అన్నింట అంతరాత్మ-22: ఎగువదారిలో మీ సేవలో.. మెట్ల వరుసను నేను!

8
8

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం మెట్ల అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]’ఏ[/dropcap]డుకొండలసామీ ఎక్కడున్నావయ్యా

ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా.. ఏడుకొండల సామీ..’

పాట వింటూనే లలితమ్మ “ఎన్ని మెట్లేమేటి, అలిపిరి నుంచి మూడువేల ఐదొందల మెట్లకు పైగా ఎక్కాలి, బస చూసుకోవాలి. ఆ తర్వాత స్నానాదులు ముగించుకుని, తయారై దర్శనం టిక్కెట్టు పుచ్చుకుని ప్రత్యేక లైన్ లోనో లేదంటే సర్వదర్శనం క్యూలోనో నిలబడితే క్యూ కదిలి కదిలి ఎప్పటికో ఏడుకొండలవాడు దర్శనమిచ్చేది” అంది. ‘వీళ్లు నా ఇరవై మెట్లనే ఎక్కలేక ఆపసోపాలు పడుతుంటారు. మూడువేల ఐదొందలంటే మాటలా’ అనుకున్నాను.

అన్నట్లు నేనెవరో చెప్పలేదు కదూ. ఈ యింట్లో హాల్లో ఉన్న మెట్ల వరుసను నేను, అందరి మాటలు వింటూ ఆనందిస్తుంటా. లలితమ్మ మాటలు విన్న భర్త ప్రసాదరావు అందుకుని “అలిపిరి మార్గం ఒక్కటే కాదు, శ్రీనివాస మంగాపురం నుంచి కూడా మరో మెట్ల మార్గం ఉంది. దాన్నే శ్రీవారి మెట్టు అంటారు. దానికి అలిపిరి మార్గం కంటే ఓ వెయ్యి మెట్లు తక్కువ. కానీ ఎందుకో నూరు మెట్ల దారి అని పిలుస్తుంటారు. గతంలో ఈ దారిని ఎక్కువగా వాడేవారట. కానీ ఆ తర్వాత తర్వాత ఎక్కువ మంది అలిపిరి మార్గం నుంచే ఎక్కుతున్నారు” అన్నాడు.

‘దైవదర్శనానికి మమ్మల్ని ఎక్కవలసిందే. చాలా దేవాలయాలు కొండమీద ఉండటం, భక్తులు మెట్లెక్కి వెళుతుండటం టీవీలో చూశాను. మమ్మల్ని సోపానాలని కూడా అంటారు’. ఇంతలో పిల్లలు నానీ, పింకీ మెట్లు దిగటం మొదలు పెట్టారు. “ఎవరు ముందు దిగుతారో చూద్దామా” అన్నాడు నానీ. “అట్లా కాదు, కిందికి దిగేసి, ఆ తర్వాత ఇద్దరం పైకెక్కి, కిందికి దిగుదాం. అప్పుడు ఎవరు ముందో చూద్దాం” అంది పింకీ. సరే అన్నాడు నానీ. ఇద్దరూ దబదబ మెట్లు దిగిఎక్కటం మొదలు పెట్టారు. పిల్లలు అలా గట్టిగా నన్ను తొక్కుతున్నా, వాళ్ల ఆట నాకు ఆనందంగానే ఉంది. “మెట్ల మీద ఏం ఆటలు, పడతారు జాగ్రత్త” అంది లలితమ్మ. “నేనే ఫస్ట్” అన్నాడు నానీ. “తొండి, నన్ను నెట్టేసి దిగావు” అంది పింకీ.

