నవరసాల నవ మాలిక – ‘అన్ని రూపాలూ రూపాయే..’

1
15

[శ్రీమతి జి.ఎస్. లక్ష్మి వెలువరించిన ‘అన్ని రూపాలూ రూపాయే..’ అనే కథా సంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి మాలాకుమార్.]

[dropcap]“ఒ[/dropcap]క రచయిత మంచి రచనలు చేయాలంటే తన చుట్టూ వున్న సమాజాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ రచయిత చేసే రచన వల్ల సమాజంలో ఒక నేరస్థుడు మంచివాడుగా మారాలి కానీ, ఒక మంచివాడు నేరస్థుడిగా మారకూడదు. నిజ జీవితంలో జరిగే సంఘటనలకే కాస్త కల్పన జోడించి, చదివేవారిలో ఉత్సుకతను పెంచేలా రాసేదే కథ. కథ చదివాక పాఠకుడు కాసేపు దాని గురించి ఆలోచించినపుడే అది మంచి కథ అవుతుంది.” అన్నారు నవరసాలను తమ కథలలో పలికించే రచయిత్రి జి.యస్. లక్ష్మిగారు నేను లక్ష్మిగారిని చేసిన ఓ ముఖాముఖిలో. అదో అలా రచించిన, లక్ష్మిగారు  వివిధ ప్రింట్, అంతర్జాల పత్రికలలో పబ్లిష్ అయిన కథలతో వచ్చిన కొత్త కథల సంపుటి ‘అన్ని రూపాలూ రూపాయే..’. ఇందులో మొత్తం 21 కథలు ఉన్నాయి.

అందులోని  టైటిల్ కథ ‘అన్ని రూపాలూ రూపాయే’. ధనుంజయ  గోనెసంచుల నిండా డాలర్స్ సంపాదించుకొని వద్దామని బోలెడు ఆశలతో అమెరికా వెళతాడు. కానీ పాపం ధనుంజయ వెళ్ళేసరికే అమెరికాలో ఎకానమీ దీనస్థితిలో ఉండటముతో, రెండేళ్ళు ఓపూట తిండితో ఎట్లాగో గడిపి చేతి సంచీడు మాత్రం సంపాదించుకొని తిరిగి వస్తాడు. వచ్చినప్పటి నుంచీ ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకుంటాడు. ధనుంజయ ఏవో చాలా సంపాదించుకొని వచ్చిఉంటాడని భావించి అతని ఫ్రెండ్ గోపీ అతని బిజినెస్‌లో భాగం తీసుకుంటానని కలుస్తాడు. ఇంకా ఆ ఇద్దరికీ రాత్రిపూట భోజనము పెడుతూ వారి చర్చలని ఆసక్తిగా వినే మేనత్త పాత్ర ఇంకోటి ఈ కథలో. ఇద్దరూ తెగ చర్చించుకొని, తిరిగి చివరికి ఏ బిజినెస్ పెట్టారు? ఆ బిజినెస్‌ను ఆపాలని మేనత్త ఎందుకు తాపత్రయపడింది అన్నది ఈ హాస్య, వంగ్య కథలో చదివి తెలుసుకోవలసిందే మరి!

వీధి కుక్కలు ఉన్నది ఎందుకు? వీధిలో ఎవరైనా వెళుతుంటే వెంటపడి కరవటానికి. అంత మాత్రాన వాటి మీద కంప్లైంట్ ఇచ్చి పట్టిస్తారా? ఖబడ్దార్ మీ మీద మర్డర్ కేస్ వేసేయగలదు లాలస. అయ్యబాబోయ్ ఎలాండీ మరి అంటే పక్కవీధిలోనే ఉన్న కౌన్సలర్ దగ్గరకు వెళ్ళి వీధికుక్కలను ఎలా మచ్చిక చేసుకోవాలో కౌన్సిలింగ్ తీసుకోండి. ఎవరా లాలస? ఈ కౌన్సిలింగ్ గోలేమిటి బాబూ అని తలపట్టుకోకుండా ‘ఇది జరిగిన కథే’ చదివి తెలుసుకోని మీ వీధి కుక్కల బారి పడకుండా మిమ్మలిని మీరు రక్షించుకోవచ్చు.

