ్మా! ప్రీతి గలిగినచోట తప్పులు పట్టనేల? ఈర్ష్యపడిన ఓ సవతులారా! మీరేల ఆడుకొంటారు. ప్రేమతో ప్రియుని అలయింపజేసిన సతి భేదాభిప్రాయములేని మాటలతో వేడుకొంటుంది. బీరాలు పోయి రతి సమయంలో బిగుసుకుపోయి పెనగులాడిన సతి దగ్గరగా చేరి అంతలోనే కరిగిపోయి అతని చెక్కిలి నొక్కుతుంది. చనువుతో కనుబొమ్మలతో బెదిరించిన వనిత ముందుకువచ్చి ఆశలు రేపి పెదవి ఆనిస్తుంది. కొనగోటితో చిమ్మి గుట్టుగా వొట్టు పెట్టుకొని తనివిదీర కౌగిలించి అతని దప్పిక తీరుస్తుంది. తలవంచుకొని సిగ్గులొలికించిన భామ సరిబేసుల ఆటకై సరసాలాడుతుంది. శ్రీవెంకటేశుడు ప్రీతితో ఇన్నిరకాలుగా కూడాడు గాబట్టి వెంటనే పెండ్లిపీటలపై కూచోవడానికి ఆమె సిద్ధపడుతుంది.

సౌరాష్ట్రం

ఔనయ్యా మంచివాఁడ వాకెచిత్త మెఱఁగవు
మానాపతైనదాని మరి రట్టుసేతురా ॥పల్లవి॥
సిగ్గరి పెండ్లికూఁతురై శిరసువంచుకుండఁగ
దిగ్గన నొడిపట్టేల తీసేవు నీవు
తగ్గి చెలిమఱఁగునఁ దప్పించుకొనఁగానే
వెగ్గళించి గోరు సోఁక వేఁడుకొనేవు ॥ఔన॥
కడలేనిముద్దరాలై కంబమువట్టుకుండఁగా
అడరి కూచుండుమంటా నానవేట్టేవు
చిడుముడితోడ నీకుఁ జేతులెత్తి మొక్కఁగానే
గుడిగొనఁ బయ్యదకొంగు జారించేవు ॥ఔన॥
పట్టపుదేవులై బడివాయకుండఁగానే
జట్టిగొని తొడమీఁదఁ బెట్టుకొనేవు
ఇట్టె శ్రీ వేంకటేశ యీకె నిన్నుఁ గూడఁగానె
చుట్టరికాలెల్లాఁ జెప్పి చొక్కించేవు ॥ఔన॥ (215)

భావము:- ముద్దరాలి చిత్తాన్ని చిత్రించే కీర్తన:

శ్రీవెంకటేశ! నీవు చాలా మంచివాడవు. ఆమె మనస్సు నీకు తెలియదు. అభిమానవతియైన ఆమెను రచ్చకీడుస్తారా? సిగ్గుల మొగ్గయయిన పెండ్లి కూతురై తలవంచుకొని కూచొనియుండగా త్వరపడి ఆమె వొడి పట్టుకొని వొట్టు పెట్టుకున్నావెందుకు? ఆమె కొంచెం తగ్గి పక్కనే రహస్యంగా తప్పించుకొనడం చూచి నీవు విజృంభించి గోటితో గీరమని ప్రార్థిస్తున్నావు. మిక్కిలి ముగ్ధయై స్తంభము పట్టుకొని (చాటున) నిలుచుండగా భయపెట్టి కూచోమని ఆజ్ఞలు జారీచేశావు. తడబడుతూ నీకు చేతులెత్తి నమస్కరించగానే త్వరత్వరగా పైటకొంగు జారదీశావు. పట్టపురాణియై ఆమె నిన్ను ఎడబాయక నిలుచొని యుండగా ఆమెతో జట్టుగట్టి తొడమీద కూర్చొండ బెట్టుకొన్నావు. ఈ విధంగా స్వామీ! ఆమె నిన్ను కలియగానే బంధుత్వాలన్నీ కలిపి చెప్పి ఆమె సొక్కిపోయేలా చేశావు.

