అన్నింట అంతరాత్మ-11: ధన్యను నేను.. పూదండను నేను!

7
10

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం పూదండ అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]”రం[/dropcap]డి రామచంద్రయ్యగారూ!” అన్న మా దుకాణదారు మాటతో నేస్తాలతో నా ముచ్చట్లు ఆగిపోయాయి. “ఇదుగోండి! మీకోసం మల్లెల దండ, గులాబీల దండ రెండూ సిద్ధంగా ఉంచాం” అంటూ ఆయనకు అందించాడు. దాంతో నేనూ, నా నేస్తం రామచంద్రయ్య చేతుల్లోకి వెళ్లిపోతూ, అంగడిలోని మా నేస్తాలకు బాధగా వీడ్కోలు చెప్పాం. “బాధపడకండి.. మేమూ ఇక్కడ శాశ్వతం కాదు కదా.. ఎవరో వస్తారు, మమ్మల్ని కొనుక్కెళ్లిపోతారు. ఇంకా నయం.. ఇద్దరూ ఒక చోటికే వెళ్తున్నారు. చివరి వరకు ఎంచక్కా కలిసి ఉంటారు” అన్నాయవి. “అవును.. అదీ నిజమే” మేమిద్దరం ఒకేసారి అన్నాం. “ఈ గజమాలలు ఎవరు కొంటారోయ్” అడిగారు రామచంద్రయ్యగారు. “వాటి గిరాకి వాటికి ఉంది సార్. ఇవాళ ఓ రాజకీయ నాయకుడికి సన్మానం ఉంది. ఆర్డరిచ్చారు.. పదవీ విరమణలకు, షష్ఠిపూర్తి వేడుకలకు, సినిమా వాళ్ల సభలకు ఇలా ఎన్నిటికో రోజూ గజమాలలు తీసుకెళ్తూనే ఉంటారు సార్” మా అంగడి యజమాని చెప్పాడు. “అలాగా..” అంటూ డబ్బులిచ్చేసి బయల్దేరాడు రామచంద్రయ్యగారు.

కొద్ది సేపటికి వారి ఇల్లు రానే వచ్చింది. గేటుకే మావాళ్లు దర్శనమిచ్చారు. మొన్న పండక్కి అలంకరించి ఉంటారు. ఆ బంతిపూల దండలను చూసి స్నేహపూర్వకంగా నవ్వాం. అవీ నవ్వాయి. లోపల గుమ్మాలకూ బంతి పూదండలు ఆర్చీల్లాగా ఉండి మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించాయి. రామచంద్రయ్య మమ్మల్ని ఒక టేబుల్ మీద ఉంచి కాళ్లు కడుక్కుని వచ్చారు. ఆ తర్వాత స్టూల్ వేసుకొని గోడకు ఉన్న పెద్ద వేంకటేశ్వర స్వామి ఫొటోకు నన్ను అలంకరించారు. మా నేస్తం గులాబీ దండను ప్రత్యేకమైన అరలో ఉన్న అందాల కృష్ణయ్యకు అలంకరించారు. ఇంతలో రామచంద్రయ్య భార్య వచ్చి చూసి, “ఎంత అందంగా ఉన్నాయో” అంటూ భక్తిగా దేవుళ్లకు నమస్కరించింది.

ఇంతలో రామచంద్రయ్య మనవడనుకుంటా “తాతా.. తాతా” అంటూ వచ్చాడు. “ఏంట్రా నందూ!” అన్నాడు ఆయన. “నేను ఓ పద్యం నేర్చుకున్నా, చెప్పనా?” అన్నాడు. “అంతకంటేనా, చెప్పు” అన్నాడు ఆయన. వెంటనే నందూ ‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ’ అని, వెంటనే ఆగిపోయి “తాతా మరి కృష్ణుడికి చెంగల్వపూదండ కదా వేయాలి, నువ్వు గులాబీల దండ వేశావే” అని ప్రశ్నించాడు. “పద్యం మొదలు పెట్టావోలేదో సందేహం.. చెంగల్వలు ఇప్పుడెక్కడ దొరుకుతాయి. గులాబీలు కూడా అందంగా ఉంటాయి, మంచి వాసన పూలుకదా, అందుకే తెచ్చాను” అంటూ “అది సరేగానీ నువ్వు పద్యం పూర్తిగా చెప్పు” అన్నారు. నందూ ‘సరే’ అంటూ మళ్లీ ’చేత వెన్న ముద్ద’ మొదలు పెట్టి గబగబా చెప్పేశాడు. “కాస్త నిదానంగా, స్పష్టంగా, భక్తిగా చెప్పాలి. సరేనా” అనగానే, “అలాగే తాతా” అన్నాడు. నందూ పరుగెత్తి వెళ్లిపోయాడు.

