అన్నింట అంతరాత్మ-12: కత్తి కన్నా గొప్పదాన్ని.. కలాన్ని నేను!

7
7

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం కలం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]మ[/dropcap]ధ్యాహ్న సమయం.. సదాశివంగారు తనకు ఇష్టమైన కలంతో రామకోటి రాస్తున్నారు. మనవరాలు అక్షర బాల్ పాయింట్ పెన్‌తో నోట్సు రాసుకుంటోంది. మనవడు లిఖిత్ రహస్యంగా తాతగారి కలం ఖజానాను తెరిచి చూస్తున్నాడు. అందులో పార్కర్ పెన్ అయిన నేనూ ఉన్నాను. సదాశివంగారికి చాలా ఏళ్ల క్రితం నన్ను బహుమతిగా ఇచ్చారు. చాలా రోజులు పనిచేశాను. ఆ తర్వాత నాకేమయిందో తెలియదు.. రాయటంలేదని ఇలా ఈ ఖజానాకు పరిమితం చేశారు. లిఖిత్ ఒక్కొక్క కలాన్ని తీసి, విచిత్రంగా చూస్తున్నాడు. అలా నన్ను కూడా తీసి చూసి ‘అసలు కలాలు లేక ముందు దేంతో రాసేవారో’ తనలో తను అనుకుంటున్నట్టుగా పైకే అన్నాడు. సరిగ్గా నా సందేహమూ ఇదే.

ఇంతలో అక్షర అక్కడికి వచ్చి తమ్ముడు తాతయ్య కలం ఖజానాను కెలుకుతుండటం చూసి “తాతయ్యా” అంటూ ఒక్క అరుపు అరిచింది. “ఏంటమ్మా, ఏమైంది” పిల్లల అరుపులు అలవాటయిన సదాశివం తాపీగా అడిగారు. “లిఖిత్ గాడు నీ కలాల బాక్స్ తెరిచి వాటిని పాడు చేస్తున్నాడు” చెప్పింది. “ఇవి పాడయినవే కదా, ఇంక నేనేం పాడు చేస్తాను” అన్నాడు లిఖిత్. అక్షర వాడి దగ్గర నుంచి ఆ బాక్స్ లాక్కోబోయింది. వాడు తప్పించుకుని నేరుగా తాత దగ్గరకు వెళ్లాడు.. “చూడు తాతయ్యా, అక్క” అంటూ. “ఒరే లిక్కీ! ఈ బాక్స్ ఎందుకు తీశావురా” వాడి చేతిలోనుంచి జాగ్రత్తగా ఆ బాక్స్ అందుకుంటూ అడిగాడు. “చూద్దామని తీశాను. ఇంతలో వచ్చేసింది రాక్షసి” అన్నాడు అక్క వంక చూస్తూ. “చూడు తాతయ్యా, వాడు నన్ను రాక్షసి అంటున్నాడు” ఫిర్యాదు చేసింది.

ఆయన ఏదో అనే లోపే లిఖిత్ “నాకొక సందేహం తాతయ్యా” అన్నాడు. “ఆలస్యం ఎందుకు, అడిగేసెయ్” అన్నారు తాతయ్య. “మరి కలాలు లేనప్పుడు దేంతో రాసుకునేవాళ్లు” అడిగాడు. నా సందేహం కూడా తీరబోతోందని నేను కూడా చెవులు చేటలు చేసుకున్నాను. తాతగారు “మంచి ప్రశ్న వేశావురా చెపుతానుండు” అంటూ తన కలం మూసేసి, రామకోటి పుస్తకం పక్కన పెట్టి మొదలు పెట్టారు..

