అన్నింట అంతరాత్మ-28: రక్షిస్తాను.. శిక్షిస్తాను.. ‘తాడు’ను నేను!

5
7

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం తాడు అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]అ[/dropcap]నగనగా అందాల పల్లె.. చల్లని రేయి.. పండు వెన్నెల్లో పెరట్లో మంచాలపై కూర్చుని అమ్మమ్మ చెప్పే చిలిపి కృష్ణుని కథలు వింటున్నారు తేజ, వంశీ, మాధురి. ‘అల్లరి కృష్ణుడు ఇరుగు, పొరుగు ఇళ్లలో వెన్నను దొంగిలించడమే కాక, ఆ వెన్నను ఆ ఇంటికోడలి మూతికి పూయడంతో అత్తగారు, కోడలే వెన్నను దొంగతనంగా తిన్నదని అనుకుంది. దాంతో ఇంకేముంది.. ఆ అత్త, కోడలిని నానా మాటలు అంది. ఇంకో ఇంట్లో వేరే అల్లరి. దాంతో ఇరుగు పొరుగు ఇళ్లవారు విసిగిపోయి, అంతా కలిసి యశోద ఇంటికి వచ్చి, కృష్ణుడు చేసిన నేరాలు చెప్పి, ‘మీ కన్నయ్య అల్లరితో మేం వేగలేం.. ఇల్లొదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోతాం’ అన్నారు. అంతా విన్న యశోదకు ఎంతో బాధ కలిగింది. తమ ఇంట వెన్నకు ఏం కొదవ? ఇలా ఇరుగు పొరుగు ఇళ్లలో వెన్నను దొంగిలించడమేమిటి? ఇక లాభం లేదు. కన్నయ్యను శిక్షించాలి. కానీ పాలుగారే తన ముద్దుల కన్నయ్యను శిక్షించడమే!.. ఉహుఁ. పోనీ ఎటూ వెళ్లకుండా కట్టివేస్తే.. అనుకుంది. అదే మంచి ఆలోచన అనుకుని, అందకుండా పరుగెత్తుతున్న చిన్ని కృష్ణుని కష్టపడి పట్టుకుంది యశోద. చిక్కకుండా ఎక్కడికి పోతావంటూ ఓ చిన్న తాడుతో కట్టబోయింది. అది చాలలేదు. మరో తాడు ముక్క అందుకుని రెండింటిని ముడివేసి కలిపింది. మళ్లీ కన్నయ్యకు కట్టి చూసింది. ఉహూఁ చాలలేదు. అలా ఎంత ప్రయత్నించినా తాడుతో అతణ్ని కట్టడం కుదరలేదు. యశోద ప్రయాస చూసి చిన్ని కృష్ణుడు జాలి పడ్డాడు. ఈసారి తనకు తానుగా కట్టుబడ్డాడు. యశోద అదంతా తన ప్రావీణ్యమే అనుకొని పొంగిపోయింది. ఇంటి ముందు స్తంభానికి కడితే ఎవరైనా వచ్చి జాలితో విప్పి వేసే అవకాశం ఉందని. అతణ్ని పెరట్లోకి తీసుకెళ్లి, అక్కడ ఏనాటి నుంచో ఉన్నరోటికి కట్టి వేసింది’ చెప్పింది అమ్మమ్మ.

‘పాపం కృష్ణుడు!’ మాధురి జాలి ప్రకటించింది. ‘పిచ్చిదానా! కృష్ణుడు హీరోనే. అమ్మ కదా అని లొంగిపోయాడు కానీ లేకుంటేనా..’ అన్నాడు తేజ. ‘అవును. నువ్వు చెప్పింది నిజమే. శాపవశాన మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకూబరుడు, మణిగ్రీవులు దీనంగా వేడుకోవడంతో, రోటితో సహా వేగంగా వెళ్లి ఆ చెట్లను కూల్చి, వారికి శాపవిమోచనం కలిగించాడు చిన్ని కృష్ణుడు’ చెప్పింది అమ్మమ్మ.

