అన్నింట అంతరాత్మ-14: ధరణినేలేదాన్ని.. ధనాన్ని నేను!

7
8

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం నాణెం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]”తా[/dropcap]తయ్యా! తాతయ్యా! ఆ చిన్న సంచీలో ఏముంది?” ఎనిమిదేళ్ల కుర్రాడు ఎదురొచ్చి అడిగాడు. లక్ష్మీపతిగారు (ఇందాక బ్యాంకులో ఎవరో పిలుస్తుంటే తెలిసింది ఆయన పేరు) భద్రంగా మేమున్న సంచీని టేబుల్‌పై పెడుతూ “ఇది చిల్లరరా” అన్నారు. ఇంతలో లక్ష్మీపతిగారి భార్య మహాలక్ష్మి వచ్చి “తెచ్చారా నూట ఎనిమిది కొత్త నాణేలు. హమ్మయ్య. ఇంక లక్ష్మీపూజ లక్షణంగా చేసుకోవచ్చు” అంటూ సంచీని తీసుకొని దేవుడి దగ్గర ఒక చిన్న డబ్బాలో పెట్టింది. సంచీలోని సరికొత్త ఐదురూపాయల నాణేల్లో ఒకదాన్నయిన నేను ఇక్కడినుంచే ఈ కొత్త చోటును పరీక్షగా చూస్తూ అందరినీ గమనిస్తున్నాను.

“తాతయ్యా! అసలు దీపావళి రోజున ధనలక్ష్మీపూజ ఎందుకు చేస్తారు?” అడిగాడు మనవడు. “దీపావళి రోజు లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి ఇల్లిల్లు తిరుగుతుందని నమ్ముతారు. అందుకే ఆ రోజున ఇళ్లను శుభ్రంగా ఉంచుకొని.. సాయంవేళ లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అలా చేస్తే ఆ యింట లక్ష్మి స్థిరంగా, కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే మీ నానమ్మ ప్రతిసంవత్సరం దీపావళినాడు కొత్త నాణేలతో పూజ చేస్తుంది.” చెప్పారాయన.

అది విని ‘అదా సంగతి’ అనుకుంటుండగా “లక్ష్మీదేవి అసలే చంచల అంటారు. అందుకే శ్రద్ధగా పూజించుకోవాలి” చెప్పింది మహాలక్ష్మి.

“చంచల అంటే..?” అడిగాడు మనవడు. “స్థిరంగా ఉండనిది అని అర్థం” చెప్పారు లక్ష్మీపతిగారు. ‘ఓహో.’ అంటుండగా లక్ష్మీపతిగారి అబ్బాయి కాబోలు, లోపలకు వస్తూ, “అమ్మా! ఇవిగో కొత్త నోట్లు రేపు పూజకు వాడతావని తెచ్చాను” అంటూ కొత్త కరెన్సీ నోట్లు అందించాడు. ఆ నోట్లు మా చుట్టాలే. బ్యాంకులో మాకు పరిచితులే. వాళ్లను చూస్తూ ఆనందపడ్డాను. అవి కూడా మా వంక చూసి పలకరింపుగా నవ్వాయి. మహాలక్ష్మిగారు “మంచి పని చేశావురా ధన్‌రాజ్” అంటూ వాటిని ఆనందంగా అందుకుని మేమున్న చోటే భద్రంగా పెట్టింది.

“నాన్నా! నాన్నా!” అంటూ వచ్చింది శ్రీనిధి అక్క, సంపద. “ఏంటి సంపూ” అన్నాడు ధనరాజ్. “మరి ఈ డబ్బు అనేది లేనప్పుడు ఎలా వస్తువులు కొనుక్కునేవారు?” అడిగింది. నాకూ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మా సంగతి మాకు తెలియకపోతే ఎలా? ఇంతలో మరో ఇద్దరు పిల్లలు పరుగెత్తుకు వచ్చి, “అవును మామయ్యా డబ్బు లేనప్పుడు ఏం చేసేవారో ఆ విషయాలు చెప్పు” అన్నారు. వాళ్లు మామయ్యా అన్నారు కాబట్టి వాళ్లు ధనరాజ్ అక్క పిల్లలని, పండుగకు వచ్చారని అర్థం చేసుకున్నా.

