అన్నింట అంతరాత్మ-39: శుభ్రమస్తు.. ఆరోగ్యమస్తు.. ‘సబ్బు’ను నేను!

6
9

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం సబ్బు అంతరంగం తెలుసుకుందాం.

***

‘టిఫిన్ రెడీ అయింది. అంతా చేతులు కడుక్కురండి. తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. వీణా! వాష్ బేసిన్ల దగ్గర, అన్ని బాత్ రూముల్లో సబ్బులున్నాయో లేదో ఒకసారి చూడు. లేదంటే ఆ షెల్ఫ్ లోవి తీసి పెట్టు’ జానకమ్మ చెప్పింది. కోడలు వీణ వచ్చి వాష్ బేసిన్ పైనే ఉన్న షెల్ఫ్ తెరిచి, మమ్మల్ని అందుకుని, అట్టపెట్టె ల్లోంచి తీసి అన్ని చోట్ల పెట్టి వచ్చింది. నన్ను వాష్ బేసిన్ దగ్గర సబ్బు పెట్టెలో పెట్టింది. ‘హూఁ! నన్ను ఇవాళ అరగదీసేస్తారు’ అనుకున్నాను. ఒకామె వచ్చి కొత్తగా ఉన్న నన్ను ముక్కు దగ్గర పెట్టుకుని మరీ ఆఘ్రాణించి ‘అబ్బ! మంచి వాసన’ అంటూ చేతులే కాదు, ముఖం కూడా కడుక్కుంది. ఆ తర్వాత ఓ పాప వచ్చి తన చిట్టి గోళ్లతో గిల్లింది. అబ్బా! అనుకున్నా. ఇంతలో వాళ్లమ్మ వచ్చి ‘సబ్బును గిల్లుతున్నావా? అలా చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను’ అంటూ తనే ఆ పాప చేతులు కడిగి తీసుకెళ్లింది. ‘హమ్మయ్య’ అనుకున్నాను.

ఇల్లంతా పెళ్లి సందడి. నాకూ సరదాగా ఉంది. అంతా టిఫిన్ తింటున్నారు. ‘వియ్యాలవారుండే విడిదికి సబ్బులు, సెంట్లు, తలనూనెలు, దువ్వెనలు, షాంపూలు.. కొన్నారా?’ ఓ పెద్దావిడ అడిగింది. ‘అన్నీ కొన్నాం మీనాక్షీ. ఎవరి కేది ఇష్టమో అని రకరకాల సబ్బులు తెప్పించాం’ బదులిచ్చింది జానకమ్మ. మా ప్రస్తావనతో వాళ్ల మాటల మీద నా ఆసక్తి పెరిగింది. ‘నాకయితే నా చిన్నప్పట్నుంచి మైనూర్ శాండల్ సబ్బే ఇష్టం’ అంది ఓ నడివయసు ఆమె. నా పేరే చెప్పటంతో నా మేను పులకించింది.

‘మాలతి పిన్నీ! అసలు మైసూర్ శాండల్ సబ్బు తయారీ ఎలా మొదలైందో, దాని చరిత్ర తెలుసా నీకు?’ అడిగాడు శ్రీధర్. ‘తెలీదురా’ అంది. ‘మాకూ తెలీదు. నువ్వు చెప్పు, వింటాం’ అన్నారంతా. ‘సరే వినండి. అవి స్వాతంత్య్రం రాకముందు రోజులు. మైసూర్ రాజ్యం చందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో ప్రపంచ గుర్తింపును పొందింది. అయితే అంతలోనే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో ప్రపంచ దేశాల్లో పంటలు పండించే వ్యవస్థ ధ్వంసమై, తిండి దొరకడమే సమస్య అయింది. ఆ పరిస్థితులలో చందనం చెక్కలను కొనేవారు లేకపోవడంతో ఎగుమతులు ఆగిపోయాయి. చందనం నిల్వలు పెరిగిపోవడంతో నష్టం వచ్చింది. అక్కడి ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్ ఆలోచించి, ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి సలహా అడిగాడు. ఆయన చందనం నుంచి తీసే నూనె నుంచి సబ్బులు తయారు చేసే పరిశ్రమ పెడితే బాగుంటుందని చెప్పడంతో బెంగళూరులో తొలిసారిగా ఒక సబ్బుల కంపెనీ మొదలుపెట్టారు. ఆ సబ్బులు మైసూర్ రాజాకు బాగా నచ్చడంతో పెద్ద ఎత్తున తయారీ ప్రారంభించి, ప్రజలందరికీ తక్కువ ధరకు సబ్బులను అందించాలన్న కోరిక వెలిబుచ్చాడు. ఆ రకంగా భారీ సబ్బుల ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. స్వచ్ఛమైన చందనం నుంచి తయారయ్యే ఈ సబ్బులు మైసూర్ శాండల్ సోప్స్‌గా ప్రసిద్ధి చెందాయి. ప్రజలు బాగా ఆదరించారు. ఆ తర్వాత ఆ కంపెనీని జాతీయం చేశారు’ ఆగాడు శ్రీధర్. నా పుట్టుక, చరిత్ర తెలిసి కాసింత గర్వపడ్డాను. దూరంగా ఉన్న సంతూర్ నన్ను చూసి అసూయతో ముఖం తిప్పుకుంది.