“తాతా! మెట్రో స్టేషన్‍లో ఎంచక్కా ఎస్కలేటర్ ఉంది, లిఫ్ట్ కూడా ఉంది కదా, మళ్లీ మెట్లు కూడా ఎందుకు?” అడిగాడు నానీ. “మోటార్ చెడిపోతే మెట్లే దిక్కవుతాయి కదా. మెట్లకు పవర్ అవసరం లేదు, చెడిపోతాయనే బెంగలేదు. మెట్లు ఎక్కడం ఒక విధంగా వ్యాయామం కూడా” అన్నాడు ప్రసాదరావు. అంతలో ప్రసాదరావు కొడుకు అనంత్ వచ్చాడు అక్కడికి. “మన మెట్రో స్టేషన్‌లో మామూలు మెట్లే ఉన్నాయి. కేరళ లోని కొచ్చిలో ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌లో పియానో మెట్లు ఏర్పాటు చేశారు. మెట్లు ఎక్కి, దిగుతుంటే సప్తస్వరాలు పలుకుతాయి. మెట్టుమీద అడుగు వేయగానే లైటింగ్‌తో పాటు స్వరం వినిపిస్తుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో స్వరం పలికేలా కంప్యూటర్‌తో డిజైన్ చేశారట” చెప్పాడు. “భలే, భలే” అన్నారు పిల్లలు. నేనూ మనసులో అలా ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను.

“పాత కాలంలో మెట్లు ఉండేవా తాతయ్యా!” అడిగాడు నానీ. “మెట్లు అత్యంత ప్రాచీనకాలం నుంచే ఉన్నాయి. మన దేశంలో ఘన చరిత్రను చాటే పురాతన కోటలెన్నో ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా రాతిమెట్ల నిర్మాణాలున్నాయి. మన హైదరాబాద్లోని గోల్కొండ కోటను మీరు చూశారు కదా. గోల్కొండ కోటకు మొత్తం ఏడువందల ఇరవై మెట్లు ఉన్నాయి. అక్కడ అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా నుంచే సందర్శకులు లోపలకు వెళ్తారు. ఫతేదర్వాజ దగ్గరి గుమ్మటం కింద ఓ నిర్ణీత ప్రదేశంలో చప్పట్లు కొడితే కిలో మీటరు ఆవల ఎత్తయిన బాలాహిస్సార్ వద్ద చాలా స్పష్టంగా ఆ చప్పట్ల ధ్వని వినిపిస్తుంది. బాలాహిస్సార్ దర్వాజా నుంచి కొండ పైకి వెళ్లటానికి మూడొందల ఎనభై ఎగుడుదిగుడు మెట్లున్నాయి. అవన్నీ ఎక్కితేనే బాలాహిస్సార్ బారాదరీ మంటపం కనపడుతుంది. మళ్లీ సెలవుల్లో ఓసారి గోల్కొండ చూద్దాంలే. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇంకో విశేషం.. ఆ మధ్య పేపర్లో చదివాను, బన్సీలాల్ పేటలో సున్నపురాయితో నిర్మితమైన మెట్లబావి బయల్పడిందని. దానికి మూడువందల సంవత్సరాల చరిత్ర ఉందట. తొంభై ఏళ్ల కిందట మరుగున పడి, మళ్లీ ఇప్పుడు వెలుగు చూసింది. ఈ మెట్లబావికి డెబ్బైకి పైగా మెట్లు ఉన్నాయిట. ఇదే కాదు, తెలంగాణలో వందల కొద్దీ పురాతన మెట్లబావులున్నాయి. వీటినే దిగుడుబావులని కూడా అంటారు” చెప్పాడు ప్రసాదరావు.

“మెట్ల బావులంటే ముందుగా చెప్పుకోవలసింది రాజస్థాన్‌లోని చాంద్ బావొరి. దీనికి ప్రపంచ వారసత్వ హోదా లభించింది. పదమూడు అంతస్తుల, ముప్ఫై మీటర్ల లోతయిన నిర్మాణం. మూడువేల ఐదొందల మెట్లు విభిన్నంగా రకరకాల కళాకృతులతో ఉంటాయి” చెప్పాడు అనంత్. “ఓ! భూమి పైనే కాకుండా, భూమి అట్టడుగు వరకూ మెట్లా!” ఆశ్చర్యపోయారు నానీ, పింకీ. నేను ఆ నిర్మాణాన్ని ఊహించుకుంటున్నాను. మా జాతి ఎంత గొప్పదో.. గర్వపడ్డాను.

