అన్నమయ్య పద శృంగారం-3

0
11

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

రేకు 803

హిందోళం

ఎదిరి దన్నెరగని దేటియాటది
కది సేవు వలపులకలగంప గలఁదా ॥ పల్లవి॥
కూరిమి నావద్ద వచ్చి కూచుండినపతితోను
సారెసారె గొసరితే చవి వుట్టునా
నారుకొన నాతోను నవ్వు లితడు నవ్వగ
చేరి చెనకే వెంతచిత్తిణివే నీవు ॥ ఎది॥
మందలించి నాతోను మాటలాడగానే నీవు
సందునుడి గత చెప్ప సంగతే యిది
కందువ నాతడు నన్ను గాగిలించుకుండగాను
అంది విడేలిచ్చే వెంతయాసోదక త్తెవే ॥ ఎది॥
శ్రీ వేంకటేశుడు నేనూ జేరి తెరలో నుండగా
సేవలకు దగ్గరేవు చెల్లదే నీకు
కైవశమై నాకితడు గలసిమెలశుండగా
నీవు (పూ?) జెప్పుకొనే వేటినేరుపరివే ॥ ఎది॥ (13)

~

భావము: స్వాధీన పతికయైన సతి వేరొక ప్రియురాలితో నిందోక్తులాడు కీర్తన ఇది. తన విభుడు కౌగిటిలోనుండగా దగ్గర చేరిన వనితను చిత్తిణీ జాతి స్త్రీగాను, ఆ సోదకత్తెగాను, నేరుపరిగాను నిందించింది.

ఎదుటి వారిని, తనను తెలుసుకోలేని తుమ్మెద ఆటలో నుండగా నీవు సమీపించావు. ప్రేమలో కలగూరగంప వుంటుందా? ప్రేమతో నా యింటికి వచ్చి నాకు దగ్గరగా కూచున్న పతిని నీవు మాటిమాటికే కొసరి కొసరి ఆడిగితే రుచులూరేనా? వలపులు పుట్టగా నాతో ఇంతకు నవ్వులాటలో వుండగా దగ్గరగా వచ్చి తాకితే నీవు ఎంతటి చిత్తినీ జాతి స్త్రీవే. పతి నన్ను మందలించి మాటలాడగా నీవు సందు చేసుకొని వచ్చి కతలు చెప్పే సంగతీ ఇది. ప్రేమతో ఆతడు నన్ను కౌగిట చేర్చగా అదను చూచి అతనికి తాంబూలమిస్తున్న నీవు ఎంతటి ఆసోదకత్తెవే. శ్రీవేంకటేశుడు, నేను ఏకాంత శయనంలో తెరలోనుండగా సేవించడానికి నీవు ముందుకురకడం నీకు చెల్లదు. ప్రతి నా ఆధీనంలో కలిసి మెలసి వుండగా నీ గోడు చెప్పుకొనే నీవు ఎంతటి నేర్పరివే!

దేసాళం

వలచి వచ్చితి నేను వానికిగాను
నెలవై మీ గొల్లవాడనే తానుండున న (సం?) టా ॥ పల్లవి॥
చెందమ్మికన్నులవాడు చేతిపిల్ల గోవివాడు
యిందు వచ్చె గంటిరా యేమిరే యమ్మా
మందలపసువువాడు మకరాంకములవాడు
యెందు నున్నాడు చెప్పరే యేల దాచేరమ్మా ॥ వల॥
నెమలిపించెమువాడు నీలమేఘకాంతివాడు
రమణు డాతడు, మొక్కే రమ్మనరమ్మా
జమళిచేతులవాడు సంకుజక్రములవాడు
అమర మీపాల జిక్కునట చూపరమ్మా ॥ వల॥
పచ్చబైడిదట్టివాడు పక్షివాహనపువాడు
యిచ్చినాడు నా కుంగర మిదివో యమ్మా
చెచ్చెర గొనేటివాడు శ్రీ వేంకటేశ్వరుడు
వచ్చి నన్ను గూడినాడు వాడువో యమ్మా ॥ వల ॥ (14)

~

భావము: ఒకానొక గోపిక పరకాంత వద్ద వున్న శ్రీకృష్ణుని వెదుకుతూ వచ్చి నల్లనయ్యను వర్ణిస్తోంది. కృష్ణునకు వేంకటేశ్వరునకు అభేదము.