వరలక్ష్మి తమ్ముడు ఆనందం తండ్రి దెబ్బలకు భయపడి చిన్ననాడే ఇంట్లో నుంచి పారిపోతాడు. తండ్రి తన తప్పు తెలుసుకొని ఆనందం తిరిగి వచ్చేవరకు కూతురు, అల్లుడు తన ఇంట్లో ఉండవచ్చని, ఆనందం వస్తే అతనికి ఇల్లు అప్పగించేయాలని కాగితం వ్రాసి నలుగురు పెద్దమనుషులకు ఇచ్చి చనిపోతారాయన.

వరలక్ష్మికి ఇద్దరు కూతుళ్ళు రమ, హైమ. భర్త పరమశివం. చాలా కోపిష్ఠి. అతని అదుపాజ్ఞలలోనే ఉంటుంది వరలక్ష్మి. ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయలేక, దానికోసం ఇల్లు అమ్మే అధికారం లేక మండిపడుతుంటాడు పరమశివం. ఆ సమయంలో ఆనందం వస్తాడు. అక్కాతమ్ముళ్ళు ఒకరిని ఒకరు గుర్తు పట్టుకుంటారు. అయినా ఎవరూ ఏమీ చెప్పరు. అక్క పరిస్థితి చూసి ఆనందం తిరిగి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతుంది వరలక్ష్మి.

బంధాలూ-బాంధవ్యాల మధ్య అనుబంధం ఏ విధంగా మూగపోతుందో చెప్పే ‘అనుబంధాలు’ కథ. మనసును మెలిబెడుతుంది.

‘ధర్మాగ్రహం’ కథలో MSc చదివి పౌరోహిత్యం చేస్తున్న మురళీధరునికి “సమాజంలోని మనుషులందరూ ఒక్కటే, పెద్దవారిని గౌరవించటం మన సాంప్రదాయం. అటువంటి విలువలున్న మన సమాజాన్ని ఇలాంటి పిచ్చి వేషాలేసే సమాజంగా చూపిస్తే అది అధర్మం. ఆ అధర్మానికి ఎదురు నిలిచి పోరాటమే మేము చేస్తున్నపని. మాది ధర్మాగ్రహమే. అందుకే మేము చేస్తున్నది ధర్మ పోరాటం” అన్నది ఆశయం.  అంతటి ఆశయం ఉన్న మురళీధరుడు పోలీస్ స్టేషన్‌లో ఎందుకున్నాడు? ఆ ధర్మపోరాటం ఏమిటో తెలుసుకోవాలంటే ‘ధర్మాగ్రహం’ కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది.

ఇవి ఈ సంపుటిలోని కొన్ని కథల గురించి మాత్రమే నేను చెప్పాను. మరి మిగతా కథలు, హాస్యం, వంగ్యం, విషాదం, సెంటిమెంట్ మొదలైన నవరసాల నవ మాలిక ‘అన్ని రూపాలూ రూపాయే..’ కొనేసి చదివేయండి.

***

అన్ని రూపాలూ రూపాయే.. (కథల సంపుటి)
రచయిత్రి: జి.యస్. లక్ష్మి
పేజీలు: 148
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత్రి, 2-2-23/7/1,
బాగ్ అంబర్‌పేట,
హైదరాబాదు, 500013
ఫోన్: 9908648068

~

 

ఇటీవల ‘అన్ని రూపాలూ రూపాయే..’ కథాసంపుటి వెలువరించిన ప్రముఖ కథా, నవలా రచయిత్రి శ్రీమతి జి.ఎస్. లక్ష్మిగారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-gs-lakshmi/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here