“మరి మెట్లు లేని చోట్ల ఎలా?” అడిగాడు నానీ. “ఎలా ఏమిటోయ్.. నిచ్చెన ఉందిగా. ఇప్పుడు ఇళ్లల్లో అటకలమీద వస్తువులు తీసుకోవడానికి కూడా తేలికపాటి మెటల్ నిచ్చెనలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపుల్లో కూడా పైనున్న వస్తువుల్ని అందుకోవడానికి నిచ్చెన రెడీగా ఉంచుకుంటారు. ఇళ్ల నిర్మాణంలో, కరెంట్ స్తంభాలు ఎక్కడానికి.. ఇంకా ఎన్నో అవసరాలకు నిచ్చెన ఎంతగానో ఉపయోగిస్తుంది.”

“ఆఁ చూశాను.. చూశాను” అన్నాడు నానీ. “స్నేక్స్ అండ్ లాడర్స్‌లో కూడా నిచ్చెనలుంటాయి కదా” అంది పింకీ. “అవునమ్మా. నిచ్చెన ఎక్కి పై పైకి వెళ్లడం, అంతలో ఏ పాము నోటికో చిక్కి కింద పడిపోవడం.. గెలవడం కష్టంగానే ఉంటుంది. స్నేక్స్ అండ్ లాడర్స్‌ను తెలుగులో ఏమంటారో తెలుసా?” అడిగాడు ప్రసాదరావు. తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది పింకీ. ‘వైకుంఠపాళీ’ అంటారు. దాన్నే ‘పరమపద సోపానము’ అని కూడా అంటారు – చెప్పాడు ప్రసాదరావు.

అంతలో పావని వచ్చి పెద్దవాళ్లకు కాఫీ, పిల్లలకు బూస్ట్ ఇచ్చింది. కాఫీ తాగుతూ, “ఈ పిల్లలకు బొత్తిగా తెలుగు మాటలు, తెలుగు కథలు తెలియకుండా పోతున్నాయి. ఒక సారి ‘బాలభారతం’ సినిమా చూపించాలి. అందులో భీముడు, తల్లి కోసం, స్వర్గం నుంచి ఐరావతాన్ని తీసుకు రావడానికి బయలుదేరుతాడు. విద్యలో ఆరితేరిన అర్జునుడు బాణాలతో స్వర్గానికి నిచ్చెన నిర్మిస్తే భీముడు ఒక్కో మెట్టే ఎక్కుతూ ఆకాశంలోకి వెళ్తాడు” చెప్పింది. పిల్లలు ఆశ్చర్యంగా వింటుంటే, నేనూ ఔరా అనుకున్నాను.

“అర్జునుడే కాదు, మాయాబజార్ సినిమాలో అభిమన్యుడు కూడా శశిరేఖ, పెద్దలకు తెలియకుండా తనతో నౌకా విహారానికి రావడానికి ఆమె ఉన్న మేడవరకు బాణాలతో నిచ్చెన ఏర్పాటు చేస్తాడు. శశిరేఖ అలవోకగా ఆ బాణాల మెట్లు దిగి కిందికి వచ్చేస్తుంది” చెప్పింది లలితమ్మ. “బాణాల ఐడియా బాగుంది” అన్నాడు నానీ. నేనూ అలాగే అనుకున్నాను. “ఇంకో సంగతి గుర్తుకు వస్తోంది. కైలాస పర్వతాన్ని ‘స్వర్గానికి వెళ్లే నిచ్చెన’ అంటారు. కైలాస పర్వతాన్ని దర్శించి, దాన్ని చుట్టివచ్చి తరించడమే కానీ ఇంతవరకూ ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేక పోయారు” చెప్పింది పావని. “కైలాస పర్వతం ఎక్కడ ఉంది?” అడిగింది పింకీ. “టిబెట్ లోని హిమాలయా పర్వతాల్లో ఉంది” బదులిచ్చింది పావని.

అంతలో “ప్రకృతిపరంగా ఏర్పడే మెట్లు కూడా ఉంటాయి. మహారాష్ట్రలో మతెరాన్ అనే ఓ చిన్న హిల్ స్టేషన్ ఉంది. అక్కడ వన్ ట్రీ హిల్ పాయింట్ మెట్ల మార్గం మాదిరే ఉంటుంది. శివాజీ మహరాజ్ ఆ మార్గం గుండానే వేటకు, వాహ్యాళికి వెళ్లేవాడని చెపుతారు” అన్నాడు అనంత్. “అవును. పరిశీలించాలే కానీ ప్రకృతిలో ఎన్నెన్ని ఆకృతుల గమ్మత్తులో” అన్నాడు ప్రసాదరావు.