ఏమమ్మా! నేను అతనిని ప్రేమించి వచ్చాను. అతడు మీ గొల్ల పల్లెలోనే నివసిస్తుంటాడట! అతడు ఎర్రతామర పూలకంటి కనులు గలవాడు. చేతిలో పిల్లనగ్రోవి గలవాడు. ఇటు వైపు రావడం మీరు చూశారా అమ్మా! గోవుల మందలవాడు, మకరిక పత్రములవాడు, అతడెక్కడ ఉన్నాడో చెప్పండి. అతనిని దాచుట ఎందుకు? ఆతడు నెమలి పింఛమును ధరించినవాడు, నీలమేఘ శరీరము గలవాడు, అందగాడు. మీకు మొక్కుతానూ అతనిని నా వద్దకు రమ్మని చెప్పరే! ఆతడు నాలుగు చేతులు గలవాడు, శంఖ చక్రములు ధరించిన వాడు. అతడు మీకు వశమైనాడట. దయతో నాకు చూపండి. ఓయమ్మా! పీతాంబరము ధరించినవాడు, గరుత్మంతుడు వాహనముగా గలవాడు నాకు ఆనవాలుగా ఇదిగో ఈ ఉంగరమిచ్చాడు. కోనేటి రాయడైన శ్రీ వేంకటేశ్వరుడు అదిగో! వచ్చి నీతో క్రీడిస్తున్నాడు.

కౌశి

నీకు బాతై నీముందర నిలుచున్నది
దాకొని నిన్నెటువలె దగిలీనో కాని ॥ పల్లవి॥
చెలరేగి చెలరేగి సేవలు నేసి నాపె
వలచి తానెందుండి వచ్చెనో కాని
వెలలేనిసింగారాల వింత మొగము దాపె
కలయ నెన్నాళ్ళనుండి కలిగెనో కాని ॥ నీకు॥
నిట్టచూపులతోడ నీమొగము చూచీ నాపె
వొట్టి నీవేవూరో తానేవూరో కాని
బట్టబయలు నీతోను పైకొని నవ్వీ నాపె
చుట్టరికము నీకుదా నెట్టాయనో కాని ॥ నీకు॥
పొంచి నీవద్ద గూచుండి పువ్వులు ముడిచి నాపె
అంచెలదా నెన్నడు పెండ్లాడెనో కాని
యెంచగ నన్ను శ్రీ వేంక టేశ నేడు గూడితివి
పంచలపాలై తానేల పదరినో కాని ॥ నీకు॥ (15)

~

భావము: ఓ వెంకటేశ! వచ్చిన ఈమె నిన్ను ఏ విధముగా ప్రీతితో తగులుకొన్నదోగాని, నీతో పూర్వ పరిచయమున్నట్లుగా నీ ముందు వచ్చి నిలుచున్నది. నిన్ను ప్రేమించి ఎక్కడి నుండి వచ్చెనో గాని ఉత్సాహంతో ఆమె సేవలు చేస్తోంది. ఎన్నాళ్లనో నుండి నీతో సఖ్యమోగాని వెలకట్టలేని అత్యంత శృంగారవతి అయిన ముఖము గలది. ఆమెది ఏవూరో, నీది ఏవూరోగాని ప్రియమైన చూపులతో నీ ముఖం చూస్తోంది. ఆవిడకు, నీకు ఏవిధమైన చుట్టరికమోగాని, బహిరంగంగా నిన్ను సమీపించి నవ్వుతోంది. నీ సతుల వరుసలో నిన్ను తాను ఎన్నడు పెండ్లాడెనోగాని, సమయము చూచి నీకు దగ్గరగా కూచుని పూలు తురుముతోంది. ఓ స్వామీ! నన్ను ఈనాడు నీవు కలిశావు. ఆమె నీ పంచలలో ఎందుకు తిరుగుతోంది.

