అన్నింట అంతరాత్మ-4: బంతిని నేను,, అందరి నేస్తం నేను

4
7

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ఓ బంతి అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]సా[/dropcap]యం సమయం. అభి, వంశీ నన్ను విసిరి విసిరి కొడుతూ ఆడుతున్నారు. నాలుగు.. అయిదు.. ఆరో సారి అభి నన్ను బలంగా కొట్టాడు. అంతే! నేను వెళ్లి, పక్కింటి కిటికీ అద్దాన్ని ఢీకొట్టాను. ఇంకేముంది. అది భళ్లుమంటూ పగిలి ముక్కలైంది. దబ్బుమంటూ నేను కింద పడ్డాను. అంతే! పక్కింటి ఆయన బయటకు పరుగెత్తుకొచ్చాడు. చూస్తే పక్కింటి పిల్లలు.. కింద నేను.. “బాల్ విసిరి కిటికీ అద్దం పగలగొట్టిందెవరు?” కోపంగా అడిగాడు. “సారీ అంకుల్! బాల్ ఆడుకుంటుంటే, పొరపాటున తగిలింది” భయం భయంగా చెప్పాడు అభి. “పొరపాటున? ప్లేగ్రౌండ్‌లో ఆడాల్సిన ఆటలు ఇంట్లో ఆడటమేంటి? ఇప్పుడు కిటికీకి అద్దం లేకపోతే మాకెంత ఇబ్బంది? ఎవరు బాగుచేస్తారు?” అరిచాడు. ఆ అరుపులకు అభి వాళ్ల నాన్న బయటకు వచ్చాడు. జరిగింది అర్థమైంది. అభి వంక కోపంగా ఓసారి చూసి, తర్వాత పక్కింటి ఆయన వైపు తిరిగి “వెరీ సారీ అండీ. పిల్లలు.. చెపితే వినరు. రేపు నేను మీ కిటికీకి కొత్త అద్దాన్ని వేయిస్తాలెండి” అన్నాడు. పక్కింటి ఆయన శాంతించి నన్ను పైకితీసి ‘తీసుకోండి’ అంటూ, అప్పటివరకు కిందపడి ఉండి, ‘నా తప్పేం ఉందీ, ఎటు విసిరితే అటు వెళతాను. అయినా నాకూ దెబ్బ తగిలింది. నా గురించి ఎవరూ పట్టించుకోరు’ అనుకుంటున్న నన్ను అందించాడు. అభి పరుగునవచ్చి నన్ను పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడం కూడా నేను తన ప్రాణమన్నంత ఆత్మీయంగా… గుండెలకు ఆనించుకుని.. “సర్లే వంశీ…ఇవాల్టికి ఆడొద్దులే” అన్నాడు. “సరే.. నే వెళ్తానయితే.. సీ యూ” అంటూ వంశీ వెళ్లిపోయాడు. అభి నన్ను తన ఆట వస్తువుల గూట్లో పెట్టాడు. అభికి బాల్స్ అంటే పిచ్చి. అతని దగ్గర నేను కాకుండా ఇంకా ఐదారు బంతులున్నాయి. అయినా అభికి నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఒకసారి పనిమనిషి ఇల్లు శుభ్రం చేస్తుంటే చీపురు తగిలి నేను వెళ్లి భోషాణాల్లాంటి పెట్టెల వెనక పడ్డా. నాకోసం చాలా వెతికాడు అభి.. నేను కనిపిస్తేనా.. నేను ఇక్కడున్నాను అభీ! అని అరుస్తున్నా.. కానీ నా గొంతు ఎవరికీ వినపడదుకదా. అప్పుడు అభి తాతగారు చెప్పిన ఉదంతం గుర్తొచ్చింది.. అలనాడు త్రేతాయుగంలో సీతాదేవి చెలులతో బంతాట ఆడగా, బంతి వెళ్లి శివధనుస్సు నుంచిన పెద్ద భోషాణం దగ్గర పడటం.. సీతాదేవి అవలీలగా ఆ భోషాణాన్ని ఎడమ చేతితో పక్కకు జరిపి బంతినందుకోవడం వగైరా.. వగైరా.. కానీ నా పరిస్థితి వేరే.. ఎవరికీ నా ఉనికి తెలియక పెట్టెల వెనకే ఉండిపోయా. అభి వేరే బంతులతో ఆడుకుంటుంటే చెప్పొద్దూ నాకు వాటి మీద అసూయగా ఉండేది. నాకీ పెట్టెల వెనుకనుంచి మోక్షమెప్పుడో అనుకుంటూ మూలనే ఉండిపోయా. అంతలో ఇంట్లోకి ఎలుక వచ్చిచేరడంతో దాన్ని బయటకు తరమటానికి ఇంట్లో వాళ్లంతా పూనుకున్నారు. తలా ఒక వైపు చీపుళ్లతో, కర్రలతో నిల్చుని వస్తువులన్నీ జరపసాగారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా భోషాణాన్ని కూడా కదిలించారు. దాంతో నేను దొర్లుకుంటూ వెళ్లి సరిగ్గా అభి ముందు ఆగాను. వెంటనే అభి “నా రెడ్ బాల్.. నా రెడ్ బాల్ దొరికింది” అంటూ కోల్పోయిన పెన్నిధి మళ్లీ లభించినంత ఆనంద పడ్డాడు. “దుమ్ముకొట్టుకుంది. ముందు దాన్నికడుగు” వాళ్లమ్మ అరవడంతో నన్ను శుభ్రం చేయడానికి పట్టుకెళ్లాడు. అందరి దృష్టి నా వైపు మళ్లటంతో తెలివైన ఎలుక బయటకు ఉరికి తప్పించుకుంది. ఎలుక భరతం పట్టలేకపోవడానికి నేనే కారణమని అంతా నన్ను తిట్టుకున్నా, అభి మాత్రం నన్ను శుభ్రంగా కడిగి, తుడిచి నాతో కొద్ది సేపు ఆడుకుని, తర్వాత గూట్లో మా వాళ్ల పక్క పదిలంగా పెట్టాడు. అలా నేను మళ్లీ మావాళ్ల చెంత చేరా. వాళ్లు చిరకాలం తర్వాత కనిపించిన బంధువును చూసినట్లు చూశారు. అన్నట్లు నేను రామాయణంలోనే కాదు, భారతంలోనూ ఉన్నానని తాతగారే చెప్పారు.. అదెలా అంటే.. కౌరవులు ఓ రోజు బంతాట ఆడుకుంటుండగా బంతి వెళ్లి బావిలో పడగా, దాన్నెలా బయటకు తీయాలో తెలియక రాజ కుమారులు కలవరపడుతున్న వేళ ఆచార్య ద్రోణుడు వచ్చి తన బాణాలతో ఆ బంతిని బావి నుంచి బయటకు తీసి రాకుమారులను ఆనందింపజేసి, ఆ తర్వాత ఆయన వారికి గురువయి, యుద్ధవిద్యలన్నీ నేర్పాడట.

అసలు బాల్‌కి.. బాల్యానికి అవినాభావ సంబంధం ఉంది. నేను లేకుండా మనుషుల బాల్యం గడవదు. నాతో అన్ని వయసుల వారు ఆడుకునేందుకు వీలుగా నన్ను చిన్న, మధ్యస్థం, పెద్ద సైజుల్లో రూపొందిస్తారు. అభి ఓ రోజు వాళ్ల నాన్నను అసలు బంతిని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారని అడిగాడు. అందుకు వాళ్ల నాన్న బంతిని క్రీ.