అన్నింట అంతరాత్మ-26: జ్ఞాన గవాక్షాన్ని.. పుస్తకాన్ని నేను!

7
11

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం పుస్తకం అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]’అ[/dropcap]బ్బ ఎంత వెలుగో!’ పుస్తకాలం మేం ఆనందంతో అబ్బురపడ్డాం. ‘ఇన్నాళ్లకు మనం గుర్తొచ్చినట్లున్నాం. దుమ్ము దులుపుతున్నారు. ఎన్నాళ్లకు బయటకు వచ్చామో. ఇంతకాలం ఊపిరాడకుండా ఈ బీరువాలోనే మగ్గిపోయాం. కదలకుండా ఇట్లా పడి ఉండటం ఎంత కష్టం! నిజానికి మనల్ని చదివి ఉపయోగించుకోకపోవడం వాళ్లకే నష్టం అని ఎందుకు తెలుసుకోరో’ రుసరుసలాడింది ఓ పిల్ల పుస్తకం. ‘పాపం జ్ఞానానందంగారికి కొద్దికాలంగా ఆరోగ్యం బాగా లేదు కదా. లేకపోతే రోజూ ఆయన చేతుల్లో మనవాళ్లం ఎవరో ఒకళ్లం ఉండేవాళ్లం కదా. అక్కడికీ మనల్ని భద్రంగా గాజు అద్దాల బీరువాలో ఉంచారు. అంతేనా.. మన కోసం మార్కెట్లో కొత్తగా వచ్చిన డస్ట్ జాకెట్లు కూడా కొనుక్కొచ్చి అమర్చారు. ఆయనకు మన మీద ఎంత ప్రేమో. మనం క్షేమంగా ఉండాలని బీరువాలో అక్కడక్కడ నాఫ్తలిన్ ఉండలు ఉంచారు. పురుగులు మనల్ని బాధించకూడదని లవంగాలు కూడా ఉంచారు. ఇంట్లో మిగతా వారెవరికీ మనమంటే ఆసక్తి లేదు. వాళ్లందరికీ ఎంత సేపూ మొబైల్ తప్ప మరో ప్రపంచం లేదు. ఏం చేస్తాడు పెద్దాయన. ఈరోజు కొంచెం ఓపిక వచ్చినట్లుంది.. మన దుమ్ము దులుపుతున్నాడు’ అన్నాను ఉద్గ్రంథమైన నేను. ‘అవును.. నువ్వు చెప్పింది నిజమే’ అంది పిల్ల పుస్తకం.

‘పుస్తకాల మీద ప్రేమ అంటే నాగేశ్వరరావు గారిదే’ అంది రాజశేఖర చరిత్ర పుస్తకం. ‘ఆయనెవరూ?’ కుతూహలం ప్రదర్శించింది పిల్ల పుస్తకం. ‘ఆయన విజయవాడ, లెనిన్ సెంటర్ లోని ప్రాచీన గ్రంథమాల పుస్తకాల షాపు ఆయన. నన్ను, జ్ఞానానందం గారు అక్కడే కొన్నారు. ఆయన అసలు పేరు నర్రా జగన్మోహనరావు. అరవై ఏళ్లకు పైగా ఆయన పుస్తకాలతో సహవాసం చేస్తున్నాడు. ఆయనకు ఆ షాపే ఉపాధి. నూటఏభై ఏళ్లనాటి పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతాయి. ఆయనకు ఎటువంటి డిగ్రీ చదువు లేకపోయినా పుస్తక పరిజ్ఞానం అపారం. ఆయన స్వయంగా ‘పుస్తక ప్రియుల సేకరణానుభూతి’ అనే పుస్తకం రాశాడు’ చెప్పింది రాజశేఖర చరిత్ర. ‘నిజంగా గొప్ప వ్యక్తి’ ఒక్కసారిగా అన్నాం మేమంతా.