“ప్రాచీనకాలంలో మనిషి రాతి ముక్కలనే ములుకు మాదిరి వాడిగా చెక్కి కొండలపై, బండలపై, గుహలలో, కొన్నిసార్లు లోహ ఉపరితలాలపై, కొయ్యలపై రాసేవాడు. కొంతకాలానికి కాగితం కనుగొన్నాక గట్టిగా ఉండే పుల్లలను వాడాడు. ఆ తర్వాత సిరా కనుక్కోవడంతో అందులో ముంచి రాసుకునే విధంగా ఒంటె వెంట్రుకలతో కుంచెలను తయారు చేసి వాటిని రాయడానికి, బొమ్మలు వేయడానికి వాడేవాడు. క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరంలో ఈజిప్టులో రీడ్స్‌నే కలంగా వాడేవారు. జాగ్రత్తగా కొస భాగాన్ని కత్తిరించి పాళీలాగా తయారుచేసి, ఖాళీ గొట్టంలాగా ఉన్న భాగంలో సిరా లాగా పనిచేసే ద్రవాన్ని పోసి వాడేవారు. క్రీస్తుశకం ఆరువందలులో ఈకల కలాలు ఫ్యాషన్ అయ్యాయి. ఈ ఫ్యాషన్ పంథొమ్మిదో శతాబ్దం దాకా కొనసాగింది. యూరప్ వారయితే పొడవుగా ఉండే హంసల ఈకలను వాడేవారు” ఆగారు.

వెంటనే లిఖిత్ “మరి కలాన్ని ఎవరు, ఎప్పుడు తయారు చేశారు?” మళ్లీ ప్రశ్నించాడు. “వీడికన్నీ సందేహాలే” అంది అక్షర. “ప్రశ్నించడం వల్లే విజ్ఞానం పెరుగుతుందమ్మా. దేహం ఉన్నంత వరకు సందేహాలు ఉంటూనే ఉంటాయి, వాటిని తీర్చుకుంటూనే ఉండాలి” అంటూ.. “కలం అంటే స్టీల్ పెన్నును పద్దెనిమిది వందల ఇరవై రెండులో జాన్ మిచెల్ అనే ఆయన తయారు చేశాడు. బర్మింగ్ హామ్ ఈ తరహా కలాల తయారీకి పెద్ద కేంద్రమైంది. కానీ ఈ పెన్నులను కూడా ఈకల మాదిరే తరచు సిరాలో ముంచి వాడవలసి వచ్చేది. అదే కాలంలో ఫౌంటెన్ పెన్నుల తయారీకి కూడా కృషి జరిగింది. లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ అనే ఆయన విజయం సాధించాడు. దాంతో సిరాలో ముంచి రాసే బాధ తప్పింది. క్రమంగా ఫౌంటెన్ పెన్ను మరింత అభివృద్ధి చెందింది”.

“మరి ఫౌంటెన్ పెన్నులు ఉండగా బాల్ పాయింట్ పెన్ను ఎందుకు తయారుచేశారు?” ఈసారి అక్షర అడిగింది. “నీకన్నీ సందేహాలే” ఆమె మాటను ఆమెకే అప్పజెప్పాడు లిఖిత్. మా కలం ఖజానా లోని బాల్ పాయింట్ పెన్నులు కుతూహలంగా తలలు ముందుకు జరపడం చూసి నేను నవ్వాను. తాతయ్య కూడా నవ్వుతూ “మనిషి మరింత సౌకర్యవంతంగా ఉండే వస్తువుల తయారీకి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అప్పుడే అభివృద్ధి సాధ్యం. నేనూ ఫౌంటెన్ పెన్నులు వాడిన వాణ్నే. చిన్నప్పుడైతే మా ఇంట్లో నలుపు, నీలం, ఎరుపు సిరా బుడ్లు ఉండేవి. పెన్నులో సిరా పోసు కోవడానికి ఇంక్ ఫిల్లర్స్ కూడా ఉండేవి. నాకు మూడో తరగతిలో ఉండగానే మా నాన్న చిన్న ఫౌంటెన్ పెన్ తెచ్చిచ్చాడు. ఎంత ముద్దుగా ఉండేదో. కానీ ఏంలాభం?” తాతగారు దాన్ని గుర్తు చేసుకుంటూ విచారంగా ముఖం పెట్టారు. “ఏమైంది? కలం పోయిందా?” అడిగాడు లిఖిత్. “నీ ఊహ సగం కరెక్ట్. మొదటిరోజే పరీక్ష హడావిడిలో మూత ఎక్కడ పడిపోయిందో పడిపోయింది. కనపడలేదు. ఇంటికి వచ్చాను. మర్నాడు పరీక్షకు వెళ్లే ముందు మా నాన్న, ఇంక్ ఎంత ఉందో చూస్తాను. అవసరమైతే మళ్లీ పోస్తాను. కలం ఇవ్వు అన్నారు. నేనేమో.. అవసరంలేదు. చాలానే ఉంది.. వద్దు వద్దు.. కంగారుగా అన్నాను. మా నాన్నపట్టు వదల్లేదు. బాక్స్ తెరవక తప్పలేదు. మూత లేని పెన్నును చూసి ‘ఇదా ఘనకార్యం. అందుకే చూడద్దంటున్నావు. జాగ్రత్త లేకపోతే ఎలా? సరేలే ఈ పూటకు వాడుకో. మూతలేని పెన్ను ఎలా.. పాళీ ఆరిపోతుంది. సాయంత్రం వేరే కలం పట్టుకొస్తాలే’ అన్నారు. హమ్మయ్య అనుకున్నాను” అన్నారు.