అంతలో ఓ బామ్మగారు ‘మొన్న టీవీలో చూశారా, ఓ కుర్రాడు మరకలు పడ్డ షర్టును పట్టుకుని, వాళ్ల నాన్నతో కాబోలు పోరాపో అంటున్నాడు. అదేంటో’ ఆశ్చర్యంగా అంది. అంతా నవ్వారు. ‘అది పోరాపో కాదు, పోర్ రబ్ పోర్.. ఇంగ్లీషు పదాలు. పోర్ అంటే పోయమని, రబ్ అంటే రుద్దమని.. అది సర్ఫ్ లిక్విడ్ గురించిన యాడ్’ వివరించి ఓ అమ్మాయి. ‘అలాగా’ అంది బామ్మగారు కళ్ల జోడు సర్దుకుంటూ. అసలు ఈ సబ్బు అనేది ఎట్లా మొదలైందో మరొకామె అంది.

‘అత్తా! నేను చెపుతా’ అంటూ మరొక కుర్రాడు మొదలు పెట్టాడు. నేను రెట్టించిన ఆసక్తితో వినడానికి సిద్ధమయ్యా.

‘పంథొమ్మిదో శతాబ్దంలో వియన్నాలో శిశువులు అధిక సంఖ్యలో మరణించేవారట. అందులో కూడా మంత్రసానులు చేసే కాన్పుల్లో శిశువులు ఆరోగ్యంగా ఉండడం, మెడికల్ విద్యార్థులు చేసే కాన్పుల్లో శిశువులు చనిపోవటం అక్కడి హంగేరియన్ డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్ వీస్ గమనించాడు. కారణమేమిటా అని పరిశీలన మొదలు పెట్టాడు. ఆ విద్యార్థులు తరచుగా శవపరీక్షలు కూడా చెయ్యాల్సి వచ్చేది. ఆ సమయంలో వారి చేతులకంటిన సూక్ష్మ క్రిములు, వారు కాన్సు చేస్తున్నప్పుడు శిశువులకు పాకి, ఇన్‌ఫెక్షన్ సోకి అనారోగ్యం పాలై మరణిస్తున్నారని తెలుసుకున్నాడు’. ‘అయ్యో’ అన్నారంతా. నేను కూడా ‘పాపం’ అనుకున్నా.

‘ముందు వినండి.. అందుకే ఆ డాక్టరు వెంటనే ఓ హ్యాండ్ వాష్‌ను తయారు చేశాడు. దాన్ని వాడటంతో వారి చేతులు శుభ్రపడి, శిశుమరణాలు ఆగిపోయాయి. అదీ సబ్బు మహత్యం! అదే క్రమంగా మార్పులు, చేర్పులతో ఒళ్లు రుద్దుకునే సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు, గిన్నెలు శుభ్రం చేసే సబ్బులు, చేతులు శుభ్రపరచుకునే ద్రవరూప సబ్బులు, వాషింగ్ పౌడర్లుగా ఉత్పత్తులు మొదలయ్యాయి’ ముగించాడు.