‘అసలు మనజాతిలో ముందుగా పుట్టిందెవరో మీకు తెలుసా?’ అడిగింది మరో పుస్తకం. ‘పుస్తక చరిత్రవి నువ్వే చెప్పాలి’ అన్నాం మేమంతా. ‘ప్రపంచంలో తొలి పుస్తకం చైనాలో ఎనిమిదో శతాబ్దిలో ముద్రించారు. ఆ తర్వాత కొరియాలో పధ్నాలుగు వందల డెబ్బై మూడులో తొలి ఆంగ్ల పుస్తకాన్ని విలియమ్ కాటన్ ముద్రించాడు. ఆ పుస్తకం పేరు ‘రీ సైల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్’. కానీ పధ్నాలుగు వందల డెబ్బై ఏడులో ప్రచురితమైన ‘ఛాసర్స్ కాంటర్‌బరీ టేల్స్’ ఆంగ్లంలోని తొలి పుస్తకంగా అధికారికంగా నమోదయింది’ చెప్పింది. ‘అలాగా. అప్పట్నుంచి మన వాళ్లు ప్రజాదరణ పొందారన్నమాట’ అన్నారు మా వాళ్లు.

‘సరేగానీ ప్రపంచంలో అతి చిన్న, అతి పెద్ద, అతి ఖరీదైన పుస్తకాలేవో మీకు తెలుసా?’ జనరల్ నాలెడ్జ్ పుస్తకం పోజుకొడుతూ అడిగింది. ‘అలాంటివి నీకే తెలియాలి. చెప్పు వింటాం’ అంది మరో పుస్తకం. ‘ప్రపంచంలో అతి చిన్న పుస్తకం ‘టీనీ టెడ్ ఫ్రమ్ టర్నిప్ టౌన్’. అతి పెద్ద పుస్తకం ‘ప్రొఫెట్ మొహమ్మద్’. దుబైకి చెందిన ఈ పుస్తకం బరువు మూడువేల మూడువందల ఆరు పౌండ్లు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుస్తకం లియోనార్డో రచించిన ‘కోడెక్స్ లీసెస్టర్. ఈ పుస్తకాన్ని పంథొమ్మిది వందల తొంభైనాలుగులో బిల్ గేట్స్ ముప్ఫయ్ పాయింట్ ఎనిమిది డాలర్లకు కొన్నాడు’ చెప్పింది జి.కె. పుస్తకం. ‘బాగుంది. నేను మరో విశేషం చెపుతా వినండి. పుస్తకం అంటే మనలాంటి సాధారణ పుస్తకాలు కాకుండా చదివి వినిపించే పుస్తకాలు కూడా వచ్చాయి. తెలుసా?’ అంది మోడర్న్ టెక్నాలజీ పుస్తకం. ‘అవునా.. కాస్త వివరంగా చెప్పు’ అడిగాయి మిగతావి.

‘ఇటీవల మాట్లాడే భగవద్గీత పుస్తకం వెలువరించారు. సెన్సర్ సాయంతో పనిచేసే ఓ ప్రత్యేక పరికరం చదవలేని వారికి సైతం గీతాసారాన్ని చేరువ చేస్తోంది. సేఫ్ షాప్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని తయారు చేసింది. ఇందులో సంస్కృతం, ఆంగ్లం, హిందీ మూడు భాషల్లో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి. ఫ్లూట్ అనే ఓ పరికరం ఉంటుంది. ఫ్లూట్ పరికరాన్ని ఏ అధ్యాయం మీద పెడితే ఆ అధ్యాయం మొత్తం వినిపిస్తుంది. చదవటం రాని వాళ్లకు, చదివే శక్తి లేనివారికి, అంధులకు, పిల్లలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగం. గ్రంథలోని ప్రతి సన్నివేశాన్ని అనుభూతించేలా ప్రతి చిత్రాన్ని ఆయా శబ్దాలు, స్వరాలతో అంటే పద్యాలు, పక్షుల కిలకిలరావాలు, శంఖనాదాలు, చక్రవిన్యాసాలు, సెలయేటి గలగలలు, రణరంగ భీకర శబ్దాలు అన్నిటినీ వినిపిస్తుంది ఫ్లూట్’ వివరించింది మోడర్న్ టెక్నాలజీ పుస్తకం.

‘భలేభలే. అన్నట్లు మీకు తెలుసా, భగవద్గీత పాకెట్ సైజు నుంచి అతి పెద్ద గ్రంథం దాకా వివిధ పరిమాణాల్లో ఉంది. గీతలో ఉన్నవి ఏడువందల ఒకటి శ్లోకాలే అయినా తాత్పర్యం, వివరణ విస్తరణలను బట్టి భగవద్గీత పుస్తకం పరిమాణం రకరకాలుగా మారుతోంది’ చెప్పింది. జి.కె.పుస్తకం.

