అన్నింట అంతరాత్మ-43: అందరికీ ఇష్టమైనదాన్ని.. ‘ఆభరణా’న్ని నేను!

5
7

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’శీర్షికలో ఈ వారం ‘ఆభరణం’ అంతరంగం తెలుసుకుందాం.

***

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా..
భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టే పదివేల వరహాలు రామచంద్రా

మంగళంపల్లి పాడిన రామదాసు కీర్తనను ఇష్టంగా వింటున్నాడు రామభద్రయ్య.

శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా..
లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా..
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా..
కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా..

ఆయన భక్తి పారవశ్యాన్ని చూస్తూ భార్య భ్రమరాంబ ‘కళ్లు మూసుకుని, తలాడిస్తూ ఆనందించడమే గానీ కట్టుకున్న దానికి నగానట్రా కొందామని ఎప్పుడైనా అనుకున్నారా?’ దెప్పి పొడిచింది.

‘రామదాసు భక్తితో రాములవారికి అవన్నీ చేయించాడు. భార్యకు చేయించలా. అది తెలుసుకో భ్రమా!’ గట్టిగానే బదులిచ్చాడు రామభద్రయ్య.

‘నన్నలా పిలవొద్దని ఎన్ని సార్లు చెప్పాలి’ కోపంగా అంది భ్రమరాంబ.

‘నీకు నగల మీద భ్రమ పోయే వరకు నేను అలాగే పిలుస్తాను’ మొండిగా అన్నాడు రామభద్రయ్య.

భ్రమరాంబ మెడలోని చంద్రహారాన్ని అయిన నాకు వాళ్ల వాదులాట భలే సరదాగా ఉంది.

ఇంతలో ‘భద్రం!’ అంటూ వచ్చాడు, మిత్రుడు భూషణం. పక్కనే ఆయన భార్య సుగుణమ్మ. తరచు వస్తుంటారు కాబట్టి నాకు వాళ్లు పరిచితులే.

‘రండి.. రండి’ భద్రం దంపతులు సాదరంగా ఆహ్వానించారు.

వాళ్లు కూర్చుంటుండగానే ‘ఊరక రారు మహాత్ములు.. ఏమిటి విశేషం?’ సరదాగా అన్నాడు భద్రం.

‘విశేషమే! మా అమ్మాయి పెళ్లి కుదిరింది!’ అన్నాడు భూషణం.

‘తీపి కబురు చెప్పారు. శుభాకాంక్షలు. ఇంతకూ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పెట్టుపోతల వివరం చెప్పండి’ అంది భ్రమరాంబ.

‘అబ్బాయి సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ రోజుల్లో కట్నం అనరు కానీ గ్రాండ్‌గా పెళ్లి అంటారు.. మీకు తెలియంది ఏముంది? ఇక నగలంటారా..’ అని సుగుణమ్మ అంటుండగానే ‘ఆ.. అదే మీ వదినకు కావాల్సింది. చెప్పు చెప్పు, చెవుల పండుగ చేసుకుంటుంది’ నవ్వుతూ అన్నాడు భద్రం.

‘చాల్లే అన్నయ్యా.. ఆడవాళ్లకు నగలంటే ఆ మాత్రం ఆసక్తి ఉండదా ఏమిటి?’ అంది సుగుణమ్మ.

‘ఆయనంతే.. నువ్వు చెప్పు’ తొందర పెట్టింది భ్రమరాంబ.

‘మాకున్నది ఒక్కర్తే కదా. ఇప్పటికే రోజు వేసుకునే గొలుసు కాకుండా ఒక నెక్లెస్, ఒక ముత్యాల హారం, రెండు జతల గాజులు ఉన్నాయి. చెవులకు జూకాలు, దిద్దులు ఉన్నాయి. చేతికి లక్ష్మీ ఉంగరం, ముత్యం ఉంగరం ఉన్నయ్. ఇంక వాళ్లు కూడా బాగానే పెట్టేట్లు ఉన్నారు. నగల షాపింగ్‌కు మా అలేఖ్యను తీసుకెళ్తామన్నారు. దానికి నచ్చినవి కొంటారట’ చెప్పింది.