‘భలే భలే. ఎంత గొప్పో’ ఆనందంగా అరిచింది మాధురి. ఇంతలో తాతయ్య ‘ఇవాల్టికి కథలు చాలించి అందరికీ మజ్జిగ ఇవ్వు’ అన్నాడు. ‘అప్పుడేనా?’ అన్నాడు తేజ. ‘సరదాగా కబుర్లు చెప్పుకుందాం’ అన్నాడు తాతయ్య. ‘సరే’ అన్నారు పిల్లలు. అమ్మమ్మ లేచి వెళ్లి అందరికీ చిక్కని, చల్లని మజ్జిగ తెచ్చిచ్చింది. మజ్జిగ తాగుతూ ‘అవును, కవ్వంతో మజ్జిగ చిలికావు కదా, మా అమ్మ అయితే మిక్సీలో చేస్తుంది’ అన్నాడు వంశీ. ‘అవును. ఇప్పుడు ఏదో మామూలు చిన్ని కవ్వంతో చేస్తున్నాను కానీ పూర్వం ఉదయాన్నే కవ్వానికి తాడు కట్టి దాంతో చాలా సేపు మీగడ పెరుగు చిలికి, వెన్న తీసేవాళ్లు. ఆ సమయంలో మేల్కొలుపు పాటలు పాడేవాళ్లు’ చెప్పింది అమ్మమ్మ.

‘అవును. మనం పడుకున్న మంచానికి ఉంది కూడా తాడే కదా’ అడిగాడు వంశీ. ‘అవును. అయితే దీన్ని నులకతాడు అంటారు. తాళ్లలో అనేక రకాలున్నాయి. ఉయ్యాలకు కట్టేతాళ్లు, బావిలో నీళ్లు తోడేందుకు చేంతాడుగా వాడే కొబ్బరి తాడు, పశువులకు కట్టే ముకుతాడు, పడవను ఒడ్డుకు లంగరు వేసేందుకు వాడే తాడు ఇలా ఎన్నెన్నో రకాలు. పశువులను కట్టేసేందుకు వాడే తాడును పలుపుతాడు అంటారు’ అన్నాడు తాతయ్య. ఆ ఇంట వేర్వేరు పనుల కోసం ఉన్న తాళ్లన్నీ తాత మాటలు శ్రద్ధగా విన్నాయి.

‘అబ్బో! మా తాళ్లు తక్కువేం కాదన్న మాట’ నులక తాడు గర్వంగా నవ్వుకుంది. ‘మా చేంతాళ్లయితే సార్థక నామధేయులు. ఎందుకంటే మా చరిత్ర అంత గొప్పది, పొడవైంది. బావిలో నీళ్లు చేదుకోవాలంటే మేమే కదా ఆధారం. అంతేకాదు, పొరపాటున బావిలో ఎవరైనా పడ్డా నన్ను విసిరితే, పడ్డవారు నన్ను ఆధారం చేసుకుని పైకి వస్తారు. అప్పుడు నా చేయూత లేకపోతే వాళ్ల పని గోవిందా’ గొప్పగా అనుకుంది చేంతాడు.

అంతలో ‘అమ్మమ్మా! దేవతలు సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించారని ఒకసారి మా తెలుగు టీచర్ చెప్పింది’ అన్నాడు తేజ. ‘అవును. దాన్నే క్షీరసాగర మథనం అంటారు. మందర పర్వతాన్నే కవ్వంగా చేసుకుని, వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని సముద్రాన్ని మథించారు. అప్పుడు అమృతం వచ్చింది. ఆ అమృతం తాగిన వారికి మరణమనేది ఉండదు. అందుకే దానికోసం దేవతలు, రాక్షసులు గొడవపడ్డారు. అదంతా పెద్ద కథ’ అంది అమ్మమ్మ. ‘సర్పం అంటే పాము కదా, పామును తాడుగా వాడారా!’ ఆశ్చర్యంగా అడిగింది మాధురి. ‘అవునమ్మా. అంత పెద్ద పర్వతం కవ్వం అయినప్పుడు మామూలు తాడు సరిపోదుకదా.. అందుకే బలమైన సర్పం వాసుకిని తాడుగా అందుకు ఉపయోగించారు’ వివరించింది అమ్మమ్మ.

పిల్లలు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంటే ఇంట్లో ఉన్న తాళ్లన్నీ కూడా అదే ఊహించుకుంటూ ఆశ్చర్యపోయాయి. ‘తాడుకు, పాముకు కొద్దీ, గొప్పో పోలిక ఉంది. ఒక్కోసారి చీకట్లో లేదా, దూరంగా ఉన్న తాడును చూసి పాము అనుకునే అవకాశం ఉంది. దాన్నేమన పెద్దలు రజ్జు సర్ప భ్రాంతి అన్నారు’ చెప్పాడు తాతయ్య. ‘అవునవును. ఒకసారి నేనలాగే భయపడ్డా’ అన్నాడు వంశీ.