ఇంతలో ‘జ్ఞానం! ఏం చేస్తున్నావురా?’ అంటూ ప్రవేశించాడు ఆయన మిత్రుడు. ‘రారా గోపాలం.. చాలాకాలమైందని నా పుస్తకాల దుమ్ము దులుపుతున్నాను’ అన్నాడు జ్ఞానానందం. ‘మంచిపని చేస్తున్నావురా.. ఈతరం పిల్లలకు పుస్తకపఠనం అంటే గిట్టదు. ఎంత సేపూ మొబైల్లో తలదూర్చడమే. మా ఇంట్లో అయితే నన్ను పుస్తకాల పురుగని వెక్కిరిస్తారు. అయినా ఈ పదప్రయోగం ఎలా వచ్చిందో! పుస్తకాల పురుగు పుస్తకానికి హాని చేస్తుంది, తినేస్తుంది. కానీ మనం పుస్తకాన్ని మంచి మిత్రుడుగా భావిస్తాం. చదువుకుంటాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటాం’ అన్నాడు గోపాలం.

‘అదికాదురా, పుస్తకాల పురుగు ఎలా అయితే దాన్ని అంటి పెట్టుకుని ఉంటుందో, పుస్తక ప్రియులు కూడా దాన్ని అంటి పెట్టుకుని ఉంటారన్న ఉద్దేశంతో ఆ పదాన్ని వాడతారనుకుంటా’ తన కోణాన్ని వివరించాడు జ్ఞానానందం. ‘నువ్వు చెప్పింది నిజమేలే. మనం కాలేజీ రోజుల్లో లైబ్రరీలో గంటల తరబడి కూర్చునేవాళ్లం. కొంత మంది పుస్తకాలు తిరిగి ఇవ్వకుండా, అజాపజా లేకుండా పోయారని, మరి కొంతమంది లైబ్రరీ పుస్తకాలపై తమ పేర్లు రాయడం, బొమ్మలు వేయడం, చించడం చేస్తుంటారని లైబ్రేరియన్ వాపోయేవాడు గుర్తుందా?’ అన్నాడు గోపాలం.

‘ఆఁ ఎందుకు గుర్తులేదూ.. పుస్తకాలు చదవడం, వాటి గురించి చర్చించుకోవడం.. అక్కడే కదా సారధి, సదాశివం, కుమార్ పరిచయం అయింది’ అన్నాడు జ్ఞానానందం.

వీరి మాటలన్నీ విని పిల్ల పుస్తకమొకటి ‘విన్నారా! పుస్తకాల దొంగలు, పుస్తకాలను పాడుచేసేవారూ కూడా ఉంటారన్నమాట’ అంది. ‘విన్నాం.. విన్నాం’ అన్నాయి మిగతావి.

‘అన్నట్లు లైబ్రరీ అనే పదం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?’ అడిగాడు జ్ఞానానందం. వెంటనే జి.కె. పుస్తకం ‘నేను చెపుతా.. నేను చెపుతా.. క్లాసులో విద్యార్థిలాగా అరిచింది. కానీ అది మా జాతికి మాత్రమే వినిపించింది. అంతలో ‘పేరు లోనే జ్ఞానం ఇముడ్చుకున్నవాడివి నువ్వే చెప్పు వింటా’ అన్నాడు గోపాలం. ‘లైబ్రరీ అనే పదం ‘లిబర్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లిబర్ అంటే పుస్తకం అని అర్థం’ చెప్పాడు జ్ఞానానందం. ‘చిన్నప్పుడు ఏటా బడి తెరవగానే నాన్నతో కొత్త క్లాసు పుస్తకాలు కొనుక్కోవడానికి పుస్తకాల షాపుకు వెళ్లడం మరుపురాని తీపి గురుతు. ఆ షాపు జనంతో కిట కిటలాడుతూ ఉండేది. పిల్లలంతా నాకు ముందివ్వు.. నాకు ముందివ్వు’ అంటూ గొడవచేసే వాళ్లు. కొత్త పుస్తకాల వాసన భలేఉండేది’ అన్నాడు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.