శంకరాభరణం

పెరగయ్యీ నీచేఁతకు విట్టలేశ్వరా
విరులుచల్లే నప్పటి విట్టలేశ్వరా ॥పల్లవి॥
వేడుకకాఁడవు నీవు విట్టలేశ్వరా మాకు
వీడె మియ్యఁగదవోయి విజ్ఞలేశ్వరా
వీడవు మనపొందులు విట్టలేశ్వరా
వీడుదోడాడీ వలపు విట్టలేశ్వరా ॥పెర॥
వెన్నదిన్న నోరితో డివిట్టలేశ్వరా
వెన్నెలనవ్వు నవ్వేవు విట్టలేశ్వరా
వెన్నుండ నీకు మొక్కేము విట్టలేశ్వరా మా –
విన్నపము లాలించు విట్టలేశ్వరా ॥పెర॥
విచ్చేయు మాయింటికి విట్టలేశ్వరా యెంత
విచ్చి చెప్పేవు కతలు విట్టలేశ్వరా
కుచ్చి శ్రీ వేంకటాద్రిపైఁ గూడితివి నన్ను
విచ్చనవిడాయ నిఁక విట్టలేశ్వరా ॥పెర॥ (216)

భావము: పాండురంగ విఠలుని వెంకటేశ్వరుని కభేదంగా భావించిన కీర్తన!

ఓ విఠలేశ్వరా! పూలు చల్లే అప్పటి నీ పనులకు భయమేస్తోంది. మాకు నీవు సరదా కలిగించే వ్యక్తివి. నీవే తాంబూలం అందించరాదా? మన పొందులను వదలిపెట్టవు. ప్రేమ అనేది కలిసి మెలసిపోయింది. వెన్నెలు తిన్న నోటితోనే వెన్నెలలవంటి నవ్వులు చిందుస్తున్నావు. శ్రీమహావిష్ణువైన నీకు మొక్కుతున్నాము. మా విన్నపాలు శ్రద్ధగా ఆలించవయ్యా! ఆ విఠలా! మా యింటికి రావయ్యా! నీవు ఎన్నో రకాలుగా కథలు విప్పి చెబుతున్నావు. దగ్గరగా చేరి నన్ను కలిశావు. ఇకపై మనకిద్దరికీ విచ్చలవిడి అవుతుంది సుమా!

రీతిగౌళ

ఎందరు లేరు సతులు యెన్నెన్నిచందాలవారు
చెంది నీనాపొందువలెఁ జెప్పరాదు గాని ॥పల్లవి॥
వేడుకమాట లెన్నైనా వేవేలు నాడఁగవచ్చు
కూడిమాడివుండేది గురుతుగాని
చూడఁజూడ వినయాలు సూడిదెలు పట్టవచ్చు
యీడుజోడైన వలపు లెక్కుడు గాని ॥ఎంద॥
ననిచి యెంతవడైనా నవ్వులు నవ్వఁగవచ్చు
మనసెనసి వుండుటే మర్మము గాని
చెనకి వినోదపుచేఁతలు సేయఁగవచ్చు
కొనసాగెడుకూటమే కొరయౌఁగాని ॥ఎంద॥
యెదురుబడి నుండి ఇంపులు చల్లఁగవచ్చు
వదలనిఁగిళ్లే వైపులుగాని
ఇది శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పొదిగొన్న సంతోసాలే పోదులౌఁ గాని ॥ఎంద॥ (217)

భావము: దక్షిణ నాయకునితో తన సఖ్యన్ని తలపోసి సంతోషిస్తోంది:

శ్రీవేంకటేశ! నీకు ఎందరో ప్రియురాండ్రు (సతులు) లేరా? వారందరూ ఎన్నో రకాలవారు. అయినా మన యిద్దరి మధ్య పొత్తుం చెప్పనలవిగాదు. సరదామాటలు ఎన్నైనా వేనకువేలు చెప్పవచ్చు. కలసిమెలసి వుండేది మాత్రమే గుర్తుగా నిలిచిపోతుంది. లెక్కించి చూడగా వినయాలనే కానుకలుగా గ్రహించవచ్చు. వాటికంటె ఈడుజోడైన ప్రేమయే అధికం. మనసు తెలుసుకొని వుండటమే అసలు రహస్యం. ప్రేమతో ఎంతవాడైనా నవ్వులు నవ్వవచ్చు. కొనసాగబోయే సఖ్యతయే కొరవడింది గానీ, దగ్గరగా చేరి వినోదపు చేష్టలు ఎన్నైనా చేయవచ్చు. ఎదురుగా నిలబడి ప్రేమలొలకించవచ్చు. వీడని కౌగిళ్లే వొడుపులు ఓ స్వామీ! ఈ విధంగా నన్ను ఏలుకొన్నావు. ఒక చోట చేరిన సంతోషాలే నాకు రక్ష.