“తాతయ్యా… బాల్ పాయింట్ పెన్ను..” విషయాన్ని గుర్తు చేసింది అక్షర. “ఆఁ చెపుతాను.. పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బాల్ పాయింట్ పెన్ ఆవిష్కరణ జరిగింది. దీని ధర తక్కువ. పైగా ఎటువైపైనా రాయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బాల్ పాయింట్ పెన్నుతో కాగితం పైనే కాకుండా కొయ్య, ప్లాస్టిక్, కార్డ్ బోర్డు, చివరకు నీటి అడుగున కూడా రాయవచ్చు. దీని సిరా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట్ల గడ్డ కట్టదు. ఈ కారణాల వల్ల ఫౌంటెన్ పెన్ వాడకం తగ్గి, బాల్ పాయింట్ పెన్ వాడకం పెరిగింది..” ఆగారు తాతగారు.

అది వినగానే మా బాక్స్ లోని చాలా కలాలు విచారంగా ముఖం పెట్టాయి. “ఆ తర్వాత హంగేరీకి చెందిన ఓ వ్యక్తి త్వరగా ఆరిపోయే సిరాను కనుగొన్నాడు. దానివల్ల ఇది వరకు మాదిరి ఏదైనా తగిలితే అక్షరాలు చెదిరి సిరా అలికినట్టు కావడం తప్పిపోయింది. దాంతో సిరాను పీల్చుకునే బ్లాటింగ్ పేపర్ వాడకం కూడా తప్పిపోయింది” చెప్పారు. “క్రమంగా బాల్ పాయింట్ పెన్ మరింతగా అభివృద్ధి చెందింది”. “తాతయ్యా! నీ కలాల బాక్స్ లో ఓ కలానికేంటి విచిత్రంగా రెండువైపులా పాళీలున్నాయి” అడిగాడు. “ఓ అదా. అది మా మామయ్య నాకు బహుమతిగా ఇచ్చాడు. ఓవైపు ఎర్ర సిరా పోయాలి. మరో వైపు నీలం సిరా పోయాలి. అంటే రెండు రకాలు ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట. నీలం ఉన్నవైపు రాసుకుంటూ మధ్యలో ఏదైనా ముఖ్యమైనవి కనపడేలా చేయాలంటే ఎర్రసిరా ఉన్నవైపు వాడుకోవాలి. దాన్ని బడికి తీసుకెళితే నా వంక అంతా అసూయగా చూసేవారు” తాతయ్య చెప్పడంతోనే ఆ రెండుముఖాల పెన్ను మా వైపు గర్వంగా చూసింది.