‘అందుకేనేమో మొన్న కరోనా కాలంలో చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అటూ గోల పెట్టారు. పైగా సబ్బుతో కడుక్కుంటే మరీ శ్రేష్ఠం’ అన్నారు అంది మరో పిన్నిగారు. మా ప్రాధాన్యత తెలిసి నాకు పరమానందమైంది.

‘అయితే స్నానపు సబ్బులు మాత్రం ప్రాచీన ఈజిప్షియన్ల కాలంనుంచే ఉన్నాయని చదివాను. అసలు బైబిల్ కాలం నుంచే సబ్బు అందుబాటులో ఉందని చరిత్రకారుల మాట. తొలి సబ్బు క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందల్లో బాబిలోన్‌లో తయారైందట’ ‘జ్ఞానప్రసూన’ చెప్పింది. ఇందాక ఎవరో ఆమెను ఆ పేరుతో పిలవగా విన్నాను.

‘మాకాలంలో లైఫ్‌బాయ్ తోనే స్నానం.. బట్టలకయితే సన్‌లైట్ ఉండేది’ చెప్పింది బామ్మగారు. ‘అవును. లైఫ్‍బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది’ అని పాడుకుంటూ స్నానం చేసేవాళ్లం’ అన్నాడు ఇంకో ఆయన. ‘గాడిద పాలతో కూడా సబ్బులు తయారు చేస్తారు తెలుసా?’ అంది ఓ కుమారి. నేను ఆశ్చర్యపోతుండగానే, ‘గాడిద పాలతోనా!’ అంతా ముక్తకంఠంతో ఆశ్చర్యం వెలిబుచ్చారు. ‘అవును, ఈజిప్టు రాణి క్లియోపాత్ర మిలమిలలాడే చర్మ సౌందర్యం కోసం, దీర్ఘకాలం యవ్వనంతో ఉండడం కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. రోమ్ చక్రవర్తి నీరో రెండవ భార్య పాపే సబీనా కూడా గాడిద పాలలో జలకాలాడేదట. గాడిద పాలలో ఆ ప్రత్యేక గుణం ఉండటం వల్లే ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ, గాడిద పాలతో సబ్బులు తయారుచేసి అమ్ముతోంది. గాడిద పాల వల్ల చర్మం ముడుతలు పడకుండా, మెరుపుతో, మృదువుగా ఉంటుందట’ చెప్పింది కుమారి. ‘ఆ సబ్బుతో గాడిదకే స్నానం చేయిస్తే ఎలా ఉంటుందో’ అన్నాడో పరిశోధక్. అంతా ఒకటే నవ్వులు. నాకూ నవ్వొచ్చింది.

‘సబ్బు తయారీకి ఇంకా ఏవేవి వాడతారో’ అంది ఓ అరవింద. ‘సబ్బు తయారీకి సోడియం హైడ్రాక్సైడ్, సుగంధ నూనెలు, కొవ్వులు, వెన్న ఇలా ఎన్నో పదార్థాలు వాడతారు. అయితే ప్రపంచంలో సహజంగానే సబ్బు లక్షణాలున్న ఒక మొక్క ఉంది తెలుసా?’ అడిగాడు శ్రీధర్. ‘మొక్కా!’ అంతా ఆశ్చర్యపోయారు. ‘అవును. ఆ మొక్కను ‘సోప్ వర్ట్’ అంటారు. ఎందుకంటే దాని ఆకులు, వేళ్లు సాపోనిన్ కలిగి ఉంటాయి. అది నురుగును ఉత్పత్తి చేస్తుంది. మురికిని కడిగేందుకు దాన్ని వాడతారు’ వివరించాడు శ్రీధర్. ‘భలే ఉందే’ అన్నారంతా. నేను, ఆ మొక్కను ఊహించుకున్నా.