‘ఇప్పటి పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో స్కూల్లోనే యూనిఫారమ్, పుస్తకాలు వగైరాలు అమ్ముతున్నారు. అసలు ఈ టీవీలు, కంప్యూటర్లు, చరవాణులు వచ్చాక పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది’ అన్నాడు జ్ఞానానందం. ‘అలా నిరాశ పడకు. గతంతో పోలిస్తే పుస్తక పఠనం అలవాటు భారతీయుల్లో తగ్గిందన్నది నిజమే అయినా ఇప్పటికీ పుస్తక పఠనంలో మొదటి స్థానం భారత్ దేనని ఒక సర్వే తెలిపింది. మన తర్వాత రెండో స్థానంలో థాయిలాండ్, మూడో స్థానంలో చైనా ఉన్నాయి. అన్నట్లు పుస్తకాల పల్లె గురించి విన్నావా?’ అడిగాడు గోపాలం.

‘పుస్తకాల పల్లె! వినలేదే. అదేమిటో చెప్పు’ ఆసక్తిగా అడిగాడు జ్ఞానానందం. పుస్తకాలం మేం కూడా ఎంతో కుతూహలంగా మా పుటలన్నిటినీ చెవులుగా చేసుకొని వినడానికి సిద్ధమయ్యాం.

‘మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో ఉన్న ‘భిలారా’ గ్రామం దేశంలోనే తొలి పుస్తకాల పల్లెగా రికార్డులకెక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలు ఉనికి కోల్పోకుండా ఉండేందుకు ‘పుస్తకాల పల్లె’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పుస్తకాల విశిష్టత చాటేలా ఊరంతా పుస్తకాల పెయింటింగ్స్ వేయించారు. భిలారా జనాభా పదివేలే అయినా ఆ పల్లెలో పుస్తకాల సంఖ్య మాత్రం పదిహేను వేలు. అక్కడ పాతిక చోట్ల పుస్తక పఠన కేంద్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. చదవడానికి ఎలాంటి రుసుము చెల్లించనక్కరలేదు. పుస్తకాలు పాడు చేయకూడదన్న నిబంధన మాత్రం పెట్టారు’ చెప్పాడు గోపాలం. ‘భలే ఉంది. ఊరంతా మనవాళ్లే ఉండటం, అందులోనూ మనుషులకన్నా మనమే ఎక్కువ ఉండటం ఎంత గొప్ప’ పుస్తకాలమంతా సంబరంగా అనుకున్నాం.

‘భలేగా ఉంది గోపాలం. ఊళ్లన్నీ భిలారాగా మారితే ఎంత బాగుండు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు కందుకూరి. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గదితో సమానం. పుస్తకాలు జ్ఞాన గవాక్షాలు. చాలామంది పనికిరాని వస్తువు లెన్నో కొంటారు కానీ పుస్తకాలు కొనడానికి వెనుకాడుతారు. కొంతమంది అవి ఇంటి అలంకరణకో, తమ అభిరుచిని ప్రదర్శించేందుకో కొంటారు.. కానీ చదవరు. మరి కొంతమంది కొంటారు కానీ వాటిని చెక్కుచెదరకుండా చెక్క బీరువాలో దాచి, జీవితకాలంలో వాటి ముఖం కూడా చూడరు. కొంతమంది తాము చదవరు సరి కదా, తమ దగ్గర ఉన్న పుస్తకాన్ని చదవాలని అభిలాషడే వారికి కూడా ఇవ్వరు. కొంతమంది పుస్తక సారాంశాన్ని గ్రహించకుండా, భావాలను అర్థం చేసుకోకుండా మొక్కుబడిగా, యాంత్రికంగా చదువుతారు. కొంతమంది పుస్తకాలు చదివి ఇస్తామని తీసుకొని తిరిగి ఇవ్వకుండా సొంతం చేసుకుంటారు.’ అన్నాడు జ్ఞానానందం.