లలిత

కడుఁగడుముద్దరాలు కామిని నీకు మేలుది
అడుగవయ్యా నీవేయైనా నాపెమనవి ॥పల్లవి॥
పడఁతి సిగ్గున విన్నపము సేయకున్నదేమో
వడి నిన్నింటికిఁ బిలువఁగవచ్చెను
వొడికాన వేళచూచుకున్న భావమో యేమో
చిడుముడి చెక్కుచేతఁ జిమ్మిరేఁగుచున్నది ॥కడుఁ॥
అట్టె మానాపతి గాన అడఁకువ నున్న దేమో
గుట్టునఁ గానుక చేతఁబట్టుకున్నది
దిట్టయై నీతలఁపులు దెలియవలసియేమో
యెట్టయెదుటనుఁ జేతులెత్తి మొక్కుచున్నది ॥కడుఁ॥
యేకతాన నూడిగాలు ఇట్టే సేసేనంటానేమో
దాకొని నీపానుపుదండ నున్నది
యీకె నింతలో శ్రీ వేంకటేశుఁడ కూడితివి
మేకొని నిన్నిన్నిటను మెచ్చుకొంటా నున్నది ॥కడుఁ॥ (218)

భావము: ముద్దరాలైన తన చెలిని లాలించి పాలించమని సఖి చెబుతున్న వైనమిది:

శ్రీ వేంకటేశ! మా చెలి ఎంతో ముద్దరాలు. నీకు తగిన భామ. నీవైనా ఆమె మనవిని అడగరాదా? సిగ్గుపడి మా చెలి తన విన్నపము సేయలేకున్నదేమో! త్వరత్వరగా నిన్ను తన యింటికి రమ్మని పిలవడానికి వచ్చింది. నేర్పుతో మీరు కలిసిన వేళ చూచుకున్న భావంచేత గాబోలు తొట్రుపడిన చెక్కులతో విజృంభించి పోతున్నది. అదే విధంగా అభిమానవతి అయినందున అణకువతో ఉన్నదేమో! రహస్యంగా (గోప్యంగా) కానుకను చేతిలో పట్టుకొని నిలుచుంది. దిట్టతనంతో నీ మనసు తెలుసుకోవాలని గాబోలు నీ ఎదుట నిలబడి చేతులెత్తి మొక్కుతోంది. ఏకాంతంలో నీకు సేవలు చేయాలని గాబోలు దాగికొని నీ పానుపు పక్కనే వుంది. ఓ స్వామీ! ఇంతలోనే నీవు ఆమెను కలిశావు. ఆమె అన్ని రకాలుగా నిన్ను మెచ్చుకొంటూ ఉంది.

గౌళ

ఇంతులాల చూడరమ్మ యెన్నఁగొత్తలు
సంతతము నీపెజవ్వనవనమందు ॥పల్లవి॥
చెలియ మోవినే సింగారము చిగిరించె
అలకల ననలుఁగొనలు సాగెను
మలసి కరములను మారాకులు వెట్టె
వలపులయీపెజవ్వనవనమందును ॥ఇంతు॥
మచ్చికతోడుత మంచిమాటలనే నీడలొతై
పెచ్చు రేఁగి చన్నులను పిందెలు వుట్టె
విచ్చనవిడి నవ్వుల వెన్నెలపంటలు వండె
వచ్చె నామని యీపెజవ్వనవనమందును ॥ఇంతు॥
పిఱిఁదిచక్కఁదనము పెద్ద పెద్దరాసులాయ
కొఱగలతొడలే కొమ్మలాయను
చిఱుఁజెమటలతోడ శ్రీ వేంకటేశుఁడు గూడి
వఱలుచు మించె నీజవ్వనవనమందును ॥ఇంతు॥ (219)

భావము: ఇంతి యౌవనాన్ని వనంతో పోల్చి శరీరావయాలను వర్ణిస్తున్నాడు.