‘చాలా బాగుంది’ భ్రమరాంబ అంటుంటే, ‘అసలు నగలు పెట్టాలనే సంప్రదాయం ఎందుకో’ అన్నాడు భద్రం.

‘మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు.. అమ్మాయికి నగలుంటే ఎంత శోభగా ఉంటుందీ! అయినా పూర్వం వాళ్ల ఆలోచన వేరు. బంగారం విలువ ఎప్పటికీ తగ్గేది కాదు కాబట్టి నగలు అమ్మాయికి ఆస్తిగా, భద్రతగా ఉంటాయని భావించారు. అత్యవసరమైతే నగలమ్మి అయినా కష్టాలు దాటవచ్చని. మీకు సత్య హరిశ్చంద్రుడి కథ గుర్తుండే ఉంటుంది, పిల్లవాడి శవాన్ని కాటికి తెచ్చిన చంద్రమతితో, సుంకం చెల్లించమంటాడు హరిశ్చంద్రుడు. ఆమె తన దగ్గర ధనం లేదంటే, మెడలోని పుస్తెను గుర్తుచేస్తాడు హరిశ్చంద్రుడు. అంటే నగలనమ్మిన ధనంతో కష్టాలను దాటడం అప్పటినుంచే ఉందనేగా’ అంది భ్రమరాంబ.

మా జాతి ఆ రకంగా కూడా మేలు చేస్తోందన్న మాట అనుకుంటుండగా, సుగుణమ్మ ‘కానీ ఎంతమంది పేకాట రాయుళ్లు, తాగుబోతులు భార్య నగల్ని అమ్మడం, కుదువ పెట్టడం చూస్తున్నాం’ అనడంతో మేం చెడుకు కూడా చేయందిస్తున్నామా అనిపించింది.

‘అందరూ మాలాగే మంచి వాళ్లుంటారా?’ నవ్వుతూ అన్నాడు భూషణం.

‘భ్రమా! కాఫీ సంగతి చూడు ఇంకా హుషారుగా మాట్లాడుకోవచ్చు’ అన్నాడు భద్రం.

‘డికాక్షన్ రెడీగానే ఉంది. ఒక్క నిమిషం’ అంటూ లోపలికి వెళ్లింది భ్రమరాంబ.

మా జాతి ముచ్చట్లు కావడంతో నేనూ ఆసక్తిగా ఎదురుచూశా.

‘గతంలో ఆకాశవాణిలో సంస్కృత పాఠం కార్యక్రమం వచ్చేది, గుర్తుందా.. ప్రారంభ శ్లోకం నాకు కంఠతా అయిపోయింది.

కేయురాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా
న స్నానం న లేపనం న కుసుమం నాలంకృతా మూర్థజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

‘ఎంత బాగా పాడావురా’ అన్నాడు భద్రం.

‘అర్థమేమిటో’ అంది సుగుణ.

‘నేనూ అదే అడుగుదామనుకున్నా’ అంటూ కాఫీ తీసుకువచ్చింది భ్రమరాంబ.

‘నేను చెపుతా. మనకు బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. తలలో పూమాలలు, పరిమళ భరిత స్నానాలు ముఖ్యం కాదు. స్వచ్ఛమైన, నిర్మలమైన, సంస్కారంతో కూడిన మాటలే సిసలైన అలంకారాలు. పైపై మెరుగులేవీ కాదు, మాట తీరే ముఖ్యం.. అదే అసలైన ఆభరణం అని భావం’ వివరించాడు భద్రం.

‘ఇలాంటి వాటికి రెడీగా ఉంటారు’ అంది భ్రమరాంబ.

‘నాకు ఇంకొకటి కూడా గుర్తొస్తోంది..

