కాజాల్లాంటి బాజాలు-36: అన్నీ బెంగలే!

1
11

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]ర్జంటుగా రమ్మన్న మా పిన్నికూతురు సుశీల ఫోన్ పిలుపుకి వదినా, నేనూ కలిసి హడావిడిగా తనింటికి వెళ్ళేం. వెళ్ళేటప్పటికి సుశీల పది లంఖణాలు చేసినదానిలా కనిపించింది. ఎంత పెద్ద జబ్బు చేసిందోనని ఖంగారుపడ్డాం. వాకబు చేస్తే సుశీల చెప్పిన సంగతులివీ.. సుశీల ఏదైనా సంగతి చెప్పిందంటే దాని చరిత్రలోకి వెళ్ళి తప్ప వర్తమానం లోకి రాదు. అందుకే సుశీల ఏం చెప్పిందో చెప్పింది చెప్పినట్టు చెప్పేస్తున్నాను.

“నీకు తెలీందేముంది వదినా. నలభైయేళ్ళక్రితం మా పెళ్ళైన కొత్తలో ఫ్రిజ్ కొనుక్కున్నాం. ఇంట్లోకి ఒక్కొక్క వస్తువూ అమర్చుకుంటున్నామని సంబరపడిపోయాం. అప్పుడు మా ఫామిలీ ఫ్రెండ్ “ఇంట్లోకి ఒక కొత్త వస్తువు కొని తెచ్చుకున్నామంటే ఇంట్లోవాళ్ళకి పనెక్కువైనట్టే” నంటూ ఒక మాటన్నారు. ఆ మాట విన్నప్పుడు సరిగా అర్ధం కాలేదు కానీ తర్వాత తర్వాత ఇంట్లోకి ఒక్కొక్కవస్తువూ వచ్చి చేరుతున్నప్పుడు అదేమాట “ఎంత నిజమో కదా!” అనిపించింది.

అలా సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఏదో కొత్త వస్తువు ఇంట్లో చేరడం, ఆ ఫామిలీ ఫ్రెండ్ అన్న మాటని గుర్తు చేసుకోవడం జరిగిపోయేది. కానీ ఈ మధ్య ఆయన చెప్పిన మాటని కాస్త మార్చితే బాగుండుననిపిస్తోంది. ఎందుకంటే, ఇన్నేళ్ళూ కొత్త వస్తువుతోపాటు కొత్తరకం పని వచ్చి చేరినా అది శారీరకంగానే ఉండేది. కానీ, ఈ మధ్య కాస్త పెద్దవాళ్ళమయి బీపీలు, సుగర్లూ లాంటివి ఒంట్లోకి చేరాక ఇంట్లోకి ఏ మిషన్ కొన్నా అది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఒత్తిడిని పెంచేస్తోంది. ఏంటి, ఇద్దరూ అలా తెల్లమొహాలేసుకుని చూస్తున్నారు! నేను చెప్పింది అర్ధం కాలేదా! అయితే అర్ధం అయేలా చెపుతాను వినండి.

నేనూ, మా ఆయనా ఇన్నాళ్ళూ బీపీ చూపించుకోడానికి నెలకోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేవాళ్లం. కాఫీ తాగితే బీపీ ఎక్కువ చూపిస్తుందని ఎవరో చెపితే, ఆ రోజు బీపీ చూపించుకుని వచ్చేదాకా కాఫీ కూడా తాగేవాళ్లం కాదు. క్లినిక్‌కి వెళ్ళగానే చూపించుకుంటే ఎక్కువ చూపిస్తుందని ఇంకెవరో చెపితే, వెళ్ళేక ఓ పది నిమిషాలో, పావుగంటో కూర్చుని, స్థిమితపడి చూపించుకునేవాళ్ళం. బీపీ లెవెలు కాస్త ఎక్కువగా చూపిస్తే, అక్కడే ఇంకో పదినిమిషాలు కూర్చుని, ఆ డాక్టర్ చేతే ఇంకోసారి చూపించుకుని, ముందు దానికీ, తరవాత దానికీ తేడా ఉందని నిర్ధారించుకుని, ‘హమ్మయ్య, పరవాలేదు’ అని సర్ది చెప్పుకుని ఇంటి కొచ్చేవాళ్లం. మరో నెల్లాళ్ళవరకూ దాని మాటే మర్చిపోయేవాళ్లం. అలా ఏదో మా తంటాలు మేం పడుతుంటే ఈమధ్య చుట్టపక్కాలను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు బీపీ మిషన్ ఒకటి కొన్నారు మా ఆయన. అదిగో. అప్పట్నించీ మొదలైంది నా బాధ.