‘తాతయ్యా! ఆగస్టు పదిహేనున, జనవరి ఇరవై ఆరున జెండావందనం చేస్తాం కదా. అప్పుడు జెండా ఎగరేయడానికి కూడా తాడుకట్టి లాగుతాం కదా’ అంది మాధురి. ‘అవునమ్మా. అది కూడా తాడే. కాకపోతే అది వేరే రకం తాడు. ‘అబ్బో! దేశభక్తి ప్రకటించడంలో కూడా మా వాళ్ల పాత్ర ప్రముఖమైందేనన్న మాట’ వసారాలో ఉన్న ఉయ్యాల తాడు గర్వంగా అనుకుంది.

‘తాళ్లు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది వరకు చాలా మంది ఆడవాళ్లు మంగళసూత్రంగా పసుపుతాడు ధరించేవారు. క్రమంగా అది కూడా బంగారంతో చేయించుకోవడం మొదలైంది. కొంతకాలం గొలుసు బంగారందే అయినా సూత్రాలను పసుపు తాడుకు గుచ్చి ఆ గొలుసుకు కట్టుకునేవారు. ఇప్పుడు చాలామంది దానికి కూడా బంగారం, వెండి వాడుతున్నారు. ఏమైనా ఇప్పటికీ పెళ్లిళ్లలో మాత్రం వరుడు, వధువుకు కట్టేది పసుపు తాడుకు గుచ్చిన మంగళ సూత్రాలనే’ చెప్పింది అమ్మమ్మ. ‘అలాగా’ అన్నట్లు చూస్తూ, తాము చూసిన పెళ్లిళ్లలోని మాంగల్య ధారణ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు పిల్లలు.

‘ఓ! భార్యాభర్తల మధ్య పవిత్రబంధ చిహ్నంగా కూడా మా తాడే నిలుస్తోందన్నమాట’ అనుకున్నాయి మిగతా తాళ్లు. ‘అమ్మమ్మా! ‘చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ..’ పద్యంలో బంగారు మొలత్రాడు పట్టుదట్టి.. అని ఉంది కదా. మొలతాడు కూడా ఒక తాడే కదా’ అంది మాధురి. ‘అవును మధూ! చిన్నపిల్లలకు తప్పని సరిగా మొలతాడు కడతారు. ఎరుపు, నలుపు రంగుల్లో పట్టుతాళ్లు అమ్ముతారు. మగవారు పెద్దవాళ్లు కూడా చాలామంది మొలతాడు కట్టుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ అలవాటు తగ్గిపోయింది. భద్రాచల రామదాసు

‘ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను

రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా..’

కీర్తనలో భద్రాద్రి గుడికి, సీతారాములకు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల నగలకు తను ఎంతెంత ఖర్చు పెట్టాడో వివరిస్తాడు. అందులో..

‘శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా..

ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా..

అంటాడు. అంటే ఆయన బంగారు మొలత్రాడు చేయించాడన్న మాట.

ధనికులు వెండి మొలత్రాడు చేయించుకోవటం ఒకప్పుడు మామూలే’ అంది అమ్మమ్మ.

‘తాతయ్యా, తాతయ్యా తాడుతో ఆటలు కూడా ఆడతాం కదా.. తాడాట, బొంగరాల ఆట, టగ్ ఆఫ్ వార్ ఇలా ఎన్నో ఉన్నాయి’ అంది మాధురి. ‘అవునమ్మా! తాడాటనే ఇంగ్లీషులో స్కిప్పింగ్ అంటారు. తాడాట ఆడితే శరీరానికి మంచి వ్యాయామం కూడా అవుతుంది. బొంగరాలను తిప్పడానికి వాడే తాడును ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీన్ని జాటీ అంటారు. టగ్ ఆఫ్ వార్ అంటే రెండు జట్ల వారు తాడుకు ఇరువైపుల తాడు పట్టుకొని బలంగా తాడును లాగడం. ఏ జట్టు బలంగా నిలబడలేక పడిపోతే వారు ఓడినట్లు. ఇవి గాక గారడీ వాళ్లు తాడుపై నడవడం చూశావా? అది బ్యాలెన్స్ నైపుణ్యాలను పెంచుతుంది’ చెప్పాడు తాతగారు. ‘భలేభలే’ అనుకున్నాయి ఇంట్లోని తాళ్లన్నీ.