నరస్యా భరణం రూపం, రూపస్య భరణం గుణ
గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా

అంటే మనిషికి రూపమే ఆభరణం, ఆ రూపానికి గుణం ఆభరణం, గుణానికి జ్ఞానమే ఆభరణం, జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం’ తాత్పర్యంతో సహా చెప్పాడు భూషణం.

అది విని.. నేను, మా మిత్రులైన పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు, దిద్దులు, ముక్కు పుడక ‘మరి మనం లెక్కేలేదా?’ అనుకుంటూ చిన్నబోయాం.

ఇంతలో పక్క గదిలోంచి కోడలు కనక మహాలక్ష్మి వచ్చి కూర్చుంటూ, ‘దేని గురించి మాట్లాడుతున్నారు?’ అంది.

‘అలేఖ్యకు పెళ్లి సంబంధం కుదిరిందట. దాంతో నగల ముచ్చట్లు మొదలయ్యాయి’ అంది భ్రమరాంబ.

‘అవునా. త్వరలో పెళ్లి సందడి అన్న మాట. అన్నట్లు నగల మాట వింటే నా సందేహం ఒకటి గుర్తుకొస్తోంది. అది.. ఏడు వారాల నగలు అంటారు కదా, అంటే ఏమిటి?’ అడిగింది.

‘ఆ మధ్య టీవీలో చెప్పారు.. పూర్వం ఆదివారం నుంచి శనివారం వరకు రోజుకో రకం నగలను ధరించేవారట. ఆయా గ్రహాలకు అనుకూలంగా ఆదివారం సూర్యుని కోసం కెంపుల కమ్మలు, హారాలు; సోమవారం చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు; మంగళవారం కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు; బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు; గురువారం బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు; శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కు పుడక; శనివారం శని ప్రభావం పడకుండా ఉండడానికి నీలమణి హారాలు, ఉంగరాలు ధరించేవారట’ చెప్పింది సుగుణమ్మ.

‘అదీ మన వాళ్ల ఘనత’ సంతోషంతో పొంగిపోయాం మేము.

‘ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అయినా అంత తీరిక, ఓపిక కూడా లేవు’ అంది కనక మహాలక్ష్మి.

‘ఆభరణాలంటే రాజుల గురించే చెప్పుకోవాలి. ఆ మధ్య ఎక్కడో చదివాను, హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఎలిజబెత్ రాణి పెళ్లికి కానుకగా అత్యంత ఖరీదైన ప్లాటినం నెక్లెస్ బహూకరించాడట.. అందులో మూడొందల వజ్రాలు పొదిగారని, దాని ప్రస్తుత విలువ అరవై ఆరు మిలియన్ పౌండ్లకు పైమాటే అని రాశారు’ అంది భ్రమరాంబ.

‘ఇలాంటి విషయాలు ఎంత బాగా గుర్తుంచుకుంటావో’ నవ్వుతూ అన్నాడు భద్రం.

అంతలో బయటి నుంచి భద్రం కొడుకు భరత్ వచ్చాడు. భూషణం దంపతులను చూసి, పలకరించాడు. భూషణం విషయం వివరించి, ‘నగల గురించే మాట్లాడుకుంటున్నాం. మగ వాళ్లకయితే నగల గోల లేదు’ అన్నాడు.