“సరే చెపుతా.. డబ్బులేని కాలంలో వస్తుమార్పిడి పద్ధతి ఉండేది. ఇంగ్లీషులో దీన్ని ‘బార్టర్ సిస్టమ్’ అంటారు. అంటే తమ దగ్గరున్న వస్తువును ఇతరులకు ఇచ్చి, వారి దగ్గర ఉన్న, తమకు కావలసిన వాటిని తీసుకోవడం అన్నమాట” అన్నాడు ధన్‌రాజు. “భలే ఉందే” అన్నాడు ఒక పిడుగు. “కాదురా కార్తీక్, అందులో వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు కావలసిన వస్తువు వెంటనే లభ్యం కావడం ఇబ్బందయింది. పైగా వస్తువుల మధ్య విలువ అంటే ఇన్నింటికి ఇన్ని.. అనే నిర్ణయం కూడా కష్టమైంది. అందుకే మనిషి ఆలోచించి డబ్బును ఆవిష్కరించాడు. మొదట్లో గవ్వలు, పూసలు, దంతాలు, ధాన్యం, పండ్లు, జంతుచర్మాలు వంటి వస్తువులు డబ్బుగా చలామణి అయ్యేవి. అన్నట్లు వేదకాలంలో గోవులను ‘గోధనం’గా భావించి ద్రవ్యంగా ఉపయోగించేవారు. కాలక్రమంలో నాణేల తయారీ మొదలయింది” చెప్పాడు ధనరాజ్.

“మరి నాణేలు ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలయ్యాయి?” అడిగింది మరో అమ్మాయి. “అదీ చెపుతా.. విను శ్రీకరీ” అంటూ.. “లోహపరిజ్ఞానం వృద్ధిచెందాక క్రీస్తుపూర్వం ఏడువందలు కాలంలో లిబియా ప్రాంతంలో తొలిసారిగా నాణేలను జారీచేశారు. మనదేశంలో నాణేల చలామణి కాలం గురించి భిన్నాభిప్రాయాలున్నా.. క్రీస్తుపూర్వం ఆరు, ఏడు శతాబ్దాలలో నాణేల తయారీ ప్రారంభమై ఉండవవచ్చని ఎక్కువమంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఎన్నో రకాల లోహాలను వాటి తయారీకి వాడారు. రాగి, వెండి, బంగారు, ఇత్తడి, కంచు.. ఆ తర్వాత నికెల్, స్టీల్ నాణేలు వచ్చాయి.”

“మరి కాగితపు కరెన్సీ ఎప్పటినుంచి ప్రారంభమైంది?” శ్రీనిధి అడిగాడు. “మధ్య యుగంలో చైనాలో తొలిసారిగా సుంగ్ వంశ రాజుల కాలంలో కరెన్సీ చలామణిలోకి వచ్చింది” చెప్పాడు.

అంతలో ధనరాజ్ అక్క భాగ్యలక్ష్మి అక్కడికి వచ్చి.. “మీకో విషయం తెలుసా? ఇప్పటికీ వస్తుమార్పిడి పద్ధతి అనుసరించే వారు ఉన్నారు?” అంది. అంతా ఆమెకేసి ఆశ్చర్యంగా చూశారు. “అవును. అసోంలోని మరిగోవ్ జిల్లాలో ప్రతి సంవత్సరం ‘జోన్‌బీల్ మేళా’ జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడివారు ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తుమార్పిడిని అనుసరిస్తారు. మేఘాలయ, అసోం సరిహద్దు గ్రామాలలోని ‘తివా’ వర్గ ప్రజలు, తాము పండించిన ఆహారపంటలను, కొండ ప్రాంతాల ప్రజలైన కర్చి ఖాసీ, రాభా, జైంతియావర్గాల వారు తీసుకొచ్చిన వస్తువులతో మారకం చేస్తారు. అయితే ఈ వస్తుమార్పిడి ఏటా ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది” చెప్పింది. “భలే ఉంది” అన్నారు పిల్లలు.

“మీకు ఇంకో చిత్రమైన విషయం చెపుతా” అంటూ వచ్చింది ధన్‌రాజ్ భార్య ఐశ్వర్య. “ఏంటో అంత చిత్రం” అన్నాడు ధనరాజ్. “అక్కడ కరెన్సీనే తూకం వేసి అమ్మారు” అంది. “కరెన్సీని తూకమా?” ఆశ్చర్యంగా చూశారు లక్ష్మీపతిగారు. “అవును మామయ్యా.. సోమాలియా ల్యాండ్‌లో ఇది జరిగింది. సోమాలియా నుంచి సోమాలియా ల్యాండ్ విడిపోయాక అక్కడ పేదరికం తాండవించింది. దాంతో ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించి ప్రజలకు పంపిణీ చేసింది. చేతినిండా డబ్బు ఉండటంతో ప్రజలు సోమరులై పనిచేయడం మానేశారు. పన్నులు కట్టే పనికూడా లేదు. దాని ఫలితంగా వారి కరెన్సీ విలువ పడిపోయింది. ఎక్కడ చూసినా కరెన్సీ కుప్పలే. ఆ సందర్భంలో కరెన్సీని తూకం వేసి అమ్మారు. వారి కరెన్సీ విదేశీ అప్పులు తీర్చడానికి కూడా పనికిరాలేదు. కొన్ని దేశాలైతే వారి కరెన్సీని నిషేధించాయి. దాంతో అక్కడి ప్రజలు తిరిగి వస్తుమార్పిడి పద్ధతిని ఎంచుకున్నారు” ఆగింది. “అంతేమరి.. ఎవరికీ పనికిరాని డబ్బుతో వాళ్లు ఏం చేయగలరు” అంది భాగ్యలక్ష్మి.