‘తాతయ్యా! రేవుల్లో పడవలను తాళ్లతోనే కదా కట్టివేస్తారు. అన్నట్లు ఆమధ్య పాపికొండలు విహార బోటు రాయల్ వశిష్ట ప్రమాదానికి గురైతే, చివరకు దాన్ని భారీ తాళ్లు కట్టేగదా బయటకు లాగారు’ అన్నాడు తేజ. ‘అవును’ అన్నాడు తాతయ్య.

‘పర్వతాలు ఎక్కేవారికి, గుడారాల ఏర్పాటుకు, దండేల ఏర్పాటుకు, సైనికులకు కూడా తాళ్లు అవసరమే. ఆయా అవసరాలకు తగ్గట్టుగా క్లైంబింగ్ రోప్, ట్విన్ రోప్, సింగిల్ రోప్, హాఫ్ రోప్, నైలాన్ తాళ్లు, ప్లాస్టిక్ తాళ్లు, జనప నార తాళ్లు, ఇలా ఎన్నెన్నో రకాల తాళ్లు తయారు చేస్తున్నారని విన్నాను’ అన్నాడు వంశీ.

‘తాటికల్లు తీయడం కోసం తాటిచెట్లు ఎక్కేవారు కూడా బలమైన తాళ్లు కట్టుకునే తాటిచెట్టు ఎక్కుతారు’ అన్నాడు తేజ. ‘దొంగల్ని, విలన్లని కూడా తాళ్లతో కట్టడం సినిమాల్లో చూశాను’ అంది మాధురి. ‘భలే గుర్తు పెట్టుకున్నావే’ అంటూ నవ్వాడు తేజ. అతడితో పాటు అంతా సరదాగా నవ్వారు. దొంగల్ని, విలన్లని బంధించగల శక్తి తమది అంటే తామెంత గొప్పవాళ్లమో అనుకుని గర్వించాయి తాళ్లన్నీ.

‘అంత నవ్వక్కర్లేదు. దేవుడి రథాలను కూడా తాళ్లతోనే లాగుతారని నాకు తెలుసులే’ అంది మాధురి. ‘మంచి విషయం చెప్పావు’ మెచ్చుకున్నాడు తాతయ్య. ‘తాతయ్యా! తాడూ, బొంగరం లేని వాడు అని అంటుంటారు కదా. దాని అర్థమేమిటి?’ అడిగాడు తేజ.

‘వెనకాముందు అంటే కుటుంబం అనేది లేక, జులాయిగా తిరిగే వారిని తాడూ, బొంగరం లేని వాడు అంటుంటారు. అలాగే ఒక గమ్యం అంటూ లేకుండా వ్యర్థంగా తిరిగే వాడిని తాడు తెగిన గాలిపటం అంటారు. ఇవికాక తాడు చాలక నుయ్యి పూడ్చమన్నట్లు అని ఒక సామెత ఉంది. తాడు చిన్నదిగా ఉందని ఒకామె బావిని కొంత పూడిస్తే నీరు పైకి వచ్చి, ఉన్న చిన్న తాడు సరిపోతుందని, అందుకని బావిని పూడ్చమందట. తెలివి తక్కువ ఆలోచనలకు ఈ సామెత వాడతారు. అలాగే తెగేదాకా లాగొద్దు అని మరొక సామెత. ఇలా తెలుగులో ఎన్నో అర్థవంతమైన సామెతలు, జాతీయాలు ఉన్నాయి’ తాతయ్య వివరించాడు. అంతా శ్రద్ధగా విన్న తాళ్లన్నీ ‘ఔరా!’ అనుకున్నాయి.

అంతలో వంశీ మాట్లాడుతూ ‘అసలు తాళ్ల తయారీ ఓ కుటీర పరిశ్రమ కదా. వ్యవసాయానికి అనుబంధంగా పల్లె ప్రజలు తాళ్ల తయారీ కూడా చేసి ధనం ఆర్జిస్తుంటారు. ముఖ్యంగా తెలుగునాట కోనసీమలో కొబ్బరి తాళ్ల తయారీ పరిశ్రమ మంచి లాభదాయకంగా ఉంది’ అన్నాడు. ‘అన్నట్లు ఇటీవల ఉంగుటూరు మండలం లోని కైకరంకు చెందిన విద్యార్థిని మారిశెట్టి దుర్గామంగ రూపొందించిన ‘తక్కువ ఖర్చుతో తాళ్ల తయారీ యంత్రం’ (లోకాస్ట్ రోప్ మేకింగ్ మిషన్) ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయి పోటీలకి ఎంపికైందని, జపాన్లో జరిగే సకురా వైజ్ఞానిక ప్రదర్శనలో ఆమె పాల్గొంటుందని పేపర్‌లో చదివాను. నైలాన్, ప్లాస్టిక్ తాళ్ల వాడకం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, సహజ సిద్ధమైన కొబ్బరి పీచు, తాటి, జనపనారలతో తక్కువ సమయంలో తాళ్లను తయారు చేసేందుకు దుర్గామంగ రూపొందించిన యంత్రం బాగా ఉపకరిస్తుందట’ చెప్పాడు వంశీ.