‘అది తప్పు. గతంలో చక్రవర్తులు, రాజులు మొదలైన వారంతా కిరీటాలు, మెడనిండా హారాలు, భుజ కీర్తులు, కుండలాలు, కంకణాలు, ఉంగరాలు ఎన్నో ధరించేవారు. అంతేనా, ఇతర రాజ్యాల పాలకులకు బహుమతిగా కూడా విలువైన ఆభరణాలు పంపేవారు. ఇక కవి, పండితులను సన్మానించడంలో కూడా ఆభరణాలు ఉండేవి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అంగళ్లలో రత్నాలు రాశులుగా పోసి అమ్మే వారని చదువుతాం. అంటే ఆరోజుల్లో ఆభరణాలకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా కొంత మంది చెవులకు పోగులు, ఒంటి రాయి చిన్న దిద్దులు, మెడలో సన్న గొలుసు, చేతికి కడియం, లేదా బ్రేస్లెట్ ధరించడం చూస్తూనే ఉన్నాం. నగలంటే మోజు పడిన ప్రముఖ సంగీత దర్శకుడు, డిస్కో కింగ్ బప్పీ లహరి మనకు తెలుసుకదా. ఆయన ఒంటినిండా ఆభరణాలే ఉండేవి. కొత్త సినిమాకు సంగీతం సమకూర్చిన ప్రతిసారి ఒక కొత్త నగ కొని ధరించేవాడు. వాటిని ధరించడానికి రోజు ఉదయం ఐదున్నరకే లేచి, స్నానానంతరం తీరిగ్గా ఆభరణాలన్నీ అలంకరించుకునేవాడట. ఆయనకు ఈ విషయంలో ఎల్విస్ ప్రీస్లే స్ఫూర్తి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పైగా ఆయన కొటేషన్ ఏమిటో తెలుసా.. గోల్డ్ ఈజ్ మై గాడ్. చివరకు ఆ బంగారం మనిషిని, మృత్యువు పట్టుకెళ్లిపోయింది’ చెప్పాడు భరత్.

మేం బప్పీ లహరి గారిని ఊహించుకుని మా జాతిని ధరించినందుకు ఆనందాన్ని, ఆయన కన్ను మూసినందుకు విచారాన్ని పొందాం.

వెంటనే భద్రం అందుకుని, ‘నిజమే. దేవుళ్లను సైతం ఆభరణాలతోనే వర్ణించారుగా. కస్తూరి తిలకం.. శ్లోకంలో శ్రీకృష్ణుడిని.. వక్షస్థలంలో కౌస్తుభం, ముక్కుకు ముత్యపు బులాకీ, చేతులకు కంకణాలు, మెడలో ముత్యాల హారం ధరించిన వాడిగా వర్ణించారు.

శ్యమంతకమణి కథ మనకు తెలిసిందే. కృష్ణుడే ముచ్చటపడి అడిగాడంటే దాని గొప్పతనం ఎంతటిదో తెలుస్తుంది.

ఇక తెలుగు వారి ఇలవేలుపు తిరుమల శ్రీనివాసుడికి ఉన్న ఆభరణాలు ఇన్నీ అన్నీ కావు. శ్రీకృష్ణదేవరాయలు దగ్గర్నుంచి ఎందరో రాజులు ఎన్నో ఆభరణాలను ఏడుకొండల వాడికి కానుకలుగా సమర్పించుకున్నారు. వజ్రకిరీటం, శంఖచక్రాలు, కర్ణపత్రాలు, భుజ కీర్తులు, నాగాభరణాలు, కడియాలు, కటి హస్తం, వైకుంఠ హస్తం, సూర్య కఠారి, సహస్ర నామ హారం, అష్టోత్తర శతనామ హారం, చతుర్భుజ లక్ష్మీ హారం, తులసీ పత్ర హారం, యజ్ఞోపవీతాలు, సువర్ణ పాదాలు, సువర్ణ పీఠం నిత్య అలంకారాలు. విశేష దినాల్లో శ్రీనివాసుడు వేర్వేరు ఆభరణాలతో దర్శనమిస్తాడు.

ఇంక రామాయణంలో రావణుడు సీతను అపహరించుకు పోతున్న సందర్భంలో ఆమె తన నగలన్నిటిని మూటగట్టి ఋష్యమూక పర్వతంపై వానరులకు చేరేలా జార విడుస్తుంది. అలాగే అశోకవనం చేరిన హనుమ, సీతకు రాముని ఆనవాలుగా ముద్రికను చూపడం, రామునికి, సీత ఆనవాలుగా శిరోరత్నాన్ని పంపడం తెలిసిందే. నగలు ఇలా కూడా ఉపయోగపడ్డాయి’ అన్నాడు.