మామూలుగా బీపీ నెలకోసారి చూపించుకునేవాళ్లం కదా! ఇంట్లో మిషనుంది కనక పదిహేనురోజులకోసారి చూసుకుందాం అన్నారాయన. సరే నన్నాను. తేగానే చూసుకున్నాం. ఎంత బాగా చూపించిందో, బైటకి వెళ్ళక్కర్లేకుండా ఎంత హాయిగా ఉందో అని మురిసి ముక్కలైపోయేం. ఆ రీడింగులన్నీ ఒక కాగితంమీద రాసి పెట్టుకున్నారీయన. రెండ్రోజులయ్యేక ఒక రోజెందుకో కూరలో ఉప్పు ఎక్కువైంది. దానికితోడు ఆ రోజు ఎప్పుడూలేనిది ఆవకాయ కూడా వేసుకున్నారీయన. దాంతోటి ఇంక మధ్యాహ్నం నాలుగు గంటలనుంచీ మొదలెట్టేరు, “నీకేమైనా తేడాగా ఉందా!” అంటూ. నాకేం లేదని చెపితే వినరే. “పోనీ, ఎందుకైనా మంచిది, ఓసారి బీపీ చూసుకుందామా, ఆవకాయ తిన్నాం కదా..” అన్నారు. ఆయన మాట కాదనడమెందుకని సరే నన్నాను. చూసుకున్నాం. రీడింగ్ కాస్త ఎక్కువే కనిపించింది. అంతే.. ఇంకీయన అప్పట్నించీ దేంట్లోనూ అసలు ఉప్పు వేసుకోడమే మానేసేరు. నాలుగురోజులయ్యేక ఏవిటో ఆయనకి తూలుతున్నట్టనిపించింది. మళ్ళీ బీపీ చూసుకున్నారు. లో బీపీ చూపించింది. మళ్ళీ మామూలుగా ఉప్పు తినడం మొదలెట్టేరు.

ఇలా వరసగా ఎన్నని చెప్పను వదినా, ఆ మిషన్ కొన్నప్పట్నించీ ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవడం, దాన్ని బట్టి ఏదైనా తినడం, మానడం, అస్తమానం ఆ విషయాలే ఆలోచించడం, ఇంటర్నెట్‌లో దానికి సంబంధించినవన్నీ బ్రౌజ్ చెయ్యడం, పేపర్లో పుస్తకాల్లో వాటి గురించే చదవడం, టీవీలో వాటి గురించి వచ్చే ప్రోగ్రాములే చూడడం అవన్నీ కలిపేసి, ఆలోచించేసి, ఉక్కిరిబిక్కిరైనట్టు అయిపోయి, అస్తస్తమానం బీపీ చూసుకోవడం ఒక అలవాటుగా అయిపోయిందనుకో ఈయనకి. అలా చదివినవీ, చూసినవీ అన్నీ తనకే ఉన్నట్టు అనేసుకోడం ఎక్కువైపోయింది. ఆయన అనుకోవడం సరే, తనతోపాటు నన్ను కూడా కలిపేసుకుని నీకెలా ఉందీ, తల తిరుగుతోందా, అలసటగా ఉందా, ఏం తింటున్నావూ, అలా తింటే మంచిదికాదూ, ఇప్పుడు లేకపోయినా రేపెప్పుడో నీకేదో వచ్చేస్తుందీ అంటూ నా వెనకాల పడడం. చచ్చిపోతున్నాననుకో.. పొద్దున్న లేస్తే ఓ పూజా లేదు, పాటా లేదు. ఏదైనా మంచి పుస్తకం చదవడం లేదు, మంచి సినిమా చూడడం లేదు. అలా ఉన్నవీ లేనివీ మనకి మనమే అనుకోవడం మంచిది కాదని ఆయనకి చెప్పి చెప్పి విసుగొచ్చి ఇంకివాళ నన్ను నేను సంబాళించుకోలేక మీకు ఫోన్ చేసేను. నేనే వద్దామనుకున్నా కానీ నాకేదో అయిపోతుందేమో నంటూ నన్నీయన ఇంట్లోంచి బైటకి కదల్నియ్యటం లేదు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. “

గుక్క తిప్పుకోకుండా ఏకబిగిన ఏకరువుపెట్టిన సుశీల మాటలు విన్న నాకూ, వదినకీ మతిపోయినట్టైంది. సుశీలా వాళ్ళాయన సుందరం చాలా మంచి మనిషి. మంచీ, మర్యాద, పెద్దలంటే గౌరవం, చుట్టాలంటే ఆదరం, పిల్లలంటే ప్రేమా ఉండే మనిషే. అవే వయసొచ్చేకొద్దీ తన పట్ల, ఎదుటి మనిషి పట్ల అతనిలోని జాగ్రత్తని ఎక్కువ చేసేయి. తనకీ, భార్యకీ రేప్పొద్దున్న ఏమీ అనారోగ్యం రాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాడని నాకూ, వదినకీ అర్ధమయింది. కానీ ఆ జాగ్రత్తే కాస్త అతి అయ్యిందేమో ననిపించింది సుశీల పరిస్థితి చూస్తే.