కన్నడ గౌళ

ఏమి చెప్పేది నీసుద్దులు యెంతవాడవు
చేముట్టి నామీద నిట్టె సేసలు చల్లేవు ॥ పల్లవి ॥
ముచ్చట నెవ్వతైనా నీమోము చూచితే జాలు
చెచ్చెర మేనవావి చెప్పుకొందువు
మచ్చికతో నొకమారు మాటాడితే జాలు
గచ్చుల నంతటిలో కంకణము గట్టుదువు ॥ ఏమి ॥
చెంగట మగవాడని సిగ్గుపడితే జాలు
సంగడి నందుకే సరసమాడుదువు
ముంగిటికి నీవు రాగా మొనసి మొక్కితే జాలు
కొంగుపెట్టి పెనగి గక్కున గాలింతువు ॥ ఏమి ॥
చిప్పిలునీసేతలకు సెలవి నవ్వితే జాలు
దప్పిదేర మోవి యాని తగులుదువు
యిప్పుడిటె శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
వొప్పుగ రేయిబగలు వొనగూడి యుందువు ॥ ఏమి ॥ (16)

~

భావం: శ్రీవెంకటేశ! నీ డంబాలు ఏమని చెప్పేది? నీవెంతో గొప్పవాడవు. నా చేయి పట్టుకొని నా మీద అలా సేసలు చల్లుతావు. ఏ వనిత అయినా నీ ముఖం వైపు చూస్తే చాలు మేనరికం వరుస కలుపుతావు. మచ్చికతో ఒక్కసారి మాట్లాడితే చాలు ఆమెను పట్టుకొని చేతికి కంకణం గడతావు. నీముందు నిలబడి మగవాడివని సిగ్గుపడితే చాలు స్నేహభావం చూపి సరసాలాడుతావు. నీవు దగ్గరగా వచ్చినప్పుడు వారు మొక్కితే చాలు అదే అదనుగా చూచి కొంగు పట్టుకొని లాగి వెంటనే కౌగిలిస్తావు. పైకి కనిపించే నీ చేష్టలు చూచి పెదవుల మాటున నవ్వితే చాలు వారి పెదవులంటి దప్పికదీర సేవిస్తావు. ఈ విధంగా స్వామీ! నీవు రాత్రింబగళ్లు నాతో సఖ్యంగా వుండి ఇప్పుడీ విధంగా నన్ను ఏలుకున్నావు.

సామంతం

చూడ బిన్నవు గాని నీసుద్దు లెన్నైనా గలవు
వేడుకకత్తెకు గాని వేసాలింత రావే ॥ పల్లవి॥
తేలగిల రమణుని దిష్టించి సారె జూచేవు
చేలకొం గాత డంటితే సిగ్గుపడేవు
నాలితనాన సెలవి నవ్వూ గొంత నవ్వేవు
యీలీల తరితీపులు యెన్ని నేర్చుకొంటివే ॥ చూడ॥
మునుకొని మగవాని ముందరనూ బొలసేవు
పెనగి పైకొంటే దప్పించుకొనేవ
మనసిచ్చి యంతలోనె మంచిమాట లాడేవు
యెనలేనియడియాస లెన్ని నేర్చుకొంటివే ॥ చూడ॥
సేవ సేసేదానివలె చేరి వద్దనే వుండేవు
శ్రీ వేంకటేశు డేలితే జీరదీసేపు
భావించాడతడు నన్నేలె పాదాలకు మొక్కేవు
యీవిధాన నిట్టిబూమె లేమి నేర్చుకొంటివే ॥ చూడ॥ (17)