‘కొన్ని సబ్బులు వాడకంలో త్వరగా విరిగి ముక్కలవుతాయి. మరి మంచి సబ్బు అవునా, కాదా అని తెలుసుకోవడం ఎలా?’ మీనాక్షి అడిగింది. వెంటనే జ్ఞానప్రసూన ‘నేను చెపుతా. సబ్బుల్లో ఉండే టోటల్ ఫ్యాటీ మేటర్.. క్లుప్తంగా చెప్పాలంటే టి.ఎఫ్.ఎమ్‌ను సబ్బుకు ఉండే ప్యాకింగ్ మీద గమనించవచ్చు. ఈ టి.ఎఫ్.ఎమ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంత నాణ్యత కలదిగా అర్థం చేసుకోవాలి. భారతీయ ప్రమాణాల బ్యూరో ప్రకారం సబ్బులను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి గ్రేడ్ వన్, గ్రేడ్ టు, గ్రేడ్ త్రీ. సబ్బులో టి.ఎఫ్.ఎమ్ ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ వన్; డెభై నుంచి డెభై ఐదు శాతం మధ్యలో ఉంటే గ్రేడ్ టు; అరవై నుంచి డెభై శాతం మధ్యలో ఉంటే గ్రేడ్ త్రీ అన్నమాట. రెండు, మూడు గ్రేడ్ సబ్బుల్లో ఫిల్లర్స్ ఎక్కువ మొత్తంలో సబ్బు రూపంలో కలిసిపోయి ఉంటాయి. చూడటానికి మామూలుగానే ఉన్నా ఆస్‌బెస్టాస్ వంటి వంటి రసాయనాలు అధికంగా ఉండి చర్మానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఈ సబ్బులు నీటితో కలిసినప్పుడు మెత్తగా అయిపోయి త్వరగా అరిగిపోతాయి. కొంత మంది వీటికి నురగ బాగానే వస్తోంది కదా అనుకొని వాడుతుంటారు. కానీ అవి నాసిరకమని, హాని చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఎటువంటి చర్మం ఉన్నవారైనా గ్రేడ్ వన్ సబ్బు వాడుకోవడం ఉత్తమం. ఇవి శుభ్రత నివ్వడమే కాకుండా మృదుత్వాన్ని కలిగిస్తాయి’ చెప్పింది. మా జాతిలో రకాలు గురించి ఇప్పుడే తెలుసుకున్నా అనుకుంటుంటే ‘అవునా, ఎప్పుడూ హడావుడిగా రేప‌ర్ తీసిపడేసి సబ్బు వాడుకోవడమే కానీ ఇవన్నీ గమనించలేదు. ఈసారి క్షుణ్ణంగా చదువుతా’ అంది ఒకావిడ.

‘ఇంకో విషయం ఆర్గానిక్ సబ్బులయితే రసాయనాల మాటే ఉండదు. వీటిలో కొబ్బరి నూనె, జనపనార విత్తనాలతో తయారయిన నూనె.. నిమ్మజాతి పండ్లు, మూలికలు ఉంటాయి’ చెప్పింది జ్ఞానప్రసూన. అంతలో ఓ బాబి గాడు ‘సబ్బులు చాలా రంగుల్లో ఉంటాయి, కానీ నురగ మాత్రం తెల్లగానే ఉంటుంది’ అని తన పరిశీలనను తెలియజేశాడు. వెంటనే శ్రీధర్, ‘అవును.. ఏథెన్స్ సైన్స్ నివేదిక ప్రకారం సబ్బు రంగు ఏదైనా నురుగు ఏర్పడినప్పుడు అందులో నీరు, గాలి కలిసి పోతాయి. ఇవి గుండ్రని బుడగ ఆకారంలో కనిపిస్తాయి. కాంతికిరణాలు వాటి పై పడినప్పుడు అవి ప్రతిబింబిస్తాయి. ఈ రసాయనిక చర్య వల్ల బుడగలు తెల్లగా కనిపిస్తాయి. సబ్బు రంగు ప్రభావం ఉండదు’ వివరించాడు. ‘మా జాతిలో ఎన్ని విశేషాలో’ అనుకున్నాను.

‘మరి కొన్ని సబ్బు ప్రకటనల్లో బ్యాక్టీరియాను తొలగిస్తాయి అని చెపుతుంటారు. అన్ని సబ్బులూ బ్యాక్టీరియాను తొలగించవా?’ బాబీ అడిగాడు. ‘నీ సందేహం మంచిదే. సాధారణ సబ్బులు కేవలం మురికిని తొలగిస్తాయి. కొన్ని ప్రత్యేక యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు మాత్రం బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. అయితే వైరస్‍లను చంపలేవు. ఇకపోతే చర్మ సమస్యలకు వాడేందుకు కొన్ని ప్రత్యేక మెడికల్ సబ్బులు ఉన్నాయి.’ చెప్పాడు శ్రీధర్.