ఓ చెలులారా! లెక్కించి చూడగా వింతవింత కొత్తలు ఈమె యౌవన సమయంలో నిత్యము కలిగాయో చూడరారమ్మా! వలపులు కుమ్మరించిన ఈమె యౌవనమనే వనంలో – చెలి పెదవిపైనే శృంగారము చిగిరించింది. ముంగురులలో తీగలు సాగాయి. చేతులు మారాకులు (చిగురాకులు) పెట్టాయి. ఆమె యౌవనవనమనే వసంతంలో మచ్చికతో కూడిన మంచిమాటలనే నీడలు పుట్టాయి. విజృంభించిన చన్నులకు పిందెలు పుట్టాయి. విచ్చలవిడి అయిన నవ్వులలో వెన్నెల పంటలు పండాయి. ఈమె యౌవనవనం విజృంభించింది. పిరుదుల సౌందర్యము పెద్దపెద్ద రాసులైనాయి. కొఱతపడిన తొడలే కొమ్మలైనాయి. శ్రీ వేంకటేశునితో గూడిన ఆమె చిరు చెమటలు పట్టాయి.

శుద్ధవసంతం

కలిగెఁగా నీకు నాపై కామనిధానమువలె
యెలమి నీభాగ్య మిఁక నేమిచెప్పేదయ్యా ॥పల్లవి॥
వొద్దిక నెట్టనెదుర నుంచుకొని కొలువులో –
నద్దమువలెఁ జూచేవు ఆపెమొగము
గద్దించి తానిచ్చిన బాగాలు పుక్కిటఁ బెట్టుకు
చద్దివలె దాఁచుకొని చవులు గొనేవు ॥కలి॥
అతిముదమున నాపై నడుగుకొంటాఁ బురాణ –
కతలువలె వినేవు కాంతమాటలు
తతి నాపెచూపులు పూదండలువలెనే నీమై
సతము భావించుక సంతోసించుకొనేవు ॥కలి॥
నీకుఁ గానుకవచ్చిననిమ్మపండ్లవలెనే
పైకొని సారె నంటేవా భామచన్నులు
యీకడ శ్రీ వేంకటేశ యిట్టె నన్ను రతిఁ గూడి
సాకిరిగాఁ బెట్టుకొని జంటపెండ్లాడేవు ॥కలి॥ (220)

భావము: మా చెలి నీకు గొప్ప నిధివలె దొరికింది. ఆమెతో నీ సరసాలు మాకు తెలుసు – అంటోంది చెలి.

శ్రీ వెంకటేశ! నీ భాగ్యాన్ని ఇంకా ఏమని చెప్పగలనయ్యా! ఆమె నీకు కామనిధివలె లభించింది. వొద్దికగా ఆమెను నీ ఎదురుగా కూచొండ బెట్టుకొని కొలువులో అద్దం చూచినట్లు ఆమె ముఖ సౌందర్యం చూస్తున్నావు. గద్దించి ఆమె ఇచ్చిన వీడెములు బుగ్గన పెట్టుకొని చద్దివలె దాచుకొని రుచులు అనుభవిస్తున్నావు. ఎంతో సంతోషంతో ఆమెను అడుగుతూ ఆమె చెప్పే మాటలను పురాణగాథలు విన్నట్లు వింటున్నావు. తృప్తిగా ఆమె చూపులే నీ శరీరంపై పూలదండలుగా భావించి నిత్యము సంతోషపడుతున్నావు. నీకు కానుకగా వచ్చిన నిమ్మపండ్లవలె ఆ భామ చనుదోయిని మాటిమాటికీ ముట్టుకొంటున్నావు. ఇక్కడ స్వామీ! నాతో రతిలో క్రీడించి నన్ను సాక్షిగా పెట్టికొని ఇద్దరినీ పెండ్లాడావు సుమా!

పాడి

చెల్లఁబో ఆఁటడానికి సిగ్గు దలఁచుకోవద్దా
చెల్లుబడిగానిచోట చెనకఁగవచ్చునా ॥పల్లవి॥
ఆతఁడూ నేనూ మాటలాడుతా నుండఁగానే
యీతల నీవేల కానుకియ్యవచ్చేవే
రాతిరిఁబగలు నాకు రమణుఁడై వుండఁగా
చేతులెత్తి నీవేల సేసలు చల్లేవే ॥చెల్లఁ॥
పొదలి నే మిద్దరముఁ బొత్తుల నుండఁగానే
సదరాన నీవేల కొసరవచ్చేవే
ముదమున మాలో నేము మొగములు చూచుకోఁగా
అదన నీకు నిఁక నడ్డాలు రాఁదగునా ॥చెల్లఁ॥
కలలో నే వింతలోనే కాఁగిలించుకొనఁగాను
సొలసి మమ్ముఁ దప్పకచూచే విదేమే
యెలమి శ్రీ వేంకటేశుఁ డిటు నన్నుఁ గూడినాఁడు
వెలి నుండి నీ వెంత వెరగందేవే ॥చెల్లఁ॥ (221)

భావము: తన సపత్ని గడుసుదనాన్ని కాంత ఈసడిస్తోంది!