అది విని మేమంతా ‘ఔరా! ఈ మనుషులు’ అనుకుంటుంటే, ‘నువ్వు చెప్పింది నిజం. పుస్తకం విలువను గుర్తుచేయడానికే పుస్తక దినోత్సవాలు, పుస్తకాల పండుగలు జరుపుకుంటున్నాం. పదహారు వందల పదహారు సంవత్సరంలో ఏప్రిల్ ఇరవైమూడవ తేదీ, ప్రఖ్యాత రచయితలు షేక్‌స్పియర్, సెవాంతెస్, ఇన్కా గర్సిలాసో, వేగా జయంతి, వర్ధంతి తేదీ కావడం వల్ల ఏటా ఈ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా పాటించాలని పంథొమ్మిది వందల యాభై అయిదులో యునెస్కో ప్రకటించింది. అంతే కాకుండా ఈ రోజును ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా జరపాలని సూచించింది కదా’ అన్నాడు గోపాలం. ‘ఓహా! మనకంటూ ఓ రోజు కూడా ఉందన్నమాట. మన జాతి ఎంత గొప్పది. మా కవర్ పేజీలనే కాలర్లుగా ఎగరేసి గర్వాన్ని ప్రకటించాం.

‘అన్నట్లు గోపాలం, నేనీ మధ్య హ్యూమన్ లైబ్రరీ గురించి విన్నాను. తొలిసారిగా ఇది ఇండోర్‌లో ప్రారంభించారు. ఆ లైబ్రరీలో మనుషులే పుస్తకాలుగా వ్యవహరించి వచ్చిన వారికి వివరిస్తారన్నమాట. హైదరాబాద్‌లో కూడా హ్యూమన్ లైబ్రరీ ఉంది. అందులో ముప్ఫయ్ మంది ఉన్నారు. ఒక్కొక్కరినీ ఒక్కో పుస్తకం పేరుతో పిలుస్తారని విన్నాను’ చెప్పాడు జ్ఞానానందం.

ఇంతలో ఆయన మనవడు వచ్చాడు.. ‘తాతయ్యా, తాతయ్యా! కాగితం తయారు కాకముందు పుస్తకాలు దేనిమీద రాసేవారు?’ అడిగాడు. ‘ప్రాచీన కాలంలో తాళపత్రాల మీద అంటే తాటి ఆకుల మీద రాసేవారు. సరస్వతీదేవి చిత్రంలో ఆమె చేతిలో పుస్తకం కనిపిస్తుంది. అలాగే వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు గ్రంథంగా రాసే చిత్రాన్ని చూస్తాం. అంటే ఎంతో ప్రాచీన కాలం నుంచి పుస్తకాలు ఉన్నాయన్నమాట. తాళపత్రాల కన్నా పూర్వం వేదాలు మొదలైనవి మౌఖికంగా గురుశిష్య పరంపరలో తరతరాలకు అందుతూ వచ్చినవి. అందుకే వాటిని ‘శ్రుతాలు’ అన్నారు. ఆ తర్వాత రాగిరేకులపై రాసేవారు. జోహానెస్ గూటెన్‌బర్గ్ అచ్చుయంత్రం కనుగొన్నాక కాగితంతో పుస్తకాల తయారీ మొదలైంది. నేడు ఎలక్రానిక్ పుస్తకాలు.. ఈ-పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటినే డిజిటల్ పుస్తకాలు అని కూడా అంటున్నాం. ఎన్ని ఆధునిక పుస్తక ప్రక్రియలు వచ్చి చేరినా స్వయంగా పుస్తకం చేత్తో పట్టుకుని చదువుకున్న తృప్తి వేరు’ చెప్పాడు జ్ఞానానందం.

‘ఆ మధ్య ఓ సెకండ్ హాండ్ పుస్తకాల షాపులో పాత బాలశిక్ష దొరికితే కొన్నాను. మన చిన్నప్పుడు పిల్లలు తప్పనిసరిగా ఆ పుస్తకం చదివేవారు. అదొక విజ్ఞాన సర్వస్వంగా ఉండేది. మేస్తర్ క్లూలో అనే తెల్లదొర ఆదేశం మేరకు పద్దెనిమిది వందల ముఫ్పై రెండులో పుదూరు సీతారామశాస్త్రి రాశారు. అందులో తెలుగు భాష గురించి ఎంతో విపులంగా ఉండేది. అంతేకాదు చారిత్రక, భౌగోళిక, విజ్ఞానసంబంధ విషయాలు అనేకానేకం ఉన్నాయి’ అన్నాడు గోపాలం.

‘అవును.. నేనూ కొన్నాను, కాకపోతే గాజుల సత్యనారాయణ గారు రాసిన కొత్త పెద్ద బాలశిక్ష’ అన్నాడు జ్ఞానానందం.