‘నాకు ఇంకో సందేహం వస్తోంది. అసలు సబ్బులే లేనప్పుడు దానికి బదులుగా ఏం వాడేవారు?’ అడిగాడు బాబీ. ‘పురాణాల్లోనే ఉంది కదరా, పార్వతి అభ్యంగన స్నానానికి వెళుతూ నలుగు పిండితో వినాయకుడిని చేసిందని. అంటే స్నానానికి నలుగు పిండి వాడేవారని, పెసలు లేదా శనగపప్పును పిండి చేసి, పసుపు కలిపి, ఇంకా కావాలంటే కాసింత గంధం పొడి కూడా కలిపి ఒంటికి పట్టించుకుని, కాస్త ఆరనిచ్చి, గట్టిగా రుద్దేస్తే ఎంచక్కా ఒళ్లు శుభ్రపడుతుంది. ఇప్పటికీ చాలామంది పసిపిల్లలకు నలుగు పెట్టడం తెలిసిందేగా. ఇక తలస్నానానికి కుంకుడుకాయలు, శీకాయలు ఉండనే ఉన్నాయి’ చెప్పింది బామ్మగారు. బాబీ అర్థమైనట్లు తలాడించాడు.

‘మీకు బంగారం, వజ్రాలు ఉండే సబ్బులు తెలుసా?’ అడిగింది కుమారి. ‘బంగారం, వజ్రాలా!’ అంతా నోళ్లు తెరిచారు. నేనూ ఆశ్చర్యపోయాను. ‘అవును. కతార్‌లో ఒక ఫ్యాన్సీ సబ్బు వెల రెండువేల డాలర్లు పై మాటే. ఈ సబ్బును బంగారు పొడితో తయారు చేస్తారు. వజ్రాలతో పొదుగుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బుగా పేరొందిన ఈ సబ్బులను కతార్‌లోని ఓ కుటుంబం వారు తయారు చేస్తున్నారు’ చెప్పింది. ‘అంత ఖరీదైనవి ఏ అంబానీలాంటి అమీరులో వాడాల్సిందే’ శ్రీధర్ అన్నాడు. మా జాతిలో అంత గొప్పవైన సబ్బులుండటం నాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది.

అంతలో వీణ ‘ఆ మధ్య ఎక్కడో చదివాను, కప్ కేక్ లాంటి సబ్బులు వచ్చాయట. ఐఐటి చదివిన సాక్షి అనే ఆవిడ ఆ క్రీమ్ సోప్‌లను తయారు చేస్తోందట. ఆయుర్వేద మూలికలు, పండ్లనూ ఆ సబ్బు తయారీలో వాడతారని, అందులో చాలా ఫ్లేవర్లు ఉన్నాయని, చాలామంది మామిడి, కాఫీ ఫ్లేవర్ క్రీమ్ సోప్‌లను ఇష్టపడుతున్నారని రాశారు’. చెప్పింది. అంతా ఆసక్తిగా విన్నారు.

‘మరో విషయం, మనం కాలాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో సబ్బుల్ని అతిగా వాడకూడదు. చాలామందికి చర్మం పగిలిపోయి, పొడిబారి, తెల్లగా పొట్టుపోయినట్టుగా అవుతుంది. అందువల్ల చలికాలంలో చర్మ సంరక్షణకు గ్లిజరిన్ శాతం ఎక్కువ ఉండే సబ్బులను వాడటం ఎంతైనా మంచిది’ అంది కుమారి.

సబ్బుకు సాహిత్యంలో కూడా చోటు దక్కింది. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవిత కనర్హం’ అన్నాడు శ్రీశ్రీ’ చెప్పాడు సాహిత్య పిపాసి అయిన శ్రీధర్. ఇంతలో ఓ కుర్రాడు ‘సినిమా సాహిత్యంలో కూడా సబ్బు చోటుచేసుకుంది

‘సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్లం కాదా

నీ వీపు సూపలేదా, మా సబ్బు రుద్దలేదా

సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్లమే పిల్లా మేము పాడాడు.