‘అవును. భారతంలో శకుంతల కథలో కూడా దుష్యంతుడు ఇచ్చిన ఉంగరమే మళ్లీ వారిని కలిపింది’ అన్నాడు భూషణం.

మా జాతి కేవలం అలంకారానికి కాకుండా ఇలా కూడా ఉపయోగపడడం విని మాకు అవధుల్లేని ఆనందం కలిగింది.

అంతలో భ్రమరాంబ మాట్లాడుతూ, ‘ఏ సెంటర్‌లో చూసినా ఎన్నెన్నో నగల షాపులు వెలుస్తున్నాయి. ఇవిగాక వన్ గ్రామ్ గోల్డ్ అని, ఇమిటేషన్ జువెలరీ అని ఏవేవో రకాలు వస్తున్నాయి. రోల్డ్ గోల్డ్ నగలకు తెలుగు నాట బందరు ప్రసిద్ధిగా ఉంది. హైదరాబాద్ రాళ్ల గాజులైతే అంతర్జాతీయంగా పేరొందాయి’ అంది.

‘అత్తయ్యా! నగలలో ఎన్నో రకాలున్నాయి. ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు వగైరాలు మనకు ఇదివరకు తెలిసినవే. వెండి నగలు కూడా మామూలే. రాగి కడియాలు, బ్రెస్లెట్లు, ఉంగరాలు ఆరోగ్యానికి మంచివని ధరించడం మామూలే. ఇవిగాక పూసలు, బీడ్స్, దంతాలు, గవ్వలు, ప్లాస్టిక్, కాగితం.. ఇలా ఎన్నెన్నో రకాల నగలున్నాయి. ప్రస్తుతం ఇత్తడి ఆభరణాల ట్రెండ్ నడుస్తోంది. వీటిలో డిజైన్లు ఎక్కువ, మన్నిక ఎక్కువ, ధర తక్కువ. వీటిలో హ్యాండ్ మేడ్ అంటే చేత్తో తయారు చేసేవి కూడా ఉన్నాయి. త్రీ డీ నగలైతే కంప్యూటర్‌లో డిజైన్, ప్రోగ్రాం చేసి, త్రీ డీ ప్రింటర్‌తో డూప్లికేట్ నగ సిద్ధం చేసి, దాని సాయంతో అచ్చు తయారు చేస్తారు. ఆ అచ్చులో బంగారం, ప్లాటినం, వెండి.. ఇలా ఏ లోహం కావాలంటే ఆ లోహ ద్రవాన్ని పోసి నగలను రూపొందించి మెరుగు పెడతారు’ చెప్పింది.

‘అంతా చిత్రంగా ఉంది’ భ్రమరాంబ, సుగుణమ్మ ఒకేసారి అన్నారు.

మా జాతిలో కొత్త రకాలను తెలుసుకుని మేం ఆశ్చర్య పోయాం.

‘ఇంకో సంగతి తెలుసా? గోల్డ్‌లో రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ కూడా ఉన్నాయి..’ కనక మహాలక్ష్మి ఇంకా ఏదో చెప్పబోతుండగానే, ‘అవేమిటి!’ ఆశ్చర్యంగా అంది భ్రమరాంబ.

‘వినండి మరి, నగల తయారీకి బంగారంలో కొద్దిగా రాగి కలుపుతారని అందరికీ తెలుసు. రాగి శాతాన్ని ఇరవై నుంచి అరవై అయిదు శాతం వరకు పెంచితే రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ కోసమైతే రాగి, జింక్, నికెల్, వెండి కలుపుతారు. అన్నట్లు నల్ల బంగారం కూడా ఉంది. మూడొంతుల బంగారానికి ఒక వంతు కోబాల్ట్ కలిపి దీన్ని తయారు చేస్తారు. అలాగే ఇతర పదార్థాలను తగు పాళ్లలో కలిపి ఆకుపచ్చ, నీలి, ఊదా బంగారాలను తయారు చేస్తారు’ చెప్పింది కనక మహాలక్ష్మి.