ఇంతలో సదాశివం గారి భార్య నిద్రలేచి వచ్చి, పెన్నుల బాక్స్ వైపు చూసి… “కలాల కబుర్లా..” అడిగింది. “అవును బామ్మా” పిల్లలు ఒకేసారి బదులిచ్చారు “మీరు హాయిగా ఈ బాల్ పాయింట్ పెన్నులు వాడుతున్నారు గానీ, మా కాలంలో ఫౌంటెన్ పెన్నులు నానా అవస్థగా ఉండేవి. ఒకసారి ఇంక్ ఫిల్లర్ కనబడక, హడావిడిగా బుడ్డినే ఎత్తి కలం నింపాలని ప్రయత్నిస్తే అది కాస్తా సగం నా బట్టలమీద, సగం కింద ఒలికిపోయింది. చేతుల నిండా సిరానే. ఇంకేముంది మా అమ్మ వచ్చి నన్ను తిట్టడమేకాదు, నా వీపు విమానం మోత మోగించింది. కొన్ని పెన్నులు సిరా కక్కేవి. నా వేళ్లకెప్పుడూ సిరా మరకలే. పైగా ఏ పెన్నిచ్చినా పాడుచేస్తావని ఇంట్లో కోప్పడేవారు. బట్టల మీద సిరా మరకల్ని పోగొట్టడానికి మా అమ్మ నిమ్మడిప్పలతో తెగ రుద్దేది. స్కూల్లో అయితే సిరా చుక్కలు పడితే పుస్తకం పాడవకుండా వెంటనే చాక్‌పీస్‌తో అద్దేవాళ్లం. అయితే ఒకటి, చూడటానికి మాత్రం నాకెందుకో ఫౌంటెన్ పెన్నులే రాజసంగా ఉంటాయనిపిస్తుంది. మా నాన్నకైతే చొక్కా జేబులో ఎప్పుడూ కలం ఉండాల్సిందే. ఆ రోజుల్లో అందరూ అలా చొక్కా జేబుకు కలం పెట్టుకునేవారు. అమ్మాయిలు కూడా జాకెట్‌కు కలం పెట్టుకునేవారు. ఓ సారి నాన్నకు తెలీకుండా ఓ ఖరీదైన పెన్ను స్కూలుకు పట్టుకెళ్లాను. అందరికీ గొప్పగా చూపించాను. సాయంత్రం ఇంటికొచ్చి చూస్తే ఆ కలం కనిపించలేదు. గుండె గుభేలుమంది. ఆ తర్వాత నాన్న ఆ కలం కోసం వెతుక్కుని ఎవరు తీశారంటూ గద్దించారు. అన్నయ్య తీయలేదని చెప్పాడు. నేను కూడా తీయలేదని చెప్పాను. నిజం చెపితే తిడతారని భయం. నాన్న ఎవరూ తీయకపోతే ఏమవుతుందంటూ అరిచారు. అంతలో అమ్మ వచ్చి ‘పిల్లల మీద ఏమిటా కేకలు, మీరే తీసుకెళ్లి ఎక్కడో మరిచిపోయుంటారు’ గట్టిగా అంది. దాంతో నాన్న ఆలోచనలో పడ్డారు. ఆ క్షణంలో అమ్మ నా పాలిటి దేవతలా అనిపించింది. నేనక్కడినుంచి మాయమయ్యాను. ఆ తర్వాత మరెప్పుడూ ఖరీదైన కలాల జోలికి వెళ్లలేదు” అనగానే అంతా నవ్వారు.

బాక్స్‌లో ఫౌంటెన్ పెన్నులన్నీ బామ్మ కామెంట్లకు మొదట బాధపడ్డా, రాజసంగా ఉంటాయన్న మాటతో మళ్లీ ఆనందంతో ఉబ్బిపోయాయి. బామ్మ మళ్లీ అందుకుని “అన్నట్లు ఆమధ్య ఎక్కడో చదివాను తిక్కన గారు మహాభారత రచనకు వాడిన ఘంటం వారి వారసుల వద్ద ఉందని రాశారు. అంతేకాదు, దాన్ని ఉంచే ఒరకు ఒకవైపు సరస్వతి, మరోవైపు వినాయకుడి బొమ్మల్ని చెక్కారని, కొన్నేళ్ల కిందట తిక్కన తిరునాళ్లలో దాన్ని ప్రదర్శించారని ఆ తర్వాత ఆ ఒర ఏమైందో తెలీలేదని కూడా రాశారు. ఆ కాలంలో కవులంతా ఘంటాలతోనే రాసినట్లు చిత్రాలను, విగ్రహాలను చూస్తే తెలుస్తుంది” అంది.