“అది సరే మామూలు పరిస్థితులలో చేతిలో డబ్బుల్లేకపోతే ఏంచేస్తారు” సంపూ అడిగింది. ఈసారి లక్ష్మీపతిగారు అందుకొని “ఏం ఉంది అప్పు చేయడమే.. ఏడుకొండలవాడికే పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి అప్పు చేయక తప్పలేదు. మనమెంత? అప్పుడు చేసిన అప్పుకు వడ్డీ పెరిగి పెరిగి ఇంకా అప్పుతీరలేదట. భక్తులు చెల్లించే ముడుపుల ధనాన్ని, అన్న గోవిందరాజులు కొలిచి లెక్కిస్తాడట. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలోని విగ్రహం ఆ కొలతపాత్రను తలక్రింద పెట్టుకుని నిద్రిస్తున్నట్లే ఉంటుంది. తమ్ముడి ఆదాయాన్ని లెక్కిస్తూ అలసిపోయి, విశ్రమిస్తున్న సందర్భమని చెపుతారు” ఆగారు తాతగారు.

“కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నప్పుడే ఆ ధనాన్ని కొలుస్తూనే అలసి పవళించిన విగ్రహమని నేనొకచోట చదివాను” అంది మహాలక్ష్మి. “ఇలాంటి విషయాల్లో రకరకాల కథనాలు ఉండటం సహజమే అత్తయ్యా” అంది ఐశ్వర్య. “తిరుమలలో దేవుడికొచ్చిన ధనాన్ని.. నాణేలను, నోట్లను వేరుచేసి నిత్యం లెక్కించే పనిని పరకామణి అంటారు” చెప్పాడు ధన్‌రాజ్. ‘అవునవును.. నేను టీవీలో చూశాను. ఎంత డబ్బో” అశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి అన్నాడు శ్రీనిధి.

దేవదేవుడికి కూడా మాతోనే పని అనుకుంటే చెప్పొద్దూ నాకెంతో గర్వంగా అనిపించింది. మావాళ్ల ముఖాలన్నీ కూడా గర్వంతో వెలగడం గమనించాను. అంతలో “శ్రీనివాసుడికేం, అప్పు భారం ఉన్నా చిద్విలాసంగా ఉన్నాడు. కానీ అలనాడు సత్యహరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడి దురుద్దేశం తెలియక అతడికి డబ్బు ఇస్తానని వాగ్దానం చేసి, దాన్ని నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టాలు తలచుకుంటే కన్నీళ్లాగవు..” అంది మహాలక్ష్మి. “అవునవును పోయినసారి తాతయ్యే మాకు హరిశ్చంద్రుడి కథ చెప్పారు” అన్నారు పిల్లలు.

“మరి నల్లధనం అంటే ఏమిటి తాతయ్యా” శ్రీకరి అడిగింది. తాతగారు అందుకుని.. “అక్రమంగా ఆర్జించిన, లెక్కలలో చూపని ధనాన్నే నల్లధనం అంటారు. ఏటా ప్రభుత్వానికి పౌరులంతా తమ ఆదాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వివరాల్లో ఈ అక్రమార్జన వివరం ఉండదన్నమాట. మన ప్రభుత్వానికి తెలియకుండా ఈ నల్లధనాన్ని బడాబాబులంతా స్విస్ బ్యాంక్‌ల్లో దాచుకుంటారట. ఇలాంటి నల్లఖాతాలున్నవారి జాబితా తమ వద్ద ఉందని, ఆ డబ్బుని వెనక్కి రప్పిస్తామని ప్రభుత్వం చెప్పటమే కానీ ఇంతవరకేమీ జరుగలేదు. నిజంగా ఆ ధనమంతా తెస్తే పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించి దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు” చెప్పారు తాతగారు.