‘పిల్లలంటే అలా ఉండాలి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ, కొత్త వస్తువులను కనుగొనాలి. మరి మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారా?’ అడిగాడు తాతయ్య. ‘తప్పకుండా’ అన్నారు పిల్లలు.

‘అన్నట్లు విశాఖపట్నంలో రోప్ వే లో కేబుల్ కార్ ఎక్కానని చెప్పాడు మా ఫ్రెండ్ శ్రీకాంత్. రోప్ వేలో ప్రయాణం చాలా బాగుంటుందిట.’ చెప్పాడు వంశీ. ‘అవును. పర్యాటక కేంద్రాలలో కొండ ప్రాంతాలలో చాలా చోట్ల ఈ రోప్ వేల నిర్మాణం ఇటీవల కాలంలో పెరిగింది. అంత ఎత్తుమీద నుంచి కేబుల్ కార్లో ప్రయాణిస్తూ పరిసర ప్రాంతాల అందాలను వీక్షించడం అద్భుతమైన అనుభవమే. ఈ రకంగా కూడా తాడు మనకు సేవలందిస్తోంది. అయితే ఇది మామూలు తాడు కాదు. తాడులా ఉండే ప్రత్యేకమైన తీగ మార్గం. ఇంగ్లీషులో మాత్రం తాడు అర్థం వచ్చేలా ‘రోప్ వే’ అని పిలుస్తున్నారు. అన్నట్లు తాళ్లతో వంతెనల నిర్మాణం కూడా ఉంది. తెలుగునాట తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెంలో వరదల కారణంగా ఊరి నుంచి పొలాలకు వెళ్లే ఓ వంతెన కూలిపోగా దాన్ని తిరిగి నిర్మించాలని ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా లాభం లేకపోవటంతో రెండేళ్ల క్రితం రైతులందరూ ఏకమై తామే చందాలు వేసుకుని తాళ్ల వంతెనను నిర్మించుకుని సమస్యను పరిష్కరించుకున్నారు’ అన్నాడు తాతయ్య.  ‘భలే భలే’ పిల్లలు అంటుండగా, తాళ్లన్నీ కూడా వంతెనగానూ తోడ్పడ్డామని కాసింత గర్వించాయి.

అప్పటిదాకా వీళ్ల మాటలు వింటూ మౌనంగా ఉన్న అమ్మమ్మ ‘ఇన్ని రకాల తాళ్ల గురించి చెప్పారు కానీ మీకు వీరతాడు గురించి తెలుసా?’ అడిగింది. ‘వీరతాడా! అదేం తాడు?’ అడిగాడు తేజ. అమ్మమ్మ నవ్వుతూ ‘భాషా ప్రయోగాలలో ప్రతిభను గుర్తిస్తూ వేసే తాడు. మాయా బజార్ సినిమా చూస్తే వీరతాడంటే ఏమిటో బాగా తెలుస్తుంది. అందులో తెలివిలేని, పదాలను సుస్పష్టంగా పలకలేని లంబు, జంబు మొదలైన రాక్షస విద్యార్థులను ఘటోత్కచుడు కోప్పడకుండా, ఎవరూ పుట్టించక పోతే కొత్త మాటలు ఎలా పుడతాయంటూ వాడికో వీరతాడు వేయమంటాడు. అలా విద్యార్థులందరికి వీరతాడు వేయడం జరుగుతుంది. హాయిగా నవ్వుకునే సన్నివేశం. రేపు మనమంతా కలిసి మాయాబజార్ సినిమా చూద్దాంలే’ అంది అమ్మమ్మ. ఆసక్తిగా విన్న పిల్లలు ‘మేం రెడీ’ అన్నారు.