సుశీల మాటలు విన్ననేను, “అయినా ఈ రోజుల్లో టివీల్లోనూ, పేపర్లలోనూ ఇలాంటివన్నీ రాసేసి అన్నింటికీ జనాల్ని ఇలా భయపెట్టేస్తున్నారు.” అన్నాను.

“వాళ్ళు చెప్పినంతలో మనం నమ్మెయ్యాలా! మన బుధ్ధి యేమైనట్టూ!” అంది వదిన విసుగ్గా.

“పొద్దున్న లేచిందగ్గర్నుంచీ నీకు ఈ గ్రహదోషముండొచ్చు, శాంతి చేయించుకోండి అని ఒకళ్ళూ, మీకు ఈ రోగం ఉందేమో టెస్టులు చేయించుకోండని ఇంకోళ్ళూ, రేప్పొద్దున్న మీకీ రోగం రావచ్చేమో, ఇప్పుడే చూపించుకోండి అని మరోళ్ళూ ఊదరగొట్టేస్తుంటే ఒకసారి కాపోతే ఒకసారైనా దృష్టి అటు పోతుంది కదా.” అన్నాను నేను.

“అవును. అందుకే అస్తమానం బీపీ చూపించుకుందుకు బైటకెళ్ళడానికి బధ్ధకిస్తున్నామని ఈ మిషన్ కొన్నారు” అంది సుశీల.

వదిన సీరియస్ గా “ ఆ బీపీ మిషన్ ప్లగ్ పీకేసి అవతల పడెయ్..” అంది. ఉలిక్కిపడ్డాను నేను.

వదిన చెప్పిన మాటలకి ముందుగా తేరుకున్న సుశీల, “మళ్ళీ కొంటేనో..” అంది.

అవును.. అదీ నిజమే. ఇది పోతే ఇంకోటి కొనడని నమ్మకమేంటీ!

వదిన ఆలోచిస్తూ “ప్రస్తుతానికి ఉన్నదాని పని పట్టు. ఈ లోపల ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎక్కడున్నాడో వెతుకుదాం. అతన్ని తీసుకొచ్చి, ఎప్పుడు బీపీ చూసుకున్నా ఆ మెషీన్ లో 130/80కి మించి రాకుండా ఉండేట్టు సెట్ చేయించేద్దాం. “ అంది.

“అలా కుదురుతుందా!” అంది సుశీల నమ్మలేనట్టు.

“ఎందుకు కుదరదు. మెషిన్‌లో ఇవన్నీ సెట్ చేసినట్టే అదీనూ.. పట్టుకుందాం ఎవర్నైనా.. ఈ లోపల మీ ఆయనకి కొంచెం బ్రైయిన్ వాష్ చేస్తాలే..” అంది వదిన సుశీలకి హామీ ఇస్తూ..

వదిన మాటలకి తేరుకున్న సుశీల మొహంలోకి కాస్త వెలుగొచ్చింది.. “వింటారంటావా!” అంది అనుమానంగా.

“ఎక్కడో బైటవాళ్ళే టివీలోనూ, ఇంటర్నెట్ లోనూ చెప్పింది నమ్ముతున్నప్పుడు కావల్సినదాన్ని నేను చెపితే నమ్మడా! నీకెందుకు, నేను మాట్లాడతాగా!..”అంది వదిన సుశీలకి భరోసా యిస్తూ..

హమ్మయ్య.. వదిన రంగంలోకి దిగిందంటే సాధించి తీరుతుంది.

“ఇలా సుందరంలాగ ఎంతమంది ఉన్నారో. లేనివన్నీ ఊహించేసుకుని, వాళ్ళు మనసులో మథనపడిపోయి, ఎదుటి మనిషిని భయపెట్టేసి, మనశ్శాంతి లేకుండా ఎంత బాధపడుతున్నారో. ఎవరో ఎందుకూ! మా తోడికోడలి తమ్ముడూ ఇలాగేట..” అన్నాను నేను.

సుశీల అందుకుంది. “అవును, నేనీ మాట మా అక్కకి చెపితే వాళ్ళ పినమామగారు కూడా ఇలాగే ఉన్నవీ లేనివీ కల్పించేసుకుని, తను బాధపడి, ఎదుటివాళ్ళని ఊదరగొట్టేస్తారుట. ఆయన బాధ పడలేక వాళ్ల పిన్నత్తగారికి పిచ్చి పట్టినట్టవుతోందిట.”

“ఇలాంటివన్నీ వింటుంటే ముందు మనకి బీపీ ఎక్కువవుతుంది. ఇంక ఆపండి. కాస్త మంచి కాఫీ తాగుదాం హాయిగా..” అంది వదిన.

చక్కగా ముగ్గురం రిలాక్స్ అయిపోయి, కమ్మటి కాఫీ తాగేసేం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here