‘ఔరా! మా జాతికి ఎన్ని వన్నెలో!!’ అనుకున్నాం మేము.

‘నాకయితే బంగారు రంగే ఇష్టం’ అంది సుగుణమ్మ.

‘నాకూ అంతే’ అంది భ్రమరాంబ.

‘ఇక క్లియోపాత్ర చోకర్లను ఆఫ్రికన్లేకాదు ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు’ అంది కనక మహాలక్ష్మి.

‘చోకర్లంటే ఏమిటో ‘అంది భ్రమరాంబ.

‘ఏం లేదు వదినా, మెడకు పట్టినట్లుగా ఉండే వెడల్పాటి హారమన్న మాట. ఆమధ్య మా అలేఖ్య ఇమిటేషన్ జువెలరిలో అలాంటిది కొన్నది’ ఉత్సాహంగా చెప్పింది సుగుణమ్మ.

‘బంగారం నగలే కాదు బంగారం మిఠాయి ఉందని మీకు తెలుసా?’ అన్నాడు భరత్.

‘అదేం స్వీటు?’ అంతా ఆశ్చర్యపోయారు.

అది విని మేం కూడా ఆశ్చర్యపోయాం.

‘సూరత్‌లో ‘24 కేరట్’ అనే మిఠాయి దుకాణం ఉంది. వాళ్లు తమ ఇరవై అయిదవ వార్షికోత్సవం సందర్భంగా ‘గోల్డెన్ స్వీట్’ పేరుతో కొత్తరకం స్వీట్ తయారుచేశారు. ఇందుకోసం ప్రత్యేకించి స్పెయిన్ నుంచి కేసరి తెప్పించారుట. ఈ స్వీటుకు బంగారం పూత వేశారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువని చెప్పారు. ఇందులో అయిదు వేర్వేరు రకాలు కూడా రూపొందించారని రాశారు. సూరత్‌కు గతంలో డైమండ్ హబ్ అని పేరు. ఇప్పుడు ఈ గోల్డెన్ స్వీట్‌తో కొత్త ప్రాముఖ్యతను సంపాదించుకుంది’ చెప్పాడు భరత్.

‘భలే ఉందే’ అన్నాడు భద్రం.

‘మొన్న మా ఆఫీస్‌లో వింత వార్తల విజయ్ ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పాడు’

‘ఏమిటో మాకూ చెప్పు’ అన్నాడు భూషణం.

‘తల్లిపాలతో నగలు తయారు చేస్తున్నారట’ అన్నాడు భరత్.

‘తల్లి పాలతోనా?’ అంతా నివ్వెరపోయారు

మా ఆశ్చర్యానికయితే అంతే లేదు.

‘అదేంటి.. పాలు ద్రవ పదార్థం కదా..’ సందేహం వ్యక్తం చేసింది భ్రమరాంబ.

‘అలాగే వాడతారేమిటి, తయారీ పద్ధతిలో దాన్ని మార్చే ప్రక్రియ ఉంటుంది. కర్ణాటకకు చెందిన నమిత అనే ఆమె, తల్లిపాలను ఎవరూ మరచిపోకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త ఆలోచన చేసి, ‘మమ్మాస్ మిల్క్ టేల్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించిందట. జీవితంలో కొన్ని అపురూప అనుభూతులను గుర్తుంచుకునేలా శిశువుకు తొలిసారి తీసిన గోళ్లతో, జుట్టుతో కూడా ఆమె, నగలు తయారు చేస్తోంది. ఈ నగలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. ముఖ్యంగా అమెరికాలో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే అస్థికలతో కూడా ఆభరణాలు చేస్తున్నారు. న్యూయార్క్ లోని మార్గరెట్ క్రాస్ అనే సంస్థ అస్థికల అవశేషాలతో రింగులు, బ్రేస్లెట్లు, గొలుసులు తయారుచేస్తోంది. ఆత్మీయులు మరణించినప్పుడు వారి అస్థికలతో తయారైన నగలు ధరిస్తే, చనిపోయినవారు తమ వెంటే ఉంటారనే నమ్మకమే దీనికి పునాది. అయితే ఈ నమ్మకాన్ని వ్యతిరేకించే వారూ ఉన్నారు. వీటి ధర కూడా ఎక్కువే. తయారీకి చాలా సమయం పడుతుందట’ వివరించాడు.