“మీరు భలే విషయాలు చెపుతారు అత్తయ్యా” అంటూ తానూ వచ్చి కూర్చుంది కోడలు సృజన. ఇంతలో కొరియర్ అతను వచ్చి ‘వాగీశ్వరి’ పిలిచాడు. సృజన పరుగెత్తుకొంటూ వెళ్లి కవర్ అందుకుంది. అంతా ఆశ్చర్యంగా చూశారు. సంతకం చేసి, తిరిగి వచ్చిన సృజన అందరి వంక చూసి, “వాగీశ్వరి అంటే నా కలం పేరు. ఈమధ్యే పెట్టుకున్నాను” చెప్పింది. ‘కలం పేరా!’ ఆశ్చర్యంగా చూశారు పిల్లలు. “అవును. మన అసలు పేరు కాకుండా నచ్చిన వేరే పేరుతో రచనలు చేసుకోవచ్చు. అలా ఎందరో ప్రముఖులున్నారు” చెప్పింది సృజన. బామ్మ అందుకుని “అవును.. ఆరుద్ర గారి అసలు పేరు శివశంకర శాస్త్రి, ఆత్రేయగారి అసలు పేరు కిడాంబి నరసింహాచార్యులు, ఓల్గా అసలు పేరు పోవూరి లలితా దేవి.. ఇలా ఎందరో ఉన్నారు” చెప్పింది.

అంతలో సదాశివంగారి అబ్బాయి ఓంకార్ వచ్చి, “నేను కలం స్నేహం గురించి చెపుతాను. మనుషులెవరో తెలియకపోయినా పత్రికలలోని కలం స్నేహం శీర్షికకు తమ పేరు, చదువు లేదా ఉద్యోగం వివరం, హాబీల వివరం చిరునామా, రాస్తుంటారు. ఆ జాబితాలో వారికి నచ్చినవారికి లేఖలు రాసి, స్నేహం చేస్తుంటారు. అదే కలం స్నేహం. అందులో నిజం పేర్లు రాయని సందర్భాల్లో ఆడ, మగ కూడా తెలుసుకోవడం కష్టమే. అలా ఎంతో కాలం గడిచాక అసలు విషయం తెలిసి షాకవటం కూడా జరుగుతుంది. కొన్ని సార్లు వారి ఉత్తరాల్లోని రాతలను బట్టి ఆ వ్యక్తి గురించి గొప్పగా, అందంగా ఊహించుకోవడం.. తీరా చివరకు కలిస్తే తమ ఊహలు తల్లకిందులై నీరసపడి పోవడమూ జరుగుతుంటాయి” చెప్పాడు. “అలా మీ ఊహలేమైనా తల్లకిందులయ్యాయా ఏమిటి?” నవ్వుతూ అడిగింది సృజన. ‘నాక్కాదు, మా ఆకాశ్ గాడికి అలాంటి అనుభవం ఎదురైంది” అన్నాడు ఓంకార్.

“కలాలలో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి? ఏ బ్రాండ్ కలాలు గొప్పవి?” అడిగింది అక్షర. “లెక్కలేనన్ని బ్రాండులున్నాయి. అయితే మన దేశంలో పేరెన్నికగన్నవి పార్కర్, క్రాస్, మాంట్ బ్లాంక్, వాటర్‌మన్, షాంఘై హీరో, షియఫర్, అరోరా.. ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడందరూ రేనాల్డ్స్, సెల్లో, పేపర్ మేట్ బాల్ పాయింట్ పెన్నుల్నే ఎక్కువగా వాడుతున్నారు” చెప్పాడు. ‘మా కలాలకు ఇంత కథా ఉందా’ అని ఆశ్చర్యపోతుండగా, ఓంకార్ “రాసుకోవడానికే కాదు, బొమ్మలు వేయడానికీ ప్రత్యేక పెన్నులు ఉన్నాయి. ఏకబిగిన ఎత్తిన పెన్నును దించకుండా బొమ్మ పూర్తిచేసే గొప్ప చిత్రకారులూ ఉన్నారు. స్కెచ్ పెన్నులు, మార్కర్లు మీకు తెలిసినవే” అన్నాడు.

అంతలో బామ్మ అందుకుని “అసలు తెలుగువాళ్లుగా మీరు ముందు మన తెలుగు రాష్ట్రంలో తయారయ్యే రత్నం పెన్ను గురించి తెలుసుకోవాలి. రత్నం పెన్ను మనదేశంలో తయారయిన మొదటి ఫౌంటెన్ పెన్. స్వదేశీ ఉద్యమ కాలంలో గాంధీ పిలుపు మేరకు రాజమండ్రిలో పందొమ్మిదివందల ముప్పైలో రత్నం పెన్నుల తయారీ ప్రారంభించి, కె.వి.రత్నం బ్రదర్స్ గాంధీజీ ప్రశంసలందుకున్నారు. ఆ తర్వాత కూడా రత్నం పెన్నుల సంస్థ తయారీలో ఎన్నో ప్రయోగాలు చేసి అతి పెద్ద పెన్నును తయారు చేసింది. అంతేనా అతి చిన్న బాల్ పెన్ను, అతి చిన్న ఫౌంటెన్ పెన్నును బంగారంతో తయారుచేసింది” చెప్పింది బామ్మ. మా పెన్నులందరం అది విని పులకించిపోతుంటే.. “అబ్బో” అన్నాడు లిఖిత్.

‘కత్తి కన్నా కలం గొప్పది’ అన్న మాటలో ఎంతో నిజం ఉంది. అందుకే ప్రజల కవి కాళోజీ “ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక” అన్నారు. ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో కలం తర్వాతే ఏదైనా. అలాగే ఒక్క కలంపోటుతో అశేష ప్రజానికి సంబంధించి ఎన్నో ఆదేశాలు, శాసనాలు, తీర్మానాలు. అసలు కవులు, రచయితలకు కలం ప్రాణమే. అదే వారి ఆయుధం. ఫలాని రచయిత కలం నుంచి జాలువారిన.. అని రాస్తుంటారు.

“‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాట విన్నారా, అందులో ‘తిక్కయ్య కలములో తియ్యందనాలు’ అన్నాడు కవి. తిక్కన శైలి మాధుర్యాన్ని అలా చెప్పారు. అలాగే వాడి కలాలు, వేడికలాలు ఇలా ఎన్నో. కలం సేద్యమనీ, ‘కలం’కారీ అని పదప్రయోగాలు వింటుంటాం. కలం అనేది విద్యకు, జ్ఞానానికి ప్రతీక. అందుకే బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొడతారట” చెప్పింది. ‘అంతా బాగానే ఉంది కానీ కోర్టులో కలం పాళీని విరగొట్టడమేమిటో. తప్పు చేసింది మనిషైతే మధ్యలో కలానికెందుకో శిక్ష’ మా కలాల మనసు కల కలమంది.

‘పిల్లలూ! ఇప్పుడు శరన్నవరాత్రులు కదా. సరస్వతీ పూజరోజున కలాలు సరస్వతీదేవి ముందు ఉంచి ప్రార్ధించడం మరచిపోకండి” చెప్పింది బామ్మ. “అలాగే బామ్మా” అన్నారు పిల్లలు. “కలాల కబుర్లేనా, కాఫీ ఏమైనా ఉందా?” తాతగారు అనడంతోనే బామ్మగారు, సృజన అక్కడి నుంచి లేచారు. పిల్లలు టీవీ ఆన్ చేశారు. తాతగారు మా పెన్నులన్నిటినీ మళ్లీ సరిగ్గా సర్ది, తీసుకొచ్చి అల్మైరాలో యథాస్థానంలో ఉంచారు.

“మొత్తానికి ఇవాళ మన చరిత్ర అంతా తెలుసుకున్నాం”, మా కలం దోస్తు అంది. “అవును. కంప్యూటర్లు వచ్చి కలం వాడకం తగ్గినా, సంతకానికయితే మనం తప్పనిససరి. అంతేనా ఎవరి చేతిరాత ఎలా ఉంటుందో చెప్పేది మనమే. మనిషి విజ్ఞానం పొందడానికి, మంచి రాతలకు వేటికైనా ఉపయోగపడటం మనకు గర్వకారణమే. కానీ అప్పుడెప్పుడో టీవీలో చెపుతుంటే విన్నాను.. కలాలతో దొంగ సంతకాలు అదే ఫోర్జరీ చేస్తారని. ఆ నేరంలో, పాపంలో మనల్నీ ఇరికించడం నాకు నచ్చని విషయం.. అలాగే మనల్ని సాధనాలుగా చేసుకుని వ్యక్తుల మధ్య ద్వేషాన్ని రగిలించే రచనలు, హింసను ప్రేరేపించే రచనలు చేయడం ఎంత అన్యాయం? ఇదే మాట ఈ మనుషులకు చెప్పాలనుంది. కానీ మనుషుల కరకు గుండెలకు కలం మాట వినపడేనా!” అన్నాను. ఏం జవాబివ్వాలో తెలియక దీర్ఘంగా నిట్టూర్చాయి నా కలం నేస్తాలు. ఇక మిగిలింది మౌనమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here