‘నేనే.. నేనే’ అంది మురిసిపోతూ పెద్ద బాలశిక్ష. మేమంతా దానివైపు నవ్వుతూ చూశాం. ‘వచ్చే సంవత్సరమన్నా పుస్తకాల పండుగకు పోవాలి. ఈ ఏడు కరోనా భయంతో వెళ్లలేదు. ఢిల్లీ, కోల్‌కతా తర్వాత విజయవాడ, హైదరాబాద్ పుస్తక పండుగలే ఎక్కువ పేరొందాయి. ఎన్నెన్ని పుస్తకాలు, ఎంతెంతమంది పుస్తకారాధకులు.. సాహిత్య సభలు, పుస్తకావిష్కరణలు.. ఎవరి చేతుల్లో చూసినా పుస్తకాల సంచులే.. ఏ నోట విన్నా పుస్తకాల ఊసులే.. ఎన్టీఆర్ స్టేడియం అంతా పుస్తకాల వెలుగులతో నిండిపోతుంది’ అన్నాడు గోపాలం.

‘అవును. నన్ను అక్కడే కొన్నారు’ అంది ఓ పుస్తకం. ‘నన్ను కూడా’ అన్నాయి మరో మూడు పుస్తకాలు. ‘నిజమే. ఇక జైపూర్‌లో జరిగే సాహిత్య పండుగ అయితే అంతర్జాతీయంగానే అతి పెద్ద సాహిత్య పండుగగా పేరొందింది’ అన్నాడు జ్ఞానానందం.

‘తాతయ్యా! పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగాల గురించి మా టీచర్ వ్యాసం రాయమన్నారు. అవేమిటో చెపుతావా!’ అన్నాడు మనవడు. పుస్తకాలమైన మేం, మా గొప్పతనం గురించి ఏం చెపుతారో విందామని మా ఒళ్లంతా చెవులు చేసుకున్నాం.

‘పుస్తకాలంటే కేవలం నీ తరగతి పుస్తకాలే కాదు. పుస్తకాలు అనేకాలు.. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతోనే మనిషి పరిపూర్ణుడిగా రూపొందుతాడు. పిల్లల పుస్తకాలు, చరిత్ర, జి.కె. జీవిత చరిత్రలు, ఆత్మకథలు, సాహిత్య గ్రంథాలు, కాల్పనిక సాహిత్యం, నేర పరిశోధక కథలు, కావ్యాలు, నవలలు, వైజ్ఞానిక గ్రంథాలు, హాస్య రచనలు, నీతి కథలు, శతకాలు, ఆధ్యాత్మిక, పురాణ గ్రంథాలు, సమాచార పుస్తకాలు, అనువాదాలు, మోనోగ్రాఫీలు.. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. పుస్తకాలు విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇస్తాయి. చైతన్యవంతుల్ని చేస్తాయి. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. పద పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎవరూ లేని ఒంటరితనంలో మిత్రుడుగా మన చెంతనే ఉండేది పుస్తకమే. మెదడు చురుగ్గా ఉంటుంది. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. ఆలోచనాశక్తిని, విశ్లేషణా నైపుణ్యాలను పెంచుతుంది. ప్రశాంతత నిస్తుంది. స్పూర్తినిస్తుంది. ప్రవర్తనా రీతులు మెరుగుపడతాయి. నైతికత పెంపొందుతుంది. ఫలితంగా మంచి వ్యక్తిత్వం మన సొంతమవుతుంది. అందుకే ‘పుస్తకం కన్నతల్లిలాంటిది’ అన్నాడు గోర్కీ..

జ్ఞానానందం ఇంకా ఏదో చెప్పబోతుండగానే ‘బాబోయ్.. ఇన్ని ఉపయోగాలా.. ఇప్పుడే రాసేస్తా’ అంటూ పరుగుతీశాడు మనవడు.

మిత్రులిద్దరూ నవ్వుకుంటుంటే ‘మనం గొప్పవాళ్లమని తెలుసుగానీ, మరీ ఇంత గొప్పవాళ్లమనీ, మనవల్ల మనుషులకు ఇన్ని ప్రయోజనాలున్నాయనీ ఇవాళే తెలిసింది’ అన్నాను నేను.