పూ. పదహారు వందలు తొలినాళ్లలో ప్రాచీన మెసో అమెరికన్స్ కనుగొన్నారని చెప్పాడు. అంతేకాదు బంతులతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ఆటలు ఆడతారని, ఆయా ఆటలకు తగ్గట్టుగా వేర్వేరు రీతుల్లో ఆ బంతులు ఉంటాయని చెప్పాడు. ఎన్నిరకాల బంతులుంటాయేం అని అభి మళ్లీ అడిగాడు. అందుకు వాళ్ల నాన్న “బేస్ బాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బిలియర్డ్స్ బాల్, గోల్ బాల్, వాలీ బాల్, రగ్బీ బాల్, క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్, వాటర్ పోలో బాల్, టేబుల్ టెన్నిస్ బాల్.. ఇంకా మరెన్నో ఉన్నాయి.. నిన్ను చిన్నప్పుడు బాల్ పూల్‌కి తీసుకెళ్లి ఆడించేవాడిని గుర్తుందా” అన్నాడు. అంతలో అభి వాళ్లమ్మ వచ్చిబంతులతో మెజీషియన్లు, బఫూన్లు ఎన్నో తమాషాలు చేస్తారని, సర్కస్‌లలో ఏనుగులు కూడా బంతాట ఆడతాయని చెప్పింది. అప్పుడు అభి, మా స్నేహితుడు సాకేత్ వాళ్ల టామీ అయితే దూరంగా పడ్డ బాల్‌ను నోటితో పట్టుకు తెచ్చివ్వటం చూస్తే భలేగా ఉంటుందన్నా డు. అభి వాళ్ల అక్కేమో “భౌతికశాస్త్ర శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాలలో రకరకాల బంతులను వాడతారు తెలుసా?” అంది. వెంటనే వాళ్ల నాన్న అందుకుని “బంతుల్ని వ్యాయామానికి కూడా వాడుతుంటారు. జిమ్‌లో ఉండే సాధనాల్లో బంతి కూడా ఒకటి. వీటిని ఫిజియో బాల్స్ అంటారు. అలాగే చేతులు లేదా కాళ్ల పని నైపుణ్యాలు (మోటార్ స్కిల్స్) సరిగా లేనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వారు బంతులతో ప్రత్యేక వ్యాయామం చేయవలసి ఉంటుంది” అన్నాడు. మళ్లీ అభి వాళ్ల అక్క అందుకుని, “మన శరీరంలో మోకాలు దగ్గర ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు తెలుసా?” అంది. అంతలో అభి వాళ్ల అమ్మ, “బంతాట అంటే గుర్తొచ్చింది, పెళ్లిళ్లలో కూడా వధూవరుల చేత బంతాట.. అదే పూబంతులతో ఆడిస్తారు. అదొక వేడుక మాత్రమేకాదు, ఆ జంట మధ్య కొత్త ఫీలింగ్ పోయేందుకు కూడా ఉపయోగపడుతుంది” అని చెప్పింది. “అన్నట్లు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏదైనా ఒక అంశంపై నిర్ణయం ఒకరి అధీనంలో ఉన్నప్పుడు ‘బాల్ ఈజ్ ఇన్ హిజ్ కోర్ట్’ అంటుంటారు” అన్నాడు వాళ్ల నాన్న. నేను చెవులు రిక్కించి అదంతా విని, అబ్బో మా జాతి ఎంత గొప్పదో అని తెగ మురిసిపోయాను. అలాగే మరో రోజు టీవీలో మా గురించి అంటే బాల్స్ గురించిన కార్యక్రమం వచ్చింది. అందులో క్రీడా బంతులు అనేక రకాలని, వాటిని వేర్వేరు ముడి వస్తువులతో.. లెదర్, రబ్బరు, లేటెక్స్, పాలిస్టర్, సింథటిక్ లెదర్, కాటన్, ఊల్, ప్లాస్టిక్ వగైరాలతో తయారు చేస్తారని చెప్పారు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు, బంతులతో ఆడినట్లు చారిత్రక ఆధారాలున్నాయని, సాధారణంగా బాల్ అనగానే గుండ్రంగా ఉంటుందనే భావన ఉన్నా, రగ్బీబాల్, సాకర్ బాల్ వంటివి కోలగా ఉంటాయని అన్నారు.