‘నగ అంటే ఎంతో కొంత విలువైందిగా ఉంటేనే బాగుంటుంది’ అంది భ్రమరాంబ.

‘లోకో భిన్న రుచి’ నవ్వాడు భరత్.

‘ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఈమధ్య పూల నగలపై ఎక్కువ మోజు పడుతున్నారు..’ కనక మహాలక్ష్మి చెపుతుండగానే, ‘పూలతో నగలా!’ ఆశ్చర్యంగా అంది సుగుణమ్మ. అందరూ కూడా చూపులతోనే ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మా సంగతి సరేసరి. కనక మహాలక్ష్మి బదులిస్తూ ‘అవును. విచ్చిన చిన్న చిన్న పూలను ఒత్తి పట్టుకుని గాజు లాకెట్ లోపల నేర్పుగా ఇముడుస్తారు. ఒత్తినా ఆ పూలు తాజాగానే ఉంటాయి. ఎన్నాళ్లయినా చెక్కుచెదరవు. చెవి రింగులు, గాజులు, ఉంగరాలు, ఈ రకం పతకాలను అమర్చి గొలుసులు ఎన్నో రకాలు తయారు చేస్తున్నారు. వీటిని ‘ప్రెస్ ఫ్లవర్ జువెలరీ’ అని, ‘బొటానికల్ జువెలరీ’ అని పిలుస్తున్నారు. వీటి తయారీకి ఆర్కిడ్స్, లావెండర్స్ వంటి పూలను వాడుతున్నారు’ చెప్పింది.

‘కాదేదీ నగల కనర్హం అన్నమాట’ అన్నాడు భద్రం.

‘అవును. దారం, వస్త్రం, సిల్క్‌తో కూడా నగల తయారీ జరుగుతోంది. అసలైనా నగ దేంతో తయారైంది అన్నది ముఖ్యం కాదు. ఎంత కళాత్మకంగా, ఎంత అందంగా ఉన్నదనేదే ముఖ్యం. ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉంటాయి కూడా. గిరిజనుల ఆభరణాలు చూడండి ఎంత వైవిధ్యంగా ఉంటాయో, లంబాడీ మహిళల నగలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో తెలుసుకదా’ అంది కనక మహాలక్ష్మి.

‘అవున్లే. దేని ప్రత్యేకత దానిదే’ అంది భ్రమరాంబ రాజీ పడుతూ.

‘భ్రమా! ఇది నా భ్రమా?’ ఆమె మాటల్ని నమ్మలేనట్లుగా చూసాడు భద్రం.

అంతా నవ్వారు.

‘అన్నట్లు మొన్న ఒక వాట్సాప్ వీడియో చూసాను. కొత్తగా గోల్డ్ ఏటిఎం వచ్చిందిట. డబ్బు లాగే బంగారం కూడా ఒక గ్రాము నుంచి, మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చట’ చెప్పింది కనక మహాలక్ష్మి.

‘భలే ఉందే. అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతానికి గోల్డ్ ఏటిఎం నుంచే బంగారం తీసుకుందాం’ వెంటనే అంది భ్రమరాంబ.

‘అక్షయ తృతీయకు కూడా’ అంది సుగుణమ్మ.

‘ధంతేరాస్ మర్చిపోయారు’ నవ్వుతూ అంది కనక మహాలక్ష్మి.

‘విశేష పర్వదినాల్లో భక్తితో పూజ చేద్దామని, దానధర్మాలు చేద్దామని ఏ కోశానా అనుకోరు. ఎంతసేపూ బంగారం.. బంగారం, ఏం ఆడవాళ్లో’ అన్నాడు భద్రం.