“సాహిత్యంలో కూడా మెట్లు ప్రముఖ స్థానాన్ని పొందాయి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ‘స్వర్గానికి నిచ్చెనలు’ అని ఓ గొప్ప నవల రాశారు. అలాగే ప్రముఖ రచయిత బుచ్చిబాబు కూడా ‘మేడ మెట్లు’ పేరుతో మంచి కథ రాశారు” అంది పావని. “చిన్నప్పుడు వేసవి సెలవుల్లో వెన్నెల రాత్రులలో పెరట్లోని మేడమెట్ల మీద కూర్చుని ఎంచక్కా కథలు, కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఎంత హాయిగా ఉండేదో” ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది లలితమ్మ. “మా ఇంట్లో అయితే చెక్క మెట్లు ఉండేవి” అంది పావని. “చెక్క మెట్లా” ఆశ్చర్యంగా అంది పింకీ. “అవును. రాతిమెట్లు, చెక్కమెట్లు, సిమెంట్ మెట్లు, మెటల్ మెట్లు, గాజు మెట్లు రకరకాల డిజైన్లతో మార్బుల్ మెట్లు ఇలా మెట్లలో ఎన్నో రకాలున్నాయి. అలాగే మామూలుగా సమంగా ఉండేవి, వంపుగా ఉండేవి, వలయాకారంలో ఉండేవి, రకరకాల మెట్ల డిజైన్లు ఉన్నాయి” చెప్పింది పావని. టీవీలో సినిమాల్లో చూసిన రకరకాల మెట్ల డిజైన్లు గుర్తొచ్చాయి. ముఖ్యంగా ఓ సినిమాలోని పెద్ద హాలు.. ఆ హాల్లో రెండువైపుల నుంచి మెట్లు నా కళ్ల ముందు మెదిలాయి.

అంతలో “ఏంచేస్తున్నారు.. కొలువు తీరినట్లున్నారు. ఏమిటి విశేషం ప్రసాదం” అంటూ ప్రవేశించాడు హనుమంతరావు. “రావోయ్ హనుమంతూ! రెండో శనివారం కదా.. కాఫీ తాగుతూ కబుర్ల లోకి దిగాం. పిల్లలు మెట్లు అంటూ మొదలు పెట్టారు. దాంతో వాటి గురించిన సంగతులే చెప్పుకుంటున్నాం” అన్నాడు ప్రసాదరావు. “అలాగా. మరి ‘పొన్ను పదునెట్టాంబడి’ గురించి మీకు తెలుసా?” అడిగాడు హనుమంతరావు. అంతా ఒక్కసారిగా “తెలియదు” అన్నారు. నేను కూడా అదేమిటో తెలుసుకోవాలని చెవులు రిక్కించాను. “చెపుతా వినండి. ఏటా నేను అయ్యప్పదీక్ష తీసుకుని, శబరిమలై వెళ్లివస్తానని మీకు తెలుసుగా. అయ్యప్పస్వామి దీక్షలో పదునెట్టాంబడికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్లు. ఈ మెట్ల గురించి ఎన్నో తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. గతంలో ఈ మెట్లను ఎక్కే భక్తులు, దిగే భక్తులు మెట్టు మెట్టుకూ కొబ్బరి కాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దాంతో క్రమంగా ఆ మెట్లు శిథిలావస్థకు చేరాయి. అది గమనించి ఆలయాధికారులు పంథొమ్మిది వందల ఎనభై అయిదులో పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుండి ఆ మెట్లకు ‘పొన్ను పదునెట్టాంబడి’ అనే పేరొచ్చింది. ఆ మెట్ల మీద కొబ్బరి కాయలు కొట్టకుండా ‘పడి’ పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు. ఈ మెట్లను ‘పదునెట్టు త్రిపాడికల్’ అని కూడా అంటారు” ఆగాడు హనుమంతరావు.