రామచంద్రయ్యగారు కూడా లోపలికి వెళ్లడంతో నేను నలుమూలలా పరీక్షగా చూశాను. అటువైపు ఓ ఫొటో ఉంది. పెద్దవాళ్లది. దానికి ఓ ప్లాస్టిక్ పూల దండ ఉంది. అవును. పోయినవాళ్ల ఫొటోలకి దండలు వేయడం నాకు తెలుసు. మా అంగడి యజమాని వాళ్ల నాన్న ఫొటోకి వేయగా చూశాను. ఆ ప్లాస్టిక్ పూల దండ నన్ను చూసి నవ్వినట్లే నవ్వి “మల్లెలమని, గులాబీలమని మీకు మహా గర్వం కదూ. కానీ మీ భోగం ఎన్నాళ్లు. రెండు రోజుల్లోనే వాడిపోతారు. మెల్లగా ఎండిపోతారు. మరి నేనో ఎంతకాలమైనా ఇలాగే ఉంటాను” అంది మిడిసిపడుతూ. “మాకు గర్వం అని ఎవరు చెప్పారు. ఎవరి ప్రత్యేకత వారిది. నాలుగు నాళ్లే ఉన్నా పరిమళాలు వెదజల్లుతూ దేవుడి మెడలో ఉంటానుకదా. అది చాలు నాకు. మేం ఏమీ అనకుండానే, నిన్ను నువ్వే తక్కువగా భావించుకుని, మమ్మల్ని నిందిస్తున్నావు. ఎవరి ప్రత్యేకత వారిది”‘ అంటుండగానే ఓ యువకుడు వచ్చాడు.

అలికిడికి రామచంద్రయ్య బయటకు వచ్చి “ప్రసాద్! వచ్చావా. సరుకులన్నీ తెచ్చావా. నేను పూలదండలు తెచ్చేశాను” చూపించారు ఫొటోల వైపు. ప్రసాద్ మా వైపు చూసి “చాలా బాగున్నాయి నాన్నా” అన్నాడు. “మనదేం ఉంది. తిరుమలలో ఏడుకొండలవాడికి నిత్యం ఎన్ని దండలు వేస్తారో తెలుసా? వాటికి నిర్దిష్టమైన కొలతలు కూడా ఉంటాయి” అన్నారు రామచంద్రయ్య.

“ఎన్ని దండలు వేస్తారేమిటి?” అంటూ సోఫాలో కూర్చున్నాడు ప్రసాద్. రామచంద్రయ్య కూడా ఎదురుగా కూర్చుంటూ “చెపుతా విను.. శ్రీవారి కిరీటం నుంచి రెండు భుజాల మీదకు ఉండే పూదండను శిఖామణి అంటారు. భుజాలనుంచి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడే మాలలు సాలిగ్రామాల మాలలు. మెడలో ఉండేది కంఠ సరి. వక్షస్థలం పై శ్రీదేవి, భూదేవిలకు అలంకరించే మాలను ‘వక్షస్థల లక్ష్మి’ అంటారు. శంఖు చక్రాలకు రెండు దండలు. బొడ్డును ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే మాలను కఠారి సరం అంటారు. రెండు మోచేతులకింద, నడుం నుంచి, మోకాళ్ల వరకు, మోకాళ్ల నుంచి పాదాలవరకు వేలాడదీసే దండలను తావళాలు అంటారు. పాదాలపై అలంకరించే దండలను తిరువడి దండలు అంటారు..” అని వివరించారు.

ఇంతలో ప్రసాద్ భార్య వచ్చి కాఫీలు అందించి, “రేపు పద్మాక్షి పిన్ని కూతురు నిశ్చయతాంబూలాలు గుర్తుందా, పూలదండలు తెచ్చే బాధ్యత మనకే అప్పజెప్పారు. మరిచిపోకండి” అంది. “అలాగే, దానికేం భాగ్యం” అన్నాడు ప్రసాద్. “పూలదండలంటే ఓ విషయం గుర్తొస్తోంది. నువ్వు కూడా విను మల్లికా” అన్నాడు ప్రసాద్. “సరే, చెప్పండి” అంటూ కుర్చీలో కూర్చుంది. “ఆమధ్య పేపర్లో చదివాను. పూల దండలే పంటల భవిష్యత్తు తెలుపుతాయని రాశారు. ఎక్కడంటే.. కర్నూలు జిల్లాలోని నల్లచెలిమల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఉందట. ఆ స్వామిని అక్కడివారు పంటల దేవుడుగా కొలుస్తూ ఏటా శ్రావణమాసం.. మూడో శనివారం రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారట. మూడు గన్నేరు పూలదండలకు పూజలు చేసిన తర్వాత గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న కొండకు పల్లకితో బయలుదేరుతారు. ఆ తర్వాత కొండ దగ్గరి కొలనులో ఆలయ ప్రధాన అర్చకులు స్నానం ఆచరించి, కొండ పైని గుహలోకి వెళ్లి మూడు గన్నేరు పూల దండలను కొండ చరియల వద్ద వదులుతారు. అర్చకుడు మంత్రాలు చదువుతుండగా రెండు గంటలకు ఒక దండ చొప్పున కొండ చరియలోకి పడిపోతాయట. సాయంత్రం ఆరునుంచి అర్ధరాత్రివరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.. దండలు నలిగితే పంటలు నలుగుతాయని, లేకుంటే పంటలు బాగా పండుతాయని వాళ్లు నమ్ముతారట. మొదటి రెండు దండలు నలగకుండా ఉంటే ఎర్రనేలల్లో పంటలు బాగా పండుతాయని, మూడో దండ నలగకుండా వస్తే నల్ల రేగడి పంటలు బాగా పండుతాయని భావిస్తారు. అర్చకులు దండలను పరిశీలించి పంటల భవిష్యత్తు గురించి వివరించే వరకు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తారని రాశారు” అన్నాడు ప్రసాద్. “భలేగా ఉంది” అంది మల్లిక. “ఒక్కో చోట ఒక్కొక్కరకం నమ్మకాలు” అన్నాడు రామచంద్రయ్య. “ఆఁ అన్నట్లు ఆమధ్య ఒక ఐఐటి విద్యార్ధి ట్విట్టర్‌లో మోడీ గారి ప్రసంగాన్ని మెచ్చుకుంటూ.. ‘మీ ప్రసంగమే కాదు, మీ మెడలోని బంగారు రంగు పూలదండ కూడా ఎంతో బాగుంది. వీలైతే అలాంటి దండ నాకొకటి పంపండి’ అన్నాడట. మోడీగారు దాంతో ఖుష్ అయిపోయి ఆ విద్యార్థికి పూలదండ కూడా పంపారట” చెప్పాడు. “బాగుంది” అంటూ లేవబోయింది మల్లిక.