~

భావం: అలుమేలు మంగతో చెలి సరసాలాడుతోంది. ఏమమ్మా! చూచేందుకు నీవు చిన్నపిల్లవేగానీ, నీ చేష్టలెన్నైనా ఉన్నాయి. ఇలాంటి వింతవింత వేషాలు అందాలభామకు గాని రావమ్మా! పారవశ్యంతో ప్రియుని దిష్టి తగిలేలా మాటిమాటికీ చూస్తున్న దానికి, పైటచెంగు అతడు పట్టుకోగానే సిగ్గుపడతావేమి? మగనాలివలె పెదవుల చివర కొద్దికొద్దిగా నవ్వుతున్నావు. ఈ విధమైన అపేక్షలు ఎన్ని నేర్చుకొన్నావే! ప్రయత్నపూర్వకంగా మగవాని ముందర తిరుగుతున్నావుగానీ అతడు పైబడితే తప్పించుకొంటున్నావు. నీ మనసు పంచి యిచ్చి యింతలోనే మంచిమాటలు పలుకుతున్నావు. అంతులేని అడియాసలు ఎన్ని నేర్చుకున్నావే! సేవ చేసే నెపంతో దగ్గరగా చేరి వుంటున్నావు. శ్రీ వేంకటేశుడు ఏలుకొంటానంటే గీత దాటవద్దంటున్నావు. ఆతడీ విధముగా నన్నేలుకొనెను. నాపాదాలకేల మొక్కుతున్నావు. ఈ విధమైన మారువేషాలు ఎంత నేర్చుకున్నావే – అని సరసోక్తులాడుతోంది.

ముఖారి

ఎఱగ గొల్లపడుచనిల్లు గాచుకుండగాను.
మఱి కృష్ణుడు వచ్చి నామయి చెమరింపించెనే ॥ పల్లవి॥
పాపట దువ్వేనంటా బాసికము గట్టినాడే
చాపేనంటా జేత సేసలు చల్లెనే
కాపురాలు సేతమని కాగిలించుకొనెనే
మాపుదాకా నేమో సేసి మనసు గరచెనే ॥ ఎఱ॥
కై దండ వట్టేనంటా కంకణము గట్టెనే
జూదాలాడేనంటా రొమ్ముచోటు గీరెనే
సోదించేనంటా నొడి చూపుమని పట్టెనే
పోదిసేసి వేగినంతా పులకలు రేచెనే ॥ ఎఱ॥
మొగము చూపు మనుచు మోవిపొత్తు గలసెనే
నగేనంటా బిగ్గెబట్టి నామెక్కించెనే
చిగురుబడుకమీద శ్రీ వేంకటేశుడు
తగరువలె మాటాడి తలపు చొక్కించెనే ॥ ఎఱ॥ (18)

~

భావము: కృష్ణుని చిలిపి చేష్టలను గోపకాంత ఏకరువు పెడుతోంది. ఏమమ్మా! ఆ కృష్ణుని లీలలు, గొల్లభామను ఇంటిపట్టున కాచుకొని వుండగా ఆ కృష్ణుడు వచ్చి నా శరీరమంతా చెమటలు పట్టేలా చేశాడు. నీ తల పాపట దువ్వుతాననే నెపంతో నొసట బాసికం కట్టాడు. చేయి చాపుతానంటూ తలపై సేసలు చల్లాడు. మనమిద్దరం కాపురం చేద్దామని కౌగిలించుకొన్నాడు. సాయంకాలం వరకు ఏమోమో చేసి నా మనసు దోచాడు. నీ చేయి పట్టుకొంటానని చేతికి కంకణం కట్టాడు. జూదమాడుదామని నా ఎదపై గీరాడు. ఏది వెదకనీ అంటూ నా వొడిని చూపమని పట్టుకున్నాడు. తెల్లవారే వరకు పోషించి పలకలు రేపాడు. ఏదీ నీముఖం చూపమని పెదవి పెదవి కలిపాడు. నవ్వుటాలకంటూ బిగి కౌగిట పట్టి పులకలు చిగురింపజేశాడు. శ్రీవేంకటేశ కృష్ణుడు మాయ మాటలాడి చిగురాకు శయ్యపైకి నన్ను చేర్చి మనసు కరిగింపజేశాడు. ఈ విధంగా ముగ్ధ అయిన నాయిక కృష్ణుని ఆగడాలు వివరించింది.