“నాణేల సేకరణ మంచి హాబీ కదా తాతయ్యా.. మా ఫ్రెండ్ ఆ మధ్య తన దగ్గరున్న నాణేలన్నీ చూపించాడు. అందులో దమ్మిడి, కాని, ఏగాని, చిల్లికాని, బేడా, అణాలు, రాగి పైస కూడా ఉన్నాయి. అంతేకాదు వాడి దగ్గర విదేశీ నాణేలు కూడా ఉన్నాయి. వాళ్ల బాబాయ్ తెచ్చిచ్చాడట. అవన్నీ చూస్తుంటే భలేగా అనిపించింది. నా దగ్గరయితే ఒకటి, రెండు, మూడు, ఐదు, పది, ఇరవై, ఇరవైఐదు, యాభై (పైసలు), రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు పాత నాణేలు ఉన్నాయి” చెప్పాడు. “అవును.. నాణేల సేకరణ మంచిహాబీ. అసలు ఈ నాణేల వల్లనే చరిత్ర కూడా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో తవ్వకాలలో దొరికిన నాణేలు అప్పటి పాలకుల వివరాన్ని, వారి సంస్కృతిని తెలియజేస్తున్నాయి” అన్నారు తాతగారు. మా పూర్వీకుల పేర్లు వింటుంటే నాకు చాలా ఆనందమనిపించింది. పైగా చరిత్రకు కూడా మేం ఆధారమంటే కాలం గడిచిపోయినా మాకు ఎంతో కొంత విలువ ఉంటుంది అనిపించింది.

అంతలో మహాలక్ష్మిగారు అందుకుని “అయినా ఇప్పుడు నాణేలు అంటే రూపాయి నాణెం మాత్రమే కాస్తంత కనిపిస్తోంది. ఆ తర్వాత ఐదురూపాయల నాణెం చూస్తున్నాం. మా చిన్నప్పుడైతే ఇంట్లో నాణేల గలగల బాగా ఉండేది. చిల్లర శ్రీమహాలక్ష్మి అనేవాళ్లు. మా నాన్న ఒక పెద్ద చాక్లెట్ డబ్బా నిండా చిల్లర పోసి ఉంచేవారు. మాకు అప్పుడు పాకెట్ మనీ లంటూ ప్రత్యేకం ఉండేవి కావు. ఐస్ ఫ్రూట్, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ చిల్లరతోనే వచ్చేవి. మా స్కూలుకు రిక్షాలో వెళ్లాలంటే నలభై పైసలు. అర్ధరూపాయి ఇవ్వమని అడిగితే ససేమిరా అనేదాన్ని. ఇప్పుడంతా నోట్ల వ్యవహారమే” అంది.

“అసలు చేతిలో డబ్బు లుండాల్సిన పని కూడా లేదు, అంతా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు, ఆన్లైన్ నగదు బదిలీలు, ఫోన్ పే వగైరాలే కదా” ఐశ్వర్య అంది. “ఇంకో చిత్రం ఏమిటంటే చిల్లర శ్రీమహాలక్ష్మి అనేది పెద్దల మాటయితే ఇప్పుడు చిల్లర అనే మాటని ఇతరులను కించపరిచే అర్థంలో ‘చిల్లర పనులు, చిల్లరగాడు’ అని వాడుతున్నారు” అంది. ఆ మాట వినగానే నా మనసంతా బాధ. మావాళ్లకేసి చూశాను. వాళ్లూ ముఖం చిన్నబుచ్చుకునే కనిపించారు.

అంతలో మళ్లీ మహాలక్ష్మిగారి మాట వినపడటంతో అప్రయత్నంగా నా చెవులు అటు మళ్లాయి.. “అసలు ఈ సిరిసంపదలు శాశ్వతమని భ్రమపడుతుంటాంగానీ భాగవతంలో పోతనగారు సిరి గురించి ఎంత చక్కగా చెప్పారో.. ముఖ్యంగా వామనుడికి దానం ఇవ్వవద్దని శుక్రాచార్యులు చెపితే, బలిచక్రవర్తి నోట పలికించిన పద్యం ఎంత ప్రసిద్ధి చెందిందో..

కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే?
వారేరీ సిరి మూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే! శిబి ప్రముఖులుం బ్రీతిన్‌ యశఃకాములై
యీరే కోర్కెలు! వారలన్‌ మఱచిరే యిక్కాలమున్‌? భార్గవా!