ఇంతలో లోపల్నుంచి రామచంద్రయ్య భార్య పారిజాతం వచ్చింది.. “ప్రసాద్! నీ కబుర్లన్నీ వింటూనే ఉన్నా. పూలదండలంటే నాకైతే ముందు గుర్తొచ్చేది గోదాదేవి కథ. ఆ కథ మీకు తెలుసా?” అడిగింది కొడుకు, కోడలు కేసి చూస్తూ. “సంక్రాంతి ముందు తిరుప్పావై వినడమే కానీ గోదాదేవి కథ గురించి తెలియదు” అన్నాడు ప్రసాద్. అవును అన్నట్లుగా మల్లిక కూడా తలాడించింది. దాంతో పారిజాతం “చెపుతా వినండి” అంటూ మొదలు పెట్టింది. వైష్ణవుడైన విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి. ఆయన నిత్యం శ్రీరంగనాథుని భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. రోజూ పూలమాల అల్లి ఆలయానికి తీసుకెళ్లి దేవుడిని అలంకరించేవాడు. అయితే గోదాదేవి పూలమాలను ఒకసారి తన మెడలో వేసుకొని చూసుకుని మురిసిపోయి, తర్వాత తండ్రికి అందించేది. ఆ విషయం విష్ణుచిత్తుడికి తెలియదు. ఓరోజు అలా ఆమె ఆ దండను మెడలో వేసుకోవడం చూశాడు. దేవుడికి అలంకరించే పూలమాలను తన కూతురు ధరించడంతో ఖిన్నుడై, ఆ మాలను రంగనాథుడికి సమర్పించలేదు. దాంతో శ్రీరంగనాథుని ముఖం చిన్నబోయింది. విష్ణుచిత్తుడు దాన్ని తన ధోరణిలోనే అర్థం చేసుకున్నాడు. కానీ ఆ రాత్రి కలలో విష్ణుచిత్తుడికి, శ్రీరంగనాథుడు కనిపించి, గోదాదేవి ధరించిన పూమాలలే తనకు ప్రీతికరమని, వాటినే తనకు అలంకరించమని చెపుతాడు. దాంతో మర్నాటినుంచి యథావిధిగా గోదాదేవి ముందుగా ధరించిన మాలనే రంగనాథుడికి సమర్పిస్తాడు విష్ణుచిత్తుడు. ఆ తర్వాత గోదాదేవి, రంగనాథుడినే భర్తగా కోరుకొని తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ తర్వాత విష్ణుచిత్తుడు లక్ష్మీ స్వరూపమైన గోదాదేవికి, శ్రీరంగనాథుడితో వివాహం చేస్తాడు” కథ ముగించింది. ఇవన్నీ వింటున్న నాకు పూలదండలమైన మా నేపథ్యం ఎంత గొప్పగా ఉంది అనిపించి, మా నేస్తం గులాబీ దండవైపు చూశాను. అది కూడా గర్వంగా నవ్వుతూ చూసింది.

అంతా కబుర్లాపి లోపలకు వెళ్లారు. నేను మళ్లీ మా అంగడిని గుర్తు చేసుకున్నాను. మా యజమానికి పాటలంటే చాలా ఇష్టం కాబోలు, నిన్న రాత్రి పాటలు పెట్టాడు. ఘంటసాల పాడిన లలిత గీతం ‘తలనిండ పూదండ దాల్చిన రాణి.. మొలక నవ్వుల తోడ మురిపించబోకే’ పాట వింటూ పరవశించాడు. చెప్పొద్దూ నాకూ చాలా సంతోషం వేసింది. మహిళల సిగలో ముఖ్యంగా మల్లెలం మేమే సింగారాలవుతాం. ఆ తర్వాత మరోపాట.. ‘ఓహో బస్తీ దొరసాని.. బాగా ముస్తాబై ఉంది.. అంద, చందాల వన్నెలాడి ఎంతో బాగుంది..’ భలేపాట అనుకుంటుంటే.. ‘ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది.. పూలదండతో పాటే మూతికూడ ముడిచింది..’ మా ప్రస్తావన వినపడడంతోనే భేష్ కవీ అనుకున్నాను. ఆ తర్వాత ‘మనసున మల్లెల మాలలూగెనే.. కన్నుల వెన్నెల డోలలూగెనే’ పాట మొదలైంది. అబ్బ మా గురించే అనుకుంటూ ఉప్పొంగిపోయాను. కొద్ది సేపటికి, పండుగలు వస్తే పూలదండలకు ఎంత గిరాకీ ఉంటుందో అంగడి యజమాని తల్లి ముసలామె చెప్పడం మొదలు పెట్టింది.. “వినాయకచవితి వస్తోంది. అబ్బో మనకు చేతినిండా పని.. ఎన్ని దండలు కట్టినా చాలవు. అనుకుంటాం కానీ మనకు ఎప్పుడూ గిరాకీ ఉండనే ఉంటుంది. వినాయకచవితి అయిపోతే, దసరా, ఆ తర్వాత దీపావళి, ఆ పైన సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి.. ఇలా వరుసగా ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. ఇవి గాక పెళ్లిళ్లు, పుట్టినరోజుల వేడుకలయితే వస్తానే ఉంటయ్. చావులయితే మామూలే” కొడుకుతో అంటుంటే, మా గొప్పతనానికి మురిసిపోయాను.

నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ లోపల్నుంచి మల్లిక, ప్రసాద్ వచ్చారు, టీవీ ఆన్ చేశారు.. ఏదో సినిమా.. పెళ్లి సన్నివేశం. పెళ్లి మండపం అంతా పూలదండలతో ఎంత అందంగా ఉందో. వధూవరులిద్దరూ మెడలో దండలతో ముచ్చటగా ఉన్నారు. మరో రెండు సీన్లు జరిగాయో లేదో, హీరో ప్రమాదంలో మరణించాడు. విషాదమే విషాదం. అతడి భౌతికకాయానికి మళ్లీ పూలదండలే పూలదండలు.. మల్లిక “ఏంటీ ఏడుపుగొట్టు సినిమా” పైకే అనుకుంటూ న్యూస్ ఛానెల్‌కు మార్చింది. బురిడీ పార్టీ అధ్యక్షుడు బడేలాల్‌కి గజమాలలతో సత్కారం.. ఆ తర్వాత ఓ ప్రముఖ నేతకు వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ విగ్రహానికి క్యూ కట్టి మరీ పూలదండలేస్తున్నారు, మరో వార్త.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో రథోత్సవం.. రథమంతా పూలదండల అలంకరణే. దేవుడికయితే చెప్పనే అక్కర్లేదు.. ఎన్నెన్ని దండలో.. ఆ తర్వాత పదవీ విరమణ, పదవీ స్వీకరణలకు సంబంధించిన వార్తల్లో మేమే మెరిసిపోతున్నాం..

అంతలో మల్లిక మళ్లీ ఛానెల్ మార్చింది.. ఏదో రియాల్టీ షో వస్తోంది. నాకేమో కొద్దిగా నీరసంగా అనిపిస్తోంది. మేం సుకుమారులం, స్వల్పాయుష్కులం కదా. అంగడిలో అయితే యజమాని నీళ్లు చల్లుతూ, తడి బట్టలు కప్పుతూ ఉంటాడు. ఇక్కడ మమల్ని ఫొటోలకు వేయడమే కానీ ఆ పైన వీళ్లకు మా గురించి ఏమీ పట్టదు. అయినా ఏం పర్వాలేదు.. పూల గుండెల్లో సూదులు గుచ్చో, మెడలకు దారాలతో ఉరులు బిగించో దండలుగా మార్చినా మేం ఓర్చుకుంటాం. ఎందుకంటే దేవుడి సేవలో, మానవ సేవలో తరించడం కన్నా మాకింకేం కావాలి! మావల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతోందో ఊహించుకుంటే ఆనందమే ఆనందం. వాడిపోగానే మమ్మల్ని చెత్తలో వేసినా, ఎండిపోతూ కూడా చివరివరకూ పరిమళాలు వెదజల్లుతాం మేం. వాడినా కూడా వాడుకోవాలేగానీ పరిమళద్రవ్యాల రూపంలో హాయిగొల్పుతుంటాం.. ఈ మనుషులకు ఓ మాట చెప్పాలనుంది.. మాలాగే వారు కూడా మనసులను పరిమళభరితం చేసుకోవాలని, కష్టాలలో ఉన్నవారితో ఒకింత మృదువుగా, దయగా వ్యవహరించాలని.. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదని, ఎలా జీవించామన్నది ముఖ్యమని.. మా మాటవారికి వినిపించేనా, వినిపించినా వారు మన్నించేనా.. అబ్బ! అలసి..సొలసి..వడిలిపో..తు..న్నా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here