రేకు 804

సౌరాష్ట్రం

అంతే పో వోయమ్మ ఔనయ్య మంచివాడవు
పంతాన నీతో బెనగేపాటిదా యీమగువ ॥ పల్లవి॥
కన్నెపడుచైనదాని గాగిట బిగింతురా
పన్ని పూవువలె జేత బట్టుట గాక
చిన్నిచన్ను లొక్కమాటే చిప్పిల బిసుకుదురా
మన్ననలనే రతుల మరపుట గాక ॥ అంతే॥
సిగ్గరి పెండ్లికూతురు జింధు వందుగా దీతురా
వొగ్గి రొమ్ముమీద బెట్టుకుండుట గాక
కగ్గులేని కెమ్మోవి కడు బిప్పి సేతురా
తగ్గకుండా గాగిట దమించుటగాక ॥ అంతే॥
కొత్త వయసుపడుచు గోరికొన సోకింతురా
పొత్తుగ లాలన సేసి పొందుటగాక
యిత్తల శ్రీ వేంకటేశ యిన్నిటా నీవేలితివి
నిత్తెము నీ సేవలెల్లా నేరుపుటగాక ॥ అంతే॥ (19)

~

భావము: చెలికత్తె వేంకటేశుని మందలిస్తోంది – ముగ్ధ అయిన మా సఖిని బిత్తరపెట్టడం న్యాయమా? అని నిలదీసింది. అంతే పో ఓయమ్మా! అంటూ – శ్రీవెంకటేశా! ఔనయ్యా! నీవు మంచివాడవే. ఈ వనిత పంతంతో నీతో పొట్లాట పెట్టుకొనేంత సమర్థురాలు కాదు. సుకుమారమైన పూవువలె స్పృశించాలిగానీ కన్నెపిల్లను ఆ విధంగా కౌగిట్లో బిగిస్తారా? మాటామంతీ కలిపి రతులలో తేల్చాలిగానీ ఆమె చిన్ని చిన్ని చన్నులను నొప్పిపుట్టేలా గట్టిగా పిసుకుతారా? ప్రేమతో ఆవిడను ఎదపై చేర్చు కోవలెగానీ సిగ్గు లొలికే పెండ్లి కూతురిని బిత్తరపోయేలా చేస్తారా? అధికోత్సాహంతో కౌగిట చేర్చి తృప్తిపడతారేగాని అందమైన పెదవిని పిప్పిచేస్తారా? ముద్దు ముచ్చటలాడి పొందుననుభవిస్తారే గానీ, ఈ నవయవ్వనవతిని ఇలా గోటి నొక్కులతో బాధిస్తారా? నిత్యము నీకు సేవలు చేయడాన్ని నేర్పించాలిగదా! ఈ విధంగా నీవు ఆమెను ఏలుకున్నావు. ముగ్ధ అయిన సతితో మొరటుగా వ్యవహరించరాదని చెలి దెప్పి పొడుస్తోంది.