“ఈ ‘పదునెట్టాంబడి’కి పురాణ నేపథ్యం ఉండే ఉంటుంది కదా” అడిగాడు ప్రసాదరావు. “ఆఁ లేకేం.. ఈ మెట్లను అఖండ సాలగ్రామ శిలతో పరశురాముడు నిర్మించాడంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమని కూడా పేర్కొంటారు. పద్దెనిమిది మెట్లు ఎందుకంటే.. హరిహర సుతుడైన అయ్యప్పస్వామి, మణికంఠునిగా పన్నెండేళ్లు పందళ రాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిమలలో చాలా ఉన్నతస్థానంలో ఆసీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతారూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లుగా మారాయనీ, అయ్యప్ప వాటి పై పాదం మోపుతూ ఉన్నతాసనాన్ని అధిష్టించాడని పురాణ కథనం. అంతే కాదు, శబరిమలకు చుట్టూ ఉన్న పద్దెనిమిది కొండలకు ఈ మెట్లు ప్రతీకలని కూడా చెపుతారు. దీక్ష తీసుకున్నవారు ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద తనను ఆవరించి ఉండే ఒక్కో మాయోపాయాన్ని వదిలివేయాలని గురుస్వాములు చెపుతారు. పద్దెనిమిది మెట్లకు ప్రత్యేకమైన పేర్లున్నాయి. అవి.. అణిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియకర, సర్వ మంగళాకార, సర్వదుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్ననివారణ, సర్వాంగ సుందర, సర్వసౌభాగ్య దాయక” వివరించారు.

“అబ్బ! ఇన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నారో” అన్నాడు నానీ. “మీరు మొబైల్ నంబర్లు గుర్తు పెట్టుకున్నట్లే” అన్నాడు ప్రసాదరావు. అంతా నవ్వారు. నాకు మాత్రం ఆ మెట్లకు ఎంత మంచి పేర్లున్నాయో, ఎంత పవిత్రమైనవో అనిపించింది.

“పావనీ! మరోసారి అందరికీ కాఫీ ఇస్తావా?” అడిగాడు అనంత్. “అలాగే. నేనూ అదే అనుకున్నాను” అంటూ లేచింది పావని. “ఇప్పటి జనాలు లిఫ్ట్‌కు బాగా అలవాటు పడిపోయారు. మా అపార్ట్‌మెంటులో వాళ్లు చిన్నవాళ్లు కూడా లిఫ్ట్ కోసమే ఎంతసేపైనా ఎదురు చూస్తారు కానీ మెట్లెక్కరు. నీరసంగా ఉందనిపిస్తే నేనూ లిఫ్ట్ వాడతాను. కానీ నాకెందుకో ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోతుందేమోనని కాస్తంత జంకుగా ఉంటుంది. ముఖ్యంగా ఒక్కడ్నే లిఫ్ట్‌లో ఉండాలంటే చెప్పొద్దూ, కాస్తంత భయంగా ఉంటుంది” అన్నాడు హనుమంతరావు. ప్రసాదరావు అలాగా అన్నట్లు తలూపాడు. పావని వచ్చి కాఫీలు, బిస్కెట్లు అందించింది.