‘బంగారం పెట్టి, భక్తితో పూజ చేస్తాం. లక్ష్మీ దేవి అంటే బంగారం లేకుండా ఎలా?’ అంది భ్రమరాంబ.

‘నిన్ను మార్చడం నా తరం కాదు’ అన్నాడు భద్రం.

ఆమె గెలుపు నవ్వు నవ్వింది.

‘అన్నట్లు ‘గోల్డ్ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా దక్షిణ ఆఫ్రికాలోని జోహానెస్‌బర్గ్ ప్రసిద్ధి చెందింది. అక్కడి బంగారు గనులు కారణంగానే ఆ నగరంలో స్మగ్లింగ్, క్రిమినల్ సిండికేట్ల తగాదాలు ఎక్కువై, నేరగాళ్ల స్థావరంగా మారింది. మన దేశంలో అయితే బంగారు గనులకు పేరొందింది కర్ణాటక లోని కోలార్. బంగారానికి మనదేశంలో డిమాండ్ ఎక్కువ. అందుకే బంగారం దిగుమతి కూడా జరుగుతోంది’ చెప్పాడు భరత్.

‘మనదేశంలో అరవై శాతం మంది మహిళల దగ్గరే బంగారం ఉందని ఇటీవల ఒక సర్వేలో తేలింది’ అంది కనక మహాలక్ష్మి.

‘మరి మిగతా నలభై శాతం మంది సంగతేమిటి?’ అంది భ్రమరాంబ.

‘ఏం ఉంది. ఇమిటేషన్ నగలు ఉండనే ఉన్నాయిగా’ అంది సుగుణమ్మ.

‘పాత నగల డిజైన్లు ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ అయ్యాయి’ అంది భ్రమరాంబ.

‘అవునవును. గుళ్లో అమ్మవారల్లే పెద్ద పెద్ద పతకాల హారాలు..’ భద్రం అంటుండగానే ‘మీకంతా వెటకారం’ అంది భ్రమరాంబ.

‘అమ్మో! టైమ్ చాలా అయింది. ఇంక వెళ్లొస్తాం’ అంటూ లేచాడు భూషణం. సుగుణ కూడా లేచి ‘ఇంక వస్తాం. పెళ్లికి తప్పకుండా రావాలి, మళ్లీ శుభలేఖ ఇవ్వడానికి వస్తామనుకో’ అంది.

‘విందు భోజనానికి మేమెప్పుడూ సిద్ధమే’ భద్రం అనడంతో అంతా నవ్వారు.

భూషణం దంపతులకు వీడ్కోలు చెప్పి అంతా తమ పనుల్లో మునిగిపోయారు.

నేను మాత్రం ఇంకా మా జాతి గురించిన ఆలోచనలోనే ఉండిపోయా. బంగారు నగలు విలువైనవి కావడం వల్ల చాలామంది అదొక ఆస్తిగా కూడా ఉంటుందని కొంటారు. అయితే బంగారు నగలను కాజేయడానికి దొంగలు ఒక్కోసారి ప్రాణాలు కూడా తీయడం వంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు అందుకు కారణం మేం కాకపోయినా మా వల్ల వారి ప్రాణాలు పోయాయని, గాయపడ్డారని మా మనసులు ఎంతగా విలవిలలాడతాయో ఎవరికి తెలుసు? ఆఖరికి దేవాలయాలలో కూడా పాపభీతి లేకుండా దొంగతనాలు చేస్తున్నారు. మనుషులకి బంగారం లాంటి మనసున్నప్పుడే విలువైన నగలు, వాటిని ధరించినవారు సురక్షితంగా ఉండేది ‘అనుకుంటుండగా టీవీ శబ్దం.. డబ్బులెవరికీ ఊరికే రావు.. గుండంకుల్ మాట వినపడడంతో నా కళ్లు, చెవులు ఇంక అటే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here