అన్నట్లు అంతర్జాతీయ నిబంధనల మేరకే క్రీడాబంతులను తయారు చేయవలసి ఉంటుందట. బేస్ బాల్ తీరే వేరని, దానికి ప్రత్యేకంగా ఉపరితలంపై ఎర్రటి దారంతో నూట ఎనిమిది కుట్లతో డిజైన్ ఉంటుందని చూపించారు. ఎంత ముచ్చటగా ఉందో. ఫుట్ బాల్‌నే అమెరికన్లు సాకర్ అంటారని వివరించారు. సాకర్ బాల్‌కు రకరకాల డిజైన్లు ఉంటాయట. బాస్కెట్ బాల్ కాషాయ వర్ణంలో, నల్లటి గీతల డిజైన్ కలిగి ఉంటే, గోల్ఫ్ బాల్ ఉపరితలమంతా సొట్టలు (డింపుల్స్) కలిగి ఉంటుందని చెప్పారు. టెన్నిస్ బాల్‌నే పింగ్ పాంగ్ అంటారని, అది ఫ్లోరోసెంట్ కలర్‌లో ఉంటుందని చెప్పారు. అంతేకాదు క్రికెట్ బాల్‌ను కార్క్, లెదర్‌తో తయారు చేస్తారని, ఎరుపురంగు క్రికెట్ బంతిని టెస్ట్ మ్యాచ్‌లలో, తెల్ల బంతిని వన్డే మ్యాచ్‌లో వాడతారని, ఎరుపురంగు క్రికెట్ బంతులలో డ్యూక్స్, కూకబుర్ర, ఎస్జీ అని మూడు రకాలున్నాయని, మన దేశంలో ఎస్జీ బంతుల్నే వాడతారని చెప్పారు. అవన్నీ తెలుసుకుని నాకెంతో సంతోషంగా, గర్వంగా అనిపించింది. అయితే ఇంకోరోజు టీవీలో ఏదో సినిమా వస్తోంది. మధ్యలో హీరో, హీరోయిన్లకు ఏదో గొడవ వచ్చింది. “నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను” అంది హీరోయిన్ కోపం, దుఃఖం కలగలిపిన గొంతుతో. అందుకు హీరో, “పో, గోడకు కొట్టిన బంతి లాగా నువ్వే తిరిగొస్తావు” అన్నాడు. నా లక్షణాన్ని ఆమెకు ఆపాదించడం అన్యాయమనిపించింది, నాతో పోల్చడం చాలా బాధనిపించింది.

ఒక రోజు అభి వాళ్ల మామయ్య వచ్చాడు. ఆయన అభికి భూమి గురించి చెపుతూ, క్రీ.పూ. ఆరో శతాబ్దంలో పైథాగరస్ భూమి బంతి ఆకారాన్ని కలిగి ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. కానీ దాన్ని కొందరు సమర్ధిస్తే, మరికొందరు వ్యతిరేకించారు, అయితే ఆ తర్వాత న్యూటన్ భూగ్రహం ఆకారం బంతి మాదిరి కాక, దీర్ఘవృత్తాకారంగా ఉంటుందన్నాడని వివరించాడు.

ఒక సారి అభి తన స్నేహితులతో కలిసి మైదానంలో బంతాట ఆడాడు. అంత పెద్ద మైదానాన్ని చూసి నా మనసు ఉరకలేసింది. కొంత సేపు ఆడుకున్నాక అంతా కలిసి ఓ గట్టుమీద కూర్చున్నా రు. నేను ఒద్దికగా అభి ఒళ్లో ఉన్నాను. అప్పుడు వికాస్ అనే అబ్బాయి “నేనిప్పుడు మీకు బంతుల గురించి కొన్ని విశేషాలు చెపుతాను” అన్నాడు. “సరే కానీ” అన్నారంతా. వికాస్ ఇలా చెప్పాడు.. “మీరెప్పుడైనా రబ్బర్ బ్యాండ్ బాల్ గురించి విన్నారా, ఫ్లోరిడాకు చెందిన జోయల్ వాల్ అనే ఆయన రెండువేల ఎనిమిదిలో ఏడు లక్షల రబ్బరు బ్యాండ్లతో పెద్ద బాల్ తయారు చేసి దానికి ‘మెగాటన్’ అని పేరు పెట్టాడు. దాని బరువు తొమ్మిదివేల ముప్ఫయ్ రెండు పౌండ్లు. ఆ బాల్ ఎత్తు ఆరడుగుల ఏడు అంగుళాలు. ఆ బాల్ తయారు చేయడానికి ఆయనకు నాలుగేళ్లు పట్టింది. అంత పెద్ద రబ్బర్ బ్యాండ్ బాల్ తయారుచేసి గిన్నెస్ బుక్ రికార్డ్ కెక్కాడు. ఇక ట్వైన్‌తో కూడా తయారయిన బంతులున్నాయి తెలుసా? జె.