“మెట్లెక్కడమంటే గుర్తొచ్చింది. ఐఎఎస్, ఐపిఎస్ ఇంటర్వ్యూల్లో ‘ఎన్ని మెట్లు ఎక్కి వచ్చార’ని ప్రశ్నించడం, అభ్యర్థి తెల్ల ముఖం వేయడం గురించి చదివాను. ఆ మెట్లే వారు ఇంటర్వ్యూ మెట్టును అధిగమింప చేయలేక పోయాయని, కాబట్టి ఇంటర్వ్యూకు వెళ్లేవారు ప్రతి అంశాన్ని సునిశితంగా గమనించి, గుర్తు పెట్టుకోవాలని ‘విజయ సోపానాలు మేగజైన్’లో కాబోలు చదివాను” అన్నాడు అనంత్. “ముఖ్యంగా డిటెక్టివ్‌లు అంటే నేర పరిశోధకులు తప్పక గమనించే అంశాలలో ఇదొకటి” అన్నాడు ప్రసాదరావు. “ఇంక నేను వెళ్లోస్తా ప్రసాదం” అన్నాడు హనుమంతరావు. “అలాగే. వాకిట్లో మెట్ల దగ్గర జాగ్రత్త. జారే ప్రమాదం ఉంది. పడకపోయినా ఒక్కోసారి కాలు బెణుకుతుంది” అన్నాడు ప్రసాదం. “అలాగే” అంటూ బయల్దేరాడు హనుమంతరావు. ఇంట్లో వాళ్లు కూడా లేచి వాళ్ల పనుల్లో మునిగిపోయారు. కానీ నేను మాత్రం మా జాతి గురించిన ఆలోచనల్లోనే ఉండిపోయాను. మా పేరును జీవితంలోని అనేక అంశాలకు అన్వయించుకుంటుంటారు. టీవీలో ఎన్నో సార్లు మా మెట్ల జాతితో పోలుస్తూ చెప్పిన ఎన్నో మాటలు విన్నాను. “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” అంటారు పర్యావరణ ప్రేమికులు. కృషి, పట్టుదలలే విజయానికి సోపానాలు అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. గ్రంథాలయాలు విజ్ఞానానికి సోపానాలు అంటారు విద్యావేత్తలు. నిష్కామ కర్మ యోగం, జ్ఞానయోగం, భక్తి యోగాలే మోక్షానికి సోపానాలు.. ఇలా ఎన్నెన్నో..

అన్నట్లు ఆ మధ్య అనంత్ స్నేహితుడు వచ్చి, తన గోడు వెళ్లబోసుకుంటూ “నేను మెట్లలాంటి వాణ్ణి. నా సాయంతో అంతా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. కానీ నేను మాత్రం ఉన్న చోటే ఉండిపోయా” అన్నాడు. మమ్మల్ని గబగబా ఎక్కేవాళ్లు కొందరైతే, నిదానంగా ఎక్కేవారు కొందరు. కొందరు తొందరపడుతూ రెండేసి మెట్ల చొప్పున ఎక్కేస్తుంటారు. వారి ధాటికి నేను తట్టుకుంటా కానీ వారే ఒక్కోసారి పడుతుంటారు, స్వయంకృతమనుకోక మమ్మల్ని నిందిస్తారు. అప్పుడు మాకు ఎంత కోపమొస్తుందో ఎవరికి తెలుసు. మొన్నామధ్య టీవీలో ఓ సినిమా చూశా. అందులో విలన్, కథానాయికను మెట్ల మీద నుండి తోసేశాడు. అలాంటి దుర్మార్గపు పనులకు మమ్మల్ని వాడుకోవడం ఎంతో బాధ కలిగించింది. ఒకరోజు నానీ చెప్పాడు, వాళ్ల బళ్లో పిల్లలు మెట్ల మీద తామే ముందు వెళ్లాలని తోసేస్తుంటారని. అలాగే ఆటల్లో, చదువుల్లో కూడా తొండి చేస్తారని చెప్పాడు. తాము త్వరగా చేరుకోవాలను కోవడంలో తప్పులేదు. కానీ అందుకోసం తోటివారిని తోసేసి, పడేసి వెళ్లడం ఎంత అన్యాయం! మనుషులకు నా వంతు సేవకు నేనెప్పుడూ సిద్ధమే. ఎంత లిఫ్టులు, ఎస్కలేటర్లు వచ్చినా మా మెట్ల స్థానం, విలువ చెక్కు చెదరదని గుర్తుంచుకోమని, పిల్లలు, యువకులు వీలైన మేరకు మమ్మల్ని ఉపయోగించుకుని ఆరోగ్యవంతులుగా ఉండమని మనవి చేయాలనుంది. కానీ మనిషి చెవి నా మనవి ఆలకించేనా? అనుకుంటుంటే నానీ, పింకీ మళ్లీ నా మీద కూర్చుని పొడుపుకథలు చెప్పుకోవటం మొదలెట్టారు…

నానీ “కేసు కాని కేసు ఏమిటో చెప్పు!” అడిగాడు. “సూట్ కేసు” చెప్పింది పింకీ. “కాదు స్టెయిర్ కేసు” అన్నాడు నానీ. “ఏదైనా చెప్పవచ్చు” అంది పింకీ. “కాదు నేను అనుకున్నదే చెప్పాలి” నాని అంటుంటే నేను హాయిగా నవ్వుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here