‘మంచిపాటే గుర్తొచ్చింది.. అంతా పకపకా నవ్వారు.

‘సరే కానీ మీరు హ్యాండ్ మేడ్ సోప్‌ల గురించి విన్నారా? వాటిలో రసాయనాలు ఉండవట. సహజ పదార్థాలు, ఆలివ్ నూనె, అవకాడో నూనె, కోకో, వెన్న, ద్రాక్ష, కొన్ని సేంద్రియ పదార్థాలు కలిపి తయారు చేస్తారు. వీటిలో గ్లిజరిన్ కూడా ఉంటుంది. ఇవి చాలా తేలికగా ఉంటాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి’ కుమారి చెప్పింది. ‘బాగుంది. మరో సంగతి కూడా చెప్పుకోవాలి. ఇంట్లో వారంతా ఒకే సబ్బు వాడటం పాత పద్ధతి. ఇప్పుడు ప్రతివ్యక్తి తమదంటూ ప్రత్యేకమైన సబ్బును వాడటానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్యరీత్యా కూడా అదే సరైనది’ అంది వీణ.

‘నిజమే. కానీ ఆర్థిక స్థితిని బట్టి అది సాధ్యమవుతుంది. పేదలకు ఆ వీలు ఎక్కడ ఉంటుంది?’ అన్నాడు శ్రీధర్. అంతలో మీనాక్షి అందుకుని, ‘గతంతో పోలిస్తే అంతటా స్నానపు సబ్బుల వాడకం ఎక్కువయింది. కానీ బట్టల సబ్బుల వాడకం మాత్రం తగ్గిందనే చెప్పాలి. అంతా డిటర్జెంట్ పౌడర్లు, డిటర్జెంట్ లిక్విడ్స్ వాడుతున్నారు’ అంది మీనాక్షి. షెల్ఫ్‌లో ఉన్న బట్టల సబ్బు ముఖం చిన్నబుచ్చుకోగా, డిటర్జెంట్ పౌడర్ డబ్బా ముఖం చాటంత అయింది. అంతలో జానకమ్మ ‘అనుకుంటాం గానీ ఎంత డిటర్జెంట్ పౌడర్ వేసినా, షర్ట్‌ల కాలర్లు బాగా మురికి పట్టినప్పుడు డిటర్జెంట్ పౌడరు లొంగనే లొంగవు. మళ్లీ సబ్బందుకొని రుద్ది, బ్రష్ చేయాల్సిందే’ అంది. అది విని, బట్టల సబ్బు ముఖం కాస్తంత వికసించింది.

అంతలో అక్కడి కొచ్చిన పనిమనిషి ‘అమ్మా! గిన్నెలు తోమే సబ్బుల గురించి అయితే నేను చెపుతా. మా సిన్నప్పుడు గిన్నెలు తోమడానికి బూడిద, ఇటుక ముక్క, వాడేసిన కాఫీ పొడి, వినుకొండ ముగ్గు వాడేవాళ్లు. ఆ రోజులు పోయి ఇప్పుడు గిన్నెలు తోమేందుకు కూడా సబ్బులొచ్చినయ్. అయితే ఇవి పెద్దగిన్నెలు తోమడానికి బాగుంటయ్ కానీ పూర్తి జిడ్డు పోగొట్టవు. జిడ్డు వదలాలంటే జెల్ చుక్క పడాల్సిందే’ అంది. అంతా ‘నువ్వు చెప్పింది నిజమే’ అన్నారు నవ్వుతూ. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