ఏమామ్మా! చెల్లుబాటు కాని చోట కదియవచ్చునా? మంచిదేనమ్మా! ఆడదానికి సిగ్గు కొంచెమైనా వుండాలి గదా! నేనూ, నా ప్రియుడు సరసాలాడేవేళ, ఈ వైపున నీవు కానుక యివ్వడానికి ఎందుకొచ్చావే? నా రమణుడు రాత్రింబగళ్లు నా వద్ద నుండగా నీవు చేతులెత్తి అతనిపై సేసలు చల్లుతున్నావెందుకు? ఏకాంతంగా మేమిద్దరము సఖ్యతతోనుండగా వేళాకోళంగా నీవెందుకు కొసరడానికి వచ్చావే? సంతోషంతో మాలో మేము ముఖాలు చూచుకొంటుండగా అదే అదనుగా భావించి మాకు అడ్డాలు రావడం భావ్యమా! మేమిద్దరం ఏకాంతంగా కలిసి కౌగిలించుకోగా నీవు ఆశ్చర్యంగా మమ్ములనిద్దరినీ విడిచిపెట్టకుండా చూస్తావిదేమి చోద్యమే! శ్రీ వేంకటేశుడు నాతో కూడి వున్నపుడు నీవు బయట నిలబడి ఆశ్చర్యపోవడం ఎందుకే?

హిందోళం

ఎందాఁకా సరసమాడే వేమయ్యా
పొందుగా నలపుదీర్చి భోగించరాదా ॥పల్లవి॥
చక్కనిజవ్వని నీవు సారెకు నవ్వించఁగాను
చెక్కులునిండాఁ గడుఁజెమరించెను
ఇక్కువ లంటుకొనుచు నీవు యిట్టె పెనుఁగులాడఁగా
ముక్కున నిట్టూర్పులు ముంచుకొనెను ॥ఎందాఁ॥
గారాపుదానిచేతఁ గతలు చెప్పించుకోఁగా
పేరి పెదవిపైఁ దమ్మబేంట్లు రాలెను
గోరనంటి పయ్యదలో గుబ్బలు గదలించఁగా
జారి కొప్పులో విరులు జల్లనరాలీని ॥ఎందాఁ॥
కోమలి నింతలో నీవు కొసరి కాఁగిలించఁగా
ఆముక విరిబాగులాయ మేనెల్లా
కామించి శ్రీ వేంకటేశ కలికిని నీ వేలఁగా
వేమారు మోవితేనెలు వేడుకలు రేఁచెను ॥ఎందాఁ॥ (222)

భావము: ముద్దరాలిని అక్కున చేర్చుకొని లాలించమని కాంతునికి చెలులు హితవు పలుకుతున్నారు!

శ్రీ వెంకటేశ! ఎంతో సేపు సరసాలాడుతున్నావేగానీ, దగ్గరగా చేరి ఆమె అలసట దీర్చి భోగించరాదా? అందాలరాశియైన మా యౌవనవతిని నీవు మాటిమాటికి నవ్వించగా ఆమె బుగ్గలనిండా చెమటలు పట్టాయి. ఆమె వున్న ప్రదేశాలు గుర్తించి వెళ్లి, నీవు ఇలానే పెనగులాడగా ఆమెకు నిట్టూర్పులు ముంచుకొని వచ్చాయి. గారాబు చేసి ఆమెచేత కథలు చెప్పించుకోగా ఆమె పెదవిపై తమలపు తుంపురులు రాలాయి. నీవు నీ గోటితో ఆమె పైటలోని చనుదోయి కదిలించగా కొప్పులో నుండి జారి పూలు జల్లున రాలాయి. ఇంతలోనే నీవు మా సఖిని కొసరి, కౌగిలించగా శరీరమంతా వ్యాపించిన పూల జల్లులయినాయి. స్వామీ! నీవు మా సఖిని కామించి ఏలుకొనగా పలుమారు పెదవిపై తేనెలు వేడుకగా విరిశాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here