‘అన్నట్లు సిలికానాంధ్ర వారి సుజనరంజని అంతర్జాల సాహితీపత్రికలో వీరతాళ్లు అనే శీర్షిక కూడా చూశాను నేను’ అన్నాడు తాతయ్య. ‘భలేగా ఉంది’ అంది అమ్మమ్మ. సాహిత్యంలో కూడా తమ స్థానం పదిలంగా ఉన్నందుకు తాళ్లన్నీ తెగ ఆనందపడి పోయాయి.

‘పిల్లలూ! తాళ్ల సంగతులతో ఇప్పటిదాకా సమయం తెలియలేదు. చాలా పొద్దుపోయింది. ఇంక పడుకోండి’ అంది అమ్మమ్మ. ‘శుభ రాత్రి’ పరస్పరం చెప్పుకుని అంతా పడుకున్నారు. అప్పటి దాకా తమకు పూర్తిగా తెలియని తమ విశేషాలను విన్న తాళ్లన్నీ ఆలోచనలో మునిగాయి.

దండెం తాడు, ఉయ్యాల తాడుతో ‘వీళ్లు అన్ని రకాల తాళ్ల గురించి చెప్పారు కానీ ఉరితాళ్ల గురించి చెప్పలేదు’ అంది. ‘ఉరితాడా! నీకు తెలిస్తే చెప్పు, వింటాను’ అంది ఉయ్యాల తాడు. అందుకు దండెం తాడు, ‘ఆ మధ్య నేను టీవీలో వాటి గురించిన కార్యక్రమం చూశాను. ఉరిశిక్ష చాలా అరుదైన కేసుల్లోనే వేస్తారు. ఉరిశిక్షలకు వాడే తాడు మనదేశంలో కేవలం బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలులోనే లభిస్తుంది. ఉరితాడు తయారీ కోసం జె ముప్పయ్ నాలుగు అనే నూలును వాడతారట. చాలా వరకు చేత్తోనే పనిచేస్తారు. దారాలను తాడులా అల్లేందుకు మాత్రమే యంత్రం వాడతారు. మొదట నూట యాభై నాలుగు నూలు దారపు పోగులుండే ఉండలను తయారు చేస్తారు. అలాంటివి ఆరు ఉండలు ఉపయోగించి పదహారు అడుగుల పొడవుండే తాడును అల్లుతారు. బయటనుంచి తాడు తయారుచేసి పంపిస్తారు. అది తీసుకున్న జైలు వారే ఫినిషింగ్ విషయం చూసుకుంటారు. తాడును మృదువుగా మార్చడమే ఫినిషింగ్. ఉరితాడు వల్ల ఎలాంటి గాయాలు కాకూడదని, కేవలం ప్రాణం మాత్రమే పోవాలని నియమ నిబంధనలు ఉన్నాయట. అందుకే ఫినిషింగ్ చాలా ముఖ్యమట’ చెప్పింది.

‘ప్రాణాలను తీసే పనికి మనల్ని వాడటం నాకు నచ్చలేదు. అయితే దుష్ట శిక్షణ కూడా ముఖ్యం కాబట్టి అందులో తప్పేం లేదనిపిస్తుంది. కాకపోతే మనిషి దుర్మార్గంగా క్రూర నేరాలు చేయకపోతే ఇలా ఉరిశిక్షకు గురికాడు కదా. అందుకే సన్మార్గులుగా ఉండమని మనుషులందరికీ మనవి చేయాలనుకుంటున్నాను. కానీ వినిపించుకోరుగా’ అంది ఉయ్యాల తాడు. ‘నువ్వు చెప్పిందీ నిజమే. మనం సమైక్యతకు చిహ్నాలం. ఎన్నో దారాలం కలిసి ఒక తాడుగా ఉంటున్నాం. కానీ ఈ మనుషులో.. అనైక్యతతో అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. మనల్ని చూసి అయినా ఐక్యంగా ఉంటే బాగుండు. అలాగే దొంగలను, నేరస్థులను కట్టివేయడానికి మనిషి మనల్ని రూపొందించాడు కానీ తనలోని చెడు ఆలోచనలను కట్టివేసే తాడును కనుగొనే ప్రయత్నం మాత్రం చేయడంలేదు’ తాడాట తాడు అంటుంటే హఠాత్తుగా తాతయ్య లేచి దండెం మీది తన తువ్వాలును అందుకోబోవడంతో తాళ్ల సంభాషణ ఠక్కున ఆగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here