‘స్నానపు సబ్బులు శరీర శుభ్రతకే కాదు, మరెన్నో విధాలుగా ఉపయోగిస్తాయి’ అంది జ్ఞానప్రసూన. ‘ఆ ఉపయోగాల గురించి చెప్పు, వింటాం’ అంది కుమారి. ‘కొన్నిసార్లు బ్యాగులు, జాకెట్ల జిప్‌లు సరిగా పనిచేయవు. అలాటి సందర్భాల్లో జిప్ చివర సబ్బును రుద్దితే జిప్ బాగవుతుంది. అలాగే కొంతమంది పాదాలకు చెమట ఎక్కువ పడుతుంది. వారి బూట్ల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే బూట్ల లోపల సబ్బు ముక్క ఉంచితే చాలు. బీరువాలో ఎక్కువ కాలం దాచి పెట్టే బట్టలు మంచి వాసనతో ఉండాలటే సబ్బును ఆ అరలో ఉంచితే చాలు. ఇంకో సిసలైన ప్రయోజనం ఏమిటంటే ఏదైనా గాజు వస్తువు కిందపడి పగిలినప్పుడు పడిన చిన్న ముక్కల్ని తీయడం కష్టమవుతుంది. అప్పుడు తడి సబ్బును ఆ ప్రాంతంలో ఉపయోగిస్తే గాజు ముక్కలు సులభంగా దానికి అతుక్కుంటాయి’ చెప్పింది. ‘అబ్బో! మా జాతితో ఇన్ని ఉపయోగాలున్నాయన్న మాట’ అనుకుంటుండగా వీణ ‘మీరు ఒక సంగతి మరిచిపోయారు. చాలామందికి చేతులకు గాజులు వేసుకోవటం కష్టంగా ఉంటుంది. మట్టి గాజులయితే మరీ ఇబ్బంది. అలాంటప్పుడు కాస్తంత సబ్బురాస్తే చిట్లకుండా సులభంగా ఎక్కుతాయి. అలాగే ఉంగరాలు, మట్టెలు కూడా ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు’ అంది. ‘అవునవును’ అన్నారంతా.

‘సబ్బుల మీద చిత్రాలు గీసేవారు కూడా ఉన్నారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తూర్పు గోదావరికి చెందిన ఓ చిత్రకారుడు సబ్బు బిళ్ల మీద ఎన్టీఆర్ చిత్రాన్ని చిత్రించాడని వార్తల్లో చదివాం, విన్నాం. గతంలో కూడా ఎందరో సబ్బు బిళ్లల పై రకరకాల బొమ్మల్ని చిత్రించారు’ చెప్పాడు శ్రీధర్. ‘అవునవును’ అన్నారంతా. కొత్త సంగతి తెలుసుకుని నేను మరింత సంతోషించాను. ‘సబ్బు సర్వస్వం చర్చించేసి అలిసిపోయారు కానీ మరో విడత కాఫీలు వస్తున్నాయి. హాయిగా తాగండి’ అంది జానకమ్మ. అంతా ‘అవునవును. ఇప్పుడిక కాఫీ పడాల్సిందే’ అంటూ కాఫీలందుకున్నారు.

నేను మాత్రం నా గురించిన ఆలోచనల్లోకి వెళ్లిపోయాను. నా జీవితం స్వల్పకాలమే అయినా ఎంతో విలువైన సేవలందిస్తున్నా. ఆ సేవలోనే కరుగుతున్నా.. అరుగుతున్నా.. తరిస్తున్నా. కంపెనీలో ఉన్నప్పుడు, షాపులో ఉన్నప్పుడు, ఇక్కడ షెల్ఫ్‌లో ఉండి కూడా మనుషుల గురించి ఎంతో తెలుసుకున్నా. శరీర శుభ్రతకు మమ్మల్ని వాడతారే కానీ మనసుల్ని మాత్రం శుభ్రం చేసుకోరు. స్వార్థపు ఆలోచనలను వీడరు, కుళ్లు కుతంత్రాలను వీడరు. అసూయను వదులుకోరు. అవన్నీ కలిసిన మనిషి ఎంతటి మలినుడు.. ఎంతటి దుర్గంధ పూరితుడు! పైన పటారం, లోన లొటారం అన్నట్లు మురికి మనసులతో తెగ పోజులు.. వినేవారుంటే ఈ మనుషులకు ఓ మాట చెప్పాలనుంది.

అది.. ‘సుమ సుగంధాలతో, తాజాదనాన్నిచ్చే నిమ్మకాయలతో, చందనంతో ఇంకా అనేకానేక వనమూలికలతో తయారయ్యే మా జాతిని వాడి తళుకులీనితే చాలదు, మనసును కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అప్పుడే అసలైన ఆరోగ్యం.. ఆనందం..’ అనుకుంటున్నానో లేదో… నా దగ్గర అంతా క్యూ కట్టారు. అందరి చేతుల్లో ఆనందంగా అరిగిపోతూ నేను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here