సి. పేనె అనే ఆయన అతి పెద్ద ట్వైన్ బాల్‌ను తయారు చేసి పంథొమ్మిది వందల తొంబైనాలుగులో గిన్నెస్ బుక్ కెక్కటమే కాదు, అంతకుముందున్న రికార్డును బద్దలుకొట్టాడు. అన్నట్లు సౌర మండలంలోని గ్రహాలకు, బంతికి దగ్గర పోలిక ఉంది. సూర్యుడిగారి సైజు, బీచ్ బాల్ సైజుకు సమంగా ఉంటుంది. జూపిటర్, గోల్ఫ్ బాల్ సైజులో ఉంటే, భూమి, బఠాణీ గింజంత బాల్ సైజులో ఉంటుంది. అంతేకాదు, గోల్స్ బాల్ గారు పంథొమ్మిది వందల డెబ్బయ్ ఒకటిలో చంద్రమండలంలో కూడా ఎగిరారు. అలెన్ షెపర్ అనే వ్యోమగామి అక్కడ గోల్ బాల్‌ను ఎగరేశాడు. ఇంకో విషయం తెలుసా, బాల్ అనేది ఆంగ్లేయుల ఇంటి పేరు (సర్‌నేమ్). వాళ్లలో చాలామందికి సర్‌నేమ్ ‘బాల్’ అని ఉంటుంది” అన్నాడు. భలేవిశేషాలు చెప్పావురా అన్నారంతా. నాకూ అదే అనిపించింది. హఠాత్తుగా నాకూ, ప్రాణులకు ఒక ముఖ్యమైన పోలిక ఉన్నట్లు స్ఫురించింది. ప్రాణులలో గాలి అదే శ్వాస ఆగిపోతే మరణించినట్లే, అలాగే నాకు ఏదైనా చిల్లు పడితే నాలోని గాలిపోతే నేను నేనెందుకూ పనికిరాను. నిర్జీవిగా భావించే నాకు, జీవులకు ఈ పోలిక ఉండటం ఎంత చిత్రం!

ఇంకో విషయం.. నా ద్వారా కూడా క్రికెట్‌లో కొందరు ఆటగాళ్లు తొండికి పాల్పడి, గెలుపు సాధించాలనుకోవడం.. కొన్నేళ్ల కిందట క్రికెట్ బంతిని ట్యాంపరింగ్ చేయడానికి ఆస్ట్రేలియా జట్టు శాండ్ పేపర్ తేవడం పెద్ద వివాదమయి, ఆ జట్టు నిషేధాన్ని కూడా ఎదుర్కొంది. లెదర్ మాయిశ్చరైజర్లు, వాక్స్, షూ పాలిష్‌తో బంతి మెరుపులో మార్పులు తేవటం (ట్యాంపరింగ్) నిషేధం. అయితే క్రికెటర్లు బంతికి తమ లాలాజలాన్ని పూయటం, తమ ప్యాంటులపై బంతిని రుద్దటం మామూలే. ఇది కూడా టీవీ ద్వారే తెలిసింది. ట్యాంపరింగ్‌తో మోసం చేసేది ఆటగాళ్లే అయినా అందుకు మావాళ్లే సాధనం కావటం నేను భరించను. మనుషులు వినాలే కానీ ఓ మాట చెప్పాలనుంది.. అది.. నన్ను ఉపయోగించి ఎంతైనా ఆడుకోండి, వినోదించండి, ఆరోగ్యం పొందండి. కానీ తొండి ఆటకు నన్ను సాధనం చేయకండి. అలాగే నాతో ఆడుకుంటే ఆనందమే కానీ కిందిస్థాయి ఉద్యోగులను, నిస్సహాయులను, మీకు ఇష్టంలేని వారిని నన్నాడుకున్నట్లుగా ఆడుకొని, వేధింపులు, హింసలకు పాల్పడకండి. భలే భలే.. ఆలోచనలో పడి గమనించలేదు. అభి కంప్యూటర్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇంక నా చూపూ అటే.. నేను ఆనందంతో గర్వించే ఘట్టం రానే వచ్చింది.. మా చుట్టం బంతి ఎగిరి బౌండరీ దాటేసింది. అంతా ‘సిక్సర్’ అంటూ ఆనందంతో.. అరుపులు.. దరువులు.. అభి కూడా టేబుల్ మీద దరువేస్తున్నాడు. నాకూ చెప్పలేని సంతోషం వేసింది.. ప్రకృతి కరుణించి గట్టిగా గాలి వీచి సాయపడటంతో దొర్లి కిందపడ్డాను. ఇప్పుడు మళ్లీ అభి ఆత్మీయహస్తాలలో నేను…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here