‘ఇది సైన్స్ యుగం. మా సైన్స్ పుస్తకాలు సాటి లేనివి’ గొప్ప చాటుకుంది ఓ సైన్స్ పుస్తకం. ‘అబ్బో చెప్పొచ్చావు.. హాయిగా నవ్వించి, ఆరోగ్యాన్నిచ్చేది మేము’ అన్నాయి హాస్య నవలలు. ‘కాల్పనిక నవలకు సాటి ఏవీ రావు. ఎక్కువమంది ఇష్టపడేది మమ్మల్నే’ విర్రవీగింది ఓ ఫిక్షన్ పుస్తకం. ‘బాల్యం నుంచి మంచి, చెడు చెప్పి, మనుషుల్ని తీర్చి దిద్దేది మేము’ అన్నాయి నీతి శతకాలు. ‘మనుషులకు లక్ష్యాలు, ఆశయాలు అంటే ఏమిటో, వాటిని ఎలా సాధించాలో తెలియచెప్పి, స్ఫూర్తినిచ్చేది మేము’ అన్నాయి ఆత్మకథల పుస్తకాలు.

ఇక లాభం లేదని ఉద్గ్రంథాన్ని అయిన నేను జోక్యం చేసుకొని ‘ఆపండి మీ గొప్పలు. ఇలా మనలో మనం వాదించుకోవడం పద్ధతి కాదు. మనిషికి మనందరమూ అవసరమే. కొన్నింటిని వారి అభిరుచిని బట్టి చదువు తుంటారన్నదీ తెలిసిందే’ అంటుండగానే ‘ఇక వస్తారా జ్ఞానం’ అంటుంటే ‘తాతయ్యా! అమ్మ ఇచ్చి రమ్మంది’ అంటూ ఇద్దరికీ మజ్జిగ గ్లాసులు అందించాడు. మజ్జిగ తాగడం కాగానే గోపాలం ‘ఈసారి నిజంగానే కదులుతున్నా’ నవ్వుతూ లేచాడు.

జ్ఞానానందం కూడా లేచి, ‘పుస్తకాల గురించి చాలా మాట్లాడుకున్నాం. చాలా సంతోషంరా’ వీడ్కోలు పలుకుతూ అన్నాడు. గోపాలం వెళ్లగానే జ్ఞానానందం వచ్చి, పుస్తకాలను ఒక్కొటొక్కటిగా పదిలంగా మళ్లీ బీరువాలో సర్దడం మొదలు పెట్టాడు. ఉధ్రంథాన్ని నేను పై అరకు చేరుకుని ‘మనుషులకు విజ్ఞాన, వికాసాలనివ్వడం ఆనందమే కానీ మమ్మల్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం అలంకరణగా, నిరర్ధకంగా ఉంచినపుడు మా ఉనికి మాకే బాధ కలిగిస్తుంది. ఆ మధ్య ఎవరో అంటుంటే విన్నా.. ఒక్కో చెట్టు కలపతో యాభై దాకా పుస్తకాలు తయారవుతాయట. కలప కోసం చెట్లను కొట్టలేక.. అందులోనూ చెట్లు తగ్గిపోయిన నేపథ్యంలో అంతా ఈ-పుస్తకాలను చదవాలని అనుకుంటున్నారట. కానీ కాగితం తయారీకి కలపకు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ప్రయత్నాలను ఎందుకు ముమ్మరం చేయడో ఈ మనిషి. అక్కడక్కడా ఆ ప్రయత్నం జరుగుతున్నా పెద్ద ఎత్తున కాగితం తయారీకి కలపకు ప్రత్యామ్నాయాన్ని ఇంతవరకూ కనుగొననే లేదు. విద్యుత్తు లేకపోయినా, ఏ ఇంటర్నెట్, వైఫైలు లేకపోయినా హాయిగా ఎక్కడైనా, ఎప్పుడైనా చదువుకోగలిగేది కాగితంతో తయారైన పుస్తకాలనే కదా. మనిషి తమ ప్రత్యేకతను గుర్తించి, ఆదరించి, పఠించి, ప్రయోజనం పొందితే ఎంత బాగుంటుంది!’ అనుకుంటుంటే, జ్ఞానానందం బీరువాలో నాఫ్తలిన్ ఉండలు వేయడంతో ఆ వాసనకు నా ఆలోచన చెదిరి, పుస్తక ప్రేమికుడైన జ్ఞానానందం వైపు ఆరాధనగా చూస్తుండిపోయాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here