దేసాళం

ఇదివో నీపొందు లెట్టనరాదు
కదిపితే నంటురాయిగతివంటివాడవు ॥ పల్లవి॥
సూటిగా నీసింగారము చూడగవచ్చుగాని
నాటినచూపు దిప్పుకొనగరాదు
మాటలు నీతో నాడి మలయగవచ్చుగాని
మాటికి నీసల్లాపము మరవగరాదు ॥ ఇది॥
ననుపు సేసుక నీతో నవ్వగవచ్చు గాని
వెనక నది యణచుకొనగరాదు
చెనకి సరసమున చేత నంటవచ్చుగాని
పెనగొన్న కేలు విడిపించగరాదు ॥ ఇది॥
కలయికరతి నిన్ను గాగిలించవచ్చుగాని
వలవంత గొంతైనా వదలరాదు.
చెలరేగి నీవె నన్ను శ్రీ వేంకటేశ కూడితివి
యిల మెచ్చవచ్చుగాని యేమి (మీ?) ననరాదు ॥ ఇది॥ (20)

~

భావము: శ్రీ వేంకటేశుని మోహపరవశతను సతి వివరిస్తోంది: శ్రీవెంకటేశా! ఇదిగో! నీతోడి సౌఖ్యాలు ఏమని చెప్పగలను. ఒక్కసారి నిన్ను సమీపిస్తే నీవు సూదంటురాయి (అయస్కాంతం) వంటి వాడవు. నీ శృంగారాన్ని నేరుగా చూడగలంగాని, ఒకసారి నీపై కుదిరిన చూపును వెనకకు మరలించలేము. మురిపెపు మాటలు మాట్లాడి తిరగవచ్చుగాని, మాటిమాటికీ నీవు చేసిన సరససల్లాపాలు మరవలేను. ప్రేమతో నీతో కలిసి నవ్వవచ్చుగానీ, ఆపైన ఆ మోహాన్ని అణచుకోలేను. ఎదురుపడి సరసంగా నీ చేయి ముట్టుకోగలను గానీ, కలిపిన చేయిని విడిపించలేను. రతివేళ నిన్ను గాఢంగా కౌగిలించవచ్చుగానీ, మన్మథబాధను కొంతైనా సహించలేను. అతిశయంతో నీవు నాతో క్రీడించడం మెచ్చుకోగలను గానీ నిన్నేమీ అనరాదు.

స్వామి సతిని మోహపారవశ్యంలో మునగజేశాడని భావం.

మేఘరంజి

మొదల నిన్ను జూచితే మొగమోటము గనము
యెదురు గుదురుగా నిన్నేమి సేతుమయ్యా ॥ పల్లవి॥
కొంచక నీవు సేసేవి గొప్పగొప్పచేతలు
మంచిమాట లాడేవు మాతో నైతే
పొంచి చెవులారా వింటే పొసగ నీప్రియాలు
యెంచారావు పంచారావు యేమి సేతుమయ్యా ॥ మొద॥
యెక్కడనైనా నీచల మెంతవలసినా గద్దు
పక్కన నవ్వేవు మాతో పలుమారును
యిక్కడనే కంటిమి నీయిచ్చలు కోటికొండలు
యెక్కారావు దిగారావు యేమి సేతుమయ్యా ॥ మొద॥
హత్తిననీదేపుళ్లు అంతటా నిండి వున్నారు
గుత్తముగా నాకాగిట గూడితి విందు
నిత్తెము శ్రీ వేంకటేశ నీవలపు మోపులాయ
యెత్తారావు దించారావు యేమి సేతుమయ్యా ॥ మొద॥ (21)

~

భావము: సూటిపోటు మాటలతో సతి వెంకటేశుని మందలిస్తోంది. ఎంచా రావూ -పంచారావూ, ఎక్కారావు-దిగారావూ, ఎత్తారావు – దించారావు అనేది జన బాహుళ్యంలోని నానుడులు.

ఓ వేంకటేశా! ముందుగా నిన్ను చూచితే అధికమైన మొగమాటము కలుగుతుంది. ఎదురుబొదురుగా వస్తే నిన్నేమి చేయగలము? నీవు చేసే పనులన్నీ గొప్పవి. మాతోనైతే నీవు మంచిమాటలు చెబుతావు. కానీ నీ ప్రియమైన మాటలు చెవులారా వింటే అవి ఎంచారావు, పంచారావు (నిష్ప్రయోజనం). ఎక్కడైనా పట్టుదల అందామా అని ఎంతైనా వుంది. మాతో నీవు అనేకమార్లు ఫక్కున నవ్వేవు. నీ ప్రీతిని కోటికొండలు ఇక్కడే చూచాము. కాని ఏమి ప్రయోజనము? వాటిని ఎక్కలేము, దిగలేము నీ ప్రియసతులు అంతటా వ్యాపించి వున్నారు. అయితే ఇప్పుడు నా కౌగిట గుత్తకు దొరికావు. నీప్రేమ నిత్యము మోపై అధికమైంది. కాని దానిని ఎత్తలేము దించలేము. ఏమి చేయగలమయ్యా!

శ్రీరాగం

నవ్వుగాదు నే నిన్ను నమ్మితి జుమ్మీ
యివ్వల నామోవి లంచ మిచ్చితిజుమ్మీ ॥ పల్లవి॥
మంతనాన నీవాడినమాటలు మఱవకుమీ
కాంత లెందరైనా నీకు గలవాడవు
వింతలేకుండా నిప్పుడే విన్నవించుకొంటి నేను
అంతలోనే ఇది బాస యడిగె ననకుమీ ॥ నవ్వు॥
గట్టిగా బిగించుకొన్న నాకాగిలి దలచుకొమ్మీ
గుట్టునకు బెక్కు సతులు గూడేవాడవు
వొట్టి సేవలెల్లా జేసి వొడబాటు సేసుకొంటి
నెట్టనే నిన్ను మీదుకట్టితి ననకుమీ ॥ నవ్వు॥
పుక్కిటితమ్మ వెట్టినపొందు విడువకుమీ
మిక్కిలివనితలకు మేలువాడవు
నెక్కొని శ్రీ వేంకటేశ నిన్ను నిందుకే కూడితి
చొక్కించి నాసొమ్ముగా జేసుకొనె ననకుమీ ॥ నవ్వు॥ (22)

~

భావము: దక్షిణనాయకుడైన శ్రీవేంకటేశుని సతి మేలమాడుతోంది. శ్రీ వేంకటేశా! నేను నిన్ను నమ్మాను. ఇది నవ్వుటాల మాటగాదు. ఇక్కడ నా పెదవిని నీకు లంచమిచ్చాను. ఏకాంతంలో నీవు చేసిన బాసలు మరువవద్దు. నీవు ఎందరో కాంతలుగల దక్షిణనాయకుడవు. ఆశ్చర్యపోకుండా నేనిప్పుడే విన్నవించుకున్నాను. ఇంతట్లోనే ఆమె నన్ను బాస చేయమని అడుగుతోందనవద్దు.

రహస్యంగా ఎందరో సతులతో కలిసేవాడివి నీవు. ఈ నా బిగి కౌగిలిని ఒకసారి మనసుకు తెచ్చుకో! ప్రయోజనంలేని సేవలు చేసి నీతో వొప్పందం చేసుకున్నాను. అలా నిన్ను మీదు కట్టానని భావించకుమీ! నా పుక్కిటిలో తాంబూలాన్ని నీకందించిన స్నేహాన్ని వదలవద్దు. ఎందరో స్త్రీలకు ప్రియుడవు నీవు. ప్రియంగా నిన్ను నేను అందుకే కలిశాను. పరవశింపజేసి నా సొమ్ముగా నిన్ను చేసుకొన్నాననవద్దు సుమీ.

వెంకటపతి తనకు దూరమవుతాడేమోనని ఆన పెడుతోంది సతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here