ఎంత సంపద ఉన్నా చివరకు అన్నిటినీ వదలిపోవలసిందేకదా. రాజులైనా, చక్రవర్తులైనా.. ఎవరైనా కడకు ఏమీ పట్టుకెళ్లలేరని ఎంత బాగా చెప్పారో. ‘ధనం మూలం ఇదం జగత్’ అంటే ధనమే జగత్తుకంతటికీ మూలం అని అన్నారని, ధనాన్ని సద్వినియోగం చేయకుండా, దాచి పెంచినందువల్ల ఏమీ ప్రయోజనం ఉండదని తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఏ దొంగలపాలో అయి చింతలపాలు చేస్తుంది.” వివరించింది.

అది విని ధనరాజ్ “మా అమ్మ పోతన భాగవతాన్ని ఎంత బాగా అర్థం చేసుకుందో” అనడంతో అంతా ఆమె వంక ప్రశంసగా చూశారు.

“ఆ మధ్య మోడీగారు ఐదువందల రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు చాలామంది దగ్గర దాచిన ధనమంతా చివరకు కొరగాకుండా పోవడం మనం చూశాంకదా” అన్నారు లక్ష్మీపతిగారు. “అవును, మా అత్తగారయితే అలా ఎక్కడెక్కడో దాచి వాటి మాటే మరిచిపోయారు. బ్యాంకులో మార్చుకునే కాలపరిమితి దాటిపోయాకగానీ అవన్నీ బయటపడలేదు. అప్పుడింక ఆవిడ లబోదిబో” భాగ్యలక్ష్మి అనడంతో అంతా నవ్వారు.

నోట్ల రద్దు కూడా జరుగుతుందన్నమాట అనుకుంటూ పక్కనున్న కట్టలవైపు చూశాను. అవి మేమూ విన్నాంలే’ అన్నట్లు చూశాయి.

“చిన్నప్పుడు స్నేహితులతో ఏదైనా పందెం కాస్తే బొమ్మ.. బొరుసుతో తేల్చుకోవడానికి నాణేలే వాడేవాళ్లం” అన్నాడు ధనరాజ్. “అన్నట్లు గతంలో చెల్లని నాణేలు కొన్ని వచ్చేవి. అలాగే నకిలీ నోట్ల బెడద కూడా ఉండనే ఉంది. అలాంటి వాటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి” అన్నారు లక్ష్మీ పతిగారు. “నాన్నా! ఇక నుంచి మీ దగ్గరున్న కొత్త నాణేల్లో ఒక్కొక్కటి నాకు ఇవ్వండి, అలాగే నోట్లు కూడా.. నేను దాచుకుంటా. నేను కూడా నాణేలు సేకరించాలనుకుంటున్నా” అంది సంపద. “అలాగే మీకందరికీ దీపావళి బహుమతిగా రేపు కొన్ని నాణేలు, నోట్లు ఇస్తాలే” అనడంతో పిల్లల ముఖాలు వెలిగిపోయాయి. ఇంతలో ఇంటికి ఎవరో రావడంతో వాళ్లంతా వేరే కబుర్లలో మునిగారు.

కానీ నేనుమాత్రం ఇందాక విన్న విషయాల దగ్గరే ఉండిపోయాను. మమ్మల్ని అంటే నాణేలను, నోట్లను ముద్రించేది మనిషే. కానీ మళ్లీ ధన నిర్వహణలో విఫలమవుతున్నాడు. మితిమీరిన స్వార్ధంతో మమ్మల్ని నల్లధనంగా మారుస్తున్నాడు. మమ్మల్నలా నలుపు చేయడం మంచిది కాదని చెప్పాలని ఉంది. అలాగే మేం ఏ కొందరి దగ్గరో అత్యంత ఎక్కువగా, చాలామంది దగ్గర తక్కువగా ఉండటం సరికాదని, ఆ తేడాను వీలైనంత తగ్గించమని.. ధనాన్ని దొంగిలించడం, నకిలీలను సృష్టించడం మంచిదికాదని చెప్పాలనుంది కానీ మా మాట ఎలా వినిపిస్తుంది. వినిపించినా డబ్బుజబ్బు ఉన్న మనుషులకు ఎలా రుచిస్తుంది? అంతలో మాముందే ఉన్న లక్ష్మీదేవి ఫొటోపై నా చూపు నిలిచింది. ఆమె చేతి నుంచి నాణేలు కురుస్తున్నట్లుగా ఉంది ఆ చిత్రం. అది చూసి నాకెంతో సంతోషమైంది. అంతలో ఓ ఆలోచన. అవును.. దైవం మీదే భారం వేస్తా అనుకుంటూ.. మానవులకు చెప్పాలనుకున్న మాటలన్నీ వారికెలాగైనా చేరవేయమని, వారికి మంచి బుద్ధి ప్రసాదించమని లక్ష్మీదేవికే విన్నపాలు